నారద మహా పురాణము - పూర్వార్థము
62 - మోక్షధర్మనిరూపణమ్
సూత ఉవాచ:-
సూత మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! సనందనమహర్షి మాటలను వినిన నారదమహర్షి శుకమహర్షి మోక్షమార్గమును చేరిన విధానమును మరల ఇట్లడిగెను.
నారద మహర్షి పలి కెను :- ఓ పూజ్యతమా ! నీవు అతి దయాలుడవై నాకు ఆంతయూ తెలిపితివి. నీవు చెప్పిన దానిని విని నా మనసు ఉత్తమశాంతిని పొందినది. అయిననూ నీవు మరల నాకు మోక్షశాస్త్రమును వివరించుము. కృష్ణగుణార్ణవమున నా ఆశ తీరుటలేదు. సంసారమునుండి ముక్తులై మోక్షశాస్త్రపరాయణులైనవారు ఎచట నివసింతురు. ఇది నాలో గొప్ప సంశయము. నీకంటే జ్ఞానులు లేరు కావున ఈ సంశయనివృత్తిని చేయుము.
సనందన మహర్షి పలికెను :- మహామునియగు శుకుడు శాస్త్రవిధానముతో ఆత్మను పాదముల నుండి శరీరమంతట అన్ని అవయవములలో క్రమముగా క్రమము తెలిసినవాడు కావున ధరించెను. తరువాత ప్రాజ్ముఖుడై విజ్ఞాని సూర్యునిచే శోభించుచున్నటుల హస్తపాదములను సవరించుకొని వినయశీలివలే ఆసీనుడాయెను. అచట పక్షి సమూహము కాని ధ్వనికాని చూపుకాని కనిపించుట లేదు. శుకమహర్షి పరంధామమున ఆత్మను చేర్చుటకు ప్రయత్నించు ప్రదేశమున ఇతరములేవీ లేవు. సర్వసంగవినిర్ముక్తుడై ఆత్మసాక్షాత్కారమును పొందెను. శుకమహర్షి సూర్యుని చూచి పెద్దగా నవ్వెను. అంతలోనే మోక్షమార్గమును పొందుటకు యోగము నవలంబించి మహాయోగీశ్వరుడై ఆకాశము నతిక్రమించెను. వ్యాసపుత్రుడు నిశ్చయబుద్దితో అంతరిక్షచరుడాయెను. గరుడుని వలె ప్రకాశించుచు ఉదయించుచున్న శుకమహర్షిని అన్ని ప్రాణులు వాయువేగమనోవేగములు కలవానిగా దర్శించిరి. యథాధిగా యథాశక్తి పూజించిరి. దేవతలు పుష్పవర్షమును కురిపించిరి. శుకమహర్షిని చూచిన గంధర్వులు అప్సరోగణములు, ఋషులు సిద్ధులు ఎవరితను కొత్తగా సిద్ధిని పొందినవాడని ఆశ్చర్యచకితులైరి. అపుడు శుకమహర్షి వారికి తన పేరును చెప్పెను. అట్లే సంతోషముచే మహాతేజోవంతులగు ఆ ఋషులను గూర్చి ఇట్లు పలికెను. మా తండ్రి! శుకొ అని పిలుచుచు - నా వెంట వచ్చినచో మీరు సావధానులై వారికి సమాధానమును చెప్పవలయును. వార యని సమాధానము చెప్పగా. శుకమహర్షి చతుర్విధలోకములను, అష్టవిధమగు తమస్సును, పంచవిధమగు రజస్సును విడిచెను. తరువాత జ్ఞానియగు - శుకమహర్షి సత్త్వమును కూడా వీడెను. అది అత్యద్భుతమాయేను. తరువాత 'నిర్గుణము లింగరహితము అయిన ఆ పదమున హిమవత్పర్వతము మేరుపర్వతముల వంటి ఆ పర్వతశృంగమున, శ్వేత పీత వర్ణ సమ్మిశ్రమున స్వర్ణరజతమయము శుభకరము అయిన నిలువుగా, అడ్డముగా శతయోజనవిస్తారముగా నున్నదాని పై నిర్వింశంకమనస్కుడై నిలిచెను. శుకమహర్షి నిలువగానె మిక్కిలి సంక్లిష్టముగా నున్న ఆ శృంగము రెండుగా చీలి కనపడెను. ఆ దృశ్యము మిగుల ఆశ్చర్యమును గొలి పెను. అంతట ఆ పర్వత శిఖర భాగముల నుండి వేగముగా బయలు వెడలెను. ఆ పర్వతము శుకమహర్షి గమనమును అడ్డగించలేక పోయెను. అప్పుడు దివ్యమగు ఆకాశ గంగను ఉపరిభాగమున వెళ్ళుచు పూచిన చెట్లు గల వనమును శుకమహర్షి చూచెను. ఆ నదిలో క్రీడించుచు అప్పరోగణములు వివస్త్రలుగా స్నానము చేయుచు సాకారులై నిరాకారుని చూడసాగిరి. అట్లు శుకమహర్షి వ్యోమగతిన సాగుచుండుట తెలిసీ తండ్రియగు వ్యాస మహర్షి అతని యందలి పేమచే ఉత్తమగతిని స్వీకరించి శుకుని వెంట సాగెను. శుక మహర్షి మాత్రము వాయువునకు పై భాగమున గమనమును అవలంబించి తన ప్రభావమును చూపుచు సర్వభూతాత్మకుడాయెను.
మహాతపస్కుడైన, వ్యాసమహర్షి యోగగతిని అవలంబించి నిమేషమాత్రమున శుకాధిపతనమును గూర్చి వెళ్ళేను. పర్వతమును రెండుగా చీల్చి శుకుడు వెళ్ళుటను చూచెను. మునులు సిద్ధులు శుకుని గతిని వ్యాసమహర్షికి తెలిపిరి. అపుడు వ్యాసమహర్షి శుకా అని పెద్దగా పిలిచెను. ఆ పిలుపు మూడులోకములలో ప్రతిధ్వనించేను. శుకమహర్షి సర్వాత్ముడు సర్వతోముఖుడు సర్వగతి అయి తండ్రి పిలుపును విని ధర్మాత్ముడు కావున భోః అని బదులు పలికెను. అంతట భోః అను ఒక అక్షరము గల మాట స్థావరజంగమాత్మకమగు ప్రపంచమంతట ప్రతిధ్వనించేను. అప్పటి నుండి ఇప్పటి వరకు పర్వతగుహలలో పలికిన మాటలు శుకుని గూర్చి ప్రతిధ్వనిగా వినిపించుచున్నవి. ఇట్లు శుకుడు సర్వభూతాంతర్గతునిగా తన ప్రభావమును చూపి సత్త్వాధీగుణములను వదిలి పరమపదమును చేరెను. మిక్కిలి తేజోవంతుడగు పుత్రుని ప్రభావమును చూచి పుత్రుని కొరకు పరితపించుచున్న వ్యాసమహర్షిని భగవంతుడగు రుద్రుడు ఓదార్చేను. ఓ మహామునీ ! నీవు పుత్రుని గూర్చి ఏల పరితపించుచున్నొవు? నీ పుత్రుడు బ్రహ్మ రూపుడై నీ వద్దకు వచ్చుటను చూడలేకున్నావా? అని ఓదార్చగా వ్యాసమహర్షి తన ఆశ్రమమునకు వెడలెను. శుకమహర్షి బ్రహ్మ స్వరూపుడై సర్వలోకములలో సంచరించెను. తరువాత కొంతకాలమునకు వ్యాసమహర్షి నరనారాయణులను చూచుటకు బదరికాశ్రమమునకు వెళ్ళెను. బదరికాశ్రమమున గొప్పతపమును చేయుచున్న నరనారాయణులను చూచిన వ్యాసమహర్షి శుకమహర్షిని తలచుచు తాను కూడా తపస్సును చేయసాగెను. వ్యాసమహర్షి బదరికాశ్రమమున ఉన్న సమయమున పరమయోగజ్ఞుడగు శుకయోగీంద్రుడు నీవు మొదటవెళ్ళిన శ్వేతద్వీపమునకు వెళ్ళెను. ఆ శ్వేతద్వీపమున దేవదేవుడు, శ్రుతులచే అన్వేషించబడు జనార్ధనుని చూచెను.. వెంటనే శుకయోగీంద్రుడు శ్రీహరిని స్తుతించెను. అపుడు శ్రీహరి శుకయోగిని గూర్చి ఇట్లు పలికెను.
భగవంతుడు శ్రీహరి పలికెను :- ఓ యోగీంద్రుడా ! దేవతలందరికీ కనపడకుండా రహస్యముగా నున్న నన్ను నీవు చూడగలిగితివి. నీవు సనత్కుమారుడు ఉపదేశించిన యోగముచే సిద్ధిని పొందగలిగితివి. ఈ యోగముచే నీవు నీ ఇచ్చానుకూలముగా వాయుమార్గమున అన్నిలోకములను చూడుము. ఇట్లు వాసుదేవుడు పలుకగా శుకమహర్షి నమస్కరించి సర్వలోకములచే నమస్కరించబడు వైకుంఠమునకు వెళ్ళెను. ఆ వైకుంఠలోకము విమానము గల దేవతలచే కూడియున్నది. విరజానది పరివేష్టితము. వైకుంఠలోకపు ప్రకాశముతోనే ఇతరలోకములు ప్రకాశించుచుండును. ఆ వైకుంఠమున పగడపు మెట్లు బంగారముతో రత్నములచే పొదగబడియున్నవి. అచటి కొలనులు కలువలచే దేవతా స్త్రీల క్రీడలతో కూడియున్నవి. దివ్యములైన హంసలు కలది. స్వచ్ఛమైనజలము కలవి. నాసాభరణభూషితులు చతుర్ఘస్తులు విష్వక్సేనానుచరులు అగు కుముదొదిద్వారపాలకులు శుకమహర్షిని వారించజాలకపోయిరి. శుకమహర్షి అభ్యంతరమున ప్రవేశించి అచట చతుర్భుజుడు, శాంతమూర్తి, ప్రసన్నవదనుడు, పీతాంబరధారి, అకారమును ధరించిన శంఖ చక్ర గదా పద్మములచే ఉపాసించబడువాడు, లక్ష్మీదేవిచే కౌస్తుభమణిచే ప్రకాశించు వక్షస్థలము కలవాడు కటిసూత్ర, యజ్ఞోపవీత, కటకొంగదములచే విభూషతుడు, కిరీటవలయాదులచే విరాజిల్లువోడు, మణినూపురాధీభూషణములచే సుశోభితుడు, రాత్రింబవళ్ళు సిద్దులచే సేవించబడు దేవదేవుడగు శ్రీమన్నారాయణుని దర్శించెను. అట్లు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి భావముచే స్తోత్రము చేసెను.
శుకమహర్షి పలికెను :- సర్వలోకసాక్టివగు వాసుదేవునకు నమస్కారము. జగత్తున కారణస్వరూపము, పరిపూర్ణుడు, నిభృతాత్ముడయిన నీకు నమస్కారము. వాసుకి పై నివసించువానికి శ్వేతద్వీపవాసి యగు శ్రీహరికి నమస్కారము హంసరూపధారికి, మత్స్యరూపధారికి వరాహరూపధారికి నమస్కారము. నృసింహరూపునకు, ధ్రువునిచే పూజించబడినవానికి సాంఖ్య యోగీశ్వరునకు నమస్కారము. పృథుస్వరూపునకు కూర్మరూపధారికి పరమానందస్వరూపునకు నమస్కారము. పొందశక్యము కాని వానికి, జగత్తును ధరించువానికి, విధాతృస్వరూపునకు, జగదంతమును చేయువానికి నమస్కారము. పరశురామస్వరూపునకు, రఘురామస్వరూపునకు, బలరామస్వరూపునకు నమస్కారము. కృష్ణరూపనకు, వేదకర్తకు, బుద్దరూ పునకు, కల్కి రూపునకు నమస్కారము. వాసుదేవ ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామములతో చతుర్వ్యూహరూపునకు వేద్యునకు, ధ్యానగమ్యునకు, పరమాత్మకు నమస్కారము. నరనారాయణనామునకు, శిపివిష్ట స్వరూపునకు, విష్ణువునకు, సత్యనివాసమునకు విధామకు, సుపర్ణునకు, స్వయం ప్రకాశకునకు నమస్కారము. ఋభుగొమధారికి, సువ్రతాఖ్యునకు, సుధామునకు, జయింపశక్యము కాని వానికి నమస్కారము. విశ్వరూపునకు, విశ్వభూతునకు సృష్టి స్థితి లయ కారకునకు, యజ్ఞ స్వరూపునకు యజ్ఞభోక్తకు, స్థవిష్ణునకు, అణు స్వరూపునకు, అర్థి రూపునకు నమస్కారము. సూర్య చంద్రనేత్రునకు, ఓజో సహబల స్వరూపునకు, పూజ్యునకు, సర్వసాక్షికి, జన్మరహితునకు బహు శీర్షములు, బహు పాదములు, బహు బాహువులు కలవానికి నమస్కారము. శ్రీపతికి, శ్రీనివాసునకు, భక్తవశ్యునకు, శార్జధనుర్ధారికి, అష్టప్రకృతులకు అధిపతికి, అనంతశక్తికి, బ్రహ్మకు నమస్కారము. బృహదారణ్య వేద్యునకు, హృషీకేశునకు, వేధస్స్వరూపునకు, పుండరీకాక్టునకు, క్షేత్రజ్ఞునకు, అంతటా భాసించువానికి నమస్కారము. గోవిందునకు, జగత్కర్తకు, జగన్నాధునకు, యోగికి, సత్యస్వరూపునకు, సత్యసంధునకు, వైకుంఠునకు, అచ్యుతునకు నమస్కారము. అధోక్షజునకు, ధర్మస్వరూపునకు, వామనునకు, త్రిధాతువునకు, ఘృతార్చికి, విష్ణువునకు, అనంతునకు, కపిలునకు నమస్కారము. విరించికి, త్రికకుదునకు, ఋగ్యజుస్సామరూపునకు, ఏక శృంగునకు, శుచిశ్రవునకు, శాస్త్ర సిద్దునకు నమస్కారము. వృషాకపునకు, బుద్ధునకు, ప్రభువునకు, విశ్వకర్మ కు, భూర్భువస్సువస్వరూపునకు, దైత్య సంహర్తకు నిర్గుణునకు నమస్కారము. నిరంజనునకు, నిత్యునకు, అవ్యయునకు, నాశములేనివానికి నమస్కారము. ఓ శరణాగతవత్సలా ! లోకనాథా ! నీకు నమస్కారము. నన్ను కాపాడుము. ఇట్లు శుకమహర్షిచే స్తోత్రము చేయబడిన శంఖ చక్రగదాధరుడు ప్రణతవత్సలుడగు శ్రీమన్నారాయణుడు శుకమహర్షిని గూర్చి ఇట్లు పలికెను.
శ్రీమన్నారాయణుడు పలికెను :- ఓ సువ్రతా ! మహానుభావా ! వ్యాసపుత్రా ! నీవు నా రూపమును ధరించి విద్యను భక్తిని పొంది జ్ఞానరూపుడవు కమ్ము. నీవు శ్వేతద్వీపమున చూచిన నా రూపము . అవతారము కొరకు ధరించినది. ఆ రూపము విశ్వంభరుడనైన నాదే. మోక్ష ధర్మమును చింతించుటచే నీవు సిద్దుడవైతివి. ఉత్తమలోకములను వాయువు, ఆకాశము, సూర్యుడు సంచరించునట్లునీవు సంచరించెదవు. నీవు నిత్యముక్తస్వరూపుడవు కావున నరులచే దేవతలచే. పూజించబడుచుందువు, సర్వపరాయణుడనైన నాయందు భక్తి కలుగుట దుర్లభము. భక్తి లభించిన తరువాత ఇక పొందవలసినదేమియూ ఉండదు. నరనారాయణ ఋషులు కల్పాంతము వరకు తపస్సు చేయుచుందురు. వారి ఆజ్ఞ వలన సువ్రతుడగు , మీ తండ్రి యగు వ్యాసమహర్షి భాగవతమును రచించెను. నీవు భూలోకమునకు వెళ్ళి ఆ భాగవతమును అధ్యయనము చేయుము. మీ తండ్రి ఇపుడు గంధమాదవ పర్వతము పై తపస్సునాచరించుచున్నాడు. నీ ఎడబాటుచే ఖిన్నుడై యున్నాడు. అతనిని సంతోషపరుచుము. అతను నాకు ప్రీతిపాత్రుడు. ఇట్లు శ్రీమన్నారాయణుడు చెప్పగా, చతుర్బుజునికి నమస్కరించి శుకమహర్షి వచ్చిన విధముగానే తిరిగి వెళ్ళి తండ్రిని సమీపించెను. తేజశ్శాలి యగు వ్యాసమహర్షి తన వద్దకు వచ్చిన శుకుని చూచి సంతోషించి తపస్సు నా పెను, నర నారాయణ మూర్తులను నమస్కరించి, శుకమహర్షితో కలిసి తన యాశ్రమమును చేరేను. నారాయణమహర్షి ఆజ్ఞచే వ్యాసమహర్షి నీ ముఖము ద్వారా విని నానాఖ్యానములు గల దివ్యమగు భాగవత సంహితను నివృత్తిపరుడగు శుకునిచే చదివించేను. వ్యాసపుత్రుడగు శుకయోగీంద్రుడు ఆత్మారాముడైనను విష్ణు భక్తులకు ప్రియమగు భాగవతసంహితము ప్రతినిత్యము అధ్యయనము చేసెను. చదువు వారికి వినువారికి హరిభక్తిని పెంచేడు మోక్షధర్మములను నీకు తెలిపితిని.
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున బృహదుపాఖ్యానమున మోక్షధర్మ నిరూపణిమను ఆరువది రెండవఆధ్యాయము సమాప్తము.
ద్వితీయపాదము సమాప్తము.
