నారద మహా పురాణము - పూర్వార్థము
8 - గంగామాహాత్మ్యమ్
సనకమహర్షి పలికేను :- ఆ బాహుమహారాజు భార్యలిరువురు ఇట్లు ఔర్వమహర్షి ఆశ్రమమున భక్తి భావముతో ప్రతిదినము శుశ్రూష చేయుచుండిరి. ఆరు నెలలు గడిచిన తరువాత బాహుమహారాజు పెద్దభార్య మనసులో చిన్నభార్య సంపదను చూచి (గర్భమును) ఈర్ష్య కలిగెను. ఆ ఈర్ష్యతో చిన్న భార్యకు విషమునిచ్చెను. అయినను ఔర్వమహర్షిని భక్తితో సేవించుచుండుట వలన ఆ విషము తన ప్రభావమును చూపలేకపాయెను. ప్రతిదినము అలుకుట, ముగ్గులు పెట్టుట మొదలగు సేవలను ఎంతో భక్తితో చిన్న భార్య చేయుచుండెను. ఆ పుణ్యము విషమును కూడా ఆరగించెను. మూడు నెలలు తరువాత శుశ్రూష వలన పాపములను బోనాడిన చిన్నభార్య శుభముహూర్తమున విషసహితముగా కుమారుని ప్రసవించేను. లోకమున సజ్జన సాంగత్యము ఏ పాపమును నశింపచేయదు ? పుణ్యకర్మలను చేసిన నరులకు లభించని ఆనందమేముండును ? మహాత్ముల పరిచర్య, తెలిసి తెలియక చేసిన పాపములను ఇతరులు చేసెడు ద్రోహములను నశింపచేయును. సత్సంగతి వలన జడుడు కూడా పూజ్యతను పొందును. చంద్రుడు ఒక కళారూపముగా నున్ననూ శంకరునిచే స్వీకరించబడెను కదా! సజ్జనసాంగత్యము ఎప్పుడూ మానవులకు ఉత్తమ వృద్దినే ఇచ్చును. ఇహలోకమున, పరలోకమున మంచియే జరుగును. కావుననే సత్పురుషులు పూజ్యతములు, ఓ మునీశ్వరా ! మహాత్ముల గుణములను ఎవరు చెప్పగలరు ? గర్భమును చేరిన విషము మూడునెలలున్ననూ జీర్ణము కాక అట్లే యుండెను.
తేజోనిధియైన ఔర్వమహర్షి విషముతో - పుట్టిన కుమారుని చూచి జాతకర్మ చేసి 'సగరుడు' అని నామకరణము చేసెను. సగరుని తల్లి ప్రేమతో ఆ బాలుని పోషించుచుండెను. ఔర్వమహర్షి చౌలమును ఉపనయనమును చేసెను. రాజులకు యోగ్యములైన శాస్త్రములను చదివించేను. శైశవమును దాటి సమర్థుడైన సగరుని చూచి మునీశ్వరుడు - మంత్రములతో సర్వశస్త్రాస్త్రములను ప్రసాదించెను. ఇట్లు ఔర్వమహర్షిచే చక్కగా అన్ని విద్యలను నేర్చిన సగరుడు బలవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞుడు, గుణవంతుడు, మంచి బుద్ధి కలవాడు, ధర్మములను తెలిసినవాడు ఆయెను. ధర్మజ్ఞుడు కావున సగరుడు మహర్షికి సమిధలను, దర్భలను, జలమును, పుష్పములను ప్రతిదినము తెచ్చి ఇచ్చుచు సేవించుచుండెను. ఒకనాడు గుణనిధియైన సగరుడు తల్లి వద్దకు వచ్చి నమస్కరించి చేతులు జోడించి వినయముతో ఇట్లు పలికెను.
సగరుడు పలికెను :- ఓ తల్లీ ! నా తండ్రి పేరేమి ? ఏ వంశమువాడు ? ఎచటికి వెళ్ళెను ? ఇదియంతయు వినవలయునని నాకు చాలా కుతూహలమున్నది. కావున చెప్పుము. ఈలోకమున తండ్రిలేనివారు బ్రతికి యున్ననూ మరణించినవారితో సమానుడే. దరిద్రుడైనను తండ్రియున్నచో వాడు కుబేరునితో సమానుడే. తలిదండ్రులు లేనివారికి సుఖముండదు. ధర్మమును విడిచిన మూర్ఖునివలే ఇహపరములలో నిందించబడును. తలిదండ్రులు లేని వాని జన్మ, ఆజ్ఞానుని జన్మ, అవివేకి జన్మ పుత్రుడు లేని వాని జన్మ ఋణగ్రస్తుని జన్మ వ్యర్థము. చంద్రుడు లేని రాత్రివలె, పద్మములు లేని సరస్సువలె, పతిలేని స్త్రీవలే తండ్రిలేని శిశువు వ్యర్ధుడు. ధర్మములేని జంతువువలె, కర్మ చేయని గృహస్థునివలె, పశువులు లేని వైశ్యుని వలె, తండ్రిలేని పిల్లవాడు వ్యర్ధుడు. సత్యములేని వాక్యము వలే, సాధుజనులు లేని సభవలె, దయలేని తపస్సువలె, తండ్రిలేని పిల్లవాడు వ్యర్ధుడు. చెట్లు లేని అడవివలె, నీరువేని నదివలె, వేగములేని అశ్వమువలె తండ్రిలేని పిల్లవాడు వ్యర్ధుడు. యాచనాపరుడెట్లు అందరిలో చులకనౌనో అట్లే తండ్రిలేని పిల్లవాడు చాలా దుఃఖమును పొందును.
ఇట్లు పుత్రుడైన సగరుడు పలుకగా విని తల్లి బరువుగా నిట్టూర్చి దుఃఖముతో జరిగినదంతయూ అతనికి తెలి పెను. తల్లి చెప్పిన దానిని వినిన సగరుడు కోపముతో ఎఱ్ఱబారిన కనులతో శత్రువులను చంపగలనని ప్రతిజ్ఞ చేసెను. ఔర్వమహర్షికి ప్రదక్షిణమును చేసి తల్లికి నమస్కరించి ఔర్వమహర్షి సాగనంపగా బయలుదేరెను. సత్యవాక్కు, పవిత్రుడు అయిన సగరుడు ఔర్వమహర్షి ఆశ్రమమునుండి బయలువెడలి ప్రీతితో తమ కులగురువైన వసిష్ఠమహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. మహాత్ముడైన వసిష్ఠమహర్షికి నమస్కరించి జ్ఞానదృష్టితో అంతా తెలిసియున్న మహర్షికి అంతయూ వివరించెను. వసిష్ఠమహర్షి దయతో సగరునకు ఐస్టాస్త్రమును, వారుణాస్త్రమును, బ్రహ్మాస్త్రమును, ఆగ్నేయమును, వజ్రాయుధమంతటి ఖడ్గమును ధనువును ఇచ్చెను. మంచిమనసుగల సగరుడు వసిష్ఠ మహర్షికి నమస్కరించి ఆశీర్వాదములను, అనుజ్ఞను పొంది వెంటనే బయలుదేరెను. మహాశూరుడైన సగరుడు ఒక్క ధనువుతోనే పుత్రపౌత్రబంధుగణములతో కూడియున్న శత్రువులను స్వర్గవాసులను చేసెను. సగరుని ధనువునుండి వెలువడిన బాణాగ్నికి భయపడిన శత్రువులు కొందరు నశించిరి. కొందరు పారిపొయిరి. మరికొందరు కేశములను విరబోసుకొని పుట్టమీద నిలుచుండిరి. కొందరు గడ్డిపరకలను నోట్లో పెట్టుకొనిరి. మరికొందరు నగ్నముగా నీటిలో ప్రవేశించిరి (ఓడిపోయినవారు మేము నిస్సహాయులము అని తెలుపుటకు జుట్టు విరబోసుకొని పుట్ట నెక్కుట, గడ్డి పరకలను నోట్లో పెట్టుకొనుట, నగ్నముగా నీళ్ళలో ప్రవేశించుట పరిపాటి.) శకులు, యవనులు, ఇతర రాజులు ప్రాణములయందాశతో వసిష్ఠ మహర్షిని శరణువేడిరి. భూమిని గెలిచిన సగరుడు తన శత్రువులను గురుసమీపమును చేరిరని చారుల ద్వారా తెలుసుకొని గురువు సమీపమునకు వెళ్ళెను. సగరుడు వచ్చెనని తెలిసిన వసిష్ఠమహర్షి శరణాగతులను కాపాడవలయునని తన శిష్యులకి హితమును చేయవలయునని నిశ్చయించుకొనెను. శబరులను తలవెంట్రుకలను గొరిగి, యవనులకు వెంట్రుకలను విరబోసీ, ఇతర రోజులకు మీసములను తీసివేసి అందరిని వేదబహిష్కృతులను చేసెను. ఇట్లు వసిష్ఠముని చచ్చినవారితో సమానముగా చేసిన శత్రువులను చూచి సగరుడు నవ్వుతు తపోనిధియైన తన గురువుతో ఇట్లు పలికెను.
సగరుడు పలికెను :- “గురువర్యా ! దురాచారులగు వీరిని రక్షించుట వ్యర్థము. నా తండ్రి రాజ్యమును హరించిన వారిని నేను తప్పక వధించెదను. ధర్మ శత్రువులను ఉపేక్షించుటయే సర్వనాశమునకు, హేతువగును. సంశయముతో పనిలేదు. దుర్జనులు మదించి మొదట జగత్తునంతటిని బాధింతురు. వారే దుర్బలులైనప్పుడు సాధుభావమును ప్రదర్శింతురు. కల్మషహృదయులైన దుర్జనులు వంచనచే తమ బలము పెరుగువరకు సేవచే సెదరు. శత్రువుల దాస భావమును, వేశ్యల అనురాగమును, పాముల సాధుత్వమును మేలుకోరువాడు నమ్మరాదు. తాము బలముతో ఉన్నప్పుడు పరిహసించుచు చూపిన దంతములనే బలహీనులు కాగానే దైన్యముతో చూ పెదరు. లోభులు మొదట నాలుకతో పరుషముగా మాటలాడెదరు. వారే బలహీనులైనచో అదే నాలుకతో చాల దీనముగా మాటలాడెదరు. తన మేలు కోరువాడు, నీతిశాస్త్రార్థములను తెలిసివారు దుర్జనుల సాధుత్వమును సమభావమును నమ్మరాదు. నమస్కరించుచున్న దుర్జనుని కపట స్వభావము కల మిత్రుని, దుష్టురాలైన భార్యను నమ్మినవాడు బ్రతికియు చనిపోయిన వానితో సమానమే. కావున గోరూపముతో నుండి పెద్దపులి పనులను చేయు వీరిని కాపాడకుడు. వీరినందరిని సంహరించి నీ అనుగ్రహముచే భూమిని సేవించెదను.”
వసిష్ఠ ఉవాచ :-
వసిష్ఠమహర్షి పలికెను :- “ఓ మహానుభావా ! బాగు ! బాగు ! నీవు నిజమునే చెప్పుచున్నావు. అయిననూ నా మాట వినినచో ఉత్తమమైన శాంతిని పొందగలవు. నీ ప్రతిజ్ఞకు విరోధులైన వీరిని నేను మొదటనే చంపితిని. చంపినవారిని చంపుటలో ఏమి కీర్తిరాగలదో చెప్పుము. ఓ రాజా ! అన్నీ ప్రాణులు కర్మపాశముతో బంధించబడియుందురు, అయిననూ వారి పాపము వారిని చంపినది. వారిని మరల నీవెందుకు చం పెదవు. పాపము వలన కలిగిన దేహము మొద టే పాపముచే చంపబడినది. పూర్ణమైనందువలన ఆత్మనాశములేనిది. ఇది శాస్త్రనిశ్చయము. ప్రాణులు తాము చేసిన కర్మల ఫలములను అనుభవించుటకు నిమిత్తమాత్రములు. కర్మలకు. మూలము దైవము. ఈ జగమంతయు దైవాధీనమే. దైవమే సాధువులను రక్షించునది. దుష్టులను శిక్షించును. కావున పరతస్త్రలైన మానవులు దేనిని సాధించగలరో చెప్పుము. పాపముచే పుట్టిన శరీరము పాపముచే ప్రవర్తించును. ఇదీయంతయు పాపమూలమని తెలిసీ చంపుట కేల సిద్దపడేదవు. ఆత్మశుద్ధమైననూ దేహమున నుండుటచే దేహి అనుబడుచున్నది. కావున ఈ శరీరము పాపమూలమే. సంశయములేదు. పాపమూలమైన శరీరమును చంపిన నీకు ఏమి కీర్తి కలుగును ? కావున వీరిని హింసించకుము”. ఇట్లు గురువగు వసిష్ణ మహర్షి చెప్పిన మాటలను విని సగరుడు తన కోపమును ఉపసంహరించుకొనెను. చేతిచే శరీరమును స్పృశించి మునులు సగరుని అభినందించిరి. తరువాత అధర్వనిధియైన వసిష్ఠ మహర్షి ఇతరమునులతో కలిసి సగరునికి రాజ్యాభి షేకమును జరి పెను. ఆ సగరమహారాజునకు విదర్బమహారాజైన కొశ్యపుని పుత్రికలు కేశిని, సుమతీ అనువారు భార్యలైరి. సగరునికి రాజ్యపట్టాభి షేకము జరుగుట తెలిసి ఔర్వమహర్షి వనమునుండి వచ్చి మాట్లాడి వెళ్ళెను. ఒకసారి భార్గవవంశజుడు మంత్రవేత్త అయిన ఔర్వమహర్షిని సగరమహారాజు భార్యలు కేశినీసుమతులు ప్రార్థించగా సంతోషించిన మహర్షి వారికి పుత్రులు కలి గేదరని వరమిచ్చెను. మరల క్షణకాలము ధ్యానించి త్రికాలజ్ఞుడైన మహర్షి కేశినిని సుమతిని గూర్చి ఇట్లు పలి కేను.
ఔర్వమహర్షి పలికెను :- “మీ ఇద్దరిలో ఒకరికి వంశకరుడైన ఒక కుమారుడు కలుగును. ఇంకొకరికి అరవై వేలమంది కొడుకులు కలిగెదరు. ఎవరి కెవరు కావలయునో కోరుకొనుడు”. ఔర్వమహర్షి మాటలను విని కేశిని ఒక కుమారుని కోరుకొనెను. సుమతి అరవైవేలమందిని కోరెను. అట్లే కేశినికి ఒక కుమారుడు, సుమతికి అరవై వేల మంది కుమారులు కలిగిరి. . కేశిని కుమారుని పేరు అసమంజసుడు. అసమంజసుడు మదించిన వాని వలె చెడుపనులను చేయుచుండెను. అసమంజసుని చూచి మిగిలిన సగరుని పుత్రులందరు చెడునడతను అలవాటు చేసుకొనిరి. అసమంజసుని బాలచేష్టలలో దౌష్ట్యమును చూచి సగరుడు చింతాక్రాంతుడాయెను. లోకములో దుర్జనసాంగత్యము కష్టములను కలిగించును. ఇనుముతో సంయోగమును పొందిన అగ్నికి సమ్మెట పోటు తప్పదు కదా? అసమంజసునికి అంశుమంతుడను కుమారుడు కలిగేను. అంశుమంతుడు అన్ని శాస్త్రములను తెలుసుకొనిన గుణవంతుడు, ధర్మజుడు, తాత అయిన సగరుని హితమును కోరువాడుగా నుండెను. చెడునడత గల సగరుని పుత్రులందరు లోకమునకు ఉపద్రవమును కలిగించు చుండిరి. ధర్మమును అనుషించువారలకు వీఘ్నములను కలిగించుచుండిరి. బ్రాహ్మణులు విధిపూర్వకముగా యజ్ఞములలో ఇచ్చిన హవిస్సులను దేవతలను కాదని తామే స్వీకరించుచుండిరి. స్వర్గమునుండి రంభాదిదేవతా స్త్రీలను బలవంతముగా - జుట్టుపట్టుకొని తీసుకొనివచ్చి అనుభవించుచుండిరి. వారందరు. మద్యపానపరాయణులై స్వర్గమునుండి పారిజాతాదివృక్షముల శ్రీ నారదీయ మహాపురాణమ్ నుండి పుష్పములను తీసుకొనివచ్చి తమ దేహములను అలంకరించు కొనుచుండిరి. మంచి నడకగల వారిని అపహరించుకొని పోయిరి. సదాచారపరులను నశింపచేసిరి. బలవంతులు అత్యంతపాపులై మిత్రులతో యుద్ధము చేయనారంభించిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు వీరి దౌర్జన్యములను చూచీ మిక్కీలి దుఃఖముతో ఆర్తులై వీరిని నశింపచేయుటెట్లు అని అలోచించస్తా? చివరికి ఒక నిశ్చయమునకొచ్చిన దేవతలందరు పాతాలముననున్న దేవదేవేశుడైన కపిలమహర్షిని రహస్యముగా చేరుకొనిరి. ఎపుడూ ఉత్తమమైన ఆనందరూపముతో నుండి మనసులో పరమాత్మను ధ్యానించుచున్న కపిలమహర్షికి నమస్కరించి స్తోత్రము చేయనారంభించిరి.
దేవతలు పలికిరి :- యోగివి సాంఖ్యయోగమునందు ప్రీతిచెందువాడవు అయిన నీకు నమస్కారము. నరరూపముతో దాగియున్న విష్ణువునకు జయశీలునకు నమస్కారము. పరమాత్మ భక్తుడవు, లోకానుగ్రహకారణము, సంసారమను అరణ్యమునకు దావాగ్నివి, ధర్మపాలనకు సేతువు అయిన నీకు నమస్కారము. రాగద్వేషములు లేని మహానుభావుడవైన నీకు నమస్కారము. సగరపుత్రులచే పీడించబడి నిన్ను శరణువేడిన మమ్ములను కాపాడుము.”
కపిల మహర్షి పలికేను :- “ఓ . సురోత్తములారా ! తమ కీర్తిని, బలమును, ధనమును, ఆయుష్యమును నశింపచేసుకోగోరువారే లోకులను బాధింతురు. ఈ విషయమున ఆశ్యర్యముతో పనిలేదు. నిరపరాధులైన జనులను బాధించగోరువాడు అన్నిలోకములోను పాపభోగమునకు ఆశపడు వాడని తెలియవలయును. కర్మతో, మనసుతో, మాటతో ఎప్పుడూ ఇతరులను బాధించువానిని దైవమే త్వరలో నశింపచేయును. ఈ విషయమున విచారించవలసిన పనిలేదు. కొద్ది రోజులలోనే సగరపుత్రులు నశింతురు.” ఇట్లు కపిల మహర్షి చెప్పిన మాటలను వినిన దేవతలు కపిల మహర్షికి నమస్కరించి స్వర్గమునకు చేరిరి.
ఇంతలో సగర మహారాజు వసిష్ఠాది మహర్షులతో సాటిలేని అశ్వమేధయాగమును చేయుటకు ప్రారంభించేను. ఆ యజ్ఞమున ఏర్పరచిన యజ్ఞాశ్వమును ఇంద్రుడపహరించి పొతాలలోకమున కపిలమహర్షి ఉన్న ప్రాంతమున ఉంచేను. రహస్యరూపముతో ఇంద్రుడపహరించిన అశ్వమును వెతుకుటకు సగరపుత్రులు భూలోకాదిలోకములను తిరిగిరి. ఎచటను అశ్వము కనపించనందున పాతాలమునకు వెళ్ళుటకు నిశ్చయించిరి. ఒక్కొక్కరు ఒక్కొక్క యోజన ప్రాంతమును భూమిని త్రవ్విరి. త్రవ్విన మట్టిని సముద్రతీరప్రాంతమున చల్లిరి. ఆ మార్గమున సగరాత్మజులందరూ పాతాలమునకు వెళ్ళిరి. మదముతో పిచ్చివారై, జ్ఞాన హీనులై సగరపుత్రులు అచట గుఱ్ఱమును వెతుకుచు కోటిసూర్యకాంతితో ధ్యానములో నున్న మహానుభావుడైన కపిలమహర్షిని, అతని సమీపమున యజ్ఞాశ్వమును చూచిరి. అపుడు వారందరూ తొందరపాటుతో చాలా వేగముగా కపిల మహర్షిని చంపుటకు సిద్ధపడి సమీపించిరి. ఇతనిని కొట్టండి ! చంపండి. పట్టుకోండి, పట్టుకోండి అంటూ పలికిరి. అశ్వమును అపహరించి సాధువు వలె, కొంగవలె ధ్యానములో మునిగియున్నాడు. లోకమున కొందరు దుర్జనులు కపటముతో, ఆడంబరముగా ప్రవర్తింతురు. ఇట్లు పలుకుచు కపిలమహర్షిని పరిహసించిరి. ఇంద్రియములను మనసును ఆత్మలో నియమించి సమాధిలో ఉన్న కపిలమహర్షికి వారి ప్రయత్నములు తెలియలేదు. బుద్దీనశించి, మృత్యువు సమీపించిన ఆ సగరపుత్రులు కపిలమహర్షిని పాదములతో కొట్టుచు, చేతులను పట్టుకొనిరి. అపుడు సమాధిని వదిలిన కపిలమహర్షి ఆశ్చర్యముతో లోకోపద్రవమునుచేయు సగరపుత్రులను గూర్చి గంభీర భావముతో ఇట్లు పలికెను.
“ఐశ్వర్యమదముతో మదించిన వారికి, ఆకలి గొన్నవారికి, కాముకులకు, అహంకారముచే మూడులైన వారికి వివేకము కలుగదు. నిధికి ఆధారమగుటచేతనే భూమి మండుచుండును. ఆ నిధినే మానవులనుభవించి మండుటలోఆశ్చర్యమేమున్నది ? దుర్జనులు సుజనులను బాధించుటలో వింతేమున్నది ? నదీ వేగము ఒడ్డున ఉన్న చెట్లను పడవేయునుకదా ! ఐశ్వర్యము, యౌవనము, తెలివి, ఉన్న చోట దారిద్ర్యము, వార్ధక్యము, మూర్ఖత్వము కూడా వెంటనే ఉండును కదా ! కనకపు మహాత్య్మము నెవ్వరు చెప్పగలరు ? కనకమను నామ సామ్యముండుటచే ఉమ్మెంత కూడా మదమును కలిగించును కదా ? అగ్నికి వాయువు మిత్రుడైనట్లు, పన్నగమునకు విషముండునట్లు, దుర్జనునకు సంపద కలిగినచో లోకవినాశము జరుగును. ధనమదముతో గుడ్డివాడైనవాడు చూచుచున్ననూ చూడడు. ఆత్మ హితమును చూచువాడే నిజముగా చూచువాడు.” కోపించిన కపిలమహర్షి ఇట్లు పలికి కనుల నుండి అగ్నిని సృష్టించెను. ఆ అగ్ని సగరపుత్రులనందరిని క్షణకాలములో భస్మము చేసెను. కపిలమహర్షి కన్నులనుండి వెలువడిన అగ్నిని చూచి పొతాలమున నివసించువారు అకాలప్రలయమని భావించి శోకముతో ఆక్రోశించిరి. కపిలమహర్షి నేత్రాగ్నితో తపించి పోయిన రాక్షసులు సర్పములు త్వరగా సముద్రమున ప్రవేశించిరి. సత్పురుషుల కోపము సహించరానిది కదా !
అపుడు యజ్ఞముచేయ నిచ్చయించి ఉన్న (యజ్ఞము చేయుచున్న) సగరమహారాజు వద్ద దేవదూత వచ్చి జరిగిన దంతయూ - వివరించెను. సగరమహారాజు అంతయూ విని మిక్కిలి సంతోషముతో “దుష్టులను దైవమే శిక్షించెను” అని పలికెను. తల్లి అయిననూ, తండ్రి అయిననూ, సోదరుడైననూ, పుత్రుడైనను అధర్మము చేసినవాడు శత్రువే. అధర్మమునందు ఆసక్తుడై లోకులందరితో విరోధమును తెచ్చుకొనువాడు శత్రువే అగును అని శాస్త్ర నిర్ణయము. ఓ మునీశ్వరా ! పుత్ర నాశమైననూ సగరమహారాజు దుఃఖించలేదు. దుర్జనుల నాశము సత్పురుషులకు ఉత్సాహమును కలిగించును. పుత్రులు లేనివారికి యజ్ఞము చేయుటకు అధికారములేదని శాస్త్రము చెప్పుచున్నందున మనమడైన అంశుమంతుని సగరమహారాజు పుత్రునిగా చేసుకొనెను. మంచిబుద్ధిగలవాడు, మాటలను తెలియువారిలో శేషుడు అయిన అసమంజసపుత్రుని యజ్ఞాశ్వమును తెచ్చుటకు నియమించెను. అంశుమంతుడు బిలద్వారములోనికి వెళ్ళి తేజోనిధియైన కపిలమహర్షిని చూచి సాష్టాంగప్రణామముచే సెను. చేతులు జోడించి వినయముతో ఎదుట నిలచి దేవదేవుడు సనాతనుడు శాంతమనస్కుడైన కపిల మహర్షిని గూర్చి పలి కెను.
అంశుమంతుడు పలికెను :- “ఓ మహర్షీ ! మా పినతండ్రుల దుష్ప్రవర్తనను క్షమించుము. సజ్జనులు పరోపకారమునందు ఆసక్తులు. క్షమ గలవారు. సజ్జనులు దుష్టప్రాణుల యందు కూడా దయ చూ పేదరు. - చంద్రుడు చండాల గృహమున వెన్నెలను ప్రసరించకుండునా? సజ్జనుడు బాధించబడుచున్ననూ అందరికి ఆనందమునే కలిగించును. దేవతలు ఆహారముగా తీసుకున్ననూ చంద్రుడు ఆహ్లాదమునే కలిగించు కదా ! చీల్చిననూ, నరికినను, చందన వృక్షము అందరిని, అన్నిటిని పరిమళవంతమునే చేయును. సజ్జనుడును అప్లై చేయును. ఓర్పుతో, తపసుతో, ఆచారముతో నీ గుణములను తెలిసిన మునీశ్వరులు లోకములను పాలించుటకే నీవవతరించితివని తెలియుదురు. ఓ మునీశ్వరా ! పరబ్రహ్మా ! నీకు నమస్కారము. బ్రహ్మ మూర్తివి, బ్రాహ్మణప్రియుడవు అయిన నీకు నమస్కారము. బ్రహ్మ ధ్యానరతుడవైన నీకు నమస్కారము. ఇట్లు అంశుమంతుడు స్తోత్రముచేయగా కపిలమహర్షి ప్రసన్నవదనముతో “నీకు ప్రసన్నుడనైతిని. వరమును కోరుము” అని , పలికెను.
ఇట్లు కపిల మహర్షి పలుకగా అంశుమంతుడు నమస్కరించి “మా పితరులను బ్రహ్మ లోకమును పొందించుము” అని ప్రార్థించెను. ఆ మాటకు మిక్కిలి సంతోషించిన కపిలమహర్షి ఆదరముతో నీ మనుమడు గంగను తీసుకొని వచ్చి నీ పితరులను స్వర్గమును చేర్చునని పలికెను. “నీ మనుమడు తీసుకొచ్చిన పవిత్రజలములు గల గంగానది నీ పితరులను పాపరహితులను చేసి పరమ పదమును చేర్చును. ఈ అశ్వమును నీ తాత వద్దకు చేర్చుము. ఈ అశ్వముతో యజ్ఞము పూర్తియగును.” అంశుమంతుడు ఆ యశ్వమును తాత వద్దకు తీసుకొనివెళ్ళి జరిగినదంతయూ వివరించేను. సగరమహారాజు ఆ యశ్వముతో, బ్రాహ్మణులతో యజ్ఞమును విధిపూర్వకముగా పూర్తి చేసి, తపస్సుచే విష్ణువు నారాధించి పరమ పదమును పొందెను.
అంశుమంతునికి దిలీపుడను పుత్రుడు కలిగెను. ఆ దిలీపునికి భగీరథుడను కుమారుడు కలిగెను. ఈ భగీరథుడే స్వర్గమునుండి గంగను తీసుకొని వచ్చెను. భగీరథుని తపస్సునకు మెచ్చిన బ్రహ్మ గంగను వరముగా నిచ్చెను. ఆ గంగను ఇచట ధరించగల వాడేవడని ఆలోచించి పరమశివుని ఆరాధించి శివుని ద్వారా దేవనదిని భూలోకమునకు తీసుకొని వచ్చి, ఆ గంగాజలముచే సగరపుత్రులను స్పృశింపచేసి పవిత్రులైన వారిని స్వర్గమునకు చేర్చెను. ఈ భగీరథుని వంశముననే సుదాసుడను రాజు పుట్టెను. సుదాసునికి మిత్రసహుడను పుత్రుడు కలిగెను. ఇతను అన్నిలోకములలో ప్రసిద్ది చెందెను. వసిష్ఠమహర్షి శాపము వలన మిత్రసహుడు రాక్షస శరీరమును పొందెను. గంగాబిందువు స్పర్శచే రాక్షస శరీరమును విడిచి మరల రాజాయేను.
ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగామాహాత్మ్యమను ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
