నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

117 - అధ్యాయము

సనాతన మహర్షి పలికెను :

చైత్రు శుద్ధ అష్టమినాడు భవానీదేవి పుట్టినది. ఆరోజు నూరు ప్రదక్షిణములను చేసి యాత్రా మహోత్సవమును చేయవలయును. జగదంబా దర్శనము నరులకు సర్వానంద ప్రదము. ఇచటనే అశోక కలికా ప్రాశనము చెప్పబడినది. పునర్వసు నక్షత్రయుక్తమగు చైత్రశుద్ధ అష్టమినాడు ఎనిమిది అశోక కలికలపానము చేసినవారు ఎపుడూ దుఃఖమును పొందరు. దేవీ పూజావిధానమున దీనినే మహాష్టమి యందురు. వైశాఖ శుద్ధ అష్టమినాడు ఉపవసించి, నీటిలో స్నానముచేసి, అపరాజితా దేవిని మాంసీ బాలక జలముచే స్నానమును. చేయించి, గంధాదులచే పూజించి, శర్కరామయముగా నైవేద్యమును సమర్పించి, నవమినాడు కన్యకలను భుజింప చేయవలయును. ఇట్లు ఆచరించినచో దేవి అనుగ్రహముతో జ్యోతిర్మయ విమానములో సూర్యునివలె ప్రకాశించుచు లోకములలో విహరించును. జ్యేష్ఠ బహుళ అష్టమినాడు దేవిని పూజించువాడు గంధర్వ అప్సరోగణములతో విమానమున సంచరించును. ఆషాఢ శుక్ల అష్టమినాడు రాత్రి జలముతో స్నానము చేసి, దేవిని కూడా అదే జలముతో స్నానము చేయించి యధావిధిగా పూజించవలయును. తరువాత శుద్ధ జలముచే స్నానము చేయించి చందనమును అలది శర్కరోపేత నైవేద్యమును సమర్పించి ఆచమనము నీయవలయును. తరువాత బ్రాహ్మణులను. భుజింపచేసి స్వర్ణదక్షిణలనిచ్చి వారిని విడిచి మౌనముగా తాను భుజించవలయును. ఈ వ్రతమును ఆచరించినవాడు దేవీలోకమును పొందును. శ్రావణ శుక్లాష్టమినాడు యధావిధిగా దేవిని పూజించి, పాలతో స్నానము చేయించి, మిష్టాన్నమును నైవేద్యము. సమర్పించవలయును. మరునాడు బ్రాహ్మణులను భుజింపచేసి తాను భుజించి ఈ వ్రతమును సమాప్తి చేయవలయును. ఈ వ్రతము సంతానమును వృద్ధి చేయును. శ్రావణ బహులాష్టమినాడు దశాఫలము చెప్పబడినది. ఉపవాసమును సంకల్పించి, స్నానము చేసి, నిత్యకర్మల నాచరించి పది కృష్ణతులసీ దళములతో పూజించవలయును. కృష్ణ, విష్ణు, అనన్త, గోవిన్ద, గరుడధ్వజ, దామోదర, హృషీకేశ, పద్మనాభ, హరి, ప్రభు అను నామములతో శ్రీ కృష్ణ భగవానుని పూజించవలయును. తరువాత ప్రదక్షిణ నమస్కారములను చేయవలయును. ఈ వ్రతమును ఇట్లు పదిదినములు చేయవలయును. ఇది అన్ని వ్రతములలో 'ఉత్తమ వ్రతము. ఆది మధ్యాంతములలో విధిననుసరించి, హోమమును చేయవలయును. కృష్ణమంత్రముతో చరువుతో అష్టోత్తర శతము హోమమును గావించవలయును. హోమాంతమున యధావిధిగా ఆచార్యుని పూజించవలయును. సువర్లతా మృణ్మయవేణు పాత్రలలో ఏదో ఒక పాత్రలో సువర్ణముతో చేసిన తులసీదళమును, బంగారు ప్రతిమను కూడా చేయించి యధావిధిగా పూజించి, ప్రతిమను పాత్రలో నుంచి ఆచార్యునకు సమర్పించవలయును. వస్త్రాలంకార భూషిత, సవతయగు గోవును దానము చేయవలయును. పదిదినములు శ్రీ కృష్ణునకు పది పూరీలను అర్పించవలయును. ఆ పూరీలను విధిజ్ఞునకు దానము చేయవలయును. లేదా తాను భుజించవలయును. శక్తి ననుసరించి శయ్యా దానమును గావించవలయును. పదవరోజున స్వర్ణమూర్తిని సదక్షిణగా గురువున కర్పించవయును. వ్రతాంతమున పదిమంది బ్రాహ్మణులకు ప్రత్యేకముగా పది పది పూరీలను ఈయవలయును. ఇట్లు పదిసంవత్సరములు ఉత్తమోత్తమమగు ఈ వ్రతము నాచరించి ఉపవసించి సర్వకామ సమన్వితుడగును. అంతకాలమున శ్రీకృష్ణ సాయుజ్యమును పొందును. ఇదియే శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ అష్టమి నరులకు పాపహరము. ఈ జన్మదినమున ఉపవాసముతో సప్త జన్మకృత పాపములు నశించును. ఉపవాసము చేయువాడు పరిశుద్ద నదీ జలములో తిలలతో స్నానము గావించి పరిశుద్ధ ప్రదేశమున మండలమున ఏర్పరిచి మండల మధ్యమున తామ్ర పాత్రను కానీ మృణ్మయ పాత్రను కాని (కలశమును) స్థాపించి, ఆ కలశముపై పాత్ర నుంచి బంగారు ప్రతిమను రెండు వస్త్రములతో కప్పి, పాద్యాద్యుపచారములచే భక్తిచే పూజించవలయును. దేవకీ దేవిని, వసుదేవుని యశోదాదేవిని, నందుని, వ్రేపల్లెను, గోపాలులను, గోపికలను, గోవులను అన్ని దిక్కులందు పూజించవలయును. తరువాత నీరాజనము నిచ్చి, క్షమాపణను వేడి, భక్తితో నమస్కరించి, అర్థరాత్రి వరకట్లే ఉండవలయును అపుడు మరల శ్రీ కృష్ణుని స్నానము చేయించవలయును. మొదట పంచామృతముతో, మరల శుద్ధ జలముతో స్నానము చేయించి గంధాదులచే పూజించవలయును. వోమ, జిలకర, శుంఠి, కలకండ నేతితో కలిపి వెండి పాత్రలో నివేదన చేయవలయును. మరల నీరాజనమునిచ్చి, దశావతార రూపుని ధ్యానించుచు ఉదయించుచున్న చంద్రునికి అర్ఘ్యము నీయవలయును. అపుడు శ్రీ కృష్ణ భగవానుడు క్షమాపణ వేడి మిగిలిన రాత్రిని గడుపవలయును. పౌరాణిక స్నోత పాఠములతో గీత వాద్యములతో రాత్రి గడుపవలయును. మరునాడు ప్రాతః కాలమున బ్రాహ్మణోత్తములను మధురాన్నములతో భుజింప చేయవలయును. సంతోషముతో వారికి దక్షిణలనిచ్చి విసర్జించవలయును. తరువాత స్వర్ణధేనుధరయగు శ్రీ కృష్ణ స్వర్ణ ప్రతిమను దక్షిణతో గురువున కర్పించి విడీచి తాను భుజించ వలయును. ఇట్లు దొరా అపత్య సహృత్ భృత్యులతో కలిసి భుజించి వ్రతమును ముగించిన మానవుడు, అంతకాలమున ఉత్తమ విమానము నధిరోహించి గోలోకమును చేరును. ఈ జగత్రయమున ఇటువంటి వ్రతమింకొకటి లేదు. ఈ వ్రతము నాచరించిన వానికి కోటి ఏకాదశి వ్రత ఫలము లభించును.