నారద మహా పురాణము - పూర్వార్థము
122 - ద్వాదశమాసస్థిత త్రయోదశీవ్రతకధనమ్
సనాతన మహర్షిపలికెను :- ఇక ఇపుడు నీకు త్రయోదశీవ్రతములను చెప్పెదను. ఈ వ్రతములనాచరించిన వారు సౌభాగ్య వంతులయ్యేదరు. చైత్రశుద్ధ త్రయోదశినాడు చందనముచే నిర్మించిన మదనుని శ్రద్దగా పూజించి చామరలచే వీవవలయును. అపుడు కదలిన కలిగిన మన్మధుడు పుత్రులను పౌత్రులను పెంపొందించును. ఈనాడు అనంగపూజకూడా విధించబడినది. దానిని తెలియుము. ఫలకమున సిందూరరజనీరాగములచే అనంగుని లిఖించవలయును. రతీదేవియందు ప్రీతికలవానిని. మృదు స్వభావుడు, పుష్పచాపేషు ధారియగు కామదేవుని, వసన్తుని, హయగ్రీవుని, శంకరుని, మధ్యాహ్నకాలమున గంధమాల్యా భరణ వస్త్రాదులచే నానావిధ భక్ష్యములచే ఈ మంత్రమును చదువుచు పూజించవలయును. నమో మారాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మవిష్ణు శివేంద్రోణాంనమః క్షోభకరాయవై” అని అనగా మారునకు కామదేవునకు, కామదేవస్వరూపునకు, బ్రహ్మ విష్ణు ఇంద్రుల మనసును క్షోబింప చేయువానికి నమస్కారము” ఈ మంత్రమునకర్థము. తరువాత కామదేవునిముందు ఒక గ్రహస్తును మన్మధునిగా భావంచి భక్తితో వస్త్రమాల్యా విభూషణాదులచే పూజించవలయును. బ్రాహ్మణదంపతులను కూడా గంధవస్త్రాది భూషణములచే పూజించవలయును. ఇట్లు ప్రతి సంవత్సరమున వసంతకాలమున ఈ వ్రతమునాచరించిన వాడు సంతోషముతో పుష్టితో నుండును. లేదా ఒక సంవత్సరకాలము ప్రతిమాసమున మన్మధుని పన్నెండు నామములతో పూజించవలయును. మదనుని, హృద్భవుని, కాముని, మన్మధుని, రతిప్రియుని, అనంగుని, కందర్పుని, మకరధ్వజుని, కుసుమాయుధుని, మనోభవుని, విషమేఘని, మాలతీప్రియుని మఖాది క్రమముతో పూజించవలయును. ఇచట అజాదానముకూడా చెప్పబడినది. నదియందు యధావిధిగా స్నానము నాచరించి దరిద్రుడు బహుకుటుంబియగు బ్రాహ్మణునకు ఫాలనిచ్చు మేకలను దానము చేయవలయును. ఈ అజాదానము చేసినవారికి పునర్జన్మ ఉండదు. ఒక వేళ ఈత్రయోదశి శనివారమున వచ్చినచో దానిని మహావారుణీ యందురు. ఈనాడు గంగాస్నానము చేసినచో కోటి సూర్యగ్రహణములకంటే విశిష్టము. చైత్ర శుక్ల త్రయోదశినాడు శుభయోగము, శతభిషానక్షతము, శనివారము, కామదేవుడు ఇట్లు కలియుట మహామహాచిత్రయోదశీయనబడును. ఈత్రయోదశి కోటికులములకు ముక్తిని ప్రసాదించును. ఇక వైశాఖ శుక్ల త్రయోదశినాడు కామదేవవ్రతము చెప్పబడినది. ఈనాడు ఉపవసించి, గంధాదులతో కొమదేవుని పూజించవలయును. తరువాత ప్రతిమాసమున శుద్ధత్రయోదశినాడు ఇట్లే వ్రతము నాచరించవలయును. సంవత్సరాన్తమున అలంకరించిన గోవును బ్రాహ్మణునకు, సత్కారపూర్వకముగా వ్రతపరిపూర్తికి దానమును గావించవలయును. జ్యేష్టశుక్షతయోదశినాడు దౌర్భాగ్యశమనవ్రతము నాచరించవలయును. ఈనాడు నదీజలమున స్నానమాడి పరిశుద్ధ ప్రదేశమున మొలచియున్న శ్వేతమందారమును, జిల్లేడును, ఎఱ్ఱగన్నేరును, ఆకాశమున సూర్యుని చూచి పూజించి ఈమంత్రముతో ప్రార్థించవలయును. మందారమా?కరవీరమా?ఆర్కమా? మీరు భాస్కరాంశతో పుట్టినవారు కావున మాచే పూజించబడి మా దౌర్భాగ్యమును నశింపచేయుడు. మీకు నమస్కారము. అని ప్రతిసంవత్సరము ఈ మూడు వృక్షములను పూజించువారి దౌర్భాగ్యమునశించును. ఆషాఢ శుద్ధ త్రయోదశినాడు ఏకభుక్తము నాచరించి, యధాశక్తి బంగారముతో కాని, వెండితోకాని మట్టితోకాని పార్వతీపరమేశ్వర రూపములను నిర్మించి, దేవాలయమున కాని, గోష్ఠమునకాని, బ్రాహ్మణ గృహమునకాని దేవమంత్రముచే ప్రతిష్టించి, అయిదుదినములు. ఏక భుక్తముతో పూజించవలయును. మూడవదినమున ప్రాతః కాలమున స్నానమును గావించి పార్వతీపరమేశ్వరులను పూజించి, వేదవేదాంగజుడగు బ్రాహ్మణునకు సమర్పించవలయును. ఇట్లు అయిదు సంవత్సరములు ప్రతివర్షము చేయవలయును. అంతమునధేను యుగ్మముతో ఆప్రతిమలను దానము చేయవలయును. ఈవ్రతమునాచరించిన నరుడు లేదా నారి ఏడు జన్మలవరకు దాంపత్య విచ్ఛేదమును పొందరు.
శ్రావణ శుక్షత్రయోదశినాడు స్త్రీలకు వైధవ్యమును వారించునది, సంతానార్థము అగు రతికామవ్రతమును ఆచరించవలయును. కన్యకాని, నారీకొని ఆనాడు ఉపవసించి, రాగితోకాని, మట్టితోకాని, బంగారముతోకాని, వెండితోకాని, నిర్మించి రతీమన్మధులను నిర్మించి గంధాధులతో చక్కగా పూజించవలయును. తరువాత చతుర్దశినాడు బ్రాహ్మణదంపతులను సత్కరించి పూజించి భోజనము చేయించి దక్షిణలతో ఆప్రతిమలను వారికి దానము చేయవలయును. ఇట్లు పదునాలుగు సంవత్సరములు ఈవ్రతము నాచరించి వ్రతపూర్తికొరకు ధేనుయుగ్మమును దానము చేయవలయును. భాద్రశుక్లత్రయోదశినాడు గోత్రిరాత్ర వ్రతము నాచరించవలయును. బంగారముతోకాని వెండితో కాని లక్ష్మీనారాయణుల ప్రతిమలను చేసి, అష్టదలమండలమున పీఠమున నుంచి వస్త్రములతో కప్పి గంధాదులతో పూజించవలయును. తరువాత నీరాజనమునిచ్చి స్నానోదకఘటమును దానము చేయవలయును. ఇట్లు దినత్రయమున ఆచరించి వ్రతాంతమున మాసము పూజించి, చక్కగా అర్థమును సంపాదించి మంత్రముతో దానమును చేయవలయును. మహాసముద్రమున మధ్యమాసమున పంచగోవులు పుట్టినవి. వాటిలో మధ్యధేనువగు నందాకు నమస్కారము. తరువాత ప్రదక్షిణము చేసి మంత్రముతో బ్రాహ్మణునకు దానము గావించవలయును. నాముందు గోవులుండును. నావెనుక గోవులుండనీ. నారెండు ప్రక్కల గోవులుండనీ. గోవుల మధ్యన నేనున్నాను. అనుఅర్థము కలమంత్రమును పఠించవలయును. తరువాత బ్రాహ్మణదంపతులను చక్కగా భుజింపచేసి పూజించవలయును. తరువాత సత్కరించి లక్ష్మీనారాయణ ప్రతిమను సమర్పించవలయును. ఈగోత్రిరాత్రవ్రతము నాచరించినచో సహస్రాశ్వమేధయాగముల ఫలితము, నూరురాజ సూయయాగముల ఫలము కలుగును.
అశ్వయుజ శుక్లత్రయోదశినాడు త్రిసత్రాశోకకవ్రతము నాచరించవలయును. బంగారముతో అశోకవృక్షమును నిర్మించి యధా విధిగా పూజించి స్త్రీ ఉపవాసముతో ప్రతిదినము ఈమంత్రముతో నూటాఎనిమిది ప్రదక్షణములు చేయవలయును.
ఓ అశోకవృక్షమా, నీవు పూర్వము లోకోపకారమునకు శంకరునిచే సృజించవబడితివి. కావున ఓ శివప్రియా. నాయెడ ప్రసన్నము కమ్ము. అని అర్థము. తరువాత మూడవదినమున ఆవృక్షమున శివుని యధావిధిగా పూజించి బ్రాహ్మణుని భుజింపచేసి దానమియ వలయును. ఈవ్రతమునాచరించు స్త్రీ వైధవ్యమును పొందదు. పుత్రపౌత్రాదులతో విలసిల్లును. పతికి ప్రీతిపాత్రురాలగును. కార్తీక బహుళత్రయోదశినాడు తైలదీపమును వెలిగించి శ్రద్దగాపూజించి గృహద్వారమున బయట నాకు యమధర్మరాజు ప్రీతి చెందుగాక యని ఉంచవలయును. ఇట్లు చేసినచో యమపీడ కలుగదు. కార్తీక శుద్ధత్రయోదశినాడు ఏకభుక్తముగా, ప్రదోషకాలమున మరల స్నానమాడి మౌనముతో, సావధానుడై వేయిదీపములను కొని నూరుదీపములు కాని వెలిగించవలయును. లేదా శివునికి ముప్పది రెండు దీపములతో మాలను చేయవలయును. దీపములను నేతితో నుంచవలయును. గంధాదులతో ఫలములతో నానావిధనైవేద్య ములతో శివుని చక్కగా పూజించవలయును. తరువాత శివుని శతనామములతో స్మోతము చేయవలయును. ఇపుడు సర్వాభీష్టప్రదములగు శివనామములను చెప్పెదను. రుద్రునకు, భీమునకు, నీలకంఠునకు, వేధకు నమస్కారము. కపర్దికి,సురేశునకు, వ్యోమకేశునకు నమస్కారము. వృషధ్వజునకు, సోమునకు, సోమనాధునకు నమస్కారము. దిగంబరునకు, భృంగునకు, ఉమాకాంతునకు, వర్ధికి, తపోమయునకు, వ్యాప్తునకు శిపివిష్టునకు నమస్కారము. వ్యాలప్రియునకు, వ్యాలునకు, వ్యాలపతికి నమస్కారము. మహీధరునకు, వ్యోమునకు, పశుపతికి నమస్కారము. త్రిపురఘ్నునకు, సింహమునకు, శార్దూలునకు, ఋషభునకు, మీతునకు, మితనాధునకు, సిద్ధునకు, పరమేష్ఠికి, వేదగీతునకు, గుప్తునకు, వేదగుహ్యునకు నమస్కారము. జగత్పతిష్ణునకు, వ్యోమరూపునకు, నమస్కారము. కళ్యాణునకు, విశిష్టునకు, శిష్టునకు, పరమాత్మకు, గజకృతిధరునకు, అంధకాసురఛేదికీ, నీలలోహితునకు, శుక్లునకు, చండముండ ప్రియునకు, భక్తిప్రియునకు, దేవునకు, యజ్ఞాంతునకు అవ్యయునకు నమస్కారము. మహేశునకు, మహాదేవునకు, హరునకుత్రి. నేత్రునకు, త్రివేదునకు వేదాంగునకు నమస్కారము. అర్ధునకు, , అర్థస్వరూపునకు, పరమార్థునకు నమస్కారము. విశ్వరూపునకు, విశ్వునకు, విశ్వనాధునకు నమస్కారము. శంకరునకు, కొలునకు, కాలావయవరూపికి, అరూపునకు, విరూపునకు, సూక్ష్మసూక్ష్మునకు నమస్కారము. శ్మనవాసికి, కృత్తివాసునకు, శశాంకశేఖరునకు, రుధ్రభూమిశ్రితునకు, దుర్గునకు, దుర్గపారునకు దుర్గావయవసాక్షికి, లింగరూపునకు లింగునకు, లింగపతికి నమస్కారము. ప్రభావరూపునకు, ప్రభావార్డునకు కారణకారణునకు, మృత్యుంజయునకు, ఆత్మభవస్వరూపికి, త్ర్యంబకునకు, శితికంఠనకు, భక్తునకు, గౌరీయుజునకు, మంగల హేతువునకు నమస్కారము. ఈ శతనామములు శంకరుని గుణములను కీర్తించుటయే. ఈనామశతమును పఠించి, ప్రదిక్షణము చేసి స్వగృహమున ఇహలోకమున సకల భోగములననుభవించి, అంతమున శివలోకమును చేరును.
మార్గశుక్ల త్రయోదశినాడు త్రికాలములలోకాని, ఏకకాలములోకానీ శివసంగమ సంభవుడగు మన్మధుని గంధాద్యుపచారములచే యధావిధిగా పూజించి బ్రాహ్మణ దంపతులను ఘటమునందు కాని, మంగల పట్టణమునందు కాని భుజింప చేయ వలయును. తరువాత దక్షిణ నిచ్చి తాను ఏకభుక్తము నాచరించవలయును. ఇట్లు యధావిధిగా వ్రతము నాచరించినచో మహాదేవాను గ్రహమువలన భూలోకమున సౌభాగ్య వంతునిగా పుట్టును. పుష్యశుక్ల త్రయోదశినాడు అచ్యుతడగు శ్రీహరిని చక్కగా పూజించి సర్వసిద్ధి కొరకు బ్రాహ్మణోత్తమునకు మృతపాత్రను దానము చేయవలయును. మాఘశుక్ల త్రయోదశినాడు ప్రారంభించి మూడు దినములు మాఘస్నానవ్రతము నానాకామఫలప్రదము. మాఘమాసమున ప్రయాగలలో మూడు దినములు స్నానమునాచరించు వానికి కలుగుఫలము అశ్వమేధసహస్రము వలన కూడా కలుగదు. ప్రయాగలో స్నానము, జపము, హోమము, దానము ఇవి అక్షయ ఫలప్రదములు. ఫాల్గుణ శుద్ధ త్రయోదశినాడుపవసించి జగన్నాధుని నమస్కరించి ధనదవ్రతమునాచరించవలయును. పట్టణమున వర్ణములచే లిఖించిన మహారాజగు యక్షపతిని భక్తిభావముతో గంధాద్యుపచారములచే పూజించవలయును. ఇట్లు ప్రతిమాసమున శుక్షత్రయోదశినాడు చక్కగా పూజించి ఏకభుక్తము నాచరించవలయును. వ్రతాంతమున సువర్ణధనపతిని నిర్మించి సువర్ణనిధులను కూర్చి. పంచామృత స్నానముమొదలగు షోడశోపచారములచే బహువిధనైవేద్యములచే భక్తితో పూజింపచవలయును. తరువాత గోవును వస్త్రగంధాలంకారముతో చక్కగా అలంకరించి, దూడతో వేదవిదునకు దానమును గావించవలయును. పన్నెండు మందిని కాని పదమూడు మందినికాని బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలనిచ్చి, గురువును వస్త్రాదులతో చక్కగా పూజించి, బ్రాహ్మణులను నమస్కరించి విడిచి తాను బంధువులతో సావధానుడై భుజింపవలయును. ఇట్లు వ్రతమునాచరించినవాడు ధనహీనుడైనను విభవమును పొంది మరో కుబేరునివలే భూలోకమున ఆనందించును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున ద్వాదశమాస స్థితత్రయోదశీవ్రత కధనమను నూటా ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.
