బ్రహ్మ మహా పురాణము

225 - ఉమా మహేశ్వర సంవాదే దేవలోక ప్రాప్తి కారణ కథనమ్‌

ధర్మ నిరూపణము

ఉమాదేవి:

కిం శీలః కిం సమాచారః పురుషః కైశ్చ కర్మభిః

స్వర్గ సమభిపద్యేత సంప్రదానేన కేన వా

ఉమాదేవి:

ఏ శీలము ఏ ఆచరణము కలిగి ఏ కర్మము లాచరించి ఏ దానములు చేసి మానవుడు స్వర్గమును పొందును?

మహేశ్వరుడు:

దాతా బ్రాహ్మణసత్కర్తా దీనా ర్తకృపణాదిషు

భక్షోభోజ్యాన్న పానానాం వాససాం చ మహామతిః

ప్రతిశ్రయాన్సభాః కుర్యా త్ప్రపాః పుష్కరిణీ స్తథా

నిత్యకాదీని కర్మణి కరోతి ప్రయతః శుచిః

ఆసనం శయనం యానం గృహం రత్నం ధనం తథా

సస్యజాతాని సర్వాణి సక్షేత్రాణ్యథ యోషితః

సుప్రశాంతమనా నిత్యం యః ప్రయచ్ఛతి మానవః

ఏవంభూతో నరో దేవి దేవలోకేభిజాయతే

తత్రోష్య సుచిరం కాలం భుక్త్వా భోగాననుత్తమాన్‌

సహాప్సరోభిర్ముదితో రమిత్వా నందనాదిషు

తస్మాచ్ఛ్యుతో మహేశాని మానుషేషూపజాయతే

మహాభాగకులే దేవి ధనధాన్యసమాచితే

తత్ర కామగుణౖః సర్వైః సముపేతే ముదాన్వితః

మహాకార్యో మహాభాగో ధనీ భవతి మానవః

ఏతే దేవి మహాభాగాః ప్రాణినో దానశాలినః

బ్రహ్మణా వైపురాప్రోక్తా సర్వస్య ప్రియదర్శనాః

అపరే మానవా దేవి ప్రదానకృపణా ద్విజాః

యేన్నాని న ప్రయచ్ఛంతి విద్యమానేప్యబుద్ధయః

దీనాంధ కృపణాన్దృష్ట్వా భిక్షుకానాతిథీనపి

యాచ్యమానా నివర్తంతే జిహ్వాలోభ సమన్వితాః

న ధనాని న వాసాంసి న భోగాన్న చ కాంచనమ్‌

న గాశ్చ నాన్నవికృతిం ప్రయచ్ఛంతి కదాచన

అప్రలుబ్ధాశ్చ యే లుబ్ధా నాస్తికా దానవర్జితాః

ఏవం భూతా నరాదేవి నిరయం యాంత్యబుద్ధయః

తేవై మనుష్యతాం యాంతి యదా కాలస్య పర్యయాత్‌

ధనరిక్తే కులే జన్మ లభంతే స్వల్పబుద్ధయః

క్షుత్పిపాసా పరీతాశ్చ సర్వలోక బహిష్కృతాః

నిరాశాః సర్వభాగేభ్యో జీవంత్యధర్మజీవికాః

అల్పభోగకులే జాతా అల్పభోగరతా నరాః

అనేన కర్మణా దేవి భవంత్యధనినో నరాః

అపరే దంభినో నిత్యం మానినః పరతో రతాః

ఆసనార్హస్య యే పీఠం న యచ్ఛంత్యల్ప చేతసః

మార్గార్హస్య చ యే మార్గం న ప్రయచ్ఛంత్యభి బుద్ధయః

ఆర్ఘార్హాన్న చ సంస్కారై రర్చయంతి యథావిధి

పాద్యమాచయమనీయం వా ప్రయచ్ఛంత్యభిబుద్ధయః

శుభం చాభిమతం ప్రేమా గురుం నాభివదంతియే

అభిమాన ప్రవృద్ధేన లోభేన సమమాస్థితాః

సంమాన్యాంశ్చావమన్యంతే వృద్ధాన్పరిభంతి చ

ఏవం విధా నరా దేవి సర్వేనిరయగామినః

తే చేద్యది నరా స్తస్మా న్నిరయాదుత్తరంతి చ

వర్ష పూగైస్తతో జన్మ లభంతే కుత్సితే కులే

శ్వపాకపుల్కసాదీనాం కుత్సితానా మచేతసామ్‌

కులేషు తేభిజాయంతే గురువృద్ధోప తాపినః

న దంభీ న చ మానీ యో దేవతాతిధి పూజకః

లోకపూజ్యో నమస్కర్తా ప్రసూతో మధురం వచః

సర్వకర్మ ప్రియకరః సర్వభూతప్రియః సదా

అద్వేషీ సుముఖః శ్లక్ష్ణః స్నిగ్ధవాణీప్రదః సదా

స్వాగతేనైవ సర్వేషాం భూతానామ విహింసకః

యథార్థం సత్క్రియాపూర్వ మర్చయన్నవతిష్ఠతే

మార్గార్హాయ దదన్మార్గం గురుమభ్యర్చయన్సదా

అతిథిప్రగ్రహరత స్తథాభ్యాగతపూజకః

ఏపంభూతో నరో దేవి స్వర్గ తిం ప్రతిపద్యతే

తతో మానుష్యమాసాద్య విశిష్టకులజో భవేత్‌

తత్రాసౌ విపులై ర్భోగూః సర్వరత్నసమాయుతః

యథార్హదాతా చార్హేషు ధర్మచర్యాపరో భవేత్‌

సంమతః సర్వభూతానాం సర్వలోక నమస్కృతః

స్వకర్మఫలమాప్నోతి స్వయమేవ నరః సదా

ఏషధర్మో మయా ప్రోక్తో విధాత్రా స్వయమీరితః

యస్తు రౌద్ర సమాచారః సర్వ సత్త్వభయంకరః

హస్తాభ్యాం యది వా పద్భ్యాం రజ్జ్వా దండేన వా పునః

లోష్టైః స్తంభై రుపాయైర్వా జంతూన్బాధేత శోభనే

హింసార్థం నిష్కృతిప్రజ్ఞః ప్రోద్వేజయతి చైవ హి

ఉపక్రామతి జంతూంశ్చ ఉద్వేగజననః సదా

ఏవం శీలసమాచారో నిరయం ప్రతిపద్యతే

స చేన్మనుష్యతాం గచ్ఛే ద్యది కాలస్య పర్యయాత్‌

బహ్వాబాధాపరిక్లిష్టే కులే జయతి సోధమే

లోకద్విష్టొధమః పుంసాం న్వయం కర్మకృతైః ఫలైః

ఏష దేవి మనుష్యేషు బోద్ధవ్యో జ్ఞాతిబంధుషు

అపరః సర్వభూతాని దయావా ననుపశ్యతి

మైత్రీ దృష్టిః పితృసమో నిర్వైరో నియతేంద్రియః

నోద్వేజయతి భూతాని న చ హంతి దయాపరః

హస్తపాదైశ్చ నియతై ర్విశ్వాస్యః సర్వజంతుషు

న రజ్జ్వా న చ దండేన న లోష్టెర్నాయుధేన చ

ఉద్వేజయతి భూతాని శుభాకర్మా దయాపరః

ఏవం శీలసమాచారః స్వర్గే సముపజాయతే

తత్రాసౌ భవనే దివ్యే ముదా వసతి దేవవత్‌

స చే త్స్వర్గక్షయాన్మర్త్యో మనుష్యే షూపజాయతే

అల్పాయాసో నిరాతంకః స జాతః సుఖమేధతే

సుఖభాగీ నిరాయాసో నిరుద్వేగః సదా నరః

ఏష దేవి సతాం మార్గో బాధా యత్ర న విద్యతే

మహేశ్వరుడు:

బ్రాహ్మణులను ఆదరించుచు దీనులు ఆర్తులు బీదలు అగు వారికి భక్ష్యములు భోజ్యములు అన్న పానములు వస్త్రములు ఉదార బుద్ధితో దానము చేయ వలెను. బాటసారులకు ఆశ్రయములను సభా మండపము లను కోనేరులను నిర్మించుచు నిత్య నైమిత్తిక కామ్య కర్మలను ప్రయతుడై శుచియై చేయుచు ఆసనములు శయనములు వాహనములు గృహములు రత్నము ధనము పొలములు పైరులు స్త్రీలు మొదలగు నవి ప్రశాంత మనస్సుతో నిరతము దానము చేయు నతడు దేవ లోకమునకు ఏగును. అచ్చట చాలకాల ముండి శ్రేష్ఠములగు భోగముల అనుభవించి అప్సరసలతో కూడి నందనో ద్యానము మొదలగు చోట సంతోషముతో గడిపి అక్కడి నుండి క్రిందికి జారియు భూ లోకము నందు ధనధాన్యము లతో నిండిన మహాభాగుల ఇంట జన్మించును. అచ్చట అన్ని కోరికల ననుభవించుచు సంతోషించుచు మహా భోగములను అనుభవించును. మహా కార్యములు చేయును. ధనవంతు డగును. అందరకు చూడ ముచ్చట యగు బ్రాహ్మణు డగును.

ఉండియు దానము చేయక అన్నము పెట్టక దీనులను అంధులను పేదలను భిక్షుకులను అతిథులను చూచియు వారు యాచించు చున్నను నాలుక కదలించి మాటనైన ఆడక ధనము సువర్ణము వస్త్రములు భోగములు గోవులు వివిధము లగు అన్నములు దానము చేయక లోభులై నాస్తికులై అవివేకులై ఉండు వారు నరకము పొందుదురు. ఇట్టివారు నరక యాతన లైన తరువాత మానవులుగా జన్మించినను ఆకలి దప్పులు భాధలు పడుచు జనులచే వెలి వేయబడి ఏ భోగములను అనుభవించు ఆశయు లేక జీవ నాధారము లేక తక్కువ భోగములతో బీదలై ఉందురు. కపటులై గర్వము కలిగి అల్ప బుద్ధులై పీఠముతో గౌరవించ దగిన వారిని అట్లు గౌరవించక త్రోవ ఈయ వలసిన వారికి త్రోవ ఈయక పూజించ దగిన వారిని పాద్యము ఆచమనీయము మొదలగు వానితో పూజించక గురువులతో ప్రేమగా శుభము అభిమతము అగు మాట లాడక దురభిమానము లోభము కలవారై సమ్మానించ దగిన పెద్దలను సమ్మానించక పోగా అవమానించు వారు అందరును నరకమును పొందుదురు. ఎన్నోవేల ఏండ్లు నరక మనుభవించి మరల మానవులై పుట్టినను శునక మాంసము వండి తిను వారి వంటి బుద్ధి హీనుల నింద్యుల ఇండ్లలో నింద్యులుగా పుట్టుదురు.

దంభము దురభిమానము లేక దేవతలను లతిథులను గౌరవించుచు జనులచే పూజింప బడుచు పెద్దలను నమస్కరించుచు తీయని మాటలాడుచు సర్వ కర్మలచే ఇతరులకు ప్రీతి కలిగించుచు ఏ ప్రాణిని ద్వేషించక మంచి ముఖ లక్షణములు స్నేహ భావము కలిగి ఎదుటి వారికి స్వాగతము పలుకుచు యథార్థముగా సత్కార పూర్వకముగా త్రోవ ఈయ దగిన వారికి త్రోవ ఇచ్చుచు గురువుల గౌరవించుచు అతిథులను అభ్యాగతులను పూజించు నరుడు స్వర్గము పొందును. తరువాత కూడ మానవ లోకమున గొప్ప ఇంట పుట్టి సర్వ రత్నములు శ్రేష్ఠ వస్తువులు లభించి సర్వ భోగములను పొంది తగిన విధమున దానము చేయుచు ధర్మముల నాచరించుచు సర్వ ప్రాణుల సమ్మానమును నమస్కారము లను అందుకొను వాడగును. మొత్తము మీద మనుష్యుడు ఎప్పుడును తాను చేసిన కర్మమునకు అనుగుణ మగు ఫలమును పొందును. అని నిర్ణయము. విధాత బ్రహ్మ స్వయముగనే చెప్పిన ఈ ధర్మమును నీకు చెప్పితిని. సర్వ ప్రాణులకు భయమును కలిగించు ప్రవర్తనము కలిగి హస్తముల తోనో పాదములతోనో త్రాటితోనో కఱ్ఱతోనో గడ్డలతోనో స్తంభముల వంటి ఇతరో పాయముల తోనో ప్రతీకార బుద్ధితో ప్రాణులను బాధించుచు భయ పెట్టుచు ఉండు వాడు నరకమును పొందును ఎంతో కాలము తరువాత అతడు మనుష్యుడై పుట్టినను జనులకు ద్వేష్యుడై అధముడై జ్ఞాతులకు బంధువులకు ఇష్టుడు కాక యుండును.

సర్వ భూతములను దయతో మైత్రితో చూచుచు వానికి తండ్రి వలె మెలగుచు వైరము చూపక ఇంద్రియముల జయించి హస్త పాదాదులతో ప్రాణుల హింసించక భయ పెట్టక అన్ని ప్రాణులకు విశ్వసనీయుడై శుభ కర్మలను ఆచరించు చుండు వారు స్వర్గమును పొంది అచ్చట దేవతల వలెనే దివ్యమగు భవనమున సంతోషము నొందును. స్వర్గ సుఖానుభవము ముగిసిన తరువాతను కూడ మానవుడుగా పుట్టి శ్రమలు భయములు లేక సుఖమును అనుభవించును.

ఉమాదేవి:

ఇమే మనుష్యా దృశ్యంతే ఊహాపోహ విశారదాః

జ్ఞాన విజ్ఞాన సంపన్నాః ప్రజ్ఞావంతో ర్థకోవిదాః

దుష్ప్రజ్ఞా శ్చాపరే దేవ జ్ఞానవిజ్ఞాన వర్జితాః

కేన కర్మవిపాకేన ప్రజ్ఞావా న్పురుషో భవేత్‌

అల్పప్రజ్ఞో విరూపాక్ష కథం భవతి మానవః

ఏవం త్వం సంశయం ఛింధి సర్వధర్మభృతాం వర

జాత్యంధా శ్చాపరే దేవ రోగార్తా శ్చాపరే తథా

నరాః క్లీబాశ్చ దృశ్యంతే కారణం బ్రూహి తత్రవై

ఉమాదేవి:

మానవులలో కొందఱు ఊహలు అపోహలు విషయముల వింగడించు కొనుట చేయుటలో నేర్పు కలిగి ఆధ్యాత్మిక విషయ జ్ఞానము లౌకిక విషయము లలో విజ్ఞానము కలిగి ప్రజ్ఞా వంతులై అర్ధ విషయము లలో నేర్పు కలిగి యున్నారు. మఱి కొందఱు ప్రజ్ఞా రహితులై జ్ఞాన విజ్ఞానములు లేక యున్నారు. కొందఱు పుట్టు గ్రుడ్డి వారు రోగార్తులు నపుంసకులు, అశక్తులు అగు చున్నారు. ఏ కర్మ ఫలముగా వీరు ఇట్లు వైవిధ్యము పొందు చున్నారో సర్వ ధర్మముల నెఱింగిన వారిలో శ్రేష్ఠుడ వగు ఓ విరూపాక్షా! నాకు తెలిపి నా సంశయము తీర్చుము.

మహేశ్వరుడు:

బ్రాహ్మణా న్వేదవిదుషః సిద్ధా న్ధర్మ విద స్తథా

పరిపృచ్ఛం త్యహరహః కుశలాకుశలం సదా

వర్జయంతోశుభం కర్మ సేవమానాః శుభం తథా

లభంతే స్వర్గతిం నిత్య మిహలోకే యథాసుఖమ్‌

స చేన్మనుష్యతాం యాతి మేధావీ తత్ర జాయతే

శ్రుతం యజ్ఞానుగం యస్య కల్యాణ ముపజాయతే

పరదారేషు యే చాపి చక్షుర్ద్రష్టుం ప్రయుంజతే

తేనదుష్టస్వభావేన జాత్యంధా స్తే భవంతి హి

మనసాపి ప్రదుష్టేన నగ్నాం పశ్యంతి యే స్త్రియమ్‌

రోగార్తా స్తే భవం తీహ నరా దుష్కృత కారిణః

యే తు మూఢా దురాచారా వియోనౌ మైథునే రతాః

పురుషేషు సుదుష్ప్రజ్ఞాః క్లీ బత్వముపయాంతి తే

పశూంశ్చ యే వై బధ్నంతి యే చైవ గురుతల్పగాః

ప్రకీర్ణమైథునా యే చ క్లీబా జాయంతి వై నరాః

మహేశ్వరుడు:

వేదార్థముల నెఱిగిన బ్రాహ్మణులను సిద్ధులను ధర్మముల నెఱిగిన వారిని అను దినము మంచి చెడులను అడుగుచు అశుభ కర్మముల విడిచి శుభ కర్మలను ఆచరించు వాడు ఇహలోకమున సుఖముల అనుభవించి పరమున స్వర్గమును పొందును. అతడు మరల మానవుడై పుట్టినను మేధావంతుడు యజ్ఞాది కర్మల యందాసక్తితో కూడిన శుభమగు శాస్త్ర సంస్కారము కల వాడగును. దుష్ట స్వభావముతో పరదారలను చెడు చూపు చూచువాడు పుట్టుగ్రుడ్డి యగును. వివస్త్ర యగు స్త్రీని అధిక దుష్ట మగు మనస్సుతో చూచువాడు ఈ దుష్కృతమునకు ఫలముగా రోగములచే బాధ నొందును. మూఢులై దురాచరణము కలిగి యోనికాని చోట్ల మైథునము చేయువారు ప్రజ్ఞా రహితులు నపుంసకులు అగుదురు. మైథునము నకై పశువులను బంధించు వారు గురు పత్నితో సంగమించు వారు వివిధములుగ మైథునము చేయు వారును నపుంసకు లగుదురు.

ఉమాదేవి:

అవద్యం కిం తు వై కర్మ నిరవద్యం తథైవ చ

శ్రేయః కుర్వ న్నవాప్నోతి మానవో దేవసత్తమ

ఉమాదేవి:

ఓ దేవశ్రేష్ఠా! దోషముతో కూడిన ఏ కర్మను విడిచి దోషరహిత మగు ఏ కర్మను ఆచరించి మానవుడు శ్రేయమును పొందును?

మహేశ్వరుడు:

శ్రేయాంసం మార్గ మన్విచ్ఛ న్సదాయః పృచ్ఛతి ద్విజాన్‌

ధర్మాన్వేషీ గుణాకాంక్షీ స స్వర్గం సముపాశ్నుతే

యది మానుష్యతాం దేవి కదాచి త్సంనియచ్ఛతి

మేధావీ ధిరణా యుక్తః ప్రాజ్ఞ స్తత్రాపి జాయతే

ఏష దేవి సతాం ధర్మో గంతవ్యో భూతికారకః

నృణాం హితార్థాయ సదా మయా చైవ ముదాహృతః

మహేశ్వరుడు:

శ్రేయస్సు కలిగించు మార్గమును ధర్మములను సద్గుణములను కోరుచు అవి ఎరిగిన బ్రాహ్మణులను అడిగి తెలిసి ఆచరించు వాడు స్వర్గము నొందును. తరువాత మనుష్యుడై పుట్టినను ఇంద్రియ నిగ్రహము మేధ ధారణాశక్తి కల ప్రాజ్ఞుడుగా జన్మించును. మానవుడు క్షేమము కలిగించు సన్మార్గము ఇది. మానవుల శ్రేయము కోరి నీకు తెలిసితిని.

ఉమాదేవి:

అపరే స్వల్పవిజ్ఞానా ధర్మవిద్వేషిణో నరాః

బ్రాహ్మణా న్వేదవిదుషో నేచ్ఛంతి పరిసర్పితుమ్‌

వ్రతవంతో నరాః కేచి చ్ఛ్రద్ధాదమపరాయణాః

అవ్రతా భ్రష్టనియమా స్తథాన్యే రాక్షసోపమాః

యజ్వానశ్చ తథైవాన్యే నిర్మోహాశ్చ తథా పరే

కేన కర్మవిపాకేర భవం తీహ వదస్వమే

ఉమాదేవి:

ఓ పరమేశ్వరా! కొందఱు అల్ప విజ్ఞానము ధర్మ ద్వేషము కలవారై వేద ధర్మముల నెఱిగిన బ్రాహ్మణులను ధర్మము నడిగి తెలిసికొన గోరక ఉన్నారు. మంచి నియమములను కర్మలను ఆచరించక నియమ భ్రష్టులై రాక్షసుల వలె ఉందురు. మఱి కొందఱు మంచి వ్రతముల నాచరించుచు శ్రధ్ధ ఇంద్రియ నిగ్రహము కలిగి యజ్ఞాదుల నాచరించుచు మూఢత్వము లేక యుందురు. ఏ కర్మములకు ఫలముగా ఇట్ల గుదురో తెలుపుము.

మహేశ్వరుడు:

ఆగమాలోకధర్మాణాం మర్యాదాః పూర్వనిర్మితాః

ప్రమాణే నానువర్తంతే దృశ్యంతేహ దృఢవ్రతాః

అధర్మం ధర్మ మి త్యాహు ర్యే చ మోహవశం గతాః

అవ్రతా నష్టమర్యాదా స్తే నరా బ్రహ్మరాక్షసాః

యే వై కాలకృతోద్యోగా త్సంభవం తీహ మానవాః

నిర్హోమా నిర్వషట్కారా స్తే భవంతి నరాధమాః

ఏష దేవి మయా సర్వ సంశయచ్ఛేదనాయ తే

కుశలా కుశలో నౄణాం వ్యాఖ్యాతో ధర్మసాగరః

మహేశ్వరుడు:

పూర్వులు నిర్మించిన ధర్మ శాస్త్రముల లోక ధర్మముల వ్యవస్థలను శాస్త్ర ప్రమాణా నుసారము ఆచరించు వారు దృఢ వ్రతులై ఆయా శాస్త్రీయ కర్మలను గట్టిగా ఆచరించు వారుగా నున్నారు. అజ్ఞాన వశమున అధర్మమును కూడ ధర్మము అని చెప్పుచు సద్ర్వతముల నాచరించక శాస్త్ర మర్యాదలను విడిచిన వారు బ్రహ్మ రాక్షసు లగుదురు. కాలము ననుసరించి పనుల నాచరించుచు హోమము వషట్కారము వంటి వైదిక కర్మా నుష్ఠానమునకు దూరముగా నుండు వారు నరాధము లగుదురు. ఓ దేవీ! నీ సర్వ సంశయము లను ఛేదించుటకు గాను మానవుల శ్రేయమునకు అశ్రేయమునకును హేతువగు ధర్మ సముద్రమును ఈ విధముగా వివరించితిని.