నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

83 - పంచ ప్రకృతి మన్త్రాది నిరూపణమ్

 శ్రీ శౌనక మహర్షి పలికేను :

ఓ మహాను భావా? సూతమహర్షి| జగదుద్ధార కారక | సనత్కుమార మహర్షిచే చెప్పబడిన మహా తంత్ర విధానమును నాకు చెప్పితీరి. ఈ మహా తంత్ర విధానము తంత్రములందు పురాణము లందు కూడా ఇది లభించదు. మీరు అతి దయాపరులు కావున మాకు చెప్పితిరి. లోకోద్ధరణ తత్పరుడగు నారదుడు సనత్కుమారుని మరల ఏమడిగెను.

సూతమహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తములారా? రాధా కృష్ణ సహస్ర నామమును వినిని నారద మహర్షి జ్ఞానులలో శ్రేష్టుడగు సనత్కుమారుని నమస్కరించి ఇట్లు పలికెను.

మధ్యస్థ రత్న సింహాసన స్థిత యగు రాధికను ధ్యానించి, పుష్పాంజలి సమర్పించి ఉపచారములచే పూజించవలయును. ఆరు లక్షలు మంత్రమును జపించవలయును. దశాంశమును నేయి కలిపిన నువ్వులచే హోమమును చేయవలయును. మాతృకా పీఠమున ఆవరణములచే పూజించవలయును. షట్కోణములందు షడంగములును, బాహ్యములందు అష్టదలమున పూజించవలయును. మాలావతిని, మాధవిని, రత్నమాలను, సుశీలికను, శశికలను, పారిజాతను, పద్మావతిని, సుందరిని క్రమముగా ప్రాచ్యాది దిక్కులందు, విదిక్కులందు పూజించవలయును. తరువాత వెలుపల సాయుధులగు ఇంద్రాదులను పూజించి వినియోగములను సాధించవలయును. రాధా, కృష్ణ ప్రియ, రాసేశ్వరి, గోపీ గణాధిప, నిరుణా కృష్ణపూజ్య, మూల ప్రకృతి, ఈశ్వరి, సర్వేశ్వరి, సర్వపూజ్య, వైరాజు జననీ, వీరందరు పూర్వారి దిక్కులందు అన్ని వైపులా అన్ని వేళలా నన్ను కాపాడుగావుత. ఓ దేవీ| నీవు జగన్మాతవు, సనాతన విష్ణుమాయవు, కృష్ణమాయవు, ఆది దేవివి, కృష్ణ ప్రాణాధికవు, శుభ కరురాలవు. కృష్ణ భక్తి ప్రదురాలవు, మంగల ప్రదురాలవు. అట్టి నీకు నమస్కారము. ఇట్లు ప్రార్థించి, సర్వేశ్వరురాలను స్తుతించి హృదయమున విసర్జన గావించవలయును. ఇట్లు సర్వాద్య, సర్వమంగలయగు రాధా దేవిని సేవించువాడు ఇహమున అన్ని భోగముల ననుభవించి అంతమున గోలోకమును పొందును.

ఓ నారదా? ఇపుడు నీకు మహాలక్ష్మీ పూజా విధానమును చేప్పెదను. ఈ లక్ష్మీ పూజ వలన సాధకుడు భుక్తి ముక్తులను పొందును. “ఓం కమల వాసిన్యై మహాలక్ష్మ్యే స్వాహా" అను మంత్రము సకలాభీష్ట ప్రదము. ఈ మంత్రమునకు నారాయణ ఋషి. జగతీ ఛన్దస్సు. మహాలక్ష్మీ దేవత. ద్వి ద్వివర్ణములచే షడంగ కల్పన చేయవలయును. శ్వేత చంపక వర్ణాభ రత్న భూషణ భూషిత, ఈషద్దాస్య ప్రసన్నాస్య, భక్తాను గ్రహకాతర, రత్నమాలా ధారిణి, కోటి చన్ల సమప్రభయగు లక్ష్మీదేవిని ధ్యానించి పన్నెండు లక్షలు జపించి దశాంశమును పాయసముచే ప్రజ్వలితాన్ని యందు హోమమును చేయవలయును. బిల్వకాష్ఠముచే పూజించవలయును. నవశక్తి యుతమగు పీఠమున అంగములచే ఆవరణములచే పూజించవలయును. విభూతి, ఉన్నతి, కాంతి, సృష్టి, కీర్తి, సన్నతి, వ్యుష్టి, ఉత్కృష్టి, ఋద్ధి అనునవి నవశక్తులు.

ఇచట మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి, షట్కోణములందు షడంగములను, దక్షిణ దిగ్భాగమున గజాననుని, వామ భాగమున మన్మధుని, అష్టదలమున ఉమను, శ్రీని, భారతిని, దుర్గను, ధరణిని, గాయత్రిని, ఉషాదేవిని పూర్వాది దిక్కులందు విదిక్కులందు క్రమముగా పూజించవలయును. పాదప్రక్షాలనోద్యతములగు గంగా యమునలను పూజించవలయును. చామరములను ధరించి శంఖ పద్మనిధులను పూజించవలయును. పశ్చిమ దిగ్భాగమున ఆతపత్రమును ధరించిన వరుణుని పూజించవలయును. చుట్టు రాశులను పూజించి యధాస్థానమున నవగ్రహములను పూజించి, దిగ్వి దిక్కులందు చతుర్ధనములు గల ఐరావతాదులను పూజించవలయును. ఆ వెలుపల లోకపాలులను, వారి వెలుపల వారి అస్త్రములను పూజించి ఆజ్యయుక్తములగు దూర్వలచే ఆయుష్యము కాఱకు హోమమును గావించవలయును. ఆజ్యసిక్తమగు గుడూచినీ ప్రతినిత్యము అష్టోత్తర సహస్రమును ఏడు వారములు హామము గావించినచో నూరు సంవత్సరములు జీవించును. ఘృత మిశ్రితములగు తిలలచే హోమమును గావించినచో దీర్ఘాయుష్యమును పొందును. శరీరారోగ్య సిద్ది కారకు ఆదివారమున ప్రారంభించి పది దినములు నేతిలో తడిపిన జిల్లేడు సమిధలచే హోమమును గావించవలయును. వరిధాన్యముచే ప్రతినిత్యము అష్టోత్తర సహస్రము హోమముగావించినచో త్వరలో గొప్ప సంపద కలుగును. జపా జాజి నారికేల రజస్సులచే నేయి కలిపిన వాటిచే అష్టోత్తర సహస్రమును హోమమును చేయుచు పాయసమును తినుచున్నచో ఒక మండలమున కుబేరుడంతటి వాడగును. గుడ మిశ్రమగు హవిస్సుచే హోమమును గావించినచో అన్నము కలవాడగును. అష్టోత్తర సహస్రము తాంబూల రస సమ్మిశితముగా జపా పుష్పములచే హోమమును గావించి ఆ భస్మమును తిలకముగా ధరించినచో నాలుగు వర్ణముల వారిని మోహింప చేయును. ఓ మునీశ్వరా? ఇట్లు లక్ష్మీదేవిని సేవించువానికి సర్వ సంపదలు కలుగును. మహాలక్ష్మి ప్రసన్నురాలగును. దేహాంతమున విష్ణుధామమును చేరును.

శివలోకమునకు వెళ్ళిన దుర్గాదేవి శివుని ఆజ్ఞను పొంది అచట దివ్యలోకమును నిర్మించేను. ఈ లోకము దేవీలోకమని ప్రసిద్ది చెంది సర్వలోక విలక్షణముగా విలసిల్లెను. ఈ జగన్మాత ఆ లోకమున నుండి తపోనియమము నాశ్రయించేను. దుర్గ పలువిధములైన స్వావతారములను చేయుచున్నది. “ఓం హ్రీం మహాదేవ్యై శ్రీ దుర్గాయై స్వాహా" అనునది దుర్గామంత్రము. వామదేవుడు ఋషి. గాయత్రీ ఛందస్సు. దుర్గతినాశిని ఆదిదేవి యగు దుర్గా దేవత ఓం కారము నుండి ఒక్కొక్క వర్ణముచే హృదయాదిత్రయ న్యాసము నాచరించవలయును. మూడింటిచే కవచమును, రెండింటిచే నేత్రము, అన్నింటిచే అస్త్రమును కల్పించవలయును. మహా మరకత ప్రఖ్య, సహస్ర భుజమండిత, నానా శస్త్ర ధారిణి, తినేత్ర, చన్ద శేఖర, కంకణాంగహార నూపురాద్యాభరణ భూషిత, కిరీట కుండల ధారిణి, యగు దుర్గాదేవిని ధ్యానించవలయును. మంత్రమును ఎనిమిది లక్షలు జపించవలయును. మధుర మిశ్రితములగు నువ్వులచేకాని, పాలచేకాని, అన్నముచే కాని దశాంశమును హోమమును గావించవలయును. నవ పద్మాత్మక దలమున శక్తులను పూజించవలయును. ప్రభా, మాయా, జయా, సూక్ష్మా, విశుద్దా, నందినీ, సుప్రభా, విజయ, సర్వసిద్ధిదా, అనునవి పీఠశక్తులు. ప్రస్వత్రయ ప్లేబరహితములగు జలముచే ఈ శక్తులను పూజించవలయును. “ఓం వజ్రనఖదంష్ట్రాయుధాయ మహాసీంహాయ హుంఫట్ నమ:” అనునది సింహ మంత్రము. ఈ మంత్రముచే ఆసనమును సమర్పించవలయును. మూల మంత్రముచే మూర్తిని కల్పించవలయును. మొదట అంగావరణలను పూజించి పత్రములందు శక్తులను పూజించవలయును. జయ, విజయ, కీర్తి, ప్రీతి ప్రభ, శ్రద్దా, మేధా, శ్రుతి అనునవి స్వనామాద్యక్షరాదికలు. ఈ యెనిమిదింటిని పత్రాగ్రములందర్పించ వలయును. తరువాత క్రమముగా ఆయుధములను పూజించవలయును. శంఖ చక్ర గదా ఖడ్గ పాశాంకుశ శరధనువులను పూజించవలయును. ఆ వెలుపల లోకేశ్వరులను, ఆ వెలుపల వారి ఆయుధములను పూజించవలయును. ఇట్లు జపాదులచే మంత్రము సిద్ధించిన తరువాత తాను కోరిన ప్రయోగములను చేయ వచ్చును. రత్న హేమాది సంయుక్తములు నవఘటములలో నున్న నవకలశములను స్థాపించి మధ్య కలశమున దుర్గాదేవిని, ఇతర కలశము లందు జయాదికలను పూజించవలయును. ఇట్లు గంధ పుష్పాదీకములచే పూజించి రాజునకు ఆ జలముచే అభిషేకము చేయవలయును. అట్లు చేసినచో రాజు శత్రువులను జయించి విజయలక్ష్మిని పొందును. రోగ రహితుడై, దీర్ఘాయుష్మంతుడై సర్వవ్యాధి వర్జితుడగును. గొడ్రాలు అభిషేకించినచో ఉత్తమ పుత్రుని పొందును. ఈ మంత్రముచే అభిమంత్రించిన నేయి క్షుద్ర గ్రహములను తొలగించును. అభిమంత్రించిన భస్మము గర్భిణీ స్త్రీలను ధరింపచేసినచో విశేష ఫలప్రదము. శ్రీ కృష్ణుడు ఆవలించినపుడు వెలువడిన గాలి రాధికా ముఖమున ప్రవేశించినపుడు వీణా పుస్తకధారిణియై పుట్టిన దేవి యొక్క మంత్ర విధానమును సర్వలోకోపకారకమును చెప్పెదను వినుము.

“ఓం శ్రీ మహాదేవ్యై సరస్వత్యై స్వాహా" అనునది ద్వాదశాక్షర మంత్రము. నారాయణ ఋషి. విరాట్చన్దస్సు. మహా సరస్వతీ దేవతా వాగృవముచే షడంగన్యాసము చేసి వర్ణన్యాసమును చేయవలయును. బ్రహ్మ రంధ్రమున ఓంకారమును, భూమధ్యమున శ్రీని ముఖనాసాదివర్ల గుణములందు శ్రీ మొదలగు వర్ణములను న్యాసము చేయవలయును. తరువాత వీణా పుస్తక ధారిణి, కర్పూర కుంద ధవల, పూర్ణ చంద్రోజ్జ్వలానన, హంసాధిరూఢ, ఫాలేన్దు దివ్యాలంకార శోభిత యగు వాగ్దేవిని ధ్యానము చేయవలయును. పది లక్షలు జపించవలయును. దశాంశము తెల్లని పద్మములచే కాని నాగచంపక పుష్పములచే కాని హోమమును చేయవలయును. మాతృకా పీఠమున చేప్పబోవు విధముగా పూజించవలయును. వర్ణాబ్దముచే ఆసనమును సమర్పించవలయును. మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి దేవియొక్క దక్షిణ భాగమున శుభకరమగు సంస్కృత వాగ్దేవిని పూజించవలయును. వామ భాగమున ప్రాకృత వాగ్దేవిని పూజించవలయును. షట్కోణములందు మొదట అంగపూజ గావించి, వెలుపల ప్రజ్ఞాదులను పూజించవలయును. మరల లోకపాలకులను వారి ఆయుధములను బయట పూజించవలయును. ఇట్లు వాగ్దేవిని పూజించినచో సాక్షాత్తుగా వాక్పతి యగును. బ్రహ్మచర్య వ్రతము నవలంబించి, పరిశుద్ధుడై, పరిశుద్ధములైన దంతనఖాదులు కలవాడై స్త్రీల నందరిని దేవతా బుద్దితో భావించుచు ఒక సంవత్సరము పూజించినచో కవిత్వమును పొందును. వేయిమార్లు మంత్రించిన జలమును ప్రతిదినము త్రాగుచు ఒక సంవత్సరము పూజించినచో మహాకవి యగును. ప్రతిదినము ఉరోమాత్ర జలమున నిలిచి మార్తాండ మండలమున నున్న దేవిని ధ్యానించుచు మూడు వేలు జపించినచో నలుబది రోజులలో సిద్ధిని పొంది అసమాన వాగ్వైభవమును పొందును. మధుర మిశ్రితములగు పాలాశ బిల్వ పుష్పములచే కాని, సమిధలచే కాని హోమమును చేసినచో వాక్పతి కీర్తిని పొందును. మధుర మిశ్రితములగు రాజ వృక్ష పుష్పములచే కాని సమిధలచే కాని హోమమును గావించినచో అతులమగు కవిత్వమును పొందును (93-108)

బ్రహ్మకు ప్రియమైన సావిత్రీ మంత్రమును నీకు చెప్పెదను. ఈ మంత్రము నుపాసించియే బ్రహ్మ చరాచరలోకములను . సృజించెను. “శ్రీ మహా సావిత్ర్యై స్వాహా" అనునది అష్టాక్షర మంత్రము. బ్రహ్మ ఋషి గాయత్రీ ఛందస్సు. సర్వదేవతా సావిత్రియగు సావిత్రి దేవత. బ్రహ్మణే నమః, రుద్రాయనమః, విష్ణవే నమః, ఈశ్వరాయ నమః, సదాశివాయ నమః, అనువాటిచే అంగకల్పన చేయవలయును. తప్తకాంచన వర్ణాభ, బ్రహ్మతేజస్సుచే జ్వలించు చున్నది, గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ సహస్ర సమవిగ్రహ, ఈ షద్ధాస్య ప్రసన్నాస్య, రత్న భూషణ భూషిత, వహ్ని శుద్ధాంశుక ధారిణి, భక్తాను గ్రహకాతర, సుఖప్రద, ముక్తిదాయిని, సర్వసంపత్ర్పద, శుభకరి, వేదబీజ స్వరూప, వేద ప్రసూ అయిన సావిత్రిని ధ్యానించ వలయును. త్రికోణోజ్జ్వల కర్ణికా మండలమున ఇట్లు ధ్యానించి, సౌర పీఠమున దీప్తాదినవశక్తులచే దేవిని పూజించవలయును. మూల మంత్రముచే సంకల్పించిన మూర్తియందు దేవిని పూజించవలయును. మూడు కోణములందు బ్రాహ్మి మొదలగు శక్తులను పూజించవలయును. తరువాత ఆ బయట ఉషాది సహితులగు ఆదిత్యాదులను పూజించవలయును. తరువాత కేసరములందు యథావిధిగా షడంగ పూజను గావించి ప్రహ్లాదినిని, ప్రభను, నిత్యను, విశ్వంభరను, విలాసినీ ప్రభావతులను, జయను శాంతను, కాంతిని, దుర్గా సరస్వతులను, విద్యారూపను, విశాలను, ఈశను, వ్యాపినిని, విమలను, తమోప హారిణిని, సూక్ష్మను, విశ్వయోనిని, జయావహను, పద్మాలయను, పరమ, శోభను, బ్రహ్మరూపను అర్చించవలయును. బాహ్యావరణమున బ్రాహ్మి మొదలగు వారిని సలక్షణల నర్చించవలయును. ఆ బాహ్యావరణమున సాయుధులగు ఇంద్రాదుల నర్చించవలయును. ఇట్లు దశావరణలలో దేవులను పూజించవలయును. ఎనిమిది లక్షలు మంత్రమును జపించవలయును. ఎనిమిది వేలు నువ్వులచే హోమమును చేయవలయును. ఇట్లు చేసినచో సర్వపాప వినిర్ముక్తుడై దీర్ఘాయుష్యమును ఆరునెలలలో మహాసంపదను పొందును. బ్రహ్మవృక్ష పుష్పములచే హోమము గావించినచో కోరిన కోర్కెలన్నియూ తీరును. ఇంకనూ ఏమి చెప్ప వలయును. విధి విధానముగా ఉపాసించబడిన సావిత్రి సర్వాభీష్ట వర్షిణి యగును. (109 - 126)

ఇక ఇపుడు నీకు పరమాద్భుతము రహస్యము నరులకు సర్వరక్షా కరమగు సావిత్రీ పంజరమను దానిని చెప్పెదను. వ్యోమకేశాలకొసక్త, సుకిరీట విరాజిత మేఘ భ్రుకుటిలాక్రాంత బ్రహ్మవిష్ణు శివాననా, గురుశుక్ర కర్ణాంత, సోమసూర్యాగ్ని లోచన, ఇడా పింగలికా సూక్ష్మ వాయు నాసా పుటాన్విత, సంధ్యాద్విజోష్ణ పుటితా, లసద్వాగురజిహ్విక, సంధ్యా సూర్యమణి గ్రీవా, మరుద్బాహు సమన్విత, పర్జన్య హృదయా సక్త, వస్వాఖ్య ప్రతిమండల, ఆకాశోదర విభ్రాంత, నాభ్యవాంతర వీధిక, ప్రజాపత్య జఘన, కటీంద్రాణీ సమాశ్రిత, మలయ మేరూరువులతో శోభించునది, సరిద్వరా, జాహ్నవీ కాశికీ జాను, వైశ్వదేవ సంజ్ఞిక, పాదాంఘి నఖలోమాఖ్య భూనాగ ద్రుమలక్షిత, గ్రహరాశి నక్షత్ర యోగాది మూర్తా వయక సంజ్ఞక, తిధిమాస ఋతు పక్షాది సంకేత నిమిషాత్మిక, మాయా కల్పితవైచిత్ర్య సంధ్యాఖ్య ఛేదనోవృత, జ్వలత్కాలానలప్రఖ్య, తటితోటి సమప్రభ, కోటి సూర్యప్రతీకాశ, శశికోటిసుశీతల, సుధామండల మధ్యస్థ, సాంద్రానందామృతాత్మిక, వాగతీత, మనోగమ్యా, వరద, వేదమాత, చరాచరమయి, నిత్య. బ్రహ్మక్షర సమన్వితయగు సావిత్రిని స్వాత్మాది విభేదముచే ధ్యానించి సావిత్రీ పంజర న్యాసమును గావించవలయును. ఈ పంజరమునకు నేను (సనత్కుమార మహర్షి ఋషిని. వికృతి ఛందస్సు. పరమహంస పరబ్రహ్మ రూపమగు ఆది దేవత దేవత. ధర్మార్థ కామమోక్ష ప్రాప్తికి వినియోగించ వలయును. షడంగ దేవతా మంత్రములచే అంగన్యాసమును ఆచరించవలయును. త్రిధామూలముచే వ్యాపకమును ఆచరించవలయును. సాహార గుణ సంయుతయగు పూర్వోక్త దేవతను ధ్యానించవలయును. త్రిపదా, హరిజా, పూర్వముఖి, బ్రహ్మస్త్రసంజ్జిక, చతుర్వింశతి తత్యాఢ్య యగు సావిత్రి పూర్వదిక్కును కాపాడుగాక. చతుష్టద బ్రహ్మదండ, బ్రహ్మాణి, దక్షిణముఖీ షడ్వింశతత్త్వ సంయుక్తో దక్షిణ దిక్కును కాపాడుగాక. పశ్చిమముఖి, పంచపదీ, పంచాశతత్తత్య రూపిణి, బ్రహ్మ శిరోంకితా పశ్చిమ దిక్కును కాపాడుగాక. సౌమ్యాస్య బ్రహ్మతుర్యాఢ్య అధర్వాంగి రసాత్మక, షట్పదా, షష్టితత్య కలాత్మిక ఉత్తర దిక్కును కాపాడుగావుత. పంచాశద్వర్ణ రచిత, నవపాద, శతాక్షరి, వ్యోమా, వేదాంత సంస్థిత, ఊర్థ్వమును కాపాడుగాత విద్యున్నిభ, బ్రహ్మ సంధ్య, మృగారూఢ, చతుర్బుజ, చాపేషు చర్మాసిధరా, ఆగ్నేయ దిక్కును కాపాడుగాక. బ్రాహ్మి, కుమారి, రక్తాంగీ, హంస వాహిని కమండలమును జపమాలను, సుక్ర్సువములను ధరించు గాయత్రి నైఋత దిక్కును కాపాడుగావుత. శుక్లవర్ల, యువతి, వృషవాహిని. కపాల శూల కాక్ష స్రగ్ధరిణి యగు సావిత్రి నాయవ్య దిక్కును కొసాడు గావుత. శ్యామా, వృద్ద వైష్ణవి, గరుడాసన, శంఖ చక్రాభయకర యగు సరస్వతి ఈశాన్య దిక్కును కాపాడు గావుత. చతుర్బుజ, దేవతమాత, గౌరాంగి, సింహవాహన, వరాభయ ఖడ్గ చర్మభుజ ఆధరదిక్కును. కాపాడు గావుత. ఆయా పొర్శములనున్నవారు స్వస్వవాహనాయుధ భూషణ ధారిణులు గ్రహ శక్ష్యంగ సంయుతలై కాపొడుగావుత. మంత్రాధి దేవతారూపలు ముద్రాధిష్ఠాతృ దేవతలు ఆపాద తలమస్తకమును వ్యాపకముగా కాపాడుగావుత. ఇట్లు నీకు సావిత్రీ పంజరమును చెప్పితిని. ప్రతి దినము ఉభయ సంధ్యలలో, విశేషించి జపకాలమున భక్తిచే పఠించు వారికి భుక్తిముక్తులు లభించును.

భూతిదా, భువనా, వాణి, మహా వసుమతి, మహీ, హిరణ్య, జనని, నందా, సవిసర్గా, తపస్విని, యశస్విని, సతీ, సత్యా, వేదివిల్, చిన్మయి, శుభ, విశ్వా, తుర్యా, వరేణ్య, నిసృణీ, యమునా, భువా, మోదా, దేవీ, వరిష్ణా, ధీ, శాంతి, మతి, మహి, ధిషణ, యోగిని, యుక్త, నదీ, ప్రజ్ఞా, ప్రచోదిని, దయా, యామిని, పద్మా, రోహిణి, రమణి, జయ, సేనాముఖి, సామమయి, జగలా, దోష వర్జిత, మాయా, ప్రజ్ఞా, పరా, దోర్రీ, మానినీ, పోషిణి, క్రియా,జ్యోత్స్నా, తీర్థమయీ, రమ్యా, సౌమ్యా, అమృతమయి, బ్రాహ్మీ, హైమి, భుజంగి, వశినీ, సుందరీ, వనీ, ఓంకార హాసినీ, సర్వా, సుధా, షడ్గుణవతీ, మాయా, స్వధా, రమా, తన్వీ, రిపుఘ్నీ, రక్షణీ, సతీ, హైమా, తారా, విధుగతి, విషఘ్ని, వరాననా, అమరా, తీర్థదా, దీక్షా, దుర్ధర్షా, రోగ హారిణి, నానా పాపనృశంసఘ్నీ, షట్పదీ, వజ్రణీ, రణీ, యోగిని, విమలా, సత్యా, ఆబాలా, బలదా, జయ, గోమతీ, జాహ్నవీ, రజ్వీ, తపనీ, జాతవేదసా, ఆచిరా, వృష్టిదా, షైయా, ఋతతంత్రా ఋతాత్మికా, సర్వకామదుఘా, సౌమ్యా, భవాహంకారవర్జితా, ద్విపదా, త్రిపదా, చతుష్పదా, షట్పదా, అష్టాపదీ, నవపదీ, సహస్రాక్షాక్షరాత్మిక, ఇవి సావిత్రీ దేవి యొక్క అష్టోత్తర శత నామములు. ఈ అష్టోత్తర శతనామములను ప్రతి దినమున భక్తిచే పఠించువారు దీర్గాయుష్మంతులు, సుఖము గలవారు, పుత్రవంతులు, విజయము గలవారు, వినయము గలవారు అగుదురు. ఇట్లు నీకు పంచ ప్రకృతి లక్షణమును చెప్పితిని. సమస్త కామ ప్రదమగు మంత్రమును అరాధనా సహితముగా చెప్పితిని.

ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున పంచప్రకృతి మంత్రాది నిరూపణమను ఎనుబది మూడ - అధ్యాయము సమాప్తము.