నారద మహా పురాణము - పూర్వార్థము
16 - భగీరథగంగానయనమ్
నారదమహర్షి పలికెను:- భగీరధ మహారాజు హిమవత్పర్వతమును చేరి ఏమి చేసెను ? గంగ నెట్లు తీసుకొని వచ్చెను? ఈ విషయమును నాకు తెలుపుము.
సనకమహర్షి పలికెను :- భగీరధమహారాజు జడలను, నారవస్త్రములను ధరించి తపస్సు చేయుటకు హిమవత్పర్వతమునకు వెళ్ళుచు గోదావరీతీరమును చేరెను. అచట ఆ మహారణ్యమున ఉత్తమము పవిత్రమైన భృగుమహర్షి ఆశ్రమమును చూచెను. ఆయాశ్రమమున జింకలు, యేనుగులు, తిరుగాడు తుమ్మెదల ఝుంకారములు, కూయుచున్న పక్షుల కోలాహలములు, వెళ్ళుచున వరాహ బృందములు, పుచ్ఛములతో వీచుచున్న చమరీ మృగములు, నాట్యముచేయుచున్న నెమళ్ళ గుంపులు, లేళ్ళు మొదలగు సాధుజంతువులు మునికన్యలచే ఆదరముతో పెంచబడిన వృక్షములు, శాలతమాలతాళమీంతలములు మాలతి, సంపేగ, మల్లె, సన్నజాజి, రాగి, మొదలగు లతావృక్షములు, వికసించిన పూవులు కలిగి, ఋషిసమూహములచే వేదఘోష చేయబడుచుండగా భగీరధ మహారాజు ఆయాశ్రమమున ప్రవేశించేను.
పరబ్రహ్మను ధ్యానము చేయుచు, శిష్య బృందముతో కూడి ఉన్న సూర్యుని వంటి తేజస్సు గల భృగుమహర్షిని చూచెను. పాదముల పట్టుకొని భృగుమహర్షికి నమస్కరించెను. భృగుమహర్షి కూడా సన్మాన పూర్వకముగా భగీరథ మహారాజునకు అతిథి మర్యాదను చేసెను. ఇట్లు భృగుమహర్షిచే అతిథి మర్యాదను పొందిన భగీరథమహారాజు చేతులు జోడించి వినయముతో భృగుమహర్షిని గూర్చి ఇట్లు పలికెను.
సర్వధర్మములను తెలుసుకొని సర్వశాస్త్రములందు విశారదుడవైన ఓ మహర్షీ ! సంసారమునకు భయపడిన నాకు మానవులు సంసారమును దాటు కారణమును తెలుపుము. ఓ మునిసత్తమా ! శ్రీమన్నారాయణుడు సంతోషించు కర్మను నామీది దయతో తెలుపుము.
భృగుమహర్షి పలికేను:- ఓ రాజా ! నీ కోరిక తెలిసినది. నీవు పుణ్యాత్ములలో శ్రేష్ఠుడవు. కావుననే నీ కులము నుద్ధరించదలచితివి. మంచిపనులచే . తన కులమునుద్దరించదలచు నరుని సాక్షాత్తు శ్రీహరిగా తెలియవలయును. ఓ రాజేన్హా ! శ్రీహరి సంతోషించు కర్మను తెలి పెదను. సావధానముగా వినుము. సత్యపరుడుగా అహింసా నిరతుడుగా ఉండుము. అన్ని ప్రాణుల హితమును కోరుము. అసత్యమును పలుకకుము. దుర్జనులతో సాంగత్యమును విడువుము. సాధు జనసమాగమును కోరుము. రాత్రింబవళ్ళు పుణ్యము నాచరించుము. సనాతనుడైన శ్రీమహావిష్ణువును స్మరించుము. మహావిష్ణువును పూజించి సాటిలేని శాంతిని పొందుము. ద్వాదశాక్షర మంత్రమును కాని, అష్టాక్షర మంత్రమును కాని జపించుము. నీకు మేలు కలుగును.
భగీరథ మహాజు పలికెను :- సత్యమనగా నెట్టిది ? సర్వభూతహితమననేమి ? అసత్యమనగానేమి ? దుర్జనులెట్టివారు ? సాధువులనగా నెవరు ? పుణ్యమనగా నెట్టిది ? విష్ణువునెట్లు స్మరించవలయును ? ఎట్లు పూజించవలయును - శాంతి యనగా నేమి ? అష్టాక్షర మంత్రమనగా నేమి ? ద్వాదశాక్షరమంత్రమేది ? వాస్తవార్థమును తెలిసిన ఓ మహర్షీ ! నా మీద దయయుంచి అంతయు తెలుపుము.
భృగుమహర్షి పలికెను :- ఓ మహాప్రాజ్ఞుడా ! బాగు ! బాగు ! నీ బుద్ధికి సాటిలేదు. . నీవడిగిన వాటినన్నింటినీ నీకు తెలి పెదను. ఉన్నది యున్నట్లుగా యధార్థమును చెప్పుట సత్యమని పండితులందురు. ధర్మపరాయణులు ధర్మమునకు విరుద్ధము కాని విధముగా చెప్పవలయును. దేశాకాలాదులను చక్కగా తెలిసి తనకు తన ధర్మమునకు విరుద్ధముగా కాని విధముగా చెప్పబడు మాటయే సత్యమని సత్పురుషులు చెప్పెదరు. అన్ని ప్రాణులకు కష్టమును కలిగించకయుండటమే అహింసయనబడును. ఈ అహింస అన్ని కోరికలను తీర్చును. చేయదగిన కార్యమునకు సాయపడుట చేయరాని పనిని అడ్డగించుటయే సర్వలోక హితమని ధర్మకోవిదులు చెప్పెదరు. ధర్మాధర్మములు తెలియక ఇష్టమొచ్చినట్లు చెప్పుటయే అసత్యమనబడును. ఈ సత్యము అన్ని శ్రేయస్సులకు విరోధియేయగును. లోకమున అందరిని, అన్నిటిని ద్వేషించువారు, మూర్భులు, చెడుదారిన నడుచుటలో ఆసక్తి కలవారు దుర్జనులని తెలియును. ఈ దుర్జనులు అన్ని ధర్మ కార్యములలో, ధర్మములలో బహిష్కృతులే. ధర్మధర్మ వివేకముతో వేదమార్గము ననుసరించుచు అన్ని ప్రాణులకు హితమును సమకూర్చవలయుని కోరువారు సజ్జనులనబడుదురు. శ్రీహరియందు భక్తిని కలుగజేయునది, సత్పురులకానందమును కలిగించునది, తమకు ప్రీతిని కలిగించునది, సత్పురులకానందమును కలిగించునది, తమకు ప్రీతిని కలిగించునది పుణ్యమనబడును. ఈ జగత్తంతయూ విష్ణువే. అన్నిటికీ కారణము విష్ణువే. నేను కూడా విష్ణువునే. అను జ్ఞానమే విష్ణుస్మ రణ మనబడును. విష్ణువు సర్వదేవ స్వరూపుడు. శ్రీమహావిష్ణువును విధిగా పూజించెదను అను శ్రద్ధయే భక్తియనబడును. విష్ణువు సర్వప్రాణి స్వరూపుడు. పరిపూర్ణుడు. సనాతనుడు అని అభేదబుద్ధియే సమతయనబడును. శత్రుమిత్రవిషయమున సమబుద్దితో నుండుట, ఇంద్రియ జయము, దైవసంకల్పముచే లభించిన దానితో తృప్తి చెందుట శాంతియనబడను. ఈ పైన చెప్పబడినవన్నియూ మానవులకు తపస్సిద్దిని కలిగించునవి. అన్ని పాపరాశులను వెంటనే నశింపచేయగలవి. అన్ని పాపములను నశింపచేసి అన్ని పురుషార్ధములను సాధించగల ఒకే సాధనము అయిన అష్టాక్షరీ మహామంత్రమును నీకు చెప్పెదను. ఈ మంత్రము విష్ణువునకు ప్రియము, అన్ని సిద్ధులను అందించునది. మొదట ప్రణవమునుచ్చరించి పిదప నమో నారాయణాయ అని జపించినచో అష్టాక్షరీ మహామంత్రమగును. మొదట ప్రణవమునుచ్చరించి, పిదప నమో భగవతే అని పలికి పిమ్మట వాసుదేవాయ అని ఉచ్చరించినచో ద్వాదశాక్షరీ మంత్రమగును. అనగా “ఓమ్ నమో నారాయణాయ” అనునది అష్టాక్షరీ మంత్రము, “ఓమ్ నమో భగవతే వాసుదేవాయ” అనునది ద్వాదశాక్షరీ మంత్రము అని భావము. ఈ రెండు మంత్రములకు సమానమైన ఫలమే లభించును. ప్రవృత్తిలోను నివృత్తిలోను అనగా ఇహపరములలో ఈ రెండు మంత్రములు సమములే. శంఖచక్రధరుడు, వికారరహితుడు, శాంతుడు, లక్మీవామాంకమున కలవాడు, అభయప్రదుడు, కిరీటమండలాదినాసాభరణశోభితుడు, కౌస్తుభమణిచే ప్రకాశించు హారము కలవాడు, శ్రీవత్సమను పుట్టుమచ్చ వక్షస్థలమున కలవాడు, పీతాంబరధారి, సురాసురులతో నమస్కరించబడువాడు, ఆద్యంతములు లేనివాడు అందరి కోరికల నీడేర్చువాడు, అంతర్యామి, జ్ఞానస్వరూపుడు, పరిపూర్ణుడు, సనాతనుడు, అగు శ్రీమన్నారాయణుని ధ్యానించవలయును. ఇట్లు నీవడిగినదంతయూ చెప్పితిని. నీకు శుభమగుగాక ! తపస్సిద్ధిని పొందుటకు యథావకాశముగా వెళ్ళుము.
పరమర్షి అయిన భృగువిట్లు పలుకగా పరమానందమును పొందిన భగీరథ మహారాజు తపస్సు చేయుటకు అరణ్యమును చేరెను. హిమవత్పర్వతమును చేరి పవిత్రము సుందరము అయిన నాదేశ్వరమను క్షేత్రమున కఠోరమైన తపస్సుచరించేను. మూడు వేళలలో స్నానమును చేయుచు కందమూల ఫలములను భుజించుచు, అతిథులకు హితమును కలిగించుచు నారాయణుని యందు మనసు నిలిపి, పత్రపుష్పఫలతోయములతో మూడు వేళలా శ్రీహరిని పూజించుచు, మిక్కిలి ధైర్యముతో చాలాకాలమును గడిపి శ్రీమన్నారాయణుని ధ్యానము చేయుచు రాలిపడిన ఆకులను తినుచు తపమునాచరించెను. పరమధార్మికుడైన భగీరథమహారాజు ప్రాణాయామముచే ఊపిరి పీల్చకనే తపస్సును చేయ సంకల్పించెను. అనంతుడు అపరాజితుడు అగు శ్రీమన్నారాయణుని ధ్యానము చేయుచు అరువది వేల సంవత్సరములు గాలి పీల్చకనే యుండగా, అతని నాసికాపుటము నుండి గొప్ప అగ్ని పుట్టెను. ఆ యగ్నిచే తపించిన దేవతలు భగీరథుని చూచి భయమును చెంది జగత్పతి యగు శ్రీమన్నారాయణుడు నివసించు క్షీరసారోత్తర తీరమును చేరి శరణాగత పాలకుడు దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుని ఇట్లు స్తుతించిరి.
దేవతలు పలికిరి :- జగదేకనాథుడు, పరేశుడు, స్మరించువారి ఆర్తిని నశింపచేయువాడు, సహజశుద్దుడు పరిపూర్ణకాముడు, తెలిసిన వారిచే జ్ఞానరూపునిగా చెప్పబడుచున్న శ్రీమహావిష్ణువును నమస్కరించుచున్నాను. ఉత్తమయోగులచే సర్వకాలములందు ధ్యానము చేయబడు మహానుభావుడు, తన సంకల్పముచే స్వీకరించిన శరీరములచే దేవకార్యములను నిర్వహించినవాడు, జగత్స్వరూపుడు, జగత్తునకు మొదటి ప్రభువు, పురుషోత్తముడు అయిన శ్రీహరికి నమస్కరించుచున్నాము. నామ సంకీర్తనచే ఖలుల పాపములను కూడా నశింపచేయు పురాణపురుషుడు, స్తుతించదగినవాడు, ప్రభువు అయిన శ్రీహరిని పురుషార్ధ సిద్దికి నమస్కరించుచున్నాము. శ్రీహరి తేజస్సుచే సూర్య చంద్రాదులు ప్రకాశించుచున్నారు. శ్రీహరి ఆజ్ఞను ఎవ్వరూ అతిక్రమించలేరు. అట్టి కాలాత్మ కుడు దేవాధినాథుడు పురుషార్ధరూపుడు అయిన మహావిష్ణువునకు నమస్కరించుచున్నాము. బ్రహ్మరూపముతో జగత్తును సృష్టించి, రుద్రరూపముతో లయము చేసి బ్రాహ్మణ రూపముతో పావనము చేయుచున్న ఆదిదేవుడు, సకలసద్గుణరూపుడు, అందరికి అన్నిటిని ఉపదేశించువాడు అయిన శ్రీహరిని శరణువేడుచున్నాము. ఉత్తముడు, సర్వోత్తముడు, మధు కైటభులను సంహరించినవాడు, దేవదానవులచే పూజించబడు పాదపద్మములు కలపోడు, సద్భక్తుల సంకల్పము సిద్ధించుటకు హేతుభూతుడు, జ్ఞానముచే మాత్రమే తెలియదగువాడు అగు శ్రీహరికి నమస్కరించుచున్నాము. ఆది మధ్యాంతములు లేనివాడు, పుట్టుక లేనివాడు, పరేశుడు, అనొదియైన ఆవిద్యయను ఆజ్ఞానమును నశింపచేయువాడు, సచ్చిదాననఘనస్వరూపుడు, రూపొదిర హితుడగు దేవునికి నమస్కరించుచున్నాము. అననుడు, ఈశుడు పీతాంబరుడు బ్రహ్మాదులచే సేవించబడువాడు, యజ్ఞప్రియుడు, యజ్ఞములను చేయువాడు, విశుద్దుడు, సర్వోత్తముడు, అవ్యయుడు, సర్వవ్యాపి అయిన శ్రీమన్నారాయణునికి నమస్కరించుచున్నాము.
ఇట్లు ఇంద్రాది దేవతలచే స్తుతించబడిన శ్రీమహావిష్ణువు భగీరధమహారాజు చరిత్రను దేవతలకు తెలియ చేసెను. తరువాత దేవతలనోదార్చి అభయమునిచ్చి భగీరధుడు తపస్సు చేయుచున్న ప్రదేశమునకు వెళ్ళెను. సర్వజగద్గురువు, సచ్చిదానన్ద స్వరూపుడు అయిన శ్రీహరి శంఖ చక్రములను ధరించి భగీరధమహారాజునకు ప్రత్యక్షమాయెను. తన కొంతిచే దిగంతములను ప్రకాశింపచేయుచున్నవాడు, పుండరీకాక్షుడు, అవిశపూవు వన్నె కలవాడు, ప్రకాశించు మండలములచే అలంకరించబడువాడు, దట్టమైన ముంగురులచే ప్రకాశించు ముఖ పద్మము కలవాడు, కిరీటముచే ప్రకాశించువాడు, శ్రీవత్సమును కౌస్తుభమును ధరించినవాడు, వనమాలచే అలంకరించబడినవాడు, ఆజానుబాహువు, ఉదారావయవములు కలవాడు లోకపాలకులచే పూజించబడు పాద పద్మములు కలవాడు, అయిన శ్రీమన్నారాయణుని చూచి దండవతణామము లాచరించెను. మిక్కిలి సంతోషముతో నిండినవాడై పులకింతలు తడబాటు రాగా కృష్ణ, కృష్ణ, కృష్ణ శ్రీకృష్ణ అని కీర్తించెను. జగద్గురువు, అంతర్యామి అయిన శ్రీహరి భూతసృష్టి చేసిన భగవానుడు కావున భగీరథ మహారాజునకు ప్రసన్నుడై దయతో నిట్లు పలికెను.
శ్రీమన్నారాయణుడు పలికెను :- ఓ మహానుభావుడగు భగీరథుడా ! నీ కోరికి నెరవేరును. నీ పితామహులు నా లోకమునకు రాగలరు. నాకు మరో రూపమై శంకరుని నీ శక్తి కొలది స్తోత్రములును చేయుము. ఆ శంకరుడు నీ కోరికనంతటిని వెంటనే తీర్చగలడు. శరణు వేడిన చంద్రుని స్వీకరించినవాడు శంకరుడు. కావున స్తుతించదగినవాడు సుఖమునిచ్చువాడు అయిన శంకరుని స్తుతించుము. ఆద్యంతములు లేని ఆ శంకరుడు అన్ని కోరికల నిచ్చువాడు. నీచే పూజింపబడి వెంటనే మేలును చేకూర్చును. జగత్పతియగు ఆచ్యుతుడు ఇట్లు పలికి అంతర్ధానము చెందెను. ఆ భగీరథమహారాజు కూడా లేచి నిలబడెను. ఇది నిజమా ? నేనేమి చేయవలయును అని ఆశ్చర్యముగా చెందెను. ఇట్లు భ్రాంతి చెందిన భగీరథమహారాజును గూర్చి ఆకాశవాణి ఇది సత్యమే. విచారించవలదని పలికెను. ఆ మాటను వినిన భగీరథమహారజు, సమస్త దేవరాజు, జగత్కారణుడు అయిన శంకరుని స్తోత్రము చేసెను.
భగీరథమహారాజు పలికెను :- జగన్నాథుడు, ప్రణామము చేయువారి ఆర్తిని నశింప చేయువాడు, ప్రమాణములకు గోచరము కానివాడు, ప్రణవస్వరూపుడు అయిన ఈశ్వరునికి నమస్కరించుచున్నాను. జగద్రూపుడు, పుట్టుకలేనివాడు, నిత్యుడు, సృష్టి స్థితి లయకారుడు, విశ్వరూపుడు, ఉగ్రరేతసుడు అయిన విరూపాకుని నమస్కరించుచున్నాను. ఆది మధ్యాంతములు లేనివాడు అవ్యయుడు, పుష్టివర్ధనుడు, యోగీనులచే మననము చేయబడువాడు అయిన ఈశ్వరునికి నమస్కరించుచున్నాను. లోకాధినాథుడు, నీలకంఠుడు అయిన పశుపతికి నమస్కారము. చైతన్యరూపునకి, పుష్టులపతికి, అల్పప్రకల్పునికి భూతపతికి నమస్కారము. పినాకహస్తునకి, శూలహస్తునికి, కపాలహస్తునికి పాశముద్ధరధారికి నమస్కారము. సర్వభూతస్వరూపునికి ఘంటాపస్తునికి పంచముఖునకు, క్షేత్రపతికి నమస్కారము. సమస్త భూతములకు ఆదిభూతుడైనవానికి, భూభరణునకు, అనేకరూపునకు నిర్గుణునకు పరమాత్మునకు నమస్కారము. గణాధిదేవునకు గణపతికి హిరణ్యగర్భునకు హిరణ్యపతికి నమస్కారము. హిరణ్య రేతస్కునకు, హిరణ్యబాహువునకు, ధ్యానస్వరూపునకు, ధ్యానసాక్షికి, ధ్యానసంస్థునకు, ధ్యానగమ్యునకు. నమస్కారము. చరాచరాత్మకమగు ఈ ప్రపంచమునంతటిని ప్రకాశింపచేయువానికి నమస్కారము. ప్రకృతి పురుషరూపముతో నున్నవానికి, స్వయం ప్రకాశునకు, మహాత్మునకు, పరంజ్యోతికి, సనాతనునకు, తత్వజులు మననము చేయువానికి, మానవనేత్రములకు సూర్యుని వంటివారికి నమస్కారము. ఉమాకాంతుడు, నంది కేశుడు, నీలకంఠుడు, సదాశివుడు, మృత్యంజయుడు, మహాదేవుడు, పరాత్పరుడు, విభువుపరుడు, శబ్ద బ్రహ్మరూపుడు, అలకారణుడగు అగు శివునికి నమస్కరించుచున్నాను, కపర్థికి సద్యోజాతునకు నమస్కారము, భవోద్భవుడు, శుద్దుడు, జ్యేష్ఠుడు, కనిషుడు, మన్యువు, త్రయీపతి అయిన ఈశునకు నమస్కారము. దీక్పతికి, కాలునకు అఘోరరూపునకు కృశాను రేతస్కునకు మహాత్మునకు నమస్కారము. సముద్రములు, నదులు, పర్వతములు గంధర్వ, యక్ష అసుర సిద్ద సంఘములు ఎవనినుండి పుట్టినవో, ఆ స్థాణువును మహద్రూపుకు అల్పునకు, చరిష్ణువునకు సదసద్రూపునకు నమస్కరించుచున్నాను. యోగులచే నమస్కరించుబడు పాదపద్మములు గలవానికి, సర్వాంతర్యామికి, రూపరహితునికి స్వతంత్రునికి, గుణవంతుల గుణస్వరూపునికి ఈశ్వరునికి మాటిమాటికి నమస్కరించుచున్నొను.
ఇట్లు స్తోత్రము చేయబడిన శంకరుడు లోకములకు శుభములకు కలిగించువాడు కావున ఉగ్రమైన తపస్సుచే తపించిన భగీరథ మహారాజునకు ప్రత్యక్షమాయెను. పంచవక్తుడు, దశభుజుడు, అర్ధచంద్ర శేఖరుడు, త్రిలోచనుడు, ఉదారాంగుడు, నాగయజ్ఞోపవీతుడు, విశాలవర్టుడు, హిమాద్రిసమకాంతిదేహుడు, గజచర్మాంబరధారి, సురార్చితపదాంబుజుడు అయిన శంకరుని చూచి భగీరథుడు దండమువలే శివుని పాదముల పై బడెను. తరువాత లేచి నిలబడి శివునిముందు చేతులు జోడించుకొని మహాదేవుని కీర్తించుచు నమస్కరించెను. చంద్ర శేఖరుడగు శంకరుడు రాజు భక్తిని తెలుసుకొని రాజునుద్దేశించి ఇట్లు పలికేను. ఓ రాజా ! నీ విషయమున సంతోషించితిని. నీకు కావలసిన వరమును కోరుకొనుము. నీవు చేసిన స్తోత్రమునకు తపస్సునకు సంతోషించితిని. ఇట్లు శంకరుడు పలుకగా భగీరథమహారాజు సంతోషించి జగదీశ్వరునితో చేతులు జోడించి ఇట్లు పలికెను.
భగీరథుడు పలికేను :- ఓ మహేశ్వరా ! వరములనిచ్చి అనుగ్రహించ దలచినచో మా పితామహులు మోక్షమును చేరుటకు కారణమైన గంగను ప్రసాదించుము.
శ్రీ శివుడు పలికెను :- నీ పితామహుల కొరకు నేను గంగనిచ్చుచున్నాను. నీకు ఉత్తమమైన మోక్షమును కూడా ఇచ్చితిని. అని పలికి అంతర్ధానము చెందెను. తరువాత శంకరుని జటలనుండి జారిపడిన లోకపావని యగు గంగ జగత్తును పావనము చేయుచు భగీరథుని అనుసరించెను. అప్పటినుండి మలమును తొలగించు నిర్మల యగు గంగ మూడు లోకములలో భాగీరథి యని ప్రసిద్ధి చెందేను. సగరపుత్రులు తన పాపములచే దగ్గమైన ప్రదేశమమును నదీ శ్రేష్ఠమైన గంగముంచివేసెను. సగరపుత్రుల భస్మమును గంగ తడి పీన వెంటనే సగరపుత్రులు పాపము తొలగినవారై నరకమునుండి ఉద్దరించబడిరి. పూర్వము యమునిచే పీడించబడిన సగరపుత్రులు గంగాజల సేచనముచే పూజించబడిరి. యముడు వారిని పాపరహితులుగా తెలుసుకొని నమస్కరించి యథావిధిగా పూజించి సంతోషమునీండిన మనసుతో నిట్లు పలికెను. “ఓ రాజా పుత్రులారా! మీరు మిగుల భయంకరమైన నరకమునుండి విముక్తులైతిరి. విమానము నధిరోహించి విష్ణుమందిరమునకు వెళ్ళుడు” ఇట్లు యమధర్మరాజు చెప్పగా పాపము తొలగిన సగరపుత్రులు దివ్య దేహమును ధరించి విష్ణులోకమును పొందిరి. విష్ణుపాదాగ్రమున పుట్టిన గంగ ఇంతటి ప్రభావము కలది. అన్ని లోకములతో మహాపాతకనాశిని అని ప్రసిద్ది చెందినది. మహాపాతకములను నశింపచేయు పవిత్రమైన ఈ కథను చదివిననూ వినిననూ గంగా స్నానఫలము లభించును. బ్రాహ్మణుల ముందు పవిత్రమైన ఈ కథను చెప్పినవారు పునరావృత్తిరహితమైన విష్ణుభవనమును చేరుదురు.
ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగామాహాత్మ్యమున భగీరథగంగానయనమను పదునారవ అధ్యాయము సమాప్తము.
