నారద మహా పురాణము - పూర్వార్థము
123 - ద్వాదశమాసస్థిత చతుర్దశీవ్రత వర్ణనమ్
సనాతనమహర్షి పలికెను. ఓ నారదా! ఇపుడు నీకు చతుర్దశీవ్రతములను చెప్పెదను. వినుము. ఈ వ్రతముల నాచరించిన మానవుడు సర్వకానమలను పొందును. చైత్రశుక్లచతుర్దశినాడు కుంకుమాగరు చందనములచే, గంధాదులచే, వస్త్రమణులచే శివునకు మహాపూజను గావించవలయును. మాతృదేవతలను వితానధ్వజఛత్రములనిచ్చి పూజించవలయును. ఇట్లర్చనగావించి ఉపవాసమును కాని ఏకభుక్తమును కాని ఆచరించవలయును. ఇట్లు చేసినచో అశ్వమేధాదియజ్ఞపుణ్యమును పొందును. ఈనాడే గంధపుష్పాదులచే దమనార్చన గావించవలయును. శివరూపియగు శివునకు పూర్ణిమనాడు దమనమును సమర్పించవలయును. వైశాఖబహుళచతుర్దశి నాడు ఉపవసించి సాయంకాలమున స్నానముచేసి ధౌతవస్త్రములను ధరించి శివలింగమును గంధాద్యుపచారములచే బిల్వపత్రములచే చక్కగా పూజించవలయును. ఇట్లే కృష్ణచతుర్దశులలో కూడా ధనమును సంతానమును కోరువారు శివవ్రతము నాచరించవలయును. వైశాఖశుద్ధచతుర్దశినాడు శ్రీనృసింహవ్రతము నాచరించవలయును. శక్తిగలవాడు ఉపవాసముతో, శక్తి లేనివాడు ఏకభుక్తముతో నాచరించవలయును. సాయంకాలసమయమున రాక్షస సంహారకుడగు శ్రీనృసింహస్వామిని షోడశోపచారములతో, పంచామృత స్నానములతో పూజించవలయును. తరువాత ఈమంత్రముతో క్షమాపణను వేడుకొనవలయును. చక్కగా పుటము పెట్టిన బంగారు వన్నెగల కేశములు గల మండుచున్న అగ్నివంటి నేత్రములు కల వజ్రాయుధమును మించిన వాడిగల నఖముల స్పర్శగల ఓ నృసింహా! నీకు నమస్కారము. ఇట్లు దేవదేవుని చక్కగా ప్రార్థించి వ్రతము నాచరించువాడు భూమిమీద పరుండవలయును. ఇంద్రియజయము కలవాడై, కోపమును జయించి అన్ని భోగములను విడిచి వ్రతము నాచరించవలయును. ఇట్లు ఈవ్రతమును యధావిధిగా నాచరించినవాడు ఇహమున అన్ని భోగములననుభవించి అంతకాలమున శ్రీహరిపదమును చేరును. ఈ దినముననే ఓంకారేశ్వర యాత్రను కూడా నాచరించ వలయును. ఇచట పూజ చేయుట దుర్లభము. దర్శనము సమస్తపాపహారము. ఇదియననేల? ఈ ధ్యానమున పూజధ్యానము, జపము, దర్శనము, మొదలగునవన్నీయూ నరులకు జ్ఞానప్రదములు మోక్షప్రదములు. అట్లే ఈదినమున పాపనాశకమగు లింగ వ్రతమును కూడా నాచరించవలయును. శివలింగమును పంచామృతముతో స్నానము చేయించి, కుంకుమాదులతో చక్కగా అర్చించి, ధూపదీపనైవేద్యములతో, ఫలములతో, వస్త్ర విభూషణములతో పిండితో చేసిన శివలింగమును సర్వార్థప్రదమును చక్కగా పూజించిన వారు మహాదేవుని అనుగ్రహము వలన భుక్తి ముక్తిని పొందెదరు. జ్యేష్ఠ శుక్లచతుర్దశినాడు పగలు పంచాగ్ని మధ్యమున నిలిచి, రాత్రిముఖమున హోమధేనువును అర్చించవలయును. ఇదియే రుద్ర వ్రతము. ఆషాఢశుద్ధచతుర్థిశినాడు నరుడు దేశకాలోద్భవములగు పుష్పములతో చక్కగా పూజించి సర్వసంపదలను పొందును. శ్రావణ శుద్ధ చతుర్దశినాడు పవిత్రారోపణము చేయవలయును. ఈపవిత్రారోపణమున తమతమ శాభోక్తవిధిననుసరించి చేయవలయును. పవిత్రమును శతాభిమంత్రితమునుగావించి దేవికి నివేదించవలయును. పవిత్రారోపణమును చేసిన స్త్రీకాని పురుషుడుకాని ఉమాదేవ్యనుగ్రహముతో భుక్తిముక్తులను పొందును. ఇక భాధ్రపదశుక్ల చదుర్గశినాడు అననవతము నాచరించవలయును. చేయవలయును. గోధుమపిండి శర్కర నేయి కలిపి చక్కగా ఉడికించి మొదట గంధాదులతో చక్కగా పూజించి అనస్తునకు నివేదించవలయును. పత్తితో కాని, చర్మముతో కాని నేర్పడిన దారమును పదునాలుగు ముడులు వేసి పాతదానిని తీసేసి, జలాశయమున పడవేసి కొత్తకంకణమును పురుషునకు దక్షిణకరమున, స్త్రీకి వామకరమున కట్టవలయును. పిండివంటలు వండి దక్షిణ సహితముగా బ్రాహ్మణునకిచ్చి తాను మితముగా భుజించవలయును. ఇట్లు పదునాలుగు సంవత్సరములు వ్రతము నాచరించి ఉద్యాపన గావించ వలయును. ధ్యానవర్ణములతో సర్వతోభద్రమండలమును నిర్మించి, ఆమండలమున తామ్రకలశమునుంచి, దానిపై బంగారముతో నిర్మించి అననప్రతిమను పీటపట్టాంశుకముతో అచ్చాదించి యధావిధిగా పూజించవలయును. గణేశుని, మాతృకలను, ఖేటమును, లోకపాలకులను, విడివిడిగా పూజించవలయును. తరువాత హవిస్సుతో హోమమును చేసి పూర్ణాహూతిని ఆచరించవలయును. చక్కగా అలంకరించిన శయ్యను, ధేనువును బంగారు ప్రతిమను గురువునకు సమర్పించవలయును. అట్లే పదునాలుగు మంది బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలతో సంతోషింప చేయవలయును. ఇట్లు ఆదరముతో అనన్తవతము నాచరించినవాడు అననుని అనుగ్రహము వలన భుక్తిముక్తులను పొందును. నరుడుకాని, నారికాని చక్కగా స్నానము చేసి ఉపవనమున నున్న అరటి చెట్టును గంధపుష్పధాన్యాంకుర దధిదూర్వా అక్షతాదులచే, దీపములచే, వస్త్రములచే, పక్వాన్నములచే, చక్కగా పూజించి ఇట్లు ప్రార్థించ వలయును. అప్సరోదేవకన్యలచే, నాగకన్యలచే పూజించబడు రంభావృక్షమా? నాకు శరీరారోగ్యమును, లావణ్యమును ప్రసరించుము. ఇట్లు ప్రార్థించి నలుగురు కన్యలను కాని, ముత్తయిదవులను కాని చక్కగా భుజింపచేసి అంశుకసిందూర కజ్జలఅలక్షములను సమర్పించి, నమస్కరించి నియమమును ముగించి తన ఇంటికి వెళ్ళవలయును. ఇట్లు వ్రతమును చేసినచో ఉత్తమమగు సౌభాగ్యమును పొంది, అస్తమున విమానముతో స్వర్గలోకమును చేరును. ఆశ్వయుజ బహుళచతుర్దశినాడు విష, శస్త్ర, అంబు, అగ్నులచే, సర్పములచే, జంతువులచే వజ్రాదులచే మరణించినవారికి, బ్రహ్మఘాతకులకు, ఏకోద్దిష్టవిధానముతో క్రియాశ్రాద్ధమును చేయవలయును. బ్రాహ్మణ వర్గమును మిష్టపక్వాన్నములతో భుజింపచేయవలయును. తర్పణమును, గోగ్రాసమును, కాకశునకములకు బలిని చేసి, ఆచమనమును చేసి, తరువాత బంధువులతో కలిసి భుజించవలయును. ఇట్లు దక్షిణలతో చక్కగా శ్రాద్ధమును చేసినచో పితృదేవతలనుద్ధరించి సనాతనమగు దేవలోకమును చేరును.
అశ్వయుజశుక్లచతుర్దశినాడు ధర్మరాజును గంధాదులతో చక్కగా పూజించి బ్రాహ్మణుని భుజింపచేసి, సువర్ణమును దానము చేసినచో ధర్మరాజు కాపాడును. ఇట్లు ధర్మరాజుప్రతిమను దానము చేసినవాడు ఇహలోకమున ఉత్తమభోగములనను భవించి ధర్మరాజాజ్ఞచే స్వర్గమును పొందును. కార్తీక కృష్ణ చతుర్దశినాడు చంద్రోదయకాలమున తైలాభ్యంగమును చేసుకొని స్నానముచేసి ధర్మరాజును పూజించి నరకమునుండి అభయమును పొందును. ప్రదోషకాలమున యమధర్మరాజ ఫ్రీతికొరకు సావధానముతో నూనె దీపములను నాలుగు దారుల కూడలిలోకాని, ఇంటి బయటి ప్రదేశమునకాని నుంచవలయును. హేమలంబసంవత్సర కార్తిక శుద్దచతుర్దశినాడు అరుణోదయకాలమున స్నానముచేసి దేవతలతో పాటు విశ్వేశ్వరుడు మణికర్ణికాతీర్థమున భస్మముతో త్రిపుండ్రమును ధరించి తననుతాను చక్కగా పూజించుకొని పాశుపతవ్రతమును ఆచరించెను. కావున ఆదినమున శివలింగమున గంధాదులతో మహాపూజనాచరించవలయును. ద్రోణపుష్పములతో బిల్వదలములతో, జిల్లేడు పూవులతో, కేతక పుష్పములతో, ఫలములతో, మిష్టాన్నములతో, పక్వాన్నములతో, బహువిధనైవేద్యములతో పూజించి ఏకభుక్తముతో విశ్వేశ్వరప్రీతికరమగు వ్రతము నాచరించి, ఇహపరములలో సకలాభీష్టములను పొందును. ఈదినమున అభివృద్దిని కోరువారు బ్రహ్మకూర్చవ్రతము నాచరించవలయును. ఉపవాసముతో రాత్రియందు జితేంద్రియుడై పంచగవ్యపానమును చేయవలయును. కపిలాధేనుమూత్రమును, కృష్ణగోమయమును, శ్వేత గోక్షీరమును, రక్తగోవుదధి, కుర్బురో గోఘృతమును ఒకచోట కలుపవలయును. ప్రాతః కాలమున దర్భజలముతో స్నానముచేసి దేవతలకు సంతర్పణచేసి, బ్రాహ్మణులను సంతోషింపచేసి, మౌనముగా భుజించవలయును. ఈ బ్రహ్మకూర్చవ్రతము సర్వపాతక నాశనము. బాల్యమున, కౌమారమున, వార్థక్యమున చేసిన పాపములన్నియూ బ్రహ్మకూర్చోపవాసముతో వెంటనే నశించును. ఈ దినముననే పాషాణవ్రతముకూడా చెప్పబడినది. దానిని వినుము. పగలు రాత్రి ఉపవసించి, పాషాణాకారపిష్టమును ఘృతపక్వముగాచేసి, గంధాదులతో గౌరీదేవిని పూజించి నైవేద్యమును సమర్పించవలయును. ఈవ్రతమును యధావిధిగా నాచరించి ఐశ్వర్యసౌఖ్యసౌభాగ్యసౌందర్యములను పొందును.
మార్గశిరశుక్లచతుర్దశినాడు ఏకభుక్తముతో కాని, నిరాహారముగా కాని స్వర్ణవృషమును చక్కగా పూజించి బ్రాహ్మణునకు దానము చేయవలయును. మరునాడు ప్రాతఃకాలమున లేచి స్నానము చేసి ఉమాసహితమహేశ్వరుని కమల పుష్పములతో, గంధమాల్యాను లేపనములతో పూజించి, బ్రాహ్మణులను మిష్టాన్నములతో భుజింపచేసి, దక్షిణాదులతో ప్రీతుల గావించవలయును. ఇదీ శివవ్రతము. భుక్తిముక్తి ప్రదము. ఈవ్రతమును చేయువారికి, ఉపదేశించువారికి, సహాయము చేయువారికి, ఆమోదించువారికి భుక్తిముక్తులు లభించును. పుష్యశుక్ల చతుర్దశినాడు విరూపాక్షవ్రతము నాచరించవలయును. ఈదినమున అగాధజలమును స్నానమునుచేసి విరూపాక్షుడగు శివుని చక్కగా ధ్యానించి పూజించవలయును. గంధమాల్యనమస్కారములను, ధూపదీపాన్నసంపదలను బ్రాహ్మణునకు సమర్పించి స్వర్గమున దేవతలవలె ఆనందించును. మాఘకృష్ణచతుర్దశినాడు యమతర్పణము చెప్పబడినది. సూర్యోదయకాలమునకు పూర్వమే స్నానముచేసి, పదునాలుగు నామములతో యమునికి తర్పణము గావించవలయును. ఇట్లు చేసినచో సర్వపాపములు నశించును. తిలదర్భజలములచే తర్పణమును చేయవలయును, నువ్వుల అన్నముతో బ్రాహ్మణులను భుజింపచేయవలయును. తాను కూడా మౌనముగా ఆయన్నమునే భుజించవలయును. ఫాలున బహుళచతుర్దశినాడు శివరాత్రివ్రతమును ఆచరించవలయును. ఈ దినమున నిర్జలముగా ఉపవసించి పగలురాత్రి స్వయంభువలింగమును కాని, పార్థివలింగమును కాని సావధానముగా, గంధాద్యుపచారములచే, జలముతో, బిల్వదలాదులచే, ధూపదీపనైవేద్యములచే, స్తోత్రపాఠములచే, జపాదులచే చక్కగా పూజించవలయును. తరువాత మరునాడు మరల ఉపచారములచే చక్కగా పూజించి, మిష్టాన్నములతో బ్రాహ్మణులకు చక్కగా భుజింపచేసి, దక్షిణలనిచ్చి పంప వలయును. ఇట్లు వ్రతము నాచరించి మహాదేవాను గ్రహముతో దేవతలతో ఆదరింపబడి దివ్యభోగములనను భవించును. ఫాల్గుణ శుక్లచతుర్దశినాడు భక్తితో దుర్గాదేవిని గంధాద్యుపచారములచే చక్కగా పూజించి బ్రాహ్మణులను భుజింపచేయ వలయును. ఏక భుక్తముతో నిట్లు దుర్గావ్రతమునాచరించి ఇహపరములలో సకలా భీష్టములను పొందును. చైత్రబహుళచతుర్దశినాడు ఉపవసించి కేదారోదకపానమును చేసినచో అశ్వమేథ యాగఫలమును పొందును. ఇట్లు సమస్త చతుర్దశీ వ్రతములను ఉద్యాపనము సామాన్యముగా ఒకేవిధముగా చెప్పబడినది. పదునాలుగు, కలశములు పూగాక్షతమోదకములతో, దక్షిణాంశుకములతో తామ్రములు కాని మృణ్మయములు కాని కొత్తవి స్థాపించి పదునాలుగు వెదురు దండములను, పవిత్రములను, ఆసనములను, పాత్రలను, యజ్ఞసూత్రములను కూడా పదునాలుగుంచవలయును. మిగిలిన దంతయూ పూర్వము చెప్పినట్లు శాఠ్యము లేకుండగా నాచరించ వలయును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున ద్వాదశమాసస్థిత చతుర్దశీవ్రతవర్ణనమను నూటా ఇరువదిమూడవ అధ్యాయము సమాప్తము.
