నారద మహా పురాణము - పూర్వార్థము
120 - ద్వాదశమాసస్థితైకాదశీ వ్రత కధనమ్
కార్తికకృష్ణఏకాదశి రమా అనబడును. ఈనాడు ఉపవసించి ద్వాదశినాడు ప్రాతః కాలమున కేశిహన్తదేవదేవుడు సనాతనుడగు కేశవుని పూజించి బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణ నొసంగి విసర్జించవలయును. ఇట్లు వ్రతమునాచరించినవాడు ఇహమున అఖిల భోగములననుభవించి అంతమున విమానముతో శ్రీపతిసాన్నిధ్యమును చేరును. కార్తీక శుక్లైకాదశి ప్రబోధిని యనబడును. ఈనాడు ఉపవసించి పరుండియున్న కేశవుని గీతాది మంగలములచే, ఋగ్యజుస్సామమంత్రములచే, నానావిధవాద్యములచే మేల్కొలిపి, ద్రాక్షణకు దాడిమరంభాశృంగాటకాది సమర్పణము గావించి, రాత్రి గడిచిన తరువాత మరునాడు స్నానముచేసి నిత్యకృత్యములను నెరవేర్చి గదాదామోదరుని పూజించవలయును. పురుషసూక్తముతో షోడశోపచారములతో పూజించి బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలతో సంతోషింపచేసి, సువర్ణప్రతిమను ధేను సహితముగా గురువునకు అర్పించవలయును. ఇట్లు భక్తితో ఆదరముతో ఈ వ్రతమునాచరించినవాడు ఇహమున సకల భోగములననుభవించి అంతమున విష్ణుపదమును చేరును. మార్గశిర కృష్ణ ఏకాదశి ఉత్పన్నయనబడును. ఈనాడుపవసించి, ద్వాదశినాడు కృష్ణభగవానుని గంధాద్యుపచారములచే పూజించి, బ్రాహ్మణోత్తములను భుజింపచేసి దక్షిణలనిచ్చి వారిని పంపీ ఇష్టబంధు జనముతో సావధానుడై తాను భుజింపవలయును. ఇట్లు భక్తి భావముతో ఉత్పన్నవ్రతము నాచరించినవాడు అంతకాలమున విమానమునధిరోహించి శ్రీ మహావిష్ణుపదమును చేరును. మార్గశీర్ష శుక్లైకాదశి మోక్షదాయనబడును. ఈనాడు పవసించి ద్వాదశినాడు విశ్వరూపుడగు అనస్తుని సర్వోపచారములచే పూజించి బ్రాహ్మణులను భుజింప చేసి దక్షిణల నొసగివారిని విడిచి తాను బంధువులతో కలిసి భుజింపవలయును. ఇట్లు మోక్షదావ్రతము నాచరించినవాడు ఇహమున సకలాభీష్టభోగములననుభవించి మొదటి పదితరములను, తరువాతి పదితరములను తరింపచేసి తాను శ్రీహరిలో లోకమును చేరును. పుష్యబహులైకాదశి సఫలా అనబడును. ఈనాడు ఉపవశించి, ద్వాదశినాడు సర్వోపచారములచే అచ్యుతుని పూజించి, మధురాన్నములతో బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలనిచ్చి విడువలయును. ఇట్లు యధావిధిగా సఫలావ్రతమును ఆచరించినవారు ఇహలోకమున సకల భోగములననుభవించి అంతమున విష్ణు పదమును చేరును. పుష్యశుక్లైకాదశి పుత్రదా అనబడును. ఈనాడు పవసించి ద్వాదశి నాడు గంధాధ్యుపచారములచే చక్రిని పూజించి, బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలనిచ్చి, విడిచి, తాను శిష్టాన్నమును ఇష్ట బాంధవులతో కలిసి భుజించవలయును. ఇట్లు పుత్రదా వ్రతమునాచరించినవారు ఇహలోకమున సకలాభీష్టభోగములననుభవించి అంతమున శ్రీహరి మందిరమును చేరుకొనును.
మాఘకృష్ణేకాదశి షట్టిలాయనబడును. షటిలనాడుపవసించి ద్వాదశినాడు ప్రాతః కాలమున తిలములతోనే స్నానముచేసి, దానముచేసి, తర్పణము చేసి, హోమముచేసి, భుజించి, సమర్పించి, శ్రీవైకుంఠుని చక్కగా సర్వోపచారములచే పూజించి, యధావిధిగా బ్రాహ్మణులను భుజింపచేసి, వారికి దక్షిణనిచ్చి ఇట్లు విధిగా వ్రతమును సావధానముతో నాచరించినవాడు ఇహలోకమున సకల భోగములననుభవించి అంతమున విష్ణుపదమును పొందును. మాఘశుక్లైకాదశి జయ అనబడును. ఈనాడు పవసించి ద్వాదశినాడు ప్రాతః కాలమున శ్రీపతిని చక్కగా పూజించి, బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలనిచ్చ విడిచి, శిష్టాన్నమును సావధానముతో బంధువులతో కలిసి భుజించవలయును. ఇట్లు కేశవతోషణవ్రతము నాచరించు వారు ఇహలోకమున సకలభోగముల ననుభవించి అంతమున విష్ణుపదమును చేరెదరు. ఫాలున బహుళ ఏకాదశి విజయా అనబడును. ఈనాడు పవసించి, ద్వాదశినాడు ప్రాతఃకాలమున యోగీశ్వరుని గంధపుష్పాదులతో పూజించి, బ్రాహ్మణులను భుజింప చేసి దక్షిణలతో సంతోషింపచేసి విడిచి, మౌనముగా బంధువులతో కలిసి తాను భుజించవలయును. ఇట్లు వ్రతము.నాచరించినవారు ఇహలోకమున సకలభోగములననుభవించి అంతమున దేవతలచే సత్కరించబడుచు విష్ణులోకమును చేరెదరు. ఫాలున శుక్లఏకాదశి ఆమలకీయన బడును. ఈనాడు పవసించి, ద్వాదశినాడు సకలోప చారములచే పుండరీకాక్షుని పూజించి, బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలనిచ్చి తాను భుజించవలయును. ఇట్లు ఆమలకీవ్రతము నాచరించినవారు అంతకాలమున శ్రీమహావిష్ణువుయొక్క పరమపదమును చేరెదరు. చేతబహుళ ఏకాదశి పాపమోచనికాయనబడును. ఈనాడు పవసించి ద్వాదశినాడు ప్రాతఃకాలమున షోడశోపచారములచే గోవిందుని పూజించి బ్రాహ్మణులను భుజింపచేసి, దక్షిణలనిచ్చి విడిచిపుచ్చి తాను బంధువులతో కలిసి భుజించవలయును. ఇట్లు పాపమోచనికావ్రతమునాచరించువారు తేజోవంతమగు విమానముతో విష్ణులోకమును చేరెదరు. ఇట్లు శుక్లకృష్ణపక్షములలోని ఏకాదశులలో చేయువ్రతములు మోక్షమును ప్రసాదించునని చెప్పబడినది. ఈ విషయమున ఎట్టి సంశయములేదు. ఈ వ్రతము మూడు దినములలో సాధించగల వ్రతము పాపనాశనము. అన్ని వ్రతములలో ఉత్తమవ్రతము. మహోఫలప్రదము. ఈమూడు దినములలో నాలుగుపూటలు భుజించవలయును. దశమినాడు ఒకపూట, ఏకాదశి నాడు రెండుపూటలు, ద్వాదశినాడు ఒకపూట భుజించరాదు. ఈదినత్రయవ్రతమున ఆచరించవలసిన నియమములను ఇపుడు చెప్పెదను. దశమినాడు కాంస్యమును, మాంసమును, పప్పును, అన్నమును, శనగలను, ద్రవపదార్షమును, శాకమును, మదురాన్నమును రెండవసారి భోజనమును, మైధునమును, ఈపదింటిని విడిచిపెట్ట వలయును. ద్యూతమాడుటను, నిద్రను, తాంబూలమును, దంత ధావనమును, పరాపవాదమును, కొండెములను, చెప్పుటను, చౌర్యమును, హింసను, రతిని, కోపమును, అసత్యభాషణమును ఏకాదశి నాడు విడిచి పెట్టవలయును. కాంస్యమును, మాంసమును, మద్యమును, కారమును, తైలమును, మ్లేచ్చులతో వేశ్యలతో సంభాషణమును, వ్యాయామమును, ప్రయాణమును, రాత్రి భోజనమును, మైధునమును, స్పశించరాని వారిని స్పృశించుటను, ద్వాదశినాడు విడువవలయును. ఈనియమములను పాటించుచు ఉపవాసమునాచరించవలయును. శక్తిలేనివాడు ఒకపూట భుజించ వచ్చును. కాని రాత్రి భోజనము నిషిద్ధము. ఆయాచితమును కూడా ఆచరించవచ్చును కాని ఈవ్రతమును త్యజించరాదు. అనగా తప్పక ఆచరించవలయును అని భావము.
ఇది శ్రీ బహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున ద్వాదశమాసస్థిత ఏకాదశీవ్రతకధనమను నూటా ఇరవైయవ అధ్యాయము సమాప్తము.
