నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

64 - అధ్యాయము

సనత్కుమార మహార్షి పలికెను:- ఇపుడు జీవుని పొశబంధనచ్చేదనమును చేయు, ఇష్టసిద్ధిని కలిగించు, మంత్రసామర్థ్యదా యకమగు దీక్షావిధిని చెప్పెదను. దివ్యభావము నిచ్చునది. దురితములను క్షయింప చేయునది కావున సర్వాగమవిశారదులు దీక్ష యనుచున్నారు. మననమనగా సర్వార్ధ వేదిత్వము, త్రాణమునగా సంసారులను అనుగ్రహించుట. మననము చేయుట రక్షాధర్మము కలిగి యుండుట వలన మన్తమనబడుచున్నది. ఈ మంత్రములు స్త్రీపుంనపుంసకరూపములుగా మూడు విధములుండును. రెండు అకారములు అంతమందు గల మంత్రములు, స్త్రీ మంత్రములు. హుంఫట్ అనునది అంతమందు కలవి పుంమంత్రములు. నమః అను పదము అంతమందు కలవి క్లీబ మంత్రములు. పుందైవతములు మంత్రములని, స్త్రీ దైవతములు విద్యలని అనబడుచున్నవి. ఈ రెండు  షట్కర్మలలో ప్రశస్తములు. ఈ మంత్రములు మరల మూడు విధములు. లూణాంత్య రేఫలు గలవి. స్వాహాకారములు కలవి ఆగ్నేయములుగా చెప్పబడుచున్నవి. భృగు షీయూష బీజమంత్రములు సౌమ్యములనబడుచున్నవి. అనగా సోమదేవతాత్మక మంత్రములు. ఇట్లు మంత్రములు అగ్నిషోమాత్మ కములని పండితులు తెలియుదురు. వాయువు పింగళనాడిని ఆశ్రయించినపుడు ఆగ్నేయమంత్రములు జాగృతములగును. సోమదేవతాక మంత్రములు వాయువు వామ భాగనాడుల నాశ్రయించు నపుడు మేల్కొనును. వాయువు నాడిద్వయము నాశ్రయించినపుడు అన్ని మంత్రములు ప్రబుద్దములగును. మంత్రము నిద్రించియున్నపుడు జపించుట వలన అనర్థ ఫలమును కలిగించును. ప్రత్యేక మంత్రమును ఉచ్చరించీ సవ్యములనుచ్చరించవలయును. అనులోమమున బిందుయుక్తములనుగా, విలోమమున విసర్గయుక్తముగా జపించినచో ఆ మంత్రము ప్రబుద్దమై శీఘ్రసిద్దిప్రదమగును. ఇట్లు ఈ మాలచే జపించినచో దుష్టమంత్రము కూడా సిద్ధి నొసంగును. క్రూర కర్మలయందు అగ్ని మంత్రములను, సౌమ్యకర్మలయందు సోమమంత్రములను జపించవలయును. శాంతములు రౌద్రములు అని మంత్రములు రెండు విధములు. శాంతమంత్రమైనను, హుంఫట్ అను దానిని చేర్చినచో రౌద్రత్వమును పొందును. భిన్నాది దోషయుక్తములైన మంత్రములు సాధకుని రక్షించజాలవు. భిన్నము, రుద్దము, శక్తి హీనము, పరాఙ్ముఖము, కర్ణహీనము, నేత్రహీనము, కీలితము, స్తంభితము, దగ్ధము, ప్రస్తము, భీతము, మలినము, తిరస్కృతము, భేదితము, సుషుప్తము, మదోన్మత్తము, మూర్ఛితము, హతవీర్యము, భ్రాంతసంజ్ఞము, ప్రధ్వస్తము, బాలకము, కుమారము, యువా, ప్రౌఢము, వృద్దము, నిస్ప్రింశకము, నిర్భీజము, సిద్ది హీనము, మందము, కూటము, నిరంశకము, సత్తహీనము, కేకరము, బీజ హీనము, ధూమీతము, ఆలింగితము, మోహితము, క్షుధార్తము, అతిదీప్తకము, అంగహీనము, అతిక్రుద్ధము, అతిక్రూరము, బ్రీడితము, ప్రశాంతమానసము, స్థానభ్రష్టము, వికలము, అతివృష్టము, అతని స్నేహము, పీడితము అని ఇవి నలుబది తొమ్మిది దోషములు. ఇపుడు ఈ దోషముల లక్షణములను చెప్పెదను. సంయుక్తము కాని వియుక్తము కాని మూడు విధముల స్వరములచే సంయుతమైనది మంత్రము యొక్క ఆదిమధ్యాంతములలో వహ్ని బీజము చెప్పబడినచో, ఈ బీజము కూడా నాలుగు విధములుగా కాని అయిదు విధములుగా కాని చెప్పినచో ఆ మంత్రము భిన్నమనబడును. మంత్రము యొక్క ఆదిమధ్యాంతములలో రెండు భూబీజములు చెప్పబడినచో ఆ మంత్రము రుద్దమనబడును., అతికష్టముచే సిద్ది నొసంగును. తారవర్మ త్రయము, లక్ష్మి లేని మంత్రము శక్తి హీనమనబడును. చాలాకాలమునకు ఫలము నొసంగును. ముఖమున కామబీజము, అంతమున మాయ అంకుశమున్నచో పరాజ్ముఖమనబడును. ఈ మంత్రము భజించు వారికి చాలాకాలమునకు సిద్దినిచ్చును. ఆదిమధ్యాంతభాగములయందు సకారము కనపడినచో ఆ మంత్రము బధీరమనబడును. చాలా కష్టముచే అల్ప ఫలమును ఇచ్చును. అయిదక్షరములు కలిగి, రేఫార్క బిందువులు లేని విగ్రహము కలదైనచో నేత్రహీనమనబడును. కష్టపడినను సిద్ధి నొసంగదు. ఆదిమధ్యాంతములలో హంసము ప్రాసాదవాగ్భవములు, హు పేందువు కాని సకారము కాని, ఫకారము కాని ..వర్మకాని మాప్రా, నమామి అను పదములు లేని మంత్రము కేలితమనబడును. మధ్యభాగమున ద్వయము, మూర్ధస్థానమున అస్త్రలకారములు లేని మంత్రము స్తంభితమనబడును. సిద్దిని అరికట్టును. మంత్రము యొక్క మూర్ధభాగమున పవనసంయుక్తమగు అగ్ని వర్ణములుండి, సార్లముగా నున్నచో దగ్గమనబడును. అస్త్రము, రెండు మూడు, ఆరు, ఎనిమిది అక్షరములు కలదిగా యుండినచో ఆ మంత్రము త్రస్తమనబడును.ఈ మంత్రము యొక్క ముఖము తారవర్జితముగా నుండును. హకారము శక్తిగా యున్న మంత్రము భీతమనబడును. ఆదిమధ్యాంత భాగమున నాలుగు మకారములున్నచో మలినమనబడును. అతి క్లేశమున సిద్ది కలుగును. మంత్రమధ్యము దొర్ణముగా నుండి, మూర్ధభాగమున క్రోధయుగము, అస్త్రమున్నచో తిరస్కృతమనబడును. ద్వయము హృదయము, శీర్షమున, మధ్యభాగమున వషట్ ఔషట్లు కలది భేదితమనబడును. అతి క్లేశముచే ఫలము నిచ్చును కావున భేదితమును విడువవలయును. మూడక్షరములు కలిగి హంసహీనమైనది సుషుప్తమనబడును. విద్యకాని మంత్రము కాని పదిహేడక్షరములు కలదిగా నుండవలయును. షట్కారపంచకము ఆది యందు కలది మదోన్మత్త మనబడును. మధ్యభాగమున అస్త్రములో కల మంత్రము మూర్ఛితమనబడును. విరామస్థానమున అస్త్రమున్నచో హతవీర్యమనబడును. మంత్రము యొక్క ఆదిమధ్య భాగములలో మూర్ధభాగమున నాలుగస్త్రములుడి పదునెనిమిది అక్షరములు కల దానిని భ్రాంతమందురు. ఇరువది వర్ణములు కలిగి స్వరసంయుతమై హృత్ ల్లేఖ అంకుశ బీజాడ్యముగా ఉన్న చో దానిని ప్రధ్వస్త మందురు. ఏడక్షరములగలది బాలమంత్రము. ఎనిమిదీక్షరములు కలది  కుమార మంత్రము. పదునారక్షరములు కలది యువమంత్రము. నలుబది యక్షరములు కలది ప్రౌఢ మంత్రము. ముప్పది, అరువది నాలుగు, నూరు, నాలువందలు - అక్షరములు కల మంత్రము వృద్ద మంత్రము. తొమ్మిదక్షరములు కలిగి తార యుక్తమైనచో నిస్త్రింశమనబడును. అంతమున హృదయము, మధ్యన శిరోమంత్రము, అంతమున శిఖా, వర్మము, నేత్రము, అస్త్రము కలిగి, శివశక్తి కాని అర్థము కాని లేని మంత్రము నిర్చీజమనబడును. ఆద్యంతమధ్య భాగములలో ఫట్కారము ఆరువిధములుగా కనపడినచో సిద్ది హీనమనబడును. పంక్త్యక్షరములు కలమంత్రము మందమనబడును. ఏకాక్షరమంత్రము కూటమనబడును. దానినే నిరంశకమందురు. రెండక్షరములు కలది సత్తహీనమనబడునను. నాలుగక్షరములు కలది కేకరము. ఆరక్షరములు కలది బీజ హీనము. ఏడున్నర అక్షరములు కలది కూడా బీజ హీనమే. పన్నెండున్నర అక్షరములు కలది ధూమిత మనబడును. ఇది అతినిందితము. మూడున్నర బీజములు కలిగి ఇరువది, ఇరువది యొకటి, ముప్పది వర్ణములు కల మంత్రము ఆలింగీత మనబడును. దంత వర్ణములు కల మంత్రము మోహితమనబడును. ఇరువది నాలుగు, ఇరువది యేడు వర్ణములు కల మంత్రము క్షుధార్త మనబడును. ఈ మంత్రము సిద్ధికారకము కాదు. పదకొండు, ఇరువదియైదు, ఇరువది మూడు వర్ణములు కల మంత్రము దృప్తమనబడును. ఇరువది యారు అక్షరములు కలది కాని ముప్పదియారు వర్ణములు కలదీకాని, ఇరువది తొమ్మిది వర్ణములుగల మంత్రము హీనోంగకమనబడును. ఇరువది యెనిమిది, ముప్పది యొకటి వర్ణములు కల మంత్రము అతి క్రూరమనబడును. అన్ని కర్మలలో నిందీతము. నలుబది నుండి ఆరువది మూడు వర్ణములు గల మంత్రము వీడితమనబడును. ఈ మంత్రము అన్నీ కర్మలలోను ఉపయుక్తము కాదు. అరువది యెదకరములు కల మంత్రములు శాంత మానసములనబడును. అరువదియైదు నుండి తొంబది తొమ్మిది అక్షరముల వరకు గల మంత్రములు, వికలములనబడును. నూరు, నూట యాబది, రెండు నూర్లు, తొంబది రెండు, తొంబది యొకటి, మూడు నూర్లు వర్ణములు గల మంత్రములు నీస్స్నేహములనబడును. నాలుగు నూర్ల నుండి వేయి వర్ణముల వరకు గల మంత్రములు. అతివృద్ధములనబడును. ఈ మంత్రములు ప్రయోగదశయందు శిథిలములగునని చెప్పబడినది. వేయి కంటే ఎక్కువ వర్ణములు గల మంత్రములు పీడితములనబడును. ఇంకా అధిక వర్ణములు గల మంత్రములు స్తోత్రరూపములు. ఇట్లు మంత్రములు దోషయుక్తములని చెప్పబడినవి. ఈ దోషములను తెలియక మంత్రములను జపించువారలు కల్పకోటి శతములలో కూడ సిద్ధిని పొందజాలరు. భిన్నాదిదోషములు గల మంత్రములను సాధించు విధానమును చెప్పెదను.

యోనిముద్రాసనమున కూర్చోని సావధానమనస్కుడై యే మంత్రమును జపించిననూ అన్ని సిద్ధులు కలుగును. ఎడమమడిమను గుదమున ఉంచి, కుడి మడిమను ధ్వజము పై యుంచి కూర్చొనుట యోనిముద్రాబంధమనబడును. ఇది ఉత్తమాసనము. ఈ యోనిముద్రాబంధమున మరియొక విధానము కూడా కలదు. ఆ విషయమును రహస్యములతో ముందు చెప్పగలను. పొరంపర్యక్రమముగా పొందినవాడు, నిత్యానుష్టానతత్పరుడు, గుర్వనుజ్ఞను పొందినవాడు, సంపద్యుక్షుడు,  అభిషేకము చేయువాడు, సుందరుడు, సుముఖుడు, శాంతుడు, సత్కులజుడు, సులభుడు, ఇంద్రియనిగ్రహము కలవాడు, మంత్రతంత్రార్థ తత్త్వములు తెలిసినవాడు, నిగ్రహానుగ్రహసమర్దుడు ఆశలేనివాడు, ముని, అంతరింద్రియ నిగ్రహము కలవాడు, హితమును పలుకువాడు, వివేకము కలవాడు, తత్త్వమును తేల్చి చెప్పుటలో సమర్థుడు, వినయముగలవాడు, సజ్జనులను సేవించువాడు, ఆశ్రమవాసి, ధ్యాననిరతుడు, సంశయములను ఛేదించగలవాడు, మంచి బుద్ధికలవాడు, నిత్యానుష్టానము కలవాడు, ఆచార్యుడుగా చెప్పబడెను. శాంతుడు, వినయము కలవాడు, పరిశుద్ధాత్ముడు, సర్వలక్షణసంయుతుడు, శమాదిసాధనములు గలవాడు, శ్రద్దకలవాడు, స్థిరమైన సంకల్పము కలవాడు, శుద్ధమైన దేహము కలవాడు, శుద్ధమైన అన్నపానములు కలవాడు, ధార్మికుడు, పరిశుద్ధమనస్కుడు, ధృడవ్రతము. గలవాడు, కృతజ్ఞుడు పాపభీతి కలవాడు, గురుధ్యానమునందు, స్తోత్రమునందు కథా సేవనమునందు ఆసక్తి కలవాడు శిష్యుడు కావలయును. అట్లు కానివాడు గురువునకు దుఃఖమును కలిగించువాడగును.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వ భాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున అరువది నాలుగ - అధ్యాయము ముగిసినది.