నారద మహా పురాణము - పూర్వార్థము
40 - విష్ణుమాహాత్మ్యమ్
సనక మహర్షి పలికెను :- ఓ మునీ! ఇపుడు శ్రీమహావిష్ణు వైభవమును చెప్పెదను. ఆ వైభవమును చెప్పువారికి వినువారికి అన్నిపాపములు నశించును. పూర్వము వైవస్వత మన్వన్తరమున ఇంద్రునకు బృహస్పతికి గొప్ప సంవాదము జరిగియున్నది. దానిని చెప్పెదను వినుము. ఒకానొకప్పుడు సర్వభోగసమన్వితుడు సర్వదేవ పరివతుడు, అప్సరోగణ సమేతుడగు ఇంద్రుడు బృహస్పతిని గూర్చి ఇట్లు పలికెను.
ఇంద్రుడు పలికెను :- మహానుభావా ! సర్వతత్త్వారకోవిదా ! బృహస్పతీ ! గడిచిన బ్రహ్మ కల్పమున సృష్టి ఎట్లుండెను ? ఇంద్రుడెట్టి- వాడుగానుండెను ? దేవతలెట్టివారు? ఎట్టిపనులను చేసియున్నారు ? దీనినంతటిని ఉన్నది ఉన్నట్టుగా తెలుపుము.
బృహస్పతి పలికెను :- పూర్వకల్పమున జరిగిన చరితము నాకు తెలియదు. ఇప్పుడు జరుగుచున్నది కూడా తెలియశక్యముకాదు. గడిచిన మనువుల గూర్చి కూడా చెప్పజాలను, నీవడిగిన విషయమునంతటిని తెలిసిన వానిని చేప్పెదను వినుము. నీ పురములోనే సుధర్ముడను పేరుగలవాడు సుప్రసిద్దుడున్నాడు. అతను బ్రహ్మలోకమునుండి ఇచటికి వచ్చి దివ్యభోగముల ననుభవించుచున్నాడు. ఆ సుధర్ముడు వీటినన్నిటిని తెలియును. బృహస్పతి ఇట్లు పలుకగా ఇంద్రుడు బృహస్పతితో దేవతాగణములతో కలిసి సుధర్ముని గృహమునకు వెళ్ళెను. బృహస్పతితో కలిసివచ్చిన ఇంద్రుని చూచి సుధర్ముడు తగిన విధముగా పూజించెను. ఇట్లు ఆదరముతో సుధర్ముడు చేసిన పూజను స్వీకరించిన ఇంద్రుడు సుధర్ముని వైభవమును చూచి విస్మయము నొంది వినయముతో నిట్లు పలికెను.
ఇంద్రుడు పలికెను - జరిగిన బ్రహ్మ కల్పవృతానమును తెలిసినచో చెప్పుము. ఈ విషయమును అడుగుటకే బృహస్పతితో కలిసి వచ్చితిని. గతించిన ఇంద్రునిదేవతలను ఎట్లు తెలియుదువు. ! స్వర్గములో నివసించియు మాకంటే అధికుడవే ప్లితివో చెప్పుము. తేజస్సుచే ఇతరసాధనములచే ఎట్లు ఇట్టివాడవైతివో తెలుపుము. ఇంద్రుడిట్లడుగా సుధర్ముడు నవ్వుచు వినయముతో పూర్వమున జరిగినదానిని యథావిధిగా వివరించెను.
సుధర్ముడు పలికెను :- నాలుగువేల యుగములు బ్రహ్మకు ఒకదినమని చెప్పబడినది. ఆ ఒక దినమును పదునాలుగు మంది మనువులు, పదునాలుగుమంది ఇంద్రులు ఉందురు. దేవతలు చాల విధములుగా నుందురు. ఇంద్రులు మనువులు తేజో బలప్రభావ సంపదలు సమముగా నుండును. చారి . పేర్లను చెప్పెదను. సావధానముగా వినుము. మొదటి మనువు స్వాయంభువ మనువు. తరువాత స్వారోచిషుడు. ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చొకుషుడు, వైవస్వత మనువు ఏడవవాడు. సుర్యసావర్ణి ఎనిమిదవవాడు. దక్షసావర్ణి తొమ్మిదవవాడు. బ్రహ్మసావర్ణి పదియవ మనువు. తరువాత ధర్మసావర్ణి. రుద్రసావర్ణి, రోచమాన్నుడు, పదునాలుగవాడు భౌత్యుడు. ఈ పదునలుగురు మనువులు. ఇక ఇపుడు దేవతలను ఇంద్రులను చెప్పెదను వినుము. స్వాయంభువ మన్వంతరమున యాములనువారు దేవతలు. వారికింద్రుడు శచీపతి. స్వారోచిషమన్వంతరమున పార్వతులు దేవతలు. వారికి సర్వసంపత్సమన్వితుడగు విపశ్చిత్తు ఇంద్రుడు. ఉత్తమ మన్వంతరమున సుధాములు సత్యులు శివులు ప్రతర్థనులు అనువారు దేవతలు. వారికింద్రుడు సుశాంతి. తామసమన్వన్తరమున సుతులు పారాహారులు సుత్యలు దేవతలు. వారికింద్రుడు శుభకరుడగు శకుడు, రైవతమన్వంతరమున ఆమిరాభాదులు దేవతలు, వారికింద్రుడు విభువు. ఆరవమన్వంతరమున ఆర్యాదులు దేవతలు. వారికింద్రుడు మనోజవుడు. చైవస్వత మన్వంతరమున ఆదిత్య వసురుద్రాదులు దేవతలు. సర్వకామసమన్వితుడగు పురందరుడు ఇంద్రుడు. సూర్యసావర్ణి మన్వంతరమున అప్రమేయులగు సుతపాదులు దేవతలు. విష్ణుపూజ ప్రభావముచే బలిచక్రవర్తి వారికి ఇంద్రుడు. దక్షసావర్ణి మన్వంతరమున పొరాదులు దేవతలు. అద్భుతుడు ఇంద్రుడు. బ్రహ్మసావర్ణిమన్వంతరమున సువాసనాదులు దేవతలు. సర్వభోగసమన్వితుడగు శాంతనామకుడు ఇంద్రుడు. రుద్రసావర్ణి మన్వంతరమున విహంగమాదులు ' దేవతలు. వృషుడు ఇంద్రుడు. ధర్మసావర్ణిమన్వంతరమున విహంగమాదులు దేవతలు. ఋభుడనువాడు ఇంద్రుడు. రోచమాన మన్వంతరమున సుత్రామాదులు దేవతలు. దివస్తుత ఇంద్రుడు. భౌత్యమన్వంతరమున చాక్టుషాదులు దేవతలు శుచి ఇంద్రుడు. ఇట్లు పదునాలుగు మంది మనువులను ఇంద్రులను చెప్పితిని. దేవతలను కూడా తెలిపితిని. వీరందరు బ్రహ్మయొక్క ఒకదినమున తమ అధికారమును అనుభవింతురు. లోకములో అన్ని సృష్టులలో సృష్టి ఒకే విధముగా నుండును. సృష్టికర్తలు చాలమంది యుందురు. వారి సంఖ్యను జ్ఞానులు మాత్రమే తెలియుదురు. నేను బ్రాహ్మలోకమున నుండగా చాలామంది బ్రహ్మలు గతించిరి. వారిని ఇప్పుడు లెక్కించజాలను. స్వర్గలోకమునుకు వచ్చిన తరువాత నలువురు మనవులు గతించిరి. నా సంపద అతి విస్తరము. ఇంకను నేనిచట నూరు కోట్ల యుగములుండవలయును. అపుడు మరల కర్మభూమికి వెళ్ళేదను. నేను పూర్వము చేసిన సుకృతమును చెప్పెదను వినుము. చెప్పువారికి వినువారికి సర్వపాపములు తొలగును.
ఓ ఇంద్రా ! నేను పూర్వము విశేషించి పాపాత్మకమగు గద్దనై యుంటిని. అపవిత్రమైన ఆయోగ్యమగు మాంసమును భుజించుచు భూమి పై సంచరించుచుంటిని. ఒకపుడు నేను విష్ణమందిర ప్రాకారమున నిలచియుంటిని. అంతలో వేటగాడు బాణముచే కొట్టగా మందిర ప్రాంగణమున పడితిని. నేను కొన ఊపిరితో నుండగా మాంసము పై ఆశగల శునకము తన నోటితో కరచుకొని మరికొన్ని శునకములు వెంటరాగా పరుగెత్తనది. ఇతర శునకముల భయముతో ఆ శునకము నన్ను నోటితో పట్టుకొని మందిరము చుట్టు ప్రదక్షిణ పద్దతిలో తరిగేను జగన్మయుడు అంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు ఆ మాత్రమునకే సంతోషించి నాకు ఆ శునకమునకు పరమ పదమునిచ్చెను. ఆ సంకల్పితముగా ప్రదక్షిణారూపమున తిరిగిన దానికే ఇంత ఫలమున్నచో చక్కగా అర్చించినచో ఇకనేమి చెప్పవలయును ? ఇట్లు సుధర్ముడు చెప్పగా వినిన ఇంద్రుడు సంతోషించి హరిపూజాపరుడాయెను. అందువలనననే దేవతలందరు భారతభూమిలో జన్మించగోరి ఆనామయుడగు నారాయణుని పూజింతురు. నారాయణ పూజాపరులను బ్రహ్మాది దేవతలు పూజింతురు. దొనమును గ్రహించని వారు మహానుభావులు నారాయణస్మరణ చేయువారికి సంసారబంధ మెట్లు కలుగును. వారి సంగతిని కోరువారు కూడా ముక్తిని పొందెదరు. ముక్తసంగులైగరుడవాహనుడగు నారాయణుని ప్రతిదినము ఆర్చించువారు సర్వపాప వినిర్ముక్తులై పరమపదమును పొందెదరు. రాగమును పరనిందను పరిత్యజించి శ్రీమన్నారాయణుని ఆర్చించువారు పునర్జన్మను పొందరు. హరికథాశ్రవణముచే పాపములను తొలగించుకొని కృష్ణపాదపద్మములను పూజించుటయందు ఆసక్తి గలవారు జగత్తును పాపనము చేతురు. వారి స్పర్శతో సంభాషణతో పావనములగుదురు. కావున శ్రీహరిని పూజించవలయును. నిర్మలబుద్దులు మహానుభావులు అగు హరిపూజాపరాయణులుండుచోటనే పల్లప్రాంతమున నీరుండునట్లు అన్ని శుభములుండును. శ్రీహరియే ఉత్తమ బంధువు. శ్రీహరియే ఉత్తమగతి. చైతన్యకారణమగు శ్రీహరియే పూజ్యుడు. స్వర్గపవర్గఫలములనిచ్చు సదానందస్వరూపుడు, నిరామయుడు అగు నారాయణుని పూజించుము. ఉత్తమశ్రేయస్సు లభించును. నిష్కాములై శుద్ధమానసులై శ్రీహరిని పూజించినవారికి శ్రీహరి ప్రసన్నుడై అన్ని కోరికలను తీర్చును. ఈ వృత్తానమును వినినవారు చదివినవారు అశ్వమేధయాగఫలమును పొందెదరు. ఓ మునీంద్రా ! ఇట్లు నీకు సంగ్రహముగా విస్తరముగా హరిపూజాఫలమును చెప్పితిని. ఇంకనేమి చెప్పమందువో తెలుపుము.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున విష్ణుమాహాత్మ్యమను నలుబదియవ అధ్యాయము సమాప్తము.
