నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

25 - అధ్యయనాదిధర్మనిరూపణమ్

ఓ ముని శ్రేష్టా ! వర్ణాశ్రమాచారవీధిని విశేషముగా చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుము. స్వధర్మమును విడిచి పరధర్మము నాచరించువాడు సర్వధర్మ బహిష్కృతుడై పాషండుడగును. గర్భాధానాదీ సంస్కారములను కాలానుసారముగా మంత్రపూర్వకముగా నాచరించవలయును. స్త్రీలకు మంత్రరహితముగా నాచరించవలయును. మొదట సీమంతకర్మ నాలుగవ నెలలో చేయవలయును. లేదా ఆరవ, ఏడవ, ఎనిమిదవ నెలలోనైననూ చేయవచ్చును. పుత్రుడు జన్మించిన వెంటనే తండ్రి సచేలస్నానమాచరించి స్వస్తి వాచకపూర్వకముగా నాందీశ్రాద్దమునాచరించవలమును. అన్నముతో శ్రాద్దమును చేసినచో చండాలుడగును. తండ్రి వాజ్మయముతో అతి గుర్వక్షరాన్వితముగా బేసిఅక్షరములు కలదిగా నామకరణము చేయరాదు. మూడవయేట కాని, అయిదవ ఏట కాని, ఆరవ ఏటగాని, ఏడవయేటగాని, ఎనిమిద ఏటకొని గృహ్యమార్గముననుసరించి చౌలమును చేయవలయును. దైవయాగమున గర్భాధానాదికర్మలు చేయుటకు కాలాతిక్రమము జరిగిచో పాదకృచ్ఛవ్రతము నాచరించవలయును. కాలాతిక్రమము జరిగినచో పొదకృచ్ఛవ్రతము నాచరించవలయును. బ్రాహ్మణునకు, గర్భాష్టమ, వర్షమున కాని అష్టమవర్షమున కాని ఉపనయనము చేయవలయును. వీలుకానిచో పదునారు వర్షముల లోపు చేయవచ్చును. క్షత్రియునకు గర్బెకాదశవర్షమున చేయవలయును. ఇరువది రెండు సంవత్సరముల వరకు చేయవచ్చును. ఇరువది నాలుగు వర్షముల వరకు గౌణకాలమగును. బ్రాహ్మణునకు చెప్పిన ఉపనయనకాలము అతిక్రమించినచో ద్విజుడు సావిత్రీ పతితుడగును. అతనితో నెవ్వరూ ఎప్పుడూ సంభాషించరాదు. బ్రాహ్మణున కుపనయనము చేయు సమయము అతిక్రమించినచో పన్నెండు సంవత్సరములు కృచ్ఛవ్రతము నాచరించవలయును. తరువాత చాంద్రాయణవ్రతము నాచరించవలయును. రెండు సంతాపన వ్రతముల నాచరించి తరువాత కర్మ నారంభించ వలయును. అట్లు చేయనిచో పతీతుడగును. కర్తకు బ్రహ్మ హత్యాపాతకము లభించును. ఉపనయన కాలమున బ్రాహ్మణుని మొలత్రాడు ముంజతృణముతో నేర్పరుచవలయును. కత్రియునకు వింటినారితో చేయవలయును. వైశ్యునకు ఆవకముతో చేయవలయును. అట్లే బ్రాహ్మణునకు జింకచర్మము, క్షత్రియునకు ఏదు చర్మము, వైశ్యనకు గొట్టెచర్మమును ధరింపచేయవలయును. అట్లే బ్రాహ్మణునకు మోదుగుచెట్టు దండం, క్షత్రియునకు మేడిచెట్టు దండము, వైశ్యునకు మారేడుచెట్టు దండముండవలయును. దండప్రమాణము బ్రాహ్మణునకు కేశాంతము, క్షత్రియమునకు లలాటపర్యంతము, వైశ్యునకు నాసాగ్రపర్యంతముండవలయును. ఇక ఇపుడు బ్రాహ్మణాదులు. ధరించవలసిన వస్త్రములను చెప్పెదను వినుము. బ్రాహ్మణునకు కాషాయ వర్ణము, క్షత్రియునకు మాంజిష్ఠ వర్ణము, వైశ్యునకు పసుపువర్ణ వస్త్రము విహితము. ఉపనీతుడైన ద్విజుడు గురువునకు పరిచర్యను చేయుచు వేదాధ్యయన పర్యంతము గురకులమున నివాసమును చేయవలయును. బ్రహ్మ చారి ప్రతిదినము ప్రాతఃకాలమున స్నానమాచరించి కాలానుగుణముగా గురువుగారి కొరుకు సమిత్కుశఫదీకములను తేవలయును. యజ్ఞోపవీతము అజినము దండము నష్టమైనను భ్రష్టమైననూ నూతనమును మంత్రపూర్వకముగా ధరించవలయును. భ్రష్టమైనదానిని జలమున పడ చేయవలయును. బ్రహ్మ చారి భిక్షాన్నముచే మాత్రమే జీవికను గడుపవలయును. ఇంద్రియ నిగ్రహముతో బ్రహ్మ చారి శ్రోత్రియుని ఇంటనుండియే భిన్న గ్రహణము చేయవలయును. బ్రాహ్మణుడు భిక్ష చేయునపుడు మొదట భవచ్చబ్దమును ప్రయోగించవలయును. క్షత్రియుడు మధ్యన భవచ్చబ్దమును ప్రయోగించవలయును. వైశ్యుడు చిరవ భవచ్చబ్దము నుపయోగించవలయును. అనగా బ్రాహ్మణుడు “భవతి ! భిక్షాం దేహి మాతః” అని, క్షత్రియుడు “భిక్షాం భవతి దేహి మాతః” అని, వైశ్యుడు “భిక్షాం దేహి భవతి మాతః” అని ప్రయోగించవలయును. బ్రహ్మ చారి ఇంద్రియ నిగ్రహముతో ప్రతిదినము ప్రాతఃకాలము సాయంకాలము అగ్ని కార్యమును బ్రహ్మయజ్ఞమును చేయవలయును. తర్పణము చేయవలయును. అగ్ని కార్యమును వదిలినవాడు పతితుడగను, బ్రహ్మయజ్ఞమును చేయనివాడు బ్రహ్మ హత్యచేసిన వాడగును. గురుశుశ్రూష తరువాత దేవతాద్యర్చనను చేయవలయును. బ్రహ్మ చారి ప్రతినిత్యము భిక్షాన్నమునే భుజించవలయును కాని ఒకే ఇంటి భోజనమును చేయరాదు. ఉత్తమవిప్రుల ఇంటినుండి భిక్షను తెచ్చి ఇంద్రియ జయముతో భిక్షను గురువునకు నివేదించి గురువాజ్ఞచే మౌనముగా తాను భోజనము చేయవలయును.

మద్యమును, స్త్రీలను, మాంసమును, లవణమును, తాంబూలమును, దంతధావనమును, ఉచ్చిష్ట భోజనమును, పగలు నిద్రించుటను, బ్రహ్మచారి విడువవలయును. ఛత్రమును, పాదుకలను, గంధమును, పూలమాలనును, సుగంధద్రవ్యా సులేపనమును, జల కేళిని, నృత్యగీత పోద్యములను, వీడువలయును. పరివాదమును, ఉపలాపమును, అధిక ప్రలాపమును, కాటుకను, నాస్తిక జనసంబంధమును, శూద్రజన సంగతిని విడువలయును. వృద్ధుల విషయమున యథావిధిగా అభివాదమును చేయవలయును. జ్ఞానవృద్ధులు, వయోవృద్దులు తపోవృద్ధులు అని వృద్ధులు మూడు విధములుగా నుందురు. వేదశాస్త్రోపదేశముచే ఆధ్యాత్మికాది దుఃఖములను నివారించు గురువునకు మొదట ఆభివాదనము చేయవలయును. బ్రాహ్మణుడు ఆభివాదమును చేయునపుడు ‘అసావహం’ (ఈ నేను) అని చెప్పవలయును. బ్రాహ్మణుడు క్షత్రియాదులను ఎట్టి స్థితిలోనైనను అభివాదనము చేయరాదు. నాస్తికునికి, భిన్నమర్యాదునికి, కృతఘ్నునికి, గ్రామయాజకునికి, చోరునకి, కపటికి, ఎపుడూ నమస్కరించరాదు. పాషండునికి పతితునికి, వ్రాత్యునికి, జ్యోతిష్కునికి, పాతకునికి నమస్కరించరాదు. ఉన్మత్తునికి శకునికి ధూర్జునికి పరుగెత్తు వానికి అపవిత్రునికి నూనె తలకంటుకొనిన వానికీ, జపముచేయుచున్నవానికి నమస్కరించరాదు. వివాదశీలికీ, చండునికి వాంతి చేసుకొనినవానికి నీటి మధ్యలో నున్నవానికి, భిక్షాన్నమును ధరించినవానికి, పడుకొనియున్నవానికి నమస్కరించిరాదు. భర్తను చంపినదానికి, రజస్వలకు, జారురాలికి, ప్రసవించినదానికి, పురిటిలో ఉన్నదానికి, గర్భపాతమును చేసుకొన్నదానికి, కృతఘ్నురాలికి, చండికి, నమస్కరించరాదు. సభలో, యజ్ఞశాలలో, దేవాలయములో ప్రత్యేకించి ఏ ఒక్కరికో చేసిన నమస్కారము పూర్వమున చేసుకొన్న సుకృతమును నశింపచేయును శ్రాద్ధమును, వ్రతమును, దానమును దేవతార్చనను, యజ్ఞమును, తర్పణమును, చేయువారికి నమస్కరించరాదు. అభివాదము చేసినపుడు ప్రత్యభివాదము చేయనివారికి అభివాదము చేయరాదు. ప్రత్యభివాదమును చేయనివాడు శూద్రతుల్యుడు. పాదప్రక్షాళనమును చేసుకొని ఆచమనము చేసి గురువుగారికి అభిముఖముగా నుండి గురువుపొదములను గ్రహించి వివేకము కలవాడై అధ్యయనము చేయవలయును. అష్టమియందు, చతుర్దశియందు, ప్రతిపత్తునందు, పూర్ణిమ తిథియందు మహాభరణీ నక్షత్రమునందు శ్రావణద్వాదశియందు, భాద్రపద బహుళ ద్వితీయానాడు, మాఘశుద్ధ సప్తమినాడు, అశ్వయుజ శుద్ధనవమినాడు, సూర్యగ్రహణమున, శ్రోత్రియులు గృహమునకు వచ్చినపుడు బ్రాహ్మణుడు బంధించబడినపుడు, కలహములు పెరిగినపుడు, సంధ్యాసమయమున, మేఘగర్జన కాలమున, అకాలవర్షమున, ఉల్కాపాతము ఆశనిపాతము జరిగినపుడు, విప్రుడవమానించబడినపుడు మన్వాదికాలమునందు నాలుగు యుగముల ఆదికాలమమునందు కర్మఫలమున ఆసక్తి గల బ్రాహ్మణుడు అధ్యయనము చేయరాదు వైశాఖశుద్ద తదియ (అక్షయ తృతీయ) భాద్రపద కృష్ణ త్రయోదశి, కార్తీక శుక్ల నవమి (అక్షయనవమి) మాఘ పూర్ణిమ ఈ నాలుగు యుగాదులుగా తెలియును. ఈ కాలమున దానము చేసినచో అక్షయ ఫలము లభించును.

మన్వాదికాలమును చెప్పెదను సావధానముగా వినుము. ఆశ్వయుజ శుద్ధనవమి, కార్తీక శుద్ధద్వాదశి, చైత్రశుద్ధ తృతీయ, భాద్రపదశుద్ధ తృతీయ ఆషాడ శుక్ల దశమి, మాఘశుద్ధ సప్తమీ, శ్రావణ బహుళ అష్టమి, ఆషాడ పూర్ణిమ, ఫాల్గునామావాస్య, పుష్యశుదైకాదశి, కార్తిక, ఫాల్గున చైత్ర జ్యేష్ఠ పూర్ణిమలు మన్వాదులుగా ప్రసిద్ధి పొందినవి ఈ కాలమున దానము చేసిన అక్షయ  ఫలమున లభించును.  మన్వాది కాలమున, యుగాదికాలమున శ్రాద్ధము చేయవలయును. శ్రాద్ధమున నియంత్రణ చేసినపుడు, సూర్యచంద్రగ్రహణములలోను ఉత్తరాయణ దక్షిణాయన కాలములోను భూకంపనమున గల గ్రహణమున, మేఘచ్చిన్నదినమున అధ్యయనము చేయరాదు. ఈ అనధ్యయన దినములలో అధ్యయనముచేయు మూడులకు సంతానమును, ప్రజ్ఞను, కీర్తిని, సంపదను, ఆయుష్యమును, బలమును, ఆరోగ్యమును యముడు స్వయముగా హరించును. అనధ్యయనమున వేదాధ్యయనము చేయువానిని బ్రహ్మఘూతకునిగా పేర్కోనెదరు. అట్టివానితో మాట్లాడరాదు, కలసియుండరాదు. భర్త ఉండగా జారుని వలన కలిగిన పుత్రునికి, భర్త మరణించిన తరువాత జారుని వలన కలగిన పుత్రునికి కొని వారి పుత్రులకు కాని ఉపనయనము చేయవచ్చునని కొందరు పండితులు చెప్పుచున్నారు. వేదాధ్యయనము జరుపక ఇతర విద్యలలో పరిశ్రమచేయువాడు శూద్రతుల్యుడు, నరకమునకు ప్రియమైన అతిథిగా తెలియుము. వేదాధ్యయనమును చేయని విప్రుడు ఆచారమునందు శ్రద్ద చూపినను ఆచారఫలమును పొందజాలడు. శూద్రతుల్యుడగును. వైదికములగు నిత్యనైమిత్తిక కామ్యకర్మలుచే ఆధ్యయనము చేయనివానికి నిష్ఫలములగును. శబ్ద బ్రహ్మమయుడు విష్ణువు. వేదము సాక్షాత్తు శ్రీహరియే. కావున వేదాధ్యాయియగు విప్రుడు సర్వకామములను పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున  పూర్వభాగమున ప్రథమపాదమున స్మార్తా చారములలో వర్ణాశ్రమధర్మములలో అధ్యయనాదిధర్మనిరూపణము అను  ఇరువది అయిదవ అధ్యాయము సమాప్తము.