221 - సదాచార వర్ణనమ్‌

వ్యాసులు:

ఏవం సమ్యగ్గృహస్థేన దేవతాః పితరస్తథా

సంపూజ్యా హవ్యకవ్యాభ్యా మన్నేనాతిథిబాంధవాః

భూతాని భృత్యాః సకలాః పశుపక్షిపిపీలికాః

భిక్షవో యాచమానాశ్చ యే చాన్యే పాంథకా గృహే

సదాచారరతా విప్రాః సాధునా గృహమేధినా

పాపం భుంక్తే సముల్లంఘ్య నిత్యనైమిత్తికీః క్రియాః

వ్యాసులు:

ఇట్లు గృహస్థు దేవతలను పితృ దేవతలను హవ్య కవ్యముల చేతను అతిథులను బంధువులను భూతములను నౌకరులను పశు పక్ష్యాదులను జీమలను బిచ్చగాండ్రను సన్యాసులను యాచకులను బాటసారులను సదాచార వంతులను అన్నాద్యాహారములచే పానీయములచే బూజించి నిత్య ములయిన సంధ్యావంద నాదులను నైమిత్తికము లయిన యా యా పర్వాదులందు విహితము లైన క్రియలను నిర్వర్తించి తీర వలెను. వీని నతిక్రమించిన యెడల పాప మనుభవించును. అన మునులిట్లనిరి.

మునులు:

కథితం భవతా విప్ర నిత్యంనైమిత్తికం చ యత్‌

నిత్యం నైమిత్తికం కామ్యం త్రివిధం కర్మ పౌరుషమ్‌

సదాచారం మునే శ్రోతుమిచ్ఛామో వదతస్తవ

యం కుర్వస్సుఖమాప్నోతి పరత్రేహ చ మానవః

మునులు:

ఓ విప్రుడా! నీవలన నిత్యము నైమిత్తకము కామ్యము (ఏదేని కోరిక సఫలము కావలెనని చేయు కర్మ) అను త్రివిధమైన పురుష కర్తవ్యము (కర్మను) తెలిసి కొన్నాము. ఇక సదాచార మనగా నేమో ఇహ మందు బరమందు మానవు డాచరించి సుఖపడు దానిని గురించి వినగోరు చున్నామన మునులకు వ్యాసుండిట్లనియె.

వ్యాసులు:

గృహస్థేన సదాకార్య మాచారపరిరక్షణమ్‌

న హ్యాచార విహీనస్య భద్రమత్ర పరత్ర వా

యజ్ఞదాన తపాంసీహ పురుషస్య స భూతయే

భవంతి యః సదాచారం సముల్లంఘ్య ప్రవర్తతే

దురాచారో హి పురుషో నేహాయుర్విందతే మహత్‌

కార్యో ధర్మః సదాచార ఆచారస్యైవ లక్షణమ్‌

తస్య స్వరూపం వక్ష్యామి సదాచారస్య భోద్విజాః

ఆత్మనైకమనా భూత్వా తథైవ పరిపాలయేత్‌

త్రివర్గసాధనే యత్నః కర్తవ్యో గృహమేధినా

తత్సంసిధ్ధౌ గృహస్థస్య సిద్ధిరత్ర పరత్ర చ

పాదేనాప్యస్య పారత్ర్యం కుర్యాచ్ఛ్రేయః స్వమాత్మవాన్‌

అర్థేన చాత్మభరణం నిత్యనైమిత్తికాని చ

పాదేనైవ తథాప్యస్య మూలభూతం వివర్ధయేత్‌

ఏవమాచరతో విప్రా అర్థః సాఫల్యమృచ్ఛతి

తద్వత్పాపనిషేధార్థం ధర్మః కార్యో విపశ్చితా

పరత్రార్థస్తధైవాన్యః కార్యోత్రైవ ఫలప్రదః

ప్రత్యవాయభయాత్కామ స్తథాన్యశ్చావిరోధవాన్‌

ద్విధా కామోపి రచితస్త్రివర్గాయావిరోధకృత్‌

పరస్పరానుబంధాంశ్చ సర్వానేతాన్విచింతయేత్‌

విపరీతానుబంధాంశ్చ బుధ్యధ్వం తాన్ద్విజోత్తమాః

ధర్మో ధర్మానుబంధార్థో ధర్మోనాత్మార్థపీడకః

ఉభాభ్యాం చ ద్విధాకామం తేన తౌ చ ద్విధా పునః

వ్యాసులు:

గృహస్థు నిరంతరమును అచార రక్షణము సేసికొన వలెను. ఆచార హీనుని కిహపరము లందు క్షేమము లేదు. సదాచారము నుల్లంఘించి ప్రవర్తించు వానికి యజ్ఞదాన తపస్సులు సుఖ మీయవు. దురాచారుడు ఇక్కడ పూర్ణా యుర్దాయము పొందడు. సదాచార సంపన్న మైన ధర్మమును జేయ వలెను. అట్టి ఆచారము యొక్క లక్షణము స్వరూపమును దెల్పెద వినుండు. తానేకాగ్ర మనస్కుడై దానిని పరిపాలింప వలెను. (నిర్వహింప వలె నన్నమాట) గృహస్థు త్రి వర్గమును (ధర్మ అర్ధ కామములను పురుషార్థము లను) సాధించు ప్రయత్నము సేయ వలెను. అది సిద్ధించిన యెడల ఇహపర సిద్ధియు గల్గును. ఈ త్రివర్గ మందు నాల్గవ భాగమేని జరిపిన పరలోక శ్రేయస్సు చేకూర్చును. సగము నిర్వర్తించిన చోదన్ను దాను భరించు కొన గల వాడగును. నిత్య నైమిత్తికముల జేయ గల్గును. నాల్గవ వంతు సదాచారస మాచరణమున ధర్మమూలమును వృద్ధి గావింప గలడు. ఈ ధర్మా చరణముచే అర్ధము సిద్ధించును. అట్లే పాపమును నిషేధించుటకు దెలిసిన వాడు ధర్మ మాచరింప నగును. పరమందర్ధము దాని తరువాతిది కామము ఫలప్రదము లగుటకు వాని నిహ మందనుష్ఠింప వలయును. ప్రత్యవాయ భయముతో (పొరపాటుగ జేసిన పాపము వచ్చునను భయముతో) కామము గాని మఱి యే పురుషార్థమునకు విరుద్ధము గాకుండను (రెండు విధములు గాను) గావించిన కామ పురుషార్థము గూడ త్రివర్గ సాధన మందు విరోధకరము గాదు. ఈ పురుషార్థము నొకదాని నొకటి యనుబంధింప బడునవిగా నున్నవా? విపరీతాను బంధములుగా నున్నవా? అను విషయము తెలిసికొన వలయును. ధర్మము ధర్మాను బంధియైన అర్ధమును బాధింపని ధర్మము అట్లే ధర్మార్దాను బంధియైన కామము ఆ రెండిటిని బాధింపని కామము దానిచే (కొమముచే) బాధింప బడని ధర్మార్థములును ఆత్మ బాధకములు గావు. అనగా దనకు కృతార్ధతను గల్గించి తీరునన్న మాట. పురుషార్థము లొకదాని కొకటి యనుబంధ పడి పరస్పర విరుద్ధములు గాకుండ జాగరూకుడై చేసిన యెడల మానవుడు అన్నింటి ఫలమును బూర్తిగ పొందునని భావము.

బ్రాహ్మే ముహూర్తే బుధ్యేత ధర్మార్ధావనుచింయేత్‌

సముత్థాయ తథాచమ్య ప్రస్నాతో నియతఃశుచిః

పూర్వాం సంధ్యాం సనక్షత్రాం పశ్చిమాం సదివాకరామ్‌

ఉపాసీత యథాన్యాయం నైనాం జహ్యాదనాపది

అసత్ప్రలాపమనృతం వాక్పారుష్యం చ వర్జయేత్‌

అసచ్ఛాస్త్రమసద్వాద మసత్పావాం చ వై ద్విజాః

సాయం ప్రాతస్తథా హోమం కుర్వీత నియతాత్మవాన్‌

నోదయాస్తమనే చైవ ముదీక్షేత వివస్వతః

కేశప్రసాధనాదర్శ దంతధావనమంజనమ్‌

పూర్వాహ్ణ ఏవకార్యాణి దేవతానాం చ తర్పణమ్‌

గ్రామావసథతీర్థానాం క్షేత్రాణాం చైవ వర్త్మని

న విణ్మూత్రమనుష్ఠేయం న చ కృష్టే న గోవ్రజే

సగ్నాం పరస్త్రియం నేక్షేన్నపశ్యేదాత్మనః శకృత్‌

ఉదక్యా దర్శనస్పర్శ మేవం సంభాషణం తథా

నాఫ్సు మూత్రం పురీషంవా మైథునం వా సమాచరేత్‌

నాధితిష్ఠేచ్ఛకృన్మూత్రే కేశభస్మసపాలికాః

తుషాంగార విశీర్ణాని రజ్జువస్త్రాదికాని చ

నాధితిష్ఠేత్తథా ప్రాజ్ఞః పథివస్త్రాణి వా భువి

బ్రాహ్మ ముహూర్తమున (తెల్లవారు జాము) మేలుకొని తా నానాడు సేయ వలసిన ధర్మము అర్థము నను పురుషార్థ సాధనను గురించి యాలోచన సేయ వలెను. అటుపై లేచి యాచమము నేసి స్నానము చేసి నియమ వంతుడై శుచియై సంధ్యా వందనమును నక్షత్రము లుండగా నొనరింప వలెను. సాయం సంధ్యను సూర్యుడుండగా గావింప వలెను. ఈ సంధ్యో పాసనను ఆపద యేమియు లేనప్పుడు తప్పక సేసితీర వలసినది. చెడ్డ ప్రేలాపనను అనృతమును పరుష భాషణమును వదల వలెను. అట్లే ఆసచ్ఛాస్త్రమును (నాస్తికాది మతములను) అసద్వాద మును (దుష్ట నాదము) అసత్సెవను (అధర్మ పరుల సేవించుటను) మాన వలెను. నియమ వంతుడై సాయం ప్రాతః కాల మందు హోమము సేయ వలెను. సూర్యుని యుద యాస్తమయములను జూడరాదు. తల దువ్వు కొనుట అద్దము చూచుట దంత ధావనము కాటుక వెట్టు కొనుటయు పూర్వాహ్ణ మందే చేయ వలెను. దేవ తర్పణము కూడ నప్పుడే కావింప నగును. గ్రామములు ఇండ్లు తీర్థములు క్షేత్రములు నను వానికేగు దారు లందు దున్నిన పొలములో గోశాల లందు విణ్మూత్రములు సేయ రాదు. దిగంబరమై యున్న పరస్త్రీని తన పురీషమును జూడరాదు. బహిష్ఠ మైన స్త్రీని చూచుట తాకుట పలకరించుట గూడదు! నీళ్ళలో మూత్ర పురీషములు సేయుట మైధునము పనికి రాదు. మూత్ర పురీషములు వెంట్రుకలు బూడిద పొల్లు బొగ్గులు తెగి పోయిన త్రాళ్ళు గుడ్డ పీలికలు దారిలో పడియున్న చింపి గుడ్డలు మొదలగు వానిని ద్రొక్కరాదు.

పితృదేవమనుష్యాణాం భూతానాం చ తథార్చనమ్‌

కృత్వా విభవతః పశ్చాద్గృహస్ధో భోక్తుమర్హతి

ప్రాఙ్ముఖో దఙ్ముఖో వాపి స్వాచాంతో వాగ్యతః శుచిః

భుంజీత చాన్నం తచ్చిత్తో హ్యంతర్జానుః సదా నరః

ఉపఘాతమృతే దోషా న్నాన్నస్యోదీరయేద్బుధః

ప్రత్యక్షలవణం వర్జ్యమన్న ముచ్ఛిష్టమేవ చ

న గచ్ఛన్న చ తిష్ఠన్వై విణ్మూత్రోత్సర్గమాత్మవాన్‌

కుర్వీత చైవ ముచ్ఛిష్టం న కించిదపి భక్షయేత్‌

ఉచ్ఛిష్టో నాలపేత్కించి త్స్వాధ్యాయం న వివర్జయేత్‌

న పశ్యేచ్చ రవించేందుం నక్షత్రాణి చ కామతః

భిన్నాసనం చ శయ్యాం చ భాజనం చ వివర్జయేత్‌

గురూణామాసనం దేయ మభ్యుత్ధానాదిసత్కృతమ్‌

అనుకూలం తథాలాప మభికుర్వీత బుద్ధిమాన్‌

తత్రానుగమనం కుర్యాత్ప్రతికూలం న పంచరేత్‌

నై కవస్త్రశ్చభుంజీత న కుర్యాద్దేవతార్చనమ్‌

నావాహయేద్ద్విజానగ్నౌ హోమం కుర్వీత బుద్ధిమాన్‌

న స్నాయీత నరో నగ్నో న శయీత కదాచన

నపాణిభ్యా ముభాభ్యాం తు కండూయేత శిరస్తథా

న చాభీక్షణం శిరఃస్నానం కార్యం నిష్కారణం బుధైః

శిరః స్నాతశ్చ తైలేన నాంగం కించిదుపసృశేత్‌

అనధ్యాయేషు సర్వేషు స్వాధ్యాయం చ వివర్జయేత్‌

బ్రాహ్మణానల గోసూర్యా న్నావమన్యేత్క దాచన

పితృదేవ మనుష్యులను భూతములను అర్చించి అటుపై గృహ యజమాని భోజనము సేయ వలెను. తూర్పు ఉత్తరము దిశల వైపున కున్ముఖుడై ఆచమనముసేసి మౌన మూని శుచియై మనసుం దాను దిను నాహారము వైపు నిలిపి మోకాళ్ళ లోపల చేయి యుంచి భోనము సేయ వలెను. తెలిసిన వాడు చెడిన యన్న మొక్కటి తప్ప మఱి యే యన్న దోషము లను తెలుప రాదు. కేవల లవణము తినరాదు. ఉచ్ఛిష్టాన్నమును (ఎంగిలిని) విడిచి పెట్ట వలెను. నడుచుచు లేక నిలువ బడి మూత్ర పురీషములు విడువ రాదు. ఎంగిలి నే కొంచము తినరాదు. ఎంగిలి నోటితో మాటలాడ రాదు. వేదము చెప్ప గూడదు. సూర్య చంద్ర నక్షత్రములను బుద్ధి పూర్వకముగ జూడరాదు. విరిగిన ఆసనము మంచము పగిలిన పాత్రమును వాడు కొనరాదు. పెద్దలు వచ్చి నపుడు తాను లేచి నిలువ బడుట యెదు రేగుట మొదలగు సత్కారములు చేసి యాసనము (పీట కుర్చీ చాప మొద లయినవి) వేయ వలెను. అనుకూలముగ సంభాషణము సేయ వలెను. వారు వెడలి చను నపుడు కొంత దూరము వెంబడింప వలెను. ప్రతికూలముగ సంచరింప రాదు. ఒంటి గుడ్డతో భోజనము దేవతార్చనము బ్రాహ్మణా హ్వానము అగ్ని యందు హోమము సేయరాదు. నగ్నుడై (దిన్పమొలతో దిగంబరియై) స్నానము సేయరాదు. పండు కొనరాదు. రెండు చేతుల తోను నెత్తిని గోకు కొనరాదు. నిష్కారణముగ మాటి మాటికి తలనిండ స్నానము సేయ రాదు. శిరః స్నానము చేసి తైలముతో అంగ స్పర్శ చేయ రాదు. అనధ్యయన దినములం దన్నిట వేదా ధ్యయనము మాన వలెను. బ్రాహ్మణులను అగ్నిని గోవులను సూర్యుని ఎన్నడు నవమానింప రాదు.

ఉదఙ్ముభో దివా రాత్రా వుత్సర్గం దక్షిణాముఖం

ఆబాధాసు యథాకామం కుర్యాన్మూత్రపురీషయోః

దుష్కృతం స గురోర్బ్రూయా త్కృద్ధం చైనం ప్రసాదయేత్‌

పరీవాదం న శృణుయా దన్యేషామపి కుర్వతామ్‌

పంథా దేయో బ్రాహ్మణానాం రాజ్ఞో దుఃఖాతురస్యచ

విద్యాధికస్య గర్భిణ్యా రోగార్తస్య మహీయసః

మూకాంధబధిరాణాంచ మత్తస్యోన్మత్తకస్య చ

దేవాలయం చైత్యతరుం తథైవ చచతుష్పథమ్‌

విద్యాధికం గురుం చైవ బుధః కుర్యా త్ప్రదక్షిణమ్‌

ఉపానద్వస్త్రమాల్యాది ధృతమన్యైర్న ధారయేత్‌

చతుర్దశ్యాం తథాష్టమ్యాం పంచదశ్యాం చ పర్వసు

తైలాభ్యంగం తథా భోగం యోషితశ్చ విర్జయేత్‌

నోత్క్షిప్తబాహుజంఘశ్చ ప్రాజ్ఞస్తిష్ఠేత్కదాచన

నచాపి విక్షిపేత్పాదౌ పాదం పాదేన నాక్రమేత్‌

పుంశ్చల్యాః కృతకార్యస్య బాలస్య పతితస్యచ

మర్మాభిఘాతమాక్రోశం పైశున్యం చ వర్జయేత్‌

దంభాభిమానం తైక్షణ్యంచ న కుర్వీత విచక్షణః

మూర్ఖోన్మత్తవ్యసనినో విరూనానపి వా తథా

న్యూనాంగాంశ్చాధానాంశ్చైవ నోపహాసేన దూషయేత్‌

పరస్య దండం నోద్యచ్ఛే చ్ఛిక్షార్ధం శిష్యపుత్రయోః

తద్వన్నో పవిశేత్ర్పాజ్ఞః పాదేనాకృష్య చాసనమ్‌

సంయావం కృశరం మాంసం నాత్మార్థముపసాధయేత్‌

సాయం ప్రాతశ్చ భోక్తవ్యం కృత్వా చాతిథి పూజనమ్‌

ప్రాఙ్ముఖో దజ్ముశోవాపి వాగ్యతో దంతధావనమ్‌

కుర్వీత సతతం విప్రా వర్జయేద్వర్జ్యవీరుధమ్‌

నోదక్ఛిరాః స్వపేజ్జాతు న చ ప్రత్యక్ఛిరా నరః

శిరస్త్వా గస్త్వా మాధాయ శయీతాథ పురందరీమ్‌

నతు గంధవతీష్వప్సు శయీత న తధోషసి

ఉపరాగేపరం! స్నాన మృతే దినముదాహృతమ్‌

ఆపమృజ్యాన్న వస్త్రాంతై ర్గాత్రాణ్యంబరపాణిభిః

నాచావధూనయేత్కేశా న్వాససీ న చ నిర్ధునేత్‌

అనులేపనమాదద్యా న్నాస్నాతః కర్హిచిద్బుధః

నచాపి రక్తవాసాః స్యా చ్చిత్రాసితధరోపివా

సచకుర్యా ద్విపర్యాసం వాససోర్నాపి భూషయోః

వర్జ్యం చ విదశం వస్త్ర మత్యంతోపహతం చ యత్‌

కీటకేశావపన్నం చ తథా శ్వభిరవేక్షితమ్‌

అవలీఢం శునాచైవ సారోద్ధరణ దూషితమ్‌

పృష్ఠమాంసం వృథామాంసం వర్జ్యమాంసం చ వర్జయేత్‌

నభక్షయేచ్చ సతతం ప్రత్యక్షం లవణం నరః

వర్జ్యం చిరోషితం విప్రాః శుష్కం పర్యుషితం చ యత్‌

పిష్టశాకేక్షు పయసాం వికారా ద్విజసత్తమాః

తథా మాంసవికారాశ్చ నైవ వర్జ్యాశ్చిరోషితాః

ఉదయా స్తమనే భానోః శయనంచ వివర్జయేత్‌

నాస్నాతో నైవ సంవిష్టో నచై వాన్యమనా నరః

నచైవ శయనే నోర్వ్యా ముపవిష్టో న శబ్దకృత్‌

ప్రేష్యాణామప్రదాయాథ న భుంజీత కదాచన

భుంజీత పురుషః స్నాతః సాయం ప్రాతర్యధావిధి

పరదారా న గంతవ్యాః పురుషేణ విపశ్చితా

ఇష్టాపూర్తాయుషాం హంత్రీ పరదారగతిర్నృణామ్‌

స హీదృశ మనాయుష్యం లోకే కించన విద్యతే

పగలు ఉత్తరాభి ముఖముగను రాత్రి దక్షిణాభి ముఖముగను సంకట సమయము లందు యదేష్టముగను మూత్ర పురీషోత్సర్జన మొనరింప నగును. గురువు తప్పును జెప్పరాదు. ఆయన కోపించిన యెడ బ్రతిమాలి క్షమాపణ సెప్పికొని ప్రసన్నునిం జేసికొన వలెను. ఇతరులు చేయు నపవాదమును వినరాదు. బ్రాహ్మణులకు రాజునకు దుఃఖా తురునికి విద్యాధికునికి గర్భిణికి రోగికి పూజ్యునకు మూగ గ్రుడ్డి చెవుటి వాండ్రకు మత్తెక్కిన వానికి ఉన్మత్తునికి దారి యిచ్చి తొలగి నడువ వలెను. దేవాలయమును చైత్య వృక్షమును (ఆలయాది పుణ్య స్థానము లందు నాటించిన పుణ్య వృక్షము రావి మొదలయిన వానిని) నాల్గు దారులు గలిగిన కూడలిని ప్రదక్షిణము సేసి వెళ్ల వలయును. అప్రదక్షిణముగా బోరాదన్న మాట. ఇంకొకడు వాడిన చెప్పులు బట్టలు పూల మాలలు మొదలయిన వానిని దాను ధరింప రాదు. చతుర్దిశి అష్టమి పూర్ణిమ పర్వములు నయిన నాడభ్యంగము స్త్రీ సంభోగము గూడదు. బాహువులు పిక్కలు పైకెత్తి నిలుచుండ రాదు. పాదము లిట్టట్టు నాడింవ రాదు. ఒక కాలితో నింకొక కాలు త్రొక్కరాదు. జారిణిని తప్పు జరిగి పోయిన తరువాత బాలుని జాతి భ్రష్టుని మర్మాఘాత ముగ దిట్టుటను దెప్పి పోవుటను (సాధించుటను) మాన వలెను. వివేకి డాంభికత్వము (డంబములు పలుకుట) నేనే ఘనుడనను దురభిమానము తీక్షణ త్వమును జూపరాదు. మూర్ఖులను పిచ్చి వాండ్రను వ్యసనములలో నుండు వారిని (కష్టము లలో నున్న వారిని) విరూపులను అంగ వైకల్యము గల వారిని నిర్ధనులను బరిహసించి కించ పఱుప రాదు శిష్యులను పుత్రులను శిక్షించుట కింకొకని చేతికి దండమును (కఱ్ఱను)ఈయ రాదు. కాలితో నాసనము దగ్గరగా నీడ్చికొని దానిపై కూర్చుండ రాదు. తనకు దాను దినుటకు సంయావము గోధుమ పిండితో చేయు కృశరము (పులగము) మాంసమును సేకరింప రాదు. సాయం ప్రాతః కాలములం దతిథులను బూజించి భుజింప వలెను. తూర్పు ఉత్తరము మొగమై మౌనియై పండ్లు తోముకొన వలెను. నిషిద్ధము లయిన దంత కాష్ఠములను వాడరాదు. ఉత్తర దిశగా పడమరగా తలపెట్టి పండుకొనరాదు. దక్షిణ దిశగా గాని తలపెట్టి పండు కొనవలెను. పరిమ ళోదకములతో నిద్ర పోరాదు. ఉషఃకాల మందు నిదురింప రాదు. గ్రహణము నందు విడుపు స్నానము రాత్రియే చేయవలెను. విడుపు కాగానే రాత్రియే చేయవలెను గాని మరునాడు పగలు చేయ రాదని యర్థము. ఉప్పును దినరాదు. నిలువ యున్నది తడియారి నది పాసినదియు నగు నన్నము తినరాదు. పిండి కూరలు చెఱకు పాలు అను వాని యొక్కయు మాంసము యొక్కయు వికారములు అనగా వాని వానితో దయారైన పదార్థములను చిరకాలము నిలువ యున్న వైనను దిన వచ్చును. సూర్యోద యాస్తమయ కాలము లందు పండు కొనరాదు. స్నానము చేయక కూర్చుండక మనస్సు నిలుపక మంచము మీద వట్టి నేలమీద కూర్చుండి చప్పుడు చేయుచు లేక మాట లాడుచు బోజనము సేయ రాదు. సేవకులకు పెట్టకుండ తినరాదు. సాయం ప్రాతః కాలము లందు స్నానము సేసి భోజనము సేయ నగును. పరదార సంగము కూడదు. ఆ దోషము ఇష్టా పూర్తముల వలన గల్గు ఫలమును ఆయుర్దాయ మును నాశము సేయును. ఇష్ట మనగా యజ్ఞము, వాపీ కూప తటాకాది నిర్మాణము సత్రము పెట్టుట గోడ కట్టించుట తోటలు వేయించుట మొదలయిన ధర్మ కార్యములు పూర్తములు పరదారగ మనమంత ఆయుర్దాయమును హరించు తప్పిదము మఱి యొకటి లేదు.

యాదృశం పురుషస్యేహ పరదారిభిమర్శనమ్‌

దేవాగ్ని పితృ కార్యాణి తథా గుర్వభివాదనమ్‌

కుర్వీత సమ్యగాచమ్య తద్వదన్న భుజిక్రియామ్‌

అఫేన శబ్దగంధాభి రద్భి రచ్చాభిరాదరాత్‌

ఆచమేచ్ఛైవ తద్వచ్చ ప్రాఙ్ముఖో దఙ్ముఖోపి వా

అంతర్జలా దావ సథా ద్వల్మీకాన్మూషికా స్థలాత్‌

కృతశౌచా వశిష్టాచ్చ వర్జయెత్పంచ వై మృదః

ప్రక్షాశ్య హస్తౌ పాదౌ చ సమభూమ్యాంసమాహితః

అంతర్జానుస్తథాచామే త్త్రిశ్చతుర్వాపి వై నరః

పరిమృజ్య ద్విరావర్త్య ఖాని మూర్ధానమేవ చ

సమ్యగాచమ్య తోయేన క్రియాం కుర్వీత వైశుచిః

క్షుతేవలీఢే వాతే చ తథా నిష్ఠీవనాదిషు

కుర్యాదాచమనం స్పర్శే వాస్పృశ్యస్యార్కదర్శనమ్‌

కుర్వీతాలంభనం చాపి దక్షిణ శ్రవణస్య చ

యథావిభవతో హ్యే తత్పూర్వాభావే తతః పరమ్‌

న విద్యమానే పూర్వోక్త ఉత్తరప్రా ప్తిరిష్యతే

న కుర్యా ద్దంతసంఘర్షం నాత్మనో దేహతాడవమ్‌

స్వాపేధ్వని తథా భుంజ న్ప్వాధ్యాయంచ విపర్జయేత్‌

సంధ్యాయాం మైథునం చాపి తథా ప్రస్థానమేవ చః

తథాపరాహ్ణే కుర్వీత శ్రద్ధయా పితృతర్పణమ్‌

శిరఃస్నానం చ కుర్వీత దైవం పిత్ర్యమథాపి చ

ప్రాఙ్ముభోదఙ్ముఖోపి శ్శశ్రుకర్మచ కారయేత్‌

వ్యగినీం వర్జయేత్కన్యాం కులజాం వాప్యరోగిణీమ్‌

ఉద్వహేత్పితృమాత్రోశ్చ సప్తమీం పంచమీం తథా

శిక్షేద్దాంరాం స్త్యజే దీర్ష్యాం తథాహ్ని స్వప్నమైథునే

పరోపతాపకం కర్మ జంతుపీడాం చ సర్వదా

ఆచమనము చేసియే దేవాగ్ని పితృ కార్యములు గురు వందనము భోజనమును జేయ వలెను. ఆచనమున కుపయోగించు జలము నురుగు వాసన లేనివిగా నుండవలెను. చప్పుడు కాగూడదు. తూర్పుగ ఉత్తరముగ దిరిగి యాచమనము సేయవలెను. నీళ్ళ నుండి తీసినది ఇంటిపెరటిలో నున్నది పుట్ట లోనిది ఎలుక కలుగులోని శౌచక్రియ యందు పయోగింపగా మిగిలినది యునుగా నీయైదు విధముల మన్ను శౌచవిధి కుపయోగింప రాదు. కాలు సేతులు గడిగికొని వానిని ప్రోక్షణము సేసికొని స్థిర మనస్కుడై మూడు సార్లు గాని నాల్గుసార్లు గాని యాచమనము సేసి రెండుసార్లు పెదవులను దుడిచి కొని యింద్రియము లను రెండుసార్లు స్పృశించి శుచియై సంధ్యా వందనాది క్రియలను జేయ వలెను. తుమ్మునందు నాకుట యందు అపాన వాయువు నందు ఉమ్మి వేయుట మొదలగు పనులందు ఆచమనము సేయ వలెను. అంటరాని వాని నంటినపుడు సూర్య దర్శనము సేయ వలెను. మఱియు కుడిచెవి స్పృశింప వలెను. ఈ చెవిని స్పృశించుట యింతకు మున్ను చెప్పిన ఆచమన సూర్య దర్శనముల కవకాశము లేప్పుడే. మున్ను చెప్పినది యున్నప్పుడు తరువాత జెప్పిన పనులు సమ్మతములు గావు. పండ్లు కొఱుక రాదు. తన దేహమును గ్రుద్దు కొనరాదు. పండుకొ న్నపుడు దారి నడచు నపుడు భుజించు నపుడు స్వాధ్యాయము పనికి రాదు. సంధ్య లందు మైథునము ప్రయాణమును జేయ గూడదు. అపరాహ్ణమున (కుతపకాల మందు) పగటి కాలమును మూడు భాగములు సేయగా మూడవ భాగమున పితృ తర్పణము సేయవలెను. దేవ పితృ కార్యముల ముందు శిరఃస్నానము సేయ నగును. తూర్పు ఉత్తర దిశమొగమై క్షురకర్మ చేయించు కొనవలెను. వికలాంగిని వివాహ మాడరాదు. ఉత్తమ కులమున బుట్టినది రోగములు లేనిది యగు కన్యను బెండ్లాడ వలెను. తండ్రి వైపున నేడవ తరము దానిని తల్లి వైపున నైదవ తరము దానిని మాత్రమే స్వీకరింప నగును. భార్యను సత్ప్రవృత్తివ యందు బెట్ట వచ్చును. శిక్షణయీయ వచ్చును గాని యీర్ష్య పనికిరాదు. పగటి యందు నిద్రా మైథునములు గూడవు. ఇతరులకు తాపము గల్గించు పని జంతు పీడయు సేయరాదు.

ఉదక్యా సర్వవర్ణాణాం వర్జ్యా రాత్రి చతుష్టయమ్‌

స్త్రీజన్మ పరిహారార్థం పంచమీం చాపి వర్జయేత్‌

తతః షష్ఠ్యాం వ్రజేద్రాత్ర్యాం జ్యేష్ఠయుగ్మాసు రాత్రిషు

యుగ్మాసు పుత్రా జాయంతే స్త్రియోయుగ్మాసు రాత్రిఘ

విధిర్మిణో వై పర్వాదౌ సంధ్యాకాలేషు షండకాః

క్షురకర్మణి రిక్తాం వై వర్జయీత వచక్షణః

బ్రువతామవితావినాం నశ్రోతవ్యం కదాచన

న చోత్కృష్టాసనం దేయ మనుత్కృష్టస్య చాదరాత్‌

క్షురకర్మణి చాంతే చ స్త్రీసంభోగే చ భోద్విజాః

స్నాయీత చై లవాన్ప్రాజ్ఞః కూటభూమిముపేత్యచ

దేవవేదద్విజాతీనాం సాధుసత్యమహాత్మనామ్‌

గురోః పతివ్రతానాం చ బ్రహ్మయజ్ఞతపస్వినామ్‌

ముట్టయిన స్త్రీని అన్ని వర్ణముల వారు నాల్గు రాత్రులు వెలుపల నుంచ వలెను. అయిదవ రోజు కూడ దూరముగ నుంచినచో నామెకు మఱి స్త్రీ జన్మము రాదు. ఆఱవ రాత్రి యామెను బొంద వచ్చును. మఱియు జ్యేష్ఠ యుగ్మాసు అనగా ఋతు దినము లయిన మొదటి పదియారు దినములలో సరిరాత్రు లందు బొంద నగును. సరిరాత్రు లందు గూడిన పుత్రులు బేసి రాత్రులందు గూడిన ఆడు పిల్లలు గల్గుదురు. పర్వదినము లందు బొందిన నధర్మ పరులు సంధ్యాకాల మందు గూడిన నపుంసకులు పుట్టుదురు. రిక్తాతిథి క్షురకర్మ నిషిద్ధము. వినయము లేని వాండ్రేదేని చెప్పుచుండ నది వినరాదు. నీచున కున్నత స్థాన మీయరాదు. క్షురకర్మ సేసి కొన్నపుడు, స్త్రీ సంభోగా నంతరము, సంతకు వెళ్ళి నపుడు సచేల స్నానము చేయ వలెను. దేవతలను వేదములను ద్విజులను సాధువులు సత్య వంతులు మహాత్ములు నైన వారిని గురువును పతివ్రతలను బ్రహ్మ యజ్ఞములు తపస్సు సేయు వారిని దూషించుట (అప్రతిష్ఠ పాలు చేయుట) పరిహసించటము కూడదు.

పరివాదం న కుర్వీత పరిహాసం చ భోద్విజాః

ధవళాంబరసంవీతః సితపుష్పవిభూషితః

సదా మాంగల్యవేషః స్యాన్న వామాంగల్యవాన్భవేత్‌

నోద్ధతోన్మత్త మూఢైశ్చ నావినీతైశ్చ పండితః

గచ్ఛేన్మైత్రీమశీలైశ్చ న వయోజాతి దూషితైః

నచాతివ్యయశీలైశ్చ పురుషైర్నైవ వైరిభిః

కార్యాక్షమై ర్నిందితైర్న న చైవ విటసంగిభిః

నిఃస్వైర్న వాదైకపరై ర్నరైశ్చాన్యైస్తథాధమైః

అచ్చపు తెలుపు వస్త్రములను దెల్లని పువ్వులను దాల్చి ఎపుడును మాంగల్య వేషియై శుభ వేషము గొన్నవాడై యుండ వలెను. అట్టి వాని కమంగళములు గల్గవు. తల బిరుసు గలవారితో ఉన్మత్తులతో మూఢులతో వినయ హీనులతో నీచ శీలురలో వయస్సుచే జాతిచే దూషితు లైన వారితో డబ్బు దుబారా చేయు వాండ్రతో శత్రువులతో కార్య దక్షులుగాని వారితో నింద్యులతో జారులతో జేరిన వాండ్రతో నిరు పేదలతో వాద పరులతో మఱి పెక్కు తెఱగు లయధములతో చెలిమి సేయరాదు.

సుహృద్దీక్షిత భూపాల స్నాతకశ్వశురైః సహ

ఉత్తిష్ఠే ద్విభవాచ్చైనా నర్చయే ద్గృహమాగతాన్‌

యథావిభవతో విప్రాః ప్రతిసంవత్సరోషితాన్‌

సమ్యగ్గృహేర్చనం కృత్వా యథా స్థానమనుక్రమాత్‌

సంపూజయే త్తథా వహ్నౌ ప్రదద్యాచ్చాహుతీః క్రమాత్‌

ప్రథమాం బ్రాహ్మణే దద్వా త్ప్రజానాం పతయే తతః

తృతీయాం చైవ గృహేభ్యః కశ్యపాయ తథాపరామ్‌

తతోనుమతయే దద్యాద్గృహ బలింతతః

పూర్వం ఖ్యాతా మయాయా తు నిత్యక్రమవిధౌ క్రియా

వైశ్వదేవం తతః కుర్యా ద్వదతః శృణుతద్విజాః

మిత్రుడు దీక్షితుడు (యజ్ఞము సేసిన వాడు) భూపాలుడు స్నాతకుడు (గురుకుల మందు విద్య పూర్తి సేసిన వాడు) మామగారు అనువారితో గూడ తానును వేచి వారు వచ్చి నపుడు ప్రత్యుత్దానము చేసి యాసన పాద్యాదులీయ వలెను. వీరు తన యింటికి వచ్చి నపుడు తన కున్నంతలో (యథా విభవ ముగ) లోటు సేయకుండ పూజింప వలెను. ప్రతి సంవత్స రోషితాన్‌ = సంవత్సరమున కొకసారి వచ్చి యున్న వారిని అనగా ఆబ్దికము నందు యథా స్థానముగ అనగా వైశ్వే దేవ స్థానము పితృ స్థానము అనువాని యందర్చన సేయ వలెను. అవ్వల అగ్నికి ప్రజా పతికి గృహ దేవతలకు వరుసగా మూడాహుతు లీయవలెను. మఱొకటి కశ్యపున కీయ వలెను. అటుపైని అనుమతి కొక యాహుతి నీయ వలెను. పిమ్మట గృహ బలి నీయ వలెను. నిత్యకర్మ విధాన మందు నేనింత మున్ను జెప్పిన వైశ్వ దేవ క్రియను సేయ వలెను. ఆ విధానము తెలుపు చున్నాను వినుడు.

యథాస్థానవిభాగం తు దేవానుద్దిశ్య వై పృథక్‌

పర్జన్యాపోధరిత్రీణాం దద్యాత్తు మణికే త్రయమ్‌

వాయవే చ ప్రతిదిశం దిగ్భ్యః ప్రాచ్యాదిషు క్రమాత్‌

బ్రహ్మణే చాంతరిక్షాయ సూర్యాయ చ యథాక్రమమ్‌

విశ్వేభ్యశ్చైవ దేవోభ్యో విశ్వభూతేభ్య ఏవచ

ఉషసే భూతపతయే దద్యాద్వోత్తరతః శుచిః

స్వధా చ సమ ఇత్యుక్త్వా పితృభ్యశ్చైవ దక్షిణే

కృత్వాపసవ్యం వాయవ్యాం యక్ష్మైత త్తేతి సంవదన్‌

అన్నావశేష మిశ్రం వై తోయం దద్యాద్యథావిధి

దేవానాంచ తతః కుర్యా ద్ర్బాహ్మణానాం నమస్క్రియామ్‌

అంగుష్ఠోత్తరతో రేఖా పాణేర్యా దక్షిణస్య చ

ఏతద్ర్బాహ్మమితి ఖ్యాతం తీర్థమాచమనాయ వై

తర్జన్యంగుష్ఠయోరంతః పిత్ర్యం తీర్థముదాహృతమ్‌

పితౄణాం తేన తోయాని దద్యాన్నాందీ ముఖాదృతే

అంగుళ్యగ్రేతథా దైవం తేన దివ్యక్రియావిధిః

తీర్ధం కనిష్ఠికామూలే కార్యం తత్ర ప్రజాపతేః

ఏవమేభిః సదా తీర్ధైర్విధానం పితృభిః సహ

సదా కార్యాణి కుర్వీత నాన్యతీర్ధై కదాచన

బ్రాహ్మేణాచమనం శస్తం పైత్ర్యం పిత్ర్యేణ సర్వదా

దేవతీర్థేన దేవానాం ప్రాజాపత్యం జితే (త్యజలే)న చ

నాందీముఖానాం కుర్వీత ప్రాజ్ఞః పిండోదక క్రియామ్‌

ప్రాజాపత్యేన తీర్థేన యచ్చ కించిత్ప్రజాపతేః

పర్జన్య దేవతకు (వరుణునికి) అబ్దేవతకు భూ దేవతకు మూడు స్థానము లందు విడివిడిగా బలి వేయ వలెను. ఆ వేయుట మణిక మందు, (మణిక మనగా మట్టిపాత్ర) వాయువునకు అన్ని దిశలందు దిగ్ధేవతలకు వరుసగా తూర్పు నుండి బ్రహ్మ అంతిరిక్షము సూర్యుడు విశ్వే దేవులు విశ్వ భూతములు ఉషస్సు భూతపతి అనువారికి ఉత్తరము వైపు బలి వేయవలెను. “స్వధాయై నమః అని పలుకుచు పితరులకు దక్షిణము నను ప్రాచీనా వీతిగ వేయ వలెను. యక్ష్మై తత్తే అను మంత్రము పఠించుచు వాయవ్య మూలలో అన్నావశేషలతో గూడిన యుదకము యథా విధిగ వదల వలెను. అటుపై దేవతలకు బ్రాహ్మణులకు నమస్కారము సేయ వలెను. కుడిచేతి అంగుష్ఠ మునకు (బొటన వ్రేలికి) కుత్తరము వైపున నున్న రేఖ బ్రాహ్మ తీర్థమన బడును. అచమనము సేయవలసిన తీర్థమిది. తర్జనికి (చూపుడు వేలు) అగుష్ఠమునకు నడిమిది పితృ తీర్థము. నాందీ ముఖము లోగాక మఱి యెల్ల విధు లందును పితరులకు తర్పణాదు లీ తీర్థమున జేయవలెను. వేళ్ళ అగ్రము దైవ తీర్థము. దేవత లనుద్దేశింతి చేయు తర్పణాది విధులా తీర్థమున జేయవలెను. చిటికెన వ్రేలి మొదలు ప్రజాపతి తీర్థము. అక్కడ ప్రజాపతికి జేయ వలయును. ప్రజాపతి కాండర్షిగా వున ఋషి తీర్థమున జేయవలె నన్నమాట. బ్రాహ్మ తీర్థమునం దాచమనము ప్రశస్తము. పితృ క్రియ పితృ తీర్థమున, దేవతలకు దేవ తీర్థమున, ప్రజాపతికి నాందీముఖ దేవతలకు పిండ తర్పణాదులు ప్రజాపతికి వలె ప్రాజాపత్య తీర్థమున (చిటికెన వ్రేలి మొదట) చేయ వలెను.

యుగపజ్జల మగ్నిం చ బిభృయాన్న విచక్షణః

గురుదేవ పితౄన్విప్రాన్న చ పాదౌ ప్రసారయేత్‌

నాచక్షీత ధయంతీం గాం జలం నాంజలినా పిబేత్‌

శౌచకాలేషు సర్వేషు గురుష్వల్వేషు వా పునః

న విలంబేత మేధావీ న ముఖేనానలం ధమేత్‌

తత్రవిప్రా న వస్తవ్యం యత్రనాస్తి చతుష్టయమ్‌

ఋణప్రదాతా వైద్యశ్చ శ్రోత్రియః సజలా నదీ

జితభృత్యో నృపో యత్ర బలవాన్ధర్మతత్పరః

తత్ర నిత్యం వసే త్ర్పాజ్ఞః కుతః కునృపతౌ సుఖమ్‌

పౌరాః సుసంహతా యత్ర సతతం న్యాయవర్తినః

శాంతామత్సరిణో లోకా స్తత్ర వాసః సుభోదయః

యస్మిన్కృషీవలా రాష్ట్రే ప్రాయశో నాతిమానినః

యత్రౌషధాన్యశేషాణి వసేత్రత్ర విచక్షణః

తత్రవిప్రా న వస్తవ్యం యత్రైతత్త్రితయం సదా

జిగీషుః పూర్వవైరశ్చ జనశ్చ సతతోత్సవః

వసేన్నిత్యం సుశీలేషు సహచారిషు పండితః

యత్రాప్రధృష్యో నృపతి ర్యత్ర సస్యప్రదా మహీ

ఇత్యేతత్కథితం విప్రా మయా వో హితకామ్యయా

అతఃపరం ప్రపక్ష్యామి భక్ష్యభోజ్య విధిక్రియామ్‌

నీటిని అగ్నిని ఒక్కసారి కలిపి పట్టుకొన రాదు. గురువులు దేవతలు తల్లి దండ్రులు బ్రాహ్మణుల వైపు పాదములు చాచరాదు. పాలు గుడుపు చున్న గోవును జూడ రాదు. దోసిలితో నీరు త్రావ రాదు. చిన్న పెద్ద శౌచకాలము లందు విలంబము సేయ రాదు. నవేగాన్ధార యేత్క్వచిత్‌ అని యిదే విషయము మఱి యొకచో దెలుప బడినది. నోటితో నగ్ని నూద రాదు. ఈ క్రింది నాలుగును లేని యూరిలో వసింప రాదు. ఇదేమాట సుమతి శతకమం దిట్లున్నది.

అప్పిచ్చువాడు వైద్యుడు

నెప్పుడు నెడ తెగక పారు నేరును ద్విజుడున్‌

జొప్పడిన యూర నుండుము

చొప్పడు కున్నట్టి యూరు సొరకుము సుమతీ!

భృత్యులను జయించిన వాడు నౌకరులకు లొంగని వాడన్న మాట బలశాలి ధర్మ తత్పరుడు నయిన రాజు గల దేశ మందు ప్రాజ్ఞుడు వసింప వలెను. చెడ్డ రాజు కలచోట సుఖ మెక్కడిది? ఎక్కడ పౌరులు (ప్రజలు) కలిసి మెలిసి న్యాయ వర్తనులై శాంతులు మాత్స్యర్య హీనులునై యుందురో అక్కడ నివాసము సుఖో దయము. ఎక్కడ వ్యవసాయ దారులు (కృషికులు) దురభిమాన దురహంకారములు లేనివారో యెక్కడ ఓషధులు సర్వము గలవో యచట వివేకి వసింప వలె. జయింప వలెనను కోరిక కలవారు పూర్వ వైరము కలవారు నిరంతరము వేడుకలకై వేడుక పడు జనము ఈ మూడు లక్షణములు గలచోట వసింప రాదు. ఉత్తీమ శీలురైన వారు సహచరులు శత్రువుల బెదిరింపులకు లొంగని రాజు సస్య సమృద్ధమైన భూమిగల చోటు నిత్యనివా సార్హము. ఇదంతయు మీ హితము కోరి తెల్పితిని. ఈమీద భక్ష్యాభక్ష్య విధానము తెల్పెద వినుండు.

భోజ్యమన్నం వర్యుషితం స్నేహాక్తం చిరసంభృతమ్‌

ఆస్నేహా అపి గోధూమ యవగోరసవిక్రియాః

శశకః కచ్ఛపో గోధా శ్వావిన్మత్స్యోథ శల్యకః

భక్ష్యాశ్చైతే తథా వర్జ్యో గ్రామశూకర కుక్కుటౌ

పితృదేవాదిశేషం చ శ్రాద్ధే బ్రాహ్మణకామ్యయా

ప్రోక్షితం చౌషధార్థం చ ఖాదన్మాంసం న దుష్యతి

శంఖాశ్మ స్వర్ణరూప్యాణాం రజ్జునామథ వాససామ్‌

శాకమూలఫలానాంచ తథావిదల చర్మణామ్‌

మణివస్త్ర ప్రవాళానాం తథాముక్తాఫలస్యచ

పాత్రాణాం చమసానాంచ ఆంబునా శౌచమిష్యతే

తథాకశ్మకానాం తోయేన ఆశ్మసంఘర్షణేనచ

సస్నేహానాం చ పాత్రాణాం శుద్ధిరుష్ణేన వారిణా

శూర్పాణామజినానాంచ ముసలోలూఖలస్య చ

సంహతానాం చ వస్త్రాణాం ప్రోక్షణాత్సంచ యస్యచ

వల్కలానా మశేషాణా మంబుమృచ్ఛౌష మిష్యతే

ఆవికానాం సమస్తానాం కేశానాం చై వమిష్యతే

సిద్ధార్థకానాం కల్కేన తిలకల్కేన వా పునః

శోధనం చైవ భవతి ఉపఘాతవతాం సదా

తథాకార్పాసికానాం చ శుద్ధిః స్యాజ్జలభస్మనా

దారుదంతాస్థి శృంగాణాం తతక్షణాచ్ఛుద్ధిరిష్యతే

పునః పాకేన భాండానాం పార్థివానా మమేధ్యతా

శుద్ధంభైక్ష్యం కారుహస్తః పణ్యం యోషిన్ముఖం తథా

రథ్యాగత మవిజ్ఞాతం దానవర్గేణ సంస్కృతమ్‌

ప్రాక్ప్రశ స్తంచిరాతీత మనేకాంతరితం లఘు

అంతఃప్రభూతం వాలం చ వృద్ధాతురవిచేష్టితమ్‌

కర్మాంతాగారశాలాశ్చ స్తనద్వయం శుచిస్త్రియాః

శుచయశ్చ తథైవాపః స్రవంత్యో గంధవర్జితాః

భూమిర్విశుధ్యతే కాలా ద్దాహమార్జనగోకులైః

లేపాదుల్లే ఖనాత్సేకా ద్వేశ్మ సంమార్జనాదినా

కేశకీటావపన్నే చ గోఘ్రాతే మక్షికాన్వితే

మృదంబు భస్మ చాపన్నే ప్రక్షేప్తవ్యం విశుద్ధయే

ఔదుంబరాణా మమ్లేవ వారిణా త్రపుసీసయోః

భస్మాంబుభిశ్చ కాంస్యానాం శుద్ధః ప్లావో ద్రవస్య

చ అమేధ్యాక్తస్య మృత్తోయై ర్గంధాపహరణేన చ

అన్యేషాం చైవ ద్రవ్యాణాం వర్ణగంధాంశ్చ హారయేత్‌

శుచి మాంసం తు చాండాల క్రవ్యాదైర్విని పాతితమ్‌

రథ్యాగతం చ తైలాది శుచి గోతృప్తిదం పయః

రజోగ్ని రశ్వ గోఛాయా రశ్మయః పవనో మహీ

విప్లుషో మక్షికాద్యాశ్చ దుష్ట సంగాద దోషిణః

అజాశ్వం ముఖతో మేధ్యం న గోర్వత్సస్య చాననమ్‌

మాతుః ప్రస్రవణే మేధ్యం శకునిః ఫలపాతనే

ఆసనం శయనం యానం తటౌసద్యాస్తృణానిచ

సోమసూర్యాంశుపవనైః శుద్యంతే తాని పణ్యవత్‌

రథ్యాపసర్పణే స్నానే క్షుత్పానానాం చ కర్మసు

ఆచామేత యథాన్యాయం వాససః పరిధాపనే

స్పృష్టానామథ సంస్పర్శై ర్ద్విరథ్యా కర్దమాంభసి

పక్వేష్టక చితానాం చ మేధ్యతా వాయుసంశ్రయాత్‌

ప్రభూతోపహతాదన్నా దగ్రముద్ధృత్య సంత్యజేత్‌

శేషస్య ప్రోక్షణం కుర్యా దాచమ్యాద్భిస్తథా మృదా

ఉపవాసస్త్రిరాత్రం తు దుష్టభక్తాశినో భవేత్‌

అజ్ఞానే జ్ఞాన పూర్వేతు తద్దోషోపశిమే నతు

ఉదక్యాం వావలగ్నాం చ సూతికాంత్యావసాయినః

స్పృష్ట్వా స్నాయీత శౌచార్థం తథైవ మృతహారిణః

నారం స్పృష్టాస్థి సస్నేహం స్నాత్వా విప్రోవిశుధ్యతి

ఆచమ్యైవ తు నిఃస్నేహం గామాలభ్యార్క మీక్ష్య వా

న లంఘమేత్తథై వాథ ష్ఠీవనోద్వర్తనాని చ

గృహాదుచ్ఛిష్ట విణ్మూత్రం పాదాంభస్తత్క్షి పేద్బహిః

పంచపిండాననుద్ధృత్య న స్నాయాత్పర వారిణి

స్నాయీత దేవఖాతేషు గంగా హ్రదసరిత్సుచ

నోద్యానాదౌ వికాలేషు ప్రాజ్ఞస్తిష్ఠేత్కదాచన

నాలపేజ్జనవిద్విష్టా న్వీరహీనాస్తథా స్త్రియః

దేవతా పితృసచ్ఛాస్త్ర యజ్విసంన్యాసి నిందకైః

కృత్వా తు స్పర్శనాలాపం శుధ్యత్యర్కావ లోచనాత్‌

అవలోక్య తథోదక్యాం సంన్యాస్తం పతితం శవమ్‌

విధర్మిసూతికాషంఢ వివస్త్రాన్త్వా సాయినః

మృతనిర్యాతకాంశ్చైవ పరదార రతాశ్చ యే

ఏతదేవ హి కర్తవ్యం ప్రాజ్ఞైః శోధనమాత్మనః

అభోజ్యభిక్షుపాఖండ మార్జారఖరకుక్కుటాన్‌

పతితాపవిద్ధచాండాల మృతాహారాంశ్చ ధర్మవిత్‌

సంప్పృశ్య శుద్ధ్యతే స్నానా దుదక్యాగ్రామశూకరౌ

తద్వచ్చ సూతికాశౌచ దూషితౌ పురుషావపి

యస్య చానుదినం హానిర్గృహే నిత్యస్య కర్మణః

యశ్చ బ్రాహ్మణ సంత్యక్తః కిల్బిషాశీ నరాధమః

నిత్యస్య కర్మణో హానిం న కుర్వీత కదాచన

తస్య త్వకరణం వక్ష్యేకేవలం మృత జన్మసు

దాశాహం బ్రాహ్మణస్తిష్ఠే ద్దానహోమ వివర్జితః

క్షత్రియో ద్వాదశాహం చ వైశ్యో మాసార్ధమేవచ

శూద్రశ్చ మాసమాసీత నిజకర్మ వివర్జితః

తతః పరం నిం కర్మ కుర్యుః సర్వే యథోచితమ్‌

ప్రేతాయ సలిలం దేయం బహిర్గత్వా తు గోత్రకైః

ప్రథమేహ్ని చతుర్థే చ సప్తమే నవమే తథా

తస్యాస్థి సంచయః కార్య శ్చతుర్థేహని గోత్రజైః

ఊర్ధ్వం సంచయనాత్తేషా మంగస్పర్శో విధీయతే

గ్రోత్రైజైస్తు క్రియాఃసర్వాః కార్యాః సంచయనాత్పరమ్‌

స్పర్మ ఏవ సపిండానాం మృతాహని తథోభయోః

అన్వర్థ మిచ్ఛయా శస్త్ర రజ్జుబంధన వహ్నిషు

విషప్రతాపాది మృతే ప్రాయానాశకయో రపి

బాలే దేశాంతరస్థే చ తథా ప్రవ్రజితే మృతే

సద్యః శౌచం మనుష్యాణాం త్ర్యహముక్తమశౌచకమ్‌

సపిండానాం సపిండస్తు మృతేన్యస్మిన్మృతోయది

పూర్వశౌచం సమాఖ్యాతం కార్యాస్తత్ర దినక్రియాః

ఏషఏవ విధిర్దృష్టో జన్మన్యపి హి సూతకే

సపిండానాం సపిండేషు యథావత్సోదకేషు చ

పుత్రే జాతే పితుః స్నానం సచైలస్య విధీయతే

తత్రాపి యది వాన్యస్మిన్న నుయాతస్తతః పరమ్‌

తత్రాపి శుద్ధిరుదితా పూర్వజన్మవతో దినైః

దశద్వాదశమాసార్ధ మాస సంఖ్యైర్దినైర్గతైః

స్వాః స్వాః కర్మక్రియాః కుర్యుః సరే వర్ణా యథావిధి

ప్రేతముద్దిశ్య కర్తవ్య మేకోద్దిష్ట మతః పరమ్‌

దానాని చైవ దేయాని బ్రాహ్మణేభ్యోమనీషిభిః

యద్యదిష్టతమం లోకే యచ్చాస్య దయితం గృహే

తత్తద్గుణవతే దేయం తదేవాక్షయమిచ్ఛతా

పూర్ణైస్తు దివసైః స్పృష్ట్వా సలిలం వాహనాయుధైః

దత్తప్రేతోదపిండాశ్చ సర్వే వర్ణాః కృతక్రియాః

కుర్యుః సమగ్రాః శుచినః పరత్రేహ చ భూతయే

అధ్యేతవ్యా త్రయీ నిత్యం భవితవ్యం విపశ్చితా

ధర్మతో ధనమాహార్యం యష్టవ్యం చాపి యత్నతః

యేన ప్రకుపితో నాత్మా జుగుప్సామేతి భోద్విజాః

తత్కర్తవ్య మశంకేన యన్నగోప్యం మహాజనైః

ఏవమాచరతో విప్రాః పురుషస్య గృహే సతః

ధర్మార్థకామం సంప్రాప్య పరత్రేహ చ శోభనమ్‌

ఇదం రహస్య మాయుష్యం ధన్యం బుద్దివివర్ధనమ్‌

సర్వపాపహరం పుణ్యం శ్రీ పుష్ట్యారోగ్యదం శివమ్‌

యశః కీర్తప్రదం నౄణాం తేజోబలవివర్ధనమ్‌

అనుష్ఠేయం సదా పుంభిః సర్వసాధనముత్తమమ్‌

బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైః శూద్రైశ్చ మునిసత్తమాః

జ్ఞాతవ్యం సుప్రయత్నేన సమ్యక్శ్రేయోభి కాంక్షిభిః

జ్ఞాత్వైవ యః సదాకాల మనుష్టానం కరోతి వై

సర్వపాప వినిర్ముక్తః స్వర్గలోకే మహీయతే

సారాత్సారతరం చేద మాఖ్యాతం ద్విజసత్తమాః

శ్రుతిస్మృత్యుదితం ధర్మం న దేయం యస్య కస్యచిత్‌

న నాస్తికాయ దాతవ్యం న దుష్టమతయే ద్విజాః

న దాంభికాయ మూర్ఖాయ న కుతర్కప్రలాపినే

నేయి నూనెలతో మిశ్రిత మైనచో పర్యుషితమైన (నిలువ యున్నది చలిది) అన్నము గూడ త్యాజ్యమే. నేయి నూనెల స్పర్శ లేకున్నను గోధుమ యవ పదర్థములు అవు పాలు పెరుగు నేయి మొదలయి నవి వానితో జేసిన వంటలును నిలువ యున్న వైనను భుజింప తగినవే. కుందేలు తాబేలు ఉడుము పంది చేప ఒక రకము చేప యనునవి తిన దగినవి. ఊరబంది కోడియు తిన రానివి. పితృ శేషము దేవ శేషము శ్రాద్ధ మందు బ్రహ్మణులకు బెట్టు నుద్దేశముతో బ్రోక్షింప బడి నదియు ఔషధము కొరకై నదియు నగు మాంసము దిన్న దోషము గల్గదు. శంఖము రాయి బంగారము వెండి త్రాళ్ళ వస్త్రములు కూరలు దుంపలు పండ్లు పప్పులు చర్మము మణులు వస్త్రములు పవడములు ముత్యాలు పాత్రలు చమసలు (చతురస్రము లైన యజ్ఞ పాత్రలు) నీటితో గడిగిన శుద్దము లగును. రాతి చిప్పలు(రాచ్చిప్ప అని వాడుక) నీటి చేతను రాతితో సంఘర్షించుట చేతను శుద్దము లగును. నూనె జిడ్డున్న యెడల వానిని వేడినీట గడుగ వలయును. చేట చర్మము ఱోకలి ఱోలు ముతక బట్టలు ప్రోక్షణ చేసిన శుద్ది గల్గును. నార బట్టలు నీరు మట్టి (చవుడు మన్ను) ఎండ బెట్టుట అనువానిచే పరిశుద్ధము లగును. గొర్రె యున్నితో నేసిన బట్టలు (ముదుకగా నున్న బట్టలు) అవాల ముద్ద నువ్వుల ముద్దచే శోధనము సేయ వలెను. దట్టమైన నూలు బట్టలు గూడపూర్వోక్త రీతిగానే స్వచ్చము లగును. కఱ్ఱ దంతములు ఎముకలు కొమ్ములు అనునవి నీటితో గడిగి నను భస్మముతో దోమినను శుద్ధము లగును. అంటు కుండలు మరల వంటకు పనికిరావు. తోమి మఱి వంట చేయవలెను. బ్రహ్మచారి సంన్యాసి మొదలగు వారి భిక్షాన్నము వడ్రంగి (శిల్పి) హస్తము బజారు వస్తువులు స్త్రీ ముఖమును శుద్ధములు. బాటలో పడి యున్నది తెలియ కుండ స్పృశించినది (త్రోక్కినది) దాసిచే తోమ బడినది అదిలో పరి శుద్దమే. చిరకాల మయినను. వస్తు సమృద్దితో చేరిన ఆశుచి యైన అల్ప వస్తువు గూడ పరిశుద్దమే. స్థాన భ్రంశము పొందని వెంట్రుక ముసలి వాండ్రు రోగాది పీడితులు సేసిన వనిసత్కర్మ మరిగిన యిండ్లు వాకిండ్లు స్త్రీయొక్క పాలిండ్లు పవిత్రములు. ప్రవాహో దకము వాసన లేని నీరు పరిశుద్దము. భూమి కాలము చేతను అగ్ని దాహము చేత ఉదకము మార్జనము చేత అవులు త్రొక్కులు చేత పవిత్ర మగును. గృహము అలుకుట త్రవ్వుట నీట తడువుట నీళ్లు చల్లుట వలన శుచి యగును. వెంట్రుకల పురుగులచే ధూషిత మయినపుడు ఆవు వాసన చూచి నపుడు ఈగలు వ్రాలి నపుడు అన్నము మట్టి నీరు భస్మము నించుక చిమ్ముట వలన శుచి యగును. చింత పండు రసము చేత మేడికర్రతో జేసిన పాత్రలు తగరపు సీసపు గిన్నెలు చింతపండు రసము చేతను కంచు గిన్నెలు బూడిద నీరు చేతను శుద్ధి చెందును. ద్రవ పదార్థము అశుచియైన తఱి కొంచెము క్రింద పోయుట వలన పవిత్ర మగును. అపవిత్ర వస్తువులతో గూడిన ద్రవ్యము మట్టి నీరు వలనను వాసన పోవుదాక తోముట వలనను పవిత్ర మగును. మఱి యితర వస్తువులు వాని రంగు వాసనను దొలగించిన శుభ్రము లగును. చండాలుడు పచ్చి మాంసము తినువాడు తెచ్చిన మాంసము శుచి. దుకాణము నుండి తెచ్చిన నూనె గోవునకు దృప్తి గూర్చిన నీరు (ఆవులు త్రావినది) ధూళి అగ్ని గుర్రములు గోవుల యొక్క నీడ కిరణములు గాలి భూమి నీటి చినుకులు ఈగలు మొద లయిన దుష్ట వస్తు స్పర్శ పొందినను మైల పడవు. మేకలు గుర్రములు ముఖముచే పవిత్రములు.