నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

44 - భృగుభరద్వాజసంవాదః

భరద్వాజ మహర్షి పలికెను :- ఈ లోకముకాక పరలోకము కలదని వినబడుచున్నది కాని కనపడుట లేదు. ఆ పరలోకమును గూర్చి తెలియగోరుచున్నాను. మీరు తెలియజేయుడు.

భృగురువాచ :-

భృగు మహర్షి పలికెను :- పవిత్రము సర్వ సుగుణయుక్తమగు హిమవత్పర్వతమునకు ఉత్తర భాగమున పుణ్యము క్షేమకరము, కామ్యప్రదమగునది పరలోకమని చెప్పబడును. ఆ పరలోకమున పాపకర్మరహితులు, పవిత్రులు అత్యంత పరిశుద్దులు, లోభమోహములను పరిత్యజించినవారు, ఉపద్రవరహితులగు మానవులు నివసింతురు. ఆ ప్రదేశము స్వర్గసదృశము. అచట అన్ని శుభగుణములుండును. అచట సకాలమున మాత్రమే మృత్యువు ప్రాప్తించును. అచట వ్యాధి స్పర్శ ఉండదు. పరదారల యందు లోభముండదు. అచట జనమంతయు స్వదారనిరతులుగా నుందురు. ఇతరులేవ్వరూ వధించబడరు, ద్రవ్యకాంక్ష ఉండదు, అధర్మమే ఉండదు, సందేహములుండవు చేసిన పనులకు ప్రత్యక్షఫలమనుభవించబడును. అచటి జనులందరు వాహన ఆసన భోజన భవనాది భోగములు కలిగియుందురు. అన్ని కోరికలు తీర్చుకొనువారు, కొందరు - హేమాభరణ భూషితులుందురు. కొందరు మాత్రము ప్రాణధారణ మాత్రమునే చేతురు. మరికొందరు చాలా ప్రయాస చే ప్రాణధారణ చేయుదురు.

ఈ లోకమున కొందరు ధర్మపరులు, కొందరు అధర్మపరులుగా నుందురు. కొందరు సుఖితులు కొందరు దుఃఖితులు, కొందరు ధనవంతులు, కొందరు నిర్థనులుందురు. ఈ లోకమున శ్రమ, భయము, మోహము, తీవ్రమైన ఆకలి ఉండును. అర్థవిషయమున లోభముచే అజ్ఞానులు మోహపరవశులగుదురు. ఈ రెండు లోకములను గూర్చి తెలిసిన ప్రాజ్ఞుడు పాపములనంటడు, అపకారము, చౌర్యము, అపవాదము, అసూయ, పరోపఘాతము, హింస, లోభము అనృతము వీటిని సేవించువారి తపస్సు క్షీణించును. వీటినాచరించని వారి తపస్సు వృద్ధి చెందును. ఈ లోకమున ధర్మాధర్మ కర్మల చింత పలు విధములుగా నుండును. ఇది కర్మభూమి. ఈ లోకమున శుభాశుభకర్మలనాచరించి శుభకర్మలకు శుభపలితమును, అశుభకర్మలకు, అశుభఫలములను పొందును. ఈ లోకమున ప్రజాపతి దేవతలు ఋషులు పూర్వమున యాగములను తపమునాచరించి బ్రహ్మలోకమును చేరిరి. ఈ పృథివి యొక్క ఉత్తర భాగము శుభము సర్వ పుణ్యమయము. ఇక్కడ పుణ్యమును చేసినవారు అక్కడ పుట్టెదరు. పాపమును చేసినవారు పశుపక్ష్యాదులలో జన్మింతురు. మరికొందరు అల్పాయుష్యము కలవారు ఈ లోకముననే నశింతురు. ఇచట ఒకరినొకరు భక్షించుచు లోభమోహయుక్తులై ఇచటనే తిరుగుచుందురు. ఉత్తర భాగమునకు వెళ్ళజాలరు. నియతులై బ్రహ్మ చర్యముతో గురువులను సేవించు బుద్ధిమంతులు అన్నిలోకముల మార్గములను తెలియుదురు. ఇట్లు బ్రహ్మ నిర్మితమైన ధర్మమును సంక్షేపముగా నీకు తెలిపితిని. లోకము యొక్క ధర్మాధర్మములను తెలిసినవాడు బుద్ధిమంతుడనబడును.

 భరద్వాజ మహర్షి పలికెను :- పురుషుని విషయమున అధ్యాత్మమని చెప్పబడుచున్నది కదా ! అధ్యాత్మమనగా నేమి? దానినంతయూ విశదముగా తెలుపుము.

 భృగు మహర్షి పలికెను :- ఓ బ్రహ్మర్షీ ! నీవడుగుచున్న అధ్యాత్మమును చక్కగా వివరించెదను. ఆ అధ్యాత్మ మే శ్రేయస్కరము సుఖప్రదము. అధ్యాత్మము సృష్టి ప్రలయములచే కూడియుండునది. ఆచార్యులచే ప్రదర్శించబడినది. అధ్యాత్మజ్ఞానము కలవాడు లోకమున ప్రీతిని సౌఖ్యమును పొందును. ఫలము లభించును. సర్వభూతపాతమేర్పడును. పృథివి వాయువు ఆకాశము జలము అగ్ని అని పంచ మహాభూతములు. ఈ భూతములు అన్ని ప్రాణుల పుట్టుకకు నాశమునకు మూలములు ప్రాణులు దేని నుండి పుట్టునో దానిలో లయమగును. సాగరమున పుట్టిన ప్రాణులు భూతములలో లయమగును. తాబేలు తన అవయవములను బయటకు సారించి మరల తనలోనికి ఉపసంహరించుకొనునట్లు పంచభూతములు ప్రాణులను బయలుపరిచి మరల తనలో ఉపసంహరించుకొనును. ఇట్లే సర్వభూతాత్మకుడు తననుండి భూతములను సృష్టిచేసి మరల తనలో లీనము చేసుకొనును. పంచ మహాభూతములే అన్ని ప్రాణులలో ప్రాణిత్వమును ఏర్పరచును. ప్రాణులలోని భూతత్వమును జీవుడు చూడజాలడు. శబ్దము శ్రోత్రము ఇంద్రియములు అను నీ మూడు ఆకాశము నుండి పుట్టినవి. స్పర్శ చేష్ట త్వగింద్రియము ఈ మూడు వాయువు నుండి పుట్టినవి. రూపము చక్షువు పాకము ఈ మూడు తేజోమయములు. రసము, క్లేదము జిహ్వ ఈ మూడు జలగుణములు. వాసన గల వస్తువు, ఘ్రాణేంద్రియము, శరీరము ఈ మూడు భూమి గుణములు. మహాభూతములు అయిదు. ఆరవది మనసు. ఈ సముదాయమునకు ఇంద్రియములు మనస్సు అని వ్యవహారము. ఏడవది బుద్ధి, క్షేత్రజ్ఞుడు ఎనిమిదవ వాడు. శ్రోత్రేంద్రియము వినుటకు, త్వగింద్రియము స్పృశించుటకు, రసమును గ్రహించుట రసనేంద్రియము, గంధమును గ్రహించుటకు నాసిక, నేత్రము చూచుటకు, మనసు సంశయించుటకు నేర్పడినవి. బుద్ది నిశ్చయించును. క్షేత్రజ్ఞుడు సాక్షి వలె నుండును. ఊర్ధ్వభాగమును అధో భాగమును కూడా చూచును. ఈ విభువు చేతనే సమస్త ప్రపంచము వ్యాప్తమైనది. పురుషులు సమగ్రములుగా ఇంద్రియములను తెలియవలయును. రజస్సత్త్వత భావములు కూడా ఇంద్రియాశ్రితములే. ఈ విధముల భూతముల సృష్టిని మూలమును నరుడు తెలిసి, జాగ్రత్తగా సమీక్షించి శాంతిని పొందవలయును. గుణములచే బుద్ది నశించును. బుద్ధి వలననే ఇంద్రియములు కూడా నశించును. మనసుతో కలిసి భూతములు ఆరు. బుద్ధిలేనిచో గుణములెట్లుండును. కావున ఈ స్థావర జంగమాత్మకమగు విశ్వమంతయు బుద్దిమయమే. బుద్ధినుండే పుట్టును. బుద్ధియందే లయమగును. బుద్ధియే నిర్దేశించును. చూచుదానిని నేత్రమని, వినుదానిని శ్రోత్రమని, వాసన చూచుదానిని ఘ్రాణమని, రుచి చూచుదానిని రసనమని, స్పృశించుదానిని త్వక్ అని యందురు. బుద్దియే ఒకేసారి ఇన్ని వికారములను పొందును. బుద్దియే మనో రూపమున కోరికలను ప్రకటించును. అన్నిటికి అధిష్టానము బుద్ధి. బుద్ధికం ఓ విడిగా అయిదు అర్థములుండును. ఈ అర్థములనే ఇంద్రియములందురు. ఈ ఇంద్రియములను బుద్ధి అదృశ్యముగా అధిష్టించియుండును. పురుషునిలో ఉండు బుద్ది భావత్రయమున నుండును. ఒకపుడు ప్రీతిని పొందును ఒకపుడు చింతించును. కేవలము సుఖముతోను, కేవలము దుఃఖముతోను ఎపుడూ ఉండదు. ఇట్లు మానవుల మనసులో మూడు భావములతో నుండు బావాత్మకమైన బుద్ది భావత్రయమును దాటియుండదు. నదీపతియగు సముద్రము చెలియలికట్టను అతిక్రమించనట్లు, ఇట్లు భావాతీతము కాని బుద్ధి భావములతో కలిసి మనసులో నుండును. ఇట్లుండు మనసు తన భావమును అనుసరించియుండును. ఆ బుద్దియే అన్ని ఇంద్రియములను ప్రవర్తింపచేయును. ప్రీతిసత్త్వము, శోకము రజస్సు, క్రోధము తమము. ఈ లోకములో నున్న అన్ని భావములు ఈ మూడింటిలోనే అంతర్భవించును. ఇట్లు బుద్దిగతములగు భావనలన్నింటిని నీకు వివరించితిని. బుద్ధిమంతుడగు వాడు అన్ని ఇంద్రియములను జయించవలయును. సర్వకాలములందు సత్త్వరజస్తమస్సులు ప్రాణులను ఆశ్రయించియుండును. మూడు విధములగు వేదనలు కూడా అన్ని ప్రాణులలో నుండును. ఆవేదనలే సాత్త్వికీ రాజసీ తామసీ అని పిలువబడును. సుఖస్పర్శము సత్త్వగుణము. దుఃఖస్పర్శ రజో గుణము. ఈ రెండు తమోగుణముతో కలిసి వ్యవహారమును పొందును. ప్రీతియుక్తమైన భావన శరీరమున కాని మనసున కాని యున్నచో దానిని సాత్త్వికీ భావనగా తెలియుము. దుఃఖ సంయుక్తమగు భావన కలిగినచో మనసునకు అప్రీతికరమైనచో దానిని రాజసీ భావనగా తెలియుము. మోహయుక్తము అస్పష్టము, తెలియరానిది ఊహించరానిదిగా భావన ఏర్పడినచో దానిని తామసీ భావనగా తెలియుము. ప్రహర్షము, ప్రీతి, ఆనందము, సుఖము, శాంతచిత్తత అనునవి సాత్త్విక గుణములు. అసంతోషము, పరితాపము, శోకము, లోభము, అసహనము, అనునవి రజోగుణములు. అవమానము, మోహము, ప్రమాదము, నిద్ర, సోమరితనము అనునవి తామస గుణములు ఇతరులను దూషించుట, చిత్తచాంచల్యము అవిశ్వాసముతో ప్రార్థించుట (యాచించుట) కూడా తామసగుణములు. మససును తన వశములో నుంచుకొనిన వాడు సుఖమును పొందగలడు. సూక్ష్మములైన బుద్ధి క్షేత్ర క్షేత్రజ్ఞులకున్న భేదమిది. ఒకటి గుణములను సృజించును మరొకటి సృజించదు. దోమ సాలె పురుగు వీటికి దృష్టాంతములు. ఒకదానికొకటిగా వేరుగా నుండును. రెండు కలిసి యుండును. ప్రకృతి కంటే విడిగా నుండును. ఎప్పుడూ కలిసియే యుండును. చేప, జలము కలిసియే యుండును. కాని ఆ రెండు ఒకటిగా నుండవు వేరుగా నుండును. గుణములు ఆత్మను తెలియజాలవు. ఆత్మ అన్ని గుణములను తెలియును. ఆత్మయే గుణములను సృజించును దర్శించును. బుద్ధిమంతులు ఇంద్రియములను దీపముగా ఉపయోగించుకొందురు. చేష్టారహిరములచే జ్ఞానములు లేని వాటిచే ప్రకాశరూపుడు పరమాత్మ. సత్త్వము గుణములను సృజించును. క్షేత్రజ్ఞుడు దర్శించును. సత్వక్షేత్రజ్ఞుల సంయోగము మాత్రము నిశ్చితము. సత్త్వమునకు క్షేత్రజ్ఞునకు ఆశ్రయమేదీ యుండదు. సత్త్వము మనసును సృజించును కొని గుణములను సృజించదు. గుణ పగ్గములను మనసుచే నిగ్రహించినచో ఘటమున నున్న దీపము వలె ఆత్మ ప్రకాశించును. ప్రకృతి సంబంధములగు కర్మలను విడిచి నిత్యము ఆత్మయందు రమించు ముని ఉత్తమగతిని పొందును. నీటిలో తిరుగు పక్షి నీరు నంటనట్లు కృతప్రజ్ఞుడు భూతములలో తిరుగుచు భూతములనంటడు. ఇదియే స్వభావము. మానవుడు తన బుద్దిచే విహరించవలయును.

 కలతలకు కుందక సంపదలకు సంతోషించక మాత్సర్యమును విడిచి అన్నిటిలో సముడై భావయుక్తమగు మనసుతో గుణములను సృజించును. సాలెపురుగు తాను సూత్రములను సృజించుటను పోలికగా తెలియును. సాలెపురుగు సృజించిన సూత్రములు నశించినవి మరల సృజించబడవు నశించినవి  మరల లభించవు. ప్రత్యక్షముచే పరోక్షమును అనుమానముచే గ్రహించబడును. ఇట్లు కొందరు నిశ్చయించిరి ఇతరులు నివృత్తిని నిశ్చయించిరి. ఈ రెండు మతములను ఆలోచించి బుద్దికి తోచినట్లు నిశ్చయించవలయును. ఇట్లు బుద్ది చింతామయమైన హృదయగ్రంధిని - దృఢముగా విచ్చేదమును చేసుకొని సంశయములు భిన్నములు కాగా ఆనందముగా నుండవలయును. నదిని చేరి మానవులు మలినమును తొలగించుకోనునట్లు హృదయగ్రంథి భేదముచే శుద్ధిని పొందెదరు. తీరమును తెలిసినవారు పరితపించక మహానదిని దాటగలిగినట్లు తత్వజ్ఞుడు పరితపించడు. ఇట్లు ఉత్తమజ్ఞానము, కైవల్యము అనబడు అధ్యాత్మమును తెలిసియుందురు. ఇట్లు భూతముల గమనాగమనములను తెలిసి బుద్ధిచే నిశ్చయించి శాంతిని పొందవలయును. ఇట్లు త్రివర్గమును తెలిసి, జ్ఞానముచే బంధమును విడిచి, తెలియవలసిన దానిని అన్వేషించి తత్త్వదర్శియై ఉత్సుకుడు కాక యుండవలయును. ఇంద్రియవిభాగముచే ఆత్మ దర్శనము చేయజాలడు దీనిని తెలిసినవాడు మాత్రమే బుద్దుడగును. ఈ విషయమును తెలిసిన బుద్ధిమంతులు కృతకృత్యుదురు. తెలియని వారికి కలుగు భయము తెలిసినవారికి కలుగదు. దేనికైనను ఇంతకన్ననూ అధికమైన గతి యుండదు. గుణములున్నచో అసమానత్వము లభించును. సంగము లేక అన్వేషించువాడు పురాకృతమును దహింప చేయును. అట్టివానికి ప్రియము ఆప్రియము రెండు ఉండవు. ఈ లోకము ఆయువును గూర్చి అసూయ చెందును. అట్లు చేయువానికి ఆయువు అసూయనే కలిగించును. ఈ విషయమున జ్ఞాని విచారించడు. అజ్ఞానికి ప్రతిక్షణమున భయము కలుగును.

 భరద్వాజ మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! అధ్యాత్మపదమును సిద్ధించుటకు ధ్యానయోగమును తెలుపుము. అధ్యాత్మజ్ఞానముచే తాపత్రయ విముక్తుడగును.

భగురువాచ :-

 భృగుమహర్షి పలికెను:- నీకు నాలుగు విధములుగానున్న జ్ఞానయోగమును చెప్పెదను. ఈ జ్ఞానయోగమును తెలిసిన మహర్షులు సిద్ధిని పొందెదరు. జ్ఞానతృప్తులగు నిర్వాణమును చెందిన మనసు గలవారై మహర్షులు యోగులు ధ్యానమును చక్కగా అనుషింతురు. సంసారదోషము నుండి ముక్తులై మరల జన్మించరు. జన్మ దోషములను క్షీణించినవారై స్వభావమున నుందురు. నిర్ద్వంద్వులై నిత్యసత్త్వస్థులై ముక్తులై పరిగ్రహశూన్యులై మనశ్శాంతికరములైన అసంగాదులను అలవరచుకొని క్రిష్ణమగు మనసును ఏకాగ్రముగా ధరించవలయును. మౌనముచే కాష్ఠమువలె ఆసీనుడై ఇంద్రియ సమూహమును ఒకచోట చేర్చవలయును. చెవులతో శబ్దమును వినరాదు. త్వగింద్రియముచే స్పర్శను తెలియరాదు. కంటితో చూడరాదు. నాలుకతో రుచిని తెలియరాదు. నాసికతో చాసన చూడరాదు. తత్త్వజుడు ధ్యానములో అన్నింటిని పరిత్యజించవలయును. నిగ్రహముచే పంచేంద్రియములను పెడదారిపట్టించు శబ్దాదివిషయములందు కోరికను వీడవలయును. తరువాత పంచేంద్రియములను మనసున సంగ్రహించి భ్రాంతమగు మనసును మనసుచే సంధానమును చేయవలయును. అంతట తిరుగునది ఆధారరహితము పంచద్వారము బలాబలసంయుక్తము అయిన మనసును ధ్యానపథమున సంధానము చేయవలయును. ఇంద్రియములను మనసును ఒకటిగా సంధానము చేయుటయే నేను చెప్పిన మొదటి ధ్యాన మార్గము. తరువాత ఇంద్రియములను మనసును ఆత్మ సంస్థమును చేయవలయును. అపుడు మేఘమున సముద్రాంతమున మెరయు మెరపువలే స్పురించును. ఆకు మీద నున్న జలబిందువు అంతటా లోలమై చంచలమై యుండునో అట్లే ఇతని మనసు ధ్యానమార్గమున నుండును. సావధానము చేసిన మనసు క్షణకాలము ఏకాగ్రముగా నుండును. మరల ఆకాశమున వాయువువలె భ్రాంతమగును. నిర్వేదములేనివాడై క్లేశము లేనివాడై సోమరితనమును విడిచి మాత్సర్యము లేనివాడై ధ్యానయోగమును తెలిసి ధ్యానముచే మనసును సంధానమును చేయవలయును. అట్లు చేసినచో విచారము, వితర్కము, వివేకము కలుగును. సమాధియుక్తుడగు మునికి మొదటిది ధ్యానము, కష్టపడియైనను మనసమాధానమును కూర్చుకొనవలయును. ముని నిర్వేదమును పొందరాదు. ఆత్మ హితమును సంపాదించవలయును. ధూళి భస్మము, పేడ వీటి రాశులను నీటితో తడిపినచో చెదిరిపోక ముద్దగా మారును. తరువాత ఎండి మరల పొడిగా మారి చెదిరి పోవునో అట్లే మొదట ఇంద్రియపంచకమును ధ్యానముచే ముద్దగా చేసి సమాధిచే ఎండబెట్టి ఏకాగ్రతచే పొడిచేసి జ్ఞానముచే పారద్రోలవలయును. ఇట్లు క్రమముగా ఇంద్రియసంహారమును చేసినచో శమించును. ఇట్లు మెల్లగా మనసును ఇంద్రియ పంచకమును మొదట ధ్యానమార్గమున నిలిపిన, నిత్యయోగములో శమించును. ఇట్లు నియతాత్మయగు వానికి పురుషకారముతో కాని దైవముచే కాని సుఖము కలుగదు. ఆత్మనియమముచే మాత్రమే ఆనందమును పొందగలడు. ఆ ఆనందముచే కూడి ధ్యానమొనరించును. ఇట్లు యోగులు నిర్వాణమును చెందేదరు.

 సనంద మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! ఇట్లు భృగుమహర్షి భరద్వాజమహర్షికి ఉపదేశించగా పరమధర్మాత్ముడగు భరద్వాజ మహర్షి ఆశ్చర్యమును చెందినవాడై భృగుమహర్షిని చక్కగా పూజించెను. ఓ జ్ఞానియగు నారదా ! ఇట్లు నీవడిగిన జగదుత్పత్తి క్రమమును సంపూర్ణముగా వివరించితిని. ఇంకను ఏమి వినగోరెదవో తెలుపుము.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున నలుబది నాలుగవ అధ్యాయము సమాప్తము.