నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

59 - అధ్యాయము

సనందన మహర్షి పలికెను :- అంతట జనక మహారాజు మంత్రులచే సమస్తాంతఃపుర జనముచే కూడి పురోహితుని ముందుంచుకొని శిరస్సుతో అర్ఘ్యమును తీసుకొని గురుపుత్రుని చేరెను. సర్వరత్నవిభూషితమగు ఉత్తమాసనమును గురుపుత్రుడగు శుకమహర్షి కొసంగెను. ఆసనముపై కూర్చొని యున్న వ్యాసపుత్రునికి శాస్త్రవిధానముతో మొదట పాద్యమునిచ్చి తరువాత అర్ఘ్యమును గోవును సమర్పించేను. బ్రాహ్మణోత్తముడగు శుకమహర్షి మంత్రయుక్తమగు పూజను స్వీకరించి జనకమహారాజును అంతటా కుశలమునడిగెను. ఉదార స్వభావము కల జనకుడు కూడా గురుపుత్రునికి తమ క్షేమ సమాచారమును నివేదించి శుకమహర్షి అనుమతిని బొంది భూమి మీద కూర్చొనేను. తరువాత శుకమహర్షిని కుశలమడిగి రాకకు కారణమేమని విధానమును తెలిసిన జనకుడు అడిగేను.

శుక మహర్షి పలికెను :- ఓ జనక మహారాజా ! నీకు శుభమగుగాక ! నా తండ్రి వేదవ్యాసుడు నాతో నాకంటే ముందువాడు విదేహ రాజగు జనకుడు మోక్షధర్మార్ధ కోవిదుడు. నీవు త్వరగా అతని వద్దకు వెళ్ళుము. అతను నీ సంశయములను తొలగించగలడు. ప్రవృత్తి మార్గమున నివృత్తి మార్గమున కలుగు అన్ని సందేహములను తొలగించగలడు అని చెప్పెను. అట్లు నా తండ్రి ఆజ్ఞవలన నేను నిన్ను అడుగుటకు ఇచటికి వచ్చితిని. కావున ఓ ధర్మజ్ఞుడా ! బ్రాహ్మణుడు ఏమి చేయవలయును? మోక్షము ఏ స్వరూపము? మోక్షమును జ్ఞానముచే సాధించవలయునా? తపస్సు చే సాధించవలయునా? ఎట్లు సాధించవలయును?

జనక ఉవాచ :-

జనక మహారాజు పలికేను :- బ్రాహ్మణుడు పుట్టినప్పటి నుండి చేయవలసిన దానిని వినుము. ఉపనయనమును చేసుకొని వేదపరాయణుడు కావలయును. గురువును సేవించుచు, తపస్సుచే బ్రహ్మ చర్యముచే కూడినవాడై, ఆశ అసూయలేనివాడై దేవతలకు పితృదేవతలను ఆరాధించవలయును. జితేంద్రియుడై వేదాధ్యయనమును గావించి దక్షిణను సమర్పించి గురువాజ్ఞను పొంది ఇంటికి తిరిగిరావలయును. ఇల్లు చేరి వివాహము చేసుకొని భార్యతో నియమబద్ద జీవితమును గడుపవలయును. ఆహితాగ్ని అయి అసూయను వదిలి శాస్త్రబద్దముగా వ్యవహరించుచు పుత్రులను పౌత్రులను పొంది వానప్రస్థాశ్రమమును స్వీకరించవలయును. ఆయగ్నినే న్యాయానుసారముగా పూజనుసలుపుచు అతిథప్రియుడై అన్ని అగ్నులను ఆత్మలో ఆవేశింపచేసుకొని ధర్మములను తెలిసినవాడై ద్వంద్వములను వీడి, వైరాగ్యము నలవరుచుకొని బ్రహ్మాశ్రమమున వసించవలయును.

శుక మహర్షి పలికెను :- హృదయమున శాశ్వతమైన జ్ఞానము కలిగి విజ్ఞానము ప్రత్యక్షముగా అని చెప్పినచో గుర్వాశ్రమమున నివసించక జ్ఞానమును పొందలేరు కదా. ఆశ్రమమున తప్పక యుండవలయునా? అవసరము లేదా? ఈ విషయమును మీరు చెప్పవలయును.

జనక ఉవాచ :

జనక మహారాజు పలికెను :- జ్ఞానవిజ్ఞానములు లేనిచో మోక్షము లభించదు. అట్లే గురుసంబంధము లేనిచో జ్ఞానము లభించదు. ఆచార్యుడు తరింపచేయువాడు. జ్ఞానము పడవ. జ్ఞానము పొంది కృతకృతుడై తరింపచేయు వానిని పడవను విడిచి పెట్టవలయును. లోక సంగ్రహము కొరకు, కర్మసంగ్రహము కొరకు శుభాశుభకర్మలనాచరించిన తరువాత మోక్షము లభించును. సంసారమున బహు జన్మలలో కలిగిన కారణములచే కరణములచే చరింపవలయును. పరిశుద్దాత్ముడు ప్రథమాశ్రమముననే మోక్షమునందగలడు. అట్లు మోక్షమును పొంది, ముక్తుడై జ్ఞానియై పండితుడైన వానికి, పరము యందు అభిలాష కలవానికి మిగిలిన మూడోశ్రమములచే పనియేమి? ఎల్లపుడు రాజస తామస దోషములను విడువవలయును. సాత్త్వికమార్గమున నిలిచి ఆత్మచే ఆత్మను చూడవలయును. అన్ని ప్రాణులలో ఆత్మను, అన్ని ప్రాణులను ఆత్మలో చూచుచు సంబంధమును పెట్టుకొనరాదు. దృష్టాంతము జలచరమునకు జలమంటదుకదా ! ఆకాశమున వాయువు పైన పక్షి వలె ఉన్నచో ఈ లోకమున ఆనన్త్యమును పొందగలడు. శీతోష్ణాది ద్వంద్వములను దాటి సంసార బంధనిర్ముక్తుడై శుభసంగతుడై దేహమును విడిచును. ఈ విషయమున యయాతి మహారాజు పూర్వము కొన్ని గాధలను చెప్పియుండెను. వాటిని వినుము. మోక్ష శాస్త్రార్థ విశారదులగు బ్రాహ్మణులు ఆ గాధలను ఎప్పడూ హృదయమున ధరించుచుందురు. ఆత్మ లోనే జ్యోతి ఉండును. మరియొక చోట ఉండదు. రత్నము అచటనే ఉండును. ఆత్మయే రత్నము. సావధానమనస్కుడు స్వయముగా ఆత్మదర్శనమును చేయగలడు. ఎవనికి పరము భయపడదో, పరము వలన ఎవడు భయపడడో, ఎవడు కోరడో, ద్వేషించడో వాడు బ్రహ్మ యగును. అన్ని భూతములందు పాపభావమును చేయని వాడు పూర్వులాచరించిన నాలుగాశ్రమములనొచరించువాడు, ఈ క్రమముతో బహుపుణ్యకర్మలను చేయువాడు, త్రికరణశుద్ధి కలవాడు బ్రహ్మ యగును. మోహమును కలిగించు ఈర్ష్యను విడిచి, తపస్సుచే ఆత్మను సంయోజింపచేసి కొమలోభములను విడిచినవాడు బ్రహ్మత్వమును పొందును. శ్రవ్య విషయమున, దృశ్య విషయమున, సర్వభూతములయందు అవ్యయుని చూచుచు సమ బుద్ధి కలవాడై ద్వంద్వభావమునతిక్రమించిన వాడు బ్రహ్మ యగును. స్తుతినిందలను సమముగా చూడగలిగిననాడు, బంగారమును ఇనుమును, సుఖదుఃఖములను, శోతోష్ణములను, అర్ధఅనర్ధములను, ప్రియాప్రియములను, జన్మమృత్యువులను సమములుగా చూడగలిగిననాడు బ్రహ్మ కాగలడు. జ్ఞానియగువాడు తాబేలు తన అవయవములను బయటకు చాచి మరల లోనికి ముడుచుకొనునటుల మనసుచే ఇంద్రియములను ఉపసంహరింపచేసుకొనవలయును. చీకటి అలుముకున్న ఇంటిని దీపము ప్రకాశింపచేయునటుల బుద్ధిదీపముచే ఆత్మను చూడగలము. ఓ బుద్ధిమంతుడా ! ఇది యంతయూ నీలో కనపడుచున్నది. ఇంకనూ తెలియవలసిన ఇతర విషయములను కూడా నీవు తెలి సియే యున్నావు. ఓ బ్రహ్మర్షీ ! నీవు విషయములను త్యజించితివని నాకు తెలిసినది. గురువు గారి అనుగ్రహము వలన నీ శుశ్రూష వలన నీకు అంతయూ తెలిసినది. నాకు కూడా గురువుగారి అనుగ్రహము వలననే జ్ఞానము ప్రకాశించుచున్నది. ఆ దివ్య జ్ఞానముచే నీవు తెలియబడితివి. నీకు అధిక జ్ఞానము, అధికముగా గ్రహణశక్తి కలదు. నీ ఐశ్వర్యము కూడా అధికమే. కాని దానిని నీవు తెలియుట లేదు. బాల్యము వలననో, సంశయము వలననో, భయము వలననో, వ్యామోహము వలననో జ్ఞానము కలిగిననూ దానిని తెలియజాలరు. పరిశుద్ధమైన వ్యవసాయముచే, నాలాంటి వారిచే సంశయములను తొలగించుకొని హృదయగ్రంథులను విడిచి, ఆ యార్తిని పొందగలరు. నీవు కూడా జ్ఞానము కలవాడవు. స్థిరబుద్దిని. విషయలోలుపుడవు కావు. కావున వ్యవసాయము లేనిదే బ్రహ్మ పదము లభించదు. నీకు సుఖదుఃఖములందు విశేష బుద్ది లేదు. వస్తువులందు, నృత్య గీతాదుల యందు ఔత్సుక్యము లేదు. రాగము కలుగుట లేదు. బంధువుల యందు బంధము లేదు, భయములందు భయమూ లేదు. ఓ మహానుభావా ! నీవు - నిందాస్తుతులను సమముగా చూచువాడవని నాకు తెలిసి పోయినది, నేను ఇతర జ్ఞానులు నీవు ఉత్తమము అక్షయము అనామయమగు మార్గముననుసరించువాడవని తెలిసియున్నారు. బ్రాహ్మణుడు పొందదగిన ఫలము, మోక్షార్ధము అయిన బ్రహ్మయందే యున్నావు. ఇంకనూ ఏమడుగుచున్నావు?

సనందన ఉవాచ : -

 సనందన మహర్షి పలికెను :- ఇట్లు శుకమహర్షి జనక మహారాజు మాటలను విని కృతాత్ముడై, దృఢనిశ్చయము గలవాడై ఆత్మచే ఆత్మను చేరి, ఆత్మను ఆత్మచే దర్శించి, కృతకృత్యుడై, ఆనందమును పొంది, శాంతుడై, ఊరకనే ఉత్తరాభిముఖుడై వెడలిపోయెను. హిమవత్పర్వతమును చేరి, పరాశర పుత్రుడగు వ్యాసమహర్షిని చూచెను. పైలాది బ్రాహ్మణులకు వేదమును అధ్యాపనము చేయుచున్న వ్యాస భగవానునీ పొదములను, పరిశుద్ధాత్ముడు భాస్కరసమతేజుడు, అరణీగర్భ సంభూతుడగు శుకమహర్షి సంతోషముచే గ్రహించి ఉదొరబుద్ధితో జనకమహారాజుతో జరిగిన మోక సంవాదమునంతను నివేదించెను. వేదకర్తయగు వ్యాసుడు దానినంతటిని విని సంతోషించిన మనసుచే పుత్రుని ఆలింగనము చేసుకొని తన ప్రక్కన కూర్చుండబెట్టెను. పైలాది బ్రాహ్మణులు వేదవ్యాసమహర్షి వలన వేదాధ్యయనమును గావించి హిమవత్పర్వతము నుండి భూమండలమునకు చేరి యజ్ఞములను చేయించుచు, వేదాధ్యపనమును గావించుచుండిరి.