నారద మహా పురాణము - పూర్వార్థము
69 - మన్త్ర విధాన నిరూపణమ్
సనత్కుమార మహర్షి పలికెను :- ఇపుడు వేదమూర్తియగు సూర్య భగవానుని మంత్రవిధానమును చెప్పెదను. సూర్యమంత్రములను ఆరాధించినవారు భూమండలమున సర్వాభీష్టములను పొందెదరు. రోచనతో కూడిన తారము మేధినేత్రయుతమగు రతి, సంసర్గలు వామకర్ణాడ్యుడగు భృగువు, వణ్యాసనుడగు మరుత్ శేషము దిత్యుడని, అష్టాక్షరమంత్రము భుక్తి ముక్తులను ప్రసాదించును. ఈ మంత్రమునకు మునీ దేవభాగుడు, గాయత్రీ ఛందస్సు. రవి దేవత, మాయబీజము, రమాశక్తి, దృష్టాదృష్టఫలమునకు వినియోగము. సత్యమునకు హృదయము, బ్రహ్మ కు శిరము విష్ణువవునకు శిఖ, రుద్రునకు కవచము. అగ్నికి నేత్రము, శర్వునకు అస్త్రము, నేత్రము జ్వాలా మనస్సు హుం ఫట్ స్వాహా అనునది మంత్రము. గణములు షడక్షరములతో హీం అనునది. లక్ష్మీకి అంతస్థములతో షడంగన్యాసము. శిష్ట్రారములు జఠరమున పృష్ఠమున జేన్తముతో న్యాసము చేయవలయును. ఆదిత్యుని, రవిని, భానువును, భాస్కరుని, సూర్యుని శిరసున వదనమున, హృదయమున, గుహ్యమున, పాదములలో నుంచవలయును. సద్యాదులగు అయిదు ప్రసాదులను జేయందు ఉంచవలయును. హృదయము అంతిమముల నుంచవలయును. రమామధ్యలో నున్న హీం అనుదానిని యెనిమిది వర్ణములను తారాదీకములను న్యాసము చేయవలయును. మూర్థ, ఆస్య కంఠ, హృత్, కుకి, సోభి, లింగ, గుదములందు, చంద్రస్వరపూర్వముగా జేన్తము చంద్రమండలము. మూర్ధాది కంఠపర్యంతము ఇంద్రుని స్మరించుచు న్యాసము చేయవలయును. సౌందువులగు స్పర్శలనుచ్చరించి జేన్తమగు సూర్యమండలమును కంఠాదినాభ్యంతముగా న్యాసము చేయవలయును. సూర్యుని హృదయమున ధ్యానము చేయుచుండువలయును. సచంద్రములకు యాకోరాదులనుచ్చరించి జేన్తముగా వహ్నిమండలమును నాభ్యాది పాద పర్యంతము అగ్నిని స్మరించుచు న్యాసము చేయవలయును. దీనిని మహాతేజో విధాయకమగు మండలన్యాసమందురు. ఆదిఠాంత వర్ల పూర్వము జే నమోంతము చంద్రమండలమును మూర్థాది - హృదయాంతముగా న్యాసము చేయవలయును. డకారాది క్షకారాంతవర్ణాద్యము అగ్నిమండలమును జేన్తముగా హృదయాది పొద పర్యంతము సావధానముగా న్యాసము చేయవలయును. అగ్నీషోమాతమకముగు న్యాసము సర్వసిద్ధిప్రదముగా చెప్పబడినది. చంద్రసహితముగా మాతృకావర్ణములను జయాంతపురుషాత్మునము న్యాసము చేయవలయును. నమోంతముగా వ్యాపకమును చేయవలయును. దీనిని హంసన్యాసమందురు. మిగిలిన యెనిమిది స్వరములను మరల పంచమితములుగా పంచస్వరములను ఆదిత్య ముఖములుగా చెప్పబడిన నవగ్రహములను న్యాసము చేయవలయును. ఆధారలింగములందు, నాభియందు, హృదయమున, కంఠమున, ముఖాంతరమున, భ్రూమధ్యభాగమున, ఫాలమున, బ్రహ్మరంధ్రమున న్యాసము చేయవలయును. హంసన్యాసము, అగ్నీషోమన్యాసము, మండలన్యాసము అను మూడు న్యాసములచే మరల మూడు న్యాసములను చేసి వ్యాపకమును ఆచరించవలయును. ఇట్లు న్యాసవీధినాచరించి హృదయమున సూర్యుని ధ్యానించవలయును. దాసాభయ పద్మ ద్వయమును చేతులలో ధరించియున్న, కుండలాంగద కేయూరహారధారి, వేద స్వరూపుడు అగు సూర్యుని ధ్యానించి సూర్యమంత్రమును 8 లక్షలు జపించవలయును. దశాంశమును రక్తాంభోజములతో కానీ తిలలతో కాని విధిననుసరించి హోమము గావించవలయును. మొదట పీఠపూజలో ధర్మాదిస్థలమున న్యాసము గావించవలయును. పరిశుద్ధము విశాలమైన శారమును చక్కగా ఆరాధించి, మధ్యభాగమున పరమాదీముఖముగా రవిబింబాంతముగా పూజించవలయును. సోమాగ్నిమండలములను పూజించి సూర్యమండలమును పూజించవలయును. దీప్త, సూక్ష్మ, జయ, భద్ర, విభూతి, భీమల, అమోఘా, విద్యుతా, సర్వతోముఖా అనునవి పీఠశక్తులు. ప్రస్వత్రయోక్తుల వలన పుట్టిన, క్లిబర హితములు వహీందుపరయుతములు అగు స్వరములు శక్తి బీజములగును. అటువంటి వాటిని పూజించవలయును. ఈ శక్తులు బ్రహ్మ విష్ణు శివాత్మ కములు. శేషాన్వితములు కూడా ఇట్లు అంతమున “యోగ పీఠాత్మనే హృదయమ్” అని పలుకవలయును. ఈ పీఠమంత్రము తారాద్యము. ఈ మంత్రముచే ఆసనమును సమర్పించవలయును. ధ్రువము, ఆకోశము బిందుయుతము, ఆకోశమునకు ఉల్కకు హృదయము అను అర్ధము గల మంత్రము హృదయ మంత్రము. నవాక్షర మంత్రమునకు మూర్తిని సంకల్పించవలయును. ఆ మూర్తి యందు జగత్సాక్షియగు సూర్య భగవానుని ఆవహించి విధిననుసరించి పూజించవలయును. తరువాత షడంగము నారాధించి దిక్కులయందు అష్టాంగమును పూజించవలయును. మధ్యలో ఆదిత్యుని, రవిని, భాస్కరునీ, సూర్యుని పూజించి, దిక్కులయుందు పద్యాది పంచకమును, హ్రస్వాదీకమును స్వస్వనామాది వర్ణములను శక్తులను విదిక్కులలో పూజించవలయును. ఉషను, ప్రజను, ప్రభను, సంధ్యను, పూజించి తరువాత బ్రహ్మాదులను పూజించవలయును. మొదట అరుణుని పూజించి తరువాత చంద్రుని బుధుని, గురువును, శుక్రుని పూజించి, దిక్కులలో అర్యమాదులను పూజించి కుజుని, శని, రాహువును కేతువును కోణముల యందు మొదటి వలె పూజించవలయును. ఇంద్రాదులను వజ్రాదులను పూర్వము వలె పూజించవలయును. ఇట్లు యథావిధిగా భక్తవత్సలుడగు భాస్కరుని పూజించి సావధానుడై సూర్యునికి అర్ఘ్యమును ప్రతిదినము ఈయవలయును. పరిశుద్ధమగు భూమియందు ప్రాణాయామము నాచరించి మొదట చెప్పిన న్యొసములనాచరించి భానుమండలము నేర్పరిచి పీఠమును పూర్వమువలే పూజించవలయును. సూర్యుని ధ్యానము చేసి దివ్యములు మానసికములైన ఉపచారములచే పూజించవలయును. ప్రస్థతోయమును గ్రహించునదీ, శోభనము అగు తామ్రపాత్రము రక్త చందనాదులచే నిర్మించబడిన మండలమునందుంచి, విలోమమాతృకామూలముగా ఉచ్చరించుచు జలములచే నింపవలయును. సూర్యమండలమునుండి బయలు వెడలు సుధాంబుధి విభావితములగు వాటిచే కుయమను రోచనమును, రాజిని, చందనమును, రక్త చందనమును, కరవీరమును, జపాశాలికుశశ్యామాకతండులములను తీలవేణుయవలను శుభజలమునందుంచవలయును. అచట సాంగుడు సావరణుడగు సూర్యుని ఆవాహించి మొదటివలె పూజించవలయును. విధానముననుసరించి గంధపుష్పధూపదీప నైవేద్యాదులచే పూజించి, మూడు ప్రాణాయామములను చేసి పూర్వము వలె అంగన్యాసము గావించి దక్షిణ కరతలమున చందనముచే సుధాబీజమును లిఖించవలయును. ఆ హస్తముచే అర్ఘ్యపాత్రము కప్పి, నిశ్చలమనస్కుడై మంత్రమును అష్టోత్తరశతావృత్తిగా జపించి, మరల భాస్కరుని పూజించి, హస్తములతో "పాత్రను తీసుకొని మోకాళ్ళచే భూమి మీద నిలిచి శిరస్సువరకు పాత్రను లేపి శుభ్రవస్త్రముచే రవిని చూచి, మనసుచే మరల సూర్యుని పూజించి స్వకైక్యముగా ఆ సాధకుడు బుద్ధిచే మూలమంత్రమును జపించుచు, సూర్యుని ధ్యానించుచు అర్ఘ్యము నీయవలయును. రక్త చందనమండలమున పుష్పాంజలినిచ్చి మరల అష్టోత్తర శతము జపించవలయును. ప్రతి నిత్యముకాని ఈ విధముగా సూర్యునికి అర్ఘ్యప్రదానమును గావించవపయును. అర్ఘ్యప్రదానముచే సంతుష్టి చెందిన సూర్యుడు సంపదను, కీర్తిని, సుఖమును ప్రసాదించును. అట్లే పుత్ర పౌత్రులను సకలాభీష్టములను ప్రసాదించును. ఈ అర్ఘ్యప్రదానము ఆయురారోగ్య వర్ణకముగా చెప్పబడియున్నది. అంతియేకాక ధనధాన్యపశుక్షేత్ర మిత్ర కళత్రప్రదము. తేజోవీర్యయశఃకీర్తి విద్యావిభవ భోగప్రదముగా మునులు చెప్పియున్నారు. గాయత్రీ దేవి ఆరాధనయందు ఆసక్తుడై సంధ్యావందనతత్పరుడై ఇట్లు మంత్రమును జపించు బ్రాహ్మణుడు ఎప్పుడూ దుఃఖమును పొందజాలడు.
ఇట్లు సూర్యుని పూజించి వికర్తనునికి నిర్మాల్యము నిప్పించవలయును. మార్తాండభైరవమను పేరుగల బీజము త్రైలోక్య మోహనము. బింబబీజముచే పుటము పెట్టబడి సర్వకామఫల ప్రదమగును. ఈ విషయమున అంతయూ పూర్వము వలెనే తెలియవలసి యున్నది. బిలేందుమన్వాడ్యుడగు భృగువు చంద్రుని కొఱకు హృదయాంతిమము ఈ చంద్రమంత్రరాజము షడక్షరములు కలది. ఈ మంత్రమునకు ముని భృగువు. పంక్తి ఛందస్సు. సోముడు దేవత. బీజము ఆద్యము. నమః అనునది శక్తి. అఖిల ప్రాప్తి కొరకు వినియోగము. షడ్డీర్ఘమగు స్వబీజముతో షడంగన్యాసము చేయవలయును. పూర్ణ చంద్రముఖుడు, స్పటికవర్లుడు నీలొలకలచే శోభించు ముఖము కలవాడు, ఇష్టమగు కలువను ధరించువాడు, ముత్యముల హారమును ధరించిన చంద్రుని ధ్యానించవలయును. చంద్రమంత్రమును ఆరులకలు జపించవలయును. నేతితో కలిపిన పాయసముచే దశాంశము హోమము నాచరించవలయును. సోమాంత పూజితమగు పీఠమున మూర్తిమూలముచే సంకల్పించి విధిననుసరించి చంద్రుని పూజించవలయును. కేసరములందు అంగ పూజను పత్రములందు శక్తులను పూజించవలయును. రోహిణి, కృత్తిక, రేవతీ, భరణి, రాత్రి, ఆర్ద్ర, జ్యోత్స్నాకలా, హారసమప్రభా. ఆ శక్తులను శుక్లమాల్యాంబరధరలనుగా, ముక్తాహారవిభూషితులను స్తనభరాక్రాంతలై అంజలిని ధరించిన, శుభులను, తమ ప్రియులందు ఆసక్తమనస్కులను, మదవిభ్రమమంధరలను, సరోజాకులను, పూర్ణేందుసదృశాననులను పూజించవలయును. దలాగ్రములందు సూర్యాదులగు సూర్య కుజ శనీ బృహస్పతి రాహు కేతు శుక్రులను ఎనిమిది గ్రహములను పత్రాగ్రగతులను పూజించవలయును. ఈ గ్రహములు రక్త అరుణ శ్వేత నీల పీత ధూమ్ర సిత అసీత వరులను, తన హస్తమును పోమేరువున ఉంచి, మరియొక హస్తమున అభయముద్రను ధరించినవారిని పూజించవలయును. పత్రములకు బాహ్యమున లోకపాలురను, వారి అస్త్రములను పూజించవలయును. ఇట్లు సాధింపబడిన మంత్రము స్వాభీష్టము నొసంగును. పూర్ణిమనాడు ఆహారమును మాని చంద్రోదయ కాలమున అర్ఘ్యము నీయవలయును. భూమి పై తూర్పు పడమరలు వైశాల్యముగా మూడు మండలముల నేర్పరచవలయును. పశ్చిమ మండలమున తో నుండి, మధ్యమమండలమున పూజా ద్రవ్యముల నుంచి అబ్ద సమన్వితమగు తృతీయమండలమున చంద్రుని పీఠాపూజా పూర్వకముగా విధి విధానమున పూజించి ముందు భాగమున రజత పాత్రనుంచవలయును. సుగంధజలముచే ఆ పాత్రను నింపి పాత్రను స్పృశించుచు మంత్రమును జపించవలయును. తరువాత విద్యా మంత్రముచే అష్టోత్తరశతమును జపించవలయును. విద్యామాలినియందు విద్యా చంద్రునిలో అంతమును చెప్పవలయును. ఈ మంత్రము ద్వితాంతముగా తెలియవలయును., సర్వాభీష్టార్థ సిద్ధికి చంద్రునికి అర్ఘ్యము నీయవలయును. ఈ విధానముచే ప్రతిమాసము వ్రతము నాచరించవలయును. ఇట్లు ఒక సంవత్సరము నాచరించినచో మరియొక సంవత్సరమున సర్వేష్టములను పొందును. ఇట్లు చంద్రమంత్రమును జపించువాడు ధనధాన్య పుత్ర పౌత్ర సౌభాగ్యములను త్వరలో పొందును.
ఇపుడు ధనమును పుత్రులను ప్రసాదించు అంగారకమంత్రమును చెప్పెదను. తారము దీర్దేందుసహితము. ఆకాశము, ఇదియే మరల ఇందుయుతము, శాంతము, విసర్గలు కలది. సర్దిచండీశులు క్రమముగా బిందు విసర్గలు కలవి. ఈ మహామంత్రము ఆరక్షరములు కలది. అఖిలాభీష్టప్రదము. ఈ మంత్రమునకు ముని విరూపాక్షుడు. గాయత్రీ ఛందస్సు. కుజుడు దేవత. షణ్మంత్రాక్షరములచే షడంగన్యాసము చేయుచు భూపుత్రుని ధ్యానించవలయును. మేషము మీదున్నవాడు, రక్తాంగుడు, రక్తవస్త్రుడు, శూలశక్తి గదాధరుడు శంకరుని స్వేదము వలన పుట్టినవాడు భూసుతుడగు అంగారకుని స్మరించవలయును. అంగారక మంత్రమును తొమ్మిదిలక్షలు జపమును చేయవలయును. దానిలో దశాంశమును అనగా తొంబది వేలు మేడి సమిధలచే అగ్నియందు హోమమును చేయవలయును. శైవ పీఠమున కుజుని పూజించవలయును ఇరువది యొకటి కష్టములు కలదానిలో ప్రాణాంగములను ఆరాధించి, మంగలుడు, భూమి పుత్రుడు, ఋణహర్త, ధనప్రదుడు, స్థిరాసనుడు, మహాకాయుడు. సర్వకర్మ విరోధకుడు, లోహితుడు లోహితాకుడు సామగానము చేయువారిని అనుగ్రహించువాడు, ధర్మాత్మజుడు, కుజుడు, భూమిదుడు, భూమినందనుడు. అంగారకుడు, మహీసూనుడు, సర్వరోగాపహారకుడు, వృష్టికర్తా, వృష్టిహర్త, సర్వకార్యార్థ సిద్దిదుడు. అని అంగారకుని మూర్తులు ఇరువది యొకటి చెప్పబడినవి. తమ తమ స్థానములలో నున్న మంగళాది మూర్తులను క్రమముగా పూజించవలయును. అట్ల ఇంద్రాదులను, వజ్రాదులను పూజించవలయును. ఇట్లు పూజించినచో మంత్రము సిద్ధించును. పుత్రులను కోరు స్త్రీ అంగారక వ్రతమునాచరించవలయును. మార్గశీర్షమాసమున కాని వైశాఖమాసమున కాని వ్రతారంభము చేయుట ప్రశస్తము. అరుణోదయవేళలో లేచి ఆవశ్యకృత్యములను నిర్వర్తించి ఉత్తరేణి కాష్ఠముతో దంతధావనము గావించి, వాజీయమము కలదై, స్నానమాచరించి, రక్తవస్త్రములను రక్తమాల్యములను, రక్త చందనమును ధరించి రక్తవర్ణములు కల నైవేద్యములను సిద్ధము చేయవలయును. యోగ్యుడగు బ్రాహ్మణుని ఆహ్వానించి, అతని అనుమతిని పొంది అంగారకుని అర్పించవలయును. రక్తగోవు యొక్క పేడతో అలికిన భూమి యందు రక్తాసనమున కూర్చుండవలయును. ఆచమనము గావించి, దేశకాలములను కీర్తించి కోరికను చెప్పుచు. మంగళాది నామములను స్వాంగములయందు న్యాసము గావించవలయును. ముఖమున సామగ కృపాకరుని, నాసికలయందు ధరాత్మజుని, నేత్రములయందు కుజుని, లలాటము నందు భౌముని, భ్రూమధ్యమున భూమీజుని. మస్తకమున భూనందనుని, శిఖయందు అంగారకుని, సర్వాంగములందు మహీసుతుని. బాహుద్వయమునందు సర్వరోగాపహారుని శిరస్సునుండి పాదాంతము వరకు వృష్టికర్తను, పాదాది నుండి మూర్ధాంతము వరకు వృష్టి హర్తను, అన్నీ దిక్కులయందు సర్వ కార్యార్థ సిద్దిదుని, నాభియందు, హృదయమునందు, శిరస్సునందు ఆరుని, వక్రమునందు భూమీజుని న్యాసము చేసి మొదటివలే అంగారకుని ధ్యానము చేయవలయును. మానసోపచారములచే చక్కగా పూజించి అర్ఘ్యము నీయవలయును. ఏకవింశతి కోష్టములు గల త్రికోణమును తామ్రపత్రమున లిఖించి, దానియందు అంగారకుని ఆవాహించి రక్తపుష్పాదులతో పూజించవలయును. మొదట అంగములను పూజించి మంగళాదులను తరువాత పూజించవలయును. ఏకవింశతి కోషములందు చక్రుని, ఆరుని, భూమిజుని త్రికోణములందుకూడా పూజించి, బాహ్యభాగమున అష్టమాతృకలను, ఇంద్రాదులను, వజ్రాదులను మరల పూజించివలయును. ధూపదీపములను సమర్పించి గోధూమాన్నమును నివేదన చేయవలయును. శుద్దజలపూరితమగు తామ్రపాత్రయందు రక్త చందనమును రక్త పుష్పాక్షత ఫలములను ఉంచి అర్ఘ్యమును సమర్పించవలయును. తరువాత మంత్రజ్ఞుడు మంగలుని కొఱకు ఈ మంత్రద్వయమును పఠించవలయును.
ఇవి ఆ రెండు మంత్రములు. మహాతేజోవంతుడవు శంకరుని స్వేదము నుండి పుట్టిన భూమిపుత్రుడా ? పుత్రుని కోరి నిన్ను శరణు వేడితిని. ఈ అర్ఘ్యమును స్వీకరించుము. నీకు నమస్కారము. రక్త ప్రవాళసంకాశా ! జపాకుసుమసన్నిభా ! మహానుభావా ! ఓ మహీపుత్రా ! ఈ అర్ఘ్యమును స్వీకరించుము. నీకు నమస్కారము. అని పై మంత్రములకు అర్థము. మొదట చెప్పిన ఇరువది యొకటి నామములతో జే, నమః అను వాటిని చేర్చి తారాదులచే నమస్కరించవలయును. తరువాత అన్నియే (21) ప్రదక్షిణములను చేయవలయును. ధరణీగర్భసంభూతుడు విద్యుత్తు వంటి తేజస్సు కలవాడు, శక్తి హస్తుడు, కుమారుడగు అంగారకుని నేను నమస్కరించుచున్నాను. తరువాత మేడికట్టెతో ఏర్పడిన బొగ్గుచే రేఖాత్రయమును లిఖించవలయును. సావధానమనస్కురాలై రెండు మంత్రములను పఠించుచు వామపాదముచే ఆ రేఖలను తుడిచి వేయవలయును.
అను మంత్రములు రెంటిని పఠించవలయును. దుఃఖదౌర్బాగ్య నాశము కొఱకు పుత్రసంతానము కలుగుటకు నేను లిఖించిన మూడు రేఖలను వామపాదముచే తుడుచుచున్నాను. ఋణదుఃఖనాశమునకు మనోభీష్టార్ధసిద్దికి మూడు జన్మలనుండి పుట్టుచున్న మూడు నల్లని రేఖలను తుడుచుచున్నాను. అని పై మంత్రముల కర్గము. తరువాత దోసిట పుష్పములను ధరించి అంగారకుని స్తుతించవలయును. పూజసాంగోపాంగముగా సిద్ధించుటకు అంగారకుని పాదములను ధ్యానము చేయవలయును. ఋణమును హరించువానికి దుఃఖదారిద్ర్యములను నశింపచేయు నీకు నమస్కారము. ఓ అంగారకా నాకు ఎప్పుడూ ! సౌభాగ్యమును సుఖమును ప్రసాదించుము. తప్తకాంచనసంకాశ ! తరుణాదిత్యసమతేజా ! సుఖసౌభాగ్యప్రద ! ఋణదారిద్ర్యనాశక ! సర్వకళ్యాణకారకా ! ఓ గ్రహరాజా నీకు నమస్కారము. సర్వకళ్యాణ నిలయుడవగు ఓ దేవేశా. నన్ననుగ్రహించుము. దేవదానవ గంధర్వయక్షరాక్ష సపన్నగులు నిన్ను పూజించి పూర్ణమనోరధులై శుభములను పొందుచున్నారు. నిన్ను ఆరాధించిన జనులు త్వరలో సుఖమును పొందుచున్నారు. అట్టి నీకు నమస్కారము. నీవు వక్రగతుడవై మానవులకు దుఃఖమును కలిగించుచున్నావు. పూజించినచో సుఖసౌభాగ్యములను ప్రసాదించుచున్నావు. అట్టి నీకు నమస్కారము. ఆకాశమున ప్రకాశించువాడవు సర్వకళ్యాణకారణుడవు, ధనసంతాన హేతుభూతుడవైన కుజునికి నమస్కారము. ఓ మంగలప్రదుడవగు మంగళా నన్ను అనుగ్రహించుము. ఓ రుద్రస్వరూపొ ! మేషవాహనా ! నాకు పుత్రులను, ధనమును, కీర్తిని ప్రసాదించుము. ఇట్లు స్తోత్రము చేసి నమస్కరించి అంగారకుని విసర్జించవలయును. శక్తి ననుసరించి బ్రాహ్మణులకు ధనమునిచ్చి,వారి ఆశీర్వాదములను గ్రహించవలయును.గురువునకు దక్షిణనిచ్చి, నివేదించిన పదార్థమును భుజించవలయును. ఇట్లు ఒక సంవత్సరము ప్రతిమంగళవారమున చేయవలయును. నువ్యులచే హోమము చేసి యాబదిమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును. బంగారముతో చేసిన అంగారకమూర్తిని ఆచార్యునకు సమర్పించవలయును. సుతసౌభాగ్య సిద్ది కొఱకు మండలమున నున్న ఘటమున అర్చన గావించవలయును. ఇట్లు వ్రతము నాచరించిన స్త్రీ అందమైన పుత్రులను పొందును. ఋణనాశనమునకు, ధనప్రాప్తికి పురుషుడు కూడా ఈ వ్రతము నాచరించవచ్చును. బ్రాహ్మణుడు “అగ్నిర్మూర్ధా” అను వైదిక మంత్రమును పఠించవలయును. ఇక ఇపుడు పూజా సిద్దికొఱకు అంగారకగాయత్రిని చెప్పెదను. “అంగారకాయ విద్మ హే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్” అనునది అంగారకగాయత్రీ మంత్రము. ఈ అంగారకగాయత్రీ మంత్రము మానవులను సర్వాభీష్టములను ప్రసాదించును. ఇది అంగారక పూజా విధానము. ఇక బుధమంత్రమును చెప్పెదను వినుము.
ఫాంతము, కర్ణేందుసంయుక్తము, బుధుడు. జేన్తము, హృదంతిమము. ఈ బుధమంత్రము తొమ్మిది వర్ణములు కలది. పంక్తి ఛందస్సు బుధుడు దేవత ఆద్యబీజము నమశ్శక్తి అలాప్తికి వినియోగము. పీతాంబరవిభూషితుడగు బుధుని భక్తిచే నమస్కరించుచున్నాను. వామహస్తమును జానువు మీద నుంచి దక్షిణకరమున భయ ముద్రను ధరించి యున్న బుధుని ధ్యానించి ఇంద్రియనిగ్రముచే ఒకవేయి మంత్రమును జపించవలయును. ఆజ్యముచే దశాంశము నర్పించవలయును. అంగములను, మాతృకలను, దిక్పాలకులను ఆయుధములతో కూడియున్న బుధుని అర్చించవలయును. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత తమ మనోరధములను సాధించుకోనవలయును. పది దినములు ప్రతి నిత్యము వేయిమార్లు మంత్రమును జపించవలయును. ఇట్లు చేసినచో త్వరలో అతనికి గ్రహ పీడ తొలగును. ఇట్లు బుధారాధన చెప్పబడినది. ఇక గుర్వారాధనను వినుము. బృహస్పతి పదము జేస్తాము. ఇంద్వాద్యాద్యర్లాఘమండితము. నమోంతము ఎనిమిదక్షరములు గలది. బ్రహ్మ ముని, అనుష్టుప్పందస్సు. బృహస్పతి దేవత ఆదిబీజము హృదయము శక్తి దీర్ఘవ హ్నీందు యుగలముతో అంగకల్పన చేయవలయును. రాశియందు వామకరము నుంచి దక్షిణ కరమునుండి రత్నములను వేద జల్లుచున్న, పీత పుష్పాలంకార శోభితుని సర్వ విద్యానిధి, స్వర్ణకాంతి గల దేవ గురువును స్మరించవలయును. ఒక లక్ష జపము చేసి దశాంశము నేతితో కాని అన్నముతో కాని హోమమును చేయవలయును. ధర్మాధి పీఠమున అంగదిక్పాలాయుధములను పూజించవలయును. ఇట్లు మంత్రసిద్ధిని పొంది స్వేష్టమును సాధించుకొనవలయును. విషరోగాది పీడలందు, స్వజన కలహమున రాగి సమిధలచే హోమమును గావించిన ఆ బాధలు తొలగిపోవును. నేతితో తడిపిన నిశాపుష్పములచే మూడు దినములు హోమము రెండు వేలు గావించినచో వస్త్రములను భూమిని పొందగలడు. ఇట్లు గుర్వారాధన చెప్పబడినది. శుక్ర శుక్రారాధనను వినుము. శుక్ర మంత్రము 6 ద్వయాంతము ధ్రువాదికము. ఏకాదశాక్షరములు గలది. బ్రహ్మముని విరాట్చంధస్సు. శుక్రుడు దేవత. ధ్రువ బిజము. వసుప్రియ శక్తి. భూవేత్ర చంద్ర నేత్రాది నేత్రాక్షరములచే షడంగన్యాసము చేయవలయును. శుక్లాంబరాలేపభూషితుని, ధనమును ధరించియున్నవానిని, వ్యాఖ్యానముద్రను ధరించియున్న శుక్రుని స్మరించవలయును. పది వేలు మంత్రమును జపించవలయును. దశాంశము నేతితో హోమమును గావించవలయును. ధర్మాదిపీఠమున అందేన్గాయుధాదికమును పూజించవలయును. శుక్రవారమున తెల్లని పూవులచే గంధములచే హోమమును చేయవలయును. ఇట్లు ఇరువది యొకమార్లు చేసినచో వస్త్రములను మణులను పొందును. ఈ మంత్రములను రహస్యముగా నుంచవలయును. అందరికీ ఉపదేశించరాదు. భక్తియుక్తుడగు శిష్యునికి కాని తన పుత్రునికి కానీ ఈయవలయును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున మంత్రవిధాన నిరూపణమన అరువది తొమ్మిద - అధ్యాయము.
