నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

118 - ద్వాదశమాసస్థినవమి వ్రత కధనమ్

సనాతన మహర్షి పలికెను :-

ఓ బ్రాహ్మణోత్తమా ! ఇపుడు నీకు నవమి వ్రతములను చేప్పెదను, ఈ వ్రతములనాచరించిన నరులు వాంఛితార్ధములను పొందెదరు. చైత్ర శుక్ల నవమినాడు శ్రీరామ నవమి వ్రతము చెప్పబడినది. శక్తి కల భక్తుడు ఆనాడు ఉపవసించవలయును. శక్తిలేనివాడు మధ్యాహ్నోత్సవము తరువాత ఒకసారి భుజించవచ్చును. బ్రాహ్మణులను మిష్టాన్నములచే భుజింపచేసి రామునికి ప్రీతి కలిగించవలయును. గోభూహిరణ్య తిల వస్త్రాలంకరణాదులతో విప్రులను పూజించవలయును. ఇట్లు శ్రీరామ నవమివ్రతము నాచరించువోడు ఇహలోకమున చేసిన పాపముల నుండి విముక్తుడై శ్రీవిష్ణులోకమును చేరును. ఈ దినమున మాతృవ్రతము కూడా చెప్పబడినది. భైరవునితో కలిసియున్న అరువది నాలుగు మంది యోగినులను ప్రక్ గంధ వస్త్ర నైవేద్యములతో పూజించవలయును. ఈ రోజే భద్రకాళి యోగినులకందరికి అధినాయకురాలిగా అభిషేకించబడినది. కావున ఈ రోజు ఉపవసించి జితేంద్రియుడై భద్రకాళిని పూజించవలయును. ఇక వైశాఖ మాసమున రెండు పక్షములలోని నవమియందు చండికను పూజించినవాడు యధావిధిగా విమానమధిరోహించి దేవలోకమును చేరి దేవతలతో కలిసి ఆనందించును. జ్యేష్ఠశుక్ల నవమినాడు ఉపవసించి యధావిధిగా పార్వతీదేవిని పూజించి కన్యకలను, బ్రాహ్మణులను భుజింపచేసి శక్తికొలది దక్షిణనిచ్చి తాను పొలతో వరి అన్నమును భుజింపవలయును. ఈ ఉమావ్రతమును యధావిధిగా నాచరించినవాడు ఇహలోకమున అన్ని భోగములననుభవించి అంతకాలమున స్వర్గమును పొందును. ఆషాఢమాసమున రెండు పక్షముల నవములలో రాత్రియందు ఐరావతము నధిరోహించియున్న ఇంద్రుని భార్యయగు శచీదేవిని పూజించినచో దేవలోకభోగములననుభవించును. దివి విమానము నధిరోహించి సంచరించుచుండును. శ్రావణమాసమున రెండు పక్షముల నవములలో ఉపవసించి కుమారియగు చండికను గంధపుష్ప ధూప దీప నైవేద్యములచే పూజించి కన్యకలను భుజింపచేయవలయును. ఇట్లు భక్తిచే కౌమారీ వ్రతమునాచరించిన వాడు విమానముతో దేవలోకమును చేరును. భాద్రపద శుద్ధ నవిమి నందో అనబడును. ఈ నవమినాడు యధావిధిగా షోడశోపచారముచే దుర్గాదేవిని పూజించినవాడు అశ్వమేధ ఫలమును పొంది విష్ణులోకమున నివసించును. అశ్వయుజ శుద్ధ నవమి మహానవమి అనబడును. ఈ దినమున అపరాహ్లామున తూర్పుదిక్కున శమీపూజను చేయవలయును. తరువాత రాత్రిపూట మొదటి ఝామున ఖడ్గమును, ధనువును, శరములు, గదను, శూలమును, శక్తిని, పరశును, చిన్నకత్తిని, చర్మమును, ఖేటకమును, ఛత్రమును, ధ్వజమును, గజమును, అశ్వమును, గోవృషమును, పుస్తకమును, తులను, దండపాశములను, శంఖచక్రములను గంధాద్యుపచారములచే పూజించి మహిషమును భద్రకాళికి సమర్పించవలయును. ఇట్లు బలినిచ్చి బ్రాహ్మణులకు పక్వాన్నమును భుజింపచేసి దక్షిణనిచ్చి తాను భుజించి వ్రాత సమాప్తి గావించవలయును. ఇట్లు మానవుల దుర్గతిని నశింపచేయు దుర్గను పూజించువాడు ఇహలోకమున సకల భోగములననుభవించి అంతమున స్వర్గమును పొందును. కార్తీక శుక్లనవిమిని అక్షయ నవమి అందురు. ఈ రోజు రాగిచెట్టు మొదట చక్కగా తర్పణము చేయవలయును. దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణగావించవలయును. స్వశాఖోక్తమంత్రములతో సూర్యునకు అర్ఘ్యప్రదానము గావించవలయును. తరువాత బ్రాహ్మణులను మిష్టాన్నములతో భుజింపచేసి దక్షిణనిచ్చి తాను భుజించి విహరించవలయును. ఇట్లు భక్తితో జపదాన ద్విజార్చనలను గావించినచో అవి యన్నియూ అనన ఫలప్రదములగును. మార్గశిర శుద్ధ నవమినాడు నందిని యందురు. ఈ రోజు ఉపవసించి జగదంబను పూజించవలయును. ఇట్లు చేసినవాడు అశ్వమేథ ఫలమును పొందును. పుష్య శుక్లనవమినాడు మహామాయను భక్తితో పూజించినవాడు పోజు పేయ ఫలమును పొందును. మాఘశుక్ల నవమినాడు మహానందా యనబడును. సదానందకరియగును. ఈ దినమున స్నానము, దానము, జపము, హోమము, ఉపవాసము చేసిన అంతయు అక్షయ మగును. ఫాల్గున శుక్లనవమి ఆనందా యనబడును. ఈ నవమి మహాపుణ్యా సర్వపాపహర. ఉపవసించి ఆనందను పూజించవలయును. అట్లు చేసినచో వాంఛితార్ధములను పొందును. ఇది ముమ్మాటికి నిజము.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్ధపాదమున ద్వాదశమాసస్థిత నవమివ్రత కధన మను నూటా పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.