బ్రహ్మ మహా పురాణము

216 - నరక దుఃఖ నివారణాయ ధర్మాచరణ వర్ణనమ్‌

మునులు:

ఆహోతిదుఃఖం ఘోరం చ యమమార్గే త్వయోదితమ్‌

నరకారిణి చ ఘోరాణి ద్వారం యామ్యం చ సత్తమ

అస్త్యుపాయో నవా బ్రహ్మన్‌ య్యమమార్గేతి భీషణే

బ్రూహి యేన నరా యాంతి సుఖేన యమసాదనమ్‌

మునులు:

యమలోక మార్గమందు గల్గు ఘోర దుఃఖము ఘోరము లైన నరకములు నరక ద్వారమును గురించి యాశ్చర్యమైన విషయములను నీవు దెలిపితివి. భయంకరమైన యా దారిలో సుఖముగ వెళ్ళుట కుపాయము కలదో లేదో తెలుపు మన వ్యాసులు యిట్లనిరి.

వ్యాసులు:

ఇహ యే ధర్మసంయుక్తా స్త్వహింసానిరతా నరాః

గురుశుశ్రూషణే యుక్తా దేవబ్రామ్మణపూజకాః

యస్మిన్మష్యలోకేతే సభార్యాః ససుతాస్తథా

తమధ్వానం చ గచ్ఛంతి యథా తత్కథయామివః

విమానైర్వివిధైర్దివ్యైః కాంచనధ్వజశోభితైః

ధర్మరాజపురం యాంతి అప్సరోగణ సేవితాః

బ్రాహ్మణేభ్యస్తు దానాని నానారూపాణి భక్తితః

యే ప్రయచ్ఛంతి తే యాంతి సుఖేనైవ మహాపథే

అన్నం యేతు ప్రయచ్ఛంతి బ్రాహ్మణేభ్యః సుసంస్కృతమ్‌

శ్రోత్రియేభ్యో విశేషేణ భక్త్యా పరమయాయుతః

తరుణీభిర్వరస్త్రీభిః సేవ్యమానాః ప్రయత్నతః

ధర్మరాజపురం యాంతి విమానైరభ్యలంకృతైః

యేచ సత్యం ప్రభాషంతే బహిరంతశ్చ నిర్మలాః

తేపియాంత్యమరప్రఖ్యా విమానైర్యమమందిరమ్‌

గోదానాని పవిత్రాణి విష్ణుముద్దిశ్య సాధుషు

యే ప్రయచ్ఛంతి ధర్మజ్ఞాః కృశేషు కృశవృత్తిషు

తేయాంతి దివ్యవర్ణాభై ర్విమావైర్మణిచిత్రితైః

ధర్మరాజపురం శ్రీమత్సేవమానాప్సరోగణైః

వ్యాసులు:

ఇహమందు ధర్మపరులై యహింసా నిరతులై గురు శుశ్రూష దేవ బ్రాహ్మణ పూజ చేసిన వారు భార్యా పుత్రాదులతో యమ మార్గమున వెళ్ళరు. బంగారు టెక్కెములతో గూడిన దివ్య విమానముల యందప్సరసలు సేవింప ధర్మరాజు పరమున కేగెదరు. బ్రాహ్మణుల కన్నదానము మొదలైన వానిని భక్తితో పవిత్రముగ చేసిన వారు దేవతా తరుణుల చేత సేవింప బడుచు విమానముల మీద వెళ్ళెదరు. సత్యము పల్కినవారు మనసులో మాటలో స్వచ్చమైన వారు విష్ణు తాత్పర్యముతో గోదానమ జేసిన వారప్సరసలు సేవింప ధర్మపురి కేగుదురు.

ఉపానద్యుగళం ఛత్రం శయ్యాసనమథాపివా

యేప్రయచ్ఛంతి వస్త్రాణి తథైవాభరణానిచ

తేయాంత్యశ్చైరథైశ్చైవ కుంజరైశ్చాప్యలంకృతాః

ధర్మరాజపురం దివ్యం ఛత్త్రైః సౌవర్ణరాజతైః

యేచ భక్త్యా ప్రయచ్ఛంతి గుడపానక మర్చితమ్‌

ఓదనం చ ద్విజాగ్ర్యేభ్యో విశుద్ధేనాంతరాత్మనా

తే యాంతి కాంచనైర్యానై ర్వివిధైస్తు యమాలయమ్‌

వర స్త్రీభిర్యథాకామం సేవ్యమానాః పునః పునః

యేచ క్షీరం ప్రయచ్ఛంతి ఘృతం దధిగుడం మధు

బ్రాహ్మణేభ్యః ప్రయత్నేన శుద్ధ్యోపేతం సుసంస్కృతమ్‌

చక్రవాకప్రయుక్తైశ్చ విమానైస్తు హిరణ్మయైః

యాంతి గంధర్వవాదిత్రైః సేవ్యమనా యమాలయమ్‌

యేఫలాని ప్రయచ్ఛంతి పుష్పాణిసురభీణిచ

హంస యుక్తైర్విమానైస్తు యాంతి ధర్మపురం నరాః

యేతిలంస్తిల ధేనుంచ ఘృతధేనుమథాపివా

శ్రోత్రియేభ్యః ప్రయచ్ఛంతి విప్రేభ్యః శ్రద్ధయాన్వితాః

సోమమండలసంకాశై ర్యానైస్తే యాంతి నిర్మలైః

గంధర్వైరుపగీయంతే పురే వైవస్వతస్య తే

యేషాం వాప్యశ్చ కూపాశ్చ తడాగాని సరాంపిచ

దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ శీతలాశ్చ జలాశయాః

యానైస్తే హేమచంద్రాభై ర్దివ్యఘంటానినాదితైః

వ్యజనైస్తాళవృంతైశ్చ వీజ్యమానా మహాప్రభాః

యేషాం దేవకులాన్యత్ర చిత్రాణ్యాయతనానిచ

రత్నైః ప్రస్ఫురమాణాని మనోజ్ఞాని శుభానిచ

తేయాంతి లోకపాలైసై ర్విమానైర్వాతరంహసైః

ధర్మరాజపురం దివ్యం నానాజనసమాకులమ్‌

పానీయం యే ప్రయచ్ఛంతి సర్వప్రాణిషు జీవనమ్‌

తే వితృష్ణాః సుఖం యాంతి విమానై స్తం మహాపథమ్‌

కాష్ఠపాదుక యానాని పీఠకాన్యాసనాని చ

యైర్దత్తాని ద్విజాతిభ్య స్తేధ్వానం యాంతి వైసుఖమ్‌

సౌవర్ణ మణిపీఠేషు పాదౌ కృత్వోత్తమేషు చ

తే ప్రయాంతి విమానైస్తు అప్సరోగణమండితైః

ఆరామాణి విచిత్రాణి పుష్పాఢ్యానీహ మానవాః

రోపయంతి ఫలాఢ్యాని నరాణా ముపకారిణః

వృక్షచ్ఛాయాసు రమ్యాసు శీతలాసు స్వలంకృతాః

వరస్త్రీగీతవాద్యైశ్చ సేవ్యమానా వ్రజంతి తే

సువర్ణం రజతం వామౌపి విద్రుమం వకాక్తికం తథాః

యే ప్రయచ్ఛంతి తే యాంతి విమానైః కనకోజ్జ్వలైః

భూమిదా దీప్యమానాశ్చ సర్వకామైస్తు తర్పితాః

ఉదితాదిత్య సంకాశై ర్విమాన్పైర్భృశనాదితైః

కన్యాం తు యేప్రయచ్ఛంతి బ్రహ్మదేయామలంకృతామ్‌

దివ్యకన్యావృతాయాంతి విమానైస్తేయమాలయమ్‌

సుగంధాగురుకర్పూరా న్పుష్పధూపాన్ద్విజోత్తమాః

ప్రయచ్ఛంతి ద్విజాతిభ్యో భక్త్యా పరమయాన్వితాః

తే సుగంధాః సువేషాశ్చ సుప్రభాః సువిభూషితాః

యాంతి ధర్మపురం యానై విచిత్రైరభ్యలంకృతాః

దీపదా యాంతి యానైశ్చ దీపయంతో దిశో దశ

ఆదిత్య సదృశై ర్యానై ర్దీప్యమానా యథ్యాన్నయః

గృహావసథదాతారో గృహైః కాచంనమండితైః

వ్రజంతిబాలార్కనిభై ర్ధర్మరాజ గృహం నరాః

జలభాజన దాతారః కుండికా కారకప్రదాః

పూజ్యమానాప్సరోభిశ్చ యాంతి దృప్తా మహాగజైః

పాదాభ్యంగం శిరోభ్యంగం స్నానపానోదకం తథా

యే ప్రయచ్ఛంతి విప్రేభ్య స్తే యాంత్యశ్వైర్యమాలయమ్‌

విశ్రామయంతి యేవిప్రాం శ్రాంతానథ్వని కర్శితాన్‌

చక్రవాకప్రయుక్తేన యాంతి యానేద తే సుఖమ్‌

స్వాగతేన చ యో విప్రం పూజయే దాసనేన చ

సగచ్ఛంతితమధ్వానం సుఖం పరమనిర్వృతః

నమోబ్రహ్మణ్య దేవేతి యో హరిం చాభివాదయేత్‌

గాంచ పాపహరేత్యుక్త్వా సుఖం యాంతిచ తత్పథమ్‌

అనంతరాశినో యేచ దంభానృతవివర్జితాః

తేపి సారసయుక్తైస్తు యాంతి యానైశ్చ తత్పథమ్‌

వర్తంతే హ్యేకభక్తేన శాఠ్యదంభ వివర్జితాః

హంసయుక్తైర్విమానైస్తు సుఖం యాంతి యమాలయమ్‌

చతుర్ధేనైకభక్తేన వర్తతే యే జితేంద్రియాః

తేయాంతి ధర్మనగరం యానైర్బర్హిణయోజితైః

తృతీయే దివసే యేతు భుంజతే నియతవ్రతాః

తేపి హస్తిరథైర్దివ్యై ర్యాంతి యానైశ్చ తత్పథమ్‌

షష్ఠేన్నభక్షకో యస్తు శౌచనిత్యో జితేంద్రియః

సయాతి కుంజరస్థస్తు శచీపతిరివ స్వయమ్‌

ధర్మరాజపురం దివ్యం నానామణి విభూషితమ్‌

నానాస్వరసమాయుక్తం జయశబ్దరవైర్యుతమ్‌

పక్షోపవాసినో యాంతి యానైః శార్దూలయోజితైః

పురం తద్ధర్మరాజస్య సేవ్యమానాః సురాసురైః

యేచమాసోపవాసం తు కుర్వతే సంయతేంద్రియాః

తేపి సూర్య ప్రదీప్తైస్తు యాంతి యానైర్యమాలయమ్‌

మహాప్రస్థాన మేకాగ్రో యః ప్రయాతి దృఢవ్రతః

సేవ్యమానస్తు గంధర్వై ర్యాతి యానైర్యమాలయమ్‌

శరీరం సాధయే ద్యస్తు వైష్ణవేనాంతరాత్మనా

స రథేనాగ్ని వర్ణేన యాతీహ త్రిదశాలయమ్‌

అగ్ని ప్రవేశం యః కుర్యా న్నారాయణపరాయణః

స యాత్యగ్ని ప్రకాశేన విమానేన యమాలయమ్‌

ప్రాణాంస్త్యజతి యో మర్త్యః స్మరన్విష్ణుం సనాతనమ్‌

యానేనార్క ప్రకాశేన యాతి ధర్మపురం నరః

ప్రవిష్టోంతర్జలం యస్తు ప్రాణాంస్త్యజతిమానవః

సోమమండలకల్పేన యాతి యానేన వై సుఖమ్‌

స్వశరీరం హి గృధ్రేభ్యో వైష్ణవో యః ప్రయచ్ఛతి

సయాతి రథముఖ్యేన కాంచనేన యమాలయమ్‌

స్త్రీగ్రహే గోగ్రహే వాపి యుద్ధే మృత్యుముపైతియః

స యాత్యమరకన్యాభిః సేవ్యమానో రవిప్రభః

వైష్ణవా యే చ కుర్వంతి తీర్థయాత్రాం జితేంద్రియాః

తత్పథం యాంతితే ఘోరంసుఖయానైరలంకృతాః

యే యజంతి ద్విజశ్రేష్ఠాః క్రతుభిర్భూరిదక్షిణైః

తప్తహాటక సంకాశై ర్విమానైర్యాంతి తే సుఖమ్‌

పరపీడామకుర్వంతో భృత్యానాం భరణాదికమ్‌

కుర్వంతితే సుఖమ్‌ యాంతి విమానైః కనకోజ్జ్వలైః

యే క్షాంతాః సర్వభూతేషు ప్రాణినా మభయప్రదాః

క్రోధమోహ వినిర్ముక్తా నిర్మదాః సంయతేంద్రియాః

పూర్ణచంద్రప్రకాశేన విమానేన మహాప్రభాః

యాంతి వైవస్వతపురం దేవగంధర్వసేవితాః

ఏకభావేన యే విష్ణుం బ్రహ్మాణం త్య్రంబకం రవిమ్‌

పూజయంతి హితేయాంతి విమానై ర్భాస్కర ప్రభైః

యేచ మాంసం న ఖాదంతి సత్యశౌచసమన్వితాః

తేపి యాంతి సుఖేనైవ ధర్మరాజపురం నరాః

మాంసాన్మిష్టతరం నాస్తి భక్ష్యభోజ్యాదికేషు చ

తస్మాన్మాంసం న భుంజీత నాస్తి మిష్టైః సుఖోదయః

గో సహస్రం తు యో దద్యాద్యస్తు మాంసం న భక్షయేత్‌

సమావేతౌ పురా ప్రాహ బ్రహ్మా వేదవిదాం వరః

సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వయజ్ఞేషు యత్ఫలమ్‌

అమాంసభక్షణే విప్రా స్తచ్చ తచ్చచతత్పమమ్‌

ఏవం సుఖేన తే యాంతి యమలోకం చ ధార్మికాః

దానవ్రతపరా యానై ర్యత్ర దేవో రవేః సుతః

పాదరక్షలు గొడుగు మంచము ఆసనము వస్త్రాభరణముల నొసంగిన వారు గజాశ్వ రథముల నెక్కి బంగారు వెండి గొడుగులతో నేగుదురు. శుద్ధాంతఃకరణముతో పానకము అన్నము పూజించి యిచ్చిన వారు బంగారు విమానముల నేగుదురు. పాలు పెరుగు నేయి బెల్లము మంత్ర పూతముగా పరిమళ పుష్పముల నిచ్చిన వారు హం సవిమానముల మీద నరుగుదురు. నువ్వులను తిలధేను ఘృత ధేను దానములను శ్రద్ధతో శ్రోత్రియుల కిచ్చినవారు చంద్ర మండలము నట్లు ప్రకాశించు విమానముల మీద గంధర్వులు గానము సేయు చుండ యమపురికి జనెదరు. వాపీ కూప తటాకములు సరస్సులు దిగుడు బావులు పుష్కరుణులు మొదలైన శీతలోదక జలాశయము లను ద్రవ్వించిన వారు బంగారు విమానముల మీద దివ్య ఘంటా నాదము వినిపింప ఛత్ర చామరాదులచే వీవ బడుచు నేగుదురు. ఈ లోక మందు దేవాలయములు సువర్ణ రత్న మయములుగా నిర్మించిన వారు వాయు వేగములైన విమానములలో లోక పాలురతో నేగుదురు. మంచి నీళ్ళిచ్చిన వారు దారుమయ పాదుకులు పీఠములు ఆసనము లిచ్చిన వారు సుఖముగ స్వర్ణ మణి పీఠమందు గూర్చుండి విమానముల లోనేగుదురు. పుష్పో ద్యానములు పండ్ల తోటలు ప్రతిష్ఠించిన వారు చల్లని చెట్ల నీడలో దేవతా గానముల వినుచు నేగుదురు. బంగారము వెండి పవడము ముత్యము దాన మిచ్చిన వారు భూదాతలు సాలంకృత కన్యాదానము చేసిన వారు సుగంధాగరు కర్పూరములను పుష్పములను ధూప ద్రవ్యముల నొసంగిన వారు సుగంధ లిప్తులై సువేషులై సుప్రభులై సుభూషితులై ధర్మపుర మేగుదురు. దీప దానము చేసిన వారు సూర్య సదృశమైన విమానముల మీద దశ దెశలు మెరయించుచు నేగుదురు. గృహదానము చేసిన వారు బంగారు గృహముల వసింతురు. జల కుంభములను కుండికలను కూజాల నిచ్చిన వారేనుగుల మీద వెళ్ళెదరు. పాదాభ్యంగము. శిరో భ్యంగము చేయించిన వారు స్నానపానోదకముల నిచ్చిన వారు జాతి గుఱ్ఱము నెక్కి వెళ్ళెదరు. మార్గా యాసమున వచ్చిన బ్రాహ్మణులను విశ్రమింప జేసిన వారు చక్రవాక పక్షులు పూన్చిన వాహనముల నేగుదురు. ఇంటికి వచ్చిన బ్రాహ్మణులకు స్వాగతముచ్చి (దయ చేయుడని గౌరవించి) సుఖాసన మిచ్చి పూజించిన వారు నమో బ్రహ్మణ్య దేవాయ (బ్రహణ్య మూర్తియైన భూ దేవునకు నమస్కారము) యని పాదములపై వ్రాలి నమస్కరించి పాపహరయను మంత్రముతో గోదానము చేసిన వారును సుఖ ప్రయాణము చేయుదురు. ద్విజ భుక్త శేషము అనగా బ్రాహ్మణులకు భోజనము పెట్టిన తరువాత శేషించిన యమృతమను పేరుగల యాహారము ప్రసాద రూపముగ నారగించిన వారు దాంఛిక వృత్తి యనృతము లేనివారు హంస విమానమున నేగుదురు. మూడు రోజు లుపవాస ముండి నాల్గవ రోజున నేక భుక్తము సేసిన వారు మూర్ఖత్వము డాంభికము లేనివారు నెమలి విమానములో నేగుదురు. మూడురోజుల కొకసారి వ్రతము పూని భోబనము సేయువారు గజ రథముల మీద నేగుదురు. ఆరు రోజుల కొక్కమారే శుచియై భోజనము చేసిన యాతడు దేవేంద్రు నట్లేనుగు నెక్కి వెళ్ళును. పక్షమున కొకతూరి భోజనము చేసిన వారు పులులు పూన్చిన రథమున నేగెదరు. నెల రోజు లుప వాసము సేసిన వారు గంధర్వ గానములు వినుచు విమాన యానము చేయుదురు. విష్ణుభక్తి తాత్పర్యముతో నారాయణ పరాయణతతో ప్రాణము బాసిన వాడు అగ్ని ప్రవేశము చేసిన వాడగ్ని వలె విలసించు రథమున నేగును. విష్ణు భక్తితో తనంతట తాను జలములో దిగి ప్రాణము వదలిన వాడు, తన శరీరమును గ్రద్దల కెరవెట్టిన వాడు బంగార విమానమున నేగును. గోరక్షణకు స్త్రీ రక్షణ కొరకు ప్రాణ మర్పించిన వాడు దేవతా స్త్రీలు గొలువ సూర్యప్రభతో నేగును. విష్ణు భక్తితో తీర్థయాత్ర సేసిన వారు యజ్ఞములు చేసిన వారు ఇతరుల కెట్టి బాధయు గల్గింపని వారు భక్తితో సేవచేయు నౌకర్లను భరించిన వారు ఓరిమి గల వారు సర్వభూత దయ గలవారు అభయ మిచ్చిన వారు కామాది గుణములు లేనివారు చంద్ర ప్రకాశమైన విమానమున దేవ గంధర్వుల కొలువ యమపురి కేగుదురు. బ్రహ్మ విష్ణు శివమూర్తులను భేదబుద్ధి లేకుండ పూజించిన వారు సూర్య ప్రభములగు విమానముల నేగుదురు. సత్య శౌచములు గల్గి మాంసము తినని వారును సుఖముగ నేగుదురు. భక్ష్య భోజ్యాదు లందు మాంసము కంటె రుచికరమైన పదార్థము లేదు. పర సుఖాభిలాషి దానిని తిన గూడదు. మాంసము ముట్టని వాడు గోసహస్ర దానముసేసిన వాడును సమాను లేయని వేదవేత్తల కెల్ల శ్రేష్ఠుడైన బ్రహ్మ చెప్పినాడు. సర్వ తీర్థ సేవనము సర్వయజ్ఞా చరణము వలన కల్గు పుణ్య మొక్క మాంస భక్షణ చేయనందు వలన కల్గును. దాన వ్రతధర్మ పరులైన మహానుభావులు సూర్య కుమారుడైన ధర్మ ప్రభువు యొక్క నగరమునకు సుఖముగ నేగుదురు.

దృష్ట్వా తాన్థార్మికాన్దేవః స్వయం సంమానయేద్యమః

స్వాగతాసనదానేన పాద్యార్ఘ్యేణ ప్రియేణతు

ధన్యా యూయం మహాత్మాన ఆత్మనో హితకారిణః

యేన దివ్య సుఖార్థాయ భవద్భిః సుకృతం కృతమ్‌

ఇదం విమానమారుహ్య దివ్యస్త్రీభోగభూషితాః

స్వర్గం గచ్ఛధ్వమతులం సర్వకామసమన్వితమ్‌

తత్ర భుక్త్వా మహాభోగా నంతే పుణ్యపరిక్షయాత్‌

యత్కించిదల్పమశుభం ఫలం తదిహ భోక్ష్యథ

యేతు తం ధర్మరాజానం నరాః పుణ్యానుభావతః

పశ్యంతి సౌమ్యమనసం పితృభూతమివాత్మనః

తస్మాద్ధర్మః సేవితవ్యః సదాముక్తి ఫలప్రదః

ధర్మాదర్థస్తథాకామో మోక్షశ్చ పరికీర్త్యతే

ధర్మోమాతా పితా భ్రాతా ధర్మోనాథః సుహృత్తథా

ధర్మః స్వామీ సఖా గోప్తా తథా ధాతా చ పోషకః

ధర్మాదర్థోర్థతః కామః కామాద్భోగః సుఖాని చ

ధర్మాదైశ్వర్యమేకాగ్ర్యం ధర్మాత్స్వర్గగతిః పరా

ధర్మస్తు సేవితో విప్రా స్త్రాయతే మహతో భయాత్‌

దేవత్వం చ ద్విజ్వతం చ ధర్మాత్ప్రాప్నో త్య సంశయమ్‌

యదాచ క్షీయతే పాపం నరాణాం పూర్వసంచితమ్‌

తదైషాం భజతే బుద్ధి ర్ధర్మం చాత్ర ద్విజోత్తమాః

జన్మాంతరసహస్రేషు మానుష్యం ప్రాప్యదుర్లభమ్‌

యో హినాచరతే ధర్మం భవేత్స ఖలువంచితః

కుత్సితా యే దరిద్రాశ్చ విరూపావ్యాధితాస్తథా

పరప్రేప్యాశ్చమూర్ఖాశ్చజ్ఞేయా ధర్మవివర్జితాః

యేహి దీర్ఘాయుషః శూరాః పండితా భోగినోర్థినః

అరోగా రూపవంతశ్చ తైస్తు ధర్మః పురాకృతః

ఏవం ధర్మరతా విప్రాగచ్ఛంతి గతిముత్తమామ్‌

అధర్మం సేవమానాస్తు తిర్యగ్యోనిం వ్రజంతితే

యే నరా నరకధ్వంసి వాసుదేవమనువ్రతాః

తే స్వప్నేపి న పశ్యంతి యమం వా నరకాణి వా

అనాదినిధనం దేవం దైత్యదానవ దారణమ్‌

యే నమంతి నరానిత్యం న హి పశ్యంతి తే యమమ్‌

కర్మణా మనసా వాచా యేచ్యుతం శరణంగతాః

న సమర్థో యమస్తేషాం తే ముక్తిఫలభాగినః

యే జనా జగతాం నాథం నిత్యం నారాయణంద్విజాః

నమంతి నహి తే విష్ణోః స్థానా దన్యత్ర గామినః

నతే దూతాన్న తన్మార్గం న యమం నచ తాంపురీమ్‌

ప్రణమ్య విష్ణుం పశ్యంతి నరకాణి కథంచన

కృత్వాపి బహుశః పాపం నరా మోహసమన్వితాః

న యాంతి నరకం నత్వా సర్వపాపహరం హరిమ్‌

శాఠ్యేనాపి నరా నిత్యం యే స్మరంతి జనార్దనమ్‌

తేపి యాంతి తనుంత్యక్త్యా విష్ణులోకమనామయమ్‌

అత్యంతక్రోధసక్తోపి కదాచిత్కీర్తయేద్ధరిమ్‌

సోపి దోషక్షయాన్ముక్తిం లభే చ్చేదిపతిర్యథా

అట్లు వచ్చిన ధర్మాత్ములకు యముడు స్వయముగా స్వాగతము పల్కి పాద్యార్ఘ్యా సనాద్యు పచారములు సేసి సత్కరించును. మీరు ధన్యులు మహానుభావులు మీ హిత వేదియో తెలిసి పుణ్యము సేసినారు. ఇదిగో దివ్యస్త్రీ భోగ భాజనమైన యీ విమాన మెక్కి సర్వకామ సమృద్ధమైన స్వర్గ మునకు వెళ్ళుడు. మహాభోగము లట నను భవించి దాన మీ పుణ్యము చెల్లిన తరువాత శేషించి యే దైనను కొంచెము పాపమున్న యెడల దాని నిక్కడ యనుభవింపుడు. పుణ్య ఫలముగ సౌమ్యమైన మనస్సుతో తనకు తండ్రియైన యముని పితృ దేవతా రూపమున దర్శింతురు. కావున ధర్మము భుక్తి ముక్తుల నిచ్చునది యవశ్యము సేవింప వలసినది. ధర్మము వలననే యర్థ కామములు మోక్షము గూడ సిద్ధించును. ధర్మము తల్లి తండ్రి సోదరుడు. దిక్కు ధర్మము యజమానికి మిత్రుడు రక్షకుడు ధాత పోషకుడును. ధర్మము వలన యర్థము అర్థము వలన కామము కామము వలన సుఖ భోగములు ధర్మము వలన సర్యోత్త మైశ్వర్యము ధర్మము వలన స్వర్గ గతి పరమ గతియు ధర్మము నాచరించిన నది మహా భయము నుండి రక్షించును. దేవత్వము భూ దేవత్వము దాని వలననే. పూర్వ పాపము నశించి నపుడే జీవులకు ధర్మబుద్ధి గల్గును. వేల కొలది జన్మముల తరువాత గాని లభింపని మానుష్యమును బొంది గూడ ధర్మము నాచరింపని వాడు దైవ వంచితుడు. ధర్మదూరు లైనవారే నీచులు దరిద్రులు విరూపులు రోగులు నౌకరులు మూర్ఖులు నైనగుదురు. దీర్ఘా యుష్మంతులు శూరులు పండితులు భోగులు ధనికులు నరోగులు సురూపులు నగువారు పూర్వము ధర్మము సేసిన వారన్న మాట. ధర్మరతు లుత్తమగతి కేగుదురు.అధర్మ రతులు పశు పక్ష్యాది యోని నందుదురు. నరక ధ్వంసియైన వాసుదేవుని సేవించు వ్రతము గలవారు గలలో గూడ కాలుని నరకములను జూడరు. ఆద్యంతములు వేని దేవుని దైత్య దానవ నాశకుని పరమేశ్వరు నచ్యుతుని త్రికరణ శుద్ధిగ శరణొందిన వారిని యము డేమియు చేయజాలడు. నారాయణుని నమస్కరించు వారు విష్ణు స్థానముం దప్ప మరియొక చోటునకు బోరు. వారికి యమ దూతలు యముడు యమపురి నరకములు కానిపింపవు. పొరవడి పెక్కు పాపములు చేసిన వారుకూడ సర్వపాప హరుడగు హరిని నమస్కరించి రేని నరకమునకు బోరు. మోఢ్యము చేతనైనను జనార్దన స్మరణ సేసినవారు శరీరమును విడిచి విష్ణు లోకమునకు పోదురు. పగచే నైన నొక్క తఱి హరినామ ముచ్చరించిన జాలును శిశుపాలు డట్లు ముక్తి నందును.