నారద మహా పురాణము - పూర్వార్థము
24 - సదాచారః
ఏతన్నిశమ్య సనకోదితమప్రమేయం పుణ్యం హరేర్దినభవం నిఖిలోత్తమం చ, పాపౌఘశాంతికరణం వ్రతసారమేవం బ్రహ్మత్మజః పునరభాషత హర్షయుక్తః.
సూతమహర్షి పలికెను :- ఇట్లు సనకమహర్షి చెప్పగా పవిత్రము, ఇంత అని తులతూచలేనిది, అన్నిటిలో ఉత్తమము, పాపరాశి ప్రశమనము, సర్వవ్రతసారము అయిన ఏకాదశవ్రతమును విని నారద మహర్షి మరల ఇట్లు పలికెను.
నారదమహర్షి పలికెను :- తత్త్వార్ధకోవిదుడైన ఓ మహర్షీ ! హరిభక్తిని ప్రసాదించునది, పరమ పవిత్రమైనది యుగు ఏకాదశవ్రతమును చెప్పితీరి. ఇపుడు వర్ణాశ్రమాచారవీధిని ప్రాయశ్చిత్త విధిని వినగోరుచున్నాను. సర్వతత్తార్ధములు తెలిసిన మహానుభావుడవు కావున నా మీద దయతలచి దీనినంతటిని యథావిధిగా వివరించుడు.
సనకమహర్షి పలికెను : ఓ మునిశ్రేష్టా ! భక్తులకు ప్రియమును కలిగించు శ్రీమహావిష్ణువు వర్ణాశ్రమాచరా పరులచే ఎట్లు పూజించబడునో వినుము. నీవు శ్రీమన్నారాయణునికి భక్తుడవు కావున మనువు మొదలగు వారు చెప్పిన వర్ణాశ్రమ ధర్మములను యథావిధిగా చెప్పెదను. బ్రాహణక్షత్రియవైశ్యశూద్ర అనునవి నాలుగు వర్ణములు సుప్రసిద్ధములు. ఈ నలుగురిలో బ్రాహ్మణులు అధికులు. ఈ నలుగురిలో బ్రాహ్మణు క్షత్రియ వైశ్యులు ద్విజులనబడుదురు. మొదట జన్మ తల్లివలన రెండవ జన్మ ఉపనయమము వలన కలుగును. ఈ వర్ణములవారు తమ వర్ణాను గుణముగా సర్వధర్మములనాచరించవలయును. స్వవర్ణ ధర్మత్యాగము చేసినవారు పాషండులనబడుదురు. తమతమ గృహ్య కల్పములలో చెప్పిన విధముగా నాచరించు బ్రాహ్మణులు కృతార్దులగుదురు. అట్లా చరించనివాడు అన్ని ధర్మములనుండి బహిష్కరించబడి పతితుడగును. ఈ నాలుగు వర్ణములవారు యథోచితముగా యుగధర్మమును స్వీకరించవలయును. స్మృతిధర్మముకు విరోధము రాని దేశాచారమును స్వీకరించవలయును. వాజ్మనః కర్మలచే ప్రయత్నపూర్వకముగా ధర్మము నాచరించవలయును లోకముచే ద్వేషించబడునది అస్వర్గ్యమైనది ధర్మమైన ఆచరించరాదు. సముద్రయాత్ర, కమండలమును ధరించుట, బ్రాహ్మణులు అసవర్ణలగు కన్యలను వివాహమాడుట, భర్త తమ్ముని వలన సంతానోత్పత్తి, మధుపర్కమునందు పశువధ, శ్రాద్దమున మాంసభక్షణము, వానప్రస్థాశ్రమము, అక్షతయోనియైన (అనగా వివాహమైనను భర్తృసమాగముచేయకనే భర్త మరణించిన కన్యను) కన్యను మరల మరియొక వరునికిచ్చి వివాహము చేయుట, నైషిక బ్రహ్మ చర్యము, నరమేధాశ్వమేధ గోమేధ యాగములు, మహాప్రస్థానము. ఈ ధర్మములను కలియుగమున ఆచరించరాదని జ్ఞానులు చెప్పియున్నారు.
ఆయా దేశవాసులు ఆయా దేశాచారములను స్వీకరించవలయును. అట్లు కానిచో సర్వధర్మ బహిష్కృతుడై పతితుడగును. బ్రాహ్మణ క్షత్రియవైశ్య శూద్రులకు సామాన్య కర్మలను చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుము. బ్రాహ్మణులకు దానమును చేయవలయును. యజ్ఞములచే దేవతలను పూజించవలయును. జీవనము కొరకు యాచన చేయవలయును. ఇతరులకు అధ్యాపనము చేయవలయును. యోగ్యులచే యాగములను చేయించవలయును. బ్రాహ్మణుడు సర్వదా జలసంబంధము కలిగియుండవలయును. వేదమును అగ్నిని స్వీకరించవలయును. తాను పరిగ్రహించదగిన ధనమునందు, ఇతరులు గ్రహించదగిన ధనమునందు సమబుద్దిని చూపవలయును. సర్వలోక హితమును చేయుచు మృదువాక్యముల నుపయోగించవలయును. బ్రాహ్మణుడు ఋతుకాలమున భార్యాగమనము చేయవలయును. ఎవరితోనూ అహితమును మాట్లాడరాదు. విష్ణుపూజాపరుడు కావలయును. క్షత్రియుడు కూడా బ్రాహ్మణులకు దానమును చేయవలయును. వేదములను ఆధ్యయనము చేయవలయును. యజ్ఞములతో దేవతలను పూజించవలయును. శస్త్రజీవిగా నుండవలయును. ధర్మ బద్దముగా రాజ్యపాలన చేయవలయును. దుష్టశిక్షణ శిష్టరక్షణ గావించవలయును. పశుపొలన, వాణిజ్యము వ్యవసాయము వేదాధ్యయనము వైశ్య కర్మలు. వివాహము చేసికొని క్రయవిక్రయమువలన శిల్పాది కర్మలవలన వచ్చిన ధనముతో ధర్మాచరణమును చేయవలయును. శూద్రులు దానము చేయవలయును. శూద్రులు పాక యజ్ఞమును చేయరాదు. బ్రాహ్మణక్షత్రియ, వైశ్యుల శుశ్రూషను చేయవలయును. ఋతుకాలమున స్వదారాగమనమును చేయవలయును. సర్వలోకహితాకాంక్షిత, శుభకరత్వము, ప్రియవాదిత, అనాయాసము, మనోహర్షము, తితిక్ష, నిగర్విత ఇవి అన్ని వర్ణములకు సామాన్యధర్మములు. స్వాశ్రమోచిత కర్మలను ఆచరించువారందరూ మునులే. ఆపదలో బ్రాహ్మముడు క్షత్రియాచారమును ఆశ్రయించవచ్చును. అత్యాపదలో క్షత్రియుడు వైశ్యా చారమునాశ్రయించవచ్చును. బ్రాహ్మణుడు ఎంతటి ఆపదలోనైనను శూద్రవృత్తిని ఆశ్రయించరాదు. బ్రాహ్మణుడు శూద్రవృత్తి నాశ్రయించినచో చండాలత్వమును పొందును. బ్రాహ్మణక్షత్రియ వైశ్యులకు బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము భికుతా అను నాలుగాశ్రమములు విధించబడినవి. అయిదవ ఆశ్రమము చెప్పబడియుండలేదు. ఈ నాలుగు ఆశ్రమములతో ఉత్తమ ధర్మము సాధించబడును. కర్మయోగము నాశ్రయించు వారి విషయమున శ్రీహరి ప్రీతిచెందును. ఆశను వదిలి శాంతచిత్తుడై కర్మయోగరతులైన వారు తిరిగిరాని పరమపదమును చేరెదరు.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున సదాచారమను ఇరువదినాలుగవ అధ్యాయము సమాప్తము.
