నారద మహా పురాణము - పూర్వార్థము
39 - విష్ణుమాహాత్మ్యమ్
సనకమహర్షి పలికెను :- ఓ బ్రహ్మణోత్తమా ! మానవులకు భుక్తిని ముక్తిని ప్రసాదించునది, సర్వపాపహరము అయిన శ్రీమహావిష్ణువు మాహాత్మ్యమును ఇంకను వినుము. ఈ లోకమున హరికథ వినువారికి చదువు వారికి పాపములను నశింపచేయును. పుణ్యమును ప్రసాదించును. హరిభక్తులకు విశేషఫలము నిచ్చును. హరిభక్తి రసాస్వాదముచే ఆనందించు నరులకు నేను నమస్కరించెదను. వారితో కలిసి యున్నవారికి కూడా మోక్షము లభించును. హరిభక్తి పరులు, హరినామ పరాయణులు దుర్జనులైనను, సుజనులైనను వారికి నిత్యము నమస్కారము. సంసార సాగరమును తరించగోరువారు హరిభక్త భక్తులను సేవించవలయును. గోవిందుని దర్శించినను, స్మరించిననూ, పూజించిననూ, ధ్యానించినను, నమస్కరించిననూ దాటరాని సంసారసాగరమును దాటగలరు. నిదురించుచు, భుజించుచు, నడచుచు, నిలిచి, కూర్చొని, మాటలాడుచు హరినామమును చింతించువారికి నిత్యము నా నమస్కారములు. విష్ణు భక్తియందు ఆసక్తి కలవారి భాగ్యమే భాగ్యము. యోగులకు కూడా దుర్లభమగు ముక్తి వారికి కరస్థమై యుండును. ఈ విషయమున చెప్పువారికీ వినువారికి సర్వపాపప్రణాశకమగు ఈ ఇతిహాసమును చెప్పెదరు.
పూర్వకాలమున సోమవంశమున పుట్టిన జయధ్వజుడను మహారాజు నారాయణపరాయణుడుండెను. జయధ్వజు మహారాజు ప్రతినిత్యము విష్ణ్వాలయమున సమ్మర్జనము చేయుచుండెడివాడు. దీపారాధన చేయువాడు. విశేషించివారికి ప్రీతిపాత్రుడుగా నుండెను. సర్వప్రాణులయందు దయచూపువాడు. ఆ మహారాజు ఒకప్పుడు సుందరమైన రేవానదీ తీరమున పలువిధములైన పుష్పరాశులతో కూడిన విష్ణ్వాలయమును నిర్మించెను. ఆ ఆలయమున నిత్యము సమ్మారనము చేయుచు దీపదానపరుడుగా నుండెను. నిత్యము హరినామపరుడు హరిసంసక్తమానసుడు హరిప్రణామనిరతుడు హరిభక్తజనప్రియుడుగా నుండెను. జయధ్వజమహారాజునకు వీతిహోత్రుడను పురోహితుడుండెను. వీతిహోత్రుడు జయధ్వజుని చరితమును చూచి ఆశ్చర్యమును పొందెను. ఒకప్పుడు విష్ణుతత్పరుడగు . జయధ్వజుడు కూర్చొని యుండగా వేదవేదాంగపారగుడగు వీతిహోత్రుడు ఇట్లడిగెను.
వీతిహోత్రుడు పలికెను :- పరమ ధర్మములను తెలిసిన మహారాజా ! హరిభక్తి పరాయణా ! భరతవంశ శేషా ! హరిభక్తి కలవారిలో ఉత్తముడా ! ప్రతిదినము విష్ణుమందిరమున సమ్మారనమును చేయుచున్నావు. దీపదానమును చేయుచున్నావు. ఓ మహానుభావా ! ఇట్లు చేయుటకు నీకు తెలిసిన ఫలమేమిటో తెలుపుము. వత్తులను చేయుచు తైలమును మార్చి దీపదానము చేయుచు, సమ్మార్జనమును చేయుచుందువు. శ్రీ మహావిష్ణువునకు ప్రీతిని కలిగించు పనులు ఇతరములు చాలా కలవు కదా! అయిననూ నీవీ రెండు పనులనే ఎందుకు చేయుచున్నావు? అన్ని విధములుగా ఈ రెండు కార్యములు మహాపుణ్యతమములు అని నీకు తెలిసియే యుండును. నీకు నాయందు ప్రీతి కలదేని ఆ రహస్యమును నాకు తెలుపుము. ఇట్లు పలికిన పురోహితుని మాటలను విని జయధ్వజుడు చిరునవ్వుతో చేతులు జోడించి వినయావనతుడై ఇట్లు పలికెను.
జయధ్వజమహారాజు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా! నేను పూర్వజన్మమున ఆచరించిన దానిని పూర్వజన్మ జ్ఞానము కలదు కావున చెప్పుచున్నాను. వినువారలకాశ్చర్యమును గొలుపు ఆ వృత్తాంతమును వినుడు. పూర్వకాలమున కృతయుగమున స్వారోచిష మన్వంతరమున వేద వేదాంగపొరగుడగు రైవతుడను బ్రాహ్మణుడుండెను. యాగము చేయుటకు .. అయోగ్యులైన పొరిచే యాగమును చేయించెడివాడు. గ్రామయాజ్ఞికమును చేయుచుండెడివాడు. లోభిత్వము కలవాడు, కఠినుడు, అమ్మ కూడని వాటిని అమ్ము చుండెడివాడు. నిషిద్ధ కర్మముల నాచరించుటవలన బంధువులు వెలివేసిరి. దరిద్రుడై దుఃఖములో జీర్ణ శరీరము కలవాడై వ్యాధిగ్రస్తుడాయెను. ఆ రైవతుడు ధనమును సంపాదించుటకు పర్యటించుచు నర్మదాతీరమున శ్వాసరోధముతో (ఉబ్బసము వ్యాధిచే) మరణించేను. అతని భార్య బంధుమతి భర్త మరణించిన తరువాత, కామచారులుగా మారి బంధువులచే పరిత్యజించబడెను. ఆ బంధుమతియందు చండాలుని వలన నేను పుట్టితిని. నా పేరు దండ కేతువు. నేను కూడా నిత్యము మహాపాపములను చేయుటలో ఆసక్తి కలపొడినే బ్రాహ్మణులను ద్వేషించుచు, పరదారలను పరద్రవ్యములను అపహరించుచు, జంతువులను హింసించుచుంటిని. నేను చాలమంది బ్రాహ్మణులను చాలా గోవులను చంపితిని. వేలకొలది మృగములను పక్షులను వధించితిని. లేక్కలేనంత సువర్ణాది ద్రవ్యము నపహరించితిని. మద్యపానముతో మత్తుడనై: దారికాచి: దొంగతనమును చేయుచుంటిని. ఒకప్పుడు కామార్హుడనై రత్యరినై యువతిని వెంటతీసుకొని నగరమున శూన్యముగానున్న విష్ణుమందిరమును చూచి లోనికి ప్రవేశించితిని. రాత్రిపూట కామోపభోగము కొఱకు ఆ రాత్రి అక్కడ శయనించదలచి నా మీది వస్త్రముతో దేవాలయ ప్రాంతమున ధూళిని దూరముగా ఊడ్పితిని. సంభోగము కొఱకు అచట దీపమును వెలిగించితిని. నా వ.సముతో ఎన్ని ధూళికణములను ఊడ్చితినో అన్ని జన్మల పాపములు నశించినవి. దీపము వెలిగించుటచే మిగిలిన పాపములు తొలగినవి. ఇంతలో నగరపాలకులు విష్ణుమందిరమునకు వచ్చిరి నన్ను జారునిగా ఆ యువతిని జారిణినిగా తెలిసి బలాత్కారముతో కొట్టి వధించిరి. తరువాత పురపాలకులు వెళ్ళిపోయిరి. మేము మరణించిన వెంటనే మా సమీపమునకు చతురుజులు, కిరీట కుండలధారులు, వనమాలావిభూషితులు అగు విష్ణుదూతలు విమానమును తీసుకొని వచ్చిరి. పావనులైన విష్ణుదూతలచే పంపబడిన విమానము నధిరోహించి, దివ్యదేహధారులమై విష్ణులోకమును చేరితిమి. ఓ బ్రాహ్మణోత్తమా ! విష్ణులోకమున నూరు బ్రహ్మకల్పములు నివసించితిని. తరువాత అంతకాలము సర్వభోగసమన్వితమైన స్వర్గమున నివసించితిమి. తరువాత భూలోకమున క్రమముగా భోగముల ననుభవించితిని. ఆ పుణ్యప్రభావముచే యదువంశమున పుట్టితిని. ఆ పుణ్యము వలననే, తరగని సంపద, కర్మవలననే ఇంతటిమేలు పొందితిని. భక్తి చే చేసిన వారి కెంత పుణ్యము కలుగునో నేను తెలియజాలను. కావున నాకు పూర్వజన్మ జ్ఞానముండుటచే ప్రతినిత్యము భక్తితో దేవాలయ సమ్మార్జనమును, దేవాలయమున దీపమును వెలిగించుటను చేయుచున్నాను. ఒంటిరిగా నిస్పృహడై జగన్నాథుని పూజించినచో సర్వపాపముల నుండి విముక్తుడై పరమ పదమును పొందును. నేను నా వంశములో లేకనే కామాసక్తుడనై చేసిన కర్మవలననే ఇంతటి భోగమును పొందితిని. ప్రశాంతులై భక్తి గలవారు చక్కగా పూజించినచో ఎంతపుణ్యము లభించునో చెప్పవలయునా ? ఇట్లు జయధ్వజ మహారాజు చెప్పిన మాటలను వినిన వీతిహోత్రుడు అఖండానందమును పొంది విష్ణుపూజాపరుడాయెను.
ఓ బ్రాహ్మణోత్తమా ! కావున అవ్యయుడైన శ్రీమన్నారాయణ దేవుని తెలిసి కాని తెలియక కాని పూజించినచో ముక్తినొసంగును. బంధువులు నిత్యులుకారు. సంపదలు శాశ్వతములుకావు. నిత్యము మృత్యువు సన్ని హిఔహతముగా నుండును. కావున ధర్మమును సంపాదించుకొనుము. అజ్ఞానముతో నున్న లోకము ఉద్దతులై గర్వమును ప్రసాదించును. ఎపుడూ అపాయము దగ్గరలోనుండునది శరీరము. ధనాదులు నశ్వరములని ఏమి చెప్పవలయును ? చేయి కోట్ల జన్మలచే సంపాదించిన పుణ్యము వలన దేవదేవుడగు జనార్ధనునియందు నిర్మలమగు భక్తి కలుగును. గంగాస్నానము అతిథి పూజ అన్ని యజ్ఞములు సులభములే. విష్ణుభక్తి మాత్రము దుర్లభము, తులసిని సేవించుట సత్సంగము దుర్లభము. సర్వభూతదయ ఏ ఒక్కరికో సులభము. సత్సంగము తులసీ సేవ హరిభక్తి దుర్లభములు. బహుదుర్లభమగు మానవత్వమును పొంది వ్యర్ధముగా కాలమును గడుపరాదు. జగన్నాథుని అర్చించుటయే మానవ జన్మకు సారము. తరింప శక్యము కాని సంసారమును తరించగోరువారు హరిభక్తి పరులుకావలయును. హరిభక్తియే దివ్యౌషథము. సోదరా ! గోవిందుని ఆశ్రయించుము. మిత్రమా ! ఆలసించకుము. యమనగరము సమీపములోనే కనపడుచున్నది. ముక్తిని అభిలషించినచో జగత్కారణుడు. సర్వధారుడు, సర్వకారణుడు, సర్వాంతర్యామి, సర్వజగన్నాథుడు అగు శ్రీమన్నారాయణుని శరణు కోరిన వారు కృతార్దులగుదురు. సంశయించపనిలేదు. ప్రణతుల ఆర్తిని నశింపచేయు శ్రీమహావిష్ణువును పూజించు మహానుభావులు నమస్కరించదగినవారు పూజించదగినవారు. విశేషించి వంద్యులు. నిష్కాములైన విష్ణుభక్తులు పరమాత్మను పూజించినవారు ఇరువది యొక్కటి తరముల వారితో కలసి హరి మందిరమును చేరెదరు. నిష్కాముడు మహాత్ముడు అగు విష్ణు భక్తునకు జలమును కాని ఫలమును కాని దానము చేసినవారు భగవతియులు. విష్ణుభక్తిపరులను సేవించువారు విష్ణులోకమును చేరి ప్రళయకాలము వరకు నివసింతురు. నిస్పృహులై హరిభక్తులను శ్రీహరిని సేవించినవారు తమ పాదరజముచే ఈ ప్రపంచమునే పావనము చేతురు. శ్రీహరిని పూజించువారు నివసించు గృహమున సర్వదేవతలు శ్రీహరి నివసించును. పూజించబడు తులసి యున్న గృహమున ప్రతిదినము శ్రేయః పరంవృద్ధి చెందును. శాలగ్రామ శిలారూపియగు శ్రీహరి నివసించు ప్రాంతమున భూతభేతాల గ్రహములు బాధించజాలవు. శాలగ్రామశిల నివసించు ప్రాంతము పుణ్యతీర్థము తపోవనము. భగవానుడు అచటనే నీవ సించును కదా ! శాలగ్రామశిలార్చనములేని గృహము శుభవర్జితమైన స్మశాన తుల్య మేయగును. వేదవేదాంగములు పురాణములు, న్యాయమీమాంసా ధర్మ శాస్త్రములు శ్రీమహావిష్ణు ప్రతిరూపములుగా తెలియుము. భక్తితో శ్రీమహావిష్ణువునకు నాలుగు ప్రదక్షిణములను చేయువారు సర్వకర్మ వినాశకమగు పరమపదమును పొందెదరు.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున విష్ణు మాహాత్మ్యమను ముప్పది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
