నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

98 - మార్కండేయపురాణానుక్రమణీ కథనమ్

శ్రీ బ్రహ్మపలికెను :-

ఓ మునిసత్తమా! ఇపుడు నీకు చదువు వారిని పవిత్రులను చేయు గొప్ప మార్కండేయ పురాణమును చెప్పెదను వినుము. పక్షులను ఉద్దేశించి ఇచట సర్వధర్మ నిరూపణము చేయబడినది. ఈ పురాణము తొమ్మిది వేల శ్లోకములు కలది. ఇచట మార్కండేయ ముని జైమిని మహర్షిని అడుగుట మొదట చెప్పబడినది. ధర్మ సంజ్ఞలు కల పక్షుల జన్మము ఈ పక్షుల పూర్వజన్మకథా, ఇంద్రుని, వికారము, బలరాముని తీర్థయాత్ర, ద్రౌపదేయకధ, పవిత్రమగు హరిశ్చంద్రకధా, ఆడీ బక యుద్ధము, పితాపుత సమాఖ్యానము, దత్తాత్రేయ కథా, కార్తవీర్యార్జున కథ, మదాలస కథ, అలర్క చరితము, నవ విధములగు సృష్టి సంకీర్తనము, కల్పాన్త  కాలనిర్దేశము, యక్ష సృష్టి నిరూపణము, రుద్రాది సృష్టి, ద్వీప చర్యను కీర్తనము, మనువుల కథలు పోపపరిహారక కథలు చాలా చెప్పబడినవి. ఈ కథలలో అష్టమాంతరమున త్రయీతేజసముద్భవమగు ప్రణవోత్పత్తి, మార్తండుని జన్మము మార్తండ మాహాత్మ్యము, వైవస్వతమనువు వంశము, వత్స ప్రీచరితము, మహానుభావుడగు ఖనిత్రుని పవిత్ర కథ, అవిక్షిచ్చరితము, కిమిచ్చవ్రత విధానము, కరిష్య చరితము, ఇక్ష్వాకు చరితము, నలచరితము, రామచన్ల సత్కథ, కుశవంత సమాఖ్యానము, సోమవంశాను కీర్తనము, పురూరవుని కథ, అద్భుతమగు నహుష కథ, యయాతి చరితము, యదువంశాను కీర్తనము, శ్రీ కృష్ణబాలచరితము, మధురా గర చరిత్రము, ద్వారకా చరితము, సర్వావతార కథలు, సాంఖ్య యోగము, ప్రపంచ సత్య కీర్తనము, మార్కండేయ చరిత్రము, పురాణ శ్రవణ ఫలము నిరూపించబడినవి. ఈ మార్కండేయ పురాణమును ఆదరముతో వినువాడు ఉత్తమ గతిని పొందును. చెప్పినవాడు శివలోకమును పొందును. కార్తీక పూర్ణిమన వ్రాసి బ్రాహ్మణునకు దానమును చేసిన పరమగతిని పొందును. ఈ పురాణానుక్రమణికను వినిననూ చెప్పిననూ మార్కండేయ పురాణ శ్రవణ ఫలమును పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థ పాదమున మార్కండేయ పురాణానుక్రమణీ నిరూపణమను తొంబదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.