నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

105 - వామనపురాణానుక్రమణి వర్ణనమ్

బ్రహ్మపలికెను :

వత్సా! ఇపుడు త్రివిక్రమ చరిత్రచే శోభితమై పదివేల శ్లోకములు గల వామన పురాణమును చెప్పెదను వినుము. ఈ పురాణమున కూర్మకల్పమున జరిగిన అఖ్యానములను చెప్పెను. త్రివర్గమును తెలుపు కథలు కలది. రెండు భాగములు కలది. చెప్పువారికి వినువారికి శుభములను కలిగించునది. మొదట పురాణ ప్రశ్నము, తరువాత బ్రహ్మశిరచ్ఛేదము, కపాల మోచనాఖ్యానము, దక్షయజ్ఞ హింసనము, హరునకు కాలరూప నామము, కామదహనము, ప్రహ్లాద నారాయణ యుద్దము, దేవాసుర సంగ్రామము, సుకేశ్యర్క సమాఖ్యానము, భువనకోశకము, కామ్య వ్రతాఖ్యానము, శ్రీ దుర్గాచరితము, తపతీ చరితము, కురుక్షేత్ర వర్ణనము, సాటిలేని సత్యా మాహాత్మ్యము, పార్వతీ జన్మ కీర్తనము, పార్వతీ తపస్సు, పార్వతీ వివాహము, గౌర్యుపాఖ్యానము, కౌశిక్యుపాఖ్యానము, కుమార చరితము, అస్థక వధాఖ్యానము, సాధ్యోపాఖ్యానము, జాబాలి చరితము, అరజాకథా, అంధకేశ్వర యుద్దము, అంధకునకు గణత్వము, మరుత్తుల జన్మ కథనము, బలి చరితము, లక్ష్మీ చరితము, త్రివిక్రమ చరితము, ప్రహ్లాద తీర్థయాత్రా సందర్భమున వివిధ కథలు, ధుంధు చరితము, ప్రేతోపాఖ్యానము, నక్షత్ర పురుషాఖ్యానము, శ్రీరామచరితము, త్రివిక్రమ చరిత్రాంతమున బ్రహ్మకృతస్తవము, సుతల లోకమున ప్రహ్లాద బలి సంవాదమున హరిస్తోత్రము, ఇవి పూర్వభాగమున చెప్పిన విషయములు. ఈ పురాణమున ఉత్తర భాగమునకు బృహదామనమను నామము కలదు. మాహేశ్వరీ, భాగవతీ, సౌరీ, గాజేశ్వరి, అను నాలుగు సంహితలు ఒక్కొక్కటి విడిగా సహస్ర శ్లోకములు కలది. మాహేశ్వరీ సంహిత మందు కృష్ణ కీర్తనము, కృష్ణభక్తుల కీర్తనము, భాగవతీ సంహిత యందు అద్బుతమగు జగన్మాతావతార కథ, సౌరీ సంహితమగు పాపనాశకమగు సూర్యమహిమ, గాజేశ్వరి సంహితమందు గణేశ, చరితము చెప్పబడినది. ఇట్లు ఇది బహువిచిత్రములు కల వామన పురాణమిది. పులస్త్య బ్రహ్మ నారద మహర్షికి చెప్పినది. నారదుని నుండి వ్యాసమహర్షి వ్యాసుని నుండి వ్యాస శిష్యుడగు రోమహర్షణుడు, రోమహర్షణుడు నైమిషారణ్య వాసులగు విప్రులకు చెప్పెను. ఇట్లు వామన పురాణము పరంపరాప్రాప్తము. దీనిని చదువు వారలు, వినువారలు పరమ పదమును పొందెదరు. ఈ పురాణమును వ్రాసి ఘృతధేను సమన్వితముగా వేదజ్ఞుడగు విప్రునికిచ్చువాడు తన పితరులను నరకము నుండి స్వర్గమును చేర్చును. ఇహమున భోగములననుభవించి అంతమున విష్ణుపదమును చేరును.

ఇది శ్రీ బృహన్నారద మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున వామన పురాణాను క్రమణి వర్ణనమనునది నూటఅయిదవ అధ్యాయము.