నారద మహా పురాణము - పూర్వార్థము
121 - ద్వాధవమాసస్థ ద్వాదశీవ్రత నిరూపణమ్
సనాతనమహర్షి పలికెను :- ఓపుణ్యాత్ముడా ఇపుడు నీకు ద్వాదశివ్రతములను చెప్పెదను. ఈ వ్రతములనాచరించువారు శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రులగుదురు. చైత్రశుక్లద్వాదశినాడు మదన వ్రతమాచరించవలయును. తెల్లని బియ్యముతో నింపిన కొత్త కలశమును స్థాపించవలయును. ఆకలశము చుట్టు నానాఫలమును, చెఱుకుగడలనుంచవలయును. రెండు తెల్లని వస్త్రములతో కప్పవలయును. తెల్లని చందనమును పూయవలయును. సోనో భక్ష్యములనుంచవలయును. శక్తి కొలది బంగారమునుంచ వలయును. ఆకలశము మిద గుడముతో కూడిన తామ్రపత్రమునుంచవలయును. ఆపత్రము. మిద కామరూపి యగు అచ్యుతుని ఉపవశించి మరునాడు గంధాద్యుపచారములతో పూజించవలయును. మరల ప్రొద్దున పూజించి బ్రాహ్మణునకు దానమును గావించవలయును. బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలనీయవలయును. ఇట్లు ఈవ్రతమును ఒక సంవత్సరము గావించి ఘృతధేను సమన్వితముగా సర్వోపస్కారసహితమగు శయ్యను గురువునకు దానము చేయవలయును. కాంచనమును, కామదేవుని, శ్వేతగోవును, వస్త్రములను బ్రాహ్మణదంపతులను పూజించి సమర్పించవలయును. ఈదానమును గావించునపుడు, కామరూపియగు శ్రీహరి ప్రీతి చెందుగాక అని పలుకవలయును. ఇట్లు ఈమదన ద్వాదశీవ్రతమును యధావిధిగా నాచరించినవారు సర్వపాపవినిర్ముక్తులై హరిసామ్యమును పొందెదరు. ఈద్వాదశినాడే భర్తృద్వాదశికా వ్రతముకూడా చెప్పబడియున్నది. చక్కగా ఏర్పరచబడిన శయ్యను అమర్చి ఆశయపై పుష్పములతో మండపమును నిర్మించి ఆ మండపముపై శ్రీసహితుడగు హరిని స్థాపించి గంధాద్యుపచారమునుచేసి, మరునాడు ప్రాతఃకాలమున శయ్యతోపాటు బంగారముతో చేసిన బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలతో సంతోషింపచేసి విడిచిపుచ్చవలయును. ఇట్లు వ్రతము నాచరించువారి దాంపత్యము స్థిరముగా నుండును. ఏడు జన్మలలో ఉభయలోకభోగములననుభవించును. వైశాఖ శుక్లద్వాదశి నాడు ఉపవసించి, జితేంద్రియుడై భక్తిచే మాధవుని గంధాద్యుపచారములచే పూజించి తృప్తిని కలిగించు మధురమగు పక్వాన్నమును ఉదకుంభసహితముగా మాధవుడు ప్రీతిచెందుగాక యని బ్రాహ్మణునకు దానము గావించవలయును. జ్యేష్ఠశుక్ల ద్వాదశినాడు త్రివిక్రముని గంధాదులతో పూజించీ మధురాన్సయుతమగు కరకమును బ్రాహ్మణునకు సమర్పించవలయును. వ్రతమునాచరించు వాడు ఏకభుక్తముగా నుండవలయును. ఈవ్రతముతో సంతోషించిన దేవదేవుడగు త్రివిక్రముడు ఇహమున సకల భోగములను, అంతమున మోక్షమును ప్రసాదించును. ఆషాఢ శుక్లద్వాదశినాడు పన్నెండు మంది బ్రాహ్మణులను క్రమముగా గంధాదులతో పూజించి మధురాన్నమును భుజింపచేసి వారికి వస్త్రములను, దండములను, బ్రహ్మసూత్రములను ముద్రికలను పాత్రలను భక్తితో విష్ణువు ప్రీతి చెందుగాకయని దానము గావించవలయును.
శ్రావణశుక్లద్వాదశినాడు శ్రీధరుని భక్తితో గంధాద్యుపచారములతో పూజించి, బ్రాహ్మణోత్తములను దధితో చక్కగా భోజనము చేయించి, వెండిని దక్షణగా నిచ్చి నమస్కరించి విడువవలయును. ఈవ్రతముతో దేవేశుడగు శ్రీధరుడు ప్రీతి చెందుగాక యని పలుక వలయును. భాద్రపద శుక్లద్వాదశినాడు వామనుని చక్కగా పూజించి వామనుని ముందు పన్నెండు మంది బ్రాహ్మణులను పాయసముతో భుజింపచేసి సువర్ణమును దక్షిణగానిచ్చి శ్రీమహావిష్ణువునకు ప్రీతి పాత్రుడగును. ఆశ్వయుజ శుద్ధ ద్వాదశినాడు పద్మనాభుని గంధాద్యుపచారములతో పూజించి, పద్మనాభునిముందు బ్రాహ్మణులను మధురాన్నముతో భుజింపచేసి సువర్ణమును దక్షిణగా నీయవలయును. ఈవ్రతముతో సంతోషించిన పద్మనాభుడు ఇహమున వాంఛితసకలభోగములను శ్వేతద్వీపగతిని ఇచ్చును. కార్తిక కృష్ణద్వాదశినాడు గోవత్సద్వాదశీవ్రతము చెప్పబడినది. ద్వాదశినాడు తామ్రపాత్రపై సుగంధముగల చందనాదులతో వత్ససహితమగు గోవును లిఖించి పుష్పమాలతో పూజించి, యధావిధిగా పుష్పాక్షతతిలలో ఆర్ఘ్యమునిచ్చి ఈమంత్రముతో గోపాదములమున జలమును విడువవలయును. క్షీరసాగర సంజాతా! సురాసుర నమస్కృతా సర్వదేవమయా దేవీ సర్వదేవాలంకృతా గోవులకు మాతా మామాతా ఈ ఆర్యమును గ్రహించుము. నీకు నమస్కారము తరువాత మాషాదిసంసిద్ధములగువంటకములను నివేదన చేయవలయును. ఇట్లు తమతమ విభవానుసారముగా అయిదు కాని పది కాని ఒకటి కాని గోవులను ఓ సురభీ! జగన్మాతా నిత్యము విష్ణుపదమున నుండు దానా సర్వదేవస్వరూపిణీ నేనిచ్చు ఈ గ్రాసమును భుజించుము. సర్వదేవస్వరూపిణీ! సర్వదేవాలంకృతా నా అభిలాషను సఫలము చేయుము. అని పలికి గ్రాసమునీయవలయును. ఈ దినమున తైలపక్వమును, స్థాలీపక్వమును, గోక్షీరమును, గోఘృతమును, గోధధి, తక్రమును విడువవలయును. కార్తీక శుక్లద్వాదశినాడు సావధానముతో దామోదరుని గంధాద్యుపచారములతో చక్కగా పూజించి, దామోదరుముని ముందు పన్నెండు బ్రాహ్మణులను పక్వాన్నముతో భుజింపచేయవలయును. తరువాత నీటితో నింపిన కుంభములను వస్త్రచ్ఛన్నము గావించి చక్కగా పూజించి మోదక స్వర్ణములను ప్రీతితో వారికి సమర్పించవలయును. ఇట్లు చేసినచో శ్రీమహావిష్ణువునకు ప్రీతిపాత్రుడగును. అఖిలభోగములనను భవించి దేహాంతమున విష్ణుసాయిజ్యమును పొందును. ఈదినముననే నీరాజనవ్రతము కూడా చెప్పబడినది. దానిని తెలియుము. సాయంకాలమున నిదురించి లేచిన జగన్నాధుని చక్కగా అలంకరించి, తాను అలంకరించు కొని కొత్తగా అగ్నిని కల్పించి, మంత్రములతో పూజించి, జ్వలించిన అగ్నిలో హోమము గావించి రౌప్యదీపకయామునమునందు గంధ పుష్పాదులచే అర్చించిన దానితో శ్రీహరికి నీరాజనమును గావించవలయును. శ్రీహరి వెంట అక్కడే ఉన్న లక్ష్మీదేవిని, సరస్వతిని, చండికను, సూర్యుని, శంకరుని, గౌరీదేవిని, యక్షుని, గణపతిని, నవగ్రహములను, మాతృదేవతలను, పితరులను పర్వతములను, సర్పములను, అందరికీ క్రమముగా నీరాజనమీయవలయును. గోవులను నీరాజనము గావించవలయును. మహష్యాదులకు మండలమును గావించవలయును. నమశ్శబ్దములచే జయశబ్దములచే, ఘంటా శంఖా ధ్వనులచే, సిందూరము పూయబడిన శృంగములను, చిత్రాంగముల బహువిధవర్ణములతో, నీరాజన మహోత్సవములతో గోవుల కోలాహలము జరుగుచుండగా, సలక్షణములగు అశ్వములను, మదించిన గజములను, సర్వవిధములగు రాజచిహ్నములగు ఛత్రాదులను పూజించి స్వయముగా ఆదరముతో నీరాజనము నిచ్చి, శంఖభేర్యాది ఘోషములతో నానారత్న నిర్మితమగు సింహాసనమున చక్కగా అలంకరించుకొని కూర్చుం డవలయును. తరువాత సర్వలక్షణ లక్షితయగు వేశ్యకాని, కులాంగన కాని రాజుగారి శిరస్సుపై మెల్లగా నీరాజనము నీయవలయును. ఇట్లు మహారాజులు లేదా ధనవంతులు ఆరోగ్యమును కోరువారు ప్రతిసంవత్సరము ఈమహా శాంతిని జరుపవలయును. ఇట్లు సర్వోత్తమ మగు నీరాజన శాంతిని జరిపిన రాష్ట్రమున, పురమున రోగములు నశించి ఆరోగ్యము విలసిల్లును.
మార్గశీర్షశుక్ల ద్వాదశినాడు సర్వోత్తమమగు సాధ్యవ్రతమునాచరించవలయును. మనోభవుడు, ప్రాణుడు, నరుడు, వీర్యవంతుడు, చితి, హయము, నృపుడు, హంస, నారాయణుడు, విభువు, ప్రభువు అని పన్నెండు మంది సాధ్యులనబడుదురు. ఈ పన్నెండు మందిని తండులములతో కల్పించి గంధపుష్పాదులచే పూజించవలయును. తరువాత పన్నెండు మంది బ్రాహ్మణులను భుజింపచేసి, మంచిదక్షిణలనిచ్చి, నారాయణుడు ప్రీతిచెందుగాక యని వారిని విడువవలయును. ఈదినముననే ద్వాదశాది వ్రతము కూడా చెప్పబడినది. ఈవ్రతమున ద్వాదశాదిత్యులను పూజించవలయును. ధాత,మిత్రుడు, అర్యమా, పూషా, శుక్రుడు, అంశుడు, వరుణుడు, భగుడు, త్వష్టా, వివస్వాన్, సవితా, విష్ణువు అనువారలు ద్వాదశాదిత్యులు. ప్రతి మాసమున శుక్ల ద్వాదశినాడు ద్వాదశాదిత్యులను శ్రద్ధతో పూజించి ఒక సంవత్సరము వ్రతమునాచరించవలయును. వ్రతాంతమున ద్వాదశసువర్ణప్రతిమలను యధావిధిగా పూజించి, పన్నెండు మంది బ్రాహ్మణోత్తములను మధురాన్నములతో భుజింపచేసి చక్కగా సత్కరించి వారికి ఒకొక్కరికి ఒక్కొక్క ప్రతిమను అర్పించవలయును. ఈద్వాదశాదిత్య వ్రతము నాచరించినవాడు ద్వాదశాదిత్యమనబడు సూర్యలోకమనుపొంది, అచట చాలాకాలము సకల భోగములననుభవించి భూలోకమున ధర్మాత్ముడు రోగశూన్యుడు అగు మనుష్యునిగా జన్మించును. మరలవ్రతపుణ్యవశమున మరలవ్రతము చేయును. ఈ పుణ్యలోకముతో సూర్యమండలమును ఛేదించుకొని నిరంజనము, నిరాకారము నిర్ద్వంద్వము అగు పరబ్రహ్మను చేరును. ఈదినముననే అఖండవ్రతము చెప్పబడినది. బంగారముతో జనార్ధన మూర్తిని నిర్మించి, గందపుష్పాదులచే పూజించి, ఆమూర్తియందు, ప్రతిమాసము పన్నెండుమంది బ్రాహ్మణులను భుజింపచేయవలయును. వ్రతము నాచరించువాడు జితేంద్రియుడై రాత్రిభోజనమును మాత్రమే చేయలయును. సంవత్సరాంతమున ఆ జనార్ధన మూర్తిని చక్కగా పూజించి ధేను సహితముగా గురువునకు సమర్పించి ఇట్లు ప్రార్థించవలయును. నేను నూరుజన్మలలో ఏకొద్ది అఖండ వ్రతమునాచరించిననూ పూజ్యుడా! మి అనుగ్రహమువలన ఇపుడు అఖండమునిచట ఉండునిండు. తరువాత పన్నెండుమంది బ్రాహ్మణులను ఖండములతో పాయసములతో చక్కగా భుజింపచేసి సువర్ణదక్షిణ నిచ్చి నమస్కరించవలయును. ఇట్లు వ్రతము నాచరించి జనార్ధనుని సంతోషింపచేసి స్వర్ణవిమానముతో విష్ణులోకమును చేరును. పుష్యబహుళ ద్వాదశినాడు రూపవ్రతము చెప్పబడినది. దశమితిధిన యధావిధిగా స్నానమాచరించి, శ్వేతగోవుయొక్క కాని ఒకేరంగు కలగోవు యొక్క కాని పేడను భూమిమీద పడకముందే ఆకాశము నుండియే స్వీకరించవలయును. ఆగోమయముతో నూటా ఎనిమిది ముద్దలను చేసి తామ్రపాత్ర యందు కాని మృణ్మయపాత్రయందు కాని ఉంచి పట్టుకొని ఎండలో ఆరబెట్టవలయును. ఏకాదశినాడు ఉపవసించి శ్రీమహావిష్ణువు యొక్క సువర్ణపతిమను యధావిధిగా చక్కగా పూజించి, ఆరాత్రి మంగళగీతములతో, వాద్యములతో, స్తోతపాఠములతో, జపాదులతో జాగరణ చేయవలయును. తరువాత ద్వాదశినాడు ప్రాతఃకాలమున తలపాత్రపై నున్న ప్రతిమను, జలపూర్ణఘటమున నుంచి షోడశోపచారములచే పూజించి కట్టెలను వరిపిడిచేసి కొత్తగా అగ్నిని ఉత్పత్తిచేసి, యధావిధిగా పూజించి ఒక్కొక్క ఎండిన గోమయపిండమును (పిడికను) నువ్వులతో నేయితో కలిపి ద్వాదశాక్షర మంత్రము చే (ఓంనమోభగవతే వాసుదేవాయ) అష్టోత్తర శతమునుహోమము గావించవలయును. తరువాత ప్రీతితో ఆనందముతో బ్రాహ్మణులను పాయసాన్నములను భుజింపచేయవలయును. ఘటసహితముగా సువర్ణప్రతిమను గురువునకు అర్పించవలయును. బ్రాహ్మణులకు శక్తిననుసరించి దక్షిణలనిచ్చి, నమస్కరించివిడిచిపెట్టవలయును. ఇట్లు ఈవ్రతమును ఆదరముతో నాచరించి స్త్రీ కాని పురుషుడు కాని చక్కని రూపమును సౌభాగ్యమును పొందును. ఈ విషయమున ఆలోచించవలసిన అసవరము లేదు.
పుష్యశుక్లద్వాదశినాడు సుజన్మద్వాదశీవ్రతమునాచరించవలయును. ఆనాడు యధావిధిగా స్నానమాచరించి వార్షికవ్రతమును స్వీకరించవలయును. మొదట గోశృంగజలమును త్రాగి గోవునకు ప్రదిక్షణము గావించి ప్రతిమాసమున శుక్లద్వాదశినాడు ఇట్లు దానమును గావించవలయును. ఘృతప్రస్థమున క్రమముగా ద్రోహులు యవలు రెండొంతులు, హోమతిలలు, ఆఢకార్థము, పయోఘటము, ఒకమాసము వెండి, తృప్తిని కలిగించు మిష్టపక్వము, ఛత్రము, మాసార్థ హేమప్రస్థము, ఉత్తమపాణితము, చందనము, పలికము, వస్త్రము, పంచహస్తపరిమితము. ఈ వస్తువులను మాసికదానము గావించి, యధాక్రమముగా గోమూత్రమును, జలమును నేతిని, శాకమును నాలుగు విధములుగా వండినదానిని, పెరుగుకలిపిన క్షీరమును, ప్రతిమాసము ప్రాశన గావించవలయును. ఇట్లు ఒక సంవత్సర కాలము వ్రతము నాచరించి సూర్యుని బంగారు ప్రతిమను నిర్మించి తామ్రపాత్రలో నుంచి, యధావిధిగా పూజించి ధేను సహితముగా స్వర్ణప్రతిమను గురువునకు సమర్పించి నమస్కరించవలయును. పన్నెండు మంది బ్రాహ్మణులను భుజింపచేసి వారికి దక్షిణనీయవలయును. ఇట్లు వ్రతమునాచరించినచో ఉత్తమకులమున రోగరహితుడుగా, ధనధాన్యయుతడుగా, ఇంద్రియనిగ్రహముతో పూజించి సాలగ్రామముఖమున సువర్ణము నుంచి వెండిపాత్రలో సాలగ్రామమునుంచి, తెల్లని రెండు వస్త్రములచే కప్పి వేదజ్జునకు దానము చేసి, అతనికి భోజనము పెట్టవలయును. ఇట్లు చేసి ఏకభుక్తముగా నుండి విష్ణువును ధ్యానించుచు ఇహలోకభోగములననుభవించి విష్ణులోకమును చేరును. ఫాల్గుణశుక్లద్వాదశినాడు శ్రీహరిసువర్ణప్రతిమను గంధపుపుష్పాదులచే పూజించి వేదజ్జున కీయవలయును. పన్నెండు మంది బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణనిచ్చి, విడిచి తాను బంధువులతో కలిసి భుజించవలయును. త్రిస్టశ, ఉన్నీలనీ పక్షవర్దానీ,వంజులీ, జయా, విజయా, యజనీ అపరాజితా, అను ఈ ఎనిమిది ద్వాదశులు పాపనాశకములు. కావున ఎపుడూ ఉపవసించవలయును.
నారదమహర్షి పలికెను :- ఈ ద్వాదశులకు లక్షణమేమిటి? ఫలమేమిటి. ఇట్లే పుణ్యప్రదములు ఇంకను ఏవికలవు? వాటిన్నింటిని నాకు తెలుపుడు.
సూతమహర్షి పలికెను :- ఇట్లు నారదమహర్షి సనాతనమహర్షిని అడుగగా సనాతన మహర్షి పరమభాగవతోత్తముడగు నారదుని ప్రశంసించి ఇట్లు పలికెను.
సనాతనమహర్షిపలికెను :- సోదరా, సాధు జనుల సంశయమును తొలగించునట్లుగా చక్కగా అడిగితివి. ఇపుడు నేను ఈ మహాద్వాదశుల లక్షణలను ఫలములను చక్కగా చెప్పెదను. సూర్యోదయమునకు ముందే ఏకాదశి నివృత్తయైనచో ఆద్వాదశిత్రిస్ర్ప శాయనబడును. మహాఫలదాయినియగును. ఈద్వాదశినాడు పవసించి గోవిన్దుని పూజించినవాడు సహస్రాశ్వమేధఫలములను పొందును. అరుణోదయ కాలమున ఏకాదశినిధయైనచో ఆఏకాదశిని విడిచి ద్వాదశినాడుపవసించవలయును. ఆనాడు వాసుదేవుని చక్కగా పూజావిధానముతో పూజించి సహస్రరాజసూయయజ్ఞఫలమును పొందును. ఈద్వాదశిఉన్మీలితా యందురు. సూర్యోదయ కాలమున దశమి ఏకాదశిని స్పృశించినచో ఆ ఏకాదశి వంజులికా యనబడును. దానిని విడిచి ద్వాదశిన ఉపవసించవలయును. ఈనాడు సంకర్షణ దేవుని గంధాద్యుపచారములచే భక్తితో చక్కగా పూజించవలయును. ఇది అందరికి అభయప్రదము. ఈద్వాదశి మహా ద్వాదశి సర్వయజ్ఞ ఫలప్రద. సర్వపాపహార, సర్వసంపత్ర్పదాయిని. పూర్ణిమాఅమావాస్యలు వృద్ధిచెందియున్నచో వచ్చు ద్వాదశి పక్ష వర్ధని యందురు. ఇది మహాఫలప్రద. ఈనాడు జగత్పతి యగు ప్రద్యుమ్నుని పూజించవలయును. శుక్లపక్షమున ద్వాదశిమఘానాక్షత్ర యుక్తమైనచో దానిని జయాలందురు. ఈ ద్వాదశిసర్వశత్రు వినాశిని. ఈనాడు సర్వకామప్రదుడు సర్వసౌభాగ్యదాయకుడు రమాపతియగు అనిరుద్ధుని పూజించవలయును. శుక్లపక్షమున ద్వాదశి శ్రవణానక్షత్రయుక్తమగుచో విజయాఅనబడును. ఈనాడు సర్వభోగపరాయణుడు సర్వసౌఖ్యప్రదుడగు గదాధరుని పూజించ వలయును. ఈనాడుపవసించిన వాడు సర్వతీర్థఫలమును పొందును. శుక్లద్వాదశి రోహిణీనక్షత్రయుక్తమైనచో జయస్తీ యనబడును. ఇది మహాపుణ్యప్రదా. ఈనాడు సర్వసిద్ధిప్రదుడగు వామనుని పూజించ వలయును. ఈనాడు పవసించినచో సర్వవ్రతఫలప్రదము. సర్వదానఫలప్రదము. భుక్తిముక్తి ప్రదాయిని. శుక్ల పక్షద్వాదశి పుష్యమీ నక్షత్ర యుక్తమైనచో అపరాజితాయనబడును. ఇది సర్వజ్ఞాన ప్రదాయిని. ఈనాడు ఆనామయుడు, సర్వైశ్వర్యప్రదుడు, పుత్రపౌత్ర వివర్థనుడు, సంసార పాశవిచ్చత్తికారకుడు జ్ఞానసాగరుడగు నారాయణుని పూజించవలయును. ఈనాడు పవసించి బ్రాహ్మణులను భుజింపచేసినచో ముక్తుడగును. ఆఫౌఢ శుక్ల ద్వాదశి అనూరాధా నక్షత్ర యుక్తమైనచో వ్రతద్వయమును చేయవలయును. ఒకదేవతగా రెండువ్రతములు చేయుట ఈవిషయమున దోషముకాదు. భాద్రపద శుక్లద్వాదశి శ్రవణా నక్షత్రయుక్తమైనచో, కార్తీక శుద్ధ ద్వాదశి రేవతీ నక్షత్ర యుక్తమైనచో వ్రతద్వయము నాచరించవలయును. ఈద్వాదశులకంటే ఇతర ద్వాదశులలో ఏకభుక్తము నాచరించ వలయును. సహజముగా ఈవ్రతము సకలపాతకనాశనము. ద్వాదశీసహితముగా ఏకాదశీవ్రతము నిత్యము. ఈవ్రతమునకు ఉద్యాపనము లేదు. జీవితాంతము నాచరించవలయును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమునద్వాదశమాసస్థిత ద్వాదశీవ్రత నిరూపణమను నూటా ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.
