నారద మహా పురాణము - పూర్వార్థము
10 - గంగోత్పత్తౌ బలికృతదేవపరాజయః
నారదమహర్షి పలికెను :- విష్ణుపాదాగ్రమునుండి పుట్టి, గంగ అని చెప్పుబడుచున్న పుణ్యతీర్థముయొక్క ఉత్పత్తిని మీద అనుగ్రహముంచి తెలుపుము.
సనకమహర్షి పలికెను :- “ఓ పాపరహితుడా! నారదా! చెప్పువారలకు వినువారలకు పాపములను నశింపచేసి పుణ్యము నిచ్చు గంగోత్పత్తిని నీకు చెప్పెదను. వినుము. ఇంద్రాదిదేవతలకు తండ్రి కశ్యపమహర్షి ఉండెను. కశ్యపమహర్షికి ఆదితి దితియను దక్షప్రజాపతి పుత్రికలు భార్యలుగా నుండిరి. దేవతల తల్లి అదితి. దైత్యుల తల్లి దితి. అదితి దితి పుత్రులైన దేవదైత్యులు ఒకరినొకరు జయింపవలేనని ఎల్లప్పుడు భావించుచుండిరి. అందువల్లనే దైత్యులకు పూర్వదేవులు అని పేరు. దైత్యులలో మొదటివాడు దితి పుత్రుడు బలవంతుడగు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుని పుత్రుడు మహానుభావుడైన ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుడు. బ్రాహ్మణ భక్తి గలవాడు. విరోచనుని పుత్రుడు బలి మిక్కిలి తేజోవంతుడు, ప్రతాపవంతుడు. దైత్యులకు సేనానాయకుడై బలి వారికి సంతోష జనకుడు ఆయెను. గొప్ప సైన్యముతో భూమండలమునంతటిని గెలిచి రాజ్యము ననుభవించుచుండెను. స్వర్గమును జయించవలయునని సంకల్పించెను.”
బలి చక్రవర్తి సైన్యము చాలా శ్రేష్టమైనది. పదివేల కోట్ల లక్షల యేనుగులు. అన్నియే రథములు. అన్నియే అశ్వములు. ప్రతియేనుగు వెంట అయిదువందల పదాతి సైన్యము కలిగియుండెను. ఆ సైన్యమును గూర్చి ఏమీ వర్ణించగలము. బలి చక్రవర్తి మంత్రులలో అగ్రేసరులు కుంభాండుడు, కూపకర్ణుడను వారలు. బలిచక్రవర్తి నూరుగురు పుత్రులలో పెద్దవాడైన బాణాసురుడు తండ్రితో సమానమైన బలపరాక్రమములు గలవాడు. దేవతలను జయించవలయునని సంకల్పించి గొప్ప సైన్యముతో బయలుదేరెను. ధ్వజములతో, ఛత్రములతో ఆకాశమున మేలుపులను, సముద్రమున, ఆలలను స్మరింపజేయుచు సైన్యము సాగెను. దేవేన్ద నగరమును చేరి సింహపరాక్రములైన రాక్షసులతో అమరావతిని ముట్టడించేను. వజ్రకరుడు మొదలగు దేవతలు కూడా గొప్ప సైన్యముతో నగరమునుండి బయలువెడలిరి. అపుడు దేవదానవులకు ప్రళయకాలమేఘములవలె ధ్వనించుచు యుద్ధభేరీ ధ్వనులతో ఆకులముగా భయంకరమైన యుద్దము. మొదలాయెను. రాక్షసులు దేవతా సైన్యము పై శరజాలములను విడిచిరి. దేవతలు కూడా భయంకరమైన యుద్ధములో దైత్యుల పై బాణవర్షమును కురిపించిరి. గెలువుము, చీల్చుము, భేదించుము, ఛేదించుము, చంపుము కొట్టుము అని పెద్దగా అరచుచున్న సైన్యము ధ్వని వినిపించుచుండెను. శరముల ధ్వనులు, దుందుభిధ్వనులు, దైత్యుల సింహనాదములు, రథముల భాంకారములు, బాణముల కేంకారములు, అశ్వముల సకీలింపులు. ఏనుగుల ఘీంకారములు, ధనుష్టంకారములు నిండి లోకమంతయూ శబ్దమయమాయెను. దేవదానవులు వదిలిన బాణముల రాపిడి వలన పుట్టిన జ్వాలలను చూచిన ప్రపంచమంతయూ అకొలప్రళయము సంభవించినదని తలచేను.
ప్రకాశించు ఆయుధములను ధరించిన రాక్షస సైన్యము చంచలములైన మెరుపులతో ప్రకాశించుచు మేఘములతో కప్పబడిన రాత్రివలె శోభించెను. మహాఘోరమైన ఆ యుద్ధములో రాక్షసులు ప్రయోగించిన పర్వతములను శీఘ్రవిక్రములైన దేవతలు బాణములచే చూర్ణము చేసిరి. మరికొందరు ఏనుగులతో ఏనుగులను, రథములతో రథములను, అశ్వములతో అశ్వములను, గదలతో మరికొందరిను కొట్టుచుండిరి. పరీఘలతో కొట్టబడిన కొందరు నెత్తుటి బురదలో పడిరి. ప్రాణములను కోల్పోయిన కొందరు విమానములనాశ్రయించిరి. యుద్ధమున దేవతలచే చంపబడిన రాక్షసులు దేవత్వమును పొంది రాక్షసులతో యుద్ధమునకు తలపడిరి. అతి భయంకరులైన రాక్షసులు దేవతలచే కొట్టబడి మిక్కిలి కోపించినవారై పలువిధములైన శస్త్రములతో దేవతలను కొట్టిరి. రాళ్ళతో, భిందిపొలములతో, ఖడ్గములతో, గొడ్డళ్ళతో, తోమరములతో, పరిఘలతో, చిన్నకత్తులతో, కుంతములతో, చక్రములతో, శంఖులతో, రోకళ్ళతో, అంకుశములతో, నాగళ్ళతో, పట్టిశములతో, శక్తులతో గులకరాళ్ళతో, శతఘ్నులతో, పాశములతో, అరచేతులతో, పిడికిళ్ళతో, శూలములతో, బాణములతో, ముద్గరములతో గూడిన క్షిపణులతో, రథములతో, అశ్వములతో, ఏనుగులతో, పదాతులతో సంకులమై యుద్దము వృద్ధిపొందెను. దేవతలు కూడా పలు విధములైన అస్త్రములను రాక్షసులపై ప్రయోగించిరి. ఇట్లు ఎనిమిది వేల సంవత్సరములు భయంకరమైన యుద్ధము సాగెను.
తరువాత రాక్షస బలము వృద్ధిచెందగా పరాజయము పాలైన దేవతలు స్వర్గమును విడిచి పెట్టి అందరూ భయముతో పారిపోయిరి. మానవరూపముతో రహస్యముగా భూలోకమున తిరుగుచుండిరి. విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి నారాయణుని యందు భక్తి కలవాడై మూడు లోకములను తిరుగులేని ఐశ్వర్యముచే పెరిగిన కాంతి, బలము కలవాడై అనుభవించసాగెను. శ్రీమహావిష్ణువును సంతోషింపచేయుటకు అశ్వమేధయాగములచే పూజించెను. స్వర్గమున ఇంద్రత్వమును దిక్పాలత్వమును కూడా నిర్వహించెను. దేవతల ప్రీతి కొఱకు బ్రాహ్మణులు చేయు యాగములలో అన్నిటిలో దైత్యరాజైన బలిచక్రవర్తియే హవిస్సులను భుజించుచుండెను. దేవమాతయగు అదితి తన పుత్రుల దురవస్థను చూచి మిక్కిలి దుఃఖించినదై నేనిచట వ్యర్థముగా నివసించుచున్నోనని తలచి హిమవత్పర్వతమునకు వెళ్ళెను. ఇంద్రునికి ఐశ్వర్యమును, దైత్యులకు పరాజయమును కోరుచు హరిని ధ్యానించుచు మీక్కిలి కష్టసాధ్యమైన తపస్సును చేయనారభించెను. కొంతకాలము కూర్చొని, మరికొంతకాలము నిలబడి, కొంతకొలము ఒక కొలు మీద నిలబడి, మరికొంతకాలము కాలు కొనమీద నిలబడి, కొంతకాలము పండ్లను భుజించుచు, తరువాత ఎండుటాకులను భుజించుచు, తరువాత నీరు మాత్రమే తీసుకొని, తరువాత గాలిని భుజించుచు, ఆ తరువాతో నిరాహారముగా మనసుతో సచ్చిదోనన్ల స్వరూపుడైన శ్రీమన్నారాయణుని ధ్యానము చేయుచుండెను. ఇట్లు అదితి వేయి దివ్యవత్సరములు తపస్సును చేసెను. అంతులేని ఆమె తపస్సును విని మాయావులైన దీతీపుత్రులు బలిచక్రవర్తి చే పంపబడి దేవతారూపముతో అదితి వద్దకువచ్చి ఇట్లు పలికిరి. “ఓ తల్లీ ! శరీరమును శషింపచేయు తపస్సునేందుకు చేయుచున్నావు ? దితిపుత్రులకు తెలిసినచో చాలా కష్టములు వచ్చును. శరీరమును శుష్కింపచేయు, పలు దుఃఖములను కలిగించు ఈ తపస్సును వదిలి పెట్టుము. శ్రమ వలన కలిగేడు పుణ్యమును పండితులు అభినందించరు. ధర్మమును సాధించుటయందు ఆసక్తి కలవారు శరీరమును ప్రయత్నముతో కాపాడుకొనవలయును. శరీరమును పేక్షించి వారు ఆత్మ ఘాతకులవుదురు. కావున నీవు ఆనందముగో నుండుము. పుత్రులమగు మమ్ములను బాధించకుము. ఓ తల్లీ ! తల్లిలేని వారు చచ్చినవారితో సమానులు. ఆవులు, పశువులు, వృక్షములు మాత్సహీనములై చనిపోయినవాటీవలే ఆనందమును పొందజాలవు. దరిద్రుడైనను, రోగియైనను, దేశాంతరమునకు వెళ్ళిన వాడైనను తల్లిని చూచినంతనే పరమానందమును పొందును. అన్నమును, నీటిని, ధనాదులను ప్రియులను కూడా ఎప్పుడో ఒకపుడు విముఖుడై వదులునుగాని తల్లిని విడుచువాడెవడును ఉండడు. తల్లి, ధర్మపరాయణులైన పతివ్రతయగు స్త్రీ ఎవరింటనుండదో వాడు అడవికే వెళ్ళవలయును. తల్లిలేని మానవుడు నారాయణ భక్తి లేని ధర్మము వంటివాడు. సదోగములేని ధనము, భార్యాపుత్రులులేని ఇల్లు వంటివాడు. కావున దుఃఖముతో ఆర్తులైన నీ పుత్రులను కాపాడుము.” ఇట్లు రాక్షసులు పలుకుచున్ననూ అదితి సమాధినుండి చలించలేదు.
ఇట్లు పలికిన, దేవరూపములో ఉన్న, రాక్షసులు హరినే ధ్యానించుచు చలించకయున్న అదితిని చూచి కోపముతో చంపుటకు సంకల్పించిరి. ప్రళయకాలమునందలి మేఘముల వలె కోపముతో ఎఱ్ఱబారిన కన్నలు గలవారై కోరలనుండి అగ్నిని సృజించిరి. ఆ వహ్ని అరణ్యమునంతటిని కాల్చివేసెను. అనేక ప్రాణులతో ఆకులముగానున్న నూరుయోజనములు విస్తీర్ణముగల ఆ వనమును దహించిన అగ్నియే, అదితిని హింసించదలచిన దైత్యులను కూడా దహించివేసెను. రాక్షసులను సంహరించునది, భక్తులను అనుగ్రహించునది యగు శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనచక్రముచే కాపాడబడిన అదితి వేల సంవత్సరముల నుండి శ్రీమహావిష్ణువును ధ్యానించుచున్నదే మిగిలియుండెను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వ భాగమున ప్రథమపాదమున గంగోత్పత్తిలో బలికృత దేవపరాజయవర్ణనమను పదియవ అధ్యాయము సమాప్తము.
