నారద మహా పురాణము - పూర్వార్థము
43 - బ్రాహ్మణాచారనిరూపణమ్
భరద్వాజ మహర్షి పలికెను :- వాయువే ప్రాణపతి, వాయువే చేష్టలు చేసినచో, వాయువే శ్వాసతీసుకొనుట, వాయువే మాటలాడుట చేసినచో ఇక జీవుడు చేయునదేమి? జీవుడు నిరర్థకుడగునా? అగ్ని సంబంధమైన వేడి, అగ్ని వలననే కలిగినచో, అగ్నియే ఆహారమును శరీరమును జీర్ణము చేసినచో జీవునితో ప్రయోజనమేమి? మరణించు ప్రాణికి జీవుడు లభించుటలేదు. జంతువును వాయువు వదులుచున్నది. వేడి నశించుచున్నది. జీవుడు వాయుమయుడు. వాయువుతో సంశ్లేషించును. వాయుమండలమువలె చూడవలయును. మరుద్గణములతో కలిసి వెళ్ళవలయును. పొయువుతో కలిసియుండుట జీవితము, వాయు నాశము మరణము అనిచేప్పినచో నీటి సమూహము సముద్రము. సముద్రమనగా నీటికి పొత్ర తప్ప విడిగా సముద్రము లేదనునట్లయినది కదా? నీరు బావిలో ఉండును. దీపము అగ్నినిచ్చును. బావిలో నీరు దీపములోని అగ్ని క్షణములో నశించునట్లు జంతువులోని వాయ్వగ్నులు కూడా నశించవచ్చును కదా? పంచ భూతసంఘాతాత్మకమగు ఈ శరీరమున ఒకటీ లేకున్ననను మిగిలిన నాలుగుండుటలో సంశయము లేదు కదా? ఆహారమును తీసుకోనిచో నీరు నశించును. గాలిని బిగబట్టిన వాయువు నశించును. భోజనముచేయనిచో అగ్నీ నశించును. వ్యాధులచే, గాయములచే, పరిశ్రమచే భూమి నశించును. ఇట్లు ఈ అయిదింటిలో ఏ ఒక్కటి పీడించిననూ అయిదు నశించును కదా? ఇట్లు పంచత్వమును పొందినచో (మరణించినచో) జీవుడు దేనిననుసరించును? దేనిని బాధించును, దేనిని వినును, ఏమీ మాట్లాడును? ఈ గోవు పరలోకమున నున్న తరింప చేయును అని భావించు ఒకడు గోవును దానము చేయును. దానము చేసినవాడు మరణించిన పిదప ఆవును ఎవరినీ తరింపచేయును? దానము చేయబడిన గోవు, దానము చేసినవాడు, దానమును స్వీకరించిన వాడు ఈ లోకముననే మృతి చెందును కదా? వారెట్లు ఎపుడు ఎక్కడ కలియుదురు? పక్షులచే భక్షింపబడిన జంతువు, పర్వతము నుండి పడి మరణించిన జంతువు, అగ్నిచే దహింపబడిన జంతువు మరల ఎట్లు బ్రతుకును? సమూలముగా నరికి వేసిన వృక్షము మరల చిగురించనట్లు బ్రతుకునపుడు పనులు చేసిన వారు మరణించి మరల ఎట్లు వచ్చును? ఎక్కడికి వెళ్ళును? పూర్వమున జీవి మాత్రమే సృజించబడినది. ఆ జీవమే తిరుగుచున్నదని కదా చెప్పితీరి. చనిపోయినవారు చనిపోయిన వెంటనే నశించుచున్నారు. ఒక బీజము మరియొక బీజమును నశింపచేయుచున్నది అయినపుడు తిరిగి వచ్చునదేది పరలోకమునకు వెళ్ళునదేది? కావున ఓ బ్రాహ్మణోత్తమా? నా మనసులో ఈ సంశయమేర్పడినది. నిన్నాశ్రయించితిరి కావున నాసంశయమును సర్వజ్ఞుడవగు నీవు తొలగించుము.
సనందన మహర్షి పలికెను. ఇట్లు భరద్వాజ మహర్షి ప్రశ్నించగా బ్రహ్మపుత్రుడగు భృగు మహర్షి అతని సందేహనివృత్తి కొఱకు మరల ఇట్లు పలికెను.
భృగు మహర్షి పలికెను :- దానము చేసిన వానికి కార్యములను చేయువానికి జీవునకు ప్రాణములు లేవు. ప్రాణి అనగా జీవుడు మరో దేహమున ప్రవేశించును. శరీరము మాత్రమే నశించును. జీవుడు శరీరమునాశ్రయించి ఉండువాడు కాడు. శరీరము నశించినచో నశించువాడు కాడు. అగ్నిచే సమిధలు దహించబడును. అనగా అన్నీ సమిధల నాశ్రయించి యుండునది కాదు. సమిధలచే నశించునది కాదు. సమిధల స్వరూపనాశములో అగ్ని కనపడదు కావున అగ్ని నశించినది అని భావింతుము. భరద్వాజ ఉవాచ :-
భరద్వాజ మహర్షి పలికెను :- సమిధల నాశముచే అగ్ని నశించకపోవచ్చును. కాని సమిధలను పూర్తిగా దహించిన తరువాత అగ్ని అచట కనపడుట లేదు కదా ! సమిధలు లేనపుడు అగ్ని శాంతించును కావున నశించుననే భావించుచున్నాను. సమిధలు లేనపుడు అగ్ని గతి ప్రమాణము స్థితి యుండుట లేదు కదా?
భృగు మహర్షి పలికెను :- సమిధల ఉపయోగము తరువాత అగ్ని కనిపించదు. సమిధలు లేని అగ్ని శాంతించును కావున నశించుననే భావింతును. గతి ప్రమాణము సంస్థానము కూడా లభించదు. సమిధల ఉపయోగము తరువాత అగ్ని లభించనట్లు ఆకాశానుగతమైనది నిరాశ్రయమైనది సూక్ష్మమగుటవలన తెలియ జాలము. అట్లే శరీరమును విడిచినపుడు జీవుడు ఆకాశము వలె ఉండును. అతి సూక్ష్మమైన దగుటచే జ్యోతివలె నశించదు. అగ్ని ప్రాణములను ధరింప చేయును. అతనే జీవునిగా తెలియుము. వాయుసంధారణ మగు అగ్ని ఉచ్చ్వాస నిగ్రహము వలన నశించును. ఆ శరీరాన్ని నశించినపుడు దేహము అచేతనమగును. దేహమునకు ఆధారము భూమి కావున భూమి మీదనే పడును. ఈ విషయము స్థావరజంగమములకు అన్నింటికి సమానము. వాయువు ఆకాశముననుసరించును. అగ్ని వాయునుననుసరించును ఆకాశవాయ్వగ్నులు ఒకటి కావున వాయ్వగ్నులు భూమియందుండును. ఆకాశమున్న చోట వాయువుండును. వాయువున్న చోట అగ్నియుండును. ఈ మూడు మూర్తిమంతములు కావు. శరీరులు మాత్రము మూర్తిమంతులు.
భరద్వాజ మహర్షి పలికెను :- దేహధారులలో అగ్ని వాయూ భూమ్యాకాశ జలములే యున్నచో అచట జీవుని గుర్తించు చిహ్నమేమిటో నాకు తెలుపుము పంచాత్మక, పంచరతము, పంచవిజ్ఞాన సంజ్ఞకమైన ప్రాణుల శరీరమున జీవుడెట్టి వాడో తెలియగోరుచున్నాను. మాంసము, నెత్తురు, కొవ్వు, చీము, నరములు, ఎముకలు కలిసియున్న శరీరమున జీవుడు కనపడుటలేదు. అనగా శరీరమును చీల్చి చూచిన మాంసాదులు కనపడుచున్నవే కాని జీవుడు కనపడుట లేదని భావము. జీవుడులేని శరీరమే పంచభూతమయమైనచో శారీరిక మానస దుఃఖమును తెలియునదేవ్వరు? జీవుడు చెవులతో వినును. కాని మనసు పరాకుగా ఉన్నపుడు వినలేడు. కావున జీవుడు నిరర్ధకుడే కదా? మనసుతో కలిసిన కంటితో అందరూ చూతురు. మనసు వ్యాకులముగా నున్నపుడు చూచుచున్ననూ కనపడదు. నిద్రావశములో నున్నపుడు చూడజాలడు వాసన చూడజాలడు, వినజాలడు, మాటలాడడు, స్పర్శను తెలియజాలడు. ఈ శరీరమున సంతోషించువాడు, కోపించువాడు, విచారించువాడు, బాధపడువాడు, కోరువాడు, ధ్యానించువాడు, ద్వేషించువాడు, మాటలాడువాడు ఎవరు?
భృగు మహర్షి పలికెను. పంచభూతసాధారణాత్మకమగు శరీరమును ఒక్క అంతరాత్మయే వహించును. ఆ యంతరాత్మయే గంధమును రసమును శబ్దమును స్పర్శను, రూపమును, గుణములను ఇతరములను తెలియును. ఈ అంతరాత్మ పంచాత్మకమగు శరీరమున పంచగుణములను చూపుచు అన్ని అవయవములలో అనుగతమైయుండును. అంతరాత్మయే సుఖములను దుఃఖములను తెలియును. అంతరాత్మ వియోగము జరిగినచో దేహము తెలియజాలదు. అగ్నిలో రూపము స్పర్శ ఊష్మ భావము లోపించి శరీరాన్ని శాంతించినపుడు దేహత్యాగముతో అంతరాత్మ నశించును. ఈ ప్రపంచమంతయూ జలమయమే. శరీరులకు జలమే మూర్తి నిచ్చును. ఆ జలమున లోకకారకుడగు మానస బ్రహ్మయే ఆత్మ. అతనినే సర్వ లోకహితాత్మకమగు ఆత్మగా తెలియుము. ఈ ఆత్మ దేహమున పద్మదళమున నీటిబిందువు వలె సంగరహితముగా నుండును. ఈ ఆత్మయే నిత్యము లోకహితాత్మకమగు క్షేత్రజ్ఞుడు. తమోరజస్సత్త్వములు జీవగుణములుగా చెప్పెదరు. జీవగుణము అచేతనమని అదియే చేయును చేయించును. అతనికంటే పరుడు క్షేత్రవిత్తు, ఇతనే ఏడులోకములను ప్రవర్తింపచేయును. దేహము భిన్నమైనను జీవనాశము జరుగదు. ఇదియంతయు మిథ్య అని అజ్ఞానులందురు. జీవుడు దేహమున అంతరముగానుండును. జీవునకు అయిదు శరీర భేదములుండును. ఇట్లు జీవుడు అన్ని ప్రాణులలో గూఢముగా సంచరించుచుండును. తత్త్వదర్శులు మాత్రమే ఉత్తమమగు సూక్ష్మబుద్దిచే గ్రహించగలరు. జ్ఞాని పుర్వాపరరాత్రులందు యోగముచే ఆహారమును పొంది విశుద్దమైన మనస్సు కలవారై ఆత్మదర్శనమును చేయగలరు. చిత్త ప్రసాదముచే శుభాశుభ కర్మలను వదిలి ఆత్మలో ప్రసన్న మనస్కునిగా ఉండి అనంతమైన సుఖమును పొందును. శరీరములందుండు మానసాగ్నియే జీవుడని పిలువబడును. భూతాధ్యాత్మ నిశ్చయము కొఱకు ప్రజాపతి చేసిన సృష్టి ఇది. ప్రజాపతియగు బ్రహ్మ మొదట బ్రాహ్మణులనే సృజించెను. వారందరు బ్రహ్మ తేజస్సును నింపుకొని భాస్కరాగ్ని సమతేజస్కులు గా నుండిరి. తరువాత స్వర్గము కొఱకు సత్యధర్మములను, ఆచారమును, శౌచమును సృజించెను. తరువాత దేవదానవ గంధర్వదైత్యాసుర మహారగులు, యక్షులు, రాక్షసులు, నాగులు, పిశాచములు, మానవులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు సృజించబడిరి.
భరద్వాజ మహర్షి పలికెను :- వర్ణముతో చాతుర్వర్ణ్యములని వర్ణభేదమును చేయుచున్నారు. స్వేదము, మూత్రము, పురీషము, శ్లేష్మ, పిత్తము, రక్తము ఇవి అందరిలో సమముగా ప్రవహించుచుండును. అయినపుడు వర్ణ విభాగమెందులకు? స్థావర జంగములు అసంఖ్యేయములుగా నున్నవి. వాటిలో జాతులు అసంఖ్యేయములుగా నున్నవి. వాటిలో వర్ణనిశ్చయమెట్లు చేయుదురు?
భృగు మహర్షి పలికెను :- వర్ణములలో విశేషమేమియును లేదు. ఈ జగత్తంతయు బ్రహ్మమయమే. బ్రహ్మ సృష్టించిన ప్రాణులు వారి కర్మలచే వర్ణములను పొందిరి. కామ భోగములు కలవారు, ప్రీతిపాత్రులు, కఠినులు, కోపముకలరు, సాహస ప్రియులు, స్వకర్మలను వదిలిన రక్తవర్ణము కల ద్విజులు క్షత్రియులైరి. గోపోషణను వృత్తిగా స్వీకరించి వ్యవసాయమును చేయుచు వచ్చినవారై తమ ధర్మములను అనుష్ఠించని ద్విజులు వైశ్యులుగా మారిరి. హింసను అసత్యమును స్వీకరించి లోభులు అన్ని కర్మలచే , బ్రతుకును సాగదీయుచు నల్లవారై శౌచ పరిభ్రష్టులైన ద్విజులు శూద్రులైరి. ఇట్లు ఆయా కర్మలచే ద్విజులే ఆయా వర్ణములను పొందిరి. ధర్మశాస్త్రమును అనుసరించిన వారు బ్రాహ్మణులు వారికీ తపస్సు ఎపుడూ నశించదు. నిత్యము పరబ్రహ్మను వ్రతములను నియమములను ధరించువారు బ్రహ్మణులు. వీరినే బ్రహ్మ మొదట సృష్టించేనని జ్ఞానులు తెలియుదురు. ఈ ద్విజులే ఆయా ప్రదేశములలో బహు విధములుగా మారిరి. పిశాచులు, రాక్షసులు, ప్రేతలు, పలు మ్లేచ్ఛ జాతులుగా నుండిరి. ఈ సృష్టి బ్రహ్మమనసు నుండి ఏర్పడినది. ధర్మమునాధారముగా చేసుకొనినది.
భరద్వాజ మహర్షి పలికెను :- ఏ కర్మచే బ్రాహ్మణులగుదురు? ఏ కర్మచే క్షత్రియులు వైశ్యులు శూద్రులు గా మారుదురో తెలుపుము.
భృగు మహర్షి పలికెను :- జాతకర్మాది సంస్కారములతో సంస్కరించబడి శుచియై వేదాధ్యయన సంపన్నుడై, బ్రహ్మ కర్మ నిష్టుడై, శౌచ్చారములు కలవాడై చక్కగా విద్యాభ్యాసము చేయుచు, గురు ప్రియుడై నిత్యము వ్రతపరుడై, సత్యపరుడైన పొడు బ్రాహ్మణుడనబడును. సత్యం, దానము, అద్రోహము, అక్రూరత్వము, దయ, జాలి, తపస్సు ఉన్నవాడు బ్రాహ్మణుడనబడును. క్షత్రియ కర్మలను సేవించుచు, వేదాధ్యయనమును చేయుచు దానము నందు ఆదానమునందు ప్రీతి కలవాడు క్షత్రియుడనబడును. పశు పోషణము చేయుచు వ్యవసాయము నందు ప్రీతికలవాడై పవిత్రుడై, వేదాధ్యయన సంపన్నుడు వైశ్యుడనబడును. అన్నిటిని భక్షించుటలో ప్రీతి కలవాడు, అన్నిపనులను చేయుచు అశుచియై వేదాధ్యయనమును వదిలి ఆచార బాన్యుడు శూద్రుడనబడును. పైన చెప్పబడిన లక్షణములు శూద్రుని గుర్తింప చేయుని.. ఈ లక్షణములు ద్విజునిలో కనపడవు. ఆయాకర్మలననుసరించియే బ్రాహ్మణత్వాదులను నిర్ణయించవలయును కాని శూద్రుడు శూద్రుడే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే అని వంశమున జన్మించిన మాత్రమున చెప్పరాదు. అన్ని ప్రయత్నములచే క్రోధలోభములను నిగ్రహించుటయే జ్ఞానములలో ఉత్తమ జ్ఞానము. ఇట్లే మనో నిగ్రహమును అలవరుచుకొనవలయును. శ్రేయస్సును భంగపరుచు క్రోధలోభములను అన్నివిధములుగా వదలవలయును. కోపమునుండి సంపదను, మాత్సర్యము నుండి తపస్సును కాపాడుకొనవలయును, మానావమానములనుండి పద్యను, ప్రమాదమునుండి ఆత్మను రక్షించుకొనవలయును. ఆశా బంధర హితములగు ప్రయత్నములు కలవాడు, సర్వమును త్యాగమున అర్పించువాడు మాత్రమే నిజమగు త్యాగి, బుద్దిమంతుడు, అన్నిభూతముల విషయమున హింసను వదిలి స్నేహముతో ప్రవర్తించవలయును. పరిగ్రహమును విడిచి జితేంద్రియుడు కావలయును. ఇహపరలోకములలో శోకరహిత స్థితిని సాధించవలయును. అట్లు సాధించులకు నిత్యతపము ఇంద్రియనిగ్రహము, మౌనము, మనోనిగ్రహములు ముఖ్యోపాయములు. జయించశక్యము కాని మనసును జయించకోరువాడు విషయసంగమును పరిత్యజంచవలయును. ఇంద్రియములచే గ్రహించబడునదంతయు వ్యక్తమనబడును. అతీంద్రియము లింగమాత్రగ్రాహ్యము అవ్యక్తమనబడును. విశ్రంభము (తొట్రుపోటు) లేక మననము చేయవలయును. తొట్రుపడు మనసును నిగ్రహించవలయును. ప్రాణముతో మనసును నిగ్రహించవలయును. ప్రాణమును పరబ్రహ్మ లో నిలుపవలయును. వైరాగ్యము వలననే ఆనందము లభించును. దేనిని గూర్చి చింతించరాదు. బ్రాహ్మణుడు వైరాగ్యము చేతనే ఆనందమును పొందగలడు. ఎపుడూ శౌచోచారములు కలవాడై అన్నిఫ్రాణులయందు దయ కలిగి యుండుట ద్వీజ లక్షణము. సత్యవ్రతమే తపస్సు, సత్య మే శౌచము. సత్యము వల్లనే సృష్టి జరుగుచున్నది. సత్యము చేతనే లోకము ధరించబడుచున్నది. సత్యము చేతనే స్వర్గమును పొందగలడు. అసత్యము తమో రూపము. తమస్సుచే పతితుడగును. తమోగ్రస్తులై తమస్సుచే ఆవరించబడిన వారు ప్రకాశమును చూడజాలరు. ప్రకాశము ఏమాత్రము లేని తమ స్పే నరకమనబడును. జగత్తును సంచరించు పోరు సత్యాసత్యముల నాశ్రయింతురు. లోకవృత్తి కూడా సత్యాన్నతములలో నుండును. ధర్మాధర్మములు, ప్రకాశతమములు సుఖదుఃఖములు శారీరిక మానసిక దుఃఖములు, దుఃఖములను కలిగించు సుఖములు వీటితో లోకప్రవృత్తిని చూచువారు మోహములో పడరు. వివేకము కలవాడు దుఃఖమోక్షము కొఱకు ప్రయత్నించ వలయును. ప్రాణులకు ఇహపరములలో సుఖము అనిత్యమే. గ్రహణము పట్టిన చంద్రుని వెన్నెల ప్రకాశించినట్లు తమోగ్రస్తులగు ప్రాణులకు సుఖము ప్రకాశించదు. సుఖము శారీరము మానసమని రెండు విధములు. ఇహపరములందు వస్తు ప్రవృత్తులు సుఖము కొఱకే చెప్పబడినవి. ఇహపరములలో కూడా అపవర్గము కంటే విశిష్టమైనది లేదు. ఆ అపవర్గమే కోరదగిన గుణ విశేషము. ధర్మాచరణము అపవర్గ హేతువు. అన్ని ప్రయత్నములు సుఖమును పొందుటకొఱకే కొనసాగుచుండును.
భరద్వాజ మహర్షి పలికెను :- సుఖములకే ఉత్తమ స్థితి యని మీరు చెప్పి యుంటిరి. కాని దానిని మేము అంగీకరించుట లేదు. మహర్లోకమున నున్న ఋషులకు సుఖమను ఈ కొమ్య గుణ విశేషము పొందకూడనిదిగా చేప్పబడియున్నది. ఋషులు ఈ సుఖమును కోరుటలేదు. తపోలోకమున మూడు లోకములను సృజించిన బ్రహ్మ ప్రభువు ఒంటరిగా ఉండెనని వినుచుంటిమి. బ్రహ్మ చారిగా ఉండెను., కామ సుఖములయందు తనను తాను నియోగించుకొనలేదు మరియు పూజ్యుడగు శివుడు తనలో కామమును కలిగించగోరు మన్మధుని అనంగునిగా చేసెను. కావున భూలోకమున కూడో మహానుభావులు సుఖముచే ఆనందించుటలేదు. అంతేకాదు. సుఖము విశిష్ట గుణమని కూడా గ్రహించబడలేదు మరియు సుఖమునకు పరమావధి స్త్రీలు అని. కాని లోకమున వ్యవహారము రెండు విధములుగా నున్నది. సుకృతము వలన ఫలోదయమైన సుఖము లభించును, లేనిచో దుఖము కలుగును అని.
భృగు మహర్షి పలికెను :- అసత్యమునుండి తమస్సు పుట్టినది. ఆ తమస్సుచే ఆవరించబడినవారు అధర్మమునే అనుసరింతురు. ధర్మముననుసరించరు. క్రోధలోభమోహ మీమాంసాఅన్నతాదులచే కప్పబడినవారు ఇహమున పరమున సుఖమును పొందలేరు. పలు విధములగు వ్యాధులచే బాధలచే కలిగిన ఉపతాపములతో ఆవరించబడుదురు. చంపుట, బంధించుట, కష్టములు, ఆకలి దప్పులు, పరిశ్రమ మొదలగు వాటిచే తపించెదరు. వర్షము, గాలి, అత్యుష్ణము, అతిశీతము మొదలగు భయములచే శరీర దుఃఖములచే బాధపడుదురు. బంధనాలవినాశము తడబాటు మొదలగు మానసిక దుఃఖములచే కృశింతురు, జరా మృత్యువు మొదలగు ఇతర దుఃఖములచే ఆక్రమించబడుదురు. స్వర్గమున శారీక మానస దుఃఖములుండవు. ముసలితనము, పాపములుండవు. నిత్యము సుఖమే యుండును. ఇచట సుఖదుఃఖములు రెండుండును. నరకమున దుఃఖము మాత్రమే యుండును. పరమపదమున సుఖము మాత్రమే యుండును. అన్ని ప్రాణులకు జన్మనిచ్చునది పృథివి. స్త్రీ అట్టిదే. పురుషుడు ప్రజాపతి. శుక్రము తేజోమయము. ఇదియే ధర్మమునకు చరితమునకు లోకనియమము. చక్కగా తపము నాచరించుట స్వాధ్యాయము హోమము. ఇవియే ధర్మ చరిత్ర నియమములు. హోమముచే పోపము శమించును. స్వాధ్యాయముచే శాంతి కలుగును. దానములవలన భోగములు లభించును. తపముచే స్వర్గము లభించును. దానము రెండు విధములు. పరలోకార్థము ఇహలోకార్థము అని సత్పాత్రదానము కొంచమైనను పరలోకము ఫలించును. అసత్పాత్రదానము ఇహలోకమున ఫలించును. దానానుగుణమగు ఫలమే లభించును.
భరద్వాజ మహర్షి పలికెను : ఎవరు ఏ ధర్మమునాచరించవలయును? ధర్మమునకు లక్టణమేమి? ధర్మ మెన్ని విధములు? దీనినంతటిని తెలుప ప్రార్థన.
భృగు మహర్షి పలికెను :- స్వధర్మము నాచరించు బుద్ధిమంతులను స్వర్గము లభించును లేని యెడల వారు మోహపాశ బద్ధులగుదురు.
భరద్వాజ మహర్షి పలికెను :- బ్రహర్షి విహితములైన నాలుగాశ్రమములో ఏయే ఆశ్రమముల వారు ఏ ధర్మములనాచ రించవలయునో తెలుపుడు.
భృగు మహర్షి పలికెను :- పూర్వకాలముననే లోకహితమును చేయదలచిన బ్రహ్మ ధర్మసంరక్షణము కొఱకు నాలుగాశ్రమములను నిర్దేశించెను. ఆ నాలుగాశ్రమములలో గురుకులవాసము మొదటి ఆశ్రమమని చెపుచున్నారు. ఈ గురుకులవాసమున చక్కగా శౌచసంస్కార నియమవ్రతములచే మనసును నిగ్రహించి ఉభయ సంధ్యలండు సూర్యాగ్నులను ఆరాధించి సోమరితమును ఆలస్యమును విడిచి గురువునకు అభివాదము చేయుచు, వేదాభ్యాసముచే, శ్రవణముచే అంతరాత్మను పవిత్రము చేసుకొని మూడువేళలలో స్నానాదికములను నిర్వర్తించి, బ్రహ్మ చర్యమును అగ్నిపరిచర్యను గురుశుశ్రూషను, నిత్యభిక్షాచరణమును, భిక్షచే సంపాదించిన దానిని గురువునకు నివేదించి అంతరాత్మను గుర్వధీనముచేసి గురువు చెప్పిన మాటను ఆజ్ఞగా పరిపాలించుట, వ్యతిరేకించకుండుటచే గుర్వనుగ్రహమును పొంది, అనుగ్రహముచే గురువు ఇచ్చిన స్వాధ్యాయమును అభ్యసించవలయును. ఈ విషయమున ఒక శ్లోకము కలదు. గురువునారాధించి వేదమును పొందిన వానికి స్వర్గ ఫలము లభించును, సిద్ది లభించును అని ఆ శ్లోకమునకర్థము.
ఇక రెండవది గృహస్థాశ్రమము అని చెప్పెదరు. గృహస్థాశ్రమ సదాచారములను ఇపుడు చెప్పెదను. సదాచారము కలిగి సహధర్మాచరణ ఫలమును కోరుజారి కొఱకు గృహస్థాశ్రమము విధించబడియున్నది. గృహస్థాశ్రమమున ధర్మార్ధకామావాప్తిని త్రివర్గ సాధనమును ఆ పేక్షించి సత్కర్మలచే ధనమును సంపాదించి స్వాధ్యాయము వలన పొందిన జ్ఞానముచే, బ్రహ్మర్షి నిర్మిత మార్గముచే కాని, సాగరజలములచే కాని, ద్రవ్యనియమాభ్యాసముచే దైవానుగ్రహముచే కాని పొందిన ధనముచే గృహస్థులు గృహస్థాశ్రమమును కొనసాగించవలయును. గృహస్థాశ్రమమే అన్ని ఆశ్రమములకు మూలముగా పేర్కొందురు. గురుకులవాసులకు పరివ్రాజకులకు సంకల్పించిన వ్రత నియమ ధర్మానుష్టానములను చేయు ఇతరులకు భక్షా బలి సంవిభాగము గృహస్థాశ్రమముననే చేయబడును. వానప్రస్థులకు కూడా ద్రవ్యోపస్కారమును చేయవలయును. సామాన్యముగా సాధువులు చక్కని పథ్యమైన ఆహారమును తీసుకొనుచు, స్వాధ్యాయప్రవచనమును చేయుచు తీర్థాభిగమనము కొఱకు పుణ్య క్షేత్ర దేశ దర్శనము కొఱకు భూమినంతయు పర్యటింతురు. అట్టి వారికి లేచి ఎదురేగి అభివాదమాచరించి అసూయారహితముగా మాటలాడి ఆనందమును కలిగించు సత్కారములనాచరించి, ఆసనశయనాదులనేర్పరిచి చక్కని ఆహారమునొసంగి సన్మానించవలయును. ఈ విషయమున ఒక శ్లోకము కలదు. అతిధి నిరాశతో ఇంటినుండి వెడలినచో తన దుష్కృతమును గృహస్థున కొసంగి అతని పుణ్యమును తీసుకొని వెళ్ళును అని శ్లోక భావము. ఈ గృహస్థాశ్రమమున యజ్ఞములచే దేవతలు, తర్పణముచే పితృదేవతలు, విద్యాభ్యాసశ్రవణధారణములచే ఋషులు, సంతానోత్పత్తిచే ప్రజాపతి ప్రీతి చెందెదరు. ఇచట రెండు శ్లోకములను చేప్పెదరు. సర్వభూతములయందు వాత్సల్యమును చూపవలయును. శ్రోత్రములచే - దుర్బాషలను వినరాదు. వాక్కుచే- పరుషముగా మాట్లాడరాదు, పరితాపమును పొందరాదు. ఎదుటివారిని బాధించరాదు. అవమానము అహంకారము, దంభము ఈ మూడు నింద్యములు. అహింసా, సత్యము, అక్రోధము, తపస్సు అనునవి నాలుగాశ్రమములలో నాచరించదగినవి మరియు ఈ గృహస్థాశ్రమమున మాల్యాభరణ వస్త్ర అభ్యంగన, నిత్యోపభోగ, నృత్య గీత వాద్యములచే చెవులకు నేత్రములకు ఆనందమును కలిగించుచు, ఆరామదర్శనాదులను చేయుచు, భక్ష్యభోజ్య లేహ్య పేయ చోష్యాది రసవంతములగు ఆహారమునను స్వీకరించుచు వివిధ భోగానుభవముండును. విహారముచే సంతోషము, కామ సుఖావాప్తి కూడా యుండును. గృహస్థాశ్రమమున త్రివర్గగుణములను నివృత్తి చేయువారు ఆహమున సుఖముల ననుభవించి పరమున సద్ధతిని పొందుదురు. ఉంఛవృత్తి నవలంబించి స్వధర్మా చరణమును చేయుచు కామసుఖములను వదిలిన గృహస్థుడు సులభముగా స్వర్గమును పొందును.
వాసప్రస్థాశ్రమమును స్వీకరించిన వారు కూడా ధర్మమును అనుసరించుచు, పుణ్యతీర్థములను, పుణ్యజలములను సేవించుచు, మగ వరాహ మహిష శార్దూల వనగజాది సేవితమగు అరణ్యములలో తపస్సును చేయుచు సంచరించుచుండ నలయును. గ్రామ్యవస్త్రములను ఆహారమును పరిత్యజించి వన్యములగు ఓషధి ఫలమూల పర్లాదులచే ఆహారనియమమును అభ్యసించి భూమి పై కూర్చొనుచు, పాషాణముల పై, ఇసుక పై, గులకరాళ్ళ పై, సదీరీరములందు, భస్మాదులయందు, ధూళిలో శయనించుచు కాశకుశ చర్మవల్కలాదులను వస్త్రములుగా ధరించుచు, కేశశ్మశ్రునఖ రోమాదులను ధరించి నియమబద్దముగా కొలకృత్యములను, సంధ్యా బలిహోమాదులను అనుష్ఠించుచు, సమీధలను, పుష్పములను, జలమును సంగ్రహించుకొనుచు, సమ్మార్టోమాదులచే తమ నివాసమును పవిత్రముగా నుంచుకొనుచు, - విశ్రమించుచు చలి, వేడి, గాలి మొదలగు ప్రకృతి సహజమైన స్పర్శలకు చలించక, పలునియమములతో యోగానుష్టానముచే శరీరము నందలి మాంసాస్థి రక్త చర్మాదులను శుష్కింప చేయుచు ధైర్యము కలవారై సత్త్వయోగముచే శరీరమును ధరించియుందురు. ఇట్లు బ్రహ్మరులచే విధించబడిన నియమములనాచరించువారు అగ్నివలె పాపమును దహించి అన్ని లోకములను జయించును.
ఇక ఇపుడు సన్యాసాశ్రమాచారములను వివరించెదను. అగ్నిని పరిత్యజించి ధన భార్యాలింగనాది భోగములను వీడి సంసారమునందలి వ్యామోహమును త్రోసి పుచ్చి సన్యసించవలయును. బంగారమును మట్టిగడ్డను ఒకేవిధముగా చూచుచు త్రివర్గములయందు ఆసక్తులుకాక శత్రుమిత్ర ఉదాసీనుల విషయమున సమదృష్టిని ప్రదర్శించుచు అన్నివిధములగు ప్రాణులకు కరణత్రయముచే ద్రోహమునాచరించక స్థిరనివాస హీనులై పర్వత శిఖరములందు, వృక్షమూలములందు, దేవాలయములందు నివసించుచు సంచరించుచు దారిలో కనపడిన గ్రామమును కాని నగరమును కొని వెళ్ళవలయును. కామక్రోధలోభమోహమదమత్సరములను, దైన్యదంభపరివాదములను, హింసను విడిచి యుండవలయును. ఈ విషయమున ఈ శ్లోకములను చెప్పెదరు. సర్వభూతములకభయము నిచ్చుచు చరించువానికి ఏ ప్రాణి వలన భయము కలుగదు. అగ్నిని శరీరమున నిలిపి, శరీరమున గల అగ్నిని ముఖమున హోమము చేసి, భిక్షాటనము వలన లభించిన దానిని భుజించుచు అనగా ముఖమున నున్న అగ్ని కర్పించుచు, చితాగ్నిచే పరలోకములను చేరును. ఇట్లు సంకల్పబుద్దిచే యథోక్తవిధిగా సన్యాసాశ్రమము నాచరించిన వారు ఇంధనములు లేని అగ్నివలె ప్రశాంతులై బ్రహ్మ లోకమును చేరును.
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున భృగుభరద్వాజ సంవాదమున బ్రాహ్మణాచార నిరూపణమను నలుబది మూడవ అధ్యాయము సమాప్తము.
