నారద మహా పురాణము - పూర్వార్థము
6 - గంగామాహాత్మ్యమ్
సూత మహర్షి పలికెను :- భగవద్భక్తిమాహాత్మ్యమును విని సంతోషించిన నారదమహర్షి మరల జ్ఞానవిజ్ఞానసంపన్నుడైన సనకమహర్షిని ఇట్లు అడిగేను.
నారదమహర్షి పలికెను :- ఓ శాస్త్రార్థపారగా ! మిక్కిలి దయతో నాకు అన్ని క్షేత్రములలో ఉత్తమ క్షేత్రమును గూర్చి, అన్ని తీర్థములలో ఉత్తమ తీర్థమును గూర్చి సత్యమును చెప్పుము.
సనకమహర్షి పలికేను :- ఓ బ్రాహ్మణోత్తమా ! పరమరహస్యము సర్వసంపదలను ప్రసాదించునది, దుస్స్వప్నములను నశింప చేయునది, పుణ్యకరము, ధర్మమును కలిగించునది, పాపములను హరించునది, శుభకరము, దుష్టగ్రహములను నివారించునది అయిన ఈ విషయము మునులందరూ వినదగినది. అన్ని రోగములను నివారించునది, ఆయుష్యమును పెంచునది. అన్ని క్షేత్రములలో ఉత్తమ క్షేత్రము, అన్ని తీర్థములలో ఉత్తమ తీర్థము గంగాయమున సంగమ స్థలమగు ప్రయాగ అని - పరమరులందరూ చెప్పెదరు. తెలుపు నలుపు నీరు గల ఈ ప్రదేశమును, తీర్థమును, బ్రహ్మ మొదలగు దేవతలు, మునులు, మనువులు పుణ్యమును కోరి సేవింతురు. విష్ణుపాదమునుండి పుట్టినది కావున గంగ పుణ్యనది. సూర్యుని వలన పుట్టినది, యమునానది. ఆ రెంటి కలయిక - అన్ని శుభములను చేకూర్చును. తలచిన వారి తాపములను తొలగించు గంగ అన్ని నదులలో ఉత్తమమైనది. అన్ని పాపములను నశింపచేయునది. అన్ని ఉపద్రవములను హరింపచేయునది. సముద్రము వరకు వ్యాపించియున్న భూమండలమున నున్న. అన్ని క్షేత్రములలో పరమ పవిత్రమైన క్షేత్రము ప్రయాగ క్షేత్రము. ఈ ప్రయాగ క్షేత్రముననే బ్రహ్మ యజ్ఞములతో శ్రీమన్నారాయణుని పూజించెను. అట్లే మునులందరూ పలు విధములైన యజ్ఞముల నాచరించిరి.
ఈ భూమండలమున నున్న సమస్త పుణ్యతీర్ణాభి షేకము గంగా బింద్వభి షేకములోని 16 వ అంశతో కూడా సమానము కాదు. నూరు యోజనముల దూరములో (800 ల మైళ్ళు) నున్నవాడు కూడా గంగా గంగా అని గంగా సొమమును స్మరించినచో పాపములనుండి విడివడునన్న గంగాస్నానము చేసినవాని గూర్చి ఏమి చెప్పవలయును ? విష్ణుపాదమునుండి పుట్టి, శంకరుని శిరస్సున నిల్చిన గంగానదిని దేవతలు మునులు కూడా సేవింతురు. ఇక పామరుల విషయమేమి ? గంగానది యొక్క ఇసుక (మట్టి) లలాట భాగమున ధరించినచో అక్కడనే శివుని లలాటమున అర్థచంద్రునికి క్రింది భాగమున ప్రకాశించు మూడవ నేత్రముండునునని తెలియుము. గంగానదిలో మునిగి స్నానము చేయుట గొప్ప పుణ్యమును ప్రసాదించును. గంగాస్నానము దేవతలకు కూడా దుర్లభము. గంగాస్నానము విష్ణు సారూప్యమును ప్రసాదించును. ఇంతకంటే ఎక్కువగా చెప్పవలసినదేమున్నది. గంగానదిలో స్నానము చేసినచో పాపులు కూడా అన్ని పాపములను బోనాడి మహావిమానము నధిరోహించి పరమ పదమును పొందెదరు. గంగానదిలో స్నానము చేసినవారు వేల పిత్సకులములను మాత్సకులములను ఉద్దరించి విష్ణులోకమును చేరెదరు. గంగను స్మరించినవాడు అన్ని తీర్థములలో స్నానము చేసినవాడే. అన్ని పుణ్య క్షేత్రములలో నివాసము చేసినవాడే. ఈ విషయమున సంశయముతో పనిలేదు. గంగానదిలో స్నానమాడినవానిని దర్శించిన పాపి కూడా స్వర్గమును పొందును. గంగాజలమును తాకినపోడు దేవతలకు కూడా అధిపతి యగును. తులసీవృక్ష మూలమున ఉన్న మట్టి, బ్రాహ్మణ పాదమున ఉన్న మట్టి, గంగా నదిలోని. మట్టి జనులకు అచ్యుత సారూప్యమును ప్రసాదించును.
గంగానది, తులసి, స్థిరమైన విష్ణుభక్తి మానవులకు మిక్కిలి దుర్లభములు. అట్లే ధర్మమును బోధించు వానియందు భక్తి కలుగుట కూడా దుర్లభమే. సద్ధర్మమును బోధించువాని పాదధూళిని, గంగనుండి వచ్చిన మృత్తికను, తులసిమాల మృత్తికను భక్తితో శిరసున దాల్చినవాడు విష్ణులోకమునకేగును. “నేనెపుడు గంగానదికి వెళ్లేదను ? ఎపుడు గంగానదిని చూచెదను”- అని మనసులో పరితపించువాడు కూడా విష్ణులోకమును చేరును. గంగా మహాత్మ్యమును కొన్ని వందల సంవత్సరములు శ్రీమహావిష్ణువునకు కూడా చెప్ప శక్యముకాదు. ఇక ఇతరులేమి చెప్పగలరు ? ఈ మాయ ప్రపంచమునంతటిని మోహింప చేయుచున్నది. ఎంత ఆశ్చర్యము. గంగానామమున్ననూ లోకులు నరకమునకు వెళ్ళుట ఎంత ఆశ్చర్యము ! గంగా నామము, తులసీ నామము, హరికథలను చెప్పువారియందు భక్తి సంసార దుఃఖమును సమూలముగా తొలగించును. గంగా అను రెండక్షరములను ఒక్కమారు పలికినను అన్ని పాపములు తొలగి విష్ణులోకమును పొందును. గంగానదిలో మూడు యోజనములు పయనించినవాడు అన్ని పాపములను బోనాడి సూర్యలోకమును చేరును. పరమపవిత్రమైన ఈ గంగానదిని మేషతులామకరలలో సూర్యుడున్నప్పుడు సేవించినచో సమస్త జగత్తును పావనము చేయును. గోదావరి, భీమరథీ, కృష్ణ, రేవ, సరస్వతి, తుంగభద్ర, కావేరి, కాళింది, బాహుద, నేత్రవతి. తామ్రపర్ణి సరయూ మొదలగు పుణ్యతీర్థము లన్నింటిలో ప్రధానమైనది గంగానది.
సర్వగతుడైన శ్రీమహావిష్ణువు జగత్తునంతటిని వ్యాపించియుండునట్లు ఈ జగత్తునంతటిని వ్యాపించియున్న గంగ అన్ని పాపములను నశింపచేయును. జగత్తును ధరించు గంగానది స్నానపానాదులతో జగత్తును పావనముచేయును. కావున పావనమైన గంగనెందుకు సేవించరు? వారణాసి అన్ని తీర్థములలో ఉత్తమతీర్థము, అన్ని క్షేత్రములలో ఉత్తమ క్షేత్రము. దేవతలందరిచే సేవించబడునది. చెవులున్నవారందరి చెవులలో కాశీనామమును చాలామార్లు విన్న చెవులే చాల శాస్త్రములను విన చేవులగును. కాశీనామమును నిశ్చల మనస్సుతో స్మరించువారు అన్ని పాపములను త్రోసి శివలోకమును చేరెదరు. నూరు యోజనముల దూరమున నున్నవాడు కూడా భక్తితో కాశీనామమును స్మరించినచో బహుపాతకములున్నవాడైనను నాశములేని లోకమును చేరును. ప్రాణములు పోవు సమయమున కాశీనామమును స్మరించువాడు పాపములను నశింప చేసుకొని శివలోకమును చేరును. కాశీస్మరణము వలన వచ్చిన పుణ్యమును స్వర్గమున అనుభవించి తరువాత పృథివికి చక్రవర్తి అయి కాకిని చేరి ముక్తిని పొందును. వారాణాసీ గుణములను ఏమని చెప్పవలయును. కాశీనామమున తలచిననూ ధర్మార్థకామమోకలను పురుషార్థ చతుష్టయము అందుబాటులో ఉండును. ఇంతటి మహిమ గల వారాణాసి కంటే గంగా యమునా సంగమము ఉత్తమమైనది. ఈ సంగమమును చూచినంతనే ఉత్తమ గతిని పొందెదరు.
మకరసంక్రమణ కాలమున గంగానదిలో ఏ ప్రాంతమున స్నానము చేసినను, గంగా జలపానము చేసిననూ స్వర్గము లభించును. ఎల్లప్పుడు గంగను ధరించుచున్నందుననే శంకరుడు లోకమునకు శుభములను కలిగించగలుగుచున్నాడు. లింగ రూపమును ధరించి గంగాభి షేకము చేయుచున్నాడు. అటువంటి గంగా మహాత్మ్యమును ఎట్లు వర్ణించగలము. లింగమే హరీ రూపమును ధరించును. హరియే లింగ రూపమును ధరించును. ఈ రెండు రూపములకు ఏ మాత్రము భేదములేదు. భేదమును చెప్పువాడు దుష్టబుద్దియే. హరి శంకరనామలతో నుండేడు దేవులు ఆద్యంతములు లేనివారే. అజ్ఞాన సముద్రమున మునిగిన పాపులు. వారిద్దరికీ భేదమును చేప్పెదరు. జగదీశ్వరుడు, అన్ని కారణములకు కారణమైన ఆదిదేవుడైన ప్రభువే యుగొంతకాలమున రుద్రరూపముతో ఈ జగత్తును సంహరింపచేయును. ఆ గుద్రుడే మరల విష్ణురూపముతో సమస్త ప్రపంచమును కాపాడును. బ్రహ్మరూపమున ప్రపంచమును సృష్టించును. దీనిని హరుడే స్వయముగ సంహరించును. హరిహరులలో బ్రహ్మలో భేదమును చూచువాడు, చెప్పువాడు నరకమును పొందును. హరిని హరుని బ్రహ్మను ఏకరూపముగా చూచువాడు పరమానన్దమును పొందునని శాస్త్రనిర్ణయము. ఆదిలేనివాడు సర్వజ్ఞుడు జగత్తును సృష్టించువాడు, ప్రభువు అయిన పరమాత్మలో లింగరూపియైన జనార్దనుడు అంతర్లీనముగా ఉన్నవాడే.
కాశీ విశ్వేశ్వర లింగమును జ్యోతిర్లింగమందురు. ఆ జ్యోతిర్లింగమును దర్శించినవారు పరంజ్యోతిని చేరెదరు. మూడులోకములను పవిత్రము చేయు కాశీని ప్రదక్షిణము చేసినవారు ఏడు ద్వీపములతో సముద్రములతో పర్వతములతో కూడియున్న భూమిని ప్రదక్షిణము చేసిన వారగుదురు. ధాతురూపము, మద్రూపము, పాషాణరూపము, చిత్రరూపము అయిన శివుని ప్రతిమలు, విష్ణువు ప్రతిమలు పరమపావనములు. ఆ ప్రతిమలలో శ్రీహరి సన్నిహితముగా నుండును. తులసీతోటలోను, పద్మములతోటలోను పురాణ పఠనముచోట శ్రీహరి సన్నిహితుడై యుండును. పురాణసంహితను చెప్పువారు సాక్షాత్తు శ్రీహరియే అని అనబడును. పురాణమును చెప్పవోరియందు భక్తి నిలుపువారికి ప్రతినిత్యము గంగాస్నానము చేసిన ఫలితము లభించును. పురాణశ్రవణము నందలి భక్తి గంగాస్నానముతో సదుము. పురాణమును చేప్పుపొరి యందున్న భక్తి ప్రయాగతో సమానము. సంసారసాగరములో మునిగియున్న జగత్తును పురాణ ధర్మములను చెప్పుచు ఉద్ధరించువారు సాక్షాత్తు శ్రీహరియే అని కీర్తించబడుదురు. గంగతో సాటివచ్చు తీర్థము లేదు. తల్లితో సాటివచ్చు. గురువు లేడు. విష్ణువుతో సాటివచ్చు దైవము లేదు. గురువును మించిన తత్వము లేదు. నక్షత్రములలో చంద్రునివలె వర్ణములలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. నదులలో సముద్రము వలె గంగానది ఉత్తమమైనది. శాంతితో సాటివచ్చు బంధువు, సత్యమును మించిన తపస్సు, మోక్షమును మించిన లాభము గంగతో సాటివచ్చు నది లేదు.
గంగానామము పరమ పవిత్రమైనది. పాపారణ్యమునకు దావాగ్నివంటిది. సంసారమను వ్యాధిని హరించగలది. కావున ప్రయత్నముతో సేవించదగినది. గాయత్రీ గంగ అను ఈ రెండు సర్వపాపములను హరించగలవి. ఈ రెంటియందు భక్తి లేనివానిని పతితునిగా తెలియుము. గాయత్రి ఛందోమాత, గంగ లోకమాత, ఈ రెండు సర్వపాపములను నశింపచేయును. గాయత్రి ప్రసన్నమైనచో గంగ ప్రసన్నమగును. ఈ రెండు విష్ణుశక్తితో కూడియుండును. కావున అన్ని కోరికలను తీర్చును. ఈ రెండు ధర్మార్థకామములను ఫలములను ఇచ్చును. అన్ని లోకములను అనుగ్రహించుటకు ప్రవర్తించుచున్నవి. గాయత్రీ జాహ్నవీ అను ఈ రెండు నరులకు పరమ దుర్లభములు. ఇట్లే సాత్త్వికమైన విష్ణుభక్తి, తులసీ భక్తికి కూడా దురభములే. మహానుభావురాలేన గంగను స్మరించినచో పాపములను నశింపచేయును. దర్శించినచో హరిలోకము లభించును. గంగాజలమును పానము చేసినచో విష్ణుసారూప్యమును ప్రసాదించును. గంగానదిలో స్నానము చేసినవాడు విష్ణులోకమును పొందును. జగత్తును ధరించువాడు, సనాతనుడు వాసుదేవుడు అయిన శ్రీమన్నారాయణుడు గంగాస్నానము చేయువారు కోరిన పురుషార్థములనిచ్చును. గంగాజలబిందువును శిరసున ధరించినవాడు అన్ని పాపములను బోనాడి పరమ పదమును చేరును. గంగాజలబిందువును సేవించినందువలననే సగర వంశమున పుట్టిన సౌదాసుడు రాక్షసభావమును విడిచి మోక్షమును పొందెను.
ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగామాహాత్మ్యమను ఆరవ అధ్యాయము సమాప్తము.
