నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

33 - యోగనిరూపణమ్

నారదమహర్షి పలికెను :- పూజ్యుడా ! అన్నీ తెలిసిన మీరు నేనడిగిన దానినంతటిని చెప్పితిని. సంసార పాశబద్దులైన వారు అనుభవించు పలు దుఃఖములను వివరించితిరి. ఈ సంసారపాశమును ఛేదించునదేది ? యే ఉపాయముచే మోక్షము లభించునో అదంతయూ నాకు వివరించుడు. ప్రాణులు ప్రతిదినము తప్పక కర్మలను చేయుచుందురు.  అట్లే కర్మఫలములను అనుభవించెదరు. కూడా. ఆ కర్మ లేట్లు నశించును ? కర్మ చేతనే దేహమును పొందును. దేహము గల జీవుడు కొమముచే బంధించబడును. కామముచే లోభమును పొందును. లోభముచే కోపము కలుగును. కోపముచే ధర్మము నశించును. ధర్మనాశమునే స్మృతిభ్రంశము కలుగును. స్మృతిభ్రంశము వలన మతిభ్రమ కలుగును. మతిభ్రంశము వలన మానవుడు మళ్ళీ పాపమును చేయును. కావున దేహమే పాపమూలము. పాపకర్మరతము. కావున దేహభ్రమమును వదిలి మోక్షమును పొందు ఉపాయమును తెలుపుడు.

 సనకమహర్షి పలికెను :- ఓ మహాప్రాజ్ఞా ! బాగు బాగు. నీ బుద్ధి నిర్మలమైనది. కావుననే సంసారదుఃఖమునుండి మోక్షమునకు ఉపాయమును తెలియగోరుచున్నావు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞచే బ్రహ్మ సృజించుచున్నాడు. విష్ణువు పాలించుచున్నాడు. రుద్రుడు నశింపచేయుచున్నాడు. ఆ శ్రీమన్నారాయణుడే మోక్షము నిచ్చువాడు. అహంకారతత్త్వమునుండి విశేషములవరకు శ్రీమన్నారాయణుని ప్రభావము వలననే కలుగును. కావున అట్టి నిర్వికారుడగు శ్రీమన్నారాయణుడు మాత్రమే మోక్షము నిచ్చువాడు. ఈ ప్రపంచమంతయూ శ్రీమన్నారాయణుని కంటే భిన్నముకాదు. ఈ ప్రపంచము తోచును. తోచకపోవును. అట్టి జరాదిరహితుడు ఉగ్రుడు అగు నారాయణుని ధ్యానించి దుఃఖమునుండి విముక్తుడగును. అవీకారుడు, అజుడు, శుద్దుడు, స్వప్రకాశుడు, నిరంజనుడు, జ్ఞానరూపుడు, సదానందస్వరూపుడు అగు శ్రీమన్నారాయణుడే మోక్షసాధనుడు. శ్రీమన్నారాయణుని అవతార రూపములను బ్రహ్మాది దేవతలు పూజింతురు. ఆ శ్రీమన్నారాయణుడే శాశ్వతస్థానప్రదుడు. జితప్రాణులు, జితాహారులు, సదాధ్యానపరాయణులు సత్యస్వరూపునిగా సాక్షాత్కరించుకొను శ్రీమన్నారాయణుడు సుఖావహుడని తెలియుము. గుణరహితుడయ్యును. గుణాధారుడు, లోకానుగ్రహము కొఱకు రూపమును ధరించువాడు, ఆకాశమధ్యగుడు పూర్ణుడు అగు శ్రీమన్నారాయణుడే ప్రాణులకు మోక్షమును ప్రసాదించువాడు. సర్వకార్యములకధ్యక్షుడు దేహి హృదయములోనుండువాడు, సాటిలేనివాడు, అఖిలాధారుడు అగు ఆ శ్రీమన్నారాయణుడే మోక్షప్రదుడని తత్త్వదర్నులగు మునులు చెప్పుచుందురు. వేదార్థమును తెలిసినవారు కర్మజులు పలు యజ్ఞములచే శ్రీమహావిష్ణువును పూజింతురు. అతనే కర్మఫలప్రదుడు, మోక్షప్రదుడు. శ్రీమహావిష్ణువే హావ్యకవ్యాది దానములలో దేవపితృరూపములను ధరించి భుజించును. ఆ ప్రభువే మోక్షప్రదుడు. శ్రీమన్నారాయణుని భక్తితో ధ్యానించిననూ ప్రసాదించును. కావున ఆ దయాలువును ఆర్చించవలయును. సర్వభూతములకాధారభూతుడు ఉత్తమపురుషుడు అగు ఒక్క శ్రీమహావిష్ణువే జరామరణరహితుడు అవ్యయుడు. ఆ విష్ణువే మోక్షప్రదుడు. శ్రీమన్నారాయణుని భక్తితో ధ్యానించిననూ ప్రణామము లాచరించిననూ పూజించిననూ శాశ్వతమగు మోక్షమును ప్రసాదించును. శ్రీమన్నారాయణుని పాదపద్మములను పూజించి ప్రాణులు కూడా అమృతత్వమును పొందుదురు. కావున ఆ శ్రీహరిని పురుషోత్తముడందురు. శ్రీమహావిష్ణుని పరమపదము ఆనంద స్వరూపము. అజరము. బ్రహ్మ స్వరూపము, పరంజ్యోతి, సనాతనము పరములన్నిటికంటే పరతమము. శ్రీమన్నారాయణుడు అద్వితీయము నిర్గుణము నిత్యము సాటిలేనిది పరిపూర్ణము జ్ఞానమయము అగు స్వరూపము గలవాడు మోక్షప్రసాదకుడు ఇట్టి పరమోత్కృష్టమైన వస్తువైన శ్రీమన్నారాయణుని ఉపాసించు యోగి మాత్రమే పరమపదమును పొందును. అన్ని సంగములను పరిత్యజించి శమాదిగుణసహితుడై కామాదులను వర్ణించిన యోగియే పరమపదమును పొందును.

నారద మహర్షి పలికెను :- ఓ మహానుభావా ! యోగులకు ఏ కర్మనాచరించుటచే యోగసిద్ది లభించునో ఆ ఉపాయమును ఉన్నదున్నట్టుగా నాకు తెలుపుము.

సనక మహర్షి పలికెను :- జ్ఞానము వలన లభించునది మోక్షము, అని తత్త్వార్థ చింతకులు చెప్పెదరు. ఆ జ్ఞానము భక్తిమూలము. భక్తి కర్మపరులకే సిద్దించును. కొన్ని వేల జన్మల దానములను యజ్ఞములను పలువిధములైన తీర్థయాత్రాదులను చేసినవారికి శ్రీహరియందు భక్తి కలుగును. కొంచెము భక్తి చే అక్షయ మగు పరమధర్మము సిద్ధించును. ఉత్తమమైన శ్రద్ధచే అన్ని పాపములు నశించును. అన్ని పాపములు నశించునచో బుద్ది నిర్మలమగును. ఆ నిర్మల బుద్ధినే జ్ఞానమని జ్ఞానులు చెప్పిరి. ఆ జ్ఞానమే మోక్షమునిచ్చును. ఆ జ్ఞానము యోగులకు మాత్రమే కలుగును. కర్మయోగము జ్ఞానయోగము అని యోగము రెండు విధములుండును. కర్మయోగము. లేనిచో జ్ఞానయోగము సిద్ధించదు. కావున క్రియాయోగరతుడై మానవుడు శ్రద్ధతో శ్రీహరిని అర్చించవలయును. బ్రాహ్మణులు, భూమి, అగ్ని, జలము, సూర్యుడు, ధాతువులు, హృదయము, చిత్రము ఇవియన్నియు కేశవుని స్వరూపమే. కావున ఈ ప్రతీకలలో శ్రీహరిని భక్తిచే పూజించవలయును. మనోవాక్కాయములచే పరపీడనము చేయక సర్వగతుడైన శ్రీ మహావిష్ణువును భక్తిచే పూజించవవయును. అహింస, సత్యము, అక్రోధము, బ్రహ్మ చర్యము, అపరిగ్రహము, ఈర్షలేకపోవుట దయ అనునవి కర్మజ్ఞానయోగములలో రెండింటిలో సమానముగా నుండదగినవి. చరాచరాత్మకమగు ఈ విశ్వమంతయు శ్రీహరియే అని మనసులో నిశ్చయించి కర్మ జ్ఞానయోగములను అభ్యసించవలయును. అన్ని ప్రాణులను తనవలె చూడగలుగు వాడే దేవదేవుడగు శ్రీహరియొక్క పరతత్త్వ స్వరూపమును చూడగలరు. క్రోధాదులతో చెడిన మనసుకలవాడు శ్రీహరిని పూజాధ్యానములతో సేవించినను ధర్మ ప్రభువైన విష్ణువు అతనికి ప్రసన్నుడు కాజాలడు. కామాదులచే చెడిన మనసుకలవాడు దేవపూజాపరుడైనను అదియంతయు దంభాచారమని అతను పాతకులందరితో సముడని తెలియువలయును. తపస్సును పూజాధ్యానములు నిరర్థకములగును. కావున కర్మయోగము నాచరించు నరుడు శమాదమాదిగుణములు కలవాడై సర్వాత్మకుడగు శ్రీ మహావిష్ణువును మోక్షముకొఱకు అర్చించవలయును. మనోవాక్కర్మలచే సర్వలోకముల హితమును కోరుచు శ్రీహరిని పూజించుటయే క్రియాయోగమనబడును. సర్వాంతర్యామి, జగత్కారణుడు, సర్వదోషకారియగు శ్రీ మన్నారాయణుని స్తోత్రాదులచే స్తుతించుటయే కర్మయోగమనబడును. ఉపవాసాదులచే పురాణశ్రవణాలచే పుష్పాదులచే శ్రీమహావిష్ణువు నరిచుటయే క్రియాయోగమనబడును. ఇట్లు భక్తి కలిగి క్రియాయోగపరులైన వారికి పూర్వజన్మలో సంపాదించిన పాపములన్నియు నశించును.. పాపములు నశించుటవలన శుద్దమతి అయి ఉత్తమ జ్ఞానమును అభిలషించును. ఈ జ్ఞానమే మోక్షము నిచ్చును. ఆ జ్ఞానమును సంపాదించు ఉపాయమును నీకు చెప్పెదను.

చరాచరాత్మకమగు ఈ ప్రపంచమున శాస్త్రార్ధకోవిదులగు సజ్జనులతో నిత్యానిత్యముల విషయమున చక్కగా విచారణ చేయవలయును. పదార్థములనిత్యములు. శ్రీహరి ఒక్కడే నిత్యుడు. అనిత్యములను విడిచి నిత్యమునే ఆశ్రయించవలయును. ఇహపరలోకములందలి భోగముల విషయమున విరక్తుడు కావలయును. విరక్తుడు కానివాడు సంసారమున ప్రవర్తించును. అనిత్యపదార్థములందు రాగమును పెంచుకొన్నవానికి ఎపుడూ సంసారవిచ్ఛిత్తి జరుగదు. మోక్షమును కోరువాడు శమాదిగుణసంపన్నుడై జ్ఞానమునభ్యసించవలయును. శమాదిగుణహీనునకు జ్ఞానము కలుగదు. రాగద్వేషవి హీనుడై శమాదిగుణయుతుడై నిత్యము హరిధ్యానపరుడైన వానిని ముముకువందురు. ఈ నాలుగు సాధనములచే విశుద్దమతి యగును. సర్వభూతదయాపరుడై విష్ణువును. సర్వగతునిగా భావించవవయును. క్షరాక్షరాత్మకమగు ఈ ప్రపంచమునంతటిని నారాయణుడు వ్యాపించియుండును. అని తెలిసిన విప్రునికి కలుగు జ్ఞానము యోగము వలన కలుగును అని తెలియును. కావున ఇపుడు సంసార నీవర్తకమగు యోగోపాయమును చెప్పేదను. యోగజ్ఞానము విశుద్దమగును. ఆ జ్ఞానమే మోక్షమును ప్రసాదించును. పరము అపరము అను భేదముచే ఆత్మ రెండు విధములందురు. రెండును బ్రహ్మ లే అని అధర్వశ్రుతి. పరుడు నీరుణుడు, అపరుడు అహంకారయుతుడు. ఈ రెండు అభిన్నములని తెలియుటే యోగమని చెప్పబడినది. పంచభూతాత్మకమగు దేహమున సాక్షిగా హృదయమున నున్నవాడు అపరుడనబడును. పరమాత్మ పరుడనబడును. శరీరము క్షేత్రము అనబడును. శరీరమున నున్నవాడు క్షేత్రజ్ఞుడనబడును. అవ్యక్తుడు పరముడు శుద్దుడు పరిపూర్ణుడనబడును. జీవాత్మ పరమాత్మలకు అభేదవిజ్ఞానము కలుగునపుడు జీవాత్మకు సంసార పొశచ్చేదమగును. పరమాత్మ ఒక్కడు, శుద్దుడు, అక్షరుడు, నిత్యుడు, జగన్మయుడు. నరుల జ్ఞానభేదముచే భేదముగలవానివలె తోచును. సనాతనుడగు పరబ్రహ్మ ఏకము అద్వితీయము. వేదాంతములు పరమాత్మకంటే పరములేదని గానము చేయుచున్నవి. ఆ పరమాత్మకు కర్మ, కార్యము, రూపము, వర్ణము కర్తత్వము భోక్తృత్వము లేవు. అన్ని తేజస్సుల కంటే పరమైన తేజము అన్ని హేతువులకు నిదానము. దానికంటే మరొకటి లేదని ముక్తిని కోరువారు తెలియవలయును. మహావాక్యాదికము సర్వము శబ్దబ్రహ్మముగా తెలియుము. ఆ శబ్ద బ్రహ్మమును విచారించుటచే కలిగిన జ్ఞానమే మోక్షసాధనము. సమ్యక్ జ్ఞానము లేనివారికి జగత్తు పలువిధములుగా కనిపించును. పరమజ్ఞానులకిదియే జగత్తు పరబ్రహ్మాత్మకముగా కనిపించును. పరబ్రహ్మ ఒక్కడే పరముల కంటే పరుడు నిరుణుడు పరానన్దుడు. విజ్ఞానభేదముచే అవ్యయుడు బహురూపధరుడుగా తోచును. మాయచే పరమాత్మలో భేదమును చూచెదరు. కావున ముముక్షువు మాయను త్యజించవలయును. మాయసద్రూపముగాదు అసద్రూపమూ కాదు. ఉభయాత్మకము కాదు. కావున మాయ నిర్వచించవీలులేనిది భేదబుద్ధిప్రదాయని అని వ్యవహరించబడును. మాయయే అజ్ఞాన శబ్దముచే తెలియబడుచున్నది. మాయను జయించువారికి అజ్ఞానవిచ్ఛేదము కలుగును. సనాతనమగు పరబ్రహ్మ జ్ఞానశబ్దముచే చెప్పబడును. పరమాత్మ జ్ఞానులహృదయమున నిరంతరము భాసించును.

ఓ మునిసత్తమా ! యోగి యోగముతో అజ్ఞానమును నశింపచేయవలయును. యోగము అష్టాంగములతో సిద్ధించును. ఆ అష్టాంగములను యథార్థముగా చెప్పెదను, యమ నియమ, ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అను ఎనిమిది యోగాంగములు. ఇక ఇపుడు ఈ ఎనిమిది లక్షణములను సంక్షేపముగా చెప్పెదను. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మ చర్యము, అపరిగ్రహము, అక్రోధము, అనసూయ అను ఏడు యమములు. ఏ ప్రాణికీ క్లేశము కలిగించకుండుట అహింసయనబడును. ఈ అహింస యోగసిద్ధిని కలిగించును. ధర్మాధర్మ వివేకముతో యథార్ధమును సత్యమందురు. చౌర్యముచేత కాని బలముచేత కాని పరద్రవ్యాపహరణమును సేయమందురు. దానికి విపరీతము అస్తేయమని సజ్జనులు చెప్పుచున్నారు. అంతటా మైధునమును పరిత్యజించుట బ్రహ్మ చర్యమందురు. బ్రహ్మ చర్యమును పరిత్యజించినచో జ్ఞాని కూడా పొతకి యగును. సర్వసంగపరిత్యాగియైనను స్త్రీ సంగతితో ప్రవర్తించినచో అతను సర్వవర్ణబహిష్కృతుడగు చండాలసముడగును. యోగరతుడైన విప్రుడు విషయస్పృహ కలిగియున్నచో అతనితో సంభాషించినంతనే బ్రహ్మహత్యా పొతకము కలుగును. సర్వసంగపరిత్యాగి మరల సంగి అయినచో అతనితో కలిసియున్నవారితో కలిసిన వారికీ మహాపాతకదోషము సంభవించును. ఆపదలో కూడా ద్రవ్యములను స్వీకరించకుండుట యోగసిద్ధిని కలిగించు అపరిగ్రహమందురు. తన ఆధిక్యముచే అతికఠినముగా మాటలాడుటను ధర్మవిదులు క్రోధమందురు. దానికి విపరీతము అక్రోధమనబడును. ఎదుటవాడు ధనాదులతో అధికముగా ఉండుటను చూచి మనసున పరితపించుట అసూయ అనబడును. అసూయను వదులుట అనసూయ అని సజ్జనులు చెప్పెదరు. ఇట్లు సంక్షేపముగా యమములను చెప్పితిని. ఇపుడు నీయములను చెప్పెదను. వినుము.

తపస్సు, స్వాధ్యాయము, సంతోషము, శౌచము, హరిపూజనము, సంధ్యోపాసన, మొదలగునవి నియములని చెప్పబడినవి. చాంద్రాయణాదివ్రతములచే శరీర శోషణమే ఉత్తమయోగసాధనమగు తపమని సజ్జనులు చెప్పియున్నారు. ప్రణవమును ఉపనిషత్తులను ద్వాదశాక్షర మంత్రమును. అష్టాక్షర మంత్రమును మహావాక్య చయమును జపించుటయే స్వాధ్యాయమనబడును. ఇది ఉత్తమమగు యోగసాధనము. స్వాధ్యాయమును వదిలిన మూడునకు యోగము సిద్ధించదు. యోగము లేకున్నను స్వాధ్యాయముచే మానవులకు పాపము నశించును. స్వాధ్యాయములచే స్తుతించినచో దేవతలు ప్రసన్నులగుదురు. వాచికము, ఉపాంశు, మానసము అను భేధములచే జపము మూడు విధములు. ఈ మూడు విధములలో మొదటి దానికంటే తరువాతిది శ్రేష్టము అని చెప్పబడినది. అక్షరములు పదములు స్పుటముగా ఉండునట్లు మంత్రమునుచ్చరించుట వాచిక జపమందురు. ఈ వాచికజపము సర్వయజ్ఞ ఫలప్రదము. మంత్రమును ఉచ్చరించునపుడు కొంచెము ఒక పదమునుండి మరియొకపదమును విడిగా తెలియునట్లు పలుకుట ఉపాంశుజపమందురు. ఉపాంశుజపము వాచికజపము కంటే రెట్టింపు ఫలమునిచ్చును. అక్షరముల క్రమమును నిర్ణయించి అర్థమును విచారించుట మానసజపమందురు. మానస జపము యోగసిద్దిప్రదాయకము. జపముచే స్తుతించినచో దేవతలు ప్రసన్నలగుదురు. కావున స్వాధ్యాయసంపన్నుడు సర్వమనోరథములను పొందును. దైవవశమున లభించినదానిచే తృప్తిని పొందుట సంతోషమనబడును. సంతోషములేని మానవుడు ఎచటను సుఖమును పొందలేడు. కామములు అనుభవముచే ఎప్పుడూ తృప్తిని కలిగించవు. ఇక మరి కొంచెమును పొందవలయునని కామము పెరుగుచునేయుండును. దేహమును తపింపచేయు కొమమును విడిచి దైవవశమున లభించిన దానిచే సంతోషించి ధర్మపరాయణుడు కావలయును.

బాహ్యము ఆభ్యన్తరము అని శౌచము రెండు విధములు. నీరుచే మట్టిచే బహిశ్శుద్ధి జరుగును. భావశుద్ధి ఆంతరశుద్దియనబడును. అంతశ్శుద్ధిలేనివారు ఎన్ని యజ్ఞములను ఆచరించిననూ బూడిదలో విడిచిన హవ్యములవలె ఫలించజాలవు. భావశుద్ధి లేనివారు చేయు కర్మలన్నియు నిష్పలములే యగును. కావున రోగాదికములను విడిచి సుఖవంతుడు కావలయును. ఎన్ని మట్టిరాశులచే కాని కోటి కలశముల జలముచే కాని శుద్ధి పొందినను భావదుష్టుడైనచో చండాల సదృశుడగును. అంతశ్శుద్ధివిహీనుడై దేవపూజాపరుడైనచో ఆ దైవమే ఆతనిని వధించును. నరకమును పొందింపచేయును. అంతశుద్ధివిహీనుడై బహిశాచమును చేయువాడు అలంకరింబడిన సూరాభాండమువలే శాంతిని పొందజాలడు. మనశ్శుద్ధిలేనివారు తీర్థయాత్రలను చేసినచో సురోభాండమును నదిపొవనము చేయజాలనట్లు పావనము చేయుజాలవు. వాక్కుచే ధర్మములను చెప్పుచు మనసులో పాపమును కోరినవాడు మహాపాతకులలో శేషుడగును. మనశ్శుద్ధి కలవారు ఉత్తమధర్మా చరణగావించినచో అక్షయఫలము లభించును. ఉత్తమసుఖమును పొందును. మనోవాక్కాయములచే దృఢమైన హరిభక్తియే హరిపూజ యనబడును. ఇట్లు యమములను నియమములను సంక్షేపముగా వివరించితిని. ఈ యమనియములచే మనశ్శుద్దిగలవారికి మోక్షము హస్తగతమని తెలియుము.

ఇట్లు యమ నియములతో స్థిరబుద్ది జితేంద్రియుడై ఉత్తమము యోగసాధనము అయిన ఆసనమును చక్కగా అభ్యసించవలయును పద్మకము, స్వస్తికము, పీఠము, సైంహము, కౌక్కుటము, కౌంజరము, కౌర్మము, వజ్రాసనము, వారాహము, మృగశౌలికము, నాలికము, సర్వతోభద్రము, వార్షభము, నాగము, మాత్స్యము, వైయాఘ్రము, అర్థచంద్రకము, దండము, వాతాసనం, శైలము, స్వభ్రము, మౌద్గరము, మాకరము, త్రేపథము, కొషము, స్థాణువు వైకర్ణికము, భౌమము, వీసరాసనము అని ముప్పది ఆసనములు యోగసాధన కారణములని మునీంద్రులు చెప్పుచున్నారు. వీటిలో ఏదేని ఒక దానిని తెలుసుకొని గురుభక్తి పరాయణుడై ద్వంద్వాతీతుడు మాత్సర్యరహితునిగా ఉండి ఉపాసకుడు. ప్రాణములను జయించవలయును. తూర్పు ఉత్తరము పశ్చిమములలో ఏదేని ఒక దిక్కునకు ముఖము నుంచి కూర్చుని నిశ్శబ్దము నిర్జనము అయిన ప్రాంతమున అభ్యాసముతో ప్రాణములను జయించవలయును. శరీరములో నుండు వాయువు ప్రాణమనబడును. ఆయామమనగా నీగ్రహము. ప్రాణవాయుని నిగ్రహమును ప్రాణాయాయమందురు. ప్రాణాయామము రెండు విధములు. అగర్భము సగర్భము అని ఈ రెంటిలో సగర్భము శ్రేష్టమైనది. జపము ధ్యానము లేక చేయునది ఆ గర్భము. జపధ్యానములతో చేయునది సగరము. రేచకము, పూరకము, కుంభకము, శూన్యకము అని ప్రాణాయామము చతుర్విధము. ప్రాణులకు దక్షిణభాగమున నుండు నాడి పింగల అనబడును. పింగలానాడికి సూర్యుడు అధిదేవత. ఉత్పయోని అని మరియొక పేరు. వామ భాగమున నుండు నాడిని ఇడ అందరు ఇడా నాడి దేవయాని, చంద్రదైవతము. ఈ రెండు నాడుల మధ్యనుండు నాడి సుషుమ్నా అందరు. ఈ సుషుమ్న అతిసూక్ష్మమైనది. పరమరహస్య మైనది. బ్రహ్మ దేవతాకము. వామమార్గము ద్వారా వాయువును బయటకు రేచకము (విడుచుట) చేయవలయును. రేచనము చేయుటచే రేచకమని పేరు. దక్షిణమార్గముచే వాయువును పూరించవలయును. పూరించుటచే పూరకమని పేరు. ఇట్లు నింపిన పొయువును విడువక నిగ్రహించుటయే కుంభకమనబడును. నిండుకుండవలె ఉండుట వలన కుంభకమందురు. బయట వాయువును తీసుకొనక, లోపలి పొయువును విడువక ఉండుటను శూన్యకమందురు. మదించిన ఏనుగును వశపరుచుకొనునట్లు ప్రాణమును మెల్లి మెల్లగా వశము చేసుకొనవలయును. ప్రాణాయామమును అట్లు (మెల్లమెల్లగా) చేయనిచో భయంకరములైన మహరోగములు కలుగును. కల్మషము లేనివాడై యోగి క్రమముగా వాయువును నియోగించవలయును. అట్లు చేసినచో అన్నిపాపములనుండి విముక్తుడై బ్రహ్మపదమును చేరును.

ఓ మునీశ్వరా ! విషయములందు ప్రసక్తములైన ఇంద్రియములను వేననకు తీసుకొని నిగ్రహించు ఓ ప్రత్యాహారమనబడును. ధ్యానములేని వారైనను ఇంద్రియ జయము కలగిన మహానుభావులు పునరావృత్తిరహిత పరమపదమును చేరెదరు. ఇంద్రియ సమూహమును జయించక ధ్యానము చేయువాడు మూడుడనబడును. అతని ధ్యానము కూడా సిద్ధించదు. తాను చూచునదంతయు తనవలే, తనలోని దీనివలె చూచుచు ప్రత్యాహృతములైన ఇంద్రియములను ధరించినచో ధారణయనబడును. యోగముచే ఇంద్రియగ్రామమును జయించి, జయించిన ఇంద్రియములను హృదయమున దృఢముగా బంధించి సర్వధారకుడు అచ్యుతుడు అగు పరమాత్మను ధ్యానము చేయవలయును. సర్వవిశ్వాత్మకుడు సర్వలోకైకకారణుడు వికసత్పద్మపత్రాక్షుడు, చారుకుండల భూషితుడు, దీర్ఘబాహువు, ఉదారాంగుడు, సురాసురనమస్కృతుడు అగు శ్రీమన్నారాయణుని అష్టారమగు ద్వాదశాంగుల విస్తృతమగు హృదిన నిలుపవలెను పరాత్పరతరుడు విభుడు అవ్యక్తుడు అగు ఆత్మను ధ్యానించవలయును. ప్రత్యయము ఏకాధారముగా నుండుటను ధ్యానమందురు. ఒక ముహూర్తము ధ్యానము చేసిననూ మోక్షము లభించును. ధ్యానము వలన పొపములు నశించును. ధ్యానము వలన మోక్షము లభించును. ధ్యానమువలన శ్రీహరి ప్రసన్నడగును. ధ్యానము వలన సర్వార్ధములు సాధించబడును. శ్రీమహావిష్ణువు ధరించిన అన్ని రూపములను సావధానముగా ధ్యానించవలయును. ఆ ధ్యానముచే శ్రీహరి ప్రసన్నుడై మోక్షమును ప్రసాదించును. ధ్యేయమగు వస్తువునందు మనస్సును నిశ్చలముగా నుంచవలయును. అపుడు ధ్యానము ధ్యేయము ధ్యానముచేయువాడు అనుభేదములు నశించవలయును. అపుడు జ్ఞానామృత సేవనము వలన అమృతత్వము లభించును. నిరంతరధ్యానముచే అభేదప్రతిపత్తి కలుగును.

ఇంద్రీయ వ్యాపొరములు విరమించబడి పరమానందయుక్తుడై గాలి లేని చోటి దీపమువలె, సుషుప్తిలో వలె నుండుట సమాధి యనబడును. యోగి సమాధ్యవస్థలో వినజాలడు చూడజాలడు వాసన చూడజాలడు, స్పృశించజాలడు. ఏమియు చెప్పజాలడు. ఆత్మ నిర్మలము, శుద్దము, సచ్చినానన్ద స్వరూపము, సర్వోపాధివినిర్ముక్తుముగా యోగులకు నిశ్చలముగా భాసించును. పరమాత్మ నిర్గుణుడైనను అజ్ఞానమువలన గుణసహితుని వలె భాసించును. అజ్ఞానము నశించినచో పూర్వమున్నటుల భాసించును. అమేయాత్మ పరిజ్యోతి మాయ కలవారికి మాయకలదానిగా, మాయ నశించినచో నిర్మల బ్రహ్మ స్వరూపము ప్రకాశించును. ఒక పే రెండవది లేనిది, పరంజ్యోతి, నిరంజనము సర్వభూతాంతర్యామిగా నుండును. అణువులలో అణువు మహత్తులలో మహత్తు సనాతనమగు ఆత్మ, అఖిల ప్రపంచకారణము అగు పరమాత్మను పరాత్పరునిగా పరమ పవిత్రునిగా జ్ఞానులలో ఉత్తములు చూచెదరు. అకారము మొదలు కకారము వరకు గల వర్ణ భేదముతో నుండు వాడు అనాదియగు పురాణ పురుషుడు శబ్ద బ్రహ్మయని కీర్తించబడును. విశుద్దము అక్షరము, నిత్యము, పూర్ణము ఆకాశమధ్యస్థము, ఆనందము, నిర్మలము, శాంతము పరబ్రహ్మయని గానము చేయబడును. యోగులు సనాతనుడు అ వికారి అజుడు శుద్దుడు పరబ్రహ్మముగా కీర్తించబడు పరమాత్మను హృదయమున దర్శించగలరు. ఇపుడు ఇంకొక ధ్యానమును చెప్పెదను. సంసార తాపతప్పలగు నరులకు సుధావృష్టివంటిదీ ధ్యానము. సావధానముగా వినుము. ప్రణవములో నున్న పరానన్లస్వరూపడుగు నారాయణుని స్మరించవలయును. సాటిలేనిది అర్థమౌత్రోపరిభాగముననుండు సాదరూపుని ధ్యానించవలయును. అకారము బ్రహ్మ స్వరూపము ఉకారము విష్ణుస్వరూపము. మకారము రుద్రరూపము. అర్థమౌత్ర పరమాత్మ స్వరూపము. మూడుమాత్రలు బ్రహ్మ విష్ణుశివాత్మకములుగా చెప్పబడియున్నవి. ఆ మూడుమాత్రలసముదాయము పరబ్రహ్మ ప్రబోధకము. పరబ్రహ్మ వాచ్యము. ప్రణవము వాచకము, పరబ్రహ్మ ప్రణవములకు చాచ్యవాచక సంబంధము ఉపచారము వలన సిద్ధించును. ప్రణవమును నిత్యము జపించువారలు సర్వపాపముల నుండి విముక్తులగుదురు. ప్రణవజపాభ్యాసము కలవారు మోక్షమును పొందెదరు. బ్రహ్మ విష్ణుశివాత్మకమగు ప్రణవమును జపించుచూ ఆత్మతో నిర్మలము కోటి సూర్యసమప్రకాశమగు పరమాత్మను ధ్యానించవలయును. శాలగ్రామశిలారూపమును కాని ప్రతిమారూపమును కాని పాపహరమగు ఏ వస్తువునైనను హృదయము ధ్యానించవలయును. ఇపుడు నీకు చెప్పిన ఈ వైష్ణవజ్ఞానమును తెలిసిన యోగీన్లులు ఉత్తమమోక్షములను పొందెదరు. ఈ జ్ఞానబోధకమగు యోగవిధానమును సావధానములో వినువారు చదువువారు సర్వపాపవినిర్ముక్తురై శ్రీహరిసాలోక్యమును పొందేదరు.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున యోగనిరూపణమను మూప్పది మూడవ అధ్యాయము సమాప్తము.