బ్రహ్మ మహా పురాణము

211 - కృష్ణ నిర్యాణ కథనమ్‌

వ్యాసులు:

ఇత్యుక్తో దారుకః కృష్ణం ప్రణిపత్య పునః పునః

ప్రదక్షిణం చ బహుశః కృత్వా ప్రాయాద్యథోదితమ్‌

స చ గత్వా తథా చక్రే ద్వారకాయాం తథార్జునమ్‌

ఆవినాయ మహా బుద్ధిం పజ్రం చక్రే తథా నృపమ్‌

భగవానపి గోవిందో వాసుదేవాత్మకం పరమ్‌

బ్రహ్మాత్మని సమారోప్య సర్వభూతే ష్వధారయత్‌

స మానయన్ద్విజవచో దుర్వాసా యదువాచ హ

యోగయుక్తోభవ త్పాదం కృత్వా జానుని సత్తమాః

సంప్రాప్తో వై జరా నామ తదా తత్ర స లుబ్థకః

ముసలశేషలోహస్య సాయకం ధారయ స్పరమ్‌

సతత్పాదం మృగాకారం సమవేక్ష్య వ్యవస్థితః

తతో వివ్యాధ తేనైవ తోమరేణ ద్విజోత్తమాః

గతశ్చ దదృశే తత్ర చతుర్బాహుధరం నరమ్‌

ప్రణిపత్యాహ చైవైనం ప్రసీదేతి పునః పునః

అజానతా కృతమిదం మయా హరిణశంకయా

క్షమ్యతా మాత్మపాపేన దగ్ధం మా దగ్ధు మర్హసి

తతస్తం భగవానాహ నాస్తి తే భయ మణ్వపి

గచ్ఛత్వం మత్ర్పసాదేన లుబ్ధ స్వర్గేశ్వరాస్పదమ్‌

వ్యాసులు:

కృష్ణునిచే నిట్లు తెలుప బడి దారుకుడు స్వామికి మఱిమఱి నమస్కరించి ప్రదక్షిణ మొనరించి యాయన చెప్పి నట్లేగెను. ఏగి ద్వారక కర్జునుని గొని వచ్చి వజ్రుని రాజుం జేసెను. భగవంతుడగు గోవిందుడు వాసుదేవాత్మక మయిన తన యంశమును బ్రహ్మ మందారోపించి సర్వ భూతము లందు ధరించెను. సర్వాత్మ భావము నందె నన్నమాట. మున్ను దుర్వాసుడు చెప్పినట్లు (అది ద్విజుడు బ్రాహ్మణుడు చెప్పిన మాట యైనందున) దానిం గౌరవింని మోకాలి పై పాదముంచి యోగ సమాధిం గొని నిల్చెను. అంతట జరుడు అను వ్యాధుడు (బోయ) అచటికి వచ్చెను. వాడు మునుపటి రోకలి యందు మిగిలిన యినుప ముక్కతో తయారైన బాణముం గొని యొక లేడి కాలి యడుగు వలెనున్న హరి పాదముం జూచి బాణముతో గొట్టెను. కొట్టి యాదరికి వెళ్ళి నాలుగు బాహువులతో నున్న యొక నరమూర్తిం జూచెను. ఆయనకు ప్రణామము సేసి క్షమింపు మని మఱిమఱి వేడుకొనెను. తెలియక యొక లేడి యనుకొని కొట్టితిని. నా పాప కర్మము చేత తగల బడుచున్న నన్ను నీవు తగలబెట్ట వలదు అనెను. వానింగని భగవంతుడు నీకణు మాత్రమేని భయము లేదు. నా ప్రసాదముచే దేవేంద్ర లోకమున కేగుమని హరి పలికెను.

వ్యాసులు:

విమానమాగతం సద్య స్తద్వాక్య సమనంతరమ్‌

ఆరుహ్య ప్రయయౌ స్వర్గం లుబ్ధక స్త త్ర్పసాదతః

గతే తస్మి న్స భగవా న్సంయోజ్యాత్మాసమాత్మని

బ్రహ్మభూతేవ్యయేచింత్యే వాసుదేవ మయేమలే

అజన్మ న్యజరేనాశిన్యప్రమేయేఖిలాత్మని

త్యక్త్వా స మానుషం దేహ మవాప త్రివిధాం గతిమ్‌

శ్రీహరి వాక్యానంతర మప్పుడే విమాన మేతెంచెను. ఆ బోయ హరి ప్రసాదము వలన నది యెక్కి స్వర్గమున కేగెను. అతడేగి నంతట భగవంతుడు నారాయణుడు మనసున కందని యమేయము అమలము జన్మ జరా మరణములు లేనిది సర్వాత్మకము నైన యాత్మ యందు (తన యందు) ఆత్మను (తనను) వాసుదేవ రూపమూర్తి యందు సంయోజించి మానుష దేహముం బాసి త్రివిధ మయిన గతిని బొందెను. సాలోక్య సారూప్య సాయుజ్య రూపమైన పరమ ముక్తిని బొందెను.