నారద మహా పురాణము - పూర్వార్థము
38 - విష్ణుమాహాత్మ్యమ్
నారదమహర్షి పలికెను :- ఓ మహానుభావా ! పుణ్యపురుషుడగు ఉత్తంకమహర్షి చేసిన స్తోత్రమేది ? శ్రీహరి ఎట్లు సంతోషించెను ? ఏ వరమును పొందెను ?
సనక మహర్షి పలికెను :- హరిధ్యానపరాయణుడగు బ్రాహ్మణోత్తముడగు ఉత్తంకుడు శ్రీహరిపాదోదక మాహాత్మ్యమును చూచి భక్తిచే స్తోత్రము చేసెను.
ఉత్తంక మహర్షి పలికెను :- జగన్నివాసుడు జగదేక బంధువు ఆదిదేవుడగు నారాయణుని నమస్కరించుచున్నాను. శంఖచక్రశార్ణఖడ్గధారి మహానుభావుడు తలచువారి ఆర్తిని నశింపచేయువాడు అగు శ్రీహరిని శరణువేడుచున్నాను. శ్రీహరి నాభికమలమున పుట్టిన చతుర్ముఖబ్రహ్మ ఈ లోకజాలమును సృజించుచున్నాడు. శ్రీహరి కోపము నుండి పుట్టిన రుద్రుడు ఈ జగత్తును నశింపచేయుచున్నాడు. అట్టి ఆదిదేవుని ప్రతినిత్యము నమస్కరించుచున్నాను. లక్ష్మీపతి పద్మదలాయతాకుడు విచిత్రవీర్యుడు సమస్త జగత్తునకు ముఖ్య హేతువు, వేదాంతవేద్యుడు పురాణపురుషుడు, తేజోనిధియగు విష్ణువును నేను శరణుపొందితిని. ఆత్మ భూతుడు, అక్షరుడు, సర్వగతుడు, అచ్యుతనామధేయుడు, జ్ఞానాత్మ కుడు, జ్ఞానులకు శరణ్యుడు, జ్ఞానైకవేద్యుడు ఆదిభగవానుడు వ్యష్టి సమష్టిరూపుడు ప్రసన్నుడగు గావుత. ఆనన్త వీర్యుడు, గుణజాతిహీనుడు గుణాత్మకుడు, జ్ఞానవిదులలో శ్రేష్టుడు, నిత్యుడు, ప్రపన్నార్తిహరుడు, పరమాత్మ, దయాసముద్రుడు, నాయెడ వరదుడగు -గావుత. స్థూలసూక్ష్మాది విశేష భేదములచే తాను సృజించిన జగత్తున యథావిధిగా ప్రవేశించినవాడు సమస్త మగు అనంతసారస్వరూపుడు, అగు నీకం ఓ సగము మరొకటి లేదు. నీవే పరొత్మవు. నీ శుద్ద రూపము అగోచరము. మాయా సహీనము గుణజాతి హీనము, నిరంజనము నిర్మలము, అప్రమేయము, సజ్జనులచే పరమార్థముగా చూడబడువాడవు నీవు మాత్రమే. బంగారము ఒకటైనను ఆభరణముల ఉపాచే భిన్నముగా తోచునో అట్లే అఖిలాత్మకుడగు సర్వేశ్వరుడు ఒకడైనను ఉపాధి భేదముచే భిన్నముగా తోచును. నీమాయచే మోహాకులమగు మనస్సు కలవారై ప్రసిద్ధమైన ఆత్మ స్వరూపమును చూడజాలకున్నారు. మాయతొలగినచో వారే సర్వాత్మ కమగు ఆత్మరూపముగా చూచుచున్నారు. జ్యోతిస్వరూపుని విభుని సాటి లేని వానిని శ్రీమహావిష్ణువును నమస్కరించుచున్నాను. ఈ జగత్తు సమస్తము నీ నుండి కలిగి నీలో నిలుచుచున్నది. ఈ చైతన్యము నీ నుండి కలిగినది. చైతన్య స్వరూపుడవు అగు నీకు నమస్కారము. అప్రమేయుడు అనాధారుడు ఆధారాధేయ స్వరూపుడు, పరమానన్దచిన్మాత్రుడు అగు వాసుదేవుని సమస్కరించుచున్నాను. యోగులచే సేవించబడువాడు, హృదయకుహరమున నివసించువాడు యోగములకు ఆదిభూతుడు ప్రణవమున నివసించువాడగు శ్రీహరిని నమస్కరించుచున్నాను. 'నాదాత్మకుని, నాదబీజుని, ప్రణవాత్మకుని, అవ్యయుని, సద్భావుని, సచ్చిదానన్దుని తీక్ష చక్రము గలవానిని నమస్కరించుచున్నాను. అజరుడు, సాక్షి అవాఙ్మానసగోచరుడు, నిరంజనుడు, అనంతాఖ్యుడు అగు విష్ణురూపుని నమస్కరించుచునాను. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, సత్వము, తేజస్సు, బలము ధృతి ఇవియన్నియు వాసుదేవ స్వరూపములుగా చెప్పెదరు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు వాసుదేవ స్వరూపములుగా చెప్పుదురు. విద్వాస్వరూపుడు అవిద్యాస్వరూపుడు పరాత్పరతరుడని చెప్పెదరు. ఆద్యంతములేనివాడు శాంతుడు, సర్వధాత, అచ్యుతుడు అగు శ్రీహరిని శరణువేడిన మహానుభావులకు శాశ్వతమగు ముక్తి తప్పదు. శ్రేష్ఠుడు, శేష్ఠతరుడు వరదుడు, పురాణ పురుషుడు, సనాతనుడు, సర్వగతుడు, సమస్తరూపుడు అగు శ్రీహరిని మాటి మాటికి నమస్కరించుచున్నాను. శ్రీహరి పాదోదకము భవరోగమునకు ఔషధము అతని పాదరజము విమలత్వమును ప్రసాదించును. శ్రీహరి నామము దుష్కర్మలను నివారించును. అట్టి అప్రమేయుని పరమపురుషుని సేవించుచున్నాను. సద్రూపుని అసద్రూపుని, సదసద్రూపుని, అవ్యయుని, అట్నిటికంటే విలక్షణుని, శ్రేష్ఠములన్నిటిలో, శ్రేష్ఠ తరుని భజించెదను. నిరంజనుని నిరాకారుని పరిపూర్ణుని, ఆకాశమధ్యగుని, . విద్య అవిద్యలకం టే పరుని హృత్వద్మవాసుని స్వయంప్రకాశుని, అనిర్దేశ్యుని, మహత్తులకంటే మహత్తరుని, అణువు కం టే అణువును, సర్వోపాధివర్జితుని, నిత్యుని, పరమానందుని, సనాతనుని, పరబ్రహ్మను, జగన్నివాసుని శ్రీమహావిష్ణువును శరణు కోరితిని క్రియానిషులచే భజించబడువానిని, యోగులచే చూడబడువానిని పూజ్యులందరికంటే పరమపూజ్యుని, శాంతుని శరణుపొందితిని, విద్వాంసులచే కూడ చూడ శక్యముకాని వానిని, ఈ ప్రపంచమునంతటిని వ్యాపించియుండువానిని అన్నిటికంటే అధికుని, నిత్యుని, అవ్యయుని విభువును నమస్కరించుచున్నాను. అంతఃకరణసంయోగముచే జీవుడనబడువాడు, అవిద్యాతత్కార్యరహితుడై పరమాత్మమగా కీర్తించబడువాడు, సర్వాత్మ కుడు సర్వ హేతువు, సర్వకర్మఫలప్రదుడు, శ్రేష్ఠుడు, శ్రేష్ఠతరుడు, పరాత్పరుడగువానిని ప్రణమించుచున్నాను. సర్వజ్ఞుని, సర్వగతుని, శాంతుని సర్వాంతర్యామీనీ, శ్రీహరిని, జ్ఞానాత్మకుని, జ్ఞాననిధిని, జ్ఞానసంస్థుని విభువును భజింతును, వేదనిధిని, మురారిని, వేదాంత విజ్ఞానముచే నిశ్చయించబడిన స్వరూపము గలవానిని, సూర్యచంద్రులవలే కాంతివంతమగు నేత్రములు గలవానిని, ఇంద్రుని, పక్షిరూపుని, సర్వజగన్నాథుని, సర్వేశ్వరుని, సర్వగతుని, మహానుభావుని, వేదస్వరూపుని, వేదవిదులలో శ్రేష్ఠుని, వాజ్మనములచే ధ్యానించ శక్యము కానివానిని, అనంత శక్తిని జ్ఞానైకవేద్యుడగు పురుషుని భజించెదను. ఇంద్రాగ్నియమ 'నిర్భతి, వరుణ, వాయు, చంద్ర, శివ, సూర్య కుబేరాది దిక్పాలురరూపములచే పరిపూర్ణభావుడై లోకములను పాలించు అప్రమేయుని శరణు పొందుచున్నాను. సహస్రశీర్షుని, సహస్రపాదుని, సహస్రబాహువును, సహస్రనేత్రుని, సమస్త యజ్ఞములచే పూజించబడువానిని సంతోషప్రదుని, ఉగ్రవీర్యుని, ఆదిదేవుని నమస్కరించుచున్నాను. కాలస్వరూపుని, కాలవిభాగ హేతువును, గుణత్రయాతీతుని, గుణజ్ఞుని గుణప్రియునీ, కామదుని, సంగర హితుని, ఇంద్రియాతీతుని విశ్వబాహువుని, నిస్పృహుని, నిష్కాముని, ఉత్కృష్టుని, మనసునకు గోచరము కానివానిని - మనోమయుని, అన్నమయుని, నిస్సంగుని, విజ్ఞానభోదుని, రూపమును పొందినవానిని, వాచామగోచరుని, ప్రాణమయుని భజింతును. స్వరూపమును, బలమును, ప్రభావమును, కర్మలను, ప్రమాణములను బ్రహ్మాదిదేవతలు కూడా తెలియదు. అట్టి ఆత్మరూపుని, ఎట్లు స్తుతి చేసెదను. సంసార సాగరమున పడి దీనుడనై మోహాకులుడనై అనేక కామములచే బద్దుడనై అపకీర్తిని పొందును, పిశునుడను కృతఘ్నడను సదా అపవిత్రుని, పాపరతుని, విశేష క్రోధము గల వానిని భయాకులుడనుగు నన్ను కాపాడుము. దయానిధివగు నిన్ను శరణు వేడుచున్నాను. ఇట్లు ఉత్తంకునిచే ప్రార్థించబడిన దయానిధియగు శ్రీపతి తేజోనిధి భగవానుడు ప్రత్యక్షమాయెను.
అవిశపూవువన్నె గల వానిని వికసించిన పద్మముల వంటి కనులు గల వానిని కిరీట కుండల హార కేయూర శ్రీవత్సకౌస్తుభాదీ భూషణములను ధరించినవానిని, బంగారు యజ్ఞోపవీతమును ధరించినవానిని నాసికా ప్రాంతమున ధరించిన ముత్యము కాంతిచే శోభించు దేహకాంతి గలవానీని పీతాంబరధారిని, వనమాలావిభూషితుని, కోమలములైన తులసీ దళములచే పూజించబడిన పాదములు గలవానిని, గొప్ప తేజస్సు కలవానిని కింకిణి నూపురాదులచే భూషించబడినవానిని, గరుడ ధ్వజుని శ్రీహరిని చూచి ఉత్తంకుడు దండవత్సణామముల నాచరించెను. ఆనందబాష్పములచే శ్రీహరి పాదములను అభి షేకించేను. ఓ మురారీ ! రక్షించుము ! రక్షించుము ! అని పలుకుచు అనన్య చిత్తముతో ధ్యానించెను. దయాపరుడగు శ్రీమహావిష్ణువు ఉత్తంకుని లేపి ఆలింగనము చేసుకొనెను. వత్సా ! వరమును కోరుమని పలికెను. నేను ప్రసన్నుడనైన పిదప నీకు సాధించరానిదేదియు లేదని పలికిన శ్రీహరి మాటలను “విని ఉత్తంకుడు మరల మరల. నమస్కరించి దేవదేవుడగు జనార్ధనునితో ఇట్లు పలికెను. “నన్నేల మోహింపచేయుచున్నావు ? నాకు వేరు వరములతో నేమి పని ? ఎన్ని జన్మలలో నైనను నీయందు దృడభక్తి కలుగనిమ్ము” శ్రీహరి అట్లే కానిమ్మని పలికి శంకప్రాంతముతో స్పృశించి యోగులకు కూడా దుర్లభమగు దివ్యజ్ఞానమును ప్రసాదించెను. ఉత్తంకుడు మరల స్తోత్రము చేయుచున్న దేవదేవుడగు జనార్దనుడు ఉత్తంకుని శిరమున హస్తమునుంచి ఇట్లు పలి కెను.
శ్రీమన్నారాయణభగవానుడు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! క్రియాయోగముతో నన్నెల్లపుడారాధించుము. నరనారాయణాశ్రమునకు వెళ్ళుము. మోక్షమును పొందగలవు. నీవు చేసిన ఈ స్తోత్రమును చదివినవారు అన్ని కోరికలను పొంది అంతమున మోక్షమును పొందగలరు. శ్రీమన్నారాయణుడిట్లు పలికి అచటనే అంతర్ధానము చెందెను. తరువాత ఉత్తంకుడు కూడా నరనారాయణ స్థానమును గూర్చి వెళ్ళెను. కావున దేవదేవుడగు చక్రి విషయమున ఎల్లపుడు భక్తి చేయవలయును. అన్నిటిలో ఉత్తమమైనది హరిభక్తియే. హరిభక్తి సర్వకామఫలములనిచ్చును. నరనారాయణాశ్రమున ఉత్తంకుడు భక్తి భావముతో శ్రీహరిని పూజించుచు క్రియాయోగపరుడై, జ్ఞానవిజ్ఞానసంపన్నుడై సంశయచ్ఛేదము గలిగి అందరికి దుర్లభమగు శ్రీమహావిష్ణువు యొక్క పరమపదమును పొందెను. జగన్నాధుడగు నారాయణుడు భక్తుల గౌరవమును పెంచువాడు పూజించినను నమస్కరించిననూ స్మరించిననూ మోక్షము నొసంగును. కావున అనంతుడు అపరాజితుడు అగు నారాయణదేవుని ఇహపరములలో ఆనందమును కోరువాడు భక్తి చే పూజించవలయును. సావధానముచే ఈ కథను చదివిననూ వినిననూ సర్వపాపవినిర్ముక్తుడై శ్రీహరిభవనము చేరును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున విష్ణుమాహాత్మ్యమను ముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.
