నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

102 - లింగపురాణానుక్రమణీ నిరూపణమ్

శ్రీ బ్రహ్మపలికేను :

చదువు వారికి వినువారికి భుక్తి ముక్తులను ప్రసాదించు లింగపురాణమును ఇపుడు నీకు చెప్పెదను. వినుము. శంకరుడు వహ్నిలింగమున నుండి నాకు ధర్మాది సిద్ధి కొరకు అగ్ని కల్పకథాశ్రయమగు లింగపురాణమును స్వయముగా చెప్పెను. దీనినే వ్యాస మహర్షి రెండు భాగములుగా బహుకథాచిత్రముగా లింగపురాణమును చెప్పెను. ఈ లింగపురాణము శివుని మాహాత్మ్యమును తెలుపునది. పదకొండు వేల శ్లోకములు కలది. జగత్రయమున సర్వపురాణ సారభూతము. పురాణోపక్రమమున సంక్షేపముగా సృష్టి విషయక సంప్రశ్నము, తరువాత యోగాఖ్యానము, కల్పాఖ్యానము, లింగోద్భవము, పార్వతీ చరిత్రము, సనత్కుమార శైలాది సంవాదము, దధీచిచరితము, యుగ ధర్మ నిరూపణము, భువన కోశకథ, సూర్యచంద్ర వంశ కథలు, తరువాత విస్తృతముగా సృష్టి, త్రిపురాఖ్యానము, లింగ ప్రతిష్ట, పశుపాశ విమోచనము, శివవ్రతములు, సదాచార నిరూపణము, ప్రాయశ్చిత్తములు, అరిష్టములు, కాశీ శ్రీశైల వర్ణనములు, అంధకాఖ్యానకము, వరాహ చరితము, నృసింహ చరితము, జలంధరవధ, శివ సహస్ర నామములు, దక్షయజ్ఞ వినాశనము, కామ దహనము, పార్వతీ కళ్యాణము, వినాయకాఖ్యానము, కృపాఖ్యానము, ఉపమన్యుకథ, ఇంతవరకు పూర్వభాగమున వివరించబడినది.

ఉత్తర భాగమున విష్ణు మాహాత్మ్య కథనము, అంబరీష కథ, సనత్కుమార, నందీశ సంవాదము, శివమాహాత్మ్యము, స్నాన యాగాదికము, సూర్యపూజావిధి, ముక్తి ప్రదమగు శివపూజ, బహువిధ దానములు, శ్రాద్ధ ప్రకరణము, ప్రతిష్టి తంత్రము, అఘోర కీర్తనము, వజ్రేశ్వరీ మహావిద్యా, గాయత్రీ మాహాత్మ్యము త్ర్యంబక మాహాత్మ్యము, పురాణ శ్రవణ ఫలము వివరించబడినవి. ఈ పురాణమును వ్రాసి తిలధేను సమన్వితముగా, ఫాలున పూర్ణిమనాడు భక్తితో బ్రాహ్మణునకు దానము చేసినవాడు జరామరణ వర్జితమగు శివసాయుజ్యమును పొందును. పాపహరమగు లింగపురాణమును చదివిననూ వినిననూ ఇహలోకమున సకల భోగములనను భవించి అంతమున శివలోకమును పొందును. ఈ లింగపురాణాను క్రమణిని చదివిననూ వినిననూ శివభక్తులై ఉభయ లోకములలో భోగముల ననుభవించెదరు. సాటిలేని శివుని అనుగ్రహపాత్రులగుదురు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్ధపాదమున లింగపురాణానుక్రమణికయను నూటారెండవ అధ్యాయము సమాప్తము.