నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

 7 - గంగామాహాత్మ్యమ్

నారద మహర్షి పలికేను :- ఓ మునిశ్రేష్ఠా ! సగరవంశమున రాక్షసభావమునుండి విముక్తు డైన వాడెవడు ? సగరుడెవరు ? అదియంతయు నాకు వివరించుము.

సనక ఉవాచ :-

 సనకమహర్షి పలికెను :- ఓ మునిశ్రేష్ఠా ! ఉత్తమమైన గంగా మాహాత్మ్యమును వినుము. గంగా జలస్పర్శ మాత్రముననే సగర వంశము పావనమైనది. అన్ని లోకములలో ఉత్తమమైన విష్ణులోకము చేరినది. సూర్యవంశమున వృక మహారాజపుత్రుడగు బాహువనువాడుండెను. బాహువు ధర్మతత్పరుడై ధర్మ బద్దముగా పృథివిని అనుభవించుచుండెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, చివరికి జంతువులు కూడా తమతమ ధర్మముల నాచరించునట్లు బాహువు పరిపాలించుటచే బాహువు సర్వప్రాణులకు ప్రభువాయెను. ఏడు ద్వీపములలో ఏడు . అశ్వమేధ యాగములను చేసెను. గోవులను, భూమిని, బంగారమును, వస్త్రములను దానము చేసి బ్రాహ్మణులను తృప్తి పరిచెను. రాజనీతిచే శత్రువులను శాసించెను. ఇతరుల బాధలను తీర్చిన తనను కృతార్థునిగా తలచేను. బాహువుగా రాజ్యమున సుఖముగా నున్న ప్రజలు సుందరులైన చందనములను దివ్యములైన భూషణములను ధరించి ఆనందముగా నుండిరి. దున్నకనే పండెడు భూమి, పుష్పములతో ఫలములతో నిండుగా ఉన్న చెట్లు ఉండెను. సకాలమున ఇంద్రుడు. భూమి మీద వర్షించెను. అధర్మము పూర్తిగా తొలగినందున ధర్మమే ప్రజలను కాపాడుచుండెను.

కొంతకాలమునకు ఒక సమయమున ఆ బాహురాజమనసులో లోభము వలన జనించిన అసూయతో కూడిన గొప్ప అహంకారము కలిగెను. నేను ప్రజలందరికి ప్రభువును. ప్రజలందరిని కాపాడువాడను. బలవంతుడను. నేను - మహాయాగములను చేసినవాడను. నాకంటే పూజించదగినవాడు ఇతరుడెవడున్నాడు ? నేను వివేకము కలవాడను. ఐశ్వర్యము కలవాడను. శత్రువులనందరిని గెలిచితిని. వేద వేదాంగతత్త్వములను తెలిసినవాడను. నీతి శాస్త్ర విశారదుడను. నన్నెవరూ జయించలేరు. నా ఐశ్వర్యమునకు లోటులేదు. ఈ భూలోకమున నా కంటే గొప్పవాడెవడున్నాడు ? ఇట్లు అహంకారము కలిగిన ఆ రాజులో అసూయ పుట్టెను. అసూయ వలన కామము కలిగెను. ఇట్లు అహంకారము, అసూయ, కామము ఈ మూడున్న చో మానవుడు వినాశమార్గమును ప్రవేశించును. యౌవనము, ఐశ్వర్యము, అధికారము, అవివేకము. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటున్ననూ అనర్థమును కలిగించును. ఇక నాలుగున్నచో ఏమి చెప్పవలయును ! లోకమునకు విరోధమును కలిగించు గొప్ప అసూయ ఆ రాజులో కలిగెను. ఈ అసూయ తన దేహమును అన్ని - సంపదలను నశింపచేయును. అసూయ కలవానికి సంపద ఉన్నచో పొట్టులో (ఊకలో) పడిన అగ్నికి వాయువు తోడైనదని భావించుము. ఆసూయ కూడిన మనసు కలవారికి, బూటకపు ఆచారమును నటించువారికి, కఠినముగా మాటలాడువారికి ఇహమున, పరమున కూడ సుఖముండదు. అసూయ కలవారికి, ఎపుడూ కఠినముగా మాట్లాడు వారికి ప్రియులు, పుత్రులు, బంధువు కూడా శత్రువులే అగుదురు. పరస్త్రీ, విషయములో మనసున అభిలాష కలిగినచో ఆ యభిలాష తన సంపద్వినాశమునకు గొడ్డలి వంటిదని తెలియుము. తన మేలును చేతులారా చెడగొట్టు కొనువాడు ఇతరుల అభివృద్ధిని చూసి అసూయ చెందును. మిత్రులకు, సంతానమునకు, గృహమునకు, క్షేత్రములకు, ధనధాన్యపశువులకు కూడా హానికోరువాడే అసూయకలవాడగును. (అసూయ కలవాని మిత్రాదులకు కూడ హానిచేకూరునని భావము)

అహంకారము, అసూయ గల బాహునకు హైహయవంశము వారు, తాల జంఘరాజులు శత్రువులుగా ఏర్పడిరి. శ్రీహరి అనుకూలుడుగా ఉన్నవానికి సౌభాగ్యము పెరుగును. శ్రీహరి విముఖుడైనచో సౌభాగ్యము క్షీణించును. శ్రీమన్నారాయణుని కరుణాకటాక్షవీక్షణమున్నంత వరకే పుత్రపౌత్రధనధాన్యగృహాదిసంపదలు నిలుచును. మూర్ఖులు, మూగవారు, గుడ్డివారు, చెవిటీవారు, బుద్దిహీనులు కూడా శ్రీనివాసుని కటాక్షము సోకినచో శూరులు, వివేకవంతులు కొనియాడదగిన వారు అగుదురు. అసూయాద్వేషములు పుట్టి వాని సౌభాగ్యము క్షీణించిపోవును. జంతువులను ద్వేషించినచో విశేషముగా క్షయమగును. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ద్వేషించువానికి అన్ని శ్రేయస్సులు నశించును. అసూయను పెంచుకొనిన వానికి శ్రీమహావిష్ణువు విముఖుడగును. అతని ధనము, ధాన్యము, సంపదలు, భూమి నశించును. ఇది నిశ్చయము. అహంకారము వివేకమును నశింపచేయును. వివేకము నశించిన వారికి ఆపదలు సంభవించును. కావున అహంకారమును విడువవలయును. అహంకారమున్నవానికి త్వరగా నాశము కలుగును. కావున అసూయనిండిన బాహురాజునకు శత్రువులతో ఒకనెల రోజులు ఘోరముగా యుద్దము జరిగెను. హైహయలు, తాలజంఘలు బాహురాజును యుద్ధమున ఓడించిరి.

 అట్లు శత్రువులచే పరాజితుడైన ఆ బాహువు గర్భవతియైన తన భార్యతో అరణ్యమునకు వెళ్ళెను. అచట ఒక సరస్సును చూచి సంతోషించేను. అసూయ నిండియున్న మనసుగల ఆ బాహుమహారాజు మనోగత భావమును ఆ సరస్సు వద్ద ఉన్న పక్షులు చూచి ఆకుల మాటున దాగియుండి - “ఇది చాలా కష్టము. ఇచటికి ఒక భయంకర రూపము వచ్చినది. త్వరగా మీ మీ నివాసములకు వెళ్ళుడు” అని పలికినవి. ఇది చాలా గొప్ప చిత్రము. ఆ బాహుమహారాజు తన భార్యలతో ఆ సరస్సున స్నానమాడి, సంతోషముతో నీరుత్రాగి ఆనందమునిచ్చు చెట్టునీడను చేరెను. ఆ బాహుమహారాజు అరణ్యమునకు వెళ్ళుచున్నపుడు అతనిచే పరిపాలించబడిన ప్రజలు అతని దుర్గుణములను లెక్కించుచు వ్యర్థము, వ్యర్థము అని నిందించిరి. ఎవరైనను మానవుడు గుణవంతుడుగానున్నపుడు అందరూ కీర్తింతురు. కాని అతనే దుర్గుణమును అలవరుచుకొనిన ఎన్ని సంపదలున్ననూ జనులు నిందింతురు. ఈ లోకమున అపకీర్తితో సాటియైన మృత్యువు మఱియొకటిలేదు. బాహుమహారాజు అరణ్యమునకు వెళ్ళగానే అతని రాజ్యములోని ప్రజలు గ్రీషర్తువు గడిచినపుడు సంతోషించినట్లు సంతోషించిరి. ఓ బ్రాహ్మణోత్తమా ! ఇట్లు బాహుమహారాజు అందరిచే పలువిధములుగా నిందించబడి చచ్చిన వాని వలె అడవిలో యుండెను. లోకమున తాను సంపాదించిన కీర్తిని తన పనులచే హరింపచేసుకొనెను. అపకీర్తితో సాటియగు మృత్యువు మరియొకటుండదు. కోపముతో సాటి వచ్చు శత్రువు మరియొకడుండడు. ఇతరులను నిందించుటతో సమానమైన పాపము మరియొకటి లేదు. మోహముతో సమానమైన మద్యము ఇంకొకటి లేదు. అసూయతో సాటివచ్చు అపకీర్తి, కామముతో సాటియైన అగ్ని, రాగముతో సమానమైన పాశము, సంగముతో సాటివచ్చు విషము మరియొకటిలేదు. అత్యంతదుఃఖముతో బాహువు ఇట్లు విలపించి మానసిక పరితాపము వలన శరీరము జీర్ణించి వృద్ధత్వమును పొందెను.

చాలాకాలము గడచిన తరువాత ఆ బాహువు వ్యాధిగ్రస్తుడై ఔర్వమహర్షి ఆశ్రమ సమీపమున మరణించెను. గర్భవతిగానున్న బాహువు చిన్నభార్య చాలా కాలము పలు విధములుగా విలపించి సహగమనము చేయుటకు నిశ్చయించుకొనెను. ఎండు కట్టెలను తీసుకొనివచ్చి చితిని పేర్చి మిక్కిలి దుఃఖముతో భర్త దేహమును చితి పై పరుండబెట్టి తాను చితిని ఆరోహించుటకు సిద్దపడెను. ఇంతలో జ్ఞాని తేజోనిధియైన ఔర్వమహర్షి తన దివ్యసమాధిచే దీనినంతటిని తెలుసుకొనెను. అసూయలేని మహానుభావులైన మునీశ్వరులు త్రికాలజ్ఞులు కావున జ్ఞాననేత్రముతో భూతభవిష్యద్వర్తమానములను తెలియుదురు. తపస్సులచే తేజోరాశి పుణ్యమూర్తి అయిన ఔర్వమహర్షి బాహుప్రియురాలున్న ప్రదేశమునకు వచ్చెను. ఔర్వమహర్షి చితి మీదికి చేరుటకు సిద్ధముగానున్న బాహుభార్యను చూచి ధర్మమూలములైన కొన్నిమాటలను చెప్పెను.

 ఔర్వమహర్షి పలికెను :- ఓ మహారాజపత్నీ ! సాధ్వీ ! ఇంత సాహసమును చేయకుము. నీ గర్భములో శత్రుసంహారము చేయువాడైన చక్రవర్తి యున్నాడు. బాలపుత్రులు గల స్త్రీ, గర్బవతి, రజస్వలకాని స్త్రీ, రజస్వలగా ఉన్న స్త్రీ సహగమనము. చేయరాదు. బ్రహ్మహత్యాదిపాపములు చేయువానికి, కపటికి, నిందించువానికి ప్రాయశ్చిత్తమున్నది కాని గర్భస్థ శిశువును హత్యచేసిన వారికి నిష్కృతిలేదు. నాస్తికునికి, కృతఘ్నునికీ, ధర్మమును పేక్షించువానికి, విశ్వాసఘాతకునికి నిష్కృతిలేదు. కావున ఈ మహాపాపమును చేయతగవు. ఇపుడు నీకు కలిగిన దుఃఖము తొలిగిపోవును. ఇట్లు ఔర్యమహాముని మాటలను వినిన ఆ సాధ్వి ఆ ముని అనుగ్రహమున్నదని విశ్వసించి భర్తపాదములను పట్టుకొని మిక్కిలి దుఃఖముతో విలపించెను. సర్వశాస్త్రార్థములను తెలిసిన ఔర్వమహర్షికూడా ఆమెతో మరల ఇట్లనెను. ఓ రాజపుత్రీ ! నీవు రోదించకుము. ముందు సంపదలను పొందగలవు. కన్నీరును విడువకు. సజ్జనులు మొదటచేయవలసిన పని పేత దహనము. కావున దుఃఖమును విడిచి ఇపుడు ఉచితమైన పనిని చేయుము. పండితుడైనను, మూర్ఖుడైనను, దరిద్రుడైనను, శ్రీమంతుడైనను, మంచివానియందు, చెడువాని యందును మృత్యువు ఒక్కతీరుగానే ప్రవర్తించును. నగరమున కాని అరణ్యమున కాని మృత్యువు ఒకేతీరుగా వచ్చును. ఈ . విషయమున దైవము ప్రబలము. పూర్వజన్మలో చేసిన కర్మనే ఈ లోకమున అనుభవింతురు. ఏదో సాకును చెప్పు మానవులు ఎట్లు భావించిననూ ఈ విషయమున దైవమే కారణము. గర్భములో కాని, బాల్యమున కాని, యావనమున గాని, వార్థక్యమున కాని ప్రాణులు మృత్యువశులు కావలసినదే. కర్మవశముననున్న ప్రాణులను గోవిందుడే కాపాడును. గోవిందుడే సంహరించును. నిమిత్తమాత్రమైన ప్రాణుల పై అజ్ఞానులు నిందలు వేతురు. కావున దుఃఖమును విడిచి స్వస్తురాలవు కమ్ము. భర్తకు అంత్యక్రియలను చేసి వివేకముతో స్థిరముగా నుండుము. ఈ శరీరము వేలకొలది వ్యాధులకు దుఃఖములకు నిలయము. కర్మపాశముతో నియమించబడి సుఖముగా తోచుచు బహదుఃఖములను కలిగించును. ఇట్లు ఓదార్చి ఆ సాధ్వితో అంత్యక్రియలను చేయించెను. దుఃఖమును విడిచిన ఆ సాధ్వి ఔర్వమహర్షికి నమస్కరించి ఇట్లు పలికెను.

 “ఓ మహానుభావా! సత్పురుషులు ఇతరుల హితము కొఱకు మాత్రమే తాము ఫలములనాశించెదరు. చెట్లు తమ అనుభవము కొఱకు పండ్లను కలిగియుండునా ? ఇతరుల దుఃఖమును తెలుసుకొని మంచిమాటలతో ఓదార్చువాడే ఇతరుల హితమును చేయువాడు కావున ఆతనే విష్ణుస్వరూపుడు. ఇతరుల దుఃఖమును చూచి దుఃఖించువాడు, ఇతరుల ఆనందమును చూచి ఆనందించువాడే జగన్నాథుడు. నరరూపమును ధరించిన శ్రీహరియే. సత్పురుషులు - అభ్యసించిన శాస్త్రములు ఇతరుల దుఃఖమును తొలగించుట కొఱకే. అందరి దుఃఖములను నశింపచేయుటకే యని సత్పురుషులు చెప్పుచుందురు. సత్పురుషులు తిరుగాడు చోట దుఃఖము బాధించదు. సూర్యుడున్నచో చీక టెట్లుండును ? ఇట్లు పలుకుచు ఆ బాహుమహారాజు చిన్నభార్య తన భర్తకు అంత్యక్రియలను ఆ సరస్సు తీరమున ముని చెప్పిన విధముగా పూర్తి చేసెను. ముని అక్కడ ఉండగనే బాహుమహారాజు చితా మధ్యమునుండి దివ్యరూపముతో బయలు వెడలి ఇంద్రుని వలె ఉత్తమ విమానము నధిరోహించి ,ఔర్వమహర్షికి నమస్కరించి పరమధామమును చేరెను. మహాపాతకములు చేసినవారైనను ఉపపాతకములు చేసినవారైనను మహాత్ముల చూపు సోకినచో పరమపదమును చేరెదరు. మృతుని దేహమును కాని, భస్మము కాని, చివరికి ధూమము కాని పుణ్యాత్ముడు చూచినచో ఉత్తమ గతిని పొందును. ఇట్లు భర్తకు అంత్యక్రియలను పూర్తి చేసి సపత్నితో కలిసి శార్వమహర్షి ఆశ్రమమునకు వెళ్ళి ఆ మహర్షిని సేవించుచుండెను.

 ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగా మాహాత్మ్యమను ఏడవ అధ్యాయము సమాప్తము.