నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

93 - పద్మపురాణానుక్రమణికా వర్ణనమ్.

బ్రహ్మపలికేను :-

ఓ పుత్రా ! ఇపుడు చదువు వారికి వినువారికి గొప్ప పుణ్యమును ప్రసాదించు పద్మపురాణమును చెప్పెదను వినుము. అయిదింద్రియములు గలవాడు ఆత్మ అగునట్లు పంచఖండములు కలది పాపనాశకమగు పద్మపురాణము. ఓ బ్రాహ్మణోత్తమా? పులస్త్య బ్రహ్మ భీష్మునకు సృష్ట్యాది క్రమముగా సోనాఖ్యానే తిహాసాదులతో ధర్మము విస్తారముగా ఈ పద్మ పురాణమున చెప్పబడినది. పుష్కర మాహాత్మ్యము, వేద పాఠాది లక్షణము, దాన ప్రశంస, వ్రత ప్రశంస, పార్వతీ కళ్యాణము, తారకాఖ్యానము, గవాది మహాత్మ్యము కాలకేయాది దైత్యవధ, గ్రహార్చనము, దానము ఇవన్నియూ సృష్టి ఖండమున మహాను భావుడగు వ్యాసమహర్షి విస్తరముగా వర్ణించియున్నాడు. తల్లిదండ్రులను పూజించవలయునని చెప్పుటకు శివశర్మ కథను, సువ్రతుని కథను, వృత్రాసుర వధను, పృధువేనుల చరిత్రను, సునీధుని కథను, సుకళాఖ్యానమును, ధర్మాఖ్యానమును, పితృశుశ్రూషణాఖ్యానమును, సహుష కథను, యయాతి చరితమును, గురుతీర్ధ నిరూపణమును ఆశ్చర్యములను గొలుపు పలుకథలు గల రాజ జైమిని సంవాదమును హుండదైత్యుని వధతో కూడిన అశోక సుందరి కథను, కామోదాఖ్యానకమును, విహుండ వధను, చ్యవన కుంజల సంవాదమును, ఈ ఖండమున ఫలశ్రుతిని, సిద్ధాఖ్యానమును, సూత శౌనక సంవాదమున భూమి ఖండమున చెప్పియున్నారు. సూత పుత్రునిచే ఋషులచే బ్రహ్మండోత్పత్తి వర్ణమును, భూమిలోక సంస్థానమును, తీర్థాఖ్యానమును, నర్మదోత్పత్తి కథనమును, ఆయా తీర్థముల కధలను, కురుక్షేత్రాదులలో నుండు తీర్థముల పుణ్యధలను, కాళిందీ పుణ్యకథను, కాశీమాహాత్మ్య వర్ణనమును, గయా మహాత్మ్యమును, ప్రయాగ మహాత్మ్యమును, వర్ణాశ్రమానురోధముతో కర్మయోగ  నిరూపణమును, వ్యాస జైమిని సంవాదమును పుణ్యకర్మ కథాన్వితముగా, సముద్ర మథనాఖ్యానమును, వ్రతాఖ్యానమును, ఊర్జ పంచాహ మాహాత్మ్యమును, సర్వాపరాధములను తొలగించు స్తోతమును స్వర్గఖండమున చెప్పియున్నారు.

రామ రాజ్యాభిషేచనము, రామాశ్వమేధము, అగస్త్యాది మహర్షులు వచ్చుట, పౌలస్త్య వంశ కధను చెప్పుట, అశ్వమేధోప దేశము, హయచర్య, పవిత్రములైన నానా రాజ కధలు, జగన్నాధాను వర్ణనము, సర్వపాప ప్రణాశనమగు బృందావన మాహాత్మ్యము, కృష్ణావతారమున నున్న శ్రీహరి యొక్క నిత్యలీలాను కథనము, మాధవ స్నాన మాహాత్మ్యము, నానా దానార్చన పలము, భూవరాహ సంవాదము, యమ బ్రాహ్మణుల కథ, రాజ దూత కధ, కృష్ణ స్తోత్ర నిరూపణము, శివ శంభు సమాయోగము, దధీచాఖ్యానకము, గొప్ప భస్మ మాహాత్మ్యము, ఉత్తమమగు శివమాహాత్మ్యము, దేవరాత సుతాఖ్యానము, పురాణజ్ఞ ప్రశంస, గౌతమాఖ్యానము, శివగీతా, కల్పాన్తరమున రామకథ భారద్వాజాశ్రమస్థితి, ఇవి యన్నియు పాతాళఖండమున చెప్పబడియున్నవి. ఈ పాతాళ ఖండమును చదివిన వారికి వినువారికి సర్వపాప నివృత్తి ద్వారా సర్వాభీష్ట ఫలము నిచ్చును.

శివుడు పార్వతికి చెప్పిన పర్వతాఖ్యానము, జలంధర కథ, గంగా ప్రయాగ కాశీ గయా తీర్థక్షేత్రముల పుణ్యకథలు. అన్నాది దాన మాహాత్మ్యము, మహాద్వాదశీవ్రతము, ఇరువది నాలుగు ఏకాదశుల మాహాత్మ్యము, విష్ణు ధర్మ సమాఖ్యానము, విష్ణు నామ సహస్రము, కార్తీక వ్రత మాహాత్మ్యము, మాఘస్నాన ఫలము, పాప నాశనములగు జంబూద్వీప తీర్థముల మాహాత్మ్యము, సౌభ్రమతీ మాహాత్మ్యము, నృసింహోత్పత్తి వర్ణనము, దేవశర్మాఖ్యానము, గీతా మహాత్మ్య వర్ణనము, భక్త్యాఖ్యానము, భక్తి మాహాత్మ్యము శ్రీమద్భాగవత మాహాత్మ్యము. బహుతీర్థకథలతో కూడియున్న ఇంద్రప్రస్థ మాహాత్మ్యము, మంత్ర రత్నాభిధానము, త్రిపాద్విభూతి వర్ణనము, మత్స్యాద్యవతార కథలు, దివ్యమగు రామనామ శతకము, రామనామ మహాత్మ్యము, భృగుమహర్షి శ్రీ మహా విష్ణు వైభవమును పరీక్షించుట ఇవియన్నియు సర్వపుణ్య ప్రదమగు అయిదవ ఉత్తరఖండమున చెప్పబడియున్నవి. ఇట్లు పంచ ఖండములచే కూడియున్న పద్మపురాణమును భక్తితో వినిన మానవోత్తముడు ఇహలోకమున అభీష్టభోగముల ననుభవించి వైష్ణవ లోకమును చేరును. ఇట్లు పద్మపురాణమున యాభైయైదు వేల శ్లోకములు కలవు. జేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు, ఈ పద్మ పురాణమును వ్రాసి బంగారు పద్మములతో పురాణజ్ఞునికి చక్కగా సత్కరించి ఇచ్చినవాడు సర్వదేవ నమస్కృతుడై విష్ణులోకమున కేగును. ఈ పద్మపురాణానుక్రమణిని చదివినవాడు, వినినవాడు పద్మపురాణ శ్రవణ ఫలమును పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థ పాదమున పద్మపురాణా నుక్రమణీకథనమను తొంబది మూడవ అధ్యాయము సమాప్తము.