నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

30 - ప్రాయశ్చిత్తవిధిః

సనకమహర్షి పలికెను :- ఓ నారదా! ఇపుడు ప్రాయశ్చిత విధిని చెప్పెదను వినుము. ప్రాయశ్చిత్తముతో శుద్ధిపొందినవాడు సర్వకర్మఫలములను పొందును. ప్రాయశ్చిత్తము నాచరించనివారు చేసిన కర్మలన్నీ నిష్పలములై రాక్షసములగును. కామక్రోధములను పరిత్యజించినవారు ధర్మశాస్త్రవిశారదులు సర్వధర్మఫలమును పొందగోరినవారు బ్రాహ్మణులను ధర్మమునడిగి తెలుసుకొనవలయును. శ్రీమన్నారాయణునకు పరాజ్ముఖులై ప్రాయశ్చిత్తము లాచరించిననూ సురాభాండమును నదులు పవిత్రములను చేయలేనట్లు పవిత్రులను చేయజాలవు. బ్రాహ్మణుని చంపినవాడు, సురాపానము చేసినవాడు, చౌర్యమును చేయువాడు, గురుతల్పగతుడు ఈ నలుగు మహాపాతకులు. వీరితో కలిసియుండువోడు అయిదవ మహాపాపి. ఈ నలుగురితో కలిసి శయనాసన భోజనాదులతో ఒక సంవత్సరము కలిసున్నవాడు సర్వకర్మ భ్రష్టుడగును. తెలియక బ్రాహ్మణుని చంపినవాడు నారబట్టలను జటను ధరించి తాను చంపిన బ్రాహ్మణుని కపొలమును చేతిలో ధరించవలయును. ఆ కపాలము లభించనచో ఇంకొక కపొలమును ధరించవలయును. ధ్వజాగ్రమున కపాలమును ధరించి వనచరుడు కావలయును. మితముగా వన్యాహారమును భుజించుచు వనములో ఒకవారముండవలయును. మూడువేళలలో స్నానము చేసి సంధ్యావందనము నాచరించవలయును. గంధమాల్యాది ధారణమును పరిత్యజించి బ్రహ్మ చారి కావలయును. పుణ్యతీర్థములను పుణ్యాశ్రమములను సేవించవలయును. వన్యాహారమునచే జీవించలేనియెడల గ్రామమున భిక్షాటన చేయవలయును. ఇట్లు శ్రీహరిని స్మరించుచు పన్నెండు సంవత్సరములు బ్రహ్మ హత్యా వ్రతము నాచరించవలయును. ఇట్లు చేసినచో బ్రాహ్మణఘాతకుడు శుద్ధిని పొంది సర్వకర్మార్హుడగును. వ్రతమధ్యమున మృగములచే కానీ రోగములచే గాని మరణించిననూ గోరక్షకై ద్విజరక్షకై ప్రాణత్యాగమును చేసిననూ, బ్రాహ్మణులకు పది వేల గోవులను దానము చేసిననూ బ్రహ్మ ఘాతకుడు శుద్ధిని పొందును.  దీక్షితుడగు క్షత్రియుని వధించినను బ్రహ్మహత్యావ్రతమును ఆచరించవలయును. అగ్నిప్రవేశనము కాని వారు ప్రపాతమును కాని చేయవలయును. దీక్షితుడగు బ్రాహ్మణుని చంపినచో రెట్టింపు వ్రతము నాచరించవలయును. ఆచార్యాదివధను జరిపినచో నాలుగింతలు వ్రతమును చేయవలయును. సామాన్య బ్రాహ్మణుని వధించినచో సంవత్సరము వ్రతము నాచరించవలయును. ఇది బ్రాహ్మణునకు చెప్పబడిన ప్రాయశ్చిత్త విధి. క్షత్రియునకు రెట్టింపు, వైశ్యునకు మూడింతలు ప్రాయశ్చిత్తము జరుపబడును. బ్రాహ్మణుని వధించిన శూద్రుని ముశల్యుడందురు. అట్టివానికి రాజే శిక్ష విధించవలయునని శాస్త్ర నిర్ణయము. బ్రాహ్మణ స్త్రీని వధించినచో సగము ప్రాయశ్చిత్తమును, బ్రాహ్మణ కన్యను వధించినచో నాలుగవ భాగము ప్రాయశ్చిత్తము నాచరించవలయును. ఉపనయనము కాని వానిని వధించిననూ పాదప్రాయశ్చిత్తము నాచరించవలయును. వైశ్యుని చంపినచో మూడు సంవత్సరములు, శూద్రుని వధించినచో ఒక సంవత్సరము కచవ్రతము నాచరించవలయును. దీక్షితుడు బ్రాహ్మణుని భార్యను వధించినచో ఎనిమిది సంవత్సరములు కృచ్ఛవ్రతము నాచరించవలయును. లేదా బ్రహ్మహత్యా వ్రతమును చేసి నిశ్చయముగా శుద్ధిని పొందును. వృద్దులకు రోగార్తులకు, స్త్రీలకు, బాలురకు ఆర్థప్రాయశ్చిత్తము విధించబడినది.

గుడముచే చేయబడినది, పిష్టముచే చేయబడినది, ఇప్పపూవుచే చేయబడినది అను సురా మూడు విధములు. ఇట్టి సురను చాతుర్వర్ణ్యముల వారు స్త్రీలు ఎవ్వరూ పొనము చేయరాదు. ఒకవేళ పానము చేసినచో స్నానముచేసి తడి బట్టలను ధరించి నియమముతో నారాయణ నామమును స్మరించి పాలను కాని, నేతిని కాని గోమూత్రమును. కాని కాచిన ఉక్కువలె కాచి త్రాగి తరువాత నీరు త్రాగవలయును. లోహపాత్రతో కాని ఇనుముపాత్రతో కాని రాగి పాత్రతో కాని త్రాగవలయును. అట్లు త్రాగినచో మరణించును. సురాపానము చేసినవాడు మరణముతో శుద్ధిపొందును. మరియొక మార్గము లేదు. తెలియక కాని తెలిసికొని ద్విజుడు సురాపానము చేసినచో ప్రాయశ్చిత్తము నాచరించవలయును. చిహ్నములను మాత్రమే ధరించక బ్రహ్మ హత్యా వ్రతము నాచరించవలయును, రోగ నివృత్తికి ఔషధముగా సురాపానము చేసినచో అతనికి మరల ఉపనయనము చేయవలయును. అట్లే రెండు చాంద్రాయణ వ్రతముల నాచరించవలయును. సుర తాకిన పాత్రను తాకిననూ, సురాభాండముతో జలము సేవించిననూ సురాపానముతో సమానమే, తాలము, పానసము, ద్రాక్ష, ఖార్జూరము, మాధూకము, శైలమారిష్టము, మైరేయం. నాలికేరజము, గౌడి, మాధ్వీ, సుర అని మద్యము పదకొండు విధములు. వీటిలో దేనినీ విప్రుడు సేవించరాదు. ఒకవేళ సేవించినచో మరల ఉపనయనము చేసీ తప్తకృచ్ఛ్ర వ్రతము నాచరించవలయును.

చూచుచుండగా కాని, చూడకుండా కాని, బలప్రయోగముతో కాని, చౌర్యముతో కాని ఇతరుల వస్తువులను స్వీకరించుట స్తేయమనబడును. సువర్ణ ప్రమాణము మన్వాదులచే నిశ్చయించబడినది. స్త్యమునకు ప్రాయశ్చిత్త విధానము చెప్పెదను వినుము. గవాక్షమార్గమున ప్రసరించు సూర్య కిరణముల మధ్యన కనపడు సూక్ష్మతమాకారమగు దుమ్ములోని ఒక  కణము త్రిసరేణు ప్రమాణముగా నిర్ణయించబడినది. ఎనిమిది త్రసరేణువు నిష్కమగును. మూడు నిష్కములు రాజసర్షపమగును. మూడు రాజసర్షపములు ఒక గౌరసర్షపమగును. ఆరు గౌరుసర్షములు యవమగును. మూడు నిష్కములు రాజ సర్షపమగును. ఆరు గౌరసర్షపములు యవమగును. మూడు యవలు కృష్ణలమగును. అయిదు కృష్ణలములు మాషమనబడును.పదునాఱుమాషములు సువర్ణమగును. తెలియక బ్రాహ్మణ ధనమునపహరించినచో పూర్వమువలె పన్నెండు సంవత్సరములు కపాలధ్వజరహితముగా బ్రహ్మ హత్యావ్రతము నాచరించవలయును, గురువుల, యజ్ఞకర్తల. ధర్మిష్ణుల శ్రోత్రియుల ద్విజులు బంగారమును హరించినచో నేతిని బాగుగా కాచి శరీరమునిండా లేపనమును చేయవలయును. కరీషములో ఆచ్చాదన చేయబడి దగ్గుడైనచో సేయపాపమునుండి విముక్తుడగును. క్షత్రియుడు బ్రాహ్మణ ధనమును హరించినచో పశ్చాత్తాపమును చెంది మరల వారికే ఇచ్చివేసి పన్నెండు దినములు ఉపవాసముచేసి సాంతాపన వ్రతము నాచరించవలయును. అపుడు ముకుడగును. అటు చేయనిచో పతితుడగును. రతాసన మనుష్య , భూమి, ధేనువులు, మొదలగువి సువరసమములు. వీటిని హరించినచో అర్ధప్రాయశ్చిత్తము నాచరించవలయును. త్రసరేణు పరిమితమైన బంగారమును అపహరించినచో సావధానమనస్కుడై రెండుమార్లు ప్రాణాయామము నాచరించవలయును. నిష్కపరిమితమగు బంగారమును హరించిన ప్రాణాయామత్రయమును, రాజసక్తపమాత్రమును హరించిన నాలుగు ప్రాణాయామములను ఆచరించినచో శుద్ధిపొందును. గౌరసరపరిమిత బంగారమును హరించినచో స్నానమాచరించి యథావిధిగా ఎనిమిదివేలు గాయత్రి జపము నోచరించవలయును. యవమాత్రకవచనమునపహరించినచో ప్రాతఃకాలమునుండి సాయంకాలము వఱకు గాయత్రీజపము నాచరించి శుద్ధిపొందును. కృష్ణలమాత్ర హేమాపహరణమును గావించినచో సాంతపనవ్రతము నాచరించవలయును. మాషప్రమాణ హేమపహారణము గావించినచో ఒకసంవత్సరము గోమాత్రములో పక్వము గావించబడిన యవలను భుజించి శుద్ధిపొందును. సువర్ణపరిమిత హేమపహరణము గావించినవారు పన్నెండు సంవత్సరములు సావధాన మనస్కుడై బ్రహ్మహత్యావ్రతము నాచరించవలయును. సువర్ణపరిమాణము కంటే తక్కువ రజతము నపహరించినచో సాంతపన వ్రతము నాచరించవలయును. లేనిచో పతితుడగను. నాలుగు నిష్కములనుండి పది నిషముల వరకు రజతాపహరణమును గావించినచో చాంద్రాయణ వ్రతము నాచరించవలయును. పదీనుండి నూరు నిష్కములవరకు రజతమును అపహరించినచో రెండు చాంద్రాయణ వ్రతముల నాచరించి శుద్ధిపొందును. నూరునుండి వేయి నిషముల వరకు రజాపహరణమునకు మూడు చాంద్రాయణము లాచరించవలయును. వేయినిష్కముల కన్నా అధికము రజతమును అపహరించినచో బ్రహ్మ హత్యవ్రతము నాచరించవలయును. కంచు ఇత్తడి అయస్కాంతము మొదలగువాటిని వేయినిష్కముల నపహరించినచో పరాకవ్రతమునాచరించవలయును. రత్నాపహరణమునకు రజతాపహరణము వలెనే ప్రాయశ్చిత్తము నాచరించవలయును.

గురుతల్పగతులకు ప్రాయశ్చిత్తమును వివరించెదను. తెలియక తల్లినిగాని, తల్లి సవతిని గాని సంగమించినచో తాను చేసిన పాపమును చెప్పుచు తానే తన వృషణమును ఛేదించుకొనవలయును. చేతిలో వృషణమును పట్టుకోని నైరుతీ దిశకు వెళ్ళుచు మార్గమధ్యమున సంభవించు సుఖదుఃఖములను విచారించక ప్రాణము వదలు వరకు చూడకనే వేళ్ళవలయును. అపుడు శుద్ధిపొందును. చేసిన పాపమును చాటుకొనుచు సుడిగాలిలో పడవలయును. విచారించక తన వర్ణముకంటే ఉత్తమ వర్ల స్త్రీని సంగమించినచో సావధానమనస్కుడై పన్నెండు సంవత్సరములు బ్రహ్మహత్యావ్రతము నాచరించవలయును. విచారించక ఆభ్యాసముచే సవర్ణ స్త్రీని కాని ఉత్తమ స్త్రీని కొని సంగమించినచో పిడకనిప్పుతో దగ్గమై శుద్ధిని పొందును. మాతృసంగమున రేత స్సేకము కంటే ముందే నివృత్తుడైనచో బ్రహ్మ హత్యావ్రతము నాచరించవలయును. సవర్ణ స్త్రీ విషయమున ఉత్తమవర్ణ స్త్రీవిషయమున రేత స్సేకము గావించకనే నివృత్తుడైనచో విష్ణుతత్పరుడై తొమ్మిదివత్సరములు బ్రహ్మహత్యావ్రతము నోచరించవలయును. తండ్రి భార్యయగు వైశ్య స్త్రీ సంగమును గావించిచో ఆరు సంవత్సరములు బ్రహ్మ హత్యా వ్రతము నాచరించవలయును. తండ్రి భార్యయగు శూద్ర స్త్రీని సంగమించినచో మూడు సంవత్సరములు వ్రతము నాచరించవలయును. పినతల్లిని, మేనత్తను, ఆచార్య భార్యను, మామ భార్యను, పినతండ్రి భార్యను, మేనమామ భార్యను, పుత్రికను కామమోహితుడై దీనద్వయము సంగమించినచో యథావిధిగా బ్రహ్మ హత్య వ్రతము నాచరించవలయును. ఒకేదినమున పలుమార్లు సంగమించినచో మూడువరములు బ్రహ్మహత్యవ్రతము నాచరించవలయును. ఒకమారు సంగమించినచో ఒక సంవత్సరము వ్రతము నాచరించవలయును. మూడు దినములు సంగమించినచో వహ్నిదగ్గుడైననే శుద్ధిపొందును. చండాలస్త్రీని, పుష్కస స్త్రీని, కోడలును, సోదరిని, మిత్రుని భార్యను, శిష్యుని భార్యను కామముతో సంగమించినచో ఆరుసంవత్సరములు బ్రహ్మ హత్యా వ్రతము నాచరించవలయును. కామము లేకనే సంగమించినచో ఒక సంవత్సరము కృచ్ఛవ్రతము నాచరించవలయును.

మహాపాతకులతో కలిసియున్నపుడాచరించవలసిన ప్రాయశ్చిత్తమును చెప్పెదను. ప్రాయశ్చిత్తముచే పరిశుద్దుడగువాడు సర్వకర్మఫలముల నందగలడు. బ్రహ్మ హత్యాదిపాతక చతుష్టయములలో ఏ పాపమునచేసిన వానితో కలిసియున్నవాడు ఆయా పాతకములను నిర్దేశించబడిన ప్రాయశ్చిత్తముల నాచరించి పరిశుద్దుడగును. ఈ పాతకులలో తెలియక అయిదు దినములు కలిసియున్నచో కాయకచవ్రతమున నాచరించవలయును. లేనిచో పతితుడగును. పన్నెండురోజులు కలిసున్నచో మహాసాంతపన వ్రతము నాచరించవలయును. పది హేనుదినములు సంసర్గముచేసినచో పన్నెండు రోజులుపవసించవలయును. ఒకమాసము కలిసున్నచో పరాకవ్రతమునాచరించవలయును. మూడు మాసములున్నచో చాంద్రాయణవ్రతము నాచరించవలయును. ఆరునెలలు కలిసున్నచో రెండు చాంద్రాయణముల నాచరించవలయును. కొంచెము తక్కువగా సంవత్సరమున్నచో ఆరుమాసములు వ్రతము నాచరించవలయును. ఇదియే సంసర్గము తెలిసి చేసినచో పైన చెప్పబడిన ప్రాయశ్చిత్తములకు మూడురెట్లధికముగా నాచరించవలయును.

మండూకమును (కప్పు) ముంగిసను, కాకిని, వరాహమును, మూషకమును, మార్జాలమును, మేకను, గొఱ్ఱేను, కుక్కను, కోడిని చంపినచో అర్ధకృచ్ఛవ్రతము నాచరించవలయును. అశ్వమును వధించినవారు అతీకృచవ్రతము నాచరించవలయును. ఏనుగును వధించినచో తప్తక్పచువ్రతమును గోవధను చేసినవారు పరాకము నాచరించవలయును. తెలిసి కోరి గోవధను చేసినవారి నిష్కృతి విధించబడలేదు.

పానశయ్యాసనాదులను పుష్పమూలఫలాదులను భక్ష్య భోజ్యాదుల నహరించినచో పంచగవ్య సేవనముచే శుద్ధికలుగను. శుష్క కాష్ఠలములను, తృణమును, వృక్షములను, గుడమును, చర్మమును, వస్త్రములను, మాంసమును అపహరించినచో మూడు దినములు ఉపవసించవలయును. చకోరమును, చక్రవాకమును, హంసను, కారండమును, గుడ్లగూబను, సారసమును, పావురమును, జలపాదకమును చీలుకను, పిట్టను బలాకమును, తోడేలును, తాబేలును, వీటితో దేనిని చంపిననూ పన్నెండు దినములుపవసించవలయును. రేతస్సును, మలమూత్రములను ఆహారముగా తీసుకొనినచో ప్రాజాపత్య వ్రతము నాచరించవలయును. శూద్రోచ్చిష్టభోజనము చేసినచో మూడు చాంద్రాయణ వ్రతముల నాచరించవలయును. రజస్వలయగు స్త్రీని, చండాలుని, మహాపాతకుని, ప్రసవించిన స్త్రీని, పతితుని, ఉచ్చిష్టమును, రజకొదులను స్పృశించినచో సచేలముగా స్నానము చేయవలయును, ఘృతప్రాశనము చేయవలయును. స్నానము చేసి పరిశుద్దుడై ఎనిమిది నూర్లు గాయత్రీ జపమును చేయవలయును. భోజనముచేయుచున్నప్పుడు తెలియక వీరిలో ఒకరిని స్పృశించినచో మూడుదినములుపవాసమునాచరించి పంచగవ్య ప్రాశనము చేయవలయును. స్నానదానజపభోజనాదులలో పైన చెప్పబడిన వారిలో ఒకరి శబ్దమును వినిననూ వారితో మాటలాడినను, భుజించిన దానిని వాంతి చేసుకొనవలయును. సొనము చేసి. ఉపవసించవలయును. రెండవదినము నేతిని భుజించి శుద్ధిని పొందును. ప్రతాదుల మధ్యన వీరి మాటలను వినినచో ఒక వెయ్యి ఎనిమిది గాయత్రీ జపమునాచరించి శుద్ధిపొందును. అన్నిపాపములలో అధికపాపము ద్విజదైవత నిందనము. ఈ పాపమునకు ఏ శాస్త్రములోను నిష్కృతి చెప్పబడలేదు.

 మహాపాతకతుల్యములుగా జ్ఞానులు పేర్కొన్నవాటికి యథావిధిగా ప్రాయశ్చిత్తముల నాచరించయే తీరవలయును. నారాయణపరాయణుడై ప్రాయశ్చిత్తముల నాచరించినచో శుద్దుడగును. లేనియెడల పతితుడగను. రాగాదినిర్ముక్తుడై పశ్చాత్తాప సమన్వితుడై సర్వభూతములయందు దయావంతుడుగుచు విష్ణుస్మరణ తత్పరుడైనచో మహాపాతకములచే కాని సర్వవిధపాతకములచే కొని కూడియున్ననూ విష్ణుపరుడగుట వలన విముక్తుడగును. అనాకారుడు అనామయుడు అనాద్యంతడుగుట వలన విముక్తుడగును. అనాకారుడు అనామయుడు అనాద్యంతుడు అగు నారాయణుని స్మరించు మానవుడు పొషకోటులనుండి విముక్తుడగును. శ్రీమన్నారాయణుని స్మరించినను, పూజించినను, ధ్యానించినను, ప్రణామము లాచరించినను శ్రీమహావిష్ణువు హృదయమునుండి పాపకోటులను నశింపచేయును. సంసర్గము వలన కానీ మోహము కలన కొని శ్రీహరిని పూజించినచో సర్వపాప వినిర్ముక్తుడై శ్రీహరి పదమును చేరును. శ్రీమహావిష్ణువును ఒకసారి స్మరించినచో క్లేశరాశులు నశించును. స్వర్గాది భోగప్రాప్తి సుకరమగును. ఓ మునీశ్వరా ! మానవజన్మ దుర్లభము. అందులోనూ హరిభక్తి పరమ దుర్లభము. కావున మేరుపువలె చంచలమైన దుర్లభమైన మానవజన్మను పొంది సర్వపాశవిమోచనకమగు హారిని పూజించిన అన్ని విఘ్నములు నశించును. మనశ్శుద్ధి కలుగును. ఉత్తమమైన మోక్షము లభించును. ధర్మార్థకామమోక్షములగు సనాతన పురుషార్ధములు హరిపూజాపరులకు సిద్ధించును. పుత్రదోరగృహక్షేత్రధనధాన్యముల వెంట పరుగెత్తి మానవజన్మ నెత్తి గర్వించకుడు. కామక్రోధలోభమోహమున మాత్సర్యములను, పరాపవాదమును నిందను వదిలి భక్తితో శ్రీహరిని సేవించుడు. అన్ని వ్యాపారములను వదిలి పెట్టి జనార్దనుని పూజించుడు. యమనగరవృక్షరాజములు సమీపములోనే యున్నవి. జరామరణములు ఇంద్రియవైకల్యము సంభవించకమునుపే శ్రీహరిని అర్చించుడు. నశ్వరమైన ఈ శరీరము పై బుద్ధిమంతుడు విశ్వాసముంచడు. మృత్యువు ఎల్లపుడూ సమీపించియే యుండును. సంపదలు మిగుల చంచలములు. దేహమేప్పుడూ మృత్యవునకు దగ్గరలోనే యున్నది. కావున గర్వమును విడువుడు. ప్రతి కలయిక విడిపోవుట కొఱకే, ప్రతిదీ క్షణభంగురమే. ఈ విషయమును తెలిసి జనార్ధనుని పూజించుము. ప్రాణి ఆశచే బాధలను తెచ్చుకొనును. మోక్షమత్యంత దుర్లభము. మహాపొపియైనను భక్తి చే శ్రీ మహావిష్ణువును పూజించినచో తిరిగిరాని పరమపదమును చేరును. సర్వతీర్ధములు యజ్ఞములు సాంగములైన వేదములు నారాయణార్చనలో పదునారవ అంశతో సరిపోవు. విష్ణుభక్తి లేనివారు చేసిన వేదాధ్యయనము, యాగములు, శాస్త్రములు, తీర్ధ సేవనము, తపము, వ్రతములు అన్నియూ, నిష్పలములే యగును. వేదాంతవేద్యుడు భవరోగవైద్యుడు అనంతమూర్తి  ఆకారమునుదాల్చినవాడు సర్వ శ్రేష్ఠుడు అగు శ్రీమహావిష్ణువును ధ్యానించువారు అచ్యుత పదమును చేరెదరు. అనాదియైన ఆత్మ, అనంతశక్తి జగత్తునకు ఆధారభూతుడు, దేవతలచే స్తుతించబడువాడు, అట్టి జ్యోతిస్వరూపుని అన్నిటికంటే పరుడైన అచ్యుతుని స్మరించిన ఉత్తమసఖుని పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమ భాగమున ప్రాయశ్చిత్తవిధి యను ముప్పదియవ అధ్యాయము సమాప్తము.