నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

19 - ధ్వజారోపణమ్

సనక మహర్షి పలికెను : ధ్వజారోపణమను మరియొక వ్రతమును చెప్పెదను. ఈ వ్రతము అన్ని పాపములను తొలగించును. శ్రీహరికి ప్రీతిని కలిగించును. శ్రీవిష్ణుదేవాలయమున ధ్వజారోహణమును చేసినవారిని బ్రహ్మాదులు కూడా పూజింతురనిన ఇకనేమి చెప్పవలయును. పెద్ద కుటుంబము కల బ్రాహ్మణునకు పదివేల కిలోల బంగారమును (భారసహస్రము) దానము చేసినచో ధ్వజారోపణముతో సమానమగును. ధ్వజారోపణముతో సమానమగునది గంగాస్నానము లేదా తులసీ సేవనము, లేదా శివలింగపూజనము. ఈ ధ్వజారోపణము ఆపూర్వము. ఆశ్చర్యావహము. సర్వపాపహరము. ధ్వజారోపణ వ్రతమున చేయవలసిన కార్యములను నేను చెప్పెదను వినుము. కార్తీక శుక్ల ద్వాదశిన వ్రతమును స్వీకరించదలచిన మానవుడు నియమముతో ప్రాతఃకాలమున దంతధావనమును చేసుకొని స్నానమును చేయవలయును.  పరిశుభ్రమైన వస్త్రములను ధరించి శుద్దుడై, ఒకపూట మాత్రమే భుజించి, బ్రహ్మ చర్యము నవలంబించి శ్రీమన్నారాయణుని ముందు నారాయణునే తలచుచు నిద్రించవలెను. ప్రొద్దునలేచి యథావిధిగా స్నానము చేసి ఆచమించి నిత్యకర్మలను ముగించుకొని శ్రీ మహావిష్ణువును పూజించవలయును. నలువురు బ్రాహ్మణులతో స్వస్తి వాచనమును గావించి నాందీ శ్రాద్దమును చేయవలయును. వస్త్రములను చుట్టిన ధ్వజస్తంభములను గాయత్రీ మంత్రముచే ప్రోక్షించవలయును. భక్తితో సూర్యుని, గరుడుని, చంద్రుని పూజించవలయును. ద్వజదండమున ధాతృవిధాతలను అర్చించవలయును. పసుపు, అక్షతలు, గంధము, తెల్లని పూలు మొదలగు వాటితో విశేషముగా అర్చించవలయును. తరువాత గో చర్మమాత్రము స్థండిలము నేర్పరిచి తన గృహ్య సూత్రప్రకారము అగ్న్యాధానము గావించి యథాక్రమముగా ఆజ్యభాగాదికమును హోమమును గావించవలయును. నేతితో కలిపిన పాయసమును అష్టోత్తర శతాహుతుల నీయవలయును. మొదట పురుష సూక్తముచే, పిదప విష్ణోర్సుకం అను మంత్రముచే, ఇరావతీం అను మంత్రముచే హోమమును చేయవలయును. తరువాత గరుడునికి స్వాహకారములో అష్ణాహుతుల నీయవలయును. తరువాత ‘సోమో ధేనుం’ ‘ఉదుత్యం’ అను మంత్రములచే హోమమును చేయవలయును. అట్లే సౌరమంత్రజపమును చేయవలయును. శక్తి కొలది శాంతి సూక్తమును పఠించవలయును. పవిత్రుడై శ్రీహరి సమీపమున రాత్రిపూట జాగరణము చేయవలయును. తరువాత ప్రాతఃకాలమున లేచి నిత్యకర్మను ముగించుకొని గంధపుష్పాదులచే శ్రీహరిని యథాపూర్వముగా నర్చించవలయును. అపుడు ధ్వజమును మంగళవాద్యములచే సూక్తపాఠములచే నృత్యగీతములతో, స్తోత్ర పాఠములలో విష్ణ్వాలయమునకు తీసుకొని వెళ్ళవలయును. దేవాలయమున ద్వారదేశమున కాని శిఖరమున కాని ఆనందముచే స్థాపించవలయును. ధూపదీపగంధపుష్పాక్షతాదులచే భక్ష్యభోజ్యాదినైవేద్యములచే శ్రీహరిని పూజించవలయును. ఇట్లు దేవాలయమున శోభనముగా ధ్వజమును స్థాపించి ప్రదక్షిణమును చేసి ఈ స్తోత్రమును పఠించవలయును.

 పుండరీకాక్షా ! నీకు నమస్కారము. విశ్వభావనా ! నమస్కారము. ఓ మహాపురుషా! పూర్వజా ! హృషీ కేశా ! నీకు నమస్కారము. ఈ ప్రపంచము నీచే పుట్టినది. నీ యందే నిలిచి యున్నది. నీ యందే లయముకానున్నది. అట్టి నిన్ను శరణు వేడుచున్నాను. బ్రహ్మాది దేవతలు కూడా నీ పరత్వమును తెలియ లేరు. యోగులు చూడలేని జ్ఞానస్వరూపుడవైన నీకు నమస్కరించుచున్నాను. నీకు అంతరిక్షము నాభి. స్వర్గలోకము శిరస్సు, భూమి పాదము. దిక్కులు చెవులు. సూర్య చంద్రులు నేత్రములు. ఋగ్యజుస్సామములు నీనుండి ఆవిర్భవించినవి. నీ ముఖమునుండి బ్రాహ్మణులు, బాహువులనుండి క్షత్రియులు, ఊరువులనుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు పుట్టియున్నారు. మాయా సంగమముచే పుట్టుకలేని ఆత్మను పురుషునిగా వ్యవహరింతురు. వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, నిర్మలుడవు, వికారరహితుడవు, సంబంధమంటనివాడవు. క్షీరసాగరమున శయనించువాడవు అస్తము పరాజయము లేనివాడవు. సద్భక్తవత్సలుడవు. భక్తి మాత్రముచే తెలియువాడవు సర్వవ్యా పివి. అట్టి నీకు నమస్కారము. పృథివ్యాది పంచభూతములు పంచతన్మాత్రలు, ఇంద్రియములు, సూక్ష్మములు, స్థూలములు నీ నుండి కలుగుచున్నవి. అట్టి నీకు నమస్కారము. సర్వలోకములలో ఉత్తమలోకము నీ ధామము. నిర్గుణుడు, పరముడు, సూక్ష్ముడు అయిన నిన్ను శరణు వేడుచున్నాను. పుట్టుక వికారములులేనివానిని, శుద్దుని, సర్వతో బాహుని ఈశ్వరుని యోగీన్దూలచే సర్వకారణకారణునిగా ధ్యానించబడువానికి సర్వప్రాణులకు అంతరాత్మ గా నుండు దేవునికి జగత్స్వరూపునికి నమస్కరించుచున్నాను. నిర్గుణుడు పరమాత్మ యగు విష్ణువు ప్రసన్నుడగుగావుత. మాయా మోహితులకు హృదయమున నున్ననూ దూరముగా నున్నటుల భాసించును. జ్ఞానులకు సర్వాంతర్యామిగా తెలియబడు విష్ణువు నాకు ప్రసన్నుడగుగావుత. నాలుగు వర్ణముల వారిచే, నాలుగు ఆశ్రమముల వారిచే, రాత్రింబవళ్ళచే, అయిదు . విధముల మనుజులచే వాజ్మనస్సులచే పూజింపబడు విష్ణువు నాకు ప్రపన్నుడగుగావుత. జ్ఞానులకు కర్మిష్ణులకు, భక్తులకు ఉత్తమగతిని ప్రసాదించువాడు, ప్రపంచముచే అన్వేషించబడువాడు అయిన విష్ణువు ప్రసన్నుడగుగావుత. జగద్ధితము కొఱకు లీలగా ధరించు దేహములను జ్ఞానులు అర్చింతురు. అట్టి విష్ణువు నా విషయమున ప్రసన్నుడగు గావుత. యోగులచే నిర్గుణుడుగా, గుణాధారుడుగ, సచ్చిదానన్ద విగ్రహుడుగా ధ్యానించబడు విష్ణువు ప్రసన్నుడగురౌవుత. ఇట్లు శ్రీ మహావిష్ణువును స్తుతించి నమస్కరించి బ్రాహ్మణులను పూజించవలయును. తరువాత వస్త్రదక్షిణాదులచే ఆచార్యుని పూజించవలయును.

భక్తి భావముతో బ్రాహ్మణులను భుజింపజేయవలయను. నారాయణ సంస్మరణ చేయుచు పుత్రమిత్ర కళత్ర బంధు పరివార సమేతుడై తాను మౌనముగా భుజించవలయును. ఉత్తమమైన ధ్వజారోపణమును చేసినచో కలుగు ఫలమును చెప్పెదను వినుము. ధ్వజపటము ఎన్ని కదలుటలు చేయునో అన్ని పాపరాశులు నశించి తీరును. మహాపాతకములున్ననూ ఇతరపాతకములున్ననూ విష్ణ్వాలయమున ధ్వజారోహణమును చేసినచో అన్ని పాపములు తొలగిపోవును. విష్ణ్వాలయమున ఎన్ని దినములు ధ్వజముండునో అన్ని వేలయుగములు హరిసారూప్యమును పొందును. ధ్వజారోపణమును చూచి అభినందించినవారు మహాపాతకరాశుల నుండి విముక్తులగుదురు. విష్ణ్వాలయమున ప్రతిష్ఠించిన ధ్వజము తన పటమును ఎగురవేయుచు అర నిముషములో కర్త యొక్క పాపములన్నింటిని నశింపచేయును. విష్ణ్వాలయమున ధ్వజారోహణమును చేసి నిత్యము పూజించినవారు దివ్యవిమానముతో సుమతి మహారాజు వలె స్వర్గమును చేరెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమ పాదమున వ్రతాఖ్యానమున ధ్వజారోపణమను పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.