నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

17 - మార్గశీర్ష శుక్లద్వాదశీవ్రత కథనమ్

ఋషులు పలికిరి : మహానుభావుడవగు సూతుడా ! నీవు ఎంతో దయతో ఉత్తమము, సర్వపాప వినాశకము అగు గంగా మాహాత్మ్యమును వినిపించితివి. దివ్యజ్ఞానము గల నారదమహర్షి గంగామాహాత్మ్యమును విని సనకమహర్షిని ఏమడిగెను.

సూతమహర్షి చెప్పెను : ఓ ఋషులారా ! మీరందరూ వినుడు. నారదమహర్షి దేనినడిగెనో, ఎట్లు పలికెనో దాని నంతయు అట్లే చెప్పెదను. అనేక కథలతో ఇతిహాసములతో కూడిన ఉత్తమమైన గంగామాహాత్మ్యమును వినిన నారదమహర్షి ఆదరముతో మరల నిట్లడిగెను.

నారద మహర్షి పలికెను : ఓ సనక మహర్షి ! పరమదయాలువులైన మీ నుండి పవిత్రము పాపనాశకము, పుణ్యసారము, స్పషార్ధము అయిన గంగా మాహాత్మ్యమును వింటిని. తమకొరకు ఇతరుల కొఱకు ప్రయత్నము చేయుచునే సాధువులు శ్రీ మహావిష్ణువును బాగుగా సేవించెదరు. మోహము చేందిన మనసు కలవారిని పలు విధములైన ఉపదేశములతో ప్రబోధించి ప్రసన్న చిత్తులను చేతురు. శ్రీహరిని ప్రసన్నుని చేయు హరీవ్రతములను చక్కగా తెలుపుము. తనను సేవించువారికి దయాలువైన శ్రీహరి భక్తి నొసంగును. ఆ భక్తికి ముక్తి ప్రసిద్ధమైన దాసి వ్రతములచే అర్చనలచే ధ్యానములచే తనను సేవించువారికి శ్రీహరి ముక్తి నొసంగును. భక్తులను వెంట ఉండి సేవించుటలో గల ప్రయాసను చూచి శ్రీహరి భక్తి నెవ్వరికీ నొసగడు. హరిని సంతోషపరచు ప్రవృత్తి రూపకర్మను నివృత్తి రూపకర్మను విష్ణుభక్తుడవైన నీవు నాకు తెలియజేయుము.

సనక మహర్షి పలికెను : ఓ ముని శేష్ఠా ! బాగు బాగు. నీవు మాటిమాటికీ శ్రీహరి చరిత్రమును అడుగుచున్నావు కావున పురుషోత్తముని భక్తుడవు. లోకములకు ఉపకోరమును చేయునని, శ్రీహరి సంతోషించి అభయమునిచ్చు వ్రతములను చెప్పెదను. ఈ వ్రతముల వలన యజ్ఞలింగుడు భగవంతుడగు జనార్ధనుడు ప్రసన్నుడై ఇహపరములలో సుఖమును తపోవృద్దిని కలిగించును. ఏదోయొక విధముగా శ్రీహరిని పూజించువారు పరమపదమును పొందెదరని మహర్షులు చెప్పుచున్నారు. మార్గశీర్ష శుద్ధ ద్వాదశి దినమున ఉపవసించి శ్రద్దకలవాడై జలశాయియైన శ్రీహరిని చక్కగా పూజించవలయును. ప్రాతఃకాలమున దంతధావనము గావించుకొని స్నానముచేసి తెల్లని వస్త్రములను ధరించి వాక్కును నియమించి భక్తి భావముచే గంధపుష్పాక్షత ధూపదీపనైవేద్యములతో శ్రీహరిని పూజించవలయును. ఓ కేశవా ! నీకు నమస్కారము అనుచు విష్ణువును పూజించవలయును. అగ్ని హోత్రమున నేతిచే నువ్వులచే నూట ఎనిమిది ఆహుతులనిచ్చి రాత్రిపూట సాలగ్రామ సమీపమున జాగరణము చేయవలయును. ఒక శేరుపాలతో నిర్మలుడగు శ్రీమన్నారాయణుని స్నానమును చేయించవలయును. మూడు పూటలా ధూపదీపనైవేద్య భక్ష్యభోజ్యములతో, గీత వాద్యములచే లక్ష్మీయుక్తుడగు శ్రీమన్నొరాయణుని పూజించవలయును. మలర యథా సమయమున లేచి యథోచిత కర్మల నాచరించి వాజ్నయనముతో శుచి అయి పూర్వము వలెనే పూజించవలయును. నేతితో వండిన పాయసమును కొబ్బరికాయతో దక్షిణతోపాటు కేశవః కేశిహో దేవస్సర్వసంపతదాయకః పరమాన్న ప్రదానేన మమ స్యాదిష్టదాయకః” అను మస్త్రముచే బ్రాహ్మణునకు భక్తితో సమర్పించ వలయును. (“సర్వసంపదలనిచ్చు దేవుడగు వాడు కేశియను రాక్షసుని సంహరించిన కేశవుడు పరమాన్నదానముచే నొ ఇష్టమును పూరించుగాక” అని పై మస్త్రమునకు అర్థము) తరువాత భక్తితో బ్రాహ్మణులను బంధువులను భోజనము చేయించవలయును. నారాయణుని ధ్యానించుచు వాజీయమముతో తాను భోజనము చేయవలయును. ఇట్లు భక్తితో ఉత్తమమైన కేశవార్చనను చేయువాడు పౌండరీక యజ్ఞము చేసిన దానికి ఎనిమిది రెట్లు అధిక ఫలమును పొందును.

పుష్యశుద్ధ ద్వాదశీ తిథిన చక్కగా ఉపవసించి మనోనిగ్రహముతో నారాయణునకు నమస్కారము (నమో నారాయణాయ) అను మంత్రమును పఠించుచు శ్రీహరిని పూజించవలయును. పొలతో స్నానము చేయించి పొయసము నర్పించవలయును. మూడు కాలములలో అర్చన చేసి రాత్రిపూట జాగరణమును చేయవలయును. సుందరమైన గంధదూపదీపనైవేద్య పుష్పములచే గీత వాద్యములచే స్తోత్రములచే అర్చించవలయును. నేతితో చేసిన నువ్వుల పొంగలిని దక్షిణతో బ్రాహ్మణునకు దానము చేయవలయును. “సర్వాత్మా సర్వలోకేశః సర్వవ్యాపీ సనాతనః నారాయణః ప్రసన్నస్స్యాత్కృశరాన్న ప్రదానతః” అను మంత్రము పఠించుచు దానము చేయుచు తరువాత బ్రాహ్మణులకు భోజనము పెట్టి తాను బాంధవులతో కలిసి భుజించవలయును. ఇట్లు భక్తి చే ప్రభువు దేవుడు అగు నారాయణుని పూజించినచో ఎనిమిది అగ్నిష్టోమముల ఫలమును పొందును.

మాఘ శుద్ధ ద్వాదశీ తిథిన మొదటి వలెనే ఉపవసించి ‘నమస్తే మాధవాయ’ అని అగ్నితో ఎనిమిది నేతి ఆహుతులనిచ్చి, ఒక శేరుపొలతో శ్రీహరిని స్నానము చేయించవలయును. సావధానమైన మనస్సుతో పుష్పగంధాక్షతలతో ఆర్చించవలయును. భక్తితో రాత్రి జాగరణ చేయవలయును. ప్రాతఃకాలమున కాలకృత్యములను తీర్చుకొని మరల మాధవుని పూజించవలయును. మస్త్రపూర్వకముగా ఒక కిలో నువ్వులను బ్రాహ్మణునకు దానమీయవలయును. వస్త్రములను దక్షిణనీయవలయును. అట్లు చేసినచో అన్ని పాపములు నశించును. “మాధవ స్సర్వభూతాత్మా సర్వకర్మఫలప్రదః తిలదానేన “మహతా సర్వాన్కామా నచ్చతు” అను మంత్రముచే . భక్తితో బ్రాహ్మణునకు దానమీయవలయును. (“సర్వప్రాణి స్వరూపుడగు సర్వకర్మల ఫలములనిచ్చు మాధవుడు మహాతిల దానముతో నా కోరికలను తీర్చుగాక” అని మస్త్రమున కర్థము) తరువాత ప్రభువైన మాధవుని స్మరించుచు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును. ఇట్లు తిలదానవ్రతము చేయువారు నూరు పోజ పేయ యాగముల ఫలమును పొందెదరు.

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి ఉపవాసము చేసి ‘గోవిందాయ నమస్తుభ్యం’ అని శ్రీహరిని పూజించవలయును. నేతితో కలిసిన నువ్వులతో అగ్నిలో నూట ఎనిమిది ఆహుతులనిచ్చి ఒక శేరు పాలతో గోవిందుని స్నానము చేయించవలయును మూడు వేళలా పూజించి రాత్రి జాగరణ చేయవలయును. ప్రాతఃకాల కృత్యములను ముగించి మరల గోవిందుని పూజించవలయును. వస్త్రములను దక్షిణను నాలుగు శేర్ల ధాన్యమును బ్రాహ్మణునకు దానమీయవలయును “నమో గోవిన్ద సర్వేశ గోపికా జనవల్లభ అనేన ధాన్యదానేన పీలో భవ జగదురో” అను మంత్రముచే దానమీయవలయును. (“ఓ గోవిందా ! గోపికా జనవల్లభా ! నీకు నమస్కారము. ఓ జగద్గురూ ! ఈ ధాన్యదానముచే సంప్రీతుడవు కమ్ము” అని మంత్రమున కర్ధము). ఇట్లు చక్కగా వ్రతము నాచరించి సంపూర్ణ గోమేధయాగఫలమును పొందును.

చైత్రశుద్ధ ద్వాదశీ తిథిన ఉపవసించి ‘నమోస్తు విష్ణవే తుభ్యం’ అని మొదటి వలెనే అర్చించవలయును. ఒక శేరు పాలతో తన శక్తికి తగినట్లుగా పాలచే అభి షేకము చేయించవలయును. అట్లే ఆదరముతో శేరు నేయితో అభి షేకము చేయవలయను. మూడు వేళలా పూజించి రాత్రి జాగరణము చేయవలయును. తరువాత ప్రాతఃకాలమున లేచి కాల కృత్యములను ముగించుకొని తేనే నేయి నువ్వులతో నూట ఎనిమిది ఆహుతులనిచ్చి హూమము చేసి నాలుగు శేర్ల బియ్యమును దక్షిణతో బ్రాహ్మణునకు దానమీయవలయును. ప్రాణరూపీ మహావిష్ణుః ప్రాణదస్సర్వవల్లభః తండులాడక దానేన ప్రీయతాం మే జనార్దనః” అను మంత్రముచే దానమీయవలయును. (“ప్రాణరూపుడు ప్రాణము నిచ్చువాడు అందరికీ ప్రియుడగు జనార్ధనుడు నాలుగు శేర్ల తండుల దానముచే ప్రీతి చెందుగాక” అని ఈ మంత్రమున కర్థము). ఇట్లు భక్తి చే ఆచరించిన నరుడు అన్ని పాపములనుండి విడివడి ఆత్యగ్నిష్టోమ యాగమునకు ఎనిమిది రెట్లు ఫలమును పొందును.

వైశాఖ శుద్ధ ద్వాదశీ తిథిన ఉపవాసము చేసి మధుసూదనుని ముప్పది రెండు పేర్ల పాలతో అభి షేకము చేసి, భక్తితో జాగరణముచేసి మూడు వేళలా పూజించవలయును. ‘నమస్తే మధుహనే’ అనుచు నూట ఎనిమిది మార్లు నేతితో హోమము చేయవలయును. ఇట్లు భక్తి చే చేసినచో అన్ని పాపములు తొలగి ఎనిమిది అశ్వమేధ యాగముల ఫలమును పొందును. జ్యేష్ఠ శుద్ధద్వాదశిన ఉపవాసమును చేసి నాలుగు శేర్లపాలతో త్రివిక్రమునికి అభి షేకము చేసి భక్తితో పూజించిన ‘నమస్త్రివిక్రమాయ’ అనుచు పొయసముతో నూట ఎనిమిది మార్లు హోమముచేసి రాత్రిపూట జాగరణము చేసి మరల పూజించవలయును. బ్రాహ్మణునకు దక్షిణతో ఇరువది అపూపములను దానము చేయవలయును. ‘దేవ దేవ జగన్నాధ ! ప్రసీద పరమేశ్వర ! ఉపాయనం చ సంగృహ్య మమాభీష్టప్రదో భవ’ అను మంత్రముచే దొనమీయ వలయును. తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనము పెట్టి పోజ్నియమముతో తాను భోజనమును చేయవలయును. ఇట్లు ఉత్తమమైన త్రివిక్రమవ్రతము నాచరించువాడు అన్ని పాపములను బోనాడి ఎనిమిది నరమేధముల ఫలమును పొందును.

ఆషాఢ శుక్ల ద్వాదశినాడు ఇంద్రియ జయముతో ఉపవాసముచేసి నాలుగు శేర్ల పాలతో వామనమూర్తికి అభి షేకము చేయవలయును. ‘నమస్తే వామనాయ’ అని నూట ఎనిమిది మార్లు నేతితో గరకతో హోమము చేయవలయును. ఇట్లు హోమము చేసిన పిదప జాగరణ చేసి వామనుని పూజించవలయును. వామన మూర్తిని పూజించు బ్రాహ్మణునకు భక్తితో నారికేళము దక్షిణలతో పెరుగన్నమును ప్రదానము చేయవలయును. ‘వామనో వృద్దిదోహోతా ద్రవ్యస్లో వామన ప్పదా. పొమనస్తారకోఽస్మాచ్చ వామనాయ నమో నమః’ అను మంత్రముతో దధ్యన్నప్రదోనాము గావించవలయును. (“వామనుడు వృద్దీనిచ్చువాడు. వామనుడేహోత, వామనుడెపుడూ ద్రవ్యములో నుండును. వామనుడు మనలను తరింపచేయును. వామనునకు నమస్కారము” అని ఈ మంత్రమునకర్థము.) తరువాత శక్తి కొలది బ్రాహ్మణములకు భోజనమొసంగవలయును. ఇట్లు వ్రతమాచరించిన వారు నూరు అగ్నిష్టోమయాగములు చేసిన ఫలమును పొందును. , శ్రావణశుద్ధ ద్వాదశిన ఉపవసించి వ్రతమును స్వీకరించి తేనె కలిపిన పాలతో శ్రీధరునికి అభిషేకము చేయవలయును. ధూపదీపగంధాదులతో ‘నమోఽస్తు శ్రీధరాయ’ అనుచు పూజించవలయును. నేయి కలిపిన పెరుగుతో నూట ఎనిమిది మార్లు హోమమును చేయవలయును. రాత్రిపూట జాగరణ చేసి మరల శ్రీధరుని పూజించవలయును. నాలుగు శేర్ల పాలను బ్రాహ్మణునకు దానమీయవలయును. బంగారుకుండలములను, వస్త్రములను, దక్షిణను ఈయవలయును. క్షీరాబ్ధిశాయిన్ ! దేవేశ ! రమాకాన్త ! జగత్పతే ! క్షీరదానేన సుప్రీతో భవ సర్వసుఖప్రదః” అను మనము దానము చేయవలయును. (“పాలసముద్రములో శయనించువాడా ! దేవేశా ! రమాకాన్త ! జగత్పతీ ! అన్ని ఆనందములనిచ్చు నీవు క్షీరదానముచే సుప్రీతుడవుకమ్ము” అని అర్థము.) ఈ వ్రతమునాచరించువాడు ఆనందమునిచ్చు బ్రాహ్మణులకు శక్తి కొలది భోజనము నొసంగవలయును. ఇట్లు చేసిన వారు వేయి అశ్వమేధ యాగముల ఫలమును పొందును. భాద్రపద శుద్ధ ద్వాదశిన చక్కగా ఉపవసించి జగద్గురువైన హృషీ కేశుని ముప్పది రెండు శేర్లపాలతో అభిషేకించవలయును. ‘హృషీకేశ నమస్తుభ్యం’ అని చక్కగా పూజించవలయును. తేనె కలిపిన పొంగలితో నూట ఎనిమిది మార్లు హోమమును చేయవలయును. రాత్రిపూట జాగరణము చేసి మరల పూజించి ఆత్మజ్ఞానముగల బ్రాహ్మణునకు ఆరు శేర్ల గోధుమలను దక్షిణను, శక్తి కొలది బంగారమును దొనము చేయవలయును. “హృషీ కేశ నమస్తుభ్యం సర్వలోకైక హేతవే మహ్యం సర్వసుఖం దేహి గోధూమస్య ప్రదానతః” అను మంత్రముచే దానము చేయవలయును. (“అన్ని లోకములకు ముఖ్య కారణ భూతుడవైన ఓ హృషీ కేశా ! నీకు నమస్కారము. గోధూమ దానముతో నాకు అన్ని సుఖములనిమ్ము” అని ఈ మస్త్రమునకర్థము.) భక్తితో బ్రాహ్మణులకు భోజనమొసంగి వాజ్నీయమముతో తాను కూడా భుజించవలయును. ఇట్లు చేసినచో అన్ని పాపములు తొలగి బ్రహ్మ మేధఫలమును పొందును.

ఆశ్వయుజ శుక్ల ద్వాదశిన ఉపవసించి పాలతో పద్మనాభునికి అభి షేకమును చేయవలయును. ‘నమస్తే పద్మనాభాయ’ అనుచు శక్తి కొలది తిలలుధాన్యము, యవలు నేయితో హోమము చేసి యథావిధిగా పూజించవలయును. రాత్రి జాగరణ చేసి మరల పూజించవలయును. బ్రాహ్మణునకు తేనె పావుశేరును దక్షిణతో నీయవలయును. ‘పద్మనాభ నమస్తుభ్యం సర్వలోకపితామహ మధుదానేన సుప్రీతో భవ సర్వసుఖప్రదః’ అని దానము చేయవలయును. (“అందరికి పితామహుడవైన ఓ పద్మనాభా ! నీకు నమస్కారము. అన్ని ఆనందములను ప్రసాదించుస్వామీ ఈ మధుదానముతో సుప్రీతుడవు కమ్ము” అని మంత్రమునకర్థము.) ఇట్లు పద్మనాభవ్రతమును చేయుబుద్ధిమంతుడు వేయి బ్రహ్మ మేధముల ఫలమును పొందును.

కార్తీక శుక్ల ద్వాదశీతిథిన జితేంద్రియుడై ఉపవాసము చేసి నాలుగు శేర్ల పొలచేకాని, పెరుగుచే కాని, నేయిచే కాని “నమో దామోదరాయ” అనుచు దామోదరునికి అభి షేకము చేయవలయును. భక్తి చే తేనె నేయి కలిపిన నువ్వులచే నూట ఎనిమిది మార్లు హోమమును చేయవలయును, మూడు వేళలా పూజించి రాత్రి జాగరణ చేయవలయును. ప్రాతఃకాలమున సుందరమైన పద్మములచే పూజించవలయును. మరల నేయి కలిపిన నువ్వులచే నూట ఎనిమిది మార్లు హోమమును చేయవలయును. భక్తితో బ్రాహ్మణునకు పంచభక్ష్యములతో కూడిన అన్నము నీయవలయును. “దామోదర ! జగన్నాథ ! సర్వకారణ కారణ! త్రాహి మాం కృపయాదేవ శరణాగత పాలక” అనుమంత్రముచే కుటుంబి, శ్రోత్రియుడు అగు బ్రాహ్మణునకు దక్షిణతో దానమును చేయవలయును. సర్వకారణములకు కారణ భూతుడవైన ఓ జగన్నాథ్ ! దామోదరా ! శరణాగత రక్షక ! నన్ను దయచే కాపొడుము అని పై మంత్రమునకర్థము. పిదప బ్రాహ్మణులను భుజింపచేయవలయును. ఇట్లు వ్రతమును ముగించి బంధువులతో కలిసి భోజనము చేయవలయును. ఇట్లు చేసినచో వేయి అశ్వమేధ యాగములకు రెట్టింపు ఫలము లభించును. ఇట్లు ఒక సంవత్సరము ద్వాదశీవ్రతము నాచరించినవారు పరమ పదమును పొందెదరు. భక్తిచే ఒకటి రెండు నెలలు చేసిన వారు కూడా ఆయా ఫలములను పొంది అంతమున శ్రీహరి లోకమును చేరెదరు.

ఇట్లు ఒక సంవత్సరము ద్వాదశీవ్రతమునాచరించి ఉద్యాపనము చేయవలయును. మార్గశీర్ఘశుక్ల ద్వాదశిన ప్రాతఃకాలమున దంత ధావనమును చేసుకొని ఆచారానుగుణముగా స్నానము చేసి తెల్లని వస్త్రములను పుష్పమాలలను ధరించి, తెల్లని గంధమును పూసుకొని సుందరముగా నాలుగు మూలలతో మండపమును చేయించవలయును. ఘంటా చామరములతో కింకిణీ ధ్వనులతో ఛత్రచామర పతాకములతో పుష్పమాలలతో నలంకరించి తెల్లని వస్త్రమును పైన కప్పవలయును. చుట్టూ దీపమాలతో అలంకరింపచేయవలయును. ఆ మండప మధ్య భాగమున సర్వతో భద్రముద్రను చక్కగా అలంకారముతో చిత్రించవలయును. సర్వతోభద్రముద్ర మీద జలపూరితములైన పన్నెండు కలశములనుంచవలయును. చక్కగా శోధించిన తెల్లని వస్త్రముచే అన్ని కలశములను కప్పవలయును. ఆ కలశములలో పంచరత్నముల నుంచవలయును. బంగారముచే కాని, వెండిచే కాని, రాగిచే కాని లక్ష్మీనారాయణ ప్రతిమను భక్తితో చేయించవలయును. ఆ ప్రతిమను కలశము మీద నుంచవలయును. ప్రతిమను చేయగల అవకాశములేనిచో ప్రతిమా మూల్యమును. కలశము పై నుంచవలయును. శక్తి ననుసరించి బంగారమును కూడా ఉంచవచ్చును. బుద్ధిమంతుడైనవాడు ఏ వ్రతమునందైన విత్తలోభమును వదిలి పెట్టవలయును. విత్తలోభమును చూపినచో ఆయుర్ధనసంపదలు కయమునొందగలవు. భక్తి కలవాడై వికారరహితుడు శేషశాయి అయిన నారాయణుని పంచామృతముచే స్నానమును చేయించవలయును. కేశవాది నామములచే ఉపచారములను చేయవలయును. పురాణ శ్రవణాదులను చేయుచు రాత్రి జాగరణమును చేయవలయును. ఉపవాసముచే జితేంద్రియుడు జితనిద్రుడు కావలయును. సంపదకనుగుణముగా మూడుపూటలా శ్రీహరిని పూజించవలయును. ప్రాతఃకాలమునలేచి ప్రాతః కాలకృత్యములను ముగించుకొని బ్రాహ్మణులతో వ్యాహృతులచే వేయి తలాహుతుల నీయవలయును. తరువాత క్రమముగా గంధపుష్పాదులచే శ్రీమన్నారాయణుని పూజించవలయును. శ్రీమన్నారాయణుని ముందు కూర్చొని పురాణ శ్రవణమును చేయవలయును. పన్నెండుమంది బ్రాహ్మణులకు నేయితో కలిపిన పది అపూపములను, పాయసమును, పెరుగన్నమును దక్షిణచే నీయవలయును. దేవదేవ జగన్నాథ భక్తానుగ్రహ విగ్రహ గృహాణోపాయనం కృష్ణ సర్వాభీష్టప్రదో భవ” అను మస్త్రముచే ఉపాయనమును దానము చేయవలయును. (“దేవదేవా ! జగన్నాధా ! భక్తులననుగ్రహించుటకు శరీరమును ధరించినవాడా ! ఈ ఉపాయనమును స్వీకరించి నా అభీష్టములన్నింటిని తీర్చుము” అని మంత్రమునకర్థము.) భూమి పై మోకాళ్ళనుంచి వినయముతో వంగి, చేతులో జోడించి ప్రార్థించవలయును. సురరాజరాజా ! జగన్నివాసా ! నీకు నమస్కారము. నా వ్రతమును సంపూర్ణముగా ఫలవంతమును చేయుము. ఓ పురుషోత్తమా ! నీకు నమస్కారము. ఇట్లు పురుషోత్తమదేవుని చక్కగా ప్రార్థించవలయును. మహాలక్ష్మీ సమేతునికి, అర్యము నీయవలయును. క్షీరసాగరనివాస! లక్ష్మీపతీ ! నీకు నమస్కారము. లక్ష్మీసహితుడవై అర్ఘ్యమును స్వీకరించుము. అచ్యుతుని స్మరణమాత్రమున తపోయజ్ఞక్రియాదులలో న్యూనము పూర్ణమగును. కావున అచ్యుతునకు నమస్కారము. ఇట్లు విజ్ఞాపన చేసి దక్షిణా సహితముగా లక్ష్మీనారాయణ ప్రతిమను ఆచార్యునకు దానమునీయవలయును. తరువాత బ్రాహ్మణులకు భోజనము నుంచి శక్తి ననుసరించి దక్షిణనీయవలయును. బంధుజనులతో కూడి మౌనముగా తాను భుజించవలయును. విద్వజ్జనులతో కలిసి సాయంకాలమువరకు విష్ణుకథలను వినవలయును. ఇట్లు ద్వాదశీవ్రతమును చేయు మనుజుడు ఇహపరములలో అన్ని కోరికలను సంపూర్ణముగా పొందును. ఇరువదిఒకతరములతో అన్ని పాపములనుండి విముక్తుడై, వెళ్ళిన తరువాత శోచించని విష్ణు భవనమునకు వెళ్ళును. ఇట్లు ఈ ద్వాదశీవ్రతమును వినిన వారు చెప్పిన వారు కూడా వాజపేయ యాగఫలమును పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమ పాదమున వ్రతాఖ్యానమున మార్గశీర్ష శుక్ల ద్వాదశీ వ్రతకథనమను పదునేడవ అధ్యాయము ముగిసినది.