బ్రహ్మ మహా పురాణము

209 - ద్వివిదవానరవధ వర్ణనమ్‌

వ్యాసులు:

శృణుధ్వం మునయః సర్వే బలస్య బలశాలినః

కృతం యదన్యదేవాభూత్తదపి శ్రూయతాం ద్విజాః

నరకస్యాసురేంద్రస్య దేవపక్షవిరోధినః

సఖాభవన్మహావీర్యో ద్వివిదో నామ వానరః

వైరానుబంధం బలవా న్స చకార సురా న్ర్పతి

నరకం హతవాన్కృష్ణో బల దర్పసమన్వితమ్‌

కరిష్యే సర్వదేవానాం తస్మా దేష ప్రతిక్రియామ్‌

యజ్ఞవిధ్వంసనం కుర్వన్మర్త్యలోకక్షయం తథా

తతో విధ్వంసయామాస యజ్ఞా నజ్ఞానమోహితః

బిభేద సాధుమర్యాదాం క్షయంచక్రే చ దేహినామ్‌

దదాహ చపలో దేశం పురగ్రామాంతరాణి చ

క్వచిచ్చ పర్వతక్షేపా ద్గ్రామాదీన్సమచూర్ణయత్‌

శైలానుత్పాట్య తోయేషు ముమో చాంబునిధౌ తథా

పునశ్చార్ణవమధ్యస్థః క్షోభయాస సాగరమ్‌

తేనాతిక్షోభితశ్చాబ్ధి రుద్వేలో జాయతే ద్విజాః

ప్లావయంస్తీరజా న్గ్రామాన్పురాదీనతివేగవాన్‌

కామరూపం మహారూపం కృత్వా సస్యా న్యనేశః

లుఠన్భ్రమణసంమర్దః సంచూర్ణయతి వానరః

తేన విప్రకృతం సర్వం జగదేత ద్దురాత్మనా

నిఃస్వాధ్యాయవషట్కారం ద్విజాశ్చాసీత్సుదుఃఖితమ్‌

వ్యాసులు:

బలరాముని లీల మఱి యొకటి వినుడు. నరకాసురునికి మిత్రుడు దేవ విరోధి ద్వివిదుడను వానరు డుండెను. వాడు శత్రువులతో విరోధము వెట్టుకుని నరకుని జంపిన కృష్ణుని నిమిత్తముగా దేవతలకు బ్రతిక్రియ సేయుదు నని యజ్ఞ ధ్వంసము చేయుచు మర్త్య లోకమునకు హాని సేసెను. సాధువుల మర్యాదలం జెరచెను. జీవులం జంపెను. దేశమును బురములను గ్రామములను గాల్చెను. పర్వతము లెత్తి పడవేసి గ్రామములను గుండ గొట్టెను. శైలముల లేపి నీళ్ళలో సముద్రములో బడద్రొబ్బెను. సముద్రమున నిల్చి క్షోభింప జేసెను. దాన వార్ధి పొంగి చెలియలి కట్టదాటి దారి నున్న పుర గ్రామముల ముంచెత్తెను. కోరిన రూపు దాల్చి దూకుచు గంతు లిడుచు పంటల నెల్ల విథముల చూర్ణములు సేసెను. వానిచే నీ జగమెల్ల నపకరింప బడి నిస్స్వాధ్యాయ నషట్కారమై దుఃఖించెను.

కదాచిద్రైవతోద్యానే పపౌపానం హలాయుధః

రేవతీ చ మహాభాగా తథైవాన్యా వరస్త్రియః

ఉద్గీయమానో విలసల్లలనామౌళిమధ్యగః

రేమే యదువరశ్రేష్ఠః కేబేర ఇవమందిరే

తతః స వానరోభ్యేత్య గృహీత్వా సీరిణో హలమ్‌

ముశలం చ చకారాస్య సంముఖః స విడంబనామ్‌

తథైవ యోషితాం తాసాం జహాసాభిముఖం కపిః

పానపూర్ణాంశ్చ కరకాం శ్చిక్షేపాహత్య వైతదా

తతః కోపపరీతాత్మా భర్త్సయామాస తం బలమ్‌

తథాపి తమవజ్ఞాయ చక్రే కిలకిలాధ్వనిమ్‌

తతః సముత్థాయ బలోజగృహే ముశలం రుషా

సోపి శైలశిలాం భీమాం జగ్రాహ ప్లవగోత్తమః

చిక్షేప చ తాం క్షిప్తాం ముశలేన సహస్రధా

బిభేద యాదవశ్రేష్ఠః స పపాత మహీతలే

అపత న్ముశలం చాసౌ సముల్లంఘ్య ప్లవంగమః

వేగేనాయమ్య రూషేణ బలేనోర స్యతాడయత్‌

తతో బలేనకోపేన ముష్టినా మూర్ధ్నితాడితః

పపాత రుధిరోద్గారీ ద్వివిదః క్షీణజీవితః

పతతా తచ్ఛరీరేణ గిరేః శృంగ మశీర్యత

మునయః శతధా వజ్రివజ్రేణేవ హి తాడితమ్‌

పుష్పవృష్టిం తతోదేవా రామస్యోపరి చిక్షిపుః

ప్రశశంసుస్తదాభ్యేత్య సాథ్వేతత్తేమహత్కృతమ్‌

ఆనేన దుష్టకపినా దైత్యపక్షోపకారిణా

జగ వ్నిరాకృతం వీర దిష్ట్యా స క్షయమాగతః

ఏవం విధాన్యనేకాని బలదేవస్య ధీమతః

కర్మాణ్యపరిమేయాని శేషస్య ధరణీభృతః

ఒకతరి హలాయుధుడు రైవతో ద్యానమున మద్య పానము సేయు చుండెను. ఆయన భార్య రైవతి మఱి కొందరు రమణు లాతని ననుగమించిరి. వారు తన కీర్తిని గానము సేయ నడుమున నిల్చి కుబేరుడట్లు క్రీడించెను. అంతట ద్వివిద వానరుడు వచ్చి యాతని రోకలిని నాగలిం గైకొని యెదుట బడి వినోద మొనరించెను. ఆ తరుణుల యెదుట నిగిలించెను. నిండు కల్లు కుండల గిఱవాటు వెట్టెను. పగుల నడచెను. బలరాము డీసుగొని వానిని బెదరించెను. అయినను వాడతని నవమానించుచు కిలకిల ధ్వని సేసెను. అంతట లేచి హలి రోషముతో రోకలిం బట్టెను. వాడొక వెఱవు గొలుపు రాతి బండ నెత్తి విసరెను. హలి దానిని ఱొకట వేల తునకలు సేసి చిమ్మెను. ఆ కోతి దుమికి మీదబడ బలుడు రోసమున వాని వంచి ఱొమ్మునం గొట్టెను నడినెత్తిం గ్రుద్దెను. అంత ద్వివిదుడు రక్తము గ్రక్కికొని ప్రాణములు పోయి పడి పోయెను. పడు చున్నవాని యొడలున నా కొండ శిఖరమో మునులార! వజ్రియొక్క వజ్రమున గొట్ట బడినట్లు విరిగి పడెను. దేవత లంతట రామునిపై పూలవాన గురి పించిరి. వచ్చి బాగుబాగు గొప్పవని సేసినాడవని కొనియాడిరి. ఈ చెడ్ద కోతి దైత్యుల వైపుపకారము చేయ లోకమును బాధించి నాడు. భాగ్య వశమున వీడు నీచే గడతేర్ప బడి నాడనిరి. ఇట్లవంత మూర్తి విశ్వంభరా ధారి బలదేవుని లీల లనంతములు.