నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

58 - శుకప్రలోభనమ్

నారద మహర్షి పలికెను :-

ఓ మహామతీ ! అనూచాన ప్రసంగముతో సంపూర్ణముగా అన్ని వేదాంగములకు సంక్షిప్తముగా విస్తారముగా మీనుండి వింటిని. ఇపుడు విస్తరముగా శుకోత్పత్తిని తెలియజేయుము.

సనందన మహర్షి పలికెను :- పూర్వము మేరు పర్వత శిఖరమున కర్ణికొరవనమున మహాదేవుడగు శంకరుడు భౌమములచే భూతగణములచే కూడినవాడై విహరించెను. అచట హిమవత్పుతియగు పార్వతి కూడ యుండెను. ఆప్రాంతముననే యోగధర్మ పరాయణుడగు వేదవ్యాసమహాముని యోగముచే ఆత్మ లో ప్రవేశించి దివ్యమైన తపస్సునాచరించెను. పుత్రునికొరకు ధారణచే తపస్సునాచరించెను. అగ్నితో భూమితో వాయువుతో ఆకాశముతో సమానతేజో శాలియగు పుత్రుడు కావలయునను సంకల్పముచే ఇంద్రియనిగ్రహములేనివారు పొందలేని అభిలాషను సంకల్పించుకొని, ఉత్తమమగు తపస్సులో నుండి శంకరుని ప్రార్థించేను. నూరుసంవత్సరములు - వాయువును ఆహారముగా తీసుకొనుచు తపస్సునాచరించెను. బహురూపుడు ఉమాపతియగు శంకరుని ఆరాధించుచుండెను. అచట బ్రహ్మర్షులు, అందరు దేవర్షులు లోకపొలులు, సాధ్యులు, అష్టవసువులు, ఆదిత్యులు, రుద్రులు, సూర్యచంద్రులు, విశ్వావసువు, గంధర్వులు, సిద్దులు, అప్సరోగణములు ఉండిరి. అచటనే మహాదేవుడగు రుద్రుడు సమస్త దేవర్షులచే సంకులము, సుందరము అయిన కర్ణికారవనమున, కర్ణికారమాలను ధరించి శరదృతువున చంద్రునివలె ప్రకాశించుచుండెను. అదే వనమున వ్యాసమహర్షి పుత్రుని కోరి పరమయోగమును ఆచరించుచుండెను. అట్లుతపమునాచరించుచున్న వ్యాసుని, దేహవర్ణము తరగలేదు. శ్రమకలుగలేదు. అట్లు వ్యాసమహర్షి ఉండగలుగుట మూడులోకములకు నాశ్చర్యమును కలిగించేను. మిక్కిలి తేజోవంతుడగు వ్యాసమహర్షి జటలు అగ్నిశిఖల వలె ప్రకాశించుచు కనపడుచుండెను. ఇట్టి ఉత్తమతపస్సుచే భక్తిచే మహేశ్వరుడు ప్రసన్నుడై మనసులో వ్యాస మహర్షిని అనుగ్రహిచవలయునని సంకల్పించి అతని ముందున కేగి చిరునవ్వులను చిందించుచు ఇట్లు పలికెను. అగ్నివాయువు భూమి జలము, ఆకాశముల వలె పరిశుద్దుడగు పుత్రుడు నీకు కలుగును. అతని భావమును అనుభవించుచు, అతనియందే మనసు కలవాడవై, తాదాత్మ్యముచే అతని ఆశ్రయము వలన, ఆపుత్రుని తేజస్సుచే మూడులోకములలో గొప్పకీర్తిని పొందగలవు.

మహానుభావుడు సత్యవతీ సుతుడగు వ్యాసమహర్షి ఇట్లు శంకరుని వలన తపస్సుచే వరమును పొంది, అగ్నిని చేయ సంకల్పించి అరణిని మధించసాగెను. అంతలో తన తేజస్సుచే ఉజ్జ్వలమగు రూపమును ధరించియున్న ఘృతాచియను అప్పరసను వేదవ్యాసమహర్షి అచట చూచెను. అట్లు వ్యాసమహర్షి ఘృతాచిని చూచి వెంటనే కామమోహితుడాయెను. ఇట్లు వ్యాస మహర్షిని కొత్త సంవిగ్నమనస్కుని చేసి లోకోత్తర సౌందర్యవతియగు ఘృతాచి చిలుకరూపముతో వ్యాసమహర్షిని సమీపించేను. లోకోత్తర సౌందర్యవతి యగు ఘృతాచిని చూచిన వ్యాస మహర్షి శరీరమంతట మన్మథభావము నిండగా, మనోవ్యాకులతను గొప్ప ధైర్యముచే నిగ్రహించుకొనుచు, జారిన మనసును నిగ్రహించలేక, జరుగవలసినది జరుగవలయును కావున ఘృతాచీ సౌందర్యముచే హరించబడిన మనస్సును యత్నముచే నిగ్రహించుకొనిననూ దీనిని చేయసంకల్పించుటచే ఆయరణిలోనే వ్యాసమహర్షి వీర్యము స్రవించెను. ఆవీర్యమును మథించగా ఆయరణి యందే మహాతపస్వియగు శుకుడు జన్మించెను. ఈ శుకుడు పరమర్షి మహాయోగి అరణీ గర్భమున జన్మించెను. చక్కగా ప్రజ్వలించు అగ్ని హవ్యమును స్వీకరించి తేజస్సుచే ప్రకాశించునట్లు తన తేజస్సుచే జ్వలింపచేయుచున్నట్లు శుకమహర్షి ప్రకాశించుచుండెను. సాటిలేని రూపమును, వర్ణమును ఆశ్చర్యకరముగా ధరించుచు వెలుగొందుచుండెను. అట్టి శుకుని నదులలో కెల్ల ఉత్తమనదియగు గంగానది మేరు శిఖరమున రూపు దాల్చి స్వయముగా వచ్చి తన జలముచే స్నానము చేయించేను. అంతరిక్షము నుండి శుకుని కొరకు కృష్ణాజినము భూమిమీద పడెను. గంధర్వులు గొనమును చేసిరి. అప్పరసలు నాట్యము చేసిరి. దేవదుందుభులు గొప్పదని కలవై మోగినవి. గంధర్వుడగు విశ్వావసువు, తుంబురు నారదులు, హాహాహూహూ " గంధర్వులు శుకజన్మను స్తోత్రము చేసిరి. అచటికి ఇంద్రుడు మొదలగు లోకపొలకులు వచ్చిరి. దేవతలు దేవర్పులు బ్రహ్మరులు కూడా వచ్చిరి. వాయువు దీవ్యములైన సర్వవిధపుష్పములను వర్షించెను. స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయు సంతోషించేను. మహాత్ముడగు శంకరుడు మిక్కిలి ప్రీతిచే పార్వతీదేవితో కలిసి గొప్పతేజస్సు కలవాడై వ్యాసమహర్షి పుత్రునికి పుట్టిన వెంటనే ఉపనయనము గావించెను. దేవాధిపతియగు ఇంద్రుడు దివ్యము ఆశ్చర్యమును గొలుపు కమండలమును శుకునికిచ్చిరి. దేవతలు వస్త్రములనిచ్చిరి. హంసలు, చక్రవాకములు, సారసములు, చిలుకలు ఇతర పక్షులు శుకునికి ప్రదక్షిణమును గావించిరి. ఇట్లు అరణీ సంభవుడగు శుక మహర్షి దీవ్యమగు జన్మను పొంది, ఉపనయనము గావించుకొని బ్రహ్మ చర్యవ్రతము నవలంబించి అచటనే ఉండెను. శుకమహర్షి పుట్టిన వెంటనే సాంగములు సరహస్యములగు వేదములు తండ్రియగు వేదవ్యాసుని పొందినట్లు శుకమహర్షిని వచ్చి చేరినవి. అపుడు శుకమహర్షి ధర్మమును పరిశీలించి వేద వేదొంగ భాష్య జ్ఞానము కలవాడైనను బృహస్పతిని గురువుగా వరించెను. అట్లు బృహస్పతి దగ్గర సాంగములు సరహస్యములగు వేదములనభ్యసించి, సమగ్రేతిహాసమును, సర్వశాస్త్రములను అధ్యయనము చేసి గురువుగారికి దక్షిణను సమర్పించి ఆశ్రమమునకు తిరిగివచ్చి, సావధానమనస్కుడై ఉగ్రమైన తపస్సుచేయనారంభించెను. అట్లు తపస్సు చేయుచున్న శుకమహర్షి బాల్యములో నున్ననూ దేవతలకు, ఋషులకు సంప్రదిచదగిన వాడాయెను. జ్ఞానముచే, తపస్సుచే వారికంటే అధికుడాయెను. అయినను శుకమహర్షి బుద్ధి ఆశ్రమమున ఆనందించలేకపోయెను. గృహస్థాశ్రమము మొదలుకొనియున్న మూడు ఆశ్రమములో మోక్షధర్మమును గూర్చి ఆలోచించుచున్న శుకమహర్షి మోక్షమును ధ్యానించుచు తండ్రిని సమీపించేను.

తండ్రికి నమస్కరించి, శ్రేయస్సును కోరి వినయముతో, మోక్షధర్మములలో కుశలులైన మీరు నా మనస్సునకు శాంతి ఎట్లు కలుగునో చెప్పుడు అని పలికెను. పుత్రుడగు శుకమహర్షి మాటలను వినిన వ్యాసమహర్షి అతనితో ఇట్లు పలికెను. మోక్షధర్మములను, ఇతరములైన వివిధ ధర్మములను అధ్యయనము చేయుము. అని అట్లు తండ్రి ఆజ్ఞతో తండ్రినుండి బ్రహాజ్ఞానులలో శ్రేషుడగు శుకమహర్షి మోక్షధర్మములను ఇతర ధర్మములను గ్రహించెను. అట్లే సమగ్రముగా యోగశాస్త్రమును, కాపిల శాస్త్రమును గ్రహించెను. ఇట్లు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్న, బ్రహ్మతుల్యపరాక్రముడైన శుకమహర్షిని మోక్షశాస్త్ర విశారదునిగా వ్యాసమహర్షి తలచెను. అపుడు వ్యాసమహర్షి పుత్రుని గూర్చి మిధిలేశ్వరుడగు జనకుని వద్దకు వెళ్ళుము. జనక మహారాజు నీకు సమగ్రముగా మోక్షార్థమును బోధించగలడు. గర్వించక మానవునిగా నడిచి వెళ్ళుము. నీ ప్రభావముచే అంతరిక్ష గమనమున వెళ్ళకుము. ఆర్జవముతో వెళ్ళుము. క్షణకాల సుఖము కొరకు ఆశపడరాదు. విశేషములను నీవు చూడరాదు. విశేషములు తమంతతాముగా వచ్చి చేరును. పూజించదగిన జనక మహారాజు విషయమున అహంకారమును చూపరాదు. అతనీ భవనమున కొంతకాలమున్నచో అతను నీసంశయములను తొలగించగలడు. జనక మహారాజు ధర్మ కుశలుడు. మోక్ష శాస్త్రవిశారదుడు. అతను చెప్పి దానిని చెప్పినట్లుగా ఆచరించుము. ఇట్లు తండ్రి చెప్పగా తండ్రి అనుమతిని పొంది మిధిలాధిపతియైన జనకుని వద్దకు వెళ్ళేను. అంతరిక్ష మార్గమున సముద్రములతో చుట్టబడియున్న భూమిని దాటగల శక్తి యున్ననూ పాదములతో నడుచుచు పర్వతములను దాటి భారతవర్షమును చేరి, సమృద్ధములగు వివిధ దేశములనతిక్రమించి, విదేహ దేశమును చేరి జనకుని భవనమునకు చేరెను. రాజద్వారమును చేరగా ద్వారపాలకులు ఆపిరి. శుక్రమహర్షి రాజద్వారము ముందే ఆకలి దప్పులు లేనివాడై ఎండలో శ్రమనెరుగని వాడై ధ్యానయుక్తుడై నిలిచియుండెను. అచట నున్న ద్వారపాలకులలో ఒకడు, సూర్యుడు ఆకాశ మధ్యమున ప్రకాశించునట్లు దివ్యతేజోయుక్తుడగు శుకుడు నిలిచియుండుట చూచి, న్యాయబద్ధముగా పూజించి, నమస్కరించి చేతులు జోడించి అంజలి బదుడై రాజభవనమున ప్రవేశింప జే సెను. అచట రాజభవనములో రెండవ కక్ష్యలో అంతపుర భవనము చైత్రరధముతో సాటివచ్చునది, జలశాలలు, క్రీడాశాలలతో చక్కగా విభజింపబడి, సుందరము, పూలచెట్లు కలదియగు భవనమును చూపి, ఆసనమున కూర్చుండబెట్టి జనకమహారాజునకు నివేదించెను. జనకమహారాజు శుకుడు వచ్చుట తెలిసి, శుకుని అభిప్రాయమును తెలియగోరి శుకమహర్షి పరిచర్య కొలకు వారకాంతలను నియమించెను. సుందరమగు కేశపాశములు గలవారు, అందమైన శోణీభరము కలవారు, ప్రియదర్శనులగు వారకాంతలు సూక్ష్మములగు రక్త వస్త్రములను ధరించి మేలిమి బంగారు నగలను ధరించి, సంతాప ఆలాపములందు కుశలులు కావున, ఎదుటివారి భావమును గ్రహించు వారు, అన్నిటిలో నిపుణులగు యాబది మంది వారకాంతలు శుకమహర్షిని సమీపించి అర్ఘ్యపాద్యాదికములను సమర్పించిరి. దేశకాలోచితమగు చక్కని భోజనముచే తృప్తి కలిగించిరి. భోజనము చేసిన తరువాత శుకమహర్షిని సుందరమైన పురోద్యానమునకు కొనిపోయి ఒక్కొక్క దానిని చూపిరి. ఆడుచు, పొడుచు, నవ్వుచు స్వభావమును తెలిసిన వారకాంతలు ఉదారసత్వుడగు శుకుని సేవించసాగిరి. జితక్రోధుడు జితేంద్రియుడగు ఆరణీ గర్భసంభూతుడు పరిశుద్ధమగు మనస్సుతో ఎప్పుడూ ధ్యానములోనే ఉండి సంతోషించక, కోపించక యుండెను. పాదప్రక్షాలనమును గావించుకొని శుకమహర్షి సంధ్యావందనమాచరించెను. మోక్షార్ధమును ధ్యానించుచు పవిత్రమైన ఆసనమును కూర్చొనెను. పూర్వరాత్రిలో ధ్యానపరాయణుడై, మధ్యరాత్రమున నిద్రను రప్పించుకొనెను. ప్రొద్దుననేలేచి శౌచమును ముగించుకొని స్త్రీలతో కలిసి యుండియు ధ్యానమునే పొందెను. ఈ విధానముతో ఆచటనే ఆ పగలు రాత్రి గడి పెను.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయభాగమున శుకప్రలోభమను యాబయెనిమిదవ అధ్యాయము సమాప్తము.