207 - పౌండ్రక వాసుదేవ వర్ణనమ్‌

మునులు:

చక్రే కర్మమహచ్ఛౌరి ర్బిభ్రద్యో మానుషీం తనుమ్‌

జిగాయ శక్రం శర్వంచ సర్వదేవాంశ్చలీలయా

యచ్చాన్యదకరోత్కర్మ దివ్యచేష్టావిఘాతకృత్‌

కథ్యతాం తన్మునిశ్రేష్ఠ! పరం కౌతుహలం హి నః

మునులు:

మానుష మూర్తియై శౌరి యింద్రుని శంకరుని సర్వ దేవతలను లీలా మాత్రముగ గెలిచి మహత్కార్యము నొనరించెను. దేవతలు తెలియక చేసిన చేతలకు విఘాతము సేసిన హరి యింకను జేసిన లీలలను దెలుపుము. మాకు విన వేడుక యగుచున్న దన వ్యాసులిట్లనిరి.

వ్యాసులు:

గదతోమే మునిశ్రేష్ఠాః శ్రూయతా మిద మాదరాత్‌

నరావతారే కృష్ణేన దగ్ధా వారాణసీ యథా

పౌండ్రకో వాసుదేవశ్చ వాసుదేవోభవద్భువి

అవతీర్ణస్త్వ మిత్యుక్తో జనై రజ్ఞానమోహితైః

స మేనే వాసుదేవోహ మవతీర్ణో మహీతలే

నష్టస్మృతిస్తతః సర్వం విష్ణుచిహ్న మచీకరత్‌

దూతం చ ప్రేషయామాస స కృష్ణాయ ద్విజోత్తమాః

వ్యాసులు:

“మునివరు లార! తెలుపు చున్నాను. ఆదరముతో వినుడు. కృష్ణుడు నరావతారమున వారణాసి నగరమును గాల్చి వైచెను. పౌండ్రక వాసుదేవుడు ప్రజలు తనతో వాసుదేవు డొకడు భూలోకమున సంచరించు చున్నాడు, నిజముగ నవతరించిన వాడవు నీవెయని పలుకు చుండ వాడు వాసు దేవుడను నేనే. అవని నవతరించితిని ననుకొనెను. దాన స్మృతి దప్పి వాడు విష్ణు చిహ్నములైన శంఖ చక్ర గదాదులను నయోమయముగ జేయించుకొని పెట్టుకొని కృష్ణునకు దూతను గూడ బంపెను.

దూత:

త్యక్త్వా చక్రాదికం చిహ్నం మదీయం నామచాత్మనః

వాసుదేవాత్మకం మూఢ ముక్త్వా సర్వ మశేషతః

ఆత్మనో జీవితార్ధంచ తథా మే ప్రణతిం వ్రజ

దూత:

ఆ పంప బడిన దూత వాని మాటలగ కృష్ణునికిట్లు చెప్పెను. “ఓ మూఢ! చక్రాది చిహ్నములను నీ పెట్టు కున్న వాసుదేవ డనెడి నా పేరును సర్వమును విడిచి నీవు బ్రతుక దలతు వేని నాకు ప్రణతుడ వగుము”.

వ్యాసులు:

ఇత్యుక్తః సప్రహన్యైవ దూతం ప్రాహ జనార్దనః

వ్యాసులు:

అన నవ్వి దూతతో భగవంతుడు

శ్రీభగవానుడు:

నిజ చిహ్నమహం చక్రం సముత్ర్సక్ష్యే త్వయీతి వై

వాచ్యశ్చపౌండ్రకోగత్వా త్వయా దూత వచోమమ

జ్ఞాతస్త్వ ద్వాక్యసద్భావో యత్కార్యం తద్విధీయతామ్‌

గృహీతచిహ్న ఏవాహ మాగమిష్యామి తే పురమ్‌

ఉత్ర్సక్ష్యామిచతే చక్రం నిజచిహ్న మసంశయమ్‌

ఆజాక్షపూర్వం చ యదిద మాగచ్ఛేతి త్వ యోదితమ్‌

సంపాదయిష్యే శ్వ స్తుభ్యం తదప్యేషోవిలంబితమ్‌

శరణం తే సమభ్యేత్య కర్తాస్మి నృపతే తథా

యథాత్వత్తోభయం భూయోనైవ కించి ద్భవిష్యతి

ఇత్యుక్తేపగతే దూతే సంస్మృత్యాభ్యాగతం హరిః

గరుత్మంతం సమారుహ్య త్వరితం తత్పురం యయౌ

శ్రీభగవంతుడు:

“నా చిహ్నమగు చక్రమును నీ యెడల విడిచెదను. అని యంటి నని నా మాటగ నీవేగి పౌండ్రకునికి జెప్పుము. నీ మాట లోని మంచి తనము నాకు దెలిసినది. చేయదగిన దేదో చేయుము నేను నా చిహ్నములను దాల్చియే నీ పురమునకు వచ్చెదను. నా చిహ్న మయిన చక్రమును నీ కొఱకు వద లెదను గూడ. సందేహము లేదు. ఆజ్ఞా పూర్వకముగ రమ్మని నీ వన్న మాటను రేపే విలంబము లేకుండ నీ కప్పగించెదను. నీ శరణము (దిక్కు)న కేతెంచి నీ వలన మఱి యే కొంచెము భయము లేకుండ జేయ వలసిన పని చేసెదను.” అని పరిహాస గర్భముగ తెలుప బడి దూత చనినంతట స్మరణ మాత్రమున వచ్చి వ్రాలిన గరుక్మంతు నెక్కి త్వరితముగ హరి తత్పురమున కేగెను.

తస్యాపి కేశవోద్యోగం శ్రుత్వా కాశిపతి స్తదా

సర్వసైన్యపరీవారః పార్ష్ణిగ్రాహ ముపాయయౌ

తతోబలేన మహతా కాశిరాజబలేన చ

పౌండ్రకో వాసుదేవోసౌ కేశవాభిముఖం యయౌ

తం దదర్శ హరి ర్దూరా దుదారస్యందనే స్థితమ్‌

చక్రశంఖగదాపాణిం పాణినా విధృతాంబుజమ్‌

స్రగ్ధరం ధృతశార్ఙ్గం చ సుపర్ణరచనా ధ్వజమ్‌

వక్షఃస్థలకృతం చాస్య శ్రీవత్సం దదృశే హరిః

కిరీటకుండలధరం పీతవాసఃసమన్వితమ్‌

దృష్ట్వా తం భావగంభీరం జహాస మధుసూదనః

కాశిరాజు హరి ప్రయత్నమును విని యపుడు పౌండ్రకుని పక్షమున సర్వ సైన్య పరివారముతో పార్ణిగ్రాహియై (మడమలం ద్రొక్కికొని) వచ్చెను. ఆంతట నీ పౌండ్రక వాసు దేవుడు పెను బలముతో కాశిరాజు బలము తోడను గేశవున కెదురు నిలిచెను. హరి యున్నత రథ మందున్న వానిని శంఖ చక్ర గదాహస్తు డైన వానిని నొక హస్తమున పద్మముం బట్టిన వానిని వనమాలా ధరుని శార్ఙ్గమను విల్లు చేకొన్న వానిని బంగారపు నగిషీ చెక్కిన టెక్కము గల వానిని నురమున శ్రీవత్స చిహ్నమును దాల్చిన వానిని (శ్రీవత్సాకారముగ పచ్చబొట్టు పొడిచి కొన్నాడని యర్ధము) కిరీట కుండల ధారిని పీతాంబరుని పౌండ్రకుని గని మధువైరి భావ గంభీరముగ నవ్వెను.

యుయుధే చ బలేనాథ హస్త్యశ్వబలినా ద్విజాః

నిస్త్రింశ ర్టిగదాశూలశక్తికార్ముకశాలినా

క్షణేన శార్ఙ్గనిర్ముక్తైః శరై రగ్నివిదారుణైః

గదాచక్రాతిపాతైశ్చ సూదయామాస తద్బలమ్‌

కాశిరాజబలం చైవ క్షయం నీత్వా జనార్థనః

ఉవాచ పౌండ్రకం మూఢ మాత్మచిహ్నోపలక్షణమ్‌

చతురంగ బలముతో గదా శూల శక్త్యాది సర్వాయుధము లతో నెదిరించిన వానితో గృష్ణుడు యుద్ధము జేసెను. శార్గ ధనుర్ముక్తము లైన యగ్ని జ్వాలలచే ధారుణము లైన గదా చక్ర పాతములచే క్షణములో వాని సైన్యమును హత మొనర్చెను. కాశిరాజు సత్వమును గూడ క్షయింప జేసి తన చిహ్నములం దాల్చియున్న యమ్మూఢునితో భగవంతుడిట్లనియె.

శ్రీభగవానుడు:

పౌండ్రకోక్తం త్వయాయత్తద్దూతవక్త్రేణమాంప్రతి

సముత్సృజేతి చిహ్నాని తత్తే సంసాదయామ్యహమ్‌

చక్రమేతత్సముత్సృష్టం గదేయం తే విసర్జితా

గరుత్మానేష నిర్దిష్టః సమారోహతు తే ధ్వజమ్‌

ఇత్యు చ్చార్య విముక్తేన చక్రేణాసౌ విదారితః

పాతితో గదయా భగ్నో గరుత్మాంశ్చ గరుత్మతా

తతో హాహాకృతే లోకే కాశీనామధిపస్తదా

యుయుధే వాసుదేవేన మిత్రస్యాపచితౌ స్థితః

తతః శార్గవినిర్మిక్తైశ్చిత్వా తస్య శరైః శిరః

కాశిపుర్యాం స చిక్షేప కుర్వంల్లోకస్య విస్మయమ్‌

హత్వాతు పౌండ్రకం శౌరిః కాశిరాజం చ సానుగమ్‌

రేమే ద్వారవతీం ప్రాప్తో మరః స్వర్గగతో యథా

శ్రీభగవానుడు:

పౌండ్రక! దూత ముఖమున నీవు పంపిన కబురంతయు విన్నాను. నా చక్రాది చిహ్నములను వదలు మని కదా నీ యాజ్ఞ. అది యట్లే నిర్వహించినాను. ఇదిగో చక్రము. గద యిదిగో వదలు చున్నాను. గరుత్మంతు డిడుగో. నీ ధ్వజ మందెక్కు గాక! అని పలికి పలికిన క్షణమున హరి వదలిన చక్రముచే వాడు చీల్చబడెను గదచే హతుడై పడెను. గరుత్మంతుని చే గరుత్మంతు డయ్యెను. అనగా రెక్కలు వచ్చి నట్లై యాకశమున కెగిరి పోయెను నన్నమాట. అంతట లోకము హాహాకార మొనరించెను. మిత్రున కుపకారముగ కృతజ్ఞతగ కాశిరాజు వాసుదేవునితో దలపడెను. హరి శార్ఙ్గ ధనుర్ముక్తము లైన యమ్ములచే వాని శిరము నరికి లోకమున కచ్ఛేరువు గల్గించుచు హరి కాశి పురికి విసరి వెసెను. శౌరి పౌండ్రకుని గూల్చి పరివారముతో కాశి రాజుం జంపి ద్వారవతికి వచ్చి స్వర్గమున కేతెంచిన యమరు డట్లు విలసిల్లెను.

తచ్ఛిరః వతితం తత్ర దృష్ట్వా కాశిపతేః పురే

జనః కిమేతదిత్యాహ కేనేత్యంతవిస్మితః

జ్ఞాత్వా తం వాసుదేవేన హతం తస్య సుతస్తతః

పురోహితేన సహిత స్తోషయామాస శంకరమ్‌

అవిముక్తే మహాక్షేత్రే తోషితస్తేన శంకరః

వరం వృణీష్వేతి తదా తం ప్రోవాచ నృపాత్మజమ్‌

స వవ్రే భగవ న్కృత్యా పితుర్హంతు ర్వధాయమే

సముత్తిష్ఠతు కృష్ణస్య త్వత్ప్రసాదా న్మహేశ్వర

కాశిపతి రాజధాని యందు బడిన వాని తలంజూచి యిదేమి యెవని చేతనైనది యని జనము విస్మయ మందెను. వాసుదేవునిచే నా కాశిరాజు హతుడయ్యె నని యెరిగి వాని కొడుకు పురోహితునితో నేగి విశ్వేశ్వరుని సంతోష పరచెను. (స్తుతించెను) శంకరుడు ఆ విముక్త మహా క్షేత్రమున వానిచే తోషితుడై యారాజు సుతుని వరము గోరు కొమ్మనియె. వాడు స్వామి! నాతండ్రిం గడ తేర్చిన కృష్ణుని గడతేర్పుటకు మహేశ్వర! నీ యనుగ్రహమున కృత్యయను దారుణ శక్తి లేచుగాక యనెను.

వ్యాసులు:

ఏవం భవిష్య తీత్యుక్తేదక్షిణాగ్నేరనంతరమ్‌

మహాకృత్యా సముత్తస్థౌ తస్యైవాగ్నినివేశనాత్‌

తతో జ్వాలాకరళాస్యా జ్వలత్కేశకలాపినీ

కృష్ణకృష్ణేతి కుపితా కృత్యా ద్వారవతీం యయౌ

తా మవేక్ష్య జనః సర్వో రౌద్రాం వికృతలోచనామ్‌

యయౌ శరణ్యం జగతాం శరణం మధుసూదనమ్‌

వ్యాసులు:

ఇట్లే యగునని యనినంత వాని యగ్నిహోత్ర శాల యందలి దక్షిణాగ్ని నుండి మహా కృత్య లేచెను. అగ్నిజ్వలా భయంకర మైన ముఖము మంటలెగయుచున్న కేశ కలాపముతో కృష్ణా! కృష్ణా!యని కోపముతో నది ద్వారవతి వంక జనెను. ఆ రౌద్ర మూర్తిని వికృతమగు కన్నుల దానిని ద్వారకా వాసి జనమెల్ల జూచి జగముల కెల్ల శరణమైన మధు వైరిని శరణొందెను.

జనా:

కాశిరాజ సుతేనేయ మారాధ్య వృషభధ్వజమ్‌

ఉత్పాదితా మహాకృత్యా వధాయ తవ చక్రిణః

జహి కృత్యా మిమా ముగ్రాం వహ్ని జ్వాలా జటాకులామ్‌

జనా:

కాశిరాజు వృషభ ధ్వజు నారాధించి యీ మహా కృత్యను గృష్ణుని చంపుటకు బుట్టించెను. అగ్ని జ్వాలల తోడి జడలచే నాకులయైన యీ యుగ్ర శక్తిని సంహరింపుము.

వ్యాసులు:

చక్ర ముత్సృష్ట మక్షేషు క్రీడాసక్తేన లీలయా

తదగ్ని మాలాజటిలం జ్వాలోద్గారాతిభీషణమ్‌

కృత్యా మనుజగామశు విష్ణుచక్రం సుదర్శనమ్‌

తతః సా చక్రవిధ్వస్తా కృత్యా మాహేశ్వరీ తదా

జగామ వేగినీ వేగాత్తద ప్యనుజగామ తామ్‌

కృత్వా వారాణసీ మేవ ప్రవివేశ త్వరాన్వితా

విష్ణుచక్రప్రతిహతప్రభావా మునిసత్తమాః

తతః కాశిబలం భూరి ప్రమథానాం తథా బలమ్‌

సమస్తశస్త్రాస్త్రయుతం చక్రస్యాభిముఖం యయౌ

శస్తాస్త్రమోక్షబహుళం దగ్ధ్వా తద్బల మోజసా

కృత్వాక్షేమా మశేషాం తాం పురీం వారాణసీం యయౌ

ప్రభూతభృత్యపౌరాం తాం సాశ్వమాతంగమానవామ్‌

అశేషదుర్గకోష్ఠాం తాం దిర్నిరీక్ష్యాం సురైరపి

జ్వాలాపరివృతాశేషగృహప్రాకారతోరణామ్‌

దదాహ తాం పురీం చక్రం సకలామేవ సత్వరమ్‌

అక్షీణామర్షమత్యల్ప సాధ్యసాధనకారకమ్‌

తచ్చక్రం ప్రస్ఫుర ద్దీప్తి విష్ణో రభ్యాయయౌ కరమ్‌

వ్యాసులు:

అను జనఘోష చదరంగ మాడుచు విని యాటగ నగ్ని మాలాజటిలయై జ్వాలలం గ్రక్కు చునున్న యతిభీషణ మైన యా కృత్యను విష్ణు చక్రము సుదర్శనము వెను దరిమెను మహేశ్వర దేవతాక యగు యాకృత్య హరిచక్ర విధ్వస్తయై వేగమున బరువెత్తెను. దానిని చక్రము వెంబడించెను. అపుడా కృత్య విష్ణు చక్రముచే ప్రభావము గోల్పడినది వారాణసిం బ్రవేశించెను. అవ్వల కాశిరాజు సైన్యము అంతువడని ప్రమథ గణ సైన్యము సర్వ శస్త్రాస్త్రములతో జక్రమున కెదురు సనెను. శస్త్రాస్త్రాఘాత బహుళమైన యా సైన్యము నెల్ల దహింప జేసి యశేష కాశీ నగరమును నిండ చతురంగ బలముతో రాజ భృత్యులతో పౌరులతో దుర్గములతో కోష్ఠములతో గాల్చి గృహప్రాకార తోరణము లందు మంటలు అలము కొన సత్వర మా చక్రము వారనాసిం గాల్చెను. అక్షీణమైన కసితో సాద్య సాధనకారకములు శేషింపమి నా సుదర్శనా యుధము దీప్తి మంతమై విష్ణు హస్తమున కేతెంచెను.