నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

94 - విష్ణు పురాణాను క్రమణీ నిరూపణమ్

శ్రీ బ్రహ్మ పలికెను :-

ఓ పుత్రా! ఇరువది మూడువేల శ్లోకములు కలిగి, మహా పాతక నాశకమగు, గొప్ప విష్ణుపురాణమును చెప్పెదను వినుము. ఈ పురాణమున మొదటి భాగమున పరాశర మహర్షి ఆరు యంశములను నిర్దేశించెను. వాటిలో మొదటి యంశమున పరాశర మహర్షి మైత్రేయునకు ఆదికారణ సర్గమును, దేవాది సంభమును, సముద్రమథనాఖ్యానమును, దక్షాది వంశవర్ణనమును, ధ్రువ చరితమును, పృథుచరితమును, ప్రాచేత సచరితమును, ప్రహ్లాద కథను, విడివిడిగా రాజ్యాధికారములను చెప్పెను.

ప్రియవ్రత వంశ చరితము, ద్వీప వర్ష నిరూపణము, పాతాలనరకాఖ్యానము, సప్త సర్గ నిరూపణము, సూర్యాది వార కథనము విడివిడిగా లక్షణములు, భరత చరితము ముక్తి మార్గ నిదర్శనము, నిదాఘ ఋభు సంవాదము, ద్వితీయాంశమున చెప్పబడియున్నవి.

మన్వన్తరసమాఖ్యానము, వేదవ్యాసావతారము, నరకోద్దారక కర్మ సగర ఔర్వ సంవాదమున సర్వధర్మ నిరూపణము, శ్రాద్ద కల్పము, వర్ణాశ్రమ నిబన్లనము, సదాచారము, మాయా మోహకథా సర్వపాప ప్రణాశనమగు మూడవ యంశమున చెప్పబడినది. పవిత్రమగు సూర్యవంశ కథ, సోమవంశాను కీర్తనము, నానా రాజ కథాన్వితముగా చతుర్థాంశమున చెప్పబడినవి. కృష్ణావతార సంప్రశ్నము, గోకులీయకథ, బాల్యమున పూతనావధ, కౌమారమున అఘాసురాది వధ, కైశోరమున కంసవధ, మధురాచరితము, యౌవనమున ద్వారకలోని లీలలు, సర్వదైత్యవధ, వేరు వేరు వివాహములు, ఈ ద్వారకలో నుండి యోగేశ్వరేశ్వరుడు జగన్నాథుడగు శ్రీ కృష్ణునిచే శత్రుసంహారమును చేసి భూభారహరణము చేయుట అష్టావక్రుని కథ, ఇవి అయిదవ అంశమున చెప్పబడినవి.

కలియుగ చరిత్రము ప్రలయచాతుర్విధ్యము. బ్రహ్మజ్ఞాన సముద్దేశమును ఖాండిక్యునకు కేశిధ్వజుడు చెప్పుట ఆరవయంశమున చెప్పబడినది.

ఇక రెండవ భాగమున శౌనకాదులు అడుగగా సూత మహర్షి విష్ణుధర్మోత్తరములను పేరుగల పవిత్రములగు నానాధర్మ కథలను, వ్రతాది నియమములను, ధర్మశాస్త్రమును అర్థశాస్త్రమును వేదాంతమును, జ్యోతిష్యమును, ప్రకరణానుసారముగా వంశాఖ్యానములను, స్తోతములను, మంత్రములను, సర్వలోకోపకారకములగు నానా విద్యలను, చేప్పెను. ఇదియే సర్వశాస్త్రార్థ సంగ్రహమగు విష్ణు పురాణము. ఇచటనే వ్యాసమహర్షి వారాహ కల్పవృతానమును చెప్పెను. ఈ విష్ణు పురాణమును భక్తితో చదివిన వాడు, ఆదరముతో వినినవాడు, ఇహలోకమున భోగములననుభవించి విష్ణులోకమును పొందెదరు. ఆషాఢ పూర్ణిమా తిధి యందు ఈ విష్ణు పురాణమును ఘృత ధేను సహితముగా పురాణార్థములు తెలిసియున్న విష్ణుభక్తునకు దానము చేసినచో సూర్యకాంతి గల విమానముచే విష్ణులోకమును చేరును. ఈ విష్ణుపురాణాను క్రమణిని చెప్పిననూ వినిననూ విష్ణుపురాణ శ్రవణ ఫలమును పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వ భాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున విష్ణుపురాణాను క్రమణీ నిరూపణమను తొంబది నాలుగవ అధ్యాయము.