నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

21 - పంచరాత్రివ్రతమ్

సనకమహర్షి పలికెను : ఓ నారదా ! మరియొక వ్రతమును చెప్పెదను వినుము. అన్ని లోకములలో హరి పంచకమను పేరుతో ప్రసిద్ధి పొందినది. స్త్రీలకు పురుషులకు అన్ని దుఃఖములను నివారించునది. ఓ మునిసత్తమా ! ఈ వ్రతము ధర్మ కామార్ధమోక్షములకు మూలము. సర్వాభీష్ట ఫలప్రదము సర్వవ్రత ఫలప్రదము. మార్గశీర్షశుక్లదశమీన ఇంద్రియ జయము. కలిగి దంతధావన పూర్వకముగా స్నానాదికమును చేయవలయును. దేవార్చనను పంచమహా యజ్ఞములను నిర్వర్తించవలయును. ఏకాదశీ తిథిన ప్రాతఃకాలమున లేచి ఆచారానుగుణముగా స్నానాదికమును నిర్వర్తించి గృహమున శ్రీహరిని అర్చించవలయును. అపుడు పంచామృతముతో దేవదేవునికి అభి షేకము చేయవలయును. ఉత్తమ భక్తితో యథాక్రమముగా గంధపుష్పాదులచే అర్చన చేయవలయును. ధూపదీపనైవేద్య తాంబూలప్రదక్షిణాదులచే చక్కగా అర్చించి ఈ మంత్రమునుచ్చరించ వలయును. “నమస్తే జ్ఞానరూపాయ జ్ఞానదాయ నమోస్తు తే, నమస్తే సర్వరూపాయ సర్వ సిద్ధి ప్రదాయినే”.

 (“జ్ఞానస్వరూపునికి, జ్ఞానప్రదునికి, సర్వరూపునికి, సర్వసిద్ధి ప్రదాయకునకు నమస్కారము” అని దీని అర్థము) ఇట్లు వాసుదేవునికి నమస్కరించి ముందు చెప్పబోవు మస్త్రముతో ఉపవాసమును సమర్పించవలయును. ‘పంచరాత్రం నిరాహారో హ్యద్య ప్రభృతి కేశవ ! త్వదాజ్ఞయా జగత్వామిన్మమాభీష్టప్రదో భవ. అని (“ఓ కేశావా ! ఈ దినమునుండి అయిదు రాత్రులు నీ యాజ్ఞచే నిరాహారముగా నుందును. నా అభీష్టమును ప్రసాదించుము”) ఇట్లు ఇంద్రియ జయముతో ఉపవాసమును దేవదేవునికి సమర్పించి రాత్రి పూట జాగరణ చేయవలయును. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమాతిధులలో జాగరణ చేయవలయును. ఈ అయిదు దినములలో పంచామృతాదిపూజ సమానమే. పూర్ణిమాదినమున శక్తి ననుసరించి పొలతో శ్రీ మహావిష్ణువున కభి షేకమును చేయవలయును. అట్ల తిలహోమమును తిలదానమును చేయవలయును. ఆరవదినమున తమతమ ఆశ్రమాచారములను ముగించుకొని పంచగవ్యప్రాశనమును చేసి యథావిధిగా శ్రీహరిని పూజించవలయును. సంపదలున్నచో తప్పక బ్రాహ్మణభోజనమును జరిపించవలయును. తరువాత మౌనముతో బంధువులతో తాను భుజించవలయును. ఇట్ల పుష్యమాసము మొదలు కార్తిక మాసము వరకు శుక్లపక్షమున పూర్వోక్త విధితో వ్రతము నాచరించవలయును. ఇట్లు సర్వపాపహరమగు వ్రతమును ఒక సంవత్సరము నాచరించవలయును. మరల మార్గశీర్షమాసమున ఉద్యాపన చేయవలయును. మొదటి వలే ఏకాదశీ తిథిలో నిరాహారముగా నుండవలయును. ద్వాదశీతిధిన పంచగవ్య ప్రాశనమును చేయవలయును. ధూపదీప గంధపుష్పాదులచే దేవదేవుడగు జనార్ధనుని చక్కగా పూజించి ఇంద్రియ నిగ్రహముతో బ్రాహ్మణునకు ఉపాయనమును సమర్పించవలయును. నేయి తేనె కలిసిన పాయసమును పండ్లతో సుగంధ జలములతో దక్షిణతో కూడిన జలకుంభమును పంచరత్నములతో కూడియున్న జలకుంభమును వస్త్రముతో ఆచ్చాదనమును చేసి అధ్యాత్మజ్ఞానము కల బ్రాహ్మణునకు సమర్పించవలయును. “సర్వాత్మ స్సర్వభూతేశ సర్వవ్యాపిన్సనాతన పరమాన్న ప్రదానేన సుప్రీతో భవ మాధవ” అను మంత్రముచే పాయసదానమును చేసి బ్రాహ్మణభోజనమును జరుపవలయును. (“సర్వాత్మా ! సర్వభూతాధిపతీ ! సర్వవ్యాపీ ! సనాతన ! మాధవా ! పరమాన్నదానముచే నాకు ప్రీతుడవు  కమ్ము" అని పై మంత్రమున కర్థము) శక్తి కొలది బంధువులతో కలిసి తాను కూడా మౌనముతో భుజించవలయును. హరిపంచకమను ఈ వ్రతమును ఆచరించినవారు బ్రహ్మలోకమునుండి తిరిగి రారు. సమస్త పాపారణ్యదవానలము ఉత్తమము అయిన ఈ వ్రతమును మోక్షమును కోరువారు నాచరించవలయును. ఈ పంచరాత్ర వ్రతముచే ఉపవాసముచే వేయి కోట్ల గోదాన ఫలము లభించును. నారాయణుని మీద భక్తిచే ఈ వ్రతవిధానమును వినిన వారికి మహారములైన పాతకకోట్లు నశించును.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున వ్రతాఖ్యానమున మార్గశీర్షశుక్లద్వాదశి నుండి పూర్ణిమాపర్యన్తము పంచరాత్రి వ్రతమను ఇరువది యొకటవ అధ్యాయము సమాప్తము.