నారద మహా పురాణము - పూర్వార్థము
99 - అగ్ని పురాణాను క్రమణీ నిరూపణమ్
శ్రీ బ్రహ్మ పలికెను :-
అగ్ని దేవుడు వసిష్ఠ మహర్షికి ఈశాన కల్ప వృత్తాంతమున చెప్పిన అగ్ని పురాణమును ఇపుడు నీకు చెప్పెదను. చదువు వారికి వినువారికి సర్వపాప హరములగు అత్యాశ్చర్యమును కలిగించు నాని చరితములు కలది. పదిహేను వేల శ్లోకములు కలది. ఈ పురాణమున మొదటి సర్వావతార కథలు కలవు. తరువాత సృష్టి ప్రకరణము, విష్ణు పూజాదికము, అగ్ని కార్యము, మంత్ర ముద్రాది లక్షణములు సర్వదీక్షా విధానము, అభిషేక నిరూపణము, మండలాది లక్షణములు, కుశాపామార్జనము, పవిత్రారోపవీధి, దేవాలయ వీధి, శాలగ్రామాది పూజ, వేరు వేరు మూర్తుల చిహ్నములు, న్యాసాది విధానము, ప్రతిష్టా పూర్తకము, వినాయకాది పూజా, నానా దీక్షా విధి, సర్వదేవ ప్రతిష్ట, బ్రహ్మాండ నిరూపణము, గంగాది తీర్థ మాహాత్మ్యము, ద్వీప వర్షాను వర్ణనము, ఊర్ధ్వాధోలోక రచన, జ్యోతిశ్చక్రనిరూపణము, జ్యోతిషశాస్త్రము, యుద్ధ జయార్ణ శాస్త్రము, కర్మ షట్కము, మంత్ర మంత్రోషధీ గణము, కుబ్జకాది సమర్చన, షడ్విధ న్యాస విధి, కోటి హోమ విధానము, మన్వంతర నిరూపణము వ్రత దాన నిరూపణము, బ్రహ్మ చర్యాది ధర్మములు, శ్రాద్ధ కల్పవిధి, గ్రహ యజ్ఞము వైదికస్మార్త కర్మలు, ప్రాయశ్చిత్తాది కథనము, ఆయాతిథుల ప్రతాదికములు. వారవ్రతాను కథనము, స్తోత్రవ్రత కథనము, మాసిక వ్రత నిర్దేశము, దీపదానవీధి, నవ వ్యూహార్చనము, నరక నిరూపణము, నాడీ చక్ర సముద్దేశము ఉత్తమోత్తమ మగు సంధ్యావిధి, గాయత్ర్యర్థ నిర్దేశము, లింగ స్తోత్రము, రాజ్యాభిషేక మంత్రోక్తి, రాజ ధర్మకృత్యములు, స్వప్నాధ్యాయము, శకునాది నిరూపణము, మండలాధిక నిర్దేశము, రత్నదీక్షా విధి, కామోక్త నీతి నిర్దేశము, రత్న లక్షణము, ధనుర్విద్యా, వ్యవహార ప్రదర్శనము, దేవాసుర యుద్ధము, ఆయుర్వేద నీరూపణము, గజాది చికిత్స, గజాది శాంతి, గోనరాది చికిత్సా, నానా పూజలు, వివిధ శాంతులు, చంద్ర శ్శాస్త్రము, సాహిత్య శాస్త్రము, ఏకార్ణాది సమాఖ్యానములు, సిద్దశబ్దానుశిష్టి, సర్గాది వర్గకోశము, ప్రలయ లక్షణము, శారీరిక నిరూపణము, నరక వర్ణనము, యోగశాస్త్రము, బ్రహ్మజ్ఞానము, పురాణ శ్రవణ ఫలము ఇవి అగ్ని పురాణమున చెప్పబడినవి. ఈ అగ్నిపురాణమును వ్రాసి బంగారు కమలములతో తిలధేనుయుతముగా మార్గశీర్ష పూర్ణిమనాడు యథావిధిగా, పురాణార్థములు తెలిసిన బ్రాహ్మణునకు దానము చేసినచో స్వర్గలోకప్రాప్తి నిశ్చయము. ఈ అగ్ని పురాణమును వినువారికి, చదువు వారికి ఇహపరలోకములందు ముక్తిని ప్రసాదించును. అగ్నిపురాణాను క్రమణిని వినువారలకు చదువు వారలకు కూడా ఈ ఫలమే కలుగును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున అగ్నిపురాణానుక్రమణీ నిరూపణమను తొంబది తొమ్మిదవ అధ్యాయము.
