22 - దేవగ్రహానుకీర్తనము

సూత ఉవాచ :-

స్వాయంభువనిసర్గేతు వ్యాఖ్యాతాన్యంతరాణి చ

భవిష్యాణి చ సర్వాణి తేషాం వక్ష్యామ్యనుక్రమమ్

ఏతచ్భుత్వా తు మునయః పప్రచ్ఛూరోమహర్షణమ్ 

సూర్యాచంద్రమసోశ్చారం గ్రహాణాం చైవ సర్వశః

ఋషయః ఊచుః :-

థీమంతి కథమేతాని జ్యోతీంషి ధ్రువమండలమ్

అవ్యూ హేన చ సర్వాణి తథైవాసంకరేణ వా

కశ్చిద్ర్భాషయతే తాని భ్రమంతే యది వా స్వయమ్

ఏతద్వేదితుమిచ్ఛామస్తన్నో నీగద సత్తమ !

సూత ఉవాచ :-

భూత సమ్మోహనం హ్యేతద్వదతో మే నిబోధత

ప్రత్యక్షమపి దృశ్యం చ సంమోహయతి యత్రజాః

యోఽయం చతుర్దశం పుచ్ఛే శైశుమారే వ్యవస్థితః

ఉత్తానపాదపుత్రోసౌ మేధీభూతో ధ్రువో దివి

సవై భామయతే నిత్యం చంద్రాదిత్యా గ్రహైః సహ

భ్రమంతమనుగచ్ఛంతి నక్షత్రాణి చ చక్రవత్

ధ్రువస్య మనసా చాసౌ సర్పతే జ్యోతిషాం గణః

సూర్యాచంద్రమసౌ తారా నక్షత్రాణి గ్రహైః సహ

వాతానీకమయేర్భంధైర్రువే బద్దాని తాని వై

తేషాం యోగశ్చ భేదశ్చ కాల్చరస్తథైవ చ

అస్తోదయౌ తథోత్పాతా అయనే దక్షిణోత్తరే

విషువగ్రహవర్ణాశ్చ ధ్రువాత్సర్వం ప్రవర్తతే

సూతుఁడు చెప్పెను.

స్వాయంభువమనుసృష్టియందలి అన్నీ మన్వంతరములు వ్యాఖ్యానింపఁబడినవి. ఇంక నేను క్రమముగా భవిష్యత్మన్వంతరములను చేప్పెదను. ఆ పలుకులు వినీ సూర్యునీయొక్క చంద్రునియొక్క గ్రహముల యొక్క గతినీ (చారమును) ఋషులు రోమహర్షణునీ (సూతుని) అడీగిరీ. (2) ఋషులు ఇట్లనిరి.

ఈ జ్యోతిర్మండలము సంకర్షణముకాని, సాంకర్యముకానీ, వ్యూహ నిర్మాణముకాని లేకుండ ధ్రువమండలముచుట్టు ఎట్లు భ్రమించుచున్నవి? (3) ఎవ్వఁడయిన యొకఁడు వానినీ భ్రమింప (చలింప) చేయునా? లేక. యవియే స్వయముగా భ్రమించునా? ఓ ఉత్తమ పురుషా ! దీనిని మే మేలుంగఁ గోరుచున్నాము మా కొఱకు దీనిని వివరింపుము. (4) సూతుఁడిట్లనియెను, సర్వ ప్రజానీకమును మోహింపఁజేయునదిది. నేను చెప్పెదను వినుడు. ఇయ్యది (ఈ జ్యోతిగ్రహాదుల గమనము) ప్రత్యక్షము దృశ్యమును నయినను ప్రజలను సంమోహపరచును. (5) నాలుగు దిక్కులకు ప్రకాశమును వ్యాపింపచేయును, ఆ నక్షత్రము శింశుమారము యొక్క పుచ్చమున వ్యవస్థితమై యున్నది. అది ధ్రువుఁడు. ఉత్తానపాదుని పుత్రుఁడు. అయ్యదీయే ప్రధానమైన; ఆధారము. దానికే అన్నీ నక్షత్రములు గ్రహములు ఆకాశమున అనుబంధింపఁబడియున్నవి. (6) ఆతఁడే (ఆ ధ్రువ నక్షత్రమే) చంద్రునీ, సూర్యుని, గ్రహములతో సహా భ్రమింపఁజేయును. అయ్యది చక్రమువలె భ్రమీంచుచుండ నక్షత్రములు కూడ దానీ ననుసరించి తిరుగును. (7) జ్యోతిర్గణములు అన్నియును, సూర్యుడు, చంద్రుఁడు తారలు నక్షత్రములు గ్రహములతో సహా ధ్రువుని ఇచ్చపై మనస్సు ననుసరించి చలించును. (8) అయ్యవి వాతానీకమయ బంధములచేతనువలె ధ్రువునకు బద్దములై యున్నవి. వానీ యోగములు, భేదములు, కాలము, సంచారము, ఉదయము, అస్తమయము, ఉత్పాతములు, దక్షిణోత్తర యానములు విషువత్తులు, గ్రహముల యొక్క వర్ణములు అన్నియును ధ్రువుని వలననే కలుగును. (10)

వర్షా ధర్మో హిమం రాత్రీః సంధ్యా చైవ దీనం తథా

శుభాశుభం ప్రజానాం చ ధ్రువాత్ సత్యం ప్రవర్తతే

ధ్రువేణాధిష్ఠితశ్చైవ సూర్యోఽపో గృహ్య వర్షతి

తదేష దీప్తకిరణః స కాలాగ్నిర్దివాకరః

పరివర్తక్రమాద్వీపా భాభిరాలోకయన్ దిశః

సూర్య కిరణజాలేన వాయుయుక్రేన సర్వశః

జగతో జలమాదత్తే కృత్స్నస్య ద్వీజసత్తమాః

ఆదిత్యపీతం సకలం సోమః సంక్రమతే జలమ్

నాడీభిర్వాయుయుక్తాభిర్లోకధారా ప్రవర్తతే

యతోమాత్సవతే హ్యంబు తదన్నేష్వేవ తిష్ఠతి

మేఘా వాయువిఘాతేన విసృజంతి జలం భువి

ఏవముక్షిప్యతే చైవ పతనే చాసకృష్ణలమ్

న నాశ ఉదకస్యాస్తి తదేవ పరివర్తతే

సంధారణార్థం లోకానాం మాయైషా విశ్వనిర్మితా

అనయా మాయయా వ్యాప్తం త్రైలోక్యం సచరాచరమ్

శ్రీ విశ్వేతో లోకకృద్దేవః సహస్రాక్ష ప్రజాపతిః

ధాతా కృత్స్నస్య లోకస్య ప్రభవిష్ణుర్దివాకరః

సార్వభౌకికమంలో యత్తతోమాన్నభసశ్చ్యతమ్

సోమాధారం జగత్సర్వమేతత్తథ్యం ప్రకీర్తితమ్

సూర్యాదుష్టం నిసవతే సోమాచ్ఛీతం ప్రవర్తతే

ప్రజలకు వరము, వేడిమి, మంచుపడుట, పగలు, రాత్రి, సంధ్య, శుభము, అశుభము మొదలగునవి యన్నియు ధ్రువుని వలననే సత్యముగా సంభవించును. (11) ధ్రువునిచే నధిస్థితుఁడయి సూర్యుఁడు నీటిని స్వీకరించును. మరియు వర్షించును. ప్రకాశవంతములయిన కిరణములు గల సూర్యుఁడు ప్రపంచనాశనమునకయిన కాలాన్నీ, ఓ బ్రాహ్మణులారా ! సూర్యుఁడు తన పరిభ్రమణక్రమములో దీక్కులను ప్రకాశింపఁజేయును. సూర్యుఁడు పోయువుచే నంతటను కూడిన తన కిరణజాలముతో ప్రపంచమందలి జలము నంతటిని గ్రహించును. ఓ ద్విజసత్తములారా ! సూర్యుడు త్రాగిన నీటినంతటినీ చంద్రుడు సంక్రమింపఁజేసికొనును. (14) వాయువుచే కూడియున్న నాడులచే లోకధార ప్రవర్తించును. సోముని నుండి స్రవించునీరు అన్నములందేయుండును. (మొక్కల యందు, అన్నము కొఱకయిన పంటలయందుండును.) (15) వాయువుల తాకిడిచే మేఘములు భూమియందు నీటిని విసర్జించును (కురియును). ఈ విధముగా జలము మాటిమాటికి పైకీ (ఆవిరి రూపమున) తేబడును మరల వర్షరూపమున క్రిందభూమిపై పడవేయ (కురీయ) బడును. (16) ఉదకమునకు నాశము లేదు. ఆ నీరే పరివర్తనము చెందును, ఇయ్యది సర్వలోక సంధారణార్థము ఈ మాయ పరమేశ్వరునిచే నిర్మింపబడినది. (17) ఈ మాయంచేతనే సచరాచరమయిన మూడు లోకములు వ్యాపింపఁబడినవి. సూర్యుడు విశ్వేశుఁడు ఆతఁడే లోకముల సృజించెను. సహస్రనయనుఁడై యాతడే ఈ సర్వ ప్రపంచమునకు ప్రభువు. సృష్టికర్త. ఆతఁడే ప్రజాపతి, ఆకాశమున సోముని నుండి సంసవించిన నీరు ఐయలువెడలును. సర్వప్రపంచమునీరు యావత్ర పంచము సోముడు (చంద్రుడు) ఆధారముగా గలిగినది. ఇది తధ్యము. సత్యముగా ప్రకీర్తింపఁబడినది. సూర్యుని నుండి ఉష్ణము సోమునివలన శీతము (చల్లందనము) ప్రసరించును. (20)

శీతోష్ణవీర్యౌ ద్వావేతౌ యుక్త్యా ధారయతే జగత్

సోమాధారా నదీ గంగా పవిత్రా విమలోదకా

భద్రసోమపురోగాశ్చ మహానద్యో ద్వీజోత్తమాః

సర్వభూతశరీరేషు హ్యాపో హ్యనుసృతాశ్చ యాః

తేషు సందహ్యమానేషు జంగమస్థావరేషు చ

ధూమభూతాస్తు తో హ్యాపో నిష్కామంతీహ సర్వశః

తేన చాబ్రాణి జయంతే స్థానమభ్రమయం స్కృతమ్

తేజోబర్కః సర్వభూతేభ్య ఆదత్తే రశ్మిభిర్జలమ్

సముద్రాద్వయుసంయోగద్వహంత్యపో గభస్తయః

సంజీవనం చ సస్యానాం అంభస్తదమృతోపమమ్

తతస్త్వతువశ్కోలే పరివర్య దివాకరః

యచ్ఛంత్యాపో హి మేఘేభ్యః శుక్లాశుక్లెర్గభస్తిభిః

అభ్రస్థాః ప్రపతంత్యాపో పోయునా సముదీరితాః

సర్వభూతహితార్థాయ వాయుమిశ్రాః సమంతతః

తతో వర్షతి షణ్మాసాన్సర్వభూత వివర్ధయే

వాయవ్యం స్తనితం చైవ వైద్యుతం చాగ్నిసంభవమ్

మేహనాచ్చ మిర్దాతో ర్మేఘత్వం వ్యంజయంతి హి

న భ్రశ్యంతి యతశ్చాపస్తదభ్రం కవయో విదుః

మేఘానాం పునరుత్పత్తి స్త్రీవిధా యోనిరుచ్యతే

ఆగ్నేయా బ్రహ్మజాశ్చైవ పక్షజాశ్చ పృథగ్విధాః

శీతోష్ణవీర్యులయిన చంద్రసూర్యులు వారిరువురీయొక్క సంయుక్తిచే (సంయోగముచే) ప్రపంచమును పాలించుచున్నారు ధరించు చున్నారు, సోమాధారమైన గంగానది పవిత్రమయినది. (21) విమలోదకములు గలది. ఓ బ్రాహ్మణులారా! భద్రసోమ నదితో ప్రారంభించి పురోగమించిన మహానదులు సర్వభూతముల యొక్క (చరాచరములయిన) శరీరములందు ప్రవహించు నీరములు అగును. చరాచర పదార్థములు సందహ్యమానములు కాగా నవి సర్వత్ర పొగలై అంతట నీటిని వెలువరచును. (23) దానివలన మేఘములు పుట్టును. స్థానమయిన జలము అభమయము (మేఘమయమని) గ్రహింపవలయును. (నీరంతయు మేఘమయమనుట), సూర్యుడు తన కిరణములతో సర్వభూతముల నుండి నీటిని గ్రహించును. (24) వాయు సంయోగముచే సముద్రము నుండి సూర్య కిరణములు నీటిని వహించును. (గ్రహించును.) ఆ నీరమే సస్యములకు సంజీవనము ప్రాణములనిచ్చునది అదియే అమృతోపముము. (25) అంత, ఋతువు సకాలమున రాగా సూర్యుఁడు నీటిని తీయ్యని జలముగా మార్చి మేఘములకు తన శుక్లాలి శుక్ల కీరణముల ద్వారా యొసంగును. (26) వాయు ప్రేరితములై మేఘములు వానియందుంచబడిన నీటిని క్రిందకు విడుచును (వర్షించును). సర్వభూతములపోతమునకై వాయుమిశ్రములై యా మేఘములు అంతటవ్యాపించును. (27) సర్వభూత వివృద్ధి కొఱకు (అభ్యుదయము కొఱకు) ఆరు మాసములు వర్షించును. పిడుగుల వంటి మేఘగర్జనము వాయు సంబంధమైనది. విద్యుత్తు అగ్నివలన కలిగినది. మేఘశబ్దము తడుపు అను నర్థముగల మీదో అనే ధాతువు వలన నేర్పడుచున్నది. భ్రంశమును జెందవు గాన బుధులు (విద్వాంసులు) మేఘము నభ్రముగా నేఱుంగుదురు. ఏలయన నీరు క్రిందకు భ్రంశము కాదు. కనుక ! మేఘముల యుత్పత్తి మరల త్రివిధము వాని యొక్క జన్మ స్థానమును బట్టి అవి మూడు విధములు. అవి ఆగ్నేయములు, బ్రహ్మజములు, పక్షజములు - అనునవి పృథగ్విధములు. (30)

త్రిధా మేఘాః సమాభ్యాస్తేషాం వక్ష్యామి సంభవమ్

ఆగ్నేయాస్తూష్ణజాః ప్రోక్తాస్తేషాం ధూమప్రవర్తనమ్

శీతదుర్దినవాతా మీ స్వగుణాస్తే వ్యవస్థితాః

మహిషాశ్చ వరాహాశ్చ మత్తమాతంగరూపిణః

భూత్వా ధరణీమభ్యేత్య రమంతే విచరంతి చ

జీమూతా సామ మేఘా హ్యేతేభ్యో జీవసంభవః

విద్యుద్గుణవిహీనాళ్ళ జలధార్ విలంబినః

మూకమేఘ మహాకాయా ఆవహస్య వశానుగాః

క్రోశమాత్రాచ్చ వర్షంతి క్రోశార్గాదపి వా పునః

పర్వతాగ్రనితంబేషు వర్షంతి చ రసంతి చ

ఇలాకాగర్భదాశ్చైవ బలగర్భధారిజః

బ్రహ్మణా నామ తే మేఘా బ్రహ్మవిశ్వాససంభవాః

తే హి విద్యుదుణోపేస్తనయత్నుప్రియస్వనాః

తేషాం శశ్వత్పణాదేన భూమిః స్వాంగరుషోద్భవా

రాజీ రాజ్యాభిషిక్తేవ పునర్యౌవనమశ్నుతే

తేషియం ప్రాపృడాసక్తా భూతానాం జీవితోద్భవా

ద్వితీయం ప్రవహం వాయుం మేఘస్తే తు సమాశ్రితాః

యే తే యోజన మాత్రాచు సాధ్యరా నిష్కృతాదపి

వృష్టిర్గర్భస్త్రిధా తేషాం ధారాసారః ప్రకీర్తితః

పుష్కరావర్తక నామ తే మేఘాః పక్షసంభవాః

త్రివిధమయిన మేఘముల గూర్చి చెప్పఁబడినది. వానీయొక్క యుత్పత్తిని గూర్చి వచించెదను. ఆగ్నేయములు ఉష్ణము నుండి అనబడినవి. అయ్యవి ధూమమును ప్రవర్తింపఁజేయును. (ధూమము = ఆవిరి). (31) చల్లనిగాలులు, దుర్దినము (మేఘచ్చన్నదీనము) లందలి గాలులు - పై వాని గుణములు. అయ్యవి మహిషముల యొక్క అడవి పందుల యొక్క మత్తమాతంగముల యొక్క ఆకారములను పొందును. ఆ రూపములను దాల్చి భూమి కరుదెంచీ, క్రీడించును. అందందు సంచరించును. వానిని జీమూతములందురు. ప్రాణికోటి ఈ జీమూత మేఘముల నుండి సంభవించును. (33) విద్యుద్గుణవిహీనములు జలధారచే క్రిందకు వ్రేలాడును, అయ్యవి శబ్దింపవు. మూక మేఘములు. అయ్యవి ఆవహమనెడి ఒకానొకవిధవాయు వశము నందుండును. అవియొక క్రోశ మాత్రమే క్రోశార్థ మాత్రమే వర్షించును. అవీ పర్వత శిఖరముల యందు వర్షించును. గర్జించును. (35) ఆ మేఘములకు బ్రహ్మజములని పేరు. అవి బ్రహ్మయొక్క నిశ్వాసము నుండి పుట్టినవి. అవి బలాకలను నోకజాతి కొంగలకు గర్భమును గలిగించును. అయ్యవి (బలాకలు). గర్భమును ధరించును. (36) అవి విద్యుద్దడో పేతములు. ప్రియములైన గర్జనలను చేయునట్టివి. ఆ మేఘముల యొక్క నీరంతర ప్రణాదముచే (గర్జనచే) భూమి తనయందు పుట్టిన మొక్కలు మొలకలను రోమాంచము నొందును. (37) రాజ్యాభిషిక్తురాలయిన రాజ్ఞవలె (భూమి) పునర్యౌవసము నందును, ఆ వర్షా కాలపు మేఘముల యందాసక్తయే భూమి సర్వజీవీతములకు జీవితకారణమగును. (38) ఆ మేఘములు ప్రవహమను రెండవ విధమయిన, వాయువు నాశ్రయించును. ఈ మేఘములు 12 నుండి 18 కిలో మీటర్ల వరకు (యోజనము, యోజనార్థము) వర్షించును. (39) పుష్పరావర్తకము లను నామము గల మేఘములు వాయువు. నుండి పుట్టినవి. వాని వృష్టి. గర్భము అది త్రివిధము. నిరంతరధారాపాతముగ నుండును. (40)

శక్రేణ పక్షచ్ఛిన్నా యే పర్వతానాం మహౌజసాం

కామగానాం ప్రవృద్ధానాం భూతానాం శివమిచ్ఛతా

పుష్కరా నామ తే మేఘా బృంహతస్తోయమత్సరాః

పుష్కరావర్తకాస్తేన కారణేనేహ శబ్దితాః

నానారూపధరాశ్చైవ మహాఘోరస్వనాశ్చ తే

కల్పాంతవృష్టః సష్టారః సంవర్తాగ్నేర్నియామకాః

వర్షంతే తే యుగాంతేషు తృతీయాస్తే ప్రకీర్తితాః

అనేకరూపసంస్థానాః పూరయంతో మహీతలమ్

వాయుం పురా వహంతః స్యురాశ్రితాః కల్పసాధకాః

యాన్యండస్య తు భిన్నస్య ప్రాకృతస్యాభవంస్తథా

యస్మిన్ బ్రహ్మా సముత్పన్నశ్చతుర్వక్షః స్వయంప్రభుః

తాన్యేవాండకపాలాని సర్వే మేఘాః ప్రకీర్తితాః

తేషామాప్యాయనం ధూమః సర్వేషామవిశేషతః

తేషాం శ్రేష్ఠస్తు పర్జన్యశ్చత్వారశ్చైవ దిగ్గజః

గణానాం పర్వతానాం చ మేఘానాం భోగిభిస్సహ

కులమేకం పృథగ్భూతం యోనిలేకా జలం స్మృతమ్

పర్జన్యో దిగ్గజాశ్చైవ హేమంతే శీతసంభవాః

తుషార వృష్టిం వర్షంతి శిష్టః సస్యప్రవృద్ధయే

షష్ఠః పరివహో నామ తేషాం వాయురపాశ్రయః

యోసౌ భీభర్తి భగవాన్ గంగామాకాశగోచరామ్

మిక్కిలి శక్తిమంతములు, యధేచ్చగా పోవు శక్తి గలవీ, మిక్కిలి వృద్ధి పొందినవియునగు పర్వతము లేవికలవో వాని రెక్కలు భూతములకు శుభముగోరు ఇంద్రునిచే ఛిన్నములయినవి. పుష్కరములను పేరుగల యా మేఘములు (ఈ రెక్కల నుండి పుట్టినవి). అవి నీటితో మాత్సర్యము వహించి స్వరూపమున వృద్ధి పొందినవి. అందుచేతనే యవి పుష్కరావర్తకములని పేరొందినవి. (భ్రమించు పుష్కరములు జలములు). (42) అవి నానా రూపములను ధరించినవి. అవీ మహాఘోరముగా గర్జించును. కల్పాంతమందు కుంభవృష్టి నయ్యవి సృష్టించును. అయ్యవి సంవర్తాగ్నిని నియమించును. (ప్రపంచమును దహించు అగ్ని సంవర్తాగ్ని). (43) ఆ మేఘములు యుగాంతమునందు వర్షించును. అవి తృతీయములైన మేఘములుగా గణింపఁబడినవి. వానికనేక రూప సంస్థానములు గలవు. అయ్యవీ ప్రపంచమునంతటిని ముంచెత్తును. (44) అవి వాయువును ముందుగా వహించిపోవును. అట్లుండి అవి కల్పసాధకములు. అండకల్పములు భిన్నమయిన భూమ్యండము యొక్క ముక్కలు. (ప్రకృతి నుండి ఆవిర్భవించినవి). అవి బ్రహ్మాండము భిన్నముగాగా సముత్పన్నములు. చతుర్వక్రుఁడు స్వయంభువుఁడునయిన బ్రహ్మ అందుద్భవమొందెను. ఆ విశ్వాండము యొక్క భిన్నములయిన కపాలములు మేఘములుగా కీర్తింపఁబడినవి. (46) వాని కన్నింటికిని ధూమము సంవృద్ధికి అనుకూలమయినది, ఈ ఆనుకూల్యమున భేదము (విశేషము)లేదు. వానిలో మిక్కిలి శ్రేష్ఠమయినదీ పర్జన్యము, దిగ్గజములు నాలుగు ఏనుగులు, మేఘములు, సర్పములు, పర్వతములు వేరువేరయినను, వీనియొక్క కులము యోని (జన్మస్థానము) జలముగా నేుంగవలెను. (47,48) సస్య ప్రవృద్ధికి ఆదేశింపఁబడి, (మొక్కలు చెట్లు వృద్ధి పొందుటకు) పర్జన్య మేఘములు దిగ్గజములు హేమంతమున శీతసంభవములై తుషారమును వర్షించును. (49) వానీకి ఆరవదీయైన పరీవాహ నామక వాయువు ఆధారము. భగవద్రూపమైన యీ వాయువు ఆకాశ గంగను భరించును. ఆ యాకాశ గంగ యొక్కటీయే అమృత తుల్యమయిన నీరములు గలిగిన పవిత్రనది.

దీవ్యాపృతజలాం పుణ్యాం త్రిధా స్వాతిపథే స్థితామ్

తస్యా నీష్యందతోయానీ దిగ్గజాః పృధుభిః కరైః

శీకరం సంప్రముంచంతి నీహార ఇతి స స్మృతః

దక్షిణేన గిరిర్యోఽసౌ హేమకూట ఇతి స్మృతః

ఉదఘ్చిమవతః శైల ఉత్తరప్రాయదక్షిణే

పుండ్రం నామ సమాఖ్యాతం నగరం తత్ర విస్తృతమ్

తస్మిన్నిపతితం వర్షం తత్తుషారసముద్భవమ్

తతస్తదావహో వాయురేమమంతం సముద్వహన్

ఆనయత్యాత్మయోగేన సింఛమానో మహాగిరిమ్

హిమవంతమతీక్రమ్య వృష్టిశేషం తతః పరమ్

ఇహాభ్యోతి తతః పశ్చాదపరాంతవివృద్ధయే

వర్షద్వయం సమాఖ్యాతం సస్యద్వయవివృద్ధయే

మేఘశ్చాప్యాయనం చైవ సర్వమేతత్ ప్రకీర్తితమ్

సూర్య ఏవ తు వృషీనాం స్రష్టా సముపదేశ్యతే

సూర్యమూలా చ వై వృష్టిర్ణలం సూర్యాత్పవర్తతే

ధ్రువేణాధిష్ఠితః సూర్యస్తస్యాం వృష్ణా ప్రవర్తతే

ధ్రువేణాధిష్ఠితో వాయుః వృష్టిం సంహరతే పునః

గ్రహో నిఃసృత్య సూర్యాత్తు కృశ్నే నక్షత్రమండలే

చరిత్వాంతే విశత్యర్కం ధ్రువేణ సమధిష్ఠితమ్

తతః సూర్యరథస్యాథ సన్నివేశం నిబోధత

గంగానది ఆకాశమున స్వాతిపథమున మూఁడుపాయలుగా నున్నది. దీగ్గజములు తమ పృథువులైన (పెద్దవియైన) తొండములతో గంగనుండి నిష్యందములయిన తోయములను గ్రహించి, వానిని నీటి తుంపరలుగా వెదజల్లును, వానినే నీహార బిందువులని యందురు. (50,52) దక్షిణ మండలమున హేమకూటమను ఒక పర్వతము కలదు. హిమాలయములకు ఉత్తరమున ఉత్తర దక్షిణములకు విస్తరించియున్న యొక నగరము పుండ్లకమనునదికలదు. (53) దానిమీఁదపడు వరము తుషారబిందువులు కలిగినది. అంత ‘వహ’ (ఆవహ) అను వాయువు హిమాలయములపై ఆ మహా పర్వతముపై నీటిని వెదజల్లుచు వీచును, తన ప్రయత్నము చేతనే (ఆత్మయోగేన) ఆ పర్వతము నయ్యది తన స్వాధీనములోనికి తీసికొని వచ్చును. హిమాలయములను దాటిన తరువాత మిగిలిన వర్షపు నీటిని పశ్చిమ భాగము యొక్క అభివృద్ధి కయ్యదియుప యోగించును. (54,56) ఈ విధముగా ద్వివిధములయిన వర్షములు ద్వీవిధములయిన సస్యముల వృద్ధి కొఱకు సమాఖ్యాతములయినవి. మేఘములు వివిధ వస్తు సమృద్ధికి సలుపు వ్యాపారము కీర్తింపఁబడినది. సూర్యుడే వృష్టికి స్రష్టగా నిరూపింపబడుచున్నాఁడు. (57) వర్షజలము సూర్యమూలమై సూర్యునిచే కలుగుచున్నది. ఇదీ ధ్రువునిచే నధిష్ఠితము. సూర్యుఁడు వృష్టి కొఱకు ప్రవర్తించును. (58) ధ్రువునిచే నధిష్టితమయిన వాయువు మరల వృష్టిని ఉపసంహరించును. గ్రహము సూర్యుని నుండి వచ్చును, యావత్ నక్షత్రమండలమునను చరించును. తుదిని ధ్రువునిచే సమధిష్ఠితమయిన సూర్యుని ప్రవేశించును. అప్పటి నుండి సూర్యునియొక్క రథ సన్నివేశమును అవగాహనము చేసికొనుము. (60)

సంస్థితేనైకచక్రీణ పంచారేణ త్రినాధినా

హిరణ్మయేన భగవాంస్తథైవ హరిదర్వణా

అష్టాపదనిబద్ధీన షట్పకారైకనేమినా

చక్రేణ భాస్వతా సూర్యః స్యందనేన ప్రసర్పతి

దశయోజనసాహసో విస్తారాణామతః స్మృతః

ద్వీగుణీఽస్య రథోపస్థాదీషాదండః ప్రమాణతః

స తస్య బ్రహ్మణా సృషో రథో హ్యర్ధవశేన తు

అసంగః కాంచనోదివ్యో యుక్తః పవనగైర్హయైః

ఛందోభిర్వాజిరూపైస్తు యతశ్చక్రం తతః స్థితైః

వారుణస్యందనస్యే లక్షజ్ఞః సదృశస్తు సః

తేనాసౌ సర్పతే వ్యోమ్ని భాస్వతా తు దివాకరః

అథ్లెతాని తు సూర్యస్య ప్రత్యంగాని రథస్య హ

సంవత్సరస్యావయవైః కల్పితస్య యథాక్రమమ్

అహస్తు నాభీ సౌరస్య ఏకచక్రస్య వై స్మృతః

అరాః పంచార్తవాంస్తస్య నేమిః షడృతవః స్మృతః

రథనీడః స్మృతో హ్యేష చాయనే కూబరావుభౌ

ముహూర్తా బంధురాస్తస్య రమ్యాశ్చాస్య కలాః స్మృతాః

తస్య కాషా స్మృతా హోణా అక్షదండః క్షణస్తు వై

నిమేషశ్చానుకర్షోఽస్య హీషా చాస్య లవా స్మృతాః

రాత్రిర్వరూథో ధర్మోఽస్య ధ్వజ ఊర్ధ్వం సముచ్ఛ్రితః

భగవంతుఁడైన సూర్యుఁడు హిరణ్మయమయిన రథమున బయలుదేరును. దానికి ఒకే చక్రము; ఆ చక్రమునకు (అరలు) ఆకులు ఐదు; మూఁడు నాభులు; ఆరువిధములైన ఒకే పట్టా. ఆ పట్టాకు ఆరు నోములు; ఆ రథపు గుఱ్ఱములు. ఆకుపచ్చనివి, ఆ రథము అష్టాపదము (బంగారము)చే నిర్మితము. మిక్కిలి కాంతితో ప్రకాశించును. (62) ఆ రథము యొక్క ఆయతనము (పరిధి) దశ సహస్ర యోజనముల విస్తారము. (ఒక యోజనము 12 కి.మీ) దాని ధ్వజము (ఈషాదండము) యొక్క ప్రమాణము రథమునకన్న రెండింతలు! (63) ఆతని రథము దివ్యము కాంచనయుతము. వాయువుతో సమాన వేగముగల గుఱ్ఱములు దానికి పూన్చబడినవి. దాని కెచ్చటను అడ్డంకి లేదు. అదీ నిరాఘాటగతి కలిగినది. అయ్యది బ్రహ్మచే నొక ప్రత్యేక ప్రయోజనముద్దేశించి సృజింపఁబడినది. (64) ఛందస్సులు (వేదముల గాదులు శ్లోకశిల్పము) స్వయముగా నశ్వరూపములు ధరించినవి. చక్రమున్నదీశకే స్థితములు. వరుణుని రథ లక్షణములతో సదృశమయిన లక్షణము లీస్యందనమునకు కలవు. (65) ప్రకాశవంతమయిన యీ రథము యొక్క సహాయమున సూర్యుడు ఆకాశమున ప్రయాణించును. క్రింద వివరింపఁబడునవి ఆ రథము యొక్క ప్రత్యంగములు. దాని భాగములన్నియు సంవత్సరావయములతో చేయబడినవి. ఒకరోజు సూర్య రథము యొక్క యొక ఇరుసుగా (నాభిగా) గణింపఁబడినది. పంచ ఋతువులు (ఆర్తవములు) దాని (బండి ఆకులు) అరలు. ఆరు ఋతువులు దాని యొక్క పట్టా, దానిని రథము యొక్క అంతరాసనముగా స్మరింతురు. రెండు అయనములు రెండు (67,68) ముహూర్తములు నోగళ్లు రమ్యములై బంధురములైన కళలు కొష్ట దానియొక్క నాసిక, దానియొక్క అక్షదండము క్షణము. (69) నిమేషము అనుకరము లవములు దానియొక్క కూబరములు. రాత్రి దాని కర్ర కవచము. ధర్మము దాని యొక్క ఎత్తైన ధ్వజము. (70)

యుగాక్షకోటీ తే తస్య అర్థకామానుభౌ స్మృతా

సప్తాశ్వరూపాశ్ఛందాంసి పహంతో వామతో ధ్రువమ్

గాయత్రీ చైవ త్రిష్టుప్ప హ్యనుష్టుభ్ జగతీ తథా

పంక్తిశ్చ బృహతీ చైష హ్యప్తికైన తు సప్తమీ

చక్రమక్షే నిబద్ధం తు ధ్రువే చాక్షః సమర్పితః

సహచకో భ్రమత్యక్షః సహాక్షో భ్రమతే ధ్రువః

అక్షేణ సహ చక్రేశో భ్రమలేఽసౌ ధ్రువేరితః

ఏవమర్థవశాత్తస్య సన్నివేశో రథస్య తు

తథా సంయోగభావేన సంశుధో భాసురో రథః

తేనాసౌ తరణిర్దేవో భాస్వతా సర్పతే దివి

యుగాక్షకోటిసన్నదౌ ద్వౌ రశ్మీ స్యందనస్య తు

ధ్రువే తా భ్రామ్యతే రశ్మీ చ చక్రయుగయోస్తు వై

భ్రమతో మండలాన్యస్య ఖేచరస్య రథస్య తు

యుగాక్షకోటీ తే తస్య దక్షిణే స్యందనస్య హి

ధ్రువేణ ప్రగృహీతే వై విచక్రమనురక్షవత్

భ్రమంతమనుగచ్ఛేతాం ధ్రువం రశ్మీ తు తావుభౌ

యుగాక్షకోటిస్తతస్య రశ్మిభిః స్యందనస్య తు

కీలాసక్తా యథారజుర్భమతే సర్వతో దిశమ్

హ్రసతస్తస్య రశ్మీ తు మండలేషూత్తరాయణే

వర్ధతే దక్షిణే చైవ భ్రమతో మండలాని తు

యుగము, అక్షకోటి అర్థకామములుగా స్మరింపఁబడినవి. ఇవి కాడి యొక్కయు ఇరుసు యొక్కయు కొనలు, సప్తాశ్వరూపమున నున్న వేదచందములు వామభాగము నుండీ ధ్రువమును (కాడిని) వహించును. (71) సప్తచ్ఛందములు - గాయత్రీ తిష్టుభ్, అనుషుప్, జగతి, పంక్తి, బృహతి మరియు ఉషిక్. (72) చక్రము అక్షము నందు నిబద్ధీంపఁబడినది; అక్షము ద్రుపము నందు సమిరతము; అక్షము చక్రముతో సహా భ్రమించును. మరి ధ్రువము అక్షముతో సహ పరిభ్రమించును. (73) ధ్రువముచే ప్రచోదింపఁబడీ ఇరుసు వెంటనే (అనుసరించి) చక్రము భ్రమణము చేయును. ప్రత్యేక ప్రయోజనమును బట్టి ఇట్టేది రథము యొక్క సన్నివేశము (నిర్మాణము) (74) ఆవిధముగనే సంయోగ భావముతో భాసురమయిన రథము కూర్పఁబడినది. ఆ ప్రకాశవంతమయిన రథముచే భగవానుఁడగు సూర్యుఁడు ఆకాశము నంతటిని ప్రయాణించును. (75) ఆ రథము యొక్క ఇరుసునకు, కాడియొక్క రెండు చివరలకు కట్టబడి రెండు పగ్గముల రశ్ములు కలవు. ఆ రెండు పగ్గములు ధ్రువము నందు తిరిగి, రెండు చక్రముల కార్యమును నాచరించును. (76) ఆకాశమున వలయములుగా పరిభ్రమించు, రథము యొక్క ఇరుసుదండము, ఇరుసుల యొక్క చివరలు, ధ్రువముచే గట్టిగా పట్టుకొనఁబడి యుండును. ఆ రెండు పగ్గముల త్రాళ్లు ఇరుసుపై తీరుగును, అవి ధ్రువము ననుసరించును. ఆ ధ్రువుఁడు కూడ తీరుగును. (77,78) రథము యొక్క ఇరుసు ఇరుసు దండము యొక్క తుదిభాగముల, ఒక గసికకు (మేకునకు) పగ్గములతో కట్టఁబడిన త్రాటివలే అంతటను భ్రమణము చెందును. (79) ఉత్తరాయణమున ఆ పగ్గముల వంటి త్రాళ్లు పొడవునందు తగ్గును. దానికి కారణమయ్యవి వలయములలో తిరుగుట. దక్షిణాయనమున వాని పొడవు హెచ్చును. (80)

యుగాక్షకోటిసంబద్దే రశ్మీ ద్వే స్యందనస్య తు

ధ్రువేణ ప్రగృహీతౌ వై తౌ రశ్మీ నయతో రవిమ్

ఆకృ ష్యేతే యదా తొ వై ధ్రువేణ సమధిష్టితౌ

తదా సోఽభ్యంతరే సూర్యో భ్రమతే మండలానీ తు

అశీతిర్మండలశతం కాష్ఠయో రంతరం స్మృతమ్

ధ్రువేణ ముచ్యమానాభ్యాం రశ్మిభ్యాం పునరేవ తు

తథైవ బాహ్యతః సూర్యో భ్రమతే మండలానీ తు

ఉద్వేష్టయన్ స వేగేన మండలాని తు గచ్ఛతి

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽనుషంగపాడే దేవగ్రహానుకీర్తనం నామ ద్వావింశతితమోఽధ్యాయః

యుగమునకు అక్షకోటికిఁ గట్టఁబడిన పగ్గములు రెండుఁ (రెయిన్ కోర్ట్స్) దృఢముగా ధ్రువముచే పట్టుకొనఁబడి యుండును. ఆ రెండు పగ్గములు సూర్యుని నడిపించును. ధ్రువునిచే సమధిష్టితము అయినప్పుడు, ఆ రెండు పగ్గముల వంటి త్రాళ్లు లాగబడును. అప్పుడు, తన మండలములను సూర్యుఁడు వలయాకారముగ పరిభ్రమించును. (82) కొష్ఠముల మధ్యనున్న అంతరము అశీతి మండల శతము. ధ్రువునిచే ఆ పగ్గపు త్రాళ్లు వదులు చేయబడినప్పుడు (విడువబడినప్పుడు) తనమండలమునకు బాహ్యమున సూర్యుఁడు మరల నొకసారి వలయములలో భ్రమించును. అయ్యది చుట్టును వేగమును పెంచుచు వలయములలో తిరుగును.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ పురాణములో పూర్వభాగమందు, ద్వితీయానుషంగపాదమున దేవగ్రహానుకీర్తనమున ఇరువది రెండవ అధ్యాయము