నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

124 - ద్వాదశమాసస్థి పౌర్ణమాస్యమావాస్యావ్రత కధనమ్

సనాతన మహర్షి పలికెను :- ఓ నారదా! ఇపుడు పూర్ణిమా వ్రతములను అమావాస్యావ్రతములను చెప్పెదను. ఈ వ్రతముల నాచరించు స్త్రీ పురుషుల సుఖసంపదలను పొందెదరు. చైత్ర పూర్ణిమ మన్వాదిగా ప్రసిద్ధిచెంది యున్నది. ఈనాడు చంద్రుని ప్రీతి కొరకు సాన్నోదక కుంభమును దానము చేయవలయును. వైశాఖ పూర్ణిమనాడు దానము ప్రశస్తము. బ్రాహ్మణునకు దానము చేసిన దంతయూ లభించును. ఈనాడు ధర్మరాజు వ్రతము చెప్పబడినది. వైశాఖపూర్ణిమనాడు ధర్మరాజ ప్రీతికోరకు శృతాన్నమును ఉదకుంభమును విప్రునికి దానము గావించవలయును. ఇట్లు చేసిన గోదానఫలము లభించును. డెక్కలు, కొమ్ములు ఉన్న కృష్ణాజిన దానమును చేయవలయును. కృష్ణాజనమును, తిలలతో కప్పి వస్త్రములను బంగారమును బ్రాహ్మణునకు దానము గావించవలయును. సర్వశాస్త్రజ్ఞునికి యధావిధిగా సత్కారపూర్వకముగా కృష్ణాజినదానమును గావించనచో సప్తద్వీపభూమిప్రదమగును. ఆచన్ల తారార్కముగా విష్ణులోకమున ఆనందించును. పవిత్ర జలములతో నిండిన కలశములను బంగారముతో కలిపి బ్రాహ్మణోత్తములకు దానమును గావించినచో జీవితాంతము దుఃఖించడు. ఇక జ్యేష్ఠపూర్ణిమనాడు వటసావిత్రికవ్రతము చెప్పబడినది. ఉపవాసముతో స్త్రీ అమృతోపమలగు జలముచే వటవృక్షమును తుడపవలయును. సూత్రముతో చుట్టి నూటా ఎనిమిది ప్రదిక్షణములను చేయవలయును. తరువాత పతివ్రతా శిరోమణియగు సావిత్రిని ప్రార్థించవలయును. జగత్పూజ్యురాలా జగన్మాతా సావిత్రీ! పతిదేవతా నన్నుభర్తతో సర్వదా కలిపి ఉంచుము. నీకు నమస్కారము. ఇట్లు ప్రార్థించి మరునాడు ముత్తయిదవులను భుజింపచేసి తాను భుజించినచో సౌభాగ్యవంతురాలగును. ఆషాడపూర్ణిమనాడు గోపద్మవ్రతము చెప్పబడినది. చతుర్భుజుడు, మహాకాయుడు జాంబూనదసమప్రభుడు, శంఖచక్రగదాపద్మరమగరుడ శోభితుడు, మునులచే, దేవతలచే, యక్షగంధర్వకిన్నరులచే సేవించబడువాడు అగు శ్రీహరిని పురుషసూక్తముతో స్నానముచేయించి, గంధాద్యుపచారములచే పూజించవలయును. ఆచార్యుని ప్రీతిచే వస్త్ర భూషణాది దానముచే సంతోషింపచేయవలయును. ఇతర బ్రాహ్మణులను మిష్టపక్వాన్నములచే భుజింపచేయవలయును. ఇట్లు వ్రతమునాచరించి శ్రీహరి అనుగ్రహమువలన ఇహపరములలో సకలాభీష్టములను పొందును. ఈ దినమున కోకిలావ్రతము కూడా చెప్పబడినది. ఇపుడు ఆ విధానమును చెప్పెదను వినుము. పూర్ణిమనాడు ప్రారంభించి బహిర్భాగమున జలములో స్నానముగావించి శ్రావణమాసములో పూర్ణిమ వరకు గౌరీరూపములోనున్న కోకిలను స్వర్ణపక్షను, రక్తనేత్రను, ప్రవాలముఖ పంకజను, కస్తూరీ వర్ణసంయుక్తను, నందన వనోత్పన్నను, చూతచంపకవృక్షస్థితను, కలగీతనినాదినిని, కోకిలారూపధారిణి యగు పార్వతీదేవిని ధ్యానించవలయును. పటమున వర్ణములో లిఖించిన దానిని ప్రతిదినము గంధాదులతో పూజించవలయును. తరువాత వ్రతాంతమున బంగారుప్రతిమను కాని తిలపిష్టమయప్రతిమనుకాని స్వర్ణదక్షిణతోపాటు బ్రాహ్మణునికి మంత్రముతో దానముచేయవలయును. ఓ చైత్రరధోత్సన్నా కోకిలా. హరవల్లభా!దేవీ! నిన్ను చక్కగాపూజించి బ్రాహ్మణునికి ఇచ్చితిని. నాకు సర్వసౌభాగ్యములనిమ్ము. ఒక బ్రాహ్మణునికాని, ముప్పదిమంది ముత్తయిదువలనుకొని, ఒక ముత్తయిదవునుకాని భుజింపచేయవలయును. శక్తికొలది వస్త్రములను దక్షిణలనిచ్చి పంపవలయును. ఇట్లు వ్రతమునాచరించు స్త్రీ ఏడు జన్మలలో సుఖసౌభాగ్యములను పొందును.

ఇక శ్రావణ పూర్ణిమనాడు వేదోపాకరణము చెప్పబడినది. యుజుర్వేదమంత్రములచే దేవర్షి పితృతర్పణము చేయవలయును. స్వశాభోక్తవిధానముగా ఋషిపూజగావించవలయును. ఋగ్వేదులు చతుర్దశినాడు, సామవేదము వారు భాద్రపదమాసమున చేయవలయును. అట్లే యధావిధిగా రక్షావిధానము కూడా చేయవలయును. ఆవాలు అక్షతలు పేలాలు ధరించవలయును. రక్తాంశుకమున తెల్లనివి. పత్తితో తీయబడిన దారమును నీటిలో చక్కగా శుభ్రపరిచి కాంస్యకలశమున ధరించి, గంధాదులతో చక్కగా పూజించి దేవతా సమూహమును పూజించి, విష్ణ్వాణ్వాదులను ప్రార్థించి బ్రాహ్మణ హస్తమునుండి తన ముంజేతికి కట్టుకొనవలయును. తరువాత బ్రాహ్మాణులకుదక్షిణనిచ్చి వేదాధ్యయనమును చేయవలయును. సప్తర్వులను విడిచి బ్రహ్మసూత్రమును ధరించవలయును. ఈ బ్రహ్మసూత్రమును కొత్తగా నిర్మించి కుంకుమాదులచే అలంకరించి, శక్తికొలది బ్రాహ్మణులను భుజింపచేసి తాను ఏక భుక్తముగా నుండవలయును. ఇట్లు వార్షికమగు నీవైదిక కర్మనాచరించినచో సంవత్సరమంతయు మరిచిన కర్మ, విధిహీనమగు కర్మ, అసలే చేయని కర్మ ఆచరించినట్లగును. భాద్రపదపూర్ణిమనాడు ఉమామహేశ్వరవ్రతము నాచరించవలయును. ఏకభుక్తముగా నుండి శివుని శ్రద్దగా పూజించి చేతులు జోడించి రేపు వ్రతమును చేసెదనని ప్రార్థంచవలయును. రాత్రిపూట దేవుని సమీపమున నిదురించి స్వీకరించవలయును. రాత్రిపూట దేవుని సమీపమున నిదురించి నాలుగవఝామున లేచి నిత్యకృత్యములను నెరవేర్చి భస్మమును రుద్రాక్షలను ధరించి పలువిధములగు నుపచారములతో సుగంధాదులతో, బిల్వపత్రములతో ధూపదీపనైవేద్యములతో శంకరుని చక్కగా పూజించి ప్రదోషము వరకు పవసించి, చంద్రోదయకాలమున మరల పూజంచి, అచటనే జాగరణమును చేయవలయును. ఇట్లు ఏమరుపాటులేక పదిహేను సంవత్సరములు వ్రతము నాచరించి ఉద్యాపనమును యధావిధిగా నాచరించవలయును. ఉమా మహేశ్వరుల సువర్ణప్రతిమల నేర్పరిచి, బంగారు లేదా వెండి, లేదా మట్టిచే చేసిన పదిహేను కలశములనుంచి, వాటిలో నొకదానిలో వస్త్రసహితముగా ప్రతిమాద్వయమునుంచి, పంచామృతములతో శుద్ధజలములతో స్నానము చేయించి, షోడశోపచారములచే పూజించి, పది హేను మంది బ్రాహ్మణులకు మిష్టాన్నములతో భుజింపచేసి దక్షిణలో ఒక్కొక్కకలశమునిచ్చి, ప్రతిమలున్నకలశమును గురువునకు దానమీయవలయును. ఇట్లు ఉమామహేశ్వరవ్రతమునాచరించి, భూలోకమున సర్వసంపన్నిధిగా ప్రసిద్ధునిగా పుట్టును. ఈనాడే శక్రవ్రతము కూడా చెప్పబడినది. ప్రొద్దున స్నానమాడి సురనాయకుని గంధాద్యుపచారములతో,నైవేద్యరాశులతో పూజించి, నిమంత్రిత బ్రాహ్మణులను యధావిధిగా భుజింపచేసి, వచ్చిన ఇతరులను దీనులను, ఆనాధులను భుజింపచేయవలయును. ఇట్లు ప్రతి వర్షము శక్రవ్రతమును చేయవలయును. ధాన్యనిష్పత్తిని కోరు రాజుకాని ఇతరులు కాని చేయవచ్చును.

ఆశ్వయుజశుద్ధపూర్ణిమనాడు కోజాగరవ్రతమునాచరించవలయును. యధావిధిగా స్నానముగావించి ఉపవసించి, జితేంద్రియుడై, తామ్రకలశమున సువర్ణలక్ష్మీపతిమనుంచి, లేదా మృణ్మయ కలశమున కాని వస్త్ర సహితముగా నుంచి ఉపచారములతో వేరువేరుగా పూజించి సాయంకాలమున చంద్రోదయకాలమున బంగారు లేదా వెండి, లేదా మట్టి పాత్రలలో నేయి నింపి దీపములనుంచ వలయును, ఒకలక్ష కాని, యాభైవేలు కాని, వేయి కాని, నూరు కాని వెలిగించవలయును. నేయి శర్కరలతో చాలా పాయసమును వండి చాలా పాత్రలలో నుంచి, చంద్రకాంతిలో నుంచి ఒకఝాము రాత్రి తరువాత దానిని లక్ష్మికి నివేదించవలయును. తరువాత ఆ పాయసముతో బ్రాహ్మణులను భుజింపచేసి వారితో కలిసి నృత్యగీతమంగల వాద్యములతో ఆరాత్రి జాగరణచేసి, అరుణోదయ కాలమున స్నానము చేసి స్వర్ణప్రతిమను గురువునకు సమర్పించవలయును. ఈనాటిరాత్రి కరాంబుజయగు మహాలక్ష్మీదేవి ఈ భూమండలమున ఈ రాత్రి జాగరణచేసి నన్ను పూజించు వానికి సంపదలనిచ్చెదనని తిరుగుచుండును. ఇట్లు ప్రతివర్షము లక్ష్మీ సంతోషప్రదమగు నీ వ్రతమును ఆచరించువారికి ఇహపరములలో సమృద్ధిని ప్రసాదించును. కార్తిక పూర్ణిమనాడు విప్రత్వసిద్ధికి సర్వశత్రు జయమునకు కార్తికదర్శన వ్రతము నాచరించవలయును. ఈనాడే దీపదానముతో త్రిపురోత్సవము నాచరించవలయును. ఈ వ్రతమును సాయంకాలమున చేసిన సర్వప్రాణి సుఖావహము. కీటములు, పక్షులు, మశకములు వృక్షములు, జలచరములు, స్థలచరములు ఈ కార్తీకదీపమును చూచినచో మరల ఈ భూమిపై పుట్టవు. మోక్షమును పొందును. ఈనాడు చంద్రోదయకాలమున షట్కృత్తికలను పూజించవలయును. కార్తికేయుడు, ఖడ్గి, వరుణుడు, హుతాశనుడు, వీరిని గంధపుష్ప ధూపదీపనైవేద్యములచే, పరమాన్నములచే, దేవతలను చక్కగా పూజించి, ఇంటి బయట దీపము నుంచవలయును. దీపమునకు సమీపమున చతరప్రగర్తమును మనోహరముగా చతుర్థశాంగుల ప్రమాణముగా ఏర్పరిచి, చందనజలముచే తడిపి, ఆవుపాలతో నింపి, దానిలో బంగారమును, ముత్యముల కన్నులతో నున్న, సర్వాంగ సుందరమగు మత్స్యమును దానిలో “మహామత్స్యయ నమః” అను మంత్రమును ఉచ్చరించ వలయును. ఓ బ్రాహ్మణోత్తమా? నేను క్షీరసాగరదానమును చేయుచున్నాను. ఈ దానప్రభావమువలన హరిసన్నిధిలో ఆనందింతును. ఈనాడు వృషోత్సర్గమును చేసి, రాత్రిపూట వ్రతము నాచరించినచో రుద్రలోకమును పొందును. ఈ విషయమున ఆలోచించవలసిన పనిలేదు. ఇక మార్గశీర్షపూర్ణిమనాడు బంగారముతోపాటు ఆడకలవణమును శాంతుడగు బ్రాహ్మణునకు సర్వకామసమృద్ధి కొరకు దానము చేయవలయును. పూర్వకాలమున లక్ష్మీదేవి ఈ జగత్తును విడిచెను. అపుడు శ్రీహరి, ఇంద్రుడు, చంద్రుడు బృహస్పతి, శుక్రుడు ఈ అయిదుగురు పుష్యయుక్త పూర్ణిమనాడు జగత్తును ప్రయత్నపూర్వకముగా సౌభాగ్యోత్సవకేళీవిలాసములతో అలంకరించిరి కావున పుష్యయుక్త పూర్ణిమనాడు సర్వసౌభాగ్యసమృద్ధి కొరకు, తన శరీరమును ఎట్టిని ఆవాలరసముతో చక్కగా నలది, సర్వౌషధి జలములచే చక్కగా స్నానముచేసి నూతనవస్త్రములను ధరించవలయును. మంగల ద్రవ్యమును తాకి, నమస్కరించి, తరువాత శ్రీహరి, ఇన్జ, శుక్ర, చన్ద, బృహస్పతులను గంధాద్యుపచారములచే పూజించి, హోమమును చేసి, పాయసాన్నములచే బ్రాహ్మణులను తృప్తి పరచవలయును. ఇట్లు లక్ష్మీప్రీతివర్థకమగు వ్రతమును ఆచరించి దారిద్ర్యనాశమును కలిగించి ఇహపరములలో ఆనందించును.

 మాఘపూర్ణిమనాడు నువ్వులను, పత్తిని, గొంగడిని, రత్నములను, కంచుకములను, ఉప్లేషములను, పాదరక్షలను, ధనమును, బ్రాహ్మణునకు దానము చేయవలయును. విత్తానుసారముగా దానము చేసినచో స్వర్గమున ఆనందించును. ఈనాడు విధిపూర్వకముగా శంకరుని పూజించినవారు అశ్వమేధ యాగఫలమునుపొంది విష్ణులోకమున ఆనందించును. ఫాల్గున పూర్ణిమనాడు హోలికాపూజను ఆచరించవలయును. సర్వవిధ కాష్ఠములను,రాళ్ళను, ఒకచోట ప్రోగుచేసి అచట అగ్నిని యధావిధిగా రక్షఘ్నమంత్రములచే హోమము చేసి “అస్పకాభయసంత్రసైః కృత్వా హోం తామలిబాలిశైః, అతస్త్యాం పూజయిష్యామి భూతే భూతిప్రదోభవ" అను మంత్రముచే అగ్నిని జ్వలింపచేసి కాష్ఠములను పడవేసి ప్రదక్షిణముచేసి, గీతవాదిత్రధ్వనులచే ఉత్సవమును జరుపవలయును. ఈ హాలికాయను రాక్షసి ప్రహ్లాదునకు భయమును కలిగించినది కావున ఆరాక్షసిని కాషాదులచే మంగలగీతములచే దహింతురు. దీనిని సంవత్సర దాహమందురు. పక్షాంతరమున కామదాహమందురు. లోకమున స్థితి బహువిధముకదా, పక్షాంతరమున రెండు విడివిడిగా దేవతలు కలరు.

ఇక ఇపుడు అమావాస్యావ్రతమును చెప్పెదను. ఈ వ్రతము పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రము. చైత్రవైశాఖ అమావాస్యలలో పిత్రార్చనము, విత్తానుసారముగా, పార్వణవిధానముతో శ్రాద్దమును జరిపి, ద్వీజభోజనమును, గోదానము సర్వమాస ములందు అమావాస్యలలో బహుపుణ్యప్రదము. జ్యేష్టామావాస్యనాడు సావిత్రీవ్రతము చెప్పబడినది. ఆషాడశ్రావణం భాద్రపదమాసములలో అమావాస్యయందు పితృశ్రాద్ధము, దానము, హోమము, దేవతాపూజలు అక్షయఫలములనొసంగును. భాద్రపద అమావాస్యయందు అపరాహ్లామున తిలక్షేత్రమున పెరిగిన దర్భలను బ్రహ్మమంత్రముచే మంత్రించి, హుంఫట్లచే ఛేదించి అన్ని వేళలో అన్ని కార్యములలో ఉపయోగించవలయును. ఆశ్వయుజామావాస్యనాడు విశేషముగా పితృశ్రాద్దమును, పితృతర్పణమును చేయవలయును. గంగాజలమున గయాస్థలమున చేసినచో మోక్షప్రదము. కార్తీకమావాస్యనాడు దేవాలయములలో గృహములలో, నదీ ఆరామతటాకములలో చైత్యగోష్టాపణములలో దీపదానము, లక్ష్మీపూజ స్వర్ణరౌప్యములతో చేయుట, జయపరాజములలో దూత్యము ఆ సంవత్సర ఫలమును సూచించును. గోవులను శృంగాదులను అలంకరించి, యవస అన్నాది దానములచే నమస్కార ప్రదక్షిణలచే చక్కగా పూజించవలయును. మార్గశీర్షామావాస్యనాడు శ్రాద్ధములచే బ్రాహ్మణ భోజనములచే, బ్రహ్మచర్యాదినియమములచే జపహోమార్చనాదులచే పితృపూజను గావించవలయును. పుష్యమాఘఅమావాస్యనాడు పితృశ్రాద్దము అధిక ఫలమునిచ్చును. కర్ణపాతార్కయుక్తమగుచో గయాదులలో చేయవలయును. ఫాల్గునామావాస్యనాడు కేవలశ్రాద్ధము, బ్రాహ్మణ భోజనము సర్వదాన ఫలము నొసంగును. అమావాస్య సోమవారమున వచ్చిన అధికఫలప్రదము. ఇట్లు నీకు సంక్షేపముగా తిథికార్యములను వివరించితిని. ప్రతి తిథియందు ఇంకనూ విశేషములు కలవు. అవి ఇతరపురాణములలో వివరించబడినవి.

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున ద్వాదశమాసస్థిత పౌర్ణమావాస్యమావాస్యావ్రత కథనమను నూట ఇరువది నాలుగవ అధ్యాయము సమాప్తము.