బ్రహ్మ మహా పురాణము

194 - దేవకీ వాసుదేవాభ్యాం సహ కృష్ణ సంవాదః

వ్యాసులు:

తౌ సముత్పన్నవిజ్ఞానౌ భగవత్కర్మదర్శనాత్‌

దేవకీవసుదేవౌ స్వాందృష్ట్వా మాయాం పునర్హరిః

మోహాయ యదుచక్రస్య వితతాన స వైష్ణవీమ్‌

ఉవాచ చాంబ భోస్తాత చిరాదుత్కంఠితేనతు

భవంతౌ కంసభీతేన దృష్టౌ సంకర్షణేన చ

కుర్వతాం యాతి యః కాలో మాతాప్రిత్రో రపూజనమ్‌

సవృథా క్లేశకారీ వై సాధునా ముపజాయతే

గురుదేవ ద్విజాతీనాం మాతాపిత్రోశ్చ పూజనమ్‌

కుర్వతః సఫలం జన్మ దేహిన స్తాత జాయతే

తత్క్షంతవ్య మిదం సర్వమతిక్రమకృతం పితః

కంసవీర్యప్రతాపాభ్యామావయోః పరవశ్యయోః

ఇత్యుక్త్వాథ ప్రణమ్యోభౌ యదువృధ్ధా ననుక్రమాత్‌

పాదానతిభిః సస్నేహం చక్రతుః పూర్ణమానసమ్‌

వ్యాసులు:

భగవద్విలాస దర్శనము వలన విజ్ఞాన ముదయించిన దేవకీ వసుదేవులం జూచి హరి యాదవ సంఘము మోహములో బడుటకు దన వైష్ణవ మాయను విస్తరింప జేసెను. అమ్మా! ఓ యయ్యా! ఎన్నాళ్ల నుండియొ మిమ్మెప్పుడు చూచెదనా యని త్వర పడుచు కంసునికి జడిసి యున్న బలరాముడు నేటికి మిమ్ము జూచినాడు. తల్లిదండ్రులు బూజింపకయే జరిగిన కాలమది వ్యర్ధము. ఉత్తముల కది బాధాకరము నగును. గురువుల దేవతల విప్రులను దలిదండ్రులు పూజించు వారి జన్మము సార్థకము. ఇందనుక యిది తప్పి చేసిన తప్పిదము తండ్రీ! క్షమింపుము. కంసుని బల పరాక్రమములకు జడిసి పరవశులమై యున్నందున నట్లు జరిగినది. అని పలికి ప్రీతితోను యదు వృద్ధుల బాదముల వ్రాలి యిద్దరును వసుదేవుని మనసు నిండు వరచిరి.

కంసనత్న్యస్తతః కంసం పరివార్యహతం భువి

విలేపుర్మాతరశ్చాస్య శోకదుఃఖపనరిప్లుతాః

బహుప్రకార మస్వస్థాః పశ్చాత్తాపాతురా హరిః

తాః సమాశ్వాసయామాస స్వయ మత్రావిలేక్షణః

ఉగ్రసేనం తతో బంధాన్ముమోచ మధుసూదనః

అభ్యషించ త్తథైవైనం నిజరాజ్యే హతాత్మజమ్‌

రాజ్యేభిషిక్తః కృష్ణేన యదుసింహః సుతస్యసః

చకార ప్రేతకార్యాణి యే చాన్యే తత్ర ఘాతికాః

కృతౌర్థ్యదైహికం చైనం సింహాసనగతం హరిః

ఉవాచాజ్ఞాపయవిభో యత్కార్య మవిశంకయా

యయాతిశాపాద్వంశోయమరాజ్యార్హోపి సాంప్రతమ్‌

మయిభృత్యే స్థితే దేవానాజ్ఞాపయతు కిం నృపైః

ఇత్యుక్త్వా చోగ్రసేనం తు వాయుం ప్రతిజగాదహ

నృవాచా చైవ భగవాన్కేశవః కార్యమానుషః

శ్రీకృష్ణుడు:

గచ్ఛేంద్రం బ్రూహి వాయో త్వమలం గర్వేణ వాసన

దీయతాముగ్రసేనాయ సుధర్మా భవతా సభా

కృష్ణో బ్రవీతి రాజార్హ మేతద్రత్న మనుత్తమమ్‌

సుధర్మాభ్యా సభా యుక్త మస్యాం యధుభిరాసితుమ్‌

వ్యాసులు:

ఇత్యుక్తః పవనోగత్వా సర్వమాహ శచీపతిమ్‌

దదౌసోపి సుధర్మాఖ్యాం సభాం వాయోః పురందరః

వాయునా చాహృతాం దివ్యాం తే సభాం యదుపుంగవాః

బుభుజుః సర్వరత్నాఢ్యాం గోవింద భుజసంశ్రయాః

అంతట గంసుని భార్యలు వాని తల్లులు పుడమిం బడియున్న కంసునిం జుట్టును జేరి దుఃఖ శోకముల మునింగి (దుఃఖము=కష్టము శోకము= ఆప్తబంధు మరణాదులచే మనస్సునకు గలుగు బాధ) పెక్కు రీతుల కలతవడి పశ్చాత్తాపము నెడ నాత్రము గొని పెక్కు రీతుల నేడ్చిరి. హరి తానుం గన్నుల నీరు వెట్టికొని వారల నోదార్చెను. అవ్వల నుగ్రసేనుని బంధము నుండి విడిపించెను. మఱియు నాతనిని కొడుకుం గోల్పడిన వానిని రాజ్యమునం దభిషిక్తుం జేసెను. రాజ్యాభిషిక్తుడై యాతడు తన కొడుకునకు మఱి యపుడు చచ్చిన వారికిని బ్రేత కృత్యములు గావించెను. అట్లొనర్చి సింహాసన మెక్కిన యాతనితో కృష్ణుడు శంకింపక యిపుడు యేమి చేయ వలయునో యానతిమ్ము. యయాతి శాపముచే నీ యదు వంశము రాజ్యానర్హమే యైనను ఇప్పుడు నేను భృత్యుడనై యున్నాను గావున నీవు దేవతల నేని శాసింపుము. నర పాలుర లెక్కేమి అని కార్య నిమిత్తమున మానుషా కారముల ధరించిన భగవంతుడు మానవ భాషణముల నుగ్రసేనునిం గూర్చి పలికి వాయువుం బిలిచి యిట్లనియె. నీ వేగి ఇంద్రునితో నిట్లనుము. ఇంద్ర! గర్వము వలదు. నీ సుధర్మ సభ నుగ్రసేనునికి సమర్పింపుము కృష్ణుడు చెప్పు చున్నాడు. అత్యుత్తమము రాజుల కర్హము. ఈ సుధర్మ సభా రత్నము (సర్వ సభా శ్రేష్టము) ఇందు యదువు లెక్కుట యుక్తము. అని పలుక పవనుండేగి శచీపతి కది యెల్ల విన్న వించెను. ఆతడును సుధర్మ సభను వాయువున కొసంగెను. వాయువు గొని వచ్చిన యాదివ్య సభను సర్వ రత్నాఢ్యమును (సర్వ వస్తువులలో నత్యుత్తమ శ్రేష్ఠ వస్తువులు గల దానిని) గోవిందుని బుజముల నీడ నుండి యదుశ్రేష్ఠు లనుభవించిరి.

విదితాఖిల విజ్ఞానౌ సర్వజ్ఞాన మయావపి

శిష్యాచార్యక్రమం వీరౌ ఖ్యాపయంతౌ యదూ త్తమౌ

తతః సాందీపనిం కాశ్యమవంతిపురవాసినమ్‌

అస్త్రార్థం జగ్ముతుర్వీరౌ బలదేవ జనార్దనౌ

తస్య శిష్యత్వమభ్యేత్య గురువృత్తి పరౌ హితౌ

దర్శయాం చక్రతుర్వీరావాచార మఖలేజనే

సరహస్యం ధనుర్వేదం ససంగ్రహమధీయతామ్‌

అహోరాత్రైశ్చతుః షష్ట్యా తదద్భుత మభూద్ద్విజాః

సాందీపని రసంభావ్యంతయోః కర్మాతిమానుషమ్‌

విచింత్య తౌ తదా మేనేప్రాప్తౌ చంద్ర దివాకరౌ

అస్త్రగ్రామ మశేషం చ ప్రోక్త మాత్రమవాప్య తౌ

ఊచతు ర్ర్వియతాం యా తే దాతవ్యా గురుదక్షిణా

సోప్యతీంద్రియ మాలోక్యతయోః కర్మమహహామతిః

ఆయాచత మృతం పుత్రం ప్రభాసే లవణార్ణవే

సర్వ విజ్ఞానము లెఱింగిన వారు కేవల జ్ఞాన స్వరూపు లయ్యు నవ్వీరులు రామ కృష్ణులు శిష్యాచార మిట్లుండ వలెనని లోకమునకు వెల్లడించు వారై కాశీ క్షేత్రమునం బుట్టి అవంతీ పురము నందు (ఉజ్జయినిలో) వసించు చున్న సాందీపని సన్నిధి కస్త్ర విద్యార్థము వారెరిగిరి. ఆయనకు శిష్యులై గురు శుశ్రూష చేయుచు నెల్ల జనమునకు సదాచారము గురు శిష్య భావమిట్లుండ వలెనని చేసి చూపించిరి. ధనుర్వేదము సరహస్యముగ ససంగ్రహముగ నరువది నాల్గు దినములలో నాయనితో సధ్యయనము సేసిరి. అది వింతల కెల్ల వింత యయ్యెను. సాందీపనియు నెన్నడు నూహింప వలను గానిది అమానుషము నైన యా యధ్యయనము తీరుగని యాలోచించి చంద్ర సూర్యు లిటు వచ్చినారని వారిం భావించెను. ఆ యిద్దరు జెప్పిన మాత్రన (ఉపదేశ మాత్రమున) అస్త్ర గ్రామమెల్ల పొంది తమకు గురు దక్షిణ మేమీయ నగునో యడుగు డనిరి. ఆయన మతి మంతుడు గావున వారి పనిని నతీంద్రియ జ్ఞానమున గని(కేవల తపో దృష్టింజూచి) లవణ సముద్రమున ప్రభాస తీర్థమందు మున్ను గతించిన పుత్రుని యాచించెను.

గృహీతాస్త్రౌ తతస్తౌతు గత్వా తం లవణోదధిమ్‌

ఊచతుశ్చ గురోః పుత్రో దీయతామితి సాగరమ్‌

కృతాంజలిపుట శ్చాబ్ధి స్తావథ ద్విజసత్తమాః

ఉవాచ న మయా పుత్రోహృతః సాందీపనేరితి

దైత్యః పంచజనో నామ శంఖరూపః స బాలకమ్‌

జగ్రాహ సో స్తి సలిలే మమైవాసురసూదన

ఇత్యుక్తోంతర్జలం గత్వా హత్వా పంచజనంతథా

కృష్ణోజగ్రాహ తస్యాస్థిప్రభవం శంఖముత్తమమ్‌

యస్యనాదేన దైత్యానాం బలహానిః ప్రజాయతే

దేవానాం వర్థతే తేజో యాత్యధర్మశ్చ సంక్షయమ్‌

తం పాంజజన్య మాపూర్య గత్వా యమపురీం హరిః

బలదేవశ్చ బలవాన్‌ జిత్వా వైవస్వతం యమమ్‌

తం బాలం యాతనాసంస్థం యథాపూర్వశరీరిణమ్‌

పిత్త్రే ప్రదత్తవాన్‌ కృష్ణో బలశ్చ బలినాం వరః

మథురాం చ పునః ప్రాప్తావుగ్రసేనేన పాలితామ్‌

ప్రహృష్ట పురుష స్త్రీకా వుభౌ రామజనార్దనౌ

వారిద్దరు నస్త్రములం జేకొని సముద్రముం దరిసి సాగరునితో గురుపుత్రు నిమ్మని పల్కిరి. వార్ధియుం జేతులు మొగిచి నేను సాందీపని పుత్రుని హరింప లేదనియు పంచజను డను దైత్యుడు శంఖము రూపమున నుండువాడా బాలునిం గొనిపోయె. వాడు నా నీటిలోనె యున్నా డనియె. అది విని కృష్ణుడు నీళ్ల లోనికిం జొచ్చి పంచజనుంబం చత్వ మందించి వాని యెమ్శులం బొడమిన యుత్తమ మైన శంఖముం జేకొనియె దాని నాదముచే దైత్యులకు బలము పోవును దేవతలకు తేజస్సు వృద్ధి పొందును. అధర్మము క్షయించును. అట్టి పాంచజన్యము నెత్తి హరి యొత్తి యమపురి కేగి బలభద్రు డును యమునిం గెల్చి యమ యాతన నున్న యా బాలునిం గొని మునుపటి వోలె మానవ శరీరమున నున్నవానిం దండ్రికి బలరామ కృష్ణు లొసంగిరి. అటనుండి యుగ్రసేన పరిపాలనలో నున్న మధుర కేతెంచిరి. మధురా పుర వాసులు స్త్రీ పురుషులు వారి యాగ మనమున కమితానంద భరితులైరి.