నారద మహా పురాణము - పూర్వార్థము
111 - ద్వాదశ మాస ద్వితీయావ్రత నిరూపణము
సనాతన మహర్షి పలికెను :-
ఓ బ్రాహ్మణోత్తమా! ఇపుడు నీకు ద్వితీయా వ్రతములను చెప్పెదను. ఈ వ్రతముల నాచరించినచో మానవుడు బ్రహ్మలోకమున ఆనందించును. చైత్రశుద్ధ విదియనాడు శక్తియుక్తుడగు బ్రహ్మను హవిష్యాన్నముచే, గంధాదులచే సర్వయజ్ఞ సముద్భూతిని స్తుతించి పూజించి ఇహలోకమున సర్వకామములను అనుభవించి అంతమున బ్రహ్మలోకమును పొందును. ఈ దినముననే ఉదయించిన బాలచంద్రుని సాయంకాల సమయమున చక్కగా పూజించి భక్తిముక్తులను పొందును. అట్లే ఈ దినమున అశ్వినీ దేవతలను భక్తిచే పూజించి, బ్రాహ్మణునకు బంగారు వెండి నేత్రములను దానము చేయవలయును. ఈ పూర్ణయాత్రా వ్రతమున పెరుగుతో కాని నేయిచే కాని పన్నెండు సంవత్సరములు నేత్ర వ్రతమునాచరించినచో భూపతి కాగలడు. చక్కని రూపసి, శత్రు సంహారకుడు, ధర్మాభిరాముడు, రాజముఖ్యుడు కాగలడు. వైశాఖ శుద్ధ ద్వితీయ నాడు విష్ణురూపియగు బ్రహ్మను సప్త ధాన్యములలో నుంచిన కలశముపై యధావిధిగా పూజించి ఇహలోకమున మనసుకు నచ్చిన భక్ష్య భోగములననుభవించి అంతమున విష్ణులోకమును పొందును. జ్యేష్ఠ శుద్ధ ద్వితీయనాడు భువనాధిపతియగు సూర్యభగవానుని చతుర్వక్ర స్వరూపుని యధావిధిగా పూజించి భక్తిచే బ్రాహ్మణులకు భోజనము పెట్టి సూర్యలోకమును పొందును. ఆషాఢ శుద్ధ ద్వితీయ పుణ్య సహిత. ఆ దినమున రథమును సిద్దము చేసి సుభద్రాసహితుడగు బలరాముని బ్రాహ్మణులచే కలిసి నగరమున తిప్పి జలాశయసమిపమునకు వెళ్ళి మహోత్సవమును చేయించ వలయును. తరువాత దేవుని ఆలయమున యధావిధిగా ఉంచి బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును. శ్రావణ శుక్ల ద్వితీయనాడు ప్రజాపతియగు విశ్వకర్మ నిదురించునని ఆతిధికి అశోకశయనయని పేరు. శయ్యపైనున్న శక్తి సహితుని చతుర్ముఖుని పూజించి, జగత్పతికి నమస్కరించి ఈ మంత్రమును పఠించవలయును. శ్రీ వత్సధారీ! శ్రీకాంత! శ్రీనివాసా! శ్రీపతీ! ప్రభూ! ధర్మార్థ కామద! నాకు సంసార నివృత్తి కలిగించుము. ఇచట సర్వసిద్ధి ప్రదాయకమగు చంద్రార్థ దానము చెప్పబడినది. భాద్రపద శుద్ధ విదియనాడు ఇంద్రరూపియగు జగత్ర్పభువును యధావిధిగా పూజించి సర్వయజ్ఞఫలమును పొందవచ్చును. ఆశ్వయుజ శుక్ల ద్వితీయ పరమ పవిత్రమైనది.ఈ దినమున చేసిన దానము ఆనంత పలము నిచ్చును. కార్తీక శుద్ద విదియనాడు యమునికి చెల్లెలగు యమున తన ఇంటిలో భోజనము పెట్టేను. కావున ఈ ద్వితీయకు యమ ద్వితీయా అని పేరు. ఈ దినమున చెల్లెలు ఇంటిలో భోజనము చేసినచో పుష్టి కలుగును. భోజనము చేసిన తరువాత సోదరికి వస్త్రాభరణముల నీయవలయును. యమున యమ ధర్మరాజునకు సోదర ప్రేమతో స్వహస్తముతో భోజనము చేయించిన ఈ ద్వితీయనాడు సోదరి ఇంటిలో భోజనమును చేసినవాడు ధన ధాన్య సంపత్సమృద్ధిని పొందును. మార్గశిర శుద్ధ ద్వితీయనాడు శ్రద్ధతో పితృదేవతలను పూజించవలయును. ఇట్లు చేసినచో పుత్రపౌత్రులతో ఆరోగ్యముతో విలసిల్లును. పుష్యశుక్ల ద్వితీయనాడు గోశృంగోదకముతో మార్జనము చేసుకొని బాలేను దర్శనమును చేయవలయును. ఈ దినమున బాలచంద్రుని ఇంద్రియనిగ్రహము కలవాడై హవిష్యమును మాత్రమే భుజించుచు అర్యమునిచ్చి పూజించినచో ధర్మకామార్థములు సిద్ధించును. మాఘశుక్ల ద్వితీయనాడు భానురూపుడగు ప్రజాపతిని యధావిధిగా పూజించి ఎఱ్ఱని పూవులచే పూజించవలయును. అట్లే రక్తచందనముతో, శక్తిననుసరించి స్వర్ణమూర్తిని చేసి పరిపూర్ణమగు తామ్ర పత్రమును గోధుమలతో కాని తండులములచే కాని భక్తిచే దేవునికి సమర్పించి ఆ దేవతామూర్తిని బ్రాహ్మణునకు దానము చేయవలయును. ఇట్లు వ్రతమునాచరించి నచో సాక్షాత్తుగా ఉదయించిన సూర్యునివలె. చూడ శక్యముకాని తేజము కలవాడై ప్రకాశించును. ఇహలోకమున అభీష్ట భోగములననుభవించి అంతమున బ్రహ్మలోకమును పొందును. ఇక ఫాలున శుద్ద ద్వితీయనాడు సువాసన గల తెల్లని పూవులచే శివుని పూజించి, శుభములగు శ్వేత పుష్పములతో శయ్య మర్చి ధూప దీప నైవేద్యములతో నీరాజనాదులతో చక్కగా పూజించి ప్రసన్నుని చేసి సాష్టాంగ ప్రణామమును చేయవలయును. ఇట్లు శివుని పూజించిన మానవుడు రోగవర్జితుడై ధనధాన్య సమృద్ధికలవాడై నూరు సంవత్సరములు జీవించును. ఇట్లు శుక్ల ద్వితీయలలో చెప్పిన విధానమునే కృష్ణ ద్వితీయల యందు కూడా ఆచరించవలయును. అగ్నిహోత్రుడే ఆయానెలలో వేరు వేరు రూపములను ధరించి ద్వితీయా తిధులందు పూజిచంబడు చుండును. ఈ వ్రతములలో బ్రహ్మచర్యాది నియములను పూర్వము వలెనే ఆచరించవలయును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున ద్వాదశ మాస ద్వితీయావ్రత నిరూపణమను నూట పదుకొండవ అధ్యాయము సమాప్తము.
