నారద మహా పురాణము - పూర్వార్థము
4 - భక్తివర్ణనం - మార్కండేయ చరితారంభః
సనక మహర్షి పలికెను : భక్తిచే కూడినపుడే అన్ని ధర్మములు కోరిన ఫలముల నీయగలవు. భక్తి చేతనే అన్నింటిని సాధించవచ్చును. భక్తి చేత శ్రీహరి సంతోషించును. భక్తి చేతనే భక్తిని ఆచరించవలయును. అన్ని పనులను భక్తితో చేయవలయును. భక్తి లేక చేసిన కార్యములు సిద్ధించవు. జీవులు పనులు చేయుటకు వెలుగు కారణమైనట్లు అన్ని కార్య సిద్దులకు భక్తి మూలకారణము. అన్ని ప్రాణులకు నీరు జీవానాధారమైనట్లు అన్ని సిద్దులకు - భక్తి మూలాధారము. భూమిని ఆధారముగా చేసుకొని అన్ని ప్రాణులు జీవించునట్లు భక్తిని ఆశ్రయించి అన్ని కార్యములను సాధించవలయును. భక్తి కలవాడే ధర్మార్థకామమోక్షములను సులభముగా పొందగలడు. భక్తి లేని దానములతో తపములతో బహుదక్షిణలనిచ్చు యజ్ఞములతో కూడా శ్రీహరి సంతోషించడు. భక్తి లేక మేరుపర్వతమంత బంగారురాశులను కోట్ల కొలదిగా ఇచ్చిననూ ద్రవ్యనాశము తప్ప ఫలము కలుగదు. భక్తి లేనిదే చేసిన తపస్సు శరీరశోషణే యగును. భక్తి హీనముగా అగ్నిలో ఇచ్చిన హవిస్సు బూడిదలో వేసిన హవిస్సువలె నిష్పలమగును. భక్తితో ఎంత చిన్న పనిచేసినను శాశ్వతమైన కీర్తిని, ప్రీతిని కలిగించును. భక్తి హీనముగా వేయి అశ్వమేధయాగములను చేసినను, వేదవిహితకర్మల నాచరించినను అవి యన్నియు నీష్పలములే యగును.
మానవులకు ఉత్తమమైన హరి భక్తియే. కామధేనువు వలే అన్ని కోరికలనిచ్చును. ఆ హరిభక్తియుండగా సంసార విషమును అజ్ఞానులు మాత్రమే త్రాగెదరు. నిస్సారమైన ఈ సంసారమున భగవద్భక్తులతో కలిసి యుండుట, శ్రీహరి భక్తి, ఓర్పు అను నీ మూడు మాత్రమే సారవంతములు. అసూయ కలవారు చేసెడి దొనాదులు, చూ పేడి భక్తి నిష్పలములే. వారికి శ్రీహరి చాలదూరముగానుండును. పరుల సేవచే పరితపించువారికి బూటకపు ఆచారమునందు ప్రీతి చూపువారికి, అసత్య కర్మలను ఆచరించువారికి శ్రీహరి దూరముగా ఉండును. మహాధర్మములను గూర్చి సంశయించువారికి, మహాధర్మములు అసత్యములని చెప్పువారికి, ధర్మములందు భక్తి లేని వారికి శ్రీహరి దూరముగా నుండును. వేదముచే విధించబడినది ధర్మము. వేదము సాక్షాత్తుగా నారాయణ స్వరూపము. ఆ వేదముల పై భక్తి లేని వారికి శ్రీహరి దూరముగా నుండును. ధర్మ హీనములైన దీనములను గడుపువాడు లోహకారుని వద్దనుండు తోలుతిత్తి వలె ఊపిరి పీల్చుచు విడుచుచున్ననూ జీవించువాడు కాడు. ధర్మార్థ కామమోక్షములను సనాతన పురుషార్థములు భక్తి కలవారికి మాత్రమే సిద్దించును. తన ఆచారమును అతిక్రమించక హరిభక్తి గల నరుడు నిత్యసూరులు చూచు శ్రీహరి భవనమునకు చేరగలడు.
ఓ మునీంద్రా! వేదవిహితములు స్వాశ్రమోచితములైన ధర్మములనాచరించుచు హరిధ్యానపరుడైనవాడు పరమపదమును పొందును. ఆచారమునుండి ధర్మము పుట్టును. ధర్మమునకు అధిపతి శ్రీమన్నారాయణుడు. ఆశ్రమాచారముతో కూడినవాడే శ్రీహరిని పూజించగలడు. వేదములను, వేదాంగములను, వేదాన్తములైన ఉపనిషత్తులను చక్కగా అధ్యయనముచేసి అవగతము చేసుకొన్ననూ ఆచారభ్రష్టుడైనచో కర్మ బహిష్కృతుడై పతితుడగును. హరిభక్తి కలవాడైనను ,హరిధ్యానము చేయువాడైనను తన ఆశ్రమాచారమునుండి భ్రష్టుడైనచో పతితుడందురు. వేదము కాని, హరి భక్తి కాని,శివభక్తి కాని ఆచారభ్రష్టుడైన మూడుని పవిత్రుని చేయజాలదు. పుణ్యక్షేత్రములకు వెళ్ళుట, పుణ్యతీర్థములను సేవించుట, పలు విధములైన యజ్ఞములు ఇవి అన్నియూ ఆచారమును వదిలిన వానిని రక్షించజాలవు. ఆచారము వలన స్వర్గము లభించును. ఆచారము వలన సుఖము లభించును. ఆచారము వలన మోక్షము లభించును. ఆచారము వలన లభించనిదేది ? అన్ని ఆచారములను అన్ని యోగములను, చివరికి హరిభక్తికి కూడా మూలము భక్తియే. కోరిన కోరికలనిచ్చు శ్రీమన్నారాయణుడు భక్తి చేతనే పూజింపబడును. కావుననే అన్ని లోకములకు భక్తి మాత అని గానము చేయుబడుచున్నది. అన్ని ప్రాణులు తల్లి నాశ్రయించి జీవించునట్లు ధార్మికులందరూ భక్తి నాశ్రయించి జీవింతురు. స్వాశ్రమాచారము కలవానికి హరిభక్తి కూడా కలిగినచో ఆతనితో సమానుడు మూడు లోకములలోనూ మరి యొకడుండడు.
భక్తి చేతనే అన్ని కర్మలూ సిద్ధించును. కర్మలచే శ్రీహరి సంతోషించును. శ్రీహరి సంతోషించినచో జ్ఞానము కలుగును. జ్ఞానము వలన మోక్షము లభించును. శ్రీహరి పై భక్తి భగవద్భక్తుల సంగతీతో కలుగును. పూర్వజన్మలలో సంపాదించిన పుణ్యమున్నపుడే భగవద్భక్తుల సంగతి లభించును. వర్ణాశ్రమాచారములయందు ఆసక్తులై భగవద్భక్తియందు పీతికలవారై కామాది దోషములు లేనివారు మాత్రమే లోకమునకు మంచిమార్గమును బోధింతురు. పూర్వ జన్మమున పుణ్యము చేయనివారికి సజ్జనులతో స్నేహము కలుగదు. సజ్జన స్నేహము లభించినచో పూర్వజన్మలలో పుణ్యము చేసి యున్నారని తెలియవలయును. పూర్వజన్మలలో చేసిన పాపములు నశించినపుడే సజ్జన స్సేహము లభించును. లేనిచో మరియొక దానితో లభించదు. సూర్యుడు పగటిపూట మాత్రమే బయట కనపడు చీకటిని తన కిరణములతో నశింపచేయగలడు. సజ్జనులు తమ సూక్తులు అను కిరణములతో అన్ని వేళలా - లోపల అనగా మనసులో దాగియున్న అజ్ఞానమను చీకటీని కూడా నశింపచేతురు. భగవద్భక్తితో పరవశము నొందు పురుషులు లోకమున చాల అరుదు. ఆ భగవద్భక్తులతో స్నేహము కలిగినవానికి శాంతి శాశ్వతముగా నుండును.
నారదమహర్షి పలికెను :- భగవద్భక్తులు ఎట్లుందురు ? వారేమి పని చేసెదరు ? వారికే లోకము లభించును ? ఈ విషయమంతయు వివరముగా చెప్పుము. దేవదేవుడు చక్రాయుధధారియగు శ్రీమన్నారాయణునకు నీవు పరమభక్తుడవు. ఈ విషయమును నీవు తప్ప ఇతరులు చెప్పలేరు.
సనక మహర్షి. పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! పరమ రహస్యమైన మార్కండేయుని చరిత్రను వినుము. యోగనిద్రనుండి మేల్కొనిన జగన్నాథుడు మార్కండేయునితో చెప్పిన మాటలను కూడా వినుము. ఈ శ్రీమహావిష్ణువు సనాతనుడు; దేవదేవుడు; పరంజ్యోతి స్వరూపుడు. జగత్స్వరూపుడు; జగత్తును సృష్టించినవాడు. శివ బ్రహ్మ స్వరూపములతో నుండువాడు. యుగాంతమున రుద్రరూపముతో బ్రహ్మాండమును ఆరగించును. అపుడు స్థావరజంగమములు నశించి ఈ ప్రపంచమంతయు సముద్రముగా నుండును. ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే మిగిలియుండీ మట్టి ఆకు పై పరుండియుండును. లెక్కలేని బ్రహ్మాదులు శరీరమునందలి రోమకూపములందు నివాసమేర్పరచుకొని స్వామిని అలంకరించియుందురు. కాలిబొటన వేలు కొననుండి బయలదేరిన గంగానది యొక్క చల్లని నీటితో పవిత్రముచేయుచు సూక్ష్మములకంటే సూక్ష్మరూపుడై బ్రహ్మాండమును మింగి మజ్జియాకు పై పరుండియుండును. శ్రీమన్నారాయణుడు మాత్రమే సర్వశక్తి సమన్వితుడుగా నుండును. శ్రీమన్నారాయణుడున్న ఆస్థానమున మ హానుభావుడు నారాయణ భక్తుడు అయిన మార్కండేయ మహర్షి ఉండి పరమేశ్వరుని లీలలను చూచుచుండెను.
ఋషులు పలికిరి:- ఓ సూతమహర్షీ ! ఆ ప్రళయకాలమున స్థావర జంగములన్నియు నశించగా కేవలము శ్రీమన్నారాయణుడు మాత్రమే మిగిలి ఉండెనని మొదటి విని యుంటిమి. ఈ ప్రపంచమంతయు జలమయమైయుండగా స్థావరజంగమాత్మకమైన ప్రపంచమంతటిని మీంగిన శ్రీమన్నారాయణుడు మార్కండేయుని ఎందుకు మిగిలించేను? ఈ విషయమును తెలుసు కొనవలయునని మాకు చాల కుతూహలమున్నది. శ్రీమన్నారాయణుని కీర్తి యను అమృతమును పానము చేయుటలో అలసట ఎవరికీ కలుగును ?
సూతమహర్షి పలికెను :- మహానుభావుడగు మృకండువను పేరుగల సుప్రసిద్ధుడుండెను. ఆ మృకండువు సత్యసంధుడు; జితేంద్రియుడు. ఓర్పుగలవాడు. అన్ని ప్రాణులను తనవలె చూచుచు సంసార విషయ భోగములందు ఆశ లేనివాడై అన్ని ప్రాణుల హితమును కోరుచు అంతరింద్రియ నిగ్రహము కలవాడై శాలగ్రామమను మహాతీర్థమున పది వేల సంవత్సరములు సనాతనుడైన సగుణబ్రహ్మను గూర్చి నిరాహారుడై తపస్సు చేసెను. అతని తపస్సును చూచి ఇంద్రాది దేవతలు శంకించి ఆర్తనాశనుడగు శ్రీమన్నారాయణుని శరణు వేడిరి. దేవతలందరు పాలసముద్రపు ఆవలి తీరమును చేరి జగద్గురువు పద్మ నాభుడు దేవదేవుడగు శ్రీమన్నారాయణుని స్తోత్రము చేసిరి.
దేవతలు పలికిరి :- కయము అంతములేని ఓ నారాయణా ! శరణు వేడినవారిని రక్షించువాడా ! మృకండు మహర్షి చేయు . తపస్సుచే భయపడి నిన్ను శరణుకోరిన మమ్ములను కాపాడుము. దేవతలకు అధిదేవతలకు ప్రభువును నీవే! నీవే! శంఖగదాద్యాయుధములను ధరించి యుందువు. నీకు జయమగు గాక! బ్రహ్మాండమునకు కారణభూతుడవు, లోకస్వరూపుడవు అయిన నీకు జయము. ఓ దేవదేవేశా ! ఓ లోకపావనా ! నీకు నమస్కారము. లోకనాథుడవు లోకసాక్షివి అయిన నీకు నమస్కారము. కేశి, మధు మొదలగు రాక్షసులను చంపినవాడవు పరమాత్మవు అయిన నీకు నమస్కారము. చైతన్య స్వరూపుడవు భూమ్యాకాశాది - పంచభూత స్వరూపుడవైన నీకు నమస్కారము. అందరిలో జ్యేష్ఠుడవు, పరిశుద్దుడవు, నిర్గుణుడవయ్యు గుణాత్మ కుడవైన నీకు నమస్కారము. రూపరహితుడవు మంచిరూపము గలవాడవు అనేక. రూపములు గల వాడవు అయిన నీకు నమస్కారము. బ్రాహ్మణులయందు ప్రీతి గలవాడవు. గోవులకు బ్రాహ్మణులకు హితమును చేయువాడవు, జగత్తునకు హితమును కలిగించువాడవు అయిన కృష్ణుడవైన నీకు నమస్కారము. హిరణ్యగర్భుడవు, బ్రహ్మాది దేవతారూపుడవు, సూర్యాది దేవతారూపుడవు, హవ్యమును కవ్యమును భుజించు వాడవు అయిన నీకు నమస్కారము. నిత్యుడవు అందరిచే నమస్కరించబడువాడవు, ఎప్పుడూ ఆనంద స్వరూపుడవు అయిన నీకు నమస్కారము. తలచినవారి ఆర్తిని నశింపచేయు నీకు మాటిమాటికీ నమస్కారము.
ఇట్లు దేవతలు చేయు స్తోత్రమును విని భగవంతుడగు లక్ష్మీపతి శంఖచక్రగదాదులను ధరించినవాడై వారికి ప్రత్యక్షమాయెను. వికసించిన పద్మములవలె విశాలమైన నేత్రములు గల వానిని, కోటి సూర్యులతో సమానమైన కాంతి గలవానిని, అన్ని అలంకారములు కలవాని శ్రీవత్సమను పుట్టుమచ్చ వక్షసులమున కలవానిని, పీతాంబరధారిని సువర్ణయజ్ఞోపవీతమును ధరించియున్న వానిని, సౌమ్యుని మునులచే స్తోత్రము చేయబడుచున్నవానిని, ద్వారపాలక శేషులతో కూడి యున్న వానిని, శ్రీమన్నారాయణుని చూచి స్వామితేజస్సుచే తమ తేజస్సు మందగించగా ఆనందముతో సాష్టాంగముగా భూమి మీద పడి సమస్కరించిరి. అపుడు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై దేవతలకు ప్రీతి కలిగించుచు మేఘగంభీరనాదముతో ఇంద్రాది దేవతలను గూర్చి ఇట్లు పలికెను.
శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- “ఓ దేవతలారా ! మృకండుమహర్షి చేయు తపస్సు వలన మీ మనసులో కలిగిన భయమును నేనెరుగుదును. ఆ మృకండుమహర్షి సజ్జనులలో శ్రేష్ఠుడు. కావున మిమ్ములను బాధింపడు. సజ్జనులు సంపదలొచ్చిననూ, ఆపదలొచ్చినను ఎప్పుడూ కలలో కూడా ఇతరులను బాధించరు. సంసార విషయములు అను శత్రువులు ఎపుడూ బాధించుచున్ననూ తన రక్షను తానేర్పరచుకొనని సజ్జనుడు ఇతరుల నెట్లు బాధించును ? తాపత్రయములచే బాధించబడు ఉత్తమమానవుడు ఇతరులనెట్లు బాధించగలడు ? ఎపుడూ కామాదులు కలిగినవాడై కర్మచే, మనసుచే, మాటలచే అన్ని వేళలా ఇతరులను బాధించువాడు మూర్ఖుడనబడును. ఓ సజ్జనులారా ! లోకమునకు హితము చేయుచు మాత్సర్యములేని మానవుని నిశ్శంకుడు అని సజ్జనులు ఈ లోకమున, పరలోకమున చెప్పెదరు. సశంకుడు ఎప్పుడూదుఃఖము కలిగియే యుండును. నిశ్శంకుడు సుఖమునే పొందును. కావున స్వస్థమనస్కులై మీ గృహములకు వెళ్ళుడు. మృకండుమహర్షి మిమ్ములను బాధించడు. నేను మీకు రక్షకుడను. కావున మీరు కోరిన విధముగా విహరించుడు అని నల్ల అవి సెపూవువన్నె గల శ్రీమన్నారాయణుడు వారికి వరము నిచ్చి దేవతలందరూ చూచుచుండగనే అక్కడనే అంతర్ధానమాయెను. సంతోషము నిండిన మనస్సుగల వారై దేవతలు కూడా వచ్చిన దారినే స్వర్గమునకు వెళ్ళిరి.
శ్రీమన్నారాయణుడు మృకండు మహర్షి చేసిన తపస్సునకు మెచ్చి ప్రత్యక్షమాయెను. రూపరహితుడు, పరబ్రహ్మ, స్వయప్రకాశుడు, ప్రకృతి సంబంధము అంటనివాడు అవిశపూవువంటి శరీర ఛాయ గలవాడు పీతాంబరధారి, దివ్యాయుధములను ధరించినవాడు అచ్యుతుడు అయిన శ్రీమన్నారాయణుని చూచి అతడు ఆశ్చర్యము నొందెను. ధ్యానములో నుండి కనులు తెరిచి ప్రసన్నమైన ముఖముతో శాంతుడు, ప్రపంచమును తనలో ధరించువాడు, ప్రపంచమును ప్రకాశింపచేయు తేజోమూర్తి, అయిన శ్రీహరిని ఎదురుగా చూచేను. స్వామిని చూచిన ఆనందముతో నిలువెల్లా పులకలురాగా ఆనందాశ్రువులు కనులనిండగా సనాతనుడు దేవదేవుడు అయిన శ్రీమన్నారాయణునికి దండవతమము లాచరించెను. ఆనందాశ్రుజలముచే శ్రీమన్నారాయణుని పొదములను కడుగుచు తల పై దోసిలి ఒగ్గి స్తోత్రము చేయ నారంభించెను.
మృకండు మహర్షి పలికెను : పరమాత్మ రూపుడు పరేశుడు, మూలప్రకృతి మహదహంకారముల కంటే పరముగా నుండు వాడు, పారములేని వారికి పారమైనవాడు, పరులను అనుసరించువాడు, పరులకంటే పరులను కూడా తరింప చేయువాడు అయిన శ్రీమన్నారాయణునకు నమస్కారము. నామము జాతి మొదలగు భేదములు లేనివాడు, శబ్దస్పర్శరూపరసగంధాదుల దోషములు లేనివాడు, పలురూపములతో నున్ననూ ఏ సంబంధమూ అంటనివాడు, పరమేశ్వరుడు, స్తుతిపాత్రుడు అగు శ్రీమన్నారాయణునికి నమస్కారము. వేదాన్తములతో తెలియబడువాడు, పురాణపురుషుడు, బ్రహ్మ మొదలు సమస్త ప్రపంచస్వరూపములతో నుండువాడు, సాటిలేనివాడు, భక్త జనులను అనుగ్రహించువాడు, ఆదిదేవుడు సర్వేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుని సేవించెదను. అన్ని దోషములు తొలగిన వారు, ధ్యానమునందే ఉండువారు, ఆశనొదలిన వారు, మోహము తొలగిన వారు మాత్రమే చూడగలుగు పరమ పవిత్రుడు సంసారనివర్తకుడు అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించుచున్నాను. తలచువారి ఆర్తిని తొలగించువాడు, శరణువేడిన వారిని కాపాడు వాడు జగత్తు చే సేవించబడువాడు, జగత్తు నివాసముగా గలవాడు, దయాలవాలుడు, పరేశుడు . అయిన శ్రీమహావిష్ణువును నమస్కరించుచున్నాను.
శంఖచక్రగదాధరుడైన శ్రీమహావిష్ణువు మృకండుమహర్షి చేసిన స్తోత్రముచే మిక్కిలి సంతోషించెను. తన పొడవైన నాలుగు చేతులతో మృకండు మహర్షిని ఆలింగనము చేసుకొని మిక్కిలి సంతోషముతో ఓ సువ్రత వరమును కోరుము. పాపరహితుడవైన నీవు చేసిన తపస్సుచే స్తోత్రముచే నేను సంతోషించితిని. కావున నీ మనసులో కోరిన వరమును అడుగుము అని పలికెను.
మృకండురువాచ :-
మృకండుమహర్షి పలికెను :- ఓ దేవదేవా ! జగన్నాథా ! పుణ్యము లేని వారలకు నీ దర్శనము దుర్లభమని శాస్త్రములు చెప్పుటచే, నీ దర్శనమును పొందిననేను కృతార్థుడనైతిని. ఈ విషయమున ఏ మాత్రము సంశయములేదు. బ్రహ్మ మొదలగు దేవతలు, యోగులు, వ్రతములను ఆచరించు వారు, ధర్మాత్ములు, దీక్షితులు, కోరికలుడిగినవారు, మాత్సర్యము తొలగినవారు చూడలేని పరంధాముని చూడగలుగుచున్నాను. ఇంతకంటే ఏ వరమును కోరెదను. ఓ జగదురూ ! జనార్దనా ! ఈ దర్శనము చేతనే కృతార్థతనందితిని. మహాపాపాత్ములు కూడా నీనామస్మరణ మాత్రమున పరమపదమును పొందెదరన్న నీ దర్శనము నందిన వారి విషయము నేమి చెప్పవలయును ?
శ్రీభగవానువాచ :-
శ్రీమన్నారాయణభగవానుడు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! నీవు సత్యమునే పలికితివి. ఓ పండితా ! నీ విషయమున ప్రీతి నొందితిని. నా దర్శనమెప్పుడూ వ్యర్థము కాదు. శ్రీమహావిష్ణువు భక్త కుటుంబి అని జ్ఞానులు చెప్పుచుందురు. ఆ మాటనే పాటించేదను. నా భక్తులు అబద్దమాడకూడదు కదా ! కావున నీ తపస్సుకు సంతోషించిన నేను నీకు పుత్రుడుగా జన్మించెదను. అన్ని గుణములు కలవాడుగా, చిరంజీవిగా, చక్కని రూపము కలవాడుగా పుట్టెదను. నేను ఏ కులములో పుట్టెదనో ఆ కులము మోక్షమును పొందును. నేను సంతోషించిన తరువాత ఈ మూడు లోకములలో సాధింపరానిది, లేనిది ఏముండును ? దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికి ఆ మృకండుమహర్షి చూచుచుండగా అక్కడే అంతర్థానమాయెను. మృకండుమహర్షి కూడా తన తపస్సు నుండి విరమించెను.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున భక్తిని వర్ణించు సందర్భమున మార్కండేయచరితారంభమను నాలుగవ అధ్యాయము సమాప్తము.
