నారద మహా పురాణము - పూర్వార్థము
22 - మాసోపవాసవర్ణనమ్
సనకమహర్షి పలికెను : అన్ని పాపములను హరించునది పవిత్రమైనది సర్వలోకోపకారకమగు మరియొక వ్రతమును చెప్పెదను. సావధానముగా వినుము. ఆషాడ, శ్రావణ, భాద్రపద, అశ్వయుజ మాసములలో ఏదో ఒక మాసమున నీవ్రతము నాచరించవలయును. ఈ మాసములలో ఏదో ఒక మాసమున శుక్లపక్షమున ఇంద్రియ నిగ్రహము కలవాడై పంచగవ్య ప్రాశనముచేసి శ్రీమహావిష్ణు సమీపమున శయనించవలయును. ప్రాతఃకాలమున లేచి నిత్యకర్మలను ముగించి కోపమును వదిలి ఇంద్రియ వశము కలిగి శ్రద్దతో శ్రీమహావిష్ణువును పూజించవలయును. పండితులతో కలిసి యథావిధిగా శ్రీహరిని పూజించి స్వస్తివాచన పూర్వకముగా సంకల్పమును చేయవలయును. “ఓ కేశవా!ఈ దీనము నుండి ఒకనెల నిరాహారముగా . నుండి, నీ యాజ్ఞచే , మాసాన్తమున పారణ చేసెదను. ఓ తపస్స్వ రూపా ! తపః ఫలప్రదాయకా ! సర్వవిఘ్నములను నివారించి నా అభీష్టమును ప్రసాదించుము.” ఇట్లు శుభప్రదమైన మాసవ్రతమును శ్రీహరికి సమర్పించి అప్పటినుండి ఒకమాసము హరీమందిరమున నివసించవలయును. ప్రతి దినము పంచామృత విధానముతో శ్రీహరికి అభిషేకమును చేయవలయును. ఈనెల లో హరిమందీరమున అఖండదీపము నుంచవలయును. ప్రతిదినము ఉత్తరేణికాషముతో దంతధావనము చేసుకొని శ్రీమన్నారాయణుని ధ్యానముచేయుచు యథావిధిగా స్నానము చేయవలయును. భక్తి శ్రద్దలతో యథావిధిగా శ్రీహరికి అభి షేకము చేసి అర్చన చేయవలయును. భక్తితో, బ్రాహ్మణులకు భోజనమును దక్షిణను సమర్పించవలయును. ఇంద్రియ నిగ్రహము కలిగి తాను కూడా బంధువులతో కలిసి భోజనము చేయవలయును. ఇట్లు పదమూడు మాసోపవాసములను చేయవలయును. సంవత్సరము ముగిసిన తరువాత వేదవిదుడైన బ్రాహ్మణునకు గోదానమును చేయవలయును. దక్షిణ నీయవలయును. పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనమీయవలయును. శక్తి ననుసరించి దక్షిణలను ఆభరణములను సమర్పించవలయును. ఇట్లు ఇంద్రియ నిగ్రహముతో మూడుమార్లు మాసోపవాసవ్రతము నాచరించినవారు ఆప్తోర్యామ యజ్ఞమునకు రెట్టింపు ఫలమును పొందెదరు. నాలుగుమార్లు ఈ వ్రతము నాచరించినవారు ఎనిమిది అగ్నిష్టోమ యాగముల ఫలితమును పొందెదరు. అయిదుమార్లు ఈ వ్రతమునాచరించిన వారు అత్యగ్నిష్టోమ యాగమునకు రెట్టింపు ఫలితమును పొందెదరు. ఆరుమార్లు మాసోపవాసవ్రతమునాచరించినవారు జ్యోతిష్టోమ యాగమునకు ఎనిమిది రెట్లు ఫలితమును పొందుదురు. ఈ వ్రతము నేడుమార్లాచరించినవారు అశ్వమేధ యాగమునకు ఎనిమిది రెట్లు ఫలమును పొందుదురు. ఎనిమిదిమార్లు ఈ వ్రతమునాచరించిన వారు నరమేధ యాగమునకు అయిదు రెట్లు ఫలమును, తొమ్మిది మార్లాచరించినవారు గోమేధమునకు మూడు రెట్లు ఫలమును, పదిమార్లాచరించినవారు మూడు బ్రహ్మ మేధముల ఫలమును, పదకొండు మార్లు ఆచరించినవారు సర్వభోగసమన్వితమైన హరిసారూప్యమును, పదమూడుమార్లాచరించిన వారు దుఃఖస్పర్శలేని పరమానందమును పొందెదరు. మాసోప వాసవ్రతమును చేయువారు, గంగాస్నానమును చేయువారు ధర్మ మార్గ ప్రవక్తలు ముక్తులగుదురు. సంశయముతో పనిలేదు. పతి పుత్రులులేని స్త్రీలు, యతులు, బ్రహ్మ చారులు విశేషించి వాన ప్రస్థులు ఈ మాసోప వాసవ్రతము నాచరించవలయును. స్త్రీ కాని పురుషుడు కాని దుర్లభమైన ఈ వ్రతమునాచరించి యోగులకు కూడా దుర్లభమగు మోక్షమును పొందెదరు. గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, భిక్షుకుడు, మూర్ఖుడు, పండితుడు ఎవరైనను ఈ వ్రత విధానమును వినినచో మోక్షమును పొందును. నారాయణ భక్తుడు పవిత్రమైన ఈ వ్రతమును వినిననూ చెప్పిననూ అన్ని పాపముల నుండి విముక్తుడగును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున వ్రతాఖ్యానమున మాసోపవాసవర్ణనమను ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.
