నారద మహా పురాణము - పూర్వార్థము
100 - భవిష్యపురాణానుక్రమణీ నిరూపణమ్
శ్రీ బ్రహ్మ పలికెను :-
ఇపుడు నీకు అందరికి అన్ని అభీష్టములను ప్రదానము చేయు, సర్వసిద్ది ప్రదమగు భవిష్య పురాణమును చెప్పెదను. ఈ పురాణమును సర్వదేవతలను మొదట సృష్టించిన నా జన్మలోక సృష్టి కొరకు స్వాయంభువమనుజన్మ చెప్పబడినది. స్వాయం భువ మనువు నమస్కరించి నన్ను సర్వార్థ సాధకమగు ధర్మమునడిగెను. అపుడు నేను ప్రీతి చెంది అతనికి ధర్మ సంహితను చెప్పితిని. మహామతియగు వ్యాస మహర్షి పురాణ విభాగమును చేసినపుడు అయిదు విధములుగా చేసెను. నానాశ్చర్య కథాయుతమగు అహోర కల్పవృత్తాంతము గలది మొదటి పర్వము. ఇచటనే ప్రారంభ పురాణమగు బ్రహ్మ పురాణము కలదు. సూత శౌనక సంవాదమున పురాణ ప్రశ్న సంక్రమము, సర్వాఖ్యాన సమన్వితమగు ఆదిత్య చరితము సృష్ట్యాది లక్షణోపేతము, శాస్త్ర సర్వస్వ నిరూపకము, పుస్తకలేఖక లేఖన లక్షణములు, సర్వ సంస్కార లక్షణములు, పక్షతిథ్యాది సప్త కల్ప స్వరూపము, అష్టమకల్పము నుండి మిగిలిన కల్పము లన్నియూ విష్ణు పర్వంలో చెప్పబడినవి. శైవ పర్వమున కాయమాత్ర భిన్నములు, సౌర పర్వమున అంత్య కథాన్వయము, నానాఖ్యాన సహితమగు ప్రతిసర్గవిధానము, పురాణోపసంహార సహితముగా అయిదవ పర్వమున చెప్పబడినది. ఈ అయిదు పర్వములలో మొదటి పర్వములో అధికముగా బ్రహ్మమహిమ చెప్పబడినది. రెండు మూడు నాలుగు వర్గములలో ధర్మకామ మోక్ష విషయమున విష్ణు శివుల మహిమ అధికముగా చెప్పబడినది. చివరి వర్గంలో సర్వ కధాన్వితమగు ప్రతిసర్గ విధానము చెప్పబడినది. గుణతారతమ్యముచే బ్రహ్మ సమమని శ్రుతి. ఈ పురాణమును వ్రాసి గుడధేనుయుతముగా హేమ వస్రవిభూషణములతో వాచకముగా పుస్తకముగా కాని గంధాదులతో భక్ష భోజ్యాదులతో పూజించి నీరాజనాదికమును ఇచ్చి, జితేంద్రియుడై ఉపవసించి, సావధానుడై, బ్రాహ్మణునకీయ వలయును. ఒకపూట భుజించి చదువవలయును. లేదా వినవలయును. అతడు పాపవిముక్తుడై బ్రహ్మలోకమును పొందును. ఈ భవిష్య పురాణాను క్రమణిని చదివినవారు వినినవారు భుక్తి ముక్తులను పొందును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున చతుర్ధపాదమున భవిష్యపురాణానుక్రమణీ నిరూపణమను నూరవ అధ్యాయము.
