నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

15 - భగీరథస్య గంగానయనోద్యమవర్ణనమ్

ధర్మరాజు పలికెను : పాప భేదములను స్థూల యాతనలను చెప్పెదను. నరకములు చాలా భయంకరములు కావున ధైర్యమును వహించి వినుము. దుష్టస్వభావములు కల పాపాత్ములు యే యే నరకములలో పడి యాతనలను పొందెదరో ఆ నరకములను గూర్చి చెప్పేదను. ఇవి యన్నియు భయంకర ఫలముల నిచ్చును. తపన-వాలుకా-కుంభ-మహారౌరవ-గౌరవకుంభీపాక-నిరుచ్ఛ్వాస-కాలసూత్ర-ప్రమర్ధన-అసి పత్రవనములు లౌలాభక్షము, హిమోత్కటము, మూషావస్థ, వసామాపము, వైతరణీనది, మూత్రపానము, పురీషప్రదము, తప్త శూలము, తప్తశిల, శాల్మలీద్రుమము, శోణితకూపము, ఘోరమైన శోణిత భోజనము, శ్వమాంస భోజనము, వహ్నిజ్వాలానివేశనము, శిలావృష్టి, శస్త్రవృష్టి, వహ్నివృష్టి, క్షారోదకము, ఉష్ణతోయము తపొయః పిండభక్షణము, శిరశ్శోషణము, మరుతపతనము, పొషాణవర్షము, కృమిభోజనము, కారోదపానము, భ్రమణము, క్రకచదారణము, పురీషలేపనము, పురీషభోజనము, రేతఃపానము, సర్వసంధిదాహనము, దూమపానము, పొశబంధము, నానాశూలానులేపనము, అంగార శయనము, ముసలమర్లనము, బహుభాషయన్తకషణము, ఛేదనము, పతనోత్పతనము, గదాదండాది పీడనము, గజదంతప్రహరణము, సోనాసర్పదంశనము, నాసికా ముఖములలో శీతాంబు సేచనము, ఘోరక్షారాము పానము, లవణ భక్షణము, స్నాయుచ్ఛేదము, స్నాయుబగ్ధము, ఆస్థిచ్ఛేదము, క్షారామ్బుపూర్ణరంధ్రప్రవేశము, మాంసభోజనము, పిత్తపానము, మహాఘోరమైన శ్లేష్మ భోజనము, వృక్షాగపతనము, జలాన్తర్మజ్జనము, పాషాణధారాశయనము, కంటక శయనము, పిపీలికాదంశనము, వృశ్చిక పీడనము, వ్యాఘపీడ, శివాపీడ, మహేషపీడనము, కర్ధమ శయనము, దుర్గంధపరిపూరణము, ఆర్ధశయనము, మహాతిక ని షేవణము, అత్యుష్ణతైలపానము, మహాకటు ని షేవణము, కషాయోదక పానము, తప్తపాషాణ తక్షణము. అత్యుష్ణ, శీతస్నానము, దశన శీర్ణనము, తప్తాయ శ్శయనము, అయోభారబంధనము. ఇటువంటి యాతనలు కొన్ని కోట్లు కలవు. వేల సంవత్సరములలో నేను కూడా చెప్పజాలను. ఏ పాపమునకు ఏ యాతన వచ్చునో దానినంతనూ చెప్పెదను వినుము.

బ్రహ్మ హత్యను చేయువారు, సురాపానమును చేయువారు, చౌర్యమును చేయువారు, గురు పణీసంగమమును చేయువారు ఈ నలుగురు మహాపాతకులు అనబడుదురు. వీరితో సంబంధము కలవాడు అయిదవ మహాపాలకి యగును. భోజనము చేయుచున్న పంక్తిలోని అందరికీ ఒకే విధముగా వడ్డించక భేదమును చూపుదారు, భగవంతునికి నివేదన చేయకనే తినువారు, ఎల్లపుడూ బ్రాహ్మణులను దూషించువారు, కఠినముగా ఆదేశమిచ్చుచారు, చేదమును అమ్ముకొనువారు ఈ అయిదుగురు బ్రహ్మఘాతకులు. ధనాదికమునిచ్చెదనని బ్రాహ్మణుని పిలిచి, తరువాత లేదనువాడు కూడా బ్రహ్మఘాతకుడే. స్నానము కొఱకు కాని పూజించుటను కాని వేళ్ళు బ్రాహ్మణునికి విఘ్నమును కల్పించువాడు కూడా బ్రహ్మఘాతకుడే. పరులను నిందించుటలో, తనను శ్లాఘించుకొనుటలో ఆసక్తి చూపువాడు, అసత్యమును పలుకుటతో ఆనందించువాడు కూడా బ్రహ్మఘాతకుడనబడును. ఇతరులను బాధించుటలో ఆసక్తి కలవాడు. ఇతరుల దోషములనే సూచించువాడు, డాంబికాచారము కలవాడు, బ్రహ్మఘాతకుడే. ఎప్పడూ ఎదుటివానినుండి పరిగ్రహించువాడు, ప్రాణులను వధించు స్వభావము కలవాడు అధర్మమును ఆమోదించువాడు బ్రహ్మఘాతకుడనబడును. ఇట్లు బ్రహ్మహత్యతో సమానమైన పాపము బహువిధములుగా నుండును.

సురాపానముతో సమానమగు పాపమును సంగ్రహముగా చెప్పెదను. వేశ్యా భోజనమును భుజించుట, వేశ్యలను సేవించుట, పతితుల అన్నమును తినుట సురాపానముతో సమానము. చేయుచున్న ఉపాసనను పరిత్యజించుట, దేవలు. (ఆలయాలలోని అర్చకుల) భోజనము, సురాపానము చేయు స్త్రీతో సంగమించుట సురాపానముతో సమానము. శూద్రునిదే ఆహ్వానించబడి భోజనము చేయువాడు అన్ని ధర్మములనుండి బహిష్కరించబడి సురాపి అనబడును. శూద్రుని ఆజ్ఞచే భృత్య కర్మ చేయువానికి సురాపానసమఫలము లభించును. ఇట్లు పలువిధములైన పాపములు సురాపాన సమములుగా చెప్పబడినవి.

ఇపుడు బంగారమును చౌర్యము చేసినందువలన కలుగు పాపముతో సమాన పాపములను చెప్పెదను వినుము. కందమూలములను, ఫలములను, కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములను, రత్నములను అపహరించుట సువర్ణ సేయముతో సమానము. రాగి, ఇనుము, సీసము, ఇత్తడి, నెయ్యి, తేనె మొదలగు వాటిని సుగంధద్రవ్యములను, పట్టువస్త్రములను అపహరించుట స్వర్ణ సేయముతో సమానము. వక్కలను, నీటిని చందనమును, ఆకురసములను అపహరించుట స్వర్ణస్తేయముతో సమానము. పితృయజ్ఞమును వదిలి పెట్టుట, ధర్మకార్యములను లో పింపచేయుట, యతులను నిందించుట స్వర్ణ చౌర్యముతో సమానము. తినదగిన పదార్ధములను, ధాన్యములను హరించుట రుద్రాక్ష హరణము స్వర్ణచౌర్యముతో సమము. తోబుట్టువులైన అక్కచెల్లెలు మొదలగు స్త్రీల సంగమము, కొడుకు భార్యను సంగమించుట, రజస్వలా స్త్రీ సంగమము గురు భార్యాసంగమముతో సమానము. హీనజాతి స్త్రీని సంగమించుట, మద్యపానము చేయు స్త్రీని సంగమించుట, పరస్త్రీ గమనము, గురుదారా గమనముతో సమానము, అన్న భార్యను కలియుట, మిత్రుని భార్యను కలియుట, విధవాగమనము , గురదారా. గమనముతో సమానము. కాని కాలములో పనిచేయుట, పుత్రికాసంగమము, ధర్మలోపము, శాస్త్రానిన్ల, గురు భార్యా . గమనముతో సమానము. ఇటువంటివన్నీ మహాపాపములనబడును. వీటిలో ఏ ఒక్కదానిని చేసినను మహాపాపియే యగును. శాంతులైన పరమరులు ఈ మహాపాపములకు నిష్కృతిని (ప్రాయశ్చిత్తమును) కనుగొనిరి. ఇక ఇపుడు ప్రాయశ్చిత్తములు లేని పాపములను చెప్పెదను వినుము.

ఇవి అన్ని పాపములతో సమానమైన పాపములు. మహానరకము నిచ్చునవి. బ్రహ్మహాత్యాది పాపములకు ఏదో యొక విధముగా నిష్కృతి లభించును. బ్రాహ్మణులను ద్వేషించువారికి ఏ విధముగానైనను నిష్కృతి లేదు. నమ్మిన వారిని చంపిన వారికి, కృతఘ్నులకు; శూద్ర స్త్రీ సంగమమును చేయువారికి నిష్కృతి లభించదు. శూద్రాన్నముతో పుష్టిని పొందిన శరీరము గలవారికి చేందనిందను చేయువారికి, సత్కథానిన్తకులకు ఇహపరములలో నిష్కృతి లేదు. గొప్ప ఆపదలోనైను బౌద్దాలయ ప్రవేశము చేసిన బ్రాహ్మణునికి నూరు ప్రాయశ్చిత్తములు జరిపినను నిష్కృతి లభించదు. బౌద్దులు వేదనిన్హాకులు కావున పాషండులనబడుదురు. ధర్మ బహిష్కృతులు కావున బ్రాహ్మణులు బౌద్ధులవైపు చూడరాదు. తెలిసియైనను తెలియకనైనను బ్రాహ్మణుడు బౌద్దాలయమున ప్రవేశించరాదు. తెలిసి ప్రవేశించినచో నిష్కృతి లభించదు. ఇది శాస్త్ర నిశ్చయము. ఇవి చాల పెద్ద పాపములు కావున కోటి కల్పములు నరకముననుభవించవలయును. ప్రాయశ్చిత్తములు లేని ఇతర పాపములు చాలా కలవు. ఆ పాపములు వాటి వలన కలుగు నరకములను చెప్పెదను. వినుము.

పైన చెప్పబడిన పాపులందరిలో మహాపాపులు మాత్రము ఒక్కొక్క మహాపాపమునకు ఒక్కొక్క యుగమున నరకమున నుందురు. తరువాత భూలోకమునకు వచ్చి ఏడు జన్మలు గర్గభములుగా, తరువాత ఎపుడూ కొట్టబడు శరీరములు గల కుక్కలుగా పదిజన్మలు పుట్టెదురు. తరువాత నూరు సంవత్సరములు మలములో పురుగులుగా, పన్నెండు జన్మలు పాములుగా, తరువాత వేయి జన్మలు మృగాది పశువులుగా, నూరు సంవత్సరములు, స్థావరములుగా, తరువాత బల్లులుగా, తరువాత ఏడు జన్మలు చండాలులుగా, తరువాత పదునారు జన్మలు హీనజాతులైన శూద్రులుగా, తరువాత రెండు జన్మలు. దరిద్రులుగా వ్యాధి పీడితులూ ఎపుడూ ఎదుటివారినుండి తీసుకొను వారిగా పుట్టి మరల నరకమునకు వెళ్ళెదరు. అసూయ నిండిన మనసు కలవారు రౌరవమను నరకమునకు వెళ్ళెదరు. ఆ రౌరవమున రెండు కల్పములుండి నూరు జన్మలు చండాలులుగా పుట్టెదరు. గోవులకు అగ్నికి బ్రాహ్మణులకు అర్పించవద్దని చెప్పినవారు నూరు జన్మలు కుక్కలుగా పుట్టి చండాలులుగా పుట్టెదరు. తరువాత మలకీటకములుగా, తరువాత మూడు జన్మలు పెద్దపులులుగా పుట్టి చివరికి మరల నరకమునకు వెళ్ళి ఇరువది యొక్కయుగములు అచటనుందురు. పరులను నిందించువారు, కఠినముగా మాట్లాడువారు దానములకు విఘ్నమును కలిగించువారు చోరులతో సమానము, వారు రోట పడవేయబడి రోకళ్ళతో పొడి చేయబడుదురు. తరువాత బాగుగా కాల్చిన పాషాణమును మూడుసంవత్సరములు పట్టుకొని యుండవలయును. తరువాత ఏడు సంవత్సరములు కాల సూత్రముతో చీల్చబడుదురు. ఇట్లు పరద్రవ్యములన నపహరించినవారు తాము చేసిన కర్మలను గూర్చి విచారించుచు నరకాగ్నిలో పాకము చేయబడుదురు (వారి పాపములు నరకములో పండునని భావము).

చోరులకు ఇతరుల ద్రవ్యముల జాడను తెలిపి చౌర్యమును చేయుటకు సహకరించిన వారికి కలుగు నరకమును చే ప్పెదను వినుము. చేయి యుగములు బాగుగా కాల్చిన ఉక్కుముద్దను తినుచుందురు. బాగుగా కాల్చిన ఇనుప పట్కారులతో నాలుకను బయటకులాగుచుందురు. తరువాత సగము కల్పము మహాఘోరమైన నరకములో ఊపిరి పీల్చక పడియుందురు. ఇక ఇపుడు పర స్త్రీ సంగమమునందు ఆశ కలవారికి కలుగు నరక యాతనలను తెలి పెదను. బాగుగా కొల్పబడిన రాగి శరీరము కల స్త్రీలు కాల్చబడిన రాగి ఆభరణములను ధరించి ఇదివరకు వీరు కోరిన స్త్రీల వంటి రూపములతో వచ్చి బలవంతముగా రమీంచెదరు. ఆ స్త్రీలను చూచి భయముతో పారిపోవుచున్న పురుషుని బలాత్కారముచే పట్టుకొని పురుషుడు చేసిన పాపకార్యములను స్త్రీ సంగమములను చెప్పుచు నరకముల లోనికి తీసుకొని వెళ్ళి బలవంతముగా రమించేదరు. అట్లే భర్తను వదిలి పరపురుషునితో రమించిన స్త్రీలను నరకములో బాగుగా కాల్చిన ఉక్కు శరీరములు కల పురుషులు బాగుగా కాల్చిన ఉక్కు శయ్యమీద బలవంతముగా పడవేసి బలవంతులు కావున చాలాకాలము రమింతురు. లట్లు చాలా కాలము రమీంచి విడిచిన తరువాత ఆ స్త్రీలు అగ్నివలె మండుచున్న ఉక్కుస్తంభమును ఆలింగనము చేసుకొని చేయి సంవత్సరములుందురు. తరువాత కొరము నీటితో స్నానము చేయుచు కొరము నీరు త్రాగుచుందురు. తరువాత నూరు సంవత్సరములు అన్ని నరకయాతనలననుభవించేదరు. బ్రాహ్మణుని, ఆవును, ఉత్తమరాజగు క్షత్రియుని చంపువారు అయిదు కల్పములు అన్ని నరక యాతనలననుభవించెదరు. మహాత్ములనిందను ఆదరముతో వినువారి చెవులలో బాగుగా కాల్చిన ఇనుప మేకులను నా పెదరు. తరువాత ఆ కర్ణరంధ్రములలో బాగుగా కాగి మసలుచున్న నూనేను నిం పెదరు. తరువాత కుంభీపాక నరకమునకు గొనిపోయెదరు. శ్రీహరి యందు గాని శంకరుని యందు కొన్ని విముఖులైన నాస్తికలు కోటి సంవత్సరములు ఉప్పునే తినుచుందురు. తరువాత బాగుగా కాలియున్న ఇసుక కల గౌరవమునందు ఒక కల్పకాలము యాతనలను అనుభవించి ఇతర యాతనలను కూడా ఇట్లే అనుభవించెదరు.

బ్రాహ్మణులను కోపదృష్టిచే చూచిన నరాధములు వేలకొలది కాల్చిన సూదులచే కన్నులలో పొడువబడుదురు. తరువాత కారపు నీటి ధారలచే చల్లబడుదురు. తరువాత వారి దేహములను గడ్డపొరలచే త్రవ్వదరు. విశ్వాసఘాతకులు మర్యాదను భంగపరచువారు ఇతరుల అన్నమును ఆశించువారు తమ మాంసమును తామే భుజిస్తూ, కుక్కలచే భుజింపబడుచు ప్రతినరకమున ఒక్క సంవత్సరము చొప్పున నివసించెదరు. ఇతరులనుండి దానము గ్రహించుటయందు ఆసక్తి కలవారు, నక్షత్రములను పఠించువారు దేవతల అన్నమును భుజించువారు కల్పము వరకు ఈ యాతనలలో దుఃఖముతో పాపావిష్ణులు భోగరతులూ అగుచు నరకము ననుభవించెదరు. కాల సూత్రమను యాతనచే పీడించబడుచు కాగిన తైలములో ముంపబడుదురు. తరువాత కారపునీటితో స్నానము మలమూత్ర సేవనము చేతురు. తరువాత భూలోకమున మ్లేచ్చ జాతులలో పుట్టదరు. ఇతరులను బాధించువారు వైతరణీ నదిని చేరెదరు. దేవపిత్స బ్రహ్మయజ్ఞాది పంచమహా యజ్ఞములను విడిచినవారు: లాలా భకమను నరకమును పొందెదరు. ఉపాసనను పరిత్యజించినవారు రౌరవ నరకమును పొందెదరు. బ్రాహ్మణసమూహములనుండి పన్నును తీసుకొనువారు సూర్య చంద్రులుండు వరకు ఈ నరకములలో యాతనలను పొందెదరు. గ్రామములలో ఎక్కువ పన్సును గ్రహించు రాజు వేయి తరములు అయిదు కల్పములు నరకముననుభవించును. బ్రాహ్మణులనుండి పన్నును తీసుకొనుటను ఆమోదించినవాడు వేయి బ్రహ్మ హత్యలను చేసినవానితో సమానము. నాలుగు యుగములు మహాఘోరమైన కాల సూత్రమను నరకమున నివసించును. భగినీపుత్రవధు మొదలగు స్త్రీల యందు, శూద్రాది స్త్రీల యందు, పశువులందు వీర్యమునుంచివాడు మహాపాపియగును. అతను నరకమున రేలో భోజనమును చేయును. ఏడు దివ్య వర్షములు వసామాపమను నరకమును పొంది అన్ని లోకములలో నిందించబడుచు రేతో భోజనమును చేయుచుండును. ఉపవాసదినమున దంతధావనమును చేయువాడు నాలుగు యుగములు చ్యొఘ్రపక్షమను నరకమును పొందును. స్వకర్మలను పరిత్యజించువారు పాషండులనబడుదురు. పాషండులతో కలిసియుండువారు కూడా వారితో పాటు వేల కోట్ల కల్పములలో క్రమముగా నరకములను పొందెదరు. దేవ ద్రవ్యములను గురుద్రవ్యముల నపహరించువారు బ్రహ్మ హత్య చేసిన వారితో సమానముగా నరకము ననుభవించెదరు. అనాధల ధనమునపహరించువారు, అనాధలను ద్వేషించువారు కోటి కల్పములు నరకమున నివసింతురు. స్త్రీల సమీపమున, శూద్రులసమీపమున వేదాధ్యయనమును చేయువారు క్రింద తల, పైన పాదములతో తలక్రిందులుగా రెండు స్తంభముల మధ్యన వేలాడుచుందురు. బ్రహ్మ ఉండునంత వరకు ధూమపానము చేయుచు గడుపుచుందురు.

నీటిలో కాని దేవాలయమున కాని దేహమలమును విడిచినవారు అతి భయంకరమైన భ్రూణహత్యా సమమైన పాపమును పొందెదరు. దేవాలయమున దంతములను ఎముకలను కేశములను, గోళ్ళను వదిలినవారు, తినగా మిగిలిన దానిని జలమున వదిలిన వారు ప్రాసములతో పొడువబడుచు, నాగళ్ళచే చీల్చబడుచు ఆర్తనాదములు చేయుచు, చాలా వేడితో మసలుచున్న నూనెలో బాగుగా గోలించబడుదురు. అటు దుఃఖముచే బాగుగా తపించినవారు ఇతర నరకములలోనికి పంపబడుదురు. బ్రాహ్మణుని చంపినవారు, గంధపు కట్టను నరికిన వారు సూర్య చంద్రులుండు వరకు ఘోర నరకమున నివసింతురు. బ్రాహ్మణ ధనమును అపహరించుట ఇహ పరములలో దుఃఖమునే కలిగించును. ఇహలోకమున సంపదలను నశింపచేయును. పరమున నరకమును కలిగించును. అసత్యపు సాక్ష్యమును చెప్పువారు ఒక కల్పకాలము అన్ని నరక యాతనలను పొందెదరు. ఇహలోకమున పుత్రులు పౌత్రులు నశింతురు. పరలోకమున గౌరవనరకమును ఇతర నరకములను కూడా అనుభవింతురు. అతి కాముకులు, అబద్ధమును మాటలాడువారు చాలా ఘోరమైన నరకమును పొందెదరు. వారి నోటో పాముల వంటి జలగలను నిం పెదరు. అటు ఆరువది వేల సంవత్సరములు అనుభవించిన తరువాత కారపునీటిని చల్లేదరు. వ్యర్థముగా మాంసమును భుజించువారు కారపు బురదలో పడెదరు. తరువాత కాలితో కొట్టబడినట్లుగా యేనుగులచే పడవేయబడుదురు. దాని తరువాత భూలోకమున అంగవికలులుగా జన్మించెదరు. ఋతుకాలమున తన భార్యను సంగమించనివారు ఘోరమైన గౌరవ నరకమును పొందును, బ్రహ్యాహత్యా పాపమును కూడా పొందును. సమర్దుడైయుండి కూడా అత్యాచారములను చేయువారిని వారించనివారు కూడా ఆ పాపమును పొందెదరు. వారిద్దరు నరకమును పొందెదరు. పాపాత్ముల పాపములను లెక్కించుచు ఇతరులకు చెప్పువారు, వారు చెప్పిన పాపములున్నచో వారితో సమానముగా పాపము గలవారీగాను, అసత్యమైనచో రెట్టింపు పాపము గలవారీగా నగుదురు. పాపములేని వానియందు పాపము నారోపించి చెప్పినచో సూర్యచంద్రులు, నక్షత్రములుండు వరకు మహాఘోర నరకమును పొందెదరు. పాపులను నిందించినచో వారి పాపము సగము తొలగును. వ్రతములను ప్రారంభించి పూర్తి చేయక వదిలినచో అసి పత్రమను నరకమున యాతనలననుభవించి, భూలోకమున వికలాంగులుగా జన్మించెదరు. ఇతరులు చేయువ్రతములకు విఘ్నములను కల్పించువారు మిక్కిలి దుఃఖమును కలిగించు, భయంకరమైన శ్లేష్మ భోజనమను నరకమును పొందెదరు. న్యాయమునందు, ధర్మశీక్షలో పక్షపాతమును చూపువారికి పది వేల ప్రాయశ్చిత్తముల నాచరించినను నిష్పతి లభించదు. తినకూడని దానిని తినినవారు మల భోజ్యమను నరకమును పొంది, పిదప చండాలులుగా పుట్టి గోమాంసమును భుజించువారగుదురు.

మాటలతో బ్రాహ్మణులను అవమానించినవారు బ్రహ్మ హత్యాపాపమును పొంది అన్ని నరకయాతనల ననుభవించి పది జన్మలు చండాలులుగా పుట్టుదురు. బ్రాహ్మణునకిచ్చు దానమునకు విఘ్నమును కల్పించువారు బ్రహ్మ హత్య చేసినవారు చేయవలసిన ప్రాయశ్చిత్తము నాచరించవలయును. ఇతరుల ధనమును అపహరించి మరొకరికి దానము చేసినచో, అపహరించినవారు నరకమును పొందుదురు. ఆ ధనము ఎవరిదో వారికి దాన ఫలము లభించును. ఇచ్చెదనని మాట ఇచ్చి ఈయని వారు లాలాభక్షమను నరకమును పొందును. యతులను నిందించువారు శిలా మాత్రమను నరకమును పొందును. ఉద్యానవనములను నరకువారు ఇరువది యొక్క యుగములు శ్వభోజనమను నరకమును అనుభవించి వరసగా అన్ని యాతనల ననుభవించేదరు. దేవాలయములను తటాకములను పూలతోటలను ధ్వంసము చేయువారు అన్ని యాతనలను వేరువేరుగా అనుభవించి ఇరువది యొక్క కల్పములు మలములో క్రిములుగా ఉండి, నూరు జన్మలు చండాలులుగా పుట్టెదరు. గ్రామములను ధ్వంసమును చేయువారు, దగ్గముగావించువారు పొందేడు పాపమును, నరకములను నా జీవితకాలమునంతటిలోనూ చెప్పజాలను. ఉచ్చిష్టమును భుజించువారు మిత్రద్రోహులు సూర్య చంద్రులుండు వరకు తీవ్రయాతనలను పొందెదరు. పితృదేవయజ్ఞములను విచ్చిన్నమును చేసినవారు, వేద మార్గములనుండి బహిష్కృతులైన వారు పాషండులనబడెదరు. వారికి అన్ని యాతనలు సంప్రాప్తించును. ఓ రాజా ! ఇట్లు పాపకర్మల నాచరించువారికి చాలా విధములైన యాతనలు కలుగును. ఆ పాపములను యాతనలను లెక్కించు శక్తి నాకు లేదు. పొపములను యాతనలను ధర్మములను లెక్కించుటకు శ్రీ మహావిష్ణువు తప్ప ఇతరులు సమర్దులు కారు. ఈ పాపములనన్నింటికి ధర్మ శాస్త్ర విధానముననుసరించి ప్రాయశ్చిత్తముల నాచరించినచో పాప రాశి నశించును. ఈ ప్రాయశ్చిత్తములనన్నింటిని శ్రీ మహావిష్ణువు సన్నిధిలో నాచరించవలయును.

ఎక్కువ తక్కువలుగా చేసిన కర్మలను పరిపూర్ణములుగా చేయునవి గంగా తులసి, సత్సంగము, హరికీర్తనము, అసూయ లేకయుండుట, అహింస అనునవి. ఇవి అన్ని పాపములను హరింప చేయును. శ్రీ మహావిష్ణువునకు సమర్పించిన కర్మలు సఫలములగును. శ్రీమహావిష్ణువునకు అర్పించక చేసిన కర్మలు బూడిదలో అర్పించిన హోమద్రవ్యములవంటివి. మోక్షసాధనములైన నిత్యనైమిత్తిక కామ్య కర్మలు, ఇతర కర్మలు విష్ణువున కర్పించినచో సాత్త్వికములు సఫలములగును. మానవులకు అన్ని పాపములను నశింప చేయునది ఉత్తమమైనది హరిభక్తియొక్క ఓ. పొపారణ్యములకు దవాగ్నియైన ఆ హరి భక్తి పది విధములని తెలియుము.సాత్వికములు రాజసములు తామసములుగా భక్తి ప్రభేదములుండును. ఇతరుల వినాశము కొఱకు శ్రీహరిని భజించినచో దుష్ట స్వభావము కలది కావున ఈ భక్తి అధమతామసభక్తి అనబడును. తనకు నచ్చిన పురుషునితో రమించు స్త్రీ తన భర్తను పూజించునట్లు జగన్నాథుడైన నారాయణుని కపటముతో పూజించినచో ఆ భక్తి మధ్యమ తామసభక్తి అనబడును. దేవతలను పూజించువారిని జూచి మాత్సర్యముతో శ్రీహరిని అర్చించినచో ఆ భక్తి ఉత్తమ తామసభక్తి అనబడును. ధనధాన్యాదికములను కోరుచు శ్రీహరిని ఉత్తమమైన శ్రద్దచే పూజించినచో ఆ భక్తి అధమరాజసభక్తి అగును. అన్ని లోకములలో ప్రసిద్ధిపొందు కీర్తి కావలయుని ఉత్తమమైన భక్తి చే శ్రీహరిని పూజించిన చో మధ్యమ రాజసభక్తి యగును. సాలోక్యసాయుజ్యములను కోరుచు శ్రీహరిని పూజించినచో ఉత్తమరాజస భక్తి యనబడును. తాను చేసిన పాపములు నశించవలయునని ఉత్తమ శ్రద్ధతో శ్రీహరిని పూజించినచో అధమ సాత్త్విక భక్తియగును. ఇది శ్రీహరికి ప్రీతిని కలిగించునని శ్రీహరిని సేవించినచో మధ్యమసాత్త్విక భక్తియగును. హరిని పూజించుట నా కర్తవ్యమను బుద్దితో దాసుని వలె శ్రీహరిని పూజించినచో అన్ని భక్తులలో ఉత్తమైనది ఉత్తమ సాత్త్విక భక్తి యగును. శ్రీహరి మహిమను ఏ కొంచెమైనను. గొప్ప సంతోషముతో ప్రీతికలవాడై తన్మయత్వముతో స్తుతించినచో ఉత్తమోత్తమమైన భక్తియగును. నేనే విష్ణువును. ఈ జగత్తంతయు నాలోనే నిలిచియున్నది. అని జగత్తునంతటిని విష్ణుమయముగా చూడగలవాడు ఉత్తమోత్తముడగును. ఇట్లు పది విధములుగా నుండు భక్తి సంసారమును నశింపచేయును. ఈ పదివిధములలోను సాత్త్విక భక్తి అన్ని కోరికలను ప్రసాదించును. కావున ఓ మహారాజా ! సంసారమును గెలువవలయునని కోరువారు తమ కర్మలకు విరోధము కాకుండా శ్రీహరియందు భక్తిని చేయవలయును. స్వధర్మమును వదిలి భక్తిని మాత్రమే చేయువాని విషయమున శ్రీహరి సంతోషించడు. ఆచారముతో మాత్రమే శ్రీహరి సంతోషించును. అన్ని ఆగమములలోను మొడటిది ఆచారమని నిర్ణయించబడినది. ఆచారమునుండే ధర్మము పుట్టును. ధర్మమునకు శ్రీహరి ప్రభువు. కావున స్వధర్మముకు భంగకరము కొని విధముగా శ్రీహరి భక్తిని ఆచరించవలయును. సదాచారము లేనివారికి ధర్మములు సుఖము నీయజాలవు. స్మధర్మా చరణములేని భక్తి లేని దానితో సమానమే. నీవు అడిగిన దానినంతటిని చెప్పితిని. కావున ధర్మపరుడవై జనార్ధనుని పూజించుము. సూక్ష్మరూపుడైన శ్రీమన్నారాయణుని పూజించి ఆనందమును పొందగలవు. శివుడే శ్రీహరి. శ్రీహరియే శివుడు. ఇద్దరిలో భేదమును చూచు ఖలుడు కోటి నరకములను పొందును. కావున శ్రీహరిని కాని శివుని కాని సమానముగా భావించి పూజించుము.భేదమును చూచువాడు ఇహపరములలో దుఃఖమునే పొందును.

ఓ రోజా ! సుబుద్దీ ! నేను నీ వద్దకు వచ్చిన కోరణమును చేప్పెదను. సావధాముగా వినుము. నీ పితామహులు ఆత్మ హత్యా పాపమును చేసి కపిల మహర్షి కోపముచే దహించబడి నరకముననున్నారు. ఓ మహానుభావా! గంగను తీసుకొని వచ్చి నీ పితామహులనుద్దరించుము. గంగ అన్ని పాపములను నశింపచేయును. కేశములు, అస్తులు, నఖములు, దంతములు, చివరికి బూడిద అయిననూ గంగాజలముచే స్పృశించబడినచో శ్రీ విష్ణులోకమును చేర్చును. అస్తులను కాని భస్మమును కాని గంగలో పడవేసినచో అతను అన్నిపాపముల నుండి విముక్తుడై శ్రీహరి భవనమును చేరును. గంగా బిన్హ్వభి షేకము వలన నేను నీకు తెలిపిన పాపములన్నియూ నశించును.

సనక మహర్షి పలికెను :- ఓ మునిశ్రేషా ! మహారాజగు భగీరథునితో యమధర్మరాజు ఇట్లు చెప్పి వెంటనే అంతర్థానము చెందెను. సర్వశాస్త్రార్ధకోవిదుడు మహాప్రాజ్ఞుడగు భగీరథమహారాజు మంత్రులయందు రాజ్యభారమునుంచి అరణ్యమునకు వెళ్ళెను. హిమవత్పర్వతమునకు వెళ్ళి అచట నరనారాయణాశ్రమమునకు పశ్చిమమున పదునారు యోజనముల దూరమున మంచుతో కప్పబడియున్న శృంగమున తపస్సు చేసి మూడు లోకములలో పావనమైన గంగను తెప్పించెను.

ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున ధర్మా ఖ్యానమున ధర్మరాజోపదేశముచే భగీరథుడు చేసిన గంగానయనోద్యమ వర్ణనమను పదునైదవ అధ్యాయము సమాప్తము.