నారద మహా పురాణము - పూర్వార్థము
37 - విష్ణుమాహాత్మ్యమ్
సనక మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా శ్రీపతి మాహాత్మ్యమును. ఇంకనూ చెప్పెదను వినుము. హరి కథామృతమును సేవించుటకు ప్రీతికలగనిదెవరికి ? మమకారముచే ఆకులమైన మనస్సున కలవారు విషయాంధులైన మానవులకు సర్వపాపప్రణాశము చేయునది ఒక్క హరినామమే. మానవుల పాపములను నశింపచేయు శ్రీహరిని ఒక్కసారి కూడా నమస్కరించని వానిని చండాలునిగా తెలియుము. అతనితో ఎపుడూ సంభాషించరాదు. హరిపూజా హీనమైన గృహము స్మశానము వంటిది. అట్టి గృహమున ప్రవేశించరాదు. హరి పూజా విహీనులు వేద విద్వేషులు గోబ్రాహ్మణ ద్వేషులు రాక్షసులుగా పరిగణింప బడుదురు. బ్రాహ్మణులను ద్వేషించువాడు శ్రీహరిని పూజించిననూ ఆ పూజ నిష్పలమే యగును. ఇతరుల శ్రేయస్సును నశింపచేయుటకు చేయు హరిపూజచేయువారినే నశింపచేయును. శ్రీహరిని పూజించువారు పాపము నాచరించినచో అతనిని విష్ణుద్వేషియని తత్త్వారకోవిదులు చెప్పెదరు. విష్ణునిరతులు లోకానుగ్రహ తత్పరులు ధర్మ కార్యనిరతులుగా నున్నవారు. విష్ణురూపులని ప్రాక్టులు ప్రవచించిరి. కోటిజన్మలలో చేసిన పుణ్యములచే విష్ణుభక్తి కలుగును. శ్రీమహావిష్ణువుయందు ధృడమైన భక్తి గలవారికి పాపబుద్ది ఎట్లు కలుగును ? విష్ణుపూజాపరులకు కోటిజన్మలలో చేసిన పాపము క్షణకాలమున నశించుచున్న అట్టివారికి పాపబుద్ధి ఎట్లు కలుగును ? విష్ణుభక్తి పరులైనచో శ్రేషులుగా పరిగణించబడుదురు. విషయాంధులగు నరులకు సర్వదుఃఖవినాశనమగు హరి సేవభక్తి ముక్తులను ప్రసాదించును. సంగము వలనకాని, స్నేహము వలన కాని, భయము వలన కాని, లోభము వలనకాని అజ్ఞానవశమున కాని విష్ణువును ఉపాసించిన నరులు తరగని సుఖమును పొందెదరు. హరిపదజలమును ఒక కణమును పానము చేసినను సర్వతీర్థస్నానఫలమును పొంది శ్రీమహావిష్ణువునకు ప్రీతిపాత్రుడగును. శ్రీహరిపాదతీర్థము అకాలమృత్యుశమనము సర్వవ్యాధి వినాశనము సర్వదుఃఖోపశనము. పరంధాముడు జ్యోతిస్వరూపుడగు శ్రీమన్నారాయణుని శరణువేడినవారు శాశ్వతముక్తిని పొందెదరు. ఈ విషయమున ఒక ఇతిహాసమును చేప్పెదరు. ఇది చదువువారికి వినువారికి అన్ని పాపములను నశింపచేయును.
పూర్వకాలమున కృతయుగమున గులికుడను పేరుగల వేటగాడుండెను. అతడు ఎల్లకాలము పరదారలను పరద్రవ్యములను హరించుచుండెడివాడు. పరనిందాపరుడు నిత్యము జంతువులను హింసించువాడు. వేలకొలది బ్రాహ్మణులను. గోవులను వధించెడివాడు. వేటగాళ్ళకు రాజైన గులికుడు నిత్యము దేవధనమును పరుల ధనమును హరించుటయందు ఆసక్తిని చూ పెడివాడు. గులికుడు చేసిన పాపములను కోటి సంవత్సరములలో కూడా లెక్కించజాలము. ఒకపుడు గులికుడు జంతువుల పాలిటి యముడు సర్వేశ్వర్యసమన్వితము ఆభరణములు ధరించిన స్త్రీలతో కూడి యున్నది, స్వచ్చ జలములు కల సరస్సులచే శోభించబడునది చక్కని ఆపణములతో ఆలంకరించబడి అమరావతిని బోలు సౌవీరరాజ నగరమునకు వెళ్ళెను. ఆ నగరమునకు సమీపముననున్న ఉద్యానవనమధ్యముననున్న సుందరమగు శ్రీహరి మందిరమును బంగారు కలశములచే కూడియున్నదానిని చూచి గులికుడు సంతోషించెను. ఇచట చాలా బంగారమును లభించగలదు అని నిశ్చయించుకొని చౌర్యము నందు వ్యామోహమున్న వేటగాడు దేవాలయము లోపలికి వెళ్ళేను. అచట తత్త్వార్థ కోవిదుడు శాంతుడు, శ్రీహరిపరిచర్యాపరుడు తపోనిధి ఉత్తంకుడును బ్రాహ్మణోత్తముని చూచెను. ఉత్తంకుడు ఏకాకి దయాలువుని నిస్సహుడు ధ్యానరతుడు గానుండెను. దైవద్రవ్యమునందు మిక్కిలి ఆశగలవాడు కావున ఉత్తంకుని తన కార్యమునకు అడ్డుగా తలిచి అతిసాహసముతో ఉత్తంకుని వధించ నిశ్చయించి మదోద్దతుడై ఖడ్గమును చేత పట్టుకొని వక్షస్థలమును తన పాదముతో అదిమి పట్టి మరొక చేతితో జటలను పట్టుకొని చంపబోవు గులికుని చూచి ఉత్తంకు డిట్లు పలికెను.
ఉత్తంక మహర్షి పలికెను :- ఓ సాధూ ! నిరపరాధీనగు నన్ను వ్యర్థముగా చంపుచున్నావు. ఓ బుద్ధిమంతుడా ! నేను నీ యెడ చేసిన అపరాధమేమిటో చెప్పుము. అపరాధము చేసిన వారిని సమర్థులు శిక్షింతురు. కాని నిరపరాధులను సజ్జనులు పాపులు ఎవరైనను వధింపరు, సజ్జనులు శాంతచిత్తులు శత్రువులగు మూర్భులలో అవగుణములను చూచియు ద్వేషించరు. ఎంతగా బాధించిననూ క్షమించువాడు ఉత్తమనరుడు. వాడే విష్ణువునకు ప్రీతిపాత్రుడు. పరులను హితము నాచరించవలయునని కోరు సజ్జనుడు వినాశకాలమున కూడా ద్వేషమును చూపడు. చందన వృక్షము తనను నరుకుచున్న గొడ్డలికి కూడా సుగంధము నిచ్చును. జనులను బహువిధములుగా బాధించు విధి ఎంత బలీయము ! సర్వసంగపరిత్యాగులు కూడా దురాత్ములచే బాధించబడుచున్నారు. లోకమున నిష్కారణముగా దురాత్మలచే బాధించబడుచున్నారు. దుర్జనులు కూడా సాధువులనే బాధించుచున్నారు కాని తమతో సమానులను బాధించుటలేదు. లేళ్ళు, చేపలు, సజ్జనులు గడ్డితో నోటితో సంతోషముతో బ్రతుకుచుందురు. వేటగాళ్ళు బెస్తవారు లోభులు వీరిని నిష్కారణముగా ద్వేషించి హింసించెదరు. ఈ జగత్తునంతటిని మోహింపచేయు మాయ ఎంత బలీయము. పుత్రమిత్ర కలత్రము కొఱకు అందరిని దుఃఖింపచేయను. నీవు పరులద్రవ్యము అపహరించి కలత్రమును పోషించితివి. అవసానకాలమున అన్నింటిని అందరిని విడిచి ఒంటరిగా వెళ్ళేదవు. నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా పుత్రులు, ఇదియంతయూ నాది అని మమకారము ప్రాణులను ఎంతగా బాధించుచున్నది ? ద్రవ్యము నార్జించు వరకే బంధువులు వెంట ఉందురు. ఇహపరములలో వెంట తోడుగా నుండునవి ధర్మాధర్మములు మాత్రమే. ధర్మాధర్మములచే సంపాదించిన ద్రవ్యము నార్జించువరకే బంధువులు వెంట ఉందురు. ఇహ పరములలో వెంట తోడుగా నుండనవి ధర్మాధర్మములు మాత్రమే. ధర్మాధర్మములచే సంపాదించిన ద్రవ్యముతో పోషించబడిన బంధువులు సంపాదించినవాడు మరణించగా అతనిని అగ్నికి ఆహుతి చేసి తాము నేతి భోజనము చేతురు. పరలోకమునకు వెళ్ళువారి వెంటవచ్చునవి ధర్మధర్మములే కాని పుత్రులు బంధువులు సంపదలు కావు. పాపకర్మలను చేయువారికి కోరికలు పెరుగుచుండును. పుణ్య కార్యములను చేయువారికి కోరికలు నశించుచుండును. లోకులు ధనమును సంపాదించుటకు వ్యర్థముగా ఆకులపడుదురు. జరుగవలసినది జరిగియే తీరును. జరుగరానిది జరుగనే జరగదు. ఇట్లు నిశ్చయముగా కలవారిని చింత బాధించదు. స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తంతయూ దైవాధీనమే. కావున పుట్టుకను మరణము దైవమే తెలియును. ఇతరులు తెలియుజాలరు. ఎక్కడ ఉన్ననూ జరుగవలసినది జరిగియే తీరును. ఆ విషయము తెలిసికొనక లోకము వ్యర్థముగా బాధపడును. మమకారముచే ఆకులమైన మనసు కల వారికెంత దుఃఖము ప్రయత్నముచే మహాపాపములను చేసి ఇతరులను పోషింతురు. తాను సంపాదించిన ధనమునంతటిని బాంధవులు అనుభవించెదరు. తాను మాత్రము మూడుడై ఒంటరిగా పాపఫలము ననుభవించును. ఇట్లు పలుకుచున్న ఉత్తంక మహర్షి మాటలను విని భయముచే వణుకుచు విడిచి చేతులు జోడించి గులికుడు మాటిమాటికి క్షమించుము క్షమించుము అని ప్రార్థించెను. సజ్జనసాంగత్య ప్రభావముచే హరిసాన్నిధ్యము వలన పాపములు తొలగగా గులికుడు పశ్చాత్తాపముతో నిట్లు పలికెను.
ఓ బ్రాహ్మణోత్తమా ! నేను చాలా గొప్పపాపములను చేసితిని. మీ దర్శనముచే అవియన్నియు నశించినవి. నేను పాప బుద్ధినై మహాపాతకముల నాచరించితిని. నాకు నిష్కృతి. ఎట్లు లభించును ? ఎవరిని శరణు వేడెదను ? పూర్వజన్మములో చేసిన పాపములచే ఈ వ్యాధజన్మము వచ్చినది. ఈ జన్మములో కూడా పాపములను చేసితిని. మరల నా కేగతి పట్టునో ! నా ఆయుష్యము . వేగముగా తరిగి పోవుచున్నది. చాలా పాపములను మూట కట్టుకొంటిని. ప్రాయశ్చిత్తముల నాచరించలేక పోతిని. చివరికి నాకు ప్రతిఫలమేది రాబోవుచున్నది ? ఏ జన్మ కలుగునో ? అనేక పాపములచే అమలుడనైన నన్ను విధి ఏల పాపరతునిగా సృష్టించినది. నేనీ పాపఫలములను ఎన్ని జన్మములలో అనుభవించవలయునో ! ఇట్లు తనలో తాను తనను నిందించుకోనిన వ్యాధుడు అంతస్తాపాగ్నిచే వెంటనే మృతి చెందెను. పడిన వ్యాధుని చూచి దయాళువైన ఉత్తంకుడు విష్ణుపాదోదకము పైన చల్లెను. హరిపాదోదకస్పర్శచే పాపములు నశించిన వ్యాధుడు దివ్యవిమానమునధిరోహించి ఉత్తంకమహర్షిని గూర్చి ఇట్లు పలికెను.
గులికుడు పలికెను :- ఓ మునిశ్రేషా ! ఉత్తంకా ! మీరు నాకు గురువర్యులు. - మీ అనుగ్రహముచే మహాపాతకసంచయమునుండి విముక్తుడనైతిని. మీ ఉపదేశమువలన సంతాపము తొలగినది. సర్వపాపములు నశించినవి. మీరు నాపై హరిపాదోదక సేచనము చేసితిరి. కావున మీచే ఆ విష్ణుపదమును చేర్పించబడితిని. మీ. అనుగ్రహముచే నేను పాపములనుండి శరీరమునుండి విముక్తుడనైతిని. కావున మీకు నమస్కరించుచున్నాను. నేను చేసిన దానిని క్షమింపుము. ఇట్లు పలికి ఉత్తంకుని పై పుష్ప వర్షమును కురిపించెను. ప్రదక్షిణత్రయమును చేసి నమస్కారములాచరించెను. తరువాత సర్వకామసమన్వితమగు విమానము నధిరోహించి అప్పరోగణములచే కూడి హరిమందరిమును చేరెను. తపోనిధియగు ఉత్తంకుడు ఈ దృశ్యమును చూచి ఆశ్చర్యమునొంది, చేతులు జోడించి శ్రీమన్నారాయణుని స్తుతించెను. ఇట్లు స్తుతించబడి శ్రీమహావిష్ణువు ఉత్తంకునకు ఉత్తమ వరము నిచ్చెను. ఆ వరముచే ఉత్తంకుడు కూడా మోక్షమునొందెను.
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున విష్ణుమాహాత్మ్యమున ముప్పదియేడవ అధ్యాయము సమాప్తము.
